(అభి) మ‌తం

రంగ‌డికి ఉరిశిక్ష ఖాయం చేసారు.

అవునుమ‌రి, వాడు పెళ్ళాం నిండు ప్రాణం తియ్య‌లా ?  అంతే కావాలి ! అనుకున్నారు ఊరు ఊరంతా. కాని మేక‌ల మ‌స్తాన్ కి మాత్రం క‌డుపులో  ఏదో బాధ‌గావుంది.

ఈడే పెళ్ళాం ప్రాణం తీత్తేనాయం ఈడి పేణం తీత్తాంది.  నాయం పేణం ఎవ‌ళ్ళు తియ్యాలి ?  పేణం తియ్య‌గ‌లంగాని పొయ్య‌గ‌ల‌మా ?  అని అలోచిస్తూ ఆవునీ, దూడ‌నీ మేత‌కి తోలుకెడుతున్నాడు. ఏరోయ్ మ‌స్తానూ, నీ మేక‌ల మందేదిరా ?  హాస్య‌మాడాడు మ‌దారు. మేక‌లు మంద‌లు మంద‌లుగా ఉండ‌డంతో మేక‌ల మ‌స్తాన్ అని పేరొచ్చినా ప్ర‌స్తుతం ఒక్క మేకా లేదు. అస‌లే అదోక‌రంగా వున్న మ‌స్తాను మ‌దారు హాస్యంతో మ‌రింత ఏడుపు మొహం పెట్టి ఏంటి మ‌దారు మామా, నామంద తుఫానులో కొట్టుకుపోయింది. తెలిసీ ఎక‌సెక్కాలాడుతున్నావ్ అన్నాడు. దుఃఖంగా ఓసోస్‌, ఏందిరోయ్‌, బ‌య్యాలా ఏడుపు మొకం పెడుతున్నావ్‌. మంద మేత‌కెళ్ళింది మామా అనేవొడివి కాదా ?  మిస్‌మిల్లామీద మ‌న‌సోయిందేంటి, న‌వ్వుతూనే మ‌ళీ వేళాకోళం చేసాడు మ‌దారు. స‌డేలే, నా మొకానికి మిస్‌మిల్లా కూడాను. ఆరంగ‌డికి బదులు నాకు ఉరేసినా బాగుండిపోను. ఏడుస్తున్న‌ట్లే అన్నాడు మ‌స్తాన్‌. ఏంకూత‌ల్రా అయ్యి సైతాన్ గాడా ? అవ‌త‌ల స‌కీనాబేటా క‌న‌డానికి సిద్ధంగా వుంటే యీ మాట‌లాడ‌తావేంటి పెద్ద‌రికంగా మంద‌లించి వెళ్ళిపోయ‌డు మదార్‌. ఆవు దూరంగా మేస్తోంది. దూడ‌ను దువ్వుతూంటే మ‌స్తాన్ మ‌నస్సు ఎక్క‌డికో పోయింది.

శ్రీ‌కాకుళం జిల్లాలోవున్న భోగాపురంలో ఏనాడో అత‌డి పూర్వీకులు స్థిర‌ప‌డిపోయినారు. న‌వాబుగారి కాలంలో ఉన్న‌తోద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలూ కోసం వ‌చ్చి స్థిర‌ప‌డిపోయిన కుటుంబాల్లో మ‌స్తాన్‌ది కూడా ఒక‌టి. త‌రువాత్త‌రువాత త‌లో దానీ అయింది. త‌లో ప‌నీ చేసుకుంటూ అక్క‌డే ఉండి పోయారు. మ‌స్తాన్ తండ్రి యిస్మాయిల్ అవిడివాడ‌వ‌డంచేత మేక‌ల వ్యాపారం చేసేవాడు. మ‌దారు వంశం వాళ్ళు ప‌రుపులు కుట్ట‌డంలో ప్రావీణ్యం సంపాయించారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా వాళ్ళిక్క‌డ వుండిపోవ‌డంతో వాళ్ళ భాష‌, ఆచారాలూ కూడా చాలా వ‌ర‌కు మ‌రిచిపోయిన‌ట్లుగా హిందువుల‌తో క‌ల్సిపోయారు. అంద‌రితో క‌ల్సిక‌ట్టుగా వుండేవారు. వీళ్ళ పండుగ‌ల్లో వాళ్ళూ, వాళ్ళ పండ‌గ‌ల్లో వీళ్ళూ పాల్గొని ఎంతో ఐక‌మ‌త్యంగా వుండేవారు. అన్నిటిక‌న్నా చిత్ర‌మ‌యిన విష‌యం ఇస్మాయిల్ గోపూజ చేస్తాడు. ఇస్మాయిల్‌కి పిల్ల‌లంటే ప్రాణం. కానీ ఎన్నాళ్ళ‌కీ  ర‌జియా క‌డుపు పండ‌లేదు.

ఆ ఊళ్ళోని నీల‌కంఠ శాస్తుర్లుగారు ప్ర‌తి ఆదివారం ప్ర‌శ్న‌కు స‌మాధానాలు చెబుతూవుండేవారు. మిగ‌తా రోజులు పిల్ల‌ల‌కు వేద‌పాఠాలు చెప్పేవారు. ఆయ‌న వేదం చెబుతూవుంటే గోడ ప్ర‌క్క‌గా వుండి ఒక పాముకూడా వింటూ ఉందేది అనికూడా చెప్పుకుండేవారు.  ఓ రోజు ఇస్మాయిల్ కూడా శాస్త్రిగారింటికి వెళ్ళాడు.

ఏరా ఇస్మిగా, పిల్లలేనా ? న‌వ్వుతూ అడిగారు ఆయ‌న‌. ఆయ‌న ఎంత గొప్పవాడిని కూడా ఏరా అనే పిల్చేవారు. అలా అని ఎవ‌రికీ కోపం వ‌చ్చేదికాదు. అస‌లు నాకు యింట్లో ప‌సివాడు పారాడే అదృష్టం వుందా బాబూ అని అడిగాడు  దుఃఖంగా ర‌జియా చెప్పిన క‌బురు వినేస‌రికి పిడుగుప‌డ్డ‌ట్లు భ‌య‌పడ్డాడు. త‌న‌తోపాటుగా మ‌నువాడిన మునిస్వామికి ఆడ‌పిల్ల‌పుట్టి ప‌ద‌మూడేళ్ళ‌య్యింది. మొన్న పండ‌గ ముందు పెళ్ళి చేసాడు. మునిసామి తాత‌వ‌బోత‌న్నాడంట అని ర‌జియా చెప్పింది. త‌నింకా తండ్రేకాలేదు. ఎంతో బాధ‌గా వుండి శాస్తుర్లుగారింటికి ప్ర‌శ్న‌కొచ్చాడు. దానికితోడు జ‌నం బాధ ఎక్కువ‌య్యింది. ఏరా యిస్మాల‌, నీకు వోర‌సుడు నేపోతే ఎట్టారా ?  నీ కుంటి రాజ్యం ఎవురికి దార‌పోత్తావూ ? అని ఒక‌డూ, నీ జ‌మీని నాకివ్వ‌రాదుట్రా ? అని ఒక‌డూ ఏడిపించేవారు. ఏం డ‌బ్బుంటేనేనా పిల్ల‌లు ? ఆస్తులు పంచుకోడానికీ నాపిల్ల‌లు ? క‌ట్టానికీ, సుకానికీ పిల్ల‌లొద్దా ?  బీద‌వాడు క‌డుపు తీసి రుచెట్టావుంటుందో చూడ‌క్క‌ర‌లేదా - అనుకుని లోప‌లే ఏడ్చుకునేవాడు ఇస్మాయిల్‌. మీలో మూణ్ణాలుగు పెళ్ళిళ్ళు చేసికోవ‌చ్చంట‌గా ఏసోము వెకిలిగా న‌వ్వుతూ అనేవాడు. వంద‌పెళ్ళిళ్ళు చేసుకోడానికి హ‌క్కున్నా నాకు ర‌జియా ఒక్క‌త్తేచాలు అనుకునేవాడు ఇస్మాయిలు.

నేను చెప్పెది మీ మ‌తానికి నప్ప‌దేమోరా ? అన్నారు శాస్త్రిగారు. సందిగ్థంగా మ‌తమంటే మంచిత‌న‌మేన‌ని మీరే చెబుతారుగాసామీ ! నాచేత సెడ్డ‌ప‌ని మీరు చేయించ‌రు. మీరేం చెబుతే అది చేస్తా న‌న్న‌ట్లుగా చేతులు జోడించుకు కూర్చున్నాడు. ఆ భావాన్ని వాడిక‌ళ్ళ‌ల్లో చ‌దివి మెల్లిగా చెప్పాడు. ఓ ఆవును కొను. నువ్వూ నీ పెళ్ళాం పొద్దున్నే ఆవుకు న‌మ‌స్కారంచేసి, దాన్ని బిడ్డ‌ని సాకిన‌ట్లు సాకండి ఆ త‌రువాత నీ అదృష్టం, పోయిరా ! గో పూజా ! ఇది మాకు పూర్తి వ్య‌తిరేకం ఇస్మాయిల్ క్ష‌ణం ఆలోచించాడు. చిరున‌వ్వుతో లేచినుంచున్నాడు. పూజ కుంకుమ యిచ్చాడు ర‌జియాకిమ్మ‌ని నువ్వు నావాడివి నీ బాధ్య‌త నాది. నువ్విక నిశ్చంగ‌తా వుండు అని దీవించి పంపాడు.

సాటివారు వేలేశారు. నువ్వు ఆవుకి పూజ్జాస్తా, నీ బీబీ బొట్టుపెట్టుకుంటుందా ఇలా చేస్తే పిల్ల‌లు పుడ‌తారా నే పోతే లేదా ? ఏం పిల్ల‌ల్లేపోతే స‌చ్చిపోతారా ? ఇంకోదాన్ని క‌ట్టుకోరాదా ?  ఎవ‌రి పిల్లాడిన‌యినా ద‌గ్గ‌ర‌కు తియ్య‌రాదా ?  అన్నారు. ఇస్మాయిల్ ఉల‌కలేదు. ప‌ల‌క‌లేదు.

దీనిక్కార‌ణం ఆ శాస్త్రి ! మెల్ల‌గా ఇస్మాయిల్ కిచ్చిన‌ట్లే వ‌న‌కీ కుంకాలు, ప‌సుపులు ఇస్తారు. మ‌న మ‌తం నాశ‌నం కాటానికి ఆ ముసిలోడు  ప‌న్నాగం పన్నాడు అన్నారు. అంద‌రికీ కర్ర‌లూ, బ‌రిసెలు వేసుకుని వెళ్ళారు. త‌లో మాటా మాట్లాడారు. త‌లో క‌ర్రా ఎత్తారు. శాస్త్రిగారి మీద ప‌డిపోయే బెర‌సె పోటుకు అడ్డొచ్చాడు ఇస్మాయిల్‌. బ‌రిసె గుండె ప‌క్క‌గా దూసుకుపోయింది. జివ్వుమంటూ ర‌క్తం పైకెగ‌జిమ్మి క్రింద ధార‌లు కట్టింది. త‌న ప్రాణానికై ప్రాణ‌మొడ్డిన ఇస్మాయిల్‌ని చూచి శాస్త్రిగారి హృద‌యం ఆవేద‌న‌తో క‌దిలిపోయింది. స్వ‌య‌ముగా నెత్తురుక‌డిగి శీత‌లం క‌మ్మ‌కుండా ఆయుర్వేద వైద్యం చేసి వెంట‌నే ప‌ట్నానికి తీసుకువెళ్ళారు. అంద‌రి ఆవేశం ఆవిరైపోయింది. త‌మ త‌మ క‌న్నునే పొడుచుకున్నామ‌నుకున్నారు.

శాస్త్రిగారు ఇస్మాయిల్‌కి త‌న రక్తాన్ని ఇచ్చారు. ఎర్ర‌ని ప‌ట్టు పంచ‌, మెరిసే కండ‌వాలు, విభూతి రేఖ‌లూ మ‌నిషిని చూడ‌గానే న‌మ‌స్కారం చేయాలనిపించేలా ఉన్న శాస్త్రిగారిని చూసి ఆస్ప‌త్రిలో అంద‌రు గౌర‌వించ‌సాగారు. ఇస్మాయిల్ క‌ళ్ళు తెరిచేవ‌ర‌కు గంగ‌ను కూడా తాక‌న‌ని ఏక దీక్ష‌తో ప‌ర‌మేశ్వ‌రుణ్ని ప్రార్థిస్తూ అంత‌ర్ముఖ ధ్యానంతో ఉండిపోయారు వారి స‌మ‌తా దృష్టి ముందు, మ‌మ‌త ముందు, మాన‌వ‌త ముందు వారి మ‌త నాయ‌కుడు కూడా త‌ల‌వంచాడు. మూడు రోజుల‌కు క‌ళ్ళు తెరుస్తూనే స్వామీ మీకేం దెబ్బ‌లు త‌గ‌ల్లేదు క‌దా ఇస్తాయిల్ వ‌డ‌లిపోయిన శాస్త్రీగారిని చూస్తూ, ప్రేమ‌తో ఇస్మాయిల్ త‌ల‌నిమురుతూ ఈ ప్రాణం నువ్వు నిలిపిందేరా అంటూ గంభీరంగా న‌డుస్తూ, ఇంటికి వెళ్ళారు నిర‌శ‌న వ్ర‌తం విర‌మించ‌డానికి.

ఇస్మాయిల్ ఇంటికి వ‌చ్చేస‌రికి దొడ్లో వేప‌చెట్టుకి క‌ట్టేసి వుందొక గోమాత ఒళ్ళంతా కాటుక న‌లుపు. మొహాన మాత్రం దోసెడుమేర తెల్ల‌మ‌చ్చ అబ్బో ఏం క‌ళ !  పిల్ల‌ల్లేని త‌న చీక‌టింట్లోకి ఎంత వెలుగొచ్చింది అనుకున్నారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ సొంత పిల్ల‌ని, అదీ లేక లేక పుట్టిన బిడ్డ‌ని సాకిన‌ట్లుగా సాక‌సాగారు. వార‌క‌లా ప్రేమించ‌డంలో ఎంతో ఆనందం ల‌భించేది. ఎవ్వ‌రు న‌వ్వినా, తిట్టినా ప‌ట్టించుకోలేదు. గోమాత మ‌హాత్య‌మో, శాస్త్రిగార‌న్న‌ట్లు కాల‌మే క‌లిసొచ్చిందో మ‌స్తాన్ శాస్త్రి వాళ్ళింటికి వెలుగులా పుట్టాడు. ఆ పేరు మంచంలో వున్నా శాస్త్రిగారే పెట్టారు.

అంత‌టి పూఫ‌ల‌మూ అయిన మ‌స్తాన్ శాస్త్రి ఏమంత ప్ర‌యోజ‌కుడు కాక‌పోయినా త‌ల్లి దండ్రుల‌ను ఆనందాబ్ధిలో ఓల‌లాడించడంలో మాత్రం ఏ పిల్ల‌డికీ తీసిపోలేదు.

ఆ క‌ల‌పిగోవు వంశంలో ఆవే మ‌స్తాన్ మేపుతున్న‌ది. వారంరోజుల‌యింది తెల్లావు కోడెనేసి తండ్రిలాగానే మ‌స్తాన్‌కీ పిల్ల‌లు పుట్ట‌డం ఆల‌స్యమ‌యింది. మ‌స్తాన్ భార్య స‌కీనా మంచి రూప‌సి. స‌కినా, మ‌స్తాన్ ఇద్ద‌రూ ఒక‌రంటే ఒక‌రికిష్టం. పెళ్ళి చెయ్య‌న‌న్నాడు స‌కీనా తండ్రి ఆవున‌మ్మేస్తేగాని ఒప్పుకోన‌న్నాడు. మ‌స్తానుకి తల్లి తండ్రులు ఆవునెంత పూజించేవారో గుర్తుకొచ్చింది. ఎవ‌రన్నా పిల్లాడు పుట్టాడు గ‌దా, ఆవున‌మ్మోయ్య‌రాదా అంటే కొట్ట‌డానికొచ్చేవాడు. ఆవుకి న‌ల‌త‌గా వుండి మేత మేయ‌క‌పోతే త‌నూ అన్నం త‌నక‌పోతే త‌నూ అన్నం తిన‌క బెంగ‌గా కూర్చునేవాడు. ఏవో మందులు వేస్తూ, ఇలాంటి విశ్వాసాల‌తో పెరిగిన మ‌స్తాన్ కూడా ఆవునమ్మ‌డ‌మంటే  కుటుంబానికి ఏదో హాని క‌నుకునేవాడు. స‌కీనా తండ్రితో దెబ్బ‌లాడి చ‌స్తాన‌ని బెదిరించి మ‌స్తాన్‌ని క‌ట్టుకుంది. స‌కీదా కూడా ఆవును ప్రేమ‌గా చూసేది.

మ‌స్తాన్ ఈలోకంలోకి వ‌చ్చాడు. డాక్ట‌రమ్మ చెప్పింది స‌కీనాకి కాన్పు క‌ష్టం కావ‌చ్చు ప‌ట్నం తీసుకెళ్ళ‌మ‌ని డ‌బ్బు పోగేసుకోమంది. ఎక్క‌డ పోగేస్తాడు ?  చెప్పి ప‌దిహేనురోజుల‌యింది. ఎంత క‌ష్టంచేసినా ఏమీ పోగ‌వ‌లేదు. అతిక‌ష్టం మీద ఓ వంద పోగ‌య్యింది. ఇంకో రెండువంద‌ల‌న్నా వుంటేగాని ఈ గండం గ‌డ‌వ‌దు. మ‌దారుమామ చెప్పిన‌ట్లుగా ఆవును అమ్ముదామా అన్న ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా తండ్రి  ఏడుస్తున్న‌ట్లుగా భావ‌న క‌ల్గుతోంది ఏది ఏమైనా అమ్మడానికి మ‌న‌సొప్ప‌టం లేదు. పోయే ముందు కూడా మన‌ల్ని చ‌ల్ల‌గా చూచే గోమాత‌ను అమ్మ‌బోకు. అది మ‌న‌వంశానిక కీడు అని చెప్పి పోయాడు ఇస్మాయిల్‌. ఏదారీ తోచ‌క బెంగ‌గా ఇంటిదారిప‌ట్టాడు మ‌స్తాన్‌.

స‌కీనా న‌ల‌త‌గా ప‌డుకుంది. ప‌ల‌క‌రించడానికి కూడా ధైర్యం లేదు. నొప్పులోస్తున్నాయేమో ?  ప‌ట్నానికి తీసుకెళ్ళేలేమో ?  భ‌యం భ‌యంగా చూస్తూ కుక్కిమంచంలో అటు తిరిగి ప‌డుకున్నాడు.

స‌కీనా మ‌స్తాన్ భ‌యాన్ని ప‌సిగ‌ట్టింది. కాన్పు క‌ష్ట‌మై చ‌చ్చిపోతానేమో న‌న్న భ‌యం త‌న‌కివున్నా మొగుడికి ధైర్యం చెబుతుంటుంది.