వంట్లో బాగా లేదా, అలా వున్నావ్ ?  మెల్ల‌గా డేక్కుంటూ మంచం ద‌గ్గ‌ర‌కి వెళ్ళి అతని మొహం త‌న‌కేసి తిప్పుకుంటూ ఏం లేదే, న‌న్ను విసిగించి చంప‌బోకు దుఃఖాన్ని కోపంగా మారుస్తూ క‌సురుకున్నాడు. మ‌రికాస్త బిగుసుకుప‌డుకుంటూ.

నీ బెంగ నాకు తెల్థా ఏంటి ?  డ‌బ్బు కోస‌మేగా ?  ఏం భ‌యంలేదు. శాస్తుల్లు గోరి మాట మీద ఇస్సాసం వుంచు. గోవుత‌ల్లి వున్నంత‌కాలం మ‌న‌కేం భ‌యం నేద‌న్నారుక‌దా ! బెంగెట్టుకుని మ‌న‌సు పాడుచేసుకుంటే డ‌బ్బొచ్చేస్తాదా ?  లెగు. మొహం క‌డుక్కో, గెంజి తాగుదాం. అంటూ అనున‌యించింది స‌కీనా. అలా మాట్లాడేస‌రికి క‌ళ్ళ‌వెంట నీళ్ళు  బొట‌బొటా కారాయి మస్తాన్‌కి. మ‌స్తాన్ చూడ‌కుండా త‌న క‌ళ్ళు ఒత్తుకుంది స‌కీనా. ఒక‌రి కొక‌రు ధైర్యం చెప్పుకుంటూ గంజి తాగారు. త‌మ‌కి బంధువులు చ‌లా మందే వున్నారు. కాని డ‌బ్బు సాయం చేసే శ‌క్తి ఎవ‌రికీ లేదు. మాట సాయం చెయ్య‌డానికి అంద‌రూ సిద్ధ‌మే. త‌న‌కి కావ‌ల్సిందిప్పుడు డ‌బ్బు సాయ‌మే క‌ల‌త‌గా నిద్ద‌ర పోయారిద్ద‌రూ.

మ‌స్తాన్ పొద్ద‌న్నేలేచి ఆలోచిస్తూనే అటూ ఇటూ తిరుగాడాడు. చ‌ద్ది మూట క‌ట్టుకున్నాడు. స‌కీనా రోజూక‌న్నా భారంగా వుంది. ప‌న్ల‌న్నీ చేశాడు. చూస్తూ నుల‌క‌మంచంలో ప‌డుకుంది. త‌ను ప‌ని చేస్తుంటే వారించ‌లేదు. ఏమాత్రం ఓపికున్నా త‌న‌ను అని ముట్టుకోనిచ్చేదికాదు. ఆవును తోలుకుపోతున్నా దూరం ఎల్ల‌నులే. ఏమైనా అవుస‌ర‌మైతే న‌న్నాగాడితో క‌బురంపు. ఇక్క‌డుండి ఏం చేయ‌ను ?  పొలం ప‌న్లుకూడా లేవు. ఏ కూలీక‌న్నా పోదామ‌నుకున్నా. అన్నం కుండ‌లో యేసి ఉట్టిలో పెట్టా, లేచి తిను అని చెప్పాడు.

సకీనా మ‌స్తాన్ మీద మొద‌టిసారిగా కోపం వ‌చ్చింది. ఏం మ‌నిషి ?  ఇవత‌ల తాను స‌చ్చేందుకు సిద్ధంగా వుంటే ఆవును తోలుకుపోయాడు. ఆడ‌వాళ్ళ‌కి పురుడు మ‌ళ్ళీ జ‌న్మ అంటారు. స‌స్తానో, బ‌తుకుతానో ఈ కాసేప‌యినా నా ఎదురుగా వుండ‌రాదా అని ఏడ్చుకుంది లోలోప‌లే. వెళ్ళాడేగాని మ‌స్తాన్ మ‌న‌సు స‌కీనా చుట్టూ తిరుగుతూనేవుంది. ఎట్లావుందో. బాధ ఎక్కువ‌య్యిందేమో అన్నం తిందో, లేదో ?  ఈ ఆలోచ‌న‌ల్తో క్ష‌ణం కూడా నిల‌వ‌లేక‌పోయాడు. అవినీ, చిట్టిగాడినీ, పెద్దిర్డెగారి బుట్టోడి క‌ప్ప‌చెప్పి వెన‌క్కొచ్చేసాడు. వెళ్ళేప్పుడు ఎలా చూశాడో స‌కీనాని అలాగే ప‌డుకుని వుంది. పాక‌పై క‌ప్పుకేసి చూస్తూ లేపి కూచ్చోపెట్టి అన్నం క‌లిపి ముద్దులు చేసి నోటి కందించాడు. స‌కీనా బొట‌బొటా క‌న్నీరు కార్చింది. ఛీ, ఛీ ! ఏడ‌వ‌మాక‌, నీకేం భ‌యంలేదు. అల్లా స‌ల్ల‌గా చూత్తాడు. ఆవుత‌ల్లి స‌ల్ల‌గా సూత్తుంది. అంటూ ఓదార్చాడు ఏమో, ఎట్టావుందో పురుడు క‌ట్ట‌మౌతుంద‌న్నారు. వోరం ముందే ర‌మ్మ‌న్నారు. మల్లా నిన్ను సూత్తానో, లేదో అంది స‌కీనా బెక్కుతూ. ఏం భ‌యం లేదు. ఆవుత‌ల్లి ఉన్నంత కాలం మ‌న వంశానికేం భ‌యంలేద‌ని మా అయ్య సెప్పేవోడుక‌దా ! అందుకే డ‌బ్బులేక పోయినా ఆవుని అమ్మ‌కుండా పూజ్జేసుకుంటున్నా. నాకిప్పుడు కొండంత ధైర్యం వొచ్చింది, రాత్రి భ‌య‌ప‌డ్డాకాని అన్నాడు మ‌స్తాన్‌.

చిరున‌వ్వుతో అత‌డలా మాట్లాడేస‌రికి స‌కీనా కూడా కొంచం కుదుట ప‌డింది. నాలుగింటిదాకా న‌వ్వుతూ, స‌కీనాని న‌వ్విస్తూ కాలంగ‌డిపి ఆవుని తోలుకొస్తాన‌ని వెళ్ళాడు మ‌స్తాన్‌. జ‌ల్దిర‌మ్మ‌ని హెచ్చ‌రించి క‌ళ్ళు మూసుకుప‌డుకుంది స‌కీనా.

మ‌స్తాన్ పిలుపు వింటూనే అంబా అంటూ ప‌రిగెత్తుకొచ్చింది ఆవు. మా తల్లి ! రా ! రా !  అంటూ ద‌గ్గ‌ర‌కు తీసి గంగ‌డోలు దువ్వాడు. నువ్వే కాపాడాలి తల్లీ మా స‌కీనాని అంటూ మూగ‌గా ప్రార్థించాడు. చెట్టుకి క‌ట్టేసిన చిట్టిగాడిని ఊడ‌దీశాడు.ఒరేయ్ సిట్టీ, ప‌క్క‌గా న‌డ‌రా నారీలొస్తాయి అని మెల్లిగా న‌డిపిస్తూ పులిగాడిచ్చిన ప‌చ్చ‌గడ్డి మోపును నెత్తికెత్తుకుని న‌డ‌వ‌సాగాడు. మెల్ల‌గా బోది దాటించి రోడ్డున ప‌డ్డాడు. సిట్టీ, జాగ‌ర్త ప‌క్క‌గా న‌డు అని అదిలిస్తూ న‌డిచాడు. దూడ‌కి రోజూ పాలు పెనే వ‌దుల్తాడు. అది చెంగు చెంగున హుషారుగా న‌డుస్తోంది. చిన్న మ‌చ్చ‌కూడా లేని పాల తెలుపు. కాటుక క‌ళ్లూ దాన్ని చూస్తూంటే ఎవ‌రికైనా మురిపెంగానే వుండేది.

బొయ్య‌మంటూ విప‌రీత‌మైన వేగంతో లారీ వ‌చ్చేస్తోంది. సిట్టీ పక్క‌కెళ్ళు అంటూ అరిచాడు మ‌స్తాన్‌. ఆవుకంగారుప‌డి రోడ్డుకటూ ఇటూ ప‌రిగెత్తింది. ఆవును త‌ప్పించాల‌న్న‌ట్లుగా లారీ అటూ ఇటూ విన్యాసాలు చేసింది. ఇవాళ్ళితో ఆవు కాళీ త‌న వంశం అంతం అనుకుంటూ మ‌స్తాన్ వెర్రిత్తిపోయి గ‌డ్డిమోపు కింద‌ప‌డేసాడు. ఆస‌మ‌యానికి గ‌డ్డిపుల్ల కంటిలో గుచ్చుకుంది. లారీ కీచుమంటూ స‌డ‌న్‌గా ఆగిపోయింది. జనం హాహాకారాలు చేస్తున్నారు. మ‌స్తాన్ పుల్ల గుచ్చుకున్న క‌న్నేగాక రెండో క‌న్ను కూడా తెర‌వ‌లేక‌పోయాడు. ఏమ ఘోరం చూడ‌వ‌ల్సి వ‌స్తుందోన‌ని, అయిన ఎంతసేపు క‌ళ్ళుమూసుకోగ‌ల‌డు ?  గుండె బాదుకుంటూ మనుషుల్ని త‌ప్పించుకుంటూ వెళ్ళాడు. చూశాడు తెల్ల‌ని మ‌ల్లెపూవ్వులా వున్న చిట్టి ఎఱ్ఱ‌ని ముద్ద‌లాగా చితికిపోయి వుంది. త‌ల లారీ చ‌క్రాల కిందేవుంది. మొండేన్ని మాత్రం లారీ అటూ ఇటూ న‌డిపించి లాగారు. మ‌స్తాన్ బుఱ్ఱ దిమ్మెర‌బోయింది. నెత్తిన చేతులు పట్టుకుని అలాగే కూల‌బ‌డిపోయాడు. జ‌నం డ్రైవ‌ర్‌ని పోలీస్ స్టేష‌న్‌కి న‌డ‌వ‌మ‌న్నారు. అత‌న్దీ రాష్ట్రం కాదు. త‌మిళ‌నాడు. ఏకేసో పెడితే వాయిదాల‌కి తిర‌గ‌లేక చావాలి. తెలుగొచ్చిన క్లీన‌ర్ జ‌నానికి చెప్పాడు. ఏభై  రూపాయ‌లిస్తాడు రిపోర్టు చెయ్యొద్ద‌ని అన్నాడు.  ఆ మాట విని  మ‌స్తాను భోరున ఏడ్చాడు. నా ముద్దుల చిట్టి ఖ‌రీదు ఏభై రూపాయ‌లా ?  అది క‌డుపున ప‌డ్డ కాణ్ణించీ ఆవునెంత గారాబంగా చూశామో, పుట్టిన కాణ్ణించి దూడ‌నెంత పాణంగా చూసుకున్నామో ?  డ్రైవ‌రు బాబూ ఆ దూడ‌నా ప్రాణ‌మే కాదు. నా వొంసేన‌కి దీపం నీ రూపాలూ వ‌ద్దు కేసులూ వ‌ద్దు ఎల్లిపోబాబూ, ఎల్లిపో అంటూ కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. మ‌స్తాన్ గోడు పిచ్చోడు ఆడికే తెల్సు ?  ప్రాణానికి ప్రాణ‌మే అది ప‌శువైపోయింది ! మడిసైతే లారీకి నిప్పెట్టేవోల్లం, నిన్నామంట‌ల్లో యేసేవోల్లం అంటూ మ‌దార్ క‌య్యానికి కాలుదువ్వాడు.

అంద‌రూ తలో మాటా అందుకున్నారు. ప‌రిస్థితి విష‌మించేలాగా వుంది. డ్రైవ‌ర్ బేరాన్ని పెంచాడు. నూట ఏభైయిస్తే లారీ వ‌దుల్తాన‌న్నాడు మ‌దార్‌. డ్రైవ‌ర్ చేతిలో పెట్టిన డబ్బును చూసి మ‌రో మారు ఏడ్చాడు మ‌స్తాన్‌.  అంతా ఎక్క‌డి కక్క‌డ స‌ర్దుకున్నారు. మ‌దార్ మామా, త‌ప్పంతా నాదే. ప‌చ్చ‌గ‌డ్డికి ఆశ‌ప‌డి దూడ‌ని న‌డిపించాను లేక‌పోతే దూడ‌ని నెత్తినెట్టుకుని రానా అయ్యో మామా ఎంత ప‌ని జ‌రిగిపోయింది. ఈ సంగ‌తి స‌కీనా కెల్లా చెప్ప‌ను. దాని మొకం ఎల్లాసూడ‌ను. దాన్నెల్లా వోదార్చ‌ను ? అంటూ బాధ‌ప‌డిపోయాడు. ఒరే మ‌స్తాన్‌గా ! ఏడాదిపోతే ఆవు ఇంకో దూడ‌ను యేస్తుంది. ఈ సొమ్ముతో స‌కీనా గండం గ‌డుస్తుంది. ఏడ‌వ‌మాకురా పిచ్చోడా అన్నాడు.

ఆడంగులంతా మ‌స్తాన్ గుడిసె ద‌గ్గ‌ర‌కి చేరారు. గ‌డ‌బిడ‌గా వుంది. స‌కీనాకి నొప్పులొస్తున్నాయి అన్నారు. దూడ సంగ‌తి తాత్కాలికంగా మ‌ర్చిపోయి, స‌వారీ క‌ట్టుకుని డాక్ట‌రు ద‌గ్గ‌రికి ప‌ట్నం తీసికెళ్ళాడు.

మూడొంద‌లు బ‌ల్ల‌మీద పెడితేగాని  పేషంట్‌ని బ‌ల్లెక్కించ‌న‌న్న‌ది డాక్ట‌ర‌మ్మ‌. డ్రైవ‌రిచ్చిన నూట యాభై రొండిన అలాగే వున్నాయ్‌. మూట విప్పి బ‌ల్ల‌మీద పోశాడు మ‌స్తాన్‌. చిరున‌వ్వుతో ప‌రీక్షించింది. క‌ష్ట‌మే ! ఇంకోళ్ళ‌కైతే అయిదొంద‌లు తీసుకుంటాను. నువ్వు బీద‌వాడివ‌ని త‌క్కువ‌కి వ‌ప్పుకున్నా అంది డాక్ట‌ర‌మ్మ అతి ద‌యగా. అతి ద‌య‌నీయంగా చూస్తున్నాడు మ‌స్తాన్‌. నోట మాట రాలేదు . ప‌ల్లెటూరి మూక అని వెంట వ‌చ్చిన వారంద‌రినీ చెట్ల‌కింద వుండ‌మంది.

య‌మ బాధ‌ప‌డి పండంటి బిడ్డ‌ని కంది స‌కీనా. ఎంత తెల్ల‌గా వున్నాడో చిట్టినాగా అనుకున్నాడు మ‌స్తాన్‌. నాచిట్టీ నువ్వు నీ ప్రాణాన్నిచ్చి నా స‌కీనా ప్రాణాన్ని కాపాడావు. ఇప్ప‌టికిప్పుడు డ‌బ్బు ఎట్లా తెచ్చేవోణ్ణి ?  ఎట్టా స‌కీనాని కాపాడుకోనేవోణ్ణి అని బాధ ప‌డ్డాడు.

మ‌దార్ మామా ! నా చిట్టి త‌న పాణినిచ్చి నా వొంశాన్ని నిలిపింది మామా. నాను చేసిన పూజ‌లు ఆవు తల్లి తీసుకుని వూరుకోలేదు. ఎట్టా కాపాడిందో చూడు అంటూ సంతోషంతోను దుఃఖంతోనూ ఉబ్బి త‌బ్బిబైపోయాడు.

స‌కీనా కూడా ఓ కంట న‌వ్వు ఓ కంట ఏడుపుగా వుంది. చిట్టిని త‌ల్చుకుంటూ బుజ్జిగాడిని గుండెల‌కు హ‌త్తుకుంది. త‌ను పై కెళ్ళిపోయి బుజ్జిగాణి భూమ్మీద ప‌డేసింది. చిట్టి చ‌చ్చిపోయి వుండ‌క పోతే త‌ను చ‌చ్చిపోయేదే. ఆవు పూజ‌లో అంత మ‌హాత్య‌ముందా ?  ఏదో ఆ స‌మ‌యంలో అలా జరిగితే తాము మ‌హ‌త్య‌మే అనుకుంటున్నామేమో ?  అనుకున్న మ‌దార్ ఆ మాటే పెద్ద‌ల‌తో అన్నాడు. ఏదైనా విశ్వాసంతో చేసినప్పుడు ఫ‌లితం ఉంటుంది. మీ మ‌తం మా మ‌తం అని లేదు. మంచిత‌న‌మే మ‌తం విశ్వాస‌మే మ‌తం అన్నాడు ఆ పూరి మున‌స‌బు.

మ‌తంతోనూ, మాట‌ల్తోనూ ప‌నిలేని మ‌స్తాను. స‌కీనా బుజ్జిగాడిని ముద్దులాతుడూ చిట్టిగాడిని మ‌రిచిపోడానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.