అంత‌శ్చేత‌న‌

అర్థ‌రాత్రి అప్పుడే గ‌డియారం ప‌న్నెండు గంట‌లు కొట్టింది. అప్ప‌టిదాకా ఫ్రెండ్స్‌తో క‌బుర్లు చెప్పుకుని బెడ్‌మీద వాలిన సాందీప్‌కి చిన్న‌గా కునుకు ప‌ట్టింది. ఇంత‌లో తలుపు ట‌క‌ట‌కా కొట్టారెవ‌రో, సాందీప్‌కి మెల‌కువ వ‌చ్చింది. కాలింగ్‌బెల్ నొక్క‌కుండా త‌లుపుకొట్టారెందుకో, అనుకుంటూ నైటీ స‌రి చేసుకుని ముందుహాల్లో లైట్‌వేసి తలుపు తీశాడు. అక్క‌డ ఎవ్వ‌రూ లేరు. ర‌య్యిమంటూ త‌లుపులోంచి గాలి లోనికి దూసుకువ‌చ్చింది. ఎంతో ధైర్య‌స్తుడైన సాందీప్ గుండె ఏదో తెలీని భ‌యంతో ద‌డ‌ద‌డా కొట్ట‌కుంది.

ఎవ‌రు తలుపు కొట్టిందెవ‌రు ?  తీసేలోగానే వెళ్ళిపోయారెందుకు ?  ఏ దొంగ‌లోనా ? ఏ బందిపోట్ల‌యినానా ?  ఏ ప‌క్క‌నో న‌క్కి నేను బ‌య‌టికి వెళ్ళేస‌రికి ఒక్కుమ్మ‌డిగా మీద‌ప‌డి కాళ్ళూ చేతులూ క‌ట్టేసి లోప‌లికి వ‌చ్చి స‌ర్వం దోచుకోరు క‌దా !  అయినా అలారం బెల్ ఇక్క‌డికి ద‌గ్గ‌ర్లోనే ఉంది. నొక్క‌చ్చు. అలారం బెల్ విన‌గానే నౌక‌ర్లంద‌రూ ఒక్క‌సారిగా వ‌చ్చేలాగా ట్రైనింగ్ ఇచ్చాడునాన్న‌. ఈ ఒంట‌రి ఇంటికి గొప్పింటికి...ఆ మాత్రం ముందు జాగ్ర‌త్త అవ‌స‌ర‌మే.

రెండు నిముషాలు దాటిపోయింది గ‌డియారం చేసే టిక్కు టిక్కు శ‌బ్దం త‌ప్ప ఎలాంటి అలికిడీ లేదు. సాందీప్ ముందు తోట‌లో లైట్ కూడా వేసి అడుగు బ‌య‌ట‌పెట్టాడు. చూట్టూ ఇటూ అటూ చూశాడు. గేటు దాటి బ‌య‌టికెళ్ళి పోయారా అని చూశాడు. గేటు త‌లుపులు తాళం వేసిన‌వి వేసిన‌ట్లే వున్నాయ్‌. మెల్లిగా వ‌రండా చివ‌రి కొచ్చి దృష్టిని ద‌క్షిణ వేపుకి మ‌ళ్ళించాడు. చిన్న చిన్న పూల‌చెట్ల‌ను దాటితే వ‌చ్చే కొబ్బ‌రి చెట్లు గాలికి పిచ్చిగా ఊగుతున్నాయ్‌. మ‌బ్బుగా కూడా ఉంది కొబ్బ‌రి చెట్లు త‌రువాత వున్న మామిడి చెట్ల గుబురుల్లోకి లైట్ ఫోక‌స్ ప‌డ‌క నీడ‌లు నీడ‌లుగా వుండి ఏవో భ‌యంక‌ర‌మైన అనుభూత‌ని క‌ల్గిస్తున్నాయ్‌. సాందీప్ దృష్టి ఇంకొంచం ముందుకు సాగింది. అక్కడ ...మ‌ల్లెచెట్ల ద‌గ్గ‌ర‌...ఏమిటి...ఏదో ఆకారం...ఏం చేస్తోంద‌క్క‌డ‌. సాందీప్ గుండె ల‌య త‌ప్పింది. ఆ ఆకారం అక్క‌డ పచార్లు చేస్తున్న‌ట్లుగా వుంది. ఒక‌సారి మామిడి చెట్టు ఎక్కిన‌ట్లుగానూ కొంచం సేపు మ‌ల్లెప‌లు కోస్తున్న‌ట్లుగాను వుంది. ఏదీ నిర్ణ‌యం కాలేదు అది మ‌గా ?  ఆడా ?  మ‌నిషా ? మ‌రేదైనానా ?  సాందీప్ కి ద‌గ్గ‌ర‌గావెళ్ళి చూడాల‌ని అన్పించినా ధయిర్యం చాలలేదు. అలాగే నిల‌బడ్డాడు. స‌న్న‌గా ఏదోపాట విన‌వ‌స్తోంది. అక్క‌డ్నుండే. ఎటూ తేల్చుకోలేని సాందీప్ మెల్ల‌గా వెన‌క్కి తిర‌క్కుండానే లోప‌లికి వ‌చ్చి తలుపు వేసుకుని అలానే వ‌చ్చి బెడ్‌మీద వాలి పోయాడు.

ఈ నాడెందుకో త‌న‌కింత టెన్‌ష‌న్‌గా వుంది. గొంతు త‌డి ఆరిపోయింది. దాహం మండిపోతోంది. లేచి ప‌క్క‌నే ఉన్న ఫ్రిజ్ లోంచి నీళ్ళు తీసుకోడంగాని నౌక‌ర్ని పిలిచి మంచినీళ్ళ‌డ‌గ‌డం కానీ చేయ‌లేక‌పోయాడు. ఇంకా అవ‌త‌లి గ‌దిలోంచి మ‌మ్మీడాడీ ఏవో డ‌బ్బు లెక్క‌లు తేల‌క గ‌ట్టిగానే మాట్లాడుకుంటున్నారు. వెళ్ళివాళ్ళ‌తో క‌బుర్లు చెప్పుకుందామ‌నుకున్నా కాలు క‌ద‌ప‌లేక పోయాడు. అలాగే మంచం మీద క‌ట్టెలాగా క‌ద‌ల‌టానికీ మెద‌ల‌టానికీ కూడా ధ‌యిర్యం చాల‌క ప‌డుకుండి పోయాడు. అత‌ని క‌ళ్ళ‌ల్లో దూరాన చెట్ల‌కింద క‌ద‌లాడే ఆకారం గిర‌గిరా తిరుగుతోంది. స‌న్న‌ని ఆ పాట ఎక్క‌డో ఎప్పుడో విన్న‌ట్లే వుంది. ఎవ‌రా పాడేది ?  ఎవ‌రిదా గొంతు ?  బుర్ర ప‌గ‌ల గొట్టుకున్నా సాందీప్‌కి ఏమీ అంతుప‌ట్ట‌లేదు.

ర‌క‌ర‌కాల క‌థ‌లు గుర్త‌కొచ్చాయ్ ! బాణామ‌తులు, కామినీ పిశాచాలు, కొరివి ద‌య్యాలు, చేత‌బ‌ళ్ళు ?  బీస్‌సాల్‌బాద్‌లాంటి భయంక‌ర‌మైన సినిమాలు...ఎన్నో ఎన్నో ఊహ‌లు. ఆ దృశ్యం మ‌రీ మ‌రీ వెంటాడుతోంది. చూసిన‌ప్ప‌టిక‌న్నా ఊహించుకున్నప్పుడు మరింత భ‌యాన‌కంగా వుంది. మాన‌సికంగా ఎంతో అలిసి పోయిన సాందీప్ మెల్ల‌గా నిద్ర‌లోకి జారుకున్నాడు. ఫెళ్ళున జ్వ‌రం మంచుకొచ్చింది. అత‌ని మూలుగుకి నౌక‌రు త‌వ్విట‌య్య లేచి అమ్మ‌గారూ ! అబ్బాయిగోరి వొల్లు జొరంతో కాలిపోతోంది. ఓటే క‌ల‌వ‌రిత్త‌న్నాడు. అంటూ మ‌హేశ్వ‌రిని నిద్ర‌లేపాడు. మ‌హేశ్వ‌రి కంగారుగా వ‌చ్చి చూసి వెంట‌నే భ‌ర్త‌ని లేపింది. రాత్రి ప‌న్నెండు వ‌ర‌కు వెధ‌వ తిరుగుళ్ళు తిరుగుతాడు. ఒంటిమీద‌కు ఏం వ‌స్తుందో ఆలోచించుకోడు అంటూ డ్రైవ‌ర్ని లేపి డాక్ట‌ర్ కోసం కారు పంపాడు ల‌క్ష్మీప‌తిరావు.

ల‌క్ష్మీప‌తిరావు  ఆ చుట్టుప‌క్క‌ల చాలా వూళ్ళ‌ల్లో వున్న ధ‌న‌వంతులంద‌రిల్లోకి ధ‌న‌వంతుడు. ఆయ‌న్ని కోటేశ్వ‌రుడు అన‌కూడ‌దు. ఎందుకంటే ఆయ‌న‌కున్న‌ది ఒక్క కోటి కాదు. కోట్లు. మూడు ప‌దులో నాలుగు ప‌దులో కోట్లు !  ఇహ ఆ కోట్లు ఏయే రూపాల్లో ఏయే ఊళ్ళ‌ల్లో వున్నాయో చెప్పాలంటే విసుగు పుట్ట‌దు. కానీ వినేవాళ్ళు న‌మ్ముతారో న‌మ్మ‌రో అన్న భ‌యం చేత చెప్ప‌టం లేదు. నిజంగా ఇందులో అణువంతైనా అతిశ‌యోక్తి లేదు ! ఇంత‌వున్నా మ‌హేశ్వ‌రి పాల‌వ్యాపారం పిడ‌క‌ల వ్యాపారం మాన‌దు. మ‌నం అందుంలోంచే వ‌చ్చాం. గ‌తాన్ని మ‌ర‌వ‌కూడ‌ద‌నే ఆమె సిద్దాంతం ! ఇలాంటి ల‌క్ష్మీప‌తిరావుకి సంతానం కూడా ఘ‌నంగానే వుంది. ఎనిమిది మంది అదృష్ట‌వంతులంద‌రూ ఒక్క‌చోటే చేరార‌న్న‌ట్లుగా అంద‌రూ త‌లో బిజినెస్సూ చేస్తూ అంద‌రూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అంద‌ర్లోనూ చిన్న‌వాడైన సాందీప్ కాన్పూర్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పుచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం వేసంకాల‌మంతా త‌ల్లిదండ్రుల‌తో గ‌డుపుతున్నాడు.

ల‌క్ష్మీప‌తిరావుకి టౌన్‌లో ఎన్ని ఇళ్ళున్నా ప‌ల్లెలో త‌ను క‌ట్టుకున్న దేవేంద్ర భ‌వ‌నంలోనే వుండ‌ట‌మంటే ఇష్టం ! ఎంతో  క‌ట్టుదిట్టంగా ఎంతో బందోబ‌స్తుగా బందిపోట్ల‌కి అభేద్యంగా వుండేలా ఆధునికంగా క‌ట్టుకున్న ఆ యిల్లంటే ఆయ‌న‌కి మ‌క్కువ ఎక్కువ .  అత‌ని పొలాల్లోనూ తోట‌ల్లోనూ ప‌ని చేసే పాలేళ్ళ‌కి త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే వెన‌క‌వైపు ఉత్త‌రం వైపూ పెంకుటిళ్ళు క‌ట్టించి ఇచ్చాడు. ప‌గ‌లు త‌మ పొలాల్లోనే క‌ష్ట‌ప‌డ‌తారు. రాత్ర‌కి త‌నింటికి కాప‌ల‌గానూ ఉంటారు. వాళ్ళ అలికిడే త‌న‌కి ధ‌యిర్యం ! ఈ మ‌ధ్య బాంబుల‌తో దాడిచేసి ఇళ్ళు దోచుకుంటున్నార‌ట ! అలాంటి దాడులు జ‌రిగితే ఏం చెయ్యాలో ఎలా ఎదుర్కోవాలో నౌక‌ర్లంద‌రికీ ట్రైనింగ్ ఇచ్చాడు !


డ్రైవ‌ర్ అర‌గంట‌లో టౌన్ నించి డాక్డ‌ర్ని తీసుకొచ్చాడు. అంత‌వ‌ర‌కూ మ‌హేశ్వ‌రి సాందీప్ ముఖం మీద ఐస్‌తో త‌డిపిన బ‌ట్ట‌ని వేస్తూనే వుంది. క్ష‌ణాల్లో  ఆ బ‌ట్ట వేడెక్కి పోతోంది. సాందీప్ ఉన్న‌ట్టుండి ఉలిక్కిప‌డ‌టం అటూ ఇటూ పిచ్చిగా చూస్తూండ‌టం చేస్తున్నాడు. దాంతో మ‌హేశ్వ‌రి మ‌రీ కంగారు ప‌డి పోతోంది.

డాక్ట‌ర్ ఇంజ‌క్ష‌న్ చేసి భ‌యం లేద‌ని చెప్పి వెళ్ళిపోయాడు.

ఉద‌యం తొమ్మిదింటికి క‌ళ్ళు తెరిచాడు సాందీప్‌. ఎలావుంది నాయాన ?  మ‌హేశ్వ‌రి ఆత్రంగా అడిగింది. ల‌క్ష్మీప‌తి మేక‌పోతు గాంభీర్యంతో చుట్ట‌కాలుస్తూ అటూ ఇటూ తిరుగుతున్నా ఇదేమిటి ఇంతలో ఇలా ముంచుకొచ్చింది అని కంగారు ప‌డ్తూనే ఉన్నాడు. సాందీప్ త‌ల్లికి ఏం చెప్ప‌లేదు. భ‌యంగా చూసి క‌ళ్ళు మూసుకున్నాడు.

అమ్మ‌గారూ ! అమ్మ‌గారూ  !  మ‌ల్లి కంగారుగా వ‌చ్చింది. ష్‌... అర‌వ‌కు బాబు ఇప్పుడే లేచాడు. ఏమిటాగోల అంది మ‌హేశ్వ‌రి చూడండ‌మ్మ‌గారూ. నిన్న న‌న్ను మ‌ల్లెప‌లు కొయ్య‌ద్ద‌న్నారా ?  రేపు శుక్ర‌వారం పొద్దున్నే పుజ్జేసుకుంటాను. వుండ‌నియ్య‌మ‌న్నారా ?  అంది మ‌ల్లి. అయితే ఏమిటే. నీవు చెప్పేది సాంతం చెప్పు సాగ‌దీయ‌కు అంది మ‌హేశ్వ‌రి . అదేనండ‌మ్మాగారూ మ‌ల్లెపూలు నిన్న కొయ్య‌లేదు క‌దా ! మీరు మ‌ల్లీ ! మ‌ల్లెపూలు కోసుకు రావేల‌ని పిలుతార‌ని పొద్దుటేల‌నించి చూస్తున్నాను. ఇప్పుడే చెట్టుకాడి కెళ్ళి పూలు కోద్దామ‌నుకుంటుంటే...ఇవాల నాకు పూలు కోయ‌క్క‌ర్లేదు. నేను పూజ చేసుకోను. నా బాబుకి జ్వ‌రం త‌గ్గ‌గానే ఏ పూజ‌లైనా. అది కాద‌మ్మ‌గారూ ఈ మ‌ల్లెపూలు చూడండి. ఎలా తుంపి పార‌బోశారో ! ఎవ‌రి కొచ్చిందో మాయ‌రోగం. అంటూ త‌ను ఏరుకొచ్చిన మ‌ల్లెపూల‌ని టేబిల్ మీద పోసింది మ‌ల్లి.

సాందీప్ మ‌ల్లిమాట‌ల‌కి ఉలిక్కి ప‌డ్డాడు. రాత్రి ఆ ఆకారం మ‌ల్లె చెట్టు ద‌గ్గ‌రే త‌చ్చాడింది. మామిడి చెట్టు కూడా ఎక్కింది క‌దా !  బొండు మ‌ల్లెపూలు చిన్న‌గులాబీలంతేసి ఉన్నాయి. ఎవ‌రే ఇలా చించిపారేశారు నిక్షేపంలాంటి పూల‌ని మ‌హేశ్వ‌రి ఉసూరుమంది. సాందీప్ నాలుక‌తో పెద‌వులు త‌డి చేసుకుని అతి ప్ర‌య‌త్నం మీద అడిగాడు. మ‌ల్లీ !  మామిడి పింద‌లు కూడా కింద‌రాలిపోయి ఉన్నాయా ? మ‌ల్లి ఆశ్చ‌ర్య‌పోయింది. మీ కెలా తెలుసు బాబుగారూ ! మీరు గానీ ఈ ప‌ని చెయ్య‌లేదుగ‌దా. ఆ కింత అంతా మామిడి పిందలే. ఏ కోతేనా వ‌చ్చి తుంపి పోసింద‌నుకున్నాను. సాందీప్‌కి ఆ పాట చెవుల్లో లీల‌గా విన్పిస్తోంది. గుండెభ‌యంతో గిల‌గిల్లాడింది. మ‌ళ్ళీ జ్వ‌రం పెరిగింది. సాయంత్రానికి కాని మ‌ళ్ళీ మామూలు మ‌నిషి కాలేదు. ఇలా నాలుగైదు రోజుల‌య్యేస‌రికి మ‌ళ్ళీ రోటీన్‌లో ప‌డిపోయాడు. భ‌యం ఎంత‌ప‌ని చేస్తోందీ ?  ఛీ అలా అస‌హ్యంగా పిరికి పంద‌లాగా జ్వ‌రం తెప్పించుకున్నానేమిటి ? అనుకుంటాడు. ఇంత‌లో ఆ పాట‌, ఆ ఆకారం జ్ఞ‌ప్త‌కి రాగానే అదేమిటి ? మ‌నిషేనా అయితే ఎవ‌రు ? ఎందుకంత భ‌య‌ప‌డ్డాను ? ద‌య్య‌మా ! అన్న అనుమానం రాకుండా మాన‌దు. ఫ్రెండ్స్‌తో చెబ్తే ప‌క‌ప‌కా న‌వ్వారు. అడ‌పా ద‌డ‌పా హాస్యం ప‌ట్టిస్తున్నారు.

ఆ రోజు ఫ‌స్ట్ షో సినిమాకి సెకండ్ షో సినిమాకీ వెళ్ళి ఫ్రెండ్స్‌తో కార్లో వ‌స్తున్నాడు. తీరా రైలుగేటు దాకా వ‌చ్చేస‌రికి కారుకేదో చిన్న ట్ర‌బుల్ వ‌చ్చింది. డ్రైవ‌ర్ ఏవో తంటాలు ప‌డ్తున్నాడు. నలుగురు అక్క‌డే గేట్‌కీప‌ర్ ప‌డుకోడానికి వేసుకున్న బెంచీమీద కూర్చున్నారు. సాందీప్‌, కృష్ణ వెన్నెట్లో ప‌ట్టాల‌వెంట క‌బుర్లు చెప్పుకుంటూ న‌డుస్తున్నారు ! ఒరే కృష్ణా నువ్వు వాడి చెయ్యి గ‌ట్టిగా ప‌ట్టుకోరా లేక‌పోతే ధ‌డుసుకుని జొరం తెచ్చుకుంటాడు పాపాయ్ ! అన్నాడు వెన‌క‌నుంచి మిత్రులు. సాందీప్‌కి పౌరుషం వ‌చ్చింది. ఇదిగో నేనొక్క‌డ్నే ఈ ప‌ట్టాల మీద ఆ శ్శ‌శానం దాకా వెళ్ళక‌పోతే వెయ్యి రూపాయ‌లిచ్చుకుంటాన‌ను ! వెయ్యి ప్లీజ్ కృష్ణా గో ఎండ్ జాయిన్ దెమ్ ! అంటూ వాళ్ళ మాట‌లు విన్పించుకోకుండా ముందుకు న‌డిచాడు. శ్శ‌శానం వ‌స్తున్న కొద్దీ సాందీప్‌లో ఏదో చిన్న‌జంకు. కుక్క‌లు ఏడుపులూ న‌క్క కూత‌లూ అక్క‌డ‌క్క‌డా చిన్న చిన్న చితిమంట‌లూ అయినా లెక్క చెయ్య‌లేదు. త‌ను పందెం నెగ్గిన‌ట్టే చివ‌రిదాకా వ‌చ్చేశాడు. ఇహ వెన‌క్కి తిరుగుదాం అనుకుంటూ ప‌ట్టాల వెంబ‌డి ముందుకు దృష్టిని సారించాడు. అంతే గుండె గొంతుక‌లో  కొచ్చింది. ఆ వెన్నెల్లో ఆ ఆకారం దూరంగా అస్ప‌ష్టంగా ? అది స్త్రీ ఆకార‌మే ! ఆమె గొంతులోంచి పాట వ‌స్తోందా ? ఆ పాట త‌న చెవిలోనే ప్ర‌తిధ్వ‌నిస్తోందా ?  సాందీప్‌కి క‌ళ్ళు చీక‌ట్లు క‌మ్మాయ్ !  ఒళ్ళంతా చెమ‌ట‌లు ప‌ట్టింది ఇహ వెన‌క్కి తిర‌గ‌లేక‌పోయాడు. రైలొస్తోంది చ‌ప్పున‌రా అంటూ కృష్ణ ప‌రుగున వ‌చ్చి వెన‌క్కీడ్చుకు పోయాడు. రైలు సంద‌ట్లో సాందీప్‌నెవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. కానీ సాందీప్‌కి అయోమ‌యంగా వుంది.

రెండు నిముషాల్లో రైలు ధ‌న్‌ధ‌న్‌మంటూ స్పీడ్‌గా వెళ్ళిపోయింది. ఆ ఆకారం మ‌నిషైతే త‌ప్పించుకునే దారిలేదు. ఇటూ అటూ వంతెన ఇన‌ప ప‌ట్టీల గోడ‌లు. ఆ త‌ర్వాత ఎంతో అగాధం. ఎలా త‌ప్పించుకోగ‌ల‌దు.  కాలు ఏ కొంచం ప‌ట్టుత‌ప్పినా న‌దీ గ‌ర్భంలో క‌ల్సిపోవాల్సిందే ?  లేదా రైలు క్రింద ప‌చ్చ‌డ‌యినా కాక త‌ప్ప‌దు.

తెల్ల‌వారిన ద‌గ్గ‌ర్నుంచీ ఎవ‌రైనా వ‌చ్చి న‌దిలో శవం తెలుతుంద‌నో రైలు క్రింద ప‌డి దారుణంగా న‌లిగిన శ‌వాన్ని చూశామ‌నో చెబుతారేమోన‌ని ఎదురు చూశాడు సాందీప్‌. కానీ నాల్గురోజుల‌యినా అత‌ను ఎదురు చూసిన వార్త రాలేదు. అయితే త‌ను చూసింది మ‌నిషిని కాద‌న్న నిర్ణ‌యానికి రాక త‌ప్ప‌లేదు. త‌న హేతువాద‌మూ ధ‌యిర్యం ఏమైపోయాయి ! ఇందులో ఎక్క‌డో ఏదో అర్ధం కాని విష‌యం హృద‌యంలో ముల్లులాగా గుచ్చుకుంటోంది.

ప‌గ‌టిపూట మ‌ల్లి అమాయ‌క‌మైన క‌బుర్లు వింటూ ఆ సంగ‌తి మ‌ర్చి పోయినా రాత్ర‌య్యేస‌రికి ఏదో ఘోర విష‌యం జ‌రుగుతుందేమోన‌న్న టెంష‌న్‌ని భ‌రించ‌శ‌క్యం కాకుండా వుంది ! మ‌ల్లి ఏదో ఒక వంక‌బెట్టుకుని త‌న ద‌గ్గ‌ర‌కు రాకుండా మాన‌దు. చిన్న‌త‌నం నించీ క‌లిసి ఆడుకున్నారు. దాని మ‌న‌సు స్వ‌చ్చంగా విర‌బూసిన మ‌ల్లియ్య‌లంటిదే. సినిమా క‌థ‌లు చెప్తేచాలు,క‌ళ్ళు పెద్ద‌వి చేసుకుని వింటూ ఉంటుంది. ఈ మ‌ధ్య ప్రేమ క‌థ‌లు దాన్ని బాగా ఆక‌ర్షిస్తున్న‌ట్లుగా ఉన్నాయ్‌. క‌ట్టు బొట్టు చూపుల తీరు అన్నిట్లోను ఏదో మార్పు.

సాందీప్ త‌న‌నేదో ద‌య్యం వెంటాడుతోంద‌ని చెప్పాడు. మ‌ల్లి కిల‌కిలా న‌వ్వింది. ద‌య్యాలు దేవుళ్ళు ద‌గ్గ‌రకి రాలేవ్‌. నాకు బాగా తెలుసు అంది. ఈ మాట మ‌హేశ్వ‌రిదాకా వెళ్ళింది. మ‌హేశ్వ‌రి ర‌క్ష‌రేకు క‌ట్టించింది. ప్రొద్దుకూకాక బ‌య‌టికి పోకుండా ఆంక్ష‌లు పెట్టింది. అయినా రెండు మూడు సార్లు తలుపు కొట్టిన చ‌ప్పుడూ అస్ప‌ష్ట‌మైన పాట సాందీప్ చెవినుంచి త‌ప్పించుకోలేదు. ఆ చ‌ప్పుడు కోసం చెవుల రిక్కించి హాయిగా నిద్ర‌పోకుండా చీమ చిట్టుక్కుమంటే ఉలిక్కిప‌డే స్టేజికి వ‌చ్చాడు. ఇప్పుడ‌త‌నిలో మొద‌ట్లో వున్నంత భ‌యం లేదు. కానీ ఏదో ఆరాటం ! అదేమిటో తెల్సుకోవాల‌నే త‌ప‌న ఎక్కువైనాయ్‌.

ఓనాడు మామూలుగా తలుపు చ‌ప్పుడైంది. ఈ సారి సింహ‌ద్వారం త‌లుపుకాదు. సాందీప్ బెడ్‌రూమ్ వైపు సందులో త‌లుపు ! తియ్యాలా వ‌ద్దా ఆలోచించాడు. చ‌ప్పుడు ఆగిపోయింది. ఆ వ‌చ్చిన‌వాళ్ళు వెళ్ళిపోయే వుంటారు అనుకుని మెల్లిగా త‌లుపు తీశాడు. అక్క‌డ మెట్ల‌మీద ఓ అమ్మాయి కూర్చుని వుంది. ఆశ్చ‌ర్యంతో లైటు వేశాడు. మెల్ల‌గా ఆ అమ్మాయి లోప‌లికి వ‌చ్చి సాందీప్ బెడ్ మీద కూర్చుంది. మ‌ల్లీ నువ్వా ! ఇంత‌రాత్ర‌ప్పుడు ? ఊ  ఎందుకొచ్చావ్, ఊ ,  ఏదైనా ప‌నివుందా ?  ఊహు ! త‌లఅడ్డంగా తిప్పింది. ఏమైనా కావాలా ?  ఊ , అంటూ త‌న క‌ళ్ళలోకి చూస్తూ త‌న ఊపింది. ఊ ఆ త‌ప్ప ఊరికే క‌ళ్ళు పెట్టుకుని చూట్టం త‌ప్పా మాటా మంచీ లేదు. కాసేపు కూచుని అద్దంలో చూసుకుంటు పైపైన దువ్వుకుని వెళ్ళిపోయింది.

సాందీప్‌కి ఏం చెయ్యాలో తెలీలేదు. మ‌ల్లి తండ్రి రామ‌న్న‌ని లేపుదామ‌నుకున్నాడు. అంద‌రూ లేస్తారు. లేని రంగులు పూస్తారు.