అనురాగ‌బంధం

బాబుని నాకిచ్చి జాగ్ర‌త్త‌గా దిగు టాక్సీలోని బిందు చేతిలోంచి రాముని తీసుకుని అపురూపంగా ఎత్తుకుంది సీత‌మ్మ‌గారు. అంత‌వ‌ర‌కూ వింత‌గా క‌ళ్ళార్ప‌కుండా చూస్తున్న మాధురి అమ్మా బాబుని నాకియ్య‌వే ఎత్తుకుంటా అంటూ చేతులు జాపింది. ఇప్పుడే వ‌ద్దు మాధురీ !  ఇంకో రెణ్ణెలు పోయాక బాబు కొంచెం పెద్ద‌వుతాడుగా అప్పుడు ఎత్తుకుందువుగాని, ఇంత చిన్న‌పిల్ల‌ల్ని ఎత్తుకోవ‌టం నాకే స‌రిగ్గారాదు.

 

పాపం !  చేత‌కాద‌ని చేప్తే పిల్లాడిని నేనెత్తుకు మోస్తాన‌నుకున్నావేమో, ఆ ప‌ప్పులేఉడ‌క‌వ్‌. అమ్మా ! నువ్వు కూడా ఎత్తుకోకు వాడి ప‌నుల‌న్నీ బిందే చూసుకోవాలి అంటూ వేళాకోళం చేసాడు వాసు. అలాగంటే ఎలాగురా ! చిన్న పిల్లాడిని అమ్మాయొక్క‌తే ఎలా చూసుకుంటుంది ?  ఇప్పుడైతే నేవున్నానుగానీ, ఇంకో ఇద్ద‌రు పుడితే నువ్వు సాయం చెయ్యొద్దూ ?  ఒక్క‌త్తికీ పనెలా తీరుతుంది.... స‌రే త‌ర్వాత మాట్లాడుకోవ‌చ్చు ముందు కాళ్ళు క‌డుక్కుని రండి అని చెప్పి లోప‌లికి న‌డిచింది సీత‌మ్మ‌గారు. బాబు చాలా బాగున్నాడు. ఎంచ‌క్కా క‌ళ్ళు ఎంతెంత ఉన్నాయో ! అంద‌ర్నీ తంతాన‌న్న‌ట్టుగా కాళ్ళు బ‌లే పైకెత్తుతున్నాడే ! మురిసిపోతూ మాధురి అన్నావ‌దిన‌ల‌తో ఇంటిలోకెళ్ళింది.

సీత‌మ్మగారు మ‌న‌వ‌డు పుట్టిన సంతోషంతో ఉక్కిరిబిక్కిర‌యిపోతోంది. మాధురి చిన్న‌పిల్ల‌గా ఉండ‌గానే సుంద‌ర్రామ‌య్య‌గారు పోతే మ‌న‌సు చిక్క‌బ‌ట్టుకుని పిల్ల‌ల్నిద్ద‌ర్నీ నాల్గెక‌రాల పొలం మీద వ‌చ్చే ఆదాయంతో పెంచి పెద్ద చేసింది. వాసు చ‌దువుకి డ‌బ్బు త‌క్కువైతే అడ‌పా ద‌డ‌పా అడక్కుండానే సాయం చేసినందుకు మారుగా క‌ట్నం లేకుండానే త‌మ్ముడి కూతురు బిందుని వాసుకిచ్చి పెళ్ళి చేసింది. మాధురి ఎస్‌.ఎస్‌.సి చ‌దువుతోంది. మ‌ళ్ళీ ఈనాటికి ఇంట్లో పసిబిడ్డ పారాడుతుంటే సీత‌మ్మ‌గారు మురిసిపోతోంది.

రాము పెంకులెగిరిపోయెట్టు గుక్క‌పట్టి ఏడుస్తున్నాడు. దొడ్లో నూతి ద‌గ్గ‌రుంది బిందు. రాముని కాళ్ళ‌మీద ప‌డుకోబెట్టుకుని, కాళ్ళు , చేతులు ప‌ట్టుకు నోట్లో పాలు పోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న మాధురి ,  మాధురి అంటూ ఇల్లు దద్ద‌రిల్లిపోయేలా గ‌ర్జించిన అన్న‌య్య వంక చూసింది హ‌డిలిపోయి. పిల్లాడు రాగం పెంచాడు. ఈ సంద‌డికి బిందు వ‌చ్చి సంగ‌తి అర్ధం చేసుకుని రాముని ఎత్తుకుని ఏడుపు మానిపించింది. మాధురి మాత్రం బొమ్మ‌లా అలానే కూచోటం చూసి వాసుతో ఫ‌ర‌వాలేదులెండి కొంచెం ఏడిస్తే మీ కొడుకేం చిక్కిపోడు అంత‌మాత్రానికే చిన్న‌పిల్ల‌ని అలా భ‌య‌పెడ‌తారేమిటి ?

 

అంది చిరాగ్గా. వాసుకి కోపం రెట్టింప‌యింది. ఏడ్చిన‌ట్టు వుంది నీ తెలివి ప‌ధ్నాలుగేళ్ళోచ్చాయి దానికి. చిన్నపిల్ల‌ట ! దానిక్కూడా పాలు ప‌ట్టు. ఆ పాలు గ‌న‌క వీడి నోట్లో పోస్తే ఉక్కిరి బిక్కిరియిపోయి ఈ పాటికి ఏమ‌య్యేవాడు ?  ఇదిగో...మాధురీ !  నీకిప్పుడే చెప్తున్నాను రామూకి ఏడాదొచ్చేదాకా నువ్వెత్తుకున్న‌ట్టు క‌న్పిస్తే చూడు ఏంచేస్తానో, మాధురికి అవ‌మానంతో ముఖం న‌ల్ల‌బ‌డింది. మ‌న‌సు చిన్న‌బోయింది. త‌న‌నింత‌వ‌ర‌కూ ఎవ‌రూ ప‌ల్తెత్తుమాట‌కూడా అన‌లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచీ మ‌ధూ ! చెల్లాయీ !  బంగారుబొమ్మా ! అని ముద్దు చేసే అన్న‌య్య ఇలా క‌సిరేస‌రికి ఆ లేత మ‌న‌సు త‌ట్టుకోలేక‌పోయింది. క‌ళ్ళ‌నీళ్ళ‌తో చెక్కిళ్ళు త‌డిసిపోయాయి. అన్నం కూడా తిన‌కుండా, పుస్త‌కం వంక చూస్తూ వంచిన త‌ల ఎత్త‌కుండా కూర్చుంది. మాధురి బాధ చూశాక వాసుకి జాలివేసి పోనీ బ‌తిమాలుదామా అనుకున్నా ఆ సంఘ‌ట‌న గుర్తుకొచ్చి ఆ మాత్రం కేక లెయ్య‌క‌పోతే ఇలాంటి ప‌నులింకా చేస్తుంద‌ని ఊరుకున్నాడు.

రామూకి ఏడాది దాటింది. ఈసారి రెండోకాన్పుకి బిందుకి పుట్టింటికి వెళ్ళెందుకు వీలుక‌లుగ‌లేదు. సీత‌మ్మ‌గారు కోడ‌ల్ని కాలు కింద పెట్ట‌నీకుండా ఎంతో ఆప్యాయంగా చూసింది. రాము చేసే అల్ల‌రి, రాము మాట్లాడే జిలిబిలి మాట‌లు మాధురికి ఎంతో ముద్దుగా ఉండేవి. ఎత్తుకుందామ‌ని మ‌న‌సు త‌హ‌త‌హ‌లాడుతుంటే ఆనాటి అన్న‌య్య కోపం గుర్తొచ్చి చివ్వున వెన‌క్కి తిరిగి వెళ్ళిపోయేది మాధురి.

సిస్ట‌ర్  ! ఎలా వుంది బిందుకి ?  ఆత్రంగా ప్ర‌శ్నించాడు వాసు. మ‌గ‌పిల్ల‌వాడు.
హ‌మ్మ‌య్య ! వాసు క‌ళ్ళ‌లో కోటి దీపాలు వెలిగాయి. పిల్ల‌వాడు చాలా వీక్‌గా ఉన్నాడు. గ్యారంటీ చెప్ప‌లేము. నేనొక‌సారి వెళ్ళి చూడ‌వ‌చ్చా ?

నాటౌనో. ఇంకో అర‌గంట‌కి వెళ్ళండి. ధాంక్యూ వాసు మ‌న‌సు ప‌రిప‌రి విధాలుగాపోతోంది. త‌న‌న‌న్యాయం చేయ‌వ‌ద్ద‌ని ఆప‌ద‌మొక్కుల‌వాడికి మొర పెట్టుకున్నాడు. అతి క‌ష్టంగా అర‌గంట గ‌డిపి బిందు రూమ్‌లోకి వెళ్ళాడు. ఆత్రంగా పిల్ల‌వాడిని ఉంచిన ఉయ్యాల‌లోని తొంగి చూసాడు ! అంతే ! షాక్ తిన్న‌ట్టుగా నిల్చుండిపోయాడు. హూ వీడు నా కొడుకు కాదు, కాదు కానే కాదు పిచ్చెత్తిన‌ట్టుగా మ‌న‌సులోనే గొణుక్కున్నాడు. న‌ల్ల‌గా ఎల‌క‌పిల్ల‌లాగా వికృతంగా ఉన్నాడు. పుల్ల‌ల్లాంటి కాళ్ళూ చేతులూ - గ‌ట్టిగా ఏడ‌వ‌నుకూడా ఏడ‌వ‌లేదు. ఛీ వీడు నా కొడుకా ! రాముకీ వీడికీ అస‌లేమ‌న్నా పోలిక వుందా ? ఒక్క నిముషం మొహం చిట్లిస్తూ చూసి బ‌య‌టికి వ‌చ్చేశాడు. బిందుని క‌నీసం ప‌ల‌క‌రించ‌కుండా !  వాసు ప్ర‌వ‌ర్త‌న‌కి బిందు క‌ళ్ళ‌నుండి నీళ్ళు జ‌ల‌జ‌లారాలాయి. ఎలా ఉన్నావ‌ని కూడా అడ‌గ‌లేదు. ఆయ‌న ప్రేమంతా ఏమ‌యింది ?  వాడివంక అంత అస‌హ్యంగా చూశారే...వాడిలా పుట్ట‌టం నా త‌ప్పా ?  బ‌ల‌హీనంగా ఉండ‌టం నా త‌ప్పా ? న‌ల్ల‌గా ఉండ‌టం నా త‌ప్పా ?  అబ్బ ! పుడుతూనే మీ నాన్నలో ఎంత మార్పుతెచ్చావురా ! 

ఇటువంటి ఆలోచ‌న‌ల‌తో పుట్టి కొన్ని గంట‌లైనాకాని ఆ ప‌సిగుడ్డు వంక మ‌మ‌కార ర‌హితంగా చూసింది.

మీకు పుట్టాల్సిన వాడుకాద‌మ్మా ! యింగిలాయిలా వున్నాడు. రాముకి పూర్తి వ్య‌తిరేకం. మీలో ఎవ‌రికీ యింత న‌లుపులేదే. పోన్లేమ్మ బాధ ప‌డ‌ద‌కు. మ‌గ‌వాడికి అంద‌మెందుకులే పిల్ల‌వాడిని ఇంటికి తీసుకు వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుండీ ఇరుగుపొరుగుల‌వారు చేస్తున్న వ్యాఖ్యానాల‌కి బిందుకి ఆ ప‌సివాడిపై ప్రేమ లేకుండా పోతోంది. వీడి మూలంగా త‌ను అవ‌మానానికి గురికావ‌ల‌సి వ‌స్తోంది అన్న ఆలోచ‌న‌తో వారి మాట‌లు మాధురికి శూలాలు గుచ్చిన‌ట్టుగా ఉన్నాయి. బాబుని అంటుంటే త‌న‌ని అంటున్న‌ట్లుగానే బాధ‌ప‌డ‌సాగింది. ఛీ ఛీ ఏం మ‌నుషులు ! క‌ళ్ళ‌న్నా విప్ప‌ని ప‌సికందు మీద వీళ్ళ‌కెందుకంత ద్వేషం ?  చిన‌బాబు అందం వీరికి కాల‌క్షేపం అయిందా ?  మాధురి కొంచెం కొంచెంగా ప్ర‌పంచాన్ని అవ‌గాహ‌న చేసుకుంటోంది....

వాసు పిల్లాడిని క‌న్నెత్త‌యినా చూడ‌డు. బిందుతో కూడా మాట‌లు త‌గ్గించాడు. రామూని లాలించ‌టం, గోరు ముద్ద‌లు త‌నిపించ‌టం, సాయంకాలాలు షికార్ల‌కి తిప్ప‌టం, వాడికి కావాల‌న్న‌వి వ‌ద్ద‌నుకుండా కొన‌టం, ఇలా గారాబంగా చూస్తాడు. రాము వ‌స్తువులేవ‌న్నా చిన్నపిల్లాడు ముట్టుకుంటే కూడా స‌హించేవాడుకాదు. వాసు త‌న‌తో మాట్లాడ‌క‌పోవ‌టానికి కార‌ణం ప‌సివాడే అని తెలిసి బిందు వాడిని పూర్తిగా వ‌దిలేసింది. రాముని ముద్దుల్లో ముంచెత్త‌టంలోనే ఆ భార్యాభ‌ర్త‌ల‌కి టైమ్ స‌రిపోయేది.ప‌సివాడికి పాల‌వేళ అయితే కూడా బిందు పాలు ప‌ట్టేది కాదు. గోల‌గోల‌గా ఏడుస్తుంటే మాధురో, సీత‌మ్మ‌గారో పాలుప‌డ‌తార‌ని నిర్ల‌క్ష్యంగా ఊరుకునేది. అన్నా, వ‌దిన‌ల ప్ర‌వ‌ర్త‌న‌కి మాధురికి చిన్న‌పిల్ల‌వాడిమీద ప్రేమ‌, జాలి పొంగిపొర‌లాయి. వారి మీద అస‌హ్యంతో వాళ్ళ‌ప‌ట్ల భ‌యం కూడా పోయింది. చిన్ని కృష్ణా ! చిన్నారి కృష్ణా అంటూ ఎత్త‌కు తిప్పేది. న‌వ్వించి, ఆటలాడించేది. వాడికి కృష్ణుడ‌నే పేరు నిలిచిపోయింది.

వ‌రండాలో త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్న కృష్ణుడితో న‌న్నంటుకో అంటూ క‌వ్విస్తూ, న‌వ్విస్తున్న మాధురి ద‌గ్గ‌ర‌కు త్వ‌ర‌త్వ‌ర‌గా వ‌చ్చాడు వాసు. మాధురీ !  ఆ కొరివికొట్టుని తొంద‌ర‌గా డాబా మీద‌కి తీసికెళ్ళు. మా ఫ్రెండు, ఆయ‌న మిసెస్సు వ‌స్తున్నారు. ఊ వెళ్ళు నిర్ఘాంత‌పోయింది మాధురి. అన్న‌య్యా ! అర్థంకానిదానిలాగా చూసింది. న‌డ‌క‌కూడా వ‌స్తున్న వీణ్ణి ప్ర‌పంచానికి క‌న‌బ‌డ‌కుండా చెయ్య‌గ‌ల‌డా ?  కొడుకుని కొడుక‌ని చెప్పుకునేందుకు కూడా నామార్దానా ?  కాకిపిల్ల కాకికి ముద్దంటారే ? ఆ మాట త‌ప్పా ? ఎంత‌టి సంకుచిహృద‌యం ?  తెల్ల‌బోయి అన్న‌య్య వంక చూస్తుండిపోయింది. ఏమిటీ వాణ్ణి తీసుకువెళ్ళ‌మంటే క‌ళ్ళ‌ప్ప‌గించి చూస్తావ్ క‌ళ్ళ‌ల్లో తిరుగుతున్న నీళ్ళ‌ని అత‌నికి క‌న‌బ‌డ‌నీకుండా చ‌టుక్కున కృష్ణుణ్ణి ఎత్తుకుని విస‌విసా మేడ‌మీద‌కి వెళ్ళిపోయింది.


మేడ‌మీద‌కి వాసు అతిథుల‌తో మాట్లాడే మాట‌లు స్ప‌ష్టంగా వినిపిస్తున్నాయి. ఆ మాట‌లు వింటున్న కొద్దీ మాధురీకి ఒళ్ళుమండిపోసాగింది. బిందూ ! రాముని పిలు. మోహ‌న్ బాబాయిగారంటే వాడికి మ‌హా ఇష్టం. వాళ్ళింటికెళ్ళిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న నెత్తినెక్కి తొక్కుతాడు అల్ల‌రి వెధవ మురిసిపోతూ చెప్తున్నాడు. రామూ ఇంట్లో గంట‌కూడా కుదురుగా ఉండ‌డు మోహ‌న్‌. ఇంటి పక్క‌వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అస్త‌మానూ తీసుకుపోవ‌ట‌మే. ఎప్పుడూ బొమ్మ‌లూ, చాక్లెట్సూ ఇచ్చి ఆడిస్తూంటారు. రామూని క్ష‌ణం కూడా వ‌ద‌ల‌ర‌నుకోండి. బిందూ ! ఇవ్వాళ పిక్చ‌ర్ ప్రోగ్రాం వేసాంగా, నువ్వు రామూ త్వ‌ర‌గా రెడీ అవండి. ఇంత‌కీ మాకేమ‌న్నా టిఫెన్ పెట్టేదుందాలేదా, అబ్బా వ‌స్తున్నానండీ అంత తొంద‌రేమిటి అంటూనే ట్రేలో ప‌కోడీలూ, గులాబ్ జామూ వున్న ప్లేట్లు తీసుకు వ‌చ్చింది బిందు. రాము ప‌రిగెత్తుకు వ‌చ్చి మ‌మ్మీ అంటూ బిందు ఒడిలోకెక్కి కూర్చుని గులాబ్ జామ్ తిన‌సాగాడు. రెండు మెట్లు క్రింద‌కి దిగి కిటికీలోంచి గ‌దిలోకి తొంగిచూసింది మాధురి. పొద్దున్న చేసిన గులాబ్ జాముల్లో ఒక్క‌ట‌న్నా కృష్ణుడుకి పెట్టిందా వ‌దినా ?  కృష్ణుడూ ఆమె కొడుకే గ‌దా !  మ‌రి రామూ, కృష్ణ ప‌ట్ల ఇంత తేడా ఎందుకు చూసిస్తోంది ?  ఈ ప్ర‌శ్న‌కి జ‌వాబు దొర‌క‌లేదు. సినిమాకి వెళ్ళేట‌ప్పుడు వ‌దిన బాబుని పిల‌వ‌కుండానే, తీసికెళ్ళ‌కుండా వెడుతుందా ?  పోనీ త‌నే క్రింద‌కి తీసుకువెడితే అన్న‌య్య మండిప‌డ‌తాడేమో ?  మాధురి ఆలోచ‌న‌ల్లో కొట్టుకుమిట్టాడుతుండగానే రిక్షాలు పిల‌వ‌టం, రాముతో స‌హా న‌లుగురూ వెళ్ళిపోవ‌టం జ‌రిగిపోయింది. క్రిందికి వ‌చ్చి ప‌రుగులాంటి న‌డ‌క‌తో అమ్మ ద‌గ్గ‌ర‌కు వెళ్ళింది మాధురి. అమ్మా ! కృష్ణ‌ని సినిమాకి తీసికెళ్ళటం వ‌దినా వాళ్ళ‌కి ఎంత చిన్న‌త‌న‌మ‌య్యిందో చూశావ‌మ్మా అంటూంటే ఏడుపాగ‌లేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. ఛ ఏమిటే పిచ్చిపిల్లా ! దీనికేడుస్తారా. వీడంటే వాళ్ళ‌కేమ‌న్నా కోప‌మా ఏమిటి. చిన్న పిల్లాడుగ‌దా - ఏడిస్తే నలుగురు ఏమ‌నుకుంటారోన‌ని తీసుకువెళ్ళ‌లేదుగాని ఈ స‌మ‌ర్ధ‌న ఆవిడ‌కే న‌చ్చ‌లేదు. లేద‌మ్మా ! రాముకి ఐదు పుట్టిన‌రోజులు ఘ‌నంగా చేసారు కాని, వాళ్ళ‌కి కృష్ణుడు ఏనాడు పుట్టాడో... కాదు, ఏం తిన్నాడో, ఎలా ఉన్నాడో కూడా అక్క‌ర్లేద‌మ్మా, అక్క‌ర్లేదు. మాధురిని ఓదార్చేస‌రికి సీత‌మ్మ‌గార్కి త‌ల ప్రాణం తోక‌కొచ్చినంత‌ప‌నైంది. నాద‌గ్గ‌రే డ‌బ్బుంటే అంత‌క‌న్నా వెయ్యిరెట్లు ఘ‌నంగా బ‌ర్త్‌డే చేస్తాను నా చిన్నికి -  ఏరా చిన్నా !.... ఛ ఛ వ‌ద్దురా యిలాంటి లోకంతో మ‌న‌కేమీ సంబంధం వ‌ద్దు  -  పార్టీ ఇస్తే మెక్కిపోతారు. అంతేగా ! ఆ ముర‌ళీకృష్ణుడు నిన్ను చ‌ల్ల‌గా కాపాడాలి గానీ వీళ్ళ‌తో మ‌న‌కి ప‌నేమిటి ?  బాబు ప‌క్క‌లో ప‌డుకుని క‌ల‌త‌నిద్ద‌ర‌పోయింది ఆ రాత్రి.

మాధురికి పెళ్ళి అయిపోయింది. అత్త‌వారింటికి వెడుతున్న ఆమెకు కృష్ణుణ్ణి చూడ‌గానే క‌ళ్ళ‌ల్లోంచి క‌న్నీటి వ‌ర‌ద ఉప్పొంగిపోయింది. అత్త ఏడుస్తూంటే ఎందుకేడుస్తోందో తెలియ‌క‌పోయినా, వాడికీ ఏడుపొచ్చింది. అత్తా ఏడ‌వ‌క‌త్తా నాకు బ‌య‌మేస్తోంది అంటూ త‌నూ ఏడ‌వ‌టం మొద‌లుపెట్టాడు. అయిదేళ్ళోచ్చినా వాడికి అత్త అన్నం క‌లిపిపెట్లాల్సిందే. అత్త త‌ప్ప వాడికి ఆప్యాయ‌త‌నందించే వారేలేరు.  ఛీ పెళ్లికొడుకు మంచివాడు కాదు. మా మంచి అత్త‌ని ఎత్తుకుపోతున్నాడు. మ‌న‌సులో పెళ్లికొడుకుని తిట్టుకున్నాడు. చిన్నా ! నా బంగారూ ! బుద్ధిగా చ‌దువుకోమ్మా. ఎవ‌రితోనూ పోట్లాడ‌కు అని చెప్తుంటే మాధురికి కృష్ణుడు ప‌క్క‌వాళ్ళ‌బ్బాయిని కొట్టిన సంఘ‌ట‌న గుర్తుకువ‌చ్చింది. ఎందుక్కొట్టావ్ ? త‌ప్పుకాదా అని త‌ను మంద‌లిస్తే ఏం వాడు ఎక్కిలించ‌చ్చే ?  నేనేమో కోతినట‌. ఒంకి న‌క్క‌నట‌. వాడేమో తెల్ల‌గా జాంప‌డ‌ల్లే వున్నాడట‌. నువ్వు చెప్ప‌త్తా. నేను న‌ల్ల‌గా ఉన్నానా ? అంద‌రూ అల్లాగే అని తిడ‌తాల‌త్తా. నాకందుకే వాళ్ళ‌ని చూస్తే కొప‌మొస్తుంది. ఏమ‌త్తా ! నేను బావుండ‌నా ? మ‌ల‌యితే నువ్వు అస్త‌మానూ ముద్దులు పెత్తుకుంతామ‌వెంద‌కూ ?  క‌న్నీళ్ళు దాచుకుని ఛీ వెధ‌వ‌లు. వాళ్ళ మాట‌లు న‌మ్మ‌కు. ఏం న‌లుపైతే ? మ‌న దేముళ్ళంతా న‌లుపు కాదూ ! చిన్నా ! నీకున్న అందం నిన్ను తిట్టిన వాళ్ళెవ‌రికీ లేదు. నేను చెప్పిన క‌థ‌ల్లో రాముడు, కృష్ణుడు న‌లుపైనా ఎంత గొప్ప‌వాళ్ళూ ! మ‌న అమ్మ‌వారు పార్వ‌తి కూడా న‌లుపే. నువ్వు నాకు చాలా బావుంటావ్‌. క‌న్నా ! వాళ్ళెన్న‌న్నా ప‌ట్టించుకోకూడ‌దు. పెద్ద ఏనుగు వెడుతుంటే కుక్క‌లు దాని వెన‌కాల మొరుగుతాయ్‌. కాని ఏనుగుకేమ‌న్నా భ‌య‌మా ?  అర్ధం కాకపోయినా అర్ధ‌మ‌యిన‌ట్లు న‌వ్వి ఠీవిగా ఆడుకోవ‌డానికి వెళ్ళిపోయాడు. త‌ను వెళ్ళిపోతే ఇక కృష్ణుణ్ణి ఎవ‌రు చూస్తారు ?  రాత్రి పూట క‌ధ‌లు చెప్పి, జోల‌పాడి ఎవ‌రు నిద్ర పుచ్చుతారు ?  అమ్మ‌కి కృష్ణుడంటే పూర్తి నిర్ల‌క్ష్యం లేక‌పోయినా శ్ర‌ద్ధ కూడా లేదు -  కృష్ణుడిని వ‌ద‌ల‌లేక వ‌ద‌ల‌లేక వ‌దిలి వెళ్ళిపోయింది మాధురి. అత్త వెళ్ళిన‌వేపే బిక్క మొహంతో చూస్తూండిపోయాడు కృష్ణ. అంద‌రూ ఇంట్లోకి వెళ్ళిపోయినా ఒక్క‌డే అక్క‌డ నిల‌బ‌డ్డాడు. క‌ను చీక‌టి ప‌డుతుండ‌గా కాళ్ళీడ్చుకుంటూ లోప‌లికి వెళ్ళాడు. హ‌ఠాత్తుగా వాడిని ఒంట‌రిత‌నం ఆవ‌హించింది. అత్త‌లేని ఆ ఇల్లు వాడికి భ‌యంక‌రంగా క‌నుపించింది.

మాధురిని అత్త‌వారింట్లో అంద‌రూ చాలా ఆప్యాయంగా చూస్తున్నారు. ఆడ‌బ‌డుచు వ‌దినా వ‌దినా అంటూ చ‌నువుగా మాట్లాడేది. అత్త‌గారు ఆమెను కూతురిలాగానే చూసేది. భ‌ర్త శ్రీ‌కాంత్‌కు మాధురి అంటే ఎన‌లేని ప్రేమ‌. అంద‌రూ ఆమెని ఏ మాత్రం క‌ష్ట‌పెట్ట‌కుండా, మ‌ల్లెపూవులాగా, సుకుమారంగా చూస్తున్నా మాధురిని ఏదో బెంగ ప‌ట్టుకుని పీడించేది. త‌ను హాయిగా వుంది కాని... త‌న కృష్ణుడెలా వున్నాడో ? త‌న కోసం బెంగ పెట్టుకున్నాడో ఏమో ! శ్రీ‌కాంత్‌తో అంటే ఆ వాడి అమ్మా, నాన్నకంటే ఎక్కువా నువ్వు ? ఇదివ‌ర‌కు వాళ్ళు నువ్వు చూసుకుంటావ‌ని బాబుని వ‌దిలేసినా ఇప్పుడు జాగ్ర‌త్త‌గా చూస్తూనే వుండి వుంటారు మ‌ధూ అని కొట్టిపారేసాడు. కాని మాధురి మ‌న‌స్సు స‌మాధ‌న ప‌డ‌లేకుండా వుంది.

అత్త లేని జీవితం దుర్భ‌రంగా, న‌ర‌క‌ప్రాయంగా వుంది కృష్ణుడికి. భోజ‌నం వేళ‌యితే చిన్నీరారా !  అన్నం తిని ఆడుకోరా. మా అమ్మ క‌దూ - మా నాన్న క‌దూ అని బ‌తిమాలి అన్నం పెట్టే వారు లేరిపుడు, స‌రిక‌దా కృష్ణుడు అన్నం తిన్నాడా