అస‌మ‌ర్ధుడి రాజ్యం

సూర్యుడు వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఆకాశం నిండా ఎఱ్ఱ‌ని కాంతి పుంజాల‌ను స్ఫ్రే చేసి పోయాడు. ఎఱ్ఱ‌టి ఆ రేడియ‌మ్ క‌ల‌ర్ భూమి మీదికి కొద్ది కొద్దిగా రిఫ్లెక్స్ అవుతోంది. ఆ సంధ్య కెంజాయ‌ల‌కు క్రింద‌గా  న‌ల్ల‌ని చుక్క‌ల్లాగా ప‌క్షులు గుంపులు గుంపులుగా జంట‌లు క‌ట్టి ఎగిరి పోతున్నాయి. ముందు న‌డిచే ఆవున గిట్ట‌ల నుంచి ధూళి రేగి నీడ‌లు క‌మ్మింది. ఆ మ‌ట్టిలోంచి చిన్న సువాస‌న !

సీతాప‌తి నాగ‌లిని భుజాన వేసుకుని ఎడ్ల తాళ్ళు ప‌ట్టుకుని నిరుత్సాహంగా న‌డ‌వ సాగాడు. అత‌ని మెద‌డులో ఎన్నో ఆలోచ‌న‌లు. ఏదో ఆశాంతి. అంద‌రూ ఉండి కూడా ఏకాకిగానే బ్ర‌త‌కాల్సి వ‌చ్చింది. సొంత పొలం ఉన్నా, ప‌రాయి వాళ్ళ పొలం కౌలుకు చేయాల్సిన గ‌తి ప‌ట్టింది. త‌న తెలివీ, సామ‌ర్థ్యం, చురుకుద‌నం, జాలి, ద‌యా గుణాల వల్ల త‌న‌కు క‌లిగిన లాభం ఏమిటి ?  మంచిత‌నం వ‌ల్ల సుఖ‌ప‌డ‌క పోగా ఈ దుఃఖం అడుగ‌డుగునా అవ‌మానం ఎందుకు ?  నీతి నియ‌మం లేనివాడే సంతోషంగా, సుఖంగా ఉంటున్నాడె. నియ‌మాలు, క్ర‌మ శిక్ష‌ణ అంటూ ఆలోచించే త‌న బోటి గాడికి నిత్య విచారం త‌ప్ప‌టం లేదే ?  ఎడ్ల తాళ్ళు జార్చుకుని వెళ్ళిపోడం సీతాప‌తి గ‌మ‌నించ‌లేదు. త‌న ధోర‌ణిలోతానున్నాడు.

అస‌లు త‌న‌ను చిన్న‌త‌నం నించీ మంచివాడు. మంచివాడు అని పొగిడి పాడు చేశారు. ఎందుకూ పనికిరాని చ‌వ‌ట‌ని చేశారు. అస‌మ‌ర్ధుణ్ణి చేశారు. నిజ‌మే. త‌ను ప‌నికిరాని వాడే. అస‌మ‌ర్థుడే. అయితే మాత్రం త‌న‌లాగా లోకంలో అస‌మ‌ర్థులంతా అష్ట క‌ష్టాలు ప‌డుతున్నారా ?  చ‌వ‌ట‌లైన వారినంతా పెళ్ళాలు తిర‌స్క‌రించారా ?  వీడి పెళ్ళాం వీడ్ని వ‌దిలేసిందిరోయ్ అన్న హేళ‌న‌కు గురి అవుతున్నారా ?  త‌న‌లాగా అన్న‌ల చేత‌, త‌మ్ముల చేత నువ్వు ఊళ్ళో ఉండ‌కు. నీ మూలంగా మాకూ ఆప్ర‌తిష్ఠ వ‌స్తుంద‌ని చీద‌రింప బ‌డుతున్నారా ?  చివ‌రికి క‌న్న‌త‌ల్లి చేత కూడా నీకే క‌డుపు నిండా తిండి దొరికే మార్గంలేదు. నాకేం పెడ‌తావు ?   నేను నీ ద‌రిద్రం పంచుకోలేను. నాలుగు రాళ్ళు వెన‌కేసుకున్నాక క‌బురంపు. వ‌స్తాను అనిపించుకున్నాడు. ఇంక బ్ర‌తికేం ప్ర‌యోజ‌నం ఎవ‌రూ మెచ్చ‌ని. ఎవ‌రూ తోడు రాని ఈ జీవితం ఎందుకు ? ఏం సాధించాలి ?

సీతాప‌తి ఆలోచిస్తూ త‌ల పైకెత్తి ఆకాశాన్ని చూశాడు. ఇందాక వెళ్ళింది న‌ల్ల పిట్ల‌ల గుంపు. ఇప్పుడు తెల్ల పిట్ట‌ల బారు పైపైకి ఎగిరి ఎగిరి పోతుంటే మ‌ల్లెల్లాంటి రెక్క‌ల మీద సంధ్యారాగం ప‌డి వింత సోయ‌గాల‌ని వెద‌జ‌ల్లుతోంది. ఎంతో కాలంగా విరామం లేని విషాద గీతం సీతాప‌తిని కుదిపి వేస్తుండ‌గా అతని మ‌న‌స్సు దృశ్యానికి ఆనందంగా ప‌ర‌వ‌శించింది. ఏదో ఉత్సాహా రేఖ త‌రుము కొచ్చింది. చిన్న న‌వ్వొక‌టి పెద‌వుల మీద‌కి దండ యాత్ర చేసింది.

ఏంటి. బాబుగారూ మీలో మీరే న‌వ్వుకుంటూన్నారు. అంటూ ఎడ్ల తాళ్ళ‌ను అందుకోడానికి చ‌క‌చ‌కా న‌డిచింది రాజ్యం.

నువ్వా...రాజ్యం !  అంటూ ఉలిక్కిప‌డి ఆమె వంక‌కు చూశాడు. అత‌ని ఆలోచ‌న ఆగిపోయింది. రాజ్యం క‌ళ్ళల్లో కూడా సంధ్యారాగం ప్ర‌తిఫ‌లిస్తోంది. ప్ర‌కృతి రాగం చూసి ప‌ర‌వ‌శించ‌డానికి సిద్ధ‌ప‌డ్డ సీతాప‌తి మ‌న‌స్సు రాజ్యం క‌నుల‌లోని ఆత్మీయ‌త‌కు క‌దిలిపోయింది.
ఏముంది, రాజ్యం ?  ఆ ప‌క్షుల్ని చూడు అవి ఎంత క‌లిసిక‌ట్టుగా జీవ‌న యాత్ర చేస్తాయో ! స‌ముద్రం మీంచి ఎగిరినా, అన్నీ క‌లిసి ఒక్క‌సారే ఎగురుతాయి. అవి ఎగురుతుంటే నాకు ర‌క‌ర‌కాల డిజైన్లు క‌ళ్ళ‌కి క‌డ‌తాయి. ఇలా ఎగిరే  పిట్టల్ని చూస్తూంటే ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది అన్నాడు.

నిజ‌మే బాబుగారూ !  నేను కూడా అంతే. ఆ మొండి జామ చెట్టు మీద కూర్చుని ఈ వేళప్పుడు రోజూ పిట్ట‌ల్ని చూస్తూంటాను అంది రాజ్యం మెరిసే క‌ళ్ళ‌తో.

ఈ పిల్లేమిటో, నా వెంట ప‌డుతుంది. ఏం చెప్పినా నేనూ అంతేనంటుంది. వ‌ద్దంటే విన‌కుండా త‌న‌కు వంట‌లో సాయ‌ప‌డుతుంది.

అయితే, రాజ్యం ! ఆ టిఫిన్ కారియ‌ర్‌లో ఉన్న‌దేమితీ... అంత భ‌ద్రంగా ప‌ట్టికెడుతున్నావు ?  అన్నాడు సీతాప‌తి.

ఇదాండీ...ఇదాండీ...ఇది...ఇదంటే నా కెంత ప్రాణ‌మోనండి. ఇది ఎప్పుడంటే అప్పుడు దొరికేది కాదండి. దీన్ని, స్వ‌ర్గాన్నీ ప‌క్క ప‌క్క‌న పెట్టి నీకేది కావాలంటే నేను దీన్నే కోరుకొంటానండి అంది.

అబ్బ ఎంత స‌స్పెన్సులో పెట్టావు. ఆ టిఫిన్లో ది ఏమిటీ అంటే స్వ‌ర్గం, ప్రాణం అన్నావే గానీ అస‌ల‌దేమిటో చెప్ప‌నే లేదు క‌దా. నీకూ ర‌చ‌యిత్రుల‌కుండ‌వ‌ల‌సిన ల‌క్ష‌ణాలున్నాయి.

రాజ్యం కిల కిలా న‌వ్వింది. దీని పేరు చెప్ప‌కూడ‌దు. అస‌లు ఇదేమిటో మూడు నిముషాల్లో మీ నోట్లో ఉంటుంది. అదిగో మీ ఇల్లొచ్చేసిందిగా ఎడ్ల‌ని నేను క‌ట్టేస్తాను. మీరు వెళ్ళికాళ్ళూ, చేతులూ క‌డుక్కురండి అంది.

ఇదాండీ...ఇదాండీ...ఇది...ఇదంటే నా కెంత ప్రాణ‌మోనండి. ఇది ఎప్పుడంటే అప్పుడు దొరికేది కాదండి. దీన్ని, స్వ‌ర్గాన్నీ ప‌క్క ప‌క్క‌న పెట్టి నీకేది కావాలంటే నేను దీన్నే కోరుకొంటానండి అంది.

అబ్బ ఎంత స‌స్పెన్సులో పెట్టావు. ఆ టిఫిన్లో ది ఏమిటీ అంటే స్వ‌ర్గం, ప్రాణం అన్నావే గానీ అస‌ల‌దేమిటో చెప్ప‌నే లేదు క‌దా. నీకూ ర‌చ‌యిత్రుల‌కుండ‌వ‌ల‌సిన ల‌క్ష‌ణాలున్నాయి.

రాజ్యం చూపుతున్న చ‌నువుకీ, ఆప్యాయ‌త‌కీ ఆమె వైపు  వంగుతున్నాడు. ఇంత‌వ‌ర‌కూ త‌న నొక వ్య‌క్తిగా జ‌మ క‌ట్టిన వారు లేరు. ఈ రాజ్యం ఎందుకో త‌న కిష్ట‌మైన దేమిటో తెలుసుకోవాల‌నీ, త‌న‌కు న‌చ్చేలా ఉండాల‌నీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ అమ్మాయిని దూరంగా ఉంచాల‌నుకుంటూనే ద‌గ్గ‌ర‌వుతున్నాడు. ఎడారి లాంటి త‌న మ‌నోభూమి రాజ్యాన్ని చూడ‌టంతోనే వ‌సంత‌వ‌న మ‌యి పోతుంది. త‌న ఏకాకిన‌నీ, త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోర‌నీ కుమిలిపోతున్న ఈ త‌రుణంలో రాజ్యం అభిమానంగా ప‌ల‌కరించేస‌రికి ఒళ్ళు పుల‌క‌రించి పోతోంది. ఈ భావాన్ని అదుపులో పెట్టాలి అనుకున్నాడు సీతాప‌తి.

అయినా ఈ రాజ్యం మాత్రం ఎన్నాళ్ళుంటుంది. వాళ్ళ‌య్య దానికి మ‌నువు చెయ్యాల‌ని తొంద‌ర‌ప‌డుతున్నాడు. పెద్ద‌రెడ్డిగారి పెద్ద పాలిగాడు యెంక‌టేశుకియ్య‌నా ? ర‌మ‌ణయ్య‌గారి ట్రాక్ట‌రు తేలే డ్రైవ‌రు ఈరాసామి కియ్య‌నా ?  అప్పిగాడికి రాజ్యం అంటే పంచ ప్రాణాలు. ఆడు పంచాయితీ బోర్డు మెంబ‌రు. రాజ్యం అదుట్టం బాగుంటే ఆగే చీఫ్ మిన‌ట్ట‌ర్ గూడా అవుతాడు. కాక‌పోతే ఆడికి దుర్గుణాలు జాస్తిగా ఉన్నాయి. మీ స‌లా ఏంటి బాబు ?  అని అడిగాడు.

సీతాప‌తి తెల్ల‌బోయాడు. త‌న క‌ళ్ళ‌ల్లో వ్య‌క్తం అయిన ఆశ్చ‌ర్యం అద్దం లేక‌పోయినా, త‌న‌కే తెలిసింది.

ఆ కూలినాలి చేసుకునే దౌర్భాగ్యుల్లో మొర‌టు వాళ్ళ‌ల్లో, దుర్మార్గుల్లో ఒక దౌర్భాగ్యుణ్ణి, ఓ మొర‌టు వాణ్ణి, ఓ దుర్మార్గుణ్ణి ర‌త్నం లాంటి రాజ్యం కోసం త‌ను సెల‌క్టు చెయ్యాలా ?  ఆ ముగ్గురూ ముగ్గురే. సాయంత్రం అయ్యేసరికి మాన‌వ‌త్వం పోయ ప‌శువుల్లాగా ప్ర‌వ‌ర్తిస్తారు. తెగ తాగి పందుల్లాగా దుమ్ములో దొర్లుతారు. ఆ మాటే పైకంటే, రాజ్యం తండ్రి ప‌డి ప‌డీ న‌వ్వాడు. పొట్ట చేత ప‌ట్టుకుని న‌వ్వాడు. కొంత సేప‌టికి తేరుకుని ఏంది బాబూ, నేనేమ‌న్నా ఉజ్జోగ‌స్తుణ్ణా ల‌చ్భాధికారినా ?  నా కూతురికి యీళ్ళ కంటే మంచి సంబంధం ఎలా తెత్తాను, సామీ ! అస‌లు యీళ్ళే నా చేతిని మించి పోతున్నారు. నీ మీదికి ఆ కాసులు గోడు పోటీకి వ‌చ్చాడు. కాసులు గోడి బొట్టి రంగి గ‌జ్జ‌ల గుఱ్ఱ‌మ‌ల్లే ఉంట‌ది. నేను రొండొంద‌లు ఇస్తానంటే. ఆడు మ‌రో వంద యెక్కు విత్తాన‌ని ఆళ్ళ ద‌గ్గ‌ర ఈళ్ళ ద‌గ్గ‌ర అంట‌న్నాడంట‌. అయినా సీతాప‌తిగోరూ. మీ రెంత పిచ్చోళ్ళేమిటండీ ?  మాలో తాగ‌ని వాళ్ళుంటం శానా గొప్ప‌. మారు మ‌నువులు చేసికోనివాడు కోటి కొక్క‌డు. స‌దూకున్నోడు క‌లికానిక్కూడా లేడు. నేనెట్టా తెత్తానండీ రాజ్యానికి మంచోణ్ణి అని గ‌ల‌గ‌లా న‌వ్వాడు.

సీతాప‌తికి సిగ్గేసింది. ఈ న‌రిసిగాడు కూడా త‌న‌ను పిచ్చోడంటున్నాడు. అంటే...అంటే త‌ను నిజంగా పిచ్చి వాడేనేమో ?  లేక‌పోతే ఇంత మంది త‌న‌ను పిచ్చివాడంటారా ?

సీతాప‌తి ఎంత‌కీ రాక‌పోయేస‌రికి రాజ్యం పెరట్లోకి వ‌చ్చింది. సీతాప‌తి ఎటో చూస్తున్నాడు. మొహం క‌డుక్కున్నాడు గాబోలు మొహం మీంచి బొట్లు బొట్లుగా నీళ్ళు కింద ప‌డుతున్నాయ్‌. సీతాప‌తి ఏ మాలోచిస్తున్నాడో? ఆ నీటి చుక్క‌ల్లో క‌న్నీరు కూడా ఉందేమో తెలీని రాజ్యం అత‌ను చూసే వైపు చూసింది. ఒక ఎద్దు కుడిత్తొట్లో నీరు తాగుతుంది. రెండోది గుంజ ద‌గ్గ‌రున్న ప‌చ్చ గ‌డ్డి ప‌ర‌క‌లు మేస్తోంది. అత‌న్ని చూస్తే రాజ్యానికి త‌మాషా చెయ్యాల‌నిపించింది. పిల్లిలాగా చ‌ప్పుడు కాకుండా వెళ్ళి, చేత్తో నీళ్ళు తీసుకుని సీతాప‌తి మీదికి చిల‌క‌రించి గ‌ల‌గ‌లా న‌వ్వింది. ఎంత సేపు బాబూ, మొహం క‌డుక్కోడం !  అవ‌త‌ల తాయిలం మ‌న కోసం ఏడుస్తోంది. నే చెప్పాను క‌దా అదంటే నాకు ప్రాణ‌మ‌ని. మీతోక‌లిసి తిందామ‌ని ఆగాను. ఎంత‌కీ రారేమిటి ?  సీతాప‌తి చెయ్యి పుచ్చుకుని గబ‌గ‌బా పాక‌లోకి ఈడ్చుకు పోయింది. సీతాప‌తికి తువ్వాలు క‌నిపించ‌లేదు. రాజ్యం త‌న పైట కొంగు అందించింది. బాబూ ! నా చీర‌తో తుడుచుకుంటున్నారు గ‌న‌క పంట‌ల్లో నాకు కొత్త చీర కొనాల్సిందే. అని చిన్న పిల్ల‌లాగా మారాం చేసింది.సీతాన‌తి ఆలోచ‌న‌లు ప‌టా పంచ ల‌య్యాయి. క‌ళ్ళు మూసుకుని ఊ పెట్టు అంటూ నోరు తెరిచాడు. నోట్లోకి తియ్య‌ని అమృతం లాంటి ప‌దార్ధం వ‌చ్చింది. ఓహో దీన్ని తిని  ఎన్నాళ్ళ‌యిందో...ఎన్నేళ్ళ‌యింది ! ఎప్పుడో చిన్న‌ప్పుడు తిన్నాను. ఇది నా క‌త్యంత ప్రియ‌మైన‌దని రాజ్యాని కెలా తెలుసు ? అయినా, రాజ్యం తియ్య‌ని స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్సు క‌న్న ఇదేమంత రుచిక‌ర‌మైన‌ది ? అలాగే రాజ్యాన్ని ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఆమె ఒళ్ళో చేరి త‌న బాధ‌ను వెళ్ల‌బోసుకుందా మ‌నుకున్నాడు సీతాప‌తి, చెయ్యి న‌డుము వ‌ర‌కు వెళ్ళి, అగి పోయింది. సంస్కారం వెన్ను త‌ట్టింది. రాజ్యం ! నా కిదంటే ప్రాణమ‌ని నీ కెల్లా తెలిసింది ! ఆశ్చ‌ర్యంగా చూశాడు.

రాజ్యం తెల్ల‌బోయింది. బాబుగారి దంతా వేళాకోళం. నాకిష్ట‌మైన‌ది మీకు పెట్టాల‌ని తెచ్చాను గాని, మీ కిష్ట‌మ‌ని నాకేం తెలుస్తుంది ? అంది. మెరిసే క‌ళ్ళ‌తో రాజ్యం తమ ఇద్ద‌రికీ ఇష్ట‌మైన వాటిని లెక్క పెట్టింది. వేళ్ళు ముడుస్తూ, నాకు మ‌ల్లెలంటే ఇష్టం. మ‌గాళ్ళ‌యినా మీరూ మ‌ల్లెలు విర‌బూసిన తోట‌లో గంట‌ల త‌ర‌బ‌డి షికారు చేస్తారు. నాకు సాయంత్రంల్లో ఎఱ్ఱ కాంతిలో ఎగిరే కొల్లేటి కొంగ‌ల్నీ, మెరిసే వాటి తెల్ల‌టి రెక్క‌ల్నీ చూడ్డం ఇష్టం. మీకూ అంటే. నాకు బుల్లి బుల్లి బుజ్జాయి ఆవు దూడ‌ల్తో ప‌రుగులెత్త‌డం ఇష్టం. మీకూ అదిష్ట‌మే.

ఆ సంగ‌తి నీ కెలా తెలుసు ?

మొన్న మామిడి తోట‌లో మా న‌ల్లావు వేసిన తెల్ల దూడ‌తో మీరు ప‌రుగులెత్త‌డం చూశా అంటూ, నోటికి చెంగు అడ్డం పెట్టుకుని కిసుక్కున న‌వ్వింది.

ఆ న‌వ్వెందుకు ?  ఉడుక్కున్నాడు సీతాప‌తి.

అప్పుడు మీరు కాలు మెలిక‌ప‌డి ప‌డ్డారు క‌దా బాబూ ! ఆ పొగ‌రు మోతు దూడ మిమ్మ‌ల్ని దాటుకుని వెళ్ళిపోయి మీ క‌ళ్ళల్లోకి గ‌ర్వంగా చూసింది క‌దా. అప్పుడు లేచి దుమ్ము దులుపుకుంటున్న మిమ్మ‌ల్ని చూసి ప‌గ‌ల‌ప‌డి న‌వ్వుకున్నాను.

సీతాప‌తి కూడా పెంకి పిల్ల అంటూ ఆమె న‌వ్వుతో శ్రుతి క‌లిపాడు.

ఊ ఇంకోటి చూడండీ...నా క‌బ్దాలాడ‌టం ఇష్టంలేదు. మీకూ ఇష్టం లేదుట‌. మా బాబు చెప్పాడు. మీక అబ‌ద్దాలు చెప్ప‌డం ఇష్టం లేక చాలా పెద్ద ఉద్యోగం వ‌దులుకున్నార‌ని.

ఊ నిట్టూర్పు విడిచాడు. ఆ నిజాయితీగా ఉండాల‌నుకోడ‌మే నా జీవితాన్ని తారుమారు చేసింది. బాధ‌గా అన్నాడు.

ఇంకా మ‌నిద్ద‌రికీ క‌లిసిన సంగ‌తులు బోల్డున్నాయ్, బాబూ ! కానీ, ఈ జున్ను కూడా మీక్కూడా నాకు మ‌ల్లేనే ప్రాణం అంటే నాకు స‌ర‌దాగా ఉంది. కిల‌కిలా న‌వ్వింది.

మాట‌ల్లో ఎవ‌రెంత జున్ను తిన్నారో, ఎవ‌రెవ‌రెలా తిన్నారో తెలీదు. చివ‌రికి తెల్ల‌టి టిఫిన్‌లో ఇద్ద‌రూ ఒక్క‌సారే చెయ్యి పెట్టారు. రెండు చేతులూ అందులో బొటా బొటిగా స‌రిపోయి ఇరుక్కుపోయాయి. రాజ్యానికి ఆ టిఫిన్ కారియ‌ర్‌లోంచి చెయ్యి తియ్యాల‌నిపించ‌లేదు. ఇద్ద‌రికీ గిలిగింత‌గా ఉంది. రాజ్యం కావ‌ల‌ని చేయి బిగ‌ప‌ట్టి బ‌య‌టికి రాకుండా చేసింది. రాజ్యం అత‌ని చేతిని గిల్లి, చ‌టుక్కున చెయ్యి లాక్కుని లేచి నిల‌బ‌డింది.

బాబూ ! అలా కారియ‌ర్‌లో చేతులు ఇరుక్కుపోడం నాకు భలే బాగా ఉంది. మీకు కూడా అంతేనా అంటూ సిగ్గుతో న‌వ్వుతూ ప‌రిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.

సీతాప‌తి చాలా సేపు ఆ స్ప‌ర్శా సుఖాన్ని అనుభ‌విస్తూ ఆనందంలో మునిగి పోయాడు. ఆలోచ‌న‌లో ఆ చేతిని త‌న పెద‌వుల‌కు ఆనించుకున్నాడు. రాజ్యం చిలిపిగా గిల్లిన దాని కంటే జున్ను రుచి త‌క్కువే అనుకున్నాడు.

ఏమైనా స‌రే ఎవ‌ర‌డ్డ‌మొచ్చినా స‌రే...రాజ్యాన్ని త‌న‌దాన్ని చేసుకోవాల‌నుకుని నిర్ణ‌యం చేసుకున్నాడు. రెండు సంవ‌త్స‌రాల త‌రువాత ఆ రాత్రే గుండెమీద చెయి వేసుకుని హాయిగా నిద్ర‌పోయాడు సీతాప‌తి. రాజ్యానికి త‌న గ‌తాన్ని చెప్తే ఏమ‌నుకుంటుందో , ఏమంటుందో ?

అంద‌రూ న‌న్ను పిచ్చివాడంటారు రాజ్యం ! నా క‌థ విని నేను పిచ్చివాణ్ణో, కాదో నువ్వే నిర్ణ‌యించు.