బ‌హు...మ‌తులు

ప‌రాంకుశం  -  సావిత్రీ !  ఓ సావిత్రీ
సావిత్రి   -   రండి రండి
ప‌రాంకుశం లోప‌లికొస్తాడు. ప‌రాంకుశాన్ని చూసి
సావి   -   మీరా !!  (ఆశ్చ‌ర్యంతో) అప్ప‌డే వ‌చ్చేశారా !
ప‌రాం  -  నేనే మ‌రెవ‌ర‌నుకున్నావ్ ?
సావి   -  ఏమిటో స‌డ‌న్‌గా చూసి ఎదురింటాయ‌నేమో అనుకున్నా !
ప‌రాం   -  ఏమిటీ !  ఎదురింటాయ‌న‌నుకున్నావా !  ఏకంగా బెడ్‌రూమ్‌లోకే ర‌మ్మంటున్నావ్ !   (అనుమానంగా చూస్తాడు)
సావి  -  (నాలిక్క‌రుచుకుంటూ)  గొంతుమాత్రం మీదేన‌నుకున్నాలెండి !
ప‌రాం   -   ఇది మ‌రీ బావుంది. గొంతుక నాదీ !  ఆకారం ఆయ‌న్దీ అనుకున్నావా ?
సావి  -  అబ్బబ్బ ! మీకు సైకాల‌జీ బొత్తిగా తెలీదండీ ! ఏదో నా భౌతిక నేత్రం ఎదురింటాయ‌న‌ల్లే భావించినా మ‌నస్సు మాత్రం మీ గొంతును గుర్తుప‌ట్టింది. ఈ రెండు భావాల‌నూ ఏకీక‌ర‌ణం చేసే టైమ్ లేక మీరా ! అన్న అసంక‌ల్పిత ప‌దం నా నోటెంట వ‌చ్చింది.
ప‌రాం  -   (జాలిగా)  ఏమిటో ! ఈ మ‌ధ్య న‌వ‌ల‌లు చ‌దివి మరీ పాడ‌యిపోతున్నావ్ ! నీ మాట‌లు నాక‌ర్ధం కావు.
సావి   -  మీరు చ‌ద‌వ‌మంటే చ‌ద‌వ‌రు !  ఓ జ‌న‌ర‌ల్ నాలెడ్జీ లేదు పాడు లేదు. ఎంత‌సేపూ ఆ కోర్టు గొడ‌వే క‌దా !
ప‌రాం   -  అదిస‌రేగానీ  ఎదురింటాయ‌నేమోన‌ని నీ భౌతిక‌నేత్రం అనుమానించింది క‌దా !  బెడ్‌రూమ్‌లోకి ర‌మ్మ‌న్నావు క‌దా ! వాడు నిజంగా వ‌చ్చుంటే ఏమ‌య్యేది ?

సావి  -  ఆ ఏమ‌వుతుంది గోంగూర ! వ‌చ్చేవాడు ముందు హాల్లో కూచుందాం రండి అని తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఏ టీనో ఇచ్చిపంపేదాన్ని. అంతేగా !
ప‌రాం   -   చ్చుచ్చొచ్చొ ! ఇంత అమాయ‌కులు క‌నుక‌నే యీ ఆడ‌వాళ్ళ‌నిన్ని ఆట‌లాడిస్తున్నారు మ‌గ‌వెధ‌వ‌లు.
సావి  -  అవునండీ ! ఆ మ‌గ వెధ‌వ‌లు ఆడిస్తారు. మీరు ఆడించ‌రు గ‌దా.
ప‌రాం   -  నేనెందుకు ఆడిస్తానూ ?
సావి   -  ఎందుకాడించ‌రూ ?  మీర (మ‌గ అన్న ప‌దం మెల్లిగా అని) వెధ‌వ‌లుకారూ ?
ప‌రాం   -  ఎందుక‌వుతానూ ?
సావి  -  (గ‌ట్టిగా) ఏమిటీ మీరు మ‌గాళ్ళు కారా ?
ప‌రాం   -  (న‌త్తిన‌త్తిగా)  ఏమ‌న్నాను ?  మ‌గాణ్ణి కాద‌న్నానా ?  ఛీ ఛీ ఛీ !  నీకీ మ‌ధ్య చెముడు కూడా వ‌స్తోంది.
సావి   -   ఏమో ! మీరంటూంటే నిజంగా చెముడు వ‌స్తోందేమోన‌ని నాకూ అనుమానం వేస్తోందండీ !  వినిపించినా కూడా విన‌పించ‌లేదేమో ! వినిపించిన‌ట్లు భ్ర‌మ‌ప‌డుతున్నానేమోన‌ని భ‌యం వేస్తోందండీ !
ప‌రాం   -  చూశావా చూశావా !  ఈ సైన్స్ ఫిక్ష‌న్స్ చ‌దివి నువ్వెంత చెడిపోతున్నావో ?  చివ‌రికీయ‌న మొగుడు కాదేమో !  మొగుడ‌ని భ్ర‌మిస్తున్నానేమో అనుకునేట్లున్నావ్‌.
సావి  -  మీర‌న్న‌దీ నిజ‌మే సుమండీ . మీరు నా భ‌ర్తేనా కాదా ?  నాకునుమానంగా వుంది. మీరు నా భ‌ర్తేన‌న‌డానికి ఋజువేమిటీ ?
ప‌రాం   -  అయ్యో దేముడోయ్ ! సాంతం పిచ్చేక్కేసిన‌ట్టే వుందిరానాయ‌నా ! 
(నెత్తిమీద చేతులు పెట్టుకుని సోఫాలో కూల‌బ‌డ‌తాడు )
సావి  -  ఏయ్ మిష్ట‌ర్ ! నువ్వ‌లా కూల‌బ‌డితే లాభం లేదు. ఫ‌స్ట్ ఫ్రూవ్ యువ‌ర్ సెల్ఫ్ ! అద‌ర్‌వైజ్ గెటౌట్‌.
(ప‌రాంకుశం పిచ్చి చూపులు చూస్తుంటాడు)
ప‌రాం  -   ఏం ఋజూ చూపిచ్చ‌ను నా త‌ల‌కాయ‌. పెళ్ళ‌యి అయిదేశ్ళ‌యింది ఇప్పుడు నేన్నీ మొగుడ్న‌ని ఎలా నిరూపించ‌ను ?  ఈ బొంబాయిలో...
పోనీ ప‌క్క వాళ్ళ‌ని పిల్చి అడుగుతాను. మిష్ట‌ర్ మ‌ల్‌హోత్రా ! మ‌ల్‌హోత్రా
మ‌ల్‌హోత్రా  -  వాట్ మిష్ట‌ర్ ప‌రాంకుశం ?
ప‌రాం  -  టెల్ మై వైఫ్ ద‌ట్ అయామ్ హ‌ర్ హ‌జ్ బెండ్‌.
మ‌ల్‌హోత్రా   -  హే సిల్లీ ! హెకెన్ ఐసే ఇట్ ?  ఐ హావ్ నాట్ విట్‌నెస్‌డ్ యువ‌ర్ మారేజ్ !  ( వెళ్ళిపోతాడు)
ప‌రాం   -   హ‌త‌విధీ !  చుట్టు ప‌క్క‌లంతా మార్వాడీలు. వాళ్ళ‌కి ఇంగ్లీషు రాదు. నాకు మ‌రాఠీ రాదు. ఒసే మంగ‌తాయారూ ! నీకేదో పిచ్చి లేచిందే. నా మాట విని డాక్ట‌రు ద‌గ్గ‌ర‌కు పోదాంరా !
సావి   -   డాక్డ‌రా ?  వాడేమ‌న్నా దేవుడా ?  నా మొహాన్నెలా రాసిపెట్టుంటే అలా జ‌రుగుతుంది. విధిలిఖిత‌మును త‌ప్పింప బ్ర‌హ్మ‌త‌ర‌మె ?
ప‌రాం  -  స‌రిపోయింది. సైకాల‌జీలోంచి ఫిలాస‌ఫీ లోకొచ్చావ్‌. కూడుతిందాం రా !
సావి    -  మూడు పూట్లా తిన్నా అన్న‌మో రామ‌చంద్రా అంటూ అఘోరిస్తావ్ !  మూడ్రోజుల‌కోసారి గుప్పెడు మెతుకుల‌కి నోచుకోని రోడ్ల‌మీద కాపురాలు చేసే ఆభాగ్యులెంత‌మందున్నారో !  మ‌న‌కీ సోఫాసెట్లెందుకు ?  ప‌ట్టుచీర‌లెందుకు ? న‌గ‌లెందుకు ?
ప‌రాం  -  మ‌ళ్ళీ క‌మ్యూనిజంలోకి వ‌చ్చావా ?  స‌రే ! నీ ఇష్ట‌మొచ్చిన‌ప్పుడే అన్నంపెట్టు. నీక‌స‌లు మొగుడంటే ల‌క్ష్యం వుంటేగా ?
సావి  -  ఏం ?  మొగుడైతే ఏం గొప్ప ?  వాడికేమైనా కొమ్ములుంటాయా ?  మాగాడూ, ఆడ‌దీ ఒక్క‌లాగా పుట్ట‌లేదా ?  పెర‌గ‌లేదా ?  స్త్రీ పురుషులిద్ద‌రూ స‌మాన‌మే. మేం పురుషాధిక్య‌త స‌హింప‌బోము.
ప‌రాం   -  (నిట్టూర్చి)  హు !  మీరూ, మేమూ స‌మాన‌మా ?  వెయ్యి జ‌న్మ‌లెత్తినా స‌మానం కాబోము.
సావి   -  ఎందుక్కాదు ?
ప‌రాం   -  ఎందుక‌వుతాము ?  మీ క్కోపం వస్తే మీ బ్ర‌తుకులేం కావాలి ?  నిత్యం  మీ ద‌ర‌హాస వ‌ద‌నార‌వింద‌ముల‌పై ఎదురుచూచే మేము మీకు  దాసోహ‌మంటావా కానీ స‌మానుల‌మ‌వ‌లేం క‌దా !
సావి   -   ఇంత‌కీ మీరు నా భ‌ర్తేన‌ని నేనెలా న‌మ్మేదీ ?
ప‌రాం   -  పెళ్ళి ఫోటోల‌న్నా లేవే ఖ‌ర్మ !  ఫోటోల‌చ్చిబాటు కావ‌ని మా బామ్మ పోట్లాడింది !  ఆ వుండుజ మ‌న పెళ్ళికొచ్చిన వెంక‌ట్రావిక్క‌డే అవ‌త‌ల వీధిలో వుంటున్నాడు. పిల్చుకొస్తా.
సావి   -  సార్ సార్‌. నేనా వెంక‌ట్రావ్ సాక్ష్యం న‌మ్మ‌ను. వాడు రామాయ‌ణం పుచ్చుకుని ప్ర‌మాణం చెయ్య‌డు. దేవుడు లేడంటాడు. దేవుడు లేడ‌నేవాడికి స‌త్యం చెప్పాల‌నే నియ‌మం వుండ‌దు.
ప‌రాం   -  పోనీ మీ అమ్మ‌కి ఉత్త‌రం రాయి. ఫ‌లానా ప‌రాంకుశం నా మొగుడే నా అనుమానంగా వుంద‌ని.
సావి   -   జ‌వాబు వ‌చ్చేదాకా ఈ వారం రోజులూ ఎక్క‌డుంటారు ?
ప‌రాం   -  ముందుగ‌దిలో ఉంటాలే.
సావి    -  మీ మ‌గాళ్ళ‌ని న‌మ్మేదెవ‌రు ?  ముందు గ‌దిలోంచి వెన‌క గ‌దిలోకి రార‌ని న‌మ్మేదెట్లా ?
ప‌రాం  -  మ‌గాళ్ళ‌ని న‌మ్మ‌కు. న‌న్ను న‌మ్ము. నేను మ‌గాడ్ని కాను. మ‌గాణ్ణైతే ఇంత‌సేపూ నీతో వాగేవాణ్ణి కాదు. అన్నం పెడ‌తావా పెట్ట‌వా అని ఛ‌మ‌డాలెక్క‌దీసేవాడిని.
సావి  -  మ‌గాడికీ భావాలు పోయేదాకా ఆడది మ‌గాణ్ణి వెలెయ్యాలి. ప‌శుబ‌లం వుంది క‌దాని ఛెమ‌డాలెక్క‌దీస్తే కాళ్ళ ద‌గ్గ‌ర ప‌డ‌తామ‌నుకుంటున్నారేమో ! ఆడ‌ది అబ‌ల కాద‌ని నిరూపిస్తాం.
పరాం    -   పొద్దున్నే ఎవ‌రి మొహం....ఏ దరిద్ర గొట్టు మొహం చూశావో అన్నీ క‌ష్టాలే. ఛీ ఛీ !
సావి   -  (ఏడుస్తూ )  నా మొహ‌మేగా చూశారు ?  నేను ద‌రిద్ర‌పుగొట్టుదాన్నా ? 
ప‌రాం    -  నీ మొహం నేనెక్క‌డ చూశానూ ?  నీ మొహం చూడాల్సిన అవ‌స‌రం నాకేం లేదు.
సావి   -   చూళ్ళేదూ ?  పాల‌వాడు త‌లుపుకొడుతూంటే త‌లుపు తియ్య‌మ‌ని నేను మిమ్మ‌ల్ని లేప‌లేదూ ?
ప‌రాం   -  నేను నిన్న రాత్రిక్క‌డ ప‌డుకోలేదు.
సావి  -   అబ‌ద్ధాలాడ‌కండి... నిన్న రాత్రి ఈ బెడ్ మీదే ప‌డుకున్నారు. మీరీ వేపూ, నేనావేపూ ప‌డుకున్నాం.
పరాం    -   నీకు సిగ్గులేదూ...?
సావి  -  (కోపంగా)  నాకు సిగ్గెందుకు లేదు ?  నేను కాని ప‌నేం చెయ్య‌లేదే ?
ప‌రాం  -  ప‌రాయి మ‌గాడితో  సేమ్ బెడ్ మీద ప‌డుకోలేదూ పైగా సిగ్గుంద‌ని ద‌బాయిస్తావ్ ?
సావి   -  నేనేం ప‌రాయి మ‌గాడి ద‌గ్గ‌రేం ప‌డుకోలేదు. నా మొగుడి ద‌గ్గ‌రే నేను ప‌డుకున్నాను.
ప‌రాం   -  ఎవ‌డే నీ మొగుడు ?
సావి  -  ఎవ‌డేమిటి మీరే !  దుష్యంతుడిలాగా నువ్వు నా పెళ్ళానివి కాదందామ‌నుకుంటున్నారేమో !  నేనేం ఆనాటి శకుంత‌ల్ని కాదు. నెత్తిన చెంగేసుకుని పోడానికి. ఆ ప‌ప్పులేం నా ద‌గ్గ‌రుడ‌క‌వ్‌.
ప‌రాం   -  నువ్వు నా పెళ్ళాంవి కాదూ కాదూ కాదూ అంటా -   నువ్వ‌వునంటే ఋజువు చూపించు.
సావి   -  మ‌న పెళ్ళికి మంత్రాలు చ‌దివిన బ్రాహ్మ‌డీవూర్లోనేవున్నడండి పిలిపిస్తా !
ప‌రాం    -   నేను బ్రాహ్మ‌డి మాట‌లు న‌మ్మ‌ను. వాడు శుభ్రంగా మందుకొడ‌తాడు. నిజం చెప్తాడ‌నే న‌మ్మ‌కం లేదు నాకు.
సావి  -   ఏ బ్రాహ్మ‌డండీ మందు కొట్టేది ?
ప‌రాం   -   అదే  మ‌న పెళ్ళి చేసిన బ్రాహ్మ‌డు.
సావి  -   (సంతోషంగా చ‌ప్ప‌ట్లు కొడుతూ)  హియ‌ర్  హియ‌ర్  ! మ‌న పెళ్ళయింద‌ని, ఆ బ్రాహ్మ‌డు మ‌న పెళ్ళికి మంత్రాలు చ‌దివాడ‌నీ మీరే ఒప్పుకున్నారు.
ప‌రాం   -  డియ‌ర్ డియ‌ర్  !  ప‌ప్పులో కాలేసావ్  !  నేన్నీ మొగుణ్ణ‌ని ఋజువు చేస్కోవాల్సిన అవ‌స‌రం త‌ప్పింది. నువ్వేనా భార్య‌వ‌ని ఋజువు చేస్కున్నావ్‌.
సావి  -  కాదు మీరే
ప‌రాం  -   కాదు నువ్వే
సావి  -  కాదు మీరే
ప‌రాం  -  ఇంత‌కీ నీ పిచ్చి త‌గ్గిందా ?
సావి  -  మీ మ‌తి మ‌రుపు పోయిందా ?