ప‌రాం  -   స‌ర్లే యీ గోల‌కంతులేదు. అన్నంలోకి ఏంచేసావ్ ?
సావి   -   గుత్తొంకాయ కూర, సాంబారూ ప‌దండి తిందాం నేనే రోజూ వ‌డ్డించాలా మీరు వ‌డ్డిచ‌కూడ‌దా ?
ప‌రాం  -   ఎందుకు కూడ‌దూ నీకు రెండు వంకాయ‌లూ నాకు రెండు వంకాయ‌లూ... ఆ !  ఇదేమిటీ గుడ్లున్నాయ్‌.
సావి   -  ఆదేనండీ వెదికాను. క‌న‌ప‌ళ్ళా.
ప‌రాం   -  ఇదేమిటి మ‌జ్జిగ పులుసు చేసి సాంబారు చేసానంటావే ?
సావి  -   ఏవోనండి (భ‌యంగా) నాకు మ‌తి పోతోందా ?  లేక‌పోతే ఏ దెయ్య‌మో భూత‌మో అన్నిట్నీ మార్చేస్తోందా ?
పరాం  -   అస‌లు నువ్వు గుడ్డూ, మ‌జ్జిగ పులుసూ అని చెప్పావేమో నేనే మ‌ర్చిపోయి, గుత్తివంకాయ‌, సాంబారు అనుకున్నానేమో ?
సావి   -   నిజ‌మే నండోయ్ మీకూ మ‌తిమ‌రుపేగా మ‌ర్చిపోయారేమో ?
ప‌రాం  -  మ‌ర్చిపోయానో, లేదో గుర్తు రావ‌టం లేదు అబ్బ ఏం వంట !
ప‌రాం  -  వంట‌లింత చ‌ప్ప‌గా చ‌చ్ఛాయ్  !  ఉప్పు కారం లేకుండా ! 
సావి  -   అయినా బానే వున్నాయండి క‌మ్మ‌గా ! అయినా... బి.పి. వున్నవాళ్ళు ఉప్పు త‌క్కువ‌గా తినాలంటారుగా ?
ప‌రాం  -  (ఖంగారుగా)  ఏమిటీ నాకు బి.పి నా ?
సావి   -   (ధీమాగా) మ‌రే  !  బి.పి.  డ‌యాబిటీసూ కూడా!
ప‌రాం  -  నాకు ?
సావి    -  ఊ  మీకుకాక‌పోతే మీ తాత‌కి వుందిగా అది వంశ‌పారంప‌ర్యంగా వ‌స్తుందిట‌గా ! అందుక‌ని ముందు జాగ్ర‌ర్త వుండొద్దూ ?
ప‌రాం  -  (నీర్సంగా) మాతాత‌కి బి.పి వుంద‌ని నీకెవ‌రు చెప్పారే ?  మా తాత మా నాన్న పుట్ట‌క‌ముందే ఇంకా క‌డుపులో వుండ‌గానే పోయాడు క‌దా !
సావి   -   అదేమిటండీ చోధ్యం ! మీ తాత‌, మా తాత ఒక్కరే క‌దా ?
ప‌రాం  -  మీ తాత‌,  మా తాత ఒక్క‌రే ఎలా అవుతారూ ?
సావి   -  మ‌నిద్ద‌రం మేన‌త్త‌, మేన‌మామ పిల్ల‌లం క‌దా !
ప‌రాం  -  ఏ జ‌న్మ‌లో మాటే నువ్వు చెప్పేదీ ?
సావి  -  యీ జ‌న్మ‌లో మాటే.
ప‌రాం  -  స‌రిగ్గా గుర్తు తెచ్చుకో. లేక‌పోతే చెంబెడు నీళ్ళు నెత్తిన గుమ్మ‌రిస్తాను . పైత్యం వ‌దులుతుంది.
సావి  -  మీరే మ‌జ్జిగ తాగండి. మీ నిషా వ‌దులుతుంది.
ప‌రాం  -  (మెల్ల‌గా) గుర్తు తెచ్చుకో అమ్మ‌డూ... నాది త‌రిగొప్పుల‌, మీది తామ‌ర‌కొల్లు గ‌దా ?  పెళ్ళిచూపుల‌క‌ని ఎడ్ల‌బండిలో మీ వూరోచ్చి బండి దిగ‌లేక కాలు మెలిక‌ప‌డి బెణికితే ఆ రాత్రికి అక్క‌డే వుండిపోయాము. అప్పుడు నువ్వు ఎవ్వ‌రూ చూడ‌కుండా ప్రేమ‌గా కాలు నొప్పిగా వుందా అని అడ‌గ‌లేదూ ?
సావి  -  నిజ‌మేనండోయ్‌. గుర్తొచ్చింది !
ప‌రాం  -  మ‌రి మీ తాత, మా తాత ఒక్క‌రేనంటావ్ ! వెర్రి మొహంలా !
సావి  -   ప‌సిడి మ‌న‌సులు అనే క‌థ‌లో హీరో, హీరోయిన్లు ప‌రాంకుశం, పార్వ‌తి వాళ్ళిద్ద‌రు మేన‌త్త మేన‌మామ బిడ్డలు.
ప‌రాం  -  వాళ్ళ తాత‌కి బి.పి. వుందా ?
సావి   -  క‌ర‌క్టుగా చెప్పారు. మీరొచ్చేముందు అదే చ‌దువుతూ ఆ క‌థ‌లో లీన‌మైపోయాను. నేనా హీరోయిన్ని, మీరు హీరో అనే ఊహ‌లో ప‌డిపోయాను సుమండీ !
ప‌రాం  -  పోన్లే ! ఏ దేవుడో క‌నిక‌రించి ఇప్ప‌టిక‌న్నా ఈ ప్ర‌పంచంలోకొచ్చావ్ !
సావి   -  కొంచెం ఆ పెరుగిటందుకొండి.
పరాం   -  ఇదిగో !  నాక్కూడా కొద్దిగా వ‌డ్డించు.
సావి  -   పెరుగ్గుడా చాలా క‌మ్మ‌గా వుందండీ. అవునూ రాత్రి పాల‌వాడు రాలేదు క‌దా !  పెరుగెక్క‌డిదబ్బా ! 

ప్ర‌మీల ప్ర‌వేశం.
ప్ర‌మీ   -  సావిత్రీ !  అది మీకు తెలీదు. నేను చెబుతాను. ఇది మీ యిల్లు కాదు. మా యిల్లు.
ఇద్ద‌రు -   హా  !!  ఆ !
ప్ర‌మీ  -  ఇందాక మా యింటికొచ్చావు. బ‌జారు కెళ్ళోస్తాన‌ని చెప్పి అందాకా కూర్చోమ‌ని చెప్పి నేను బ‌జారుకెళ్ళాను.
ప‌రాం  -  కిటికీలోంచి మా సావిత్రి చ‌దువుకుంటూండ‌టం చూసి ఇది మా యిల్లేనేమోన‌నుకుని వ‌చ్చేసాను.
సావి  -   ఇప్పుడెలా ?  మీ వంట‌ల‌న్నీ తినేసామే ?
ప‌రాం   -  మ‌న వంట‌లు వాళ్ళ‌కిచ్చేయ్‌.
సావి  -  ఆ  ఇప్పుడు జ్ఞాప‌కం వ‌చ్చిందండీ బియ్యం అయిపోయాయి తెచ్చుకుందాం, సాయంత్రం వ‌స్తావా ప్ర‌మీలా అని అడ‌గ‌టానికి వీళ్ళింటికొచ్చానండి. ఆ చేత్తోనే గుత్తివంకాయ‌లు కొనుక్కొద్దామ‌న‌కున్నానండి ! 
పరాం   -  సాంబారుకి చింత‌పండొద్దూ ?  అది తేన‌ఖ్ఖ‌ర్లేదు ?  తుమ్మ‌మొద్దు ! ఎంత‌ప‌ని చేశావే ?
సావి  -  మీరు మాత్రం త‌క్కువ చేశారా ?
ప‌రాం   -  నీ మూలంగానే క‌దా.... ఇక్క‌డికొచ్చా.
సావి  -  ఇంటి నెంబ‌ర్ చూసుకోవ‌ఖ్ఖ‌ర్లేదా ?  నేనున్న‌దే మ‌న‌యిల్ల‌యిపోతుందా ?
పరాం  -  నీదే త‌ప్పు.
సావి   -   మీదే త‌ప్పు ! నీదే !  మీదే !
ప్ర‌మీ  -   అబ్బ‌బ్బ‌. త‌ప్పు మీ యిద్ద‌రిదీ కాదు. సావిత్రీ ! నిన్నింట్లో వ‌దిలివెళ్ళిన నాది !  నేను మ‌ళ్ళీ వండుకుంటాగాని మీరు మీ యింటివెళ్ళి విశ్రాంతి తీసుకుంటే అదే నాకు ప‌దివేలు.