బుర్ర శాస్త్రీయం
కోర్టు మర్యాద గుర్తించి మాట్లాడు
ఈ కాగితం ఎందుకు చదవలేవు అని ప్రశ్నిస్తే నేను నిజం చెప్పాను. నేను నిజమే చెబుతాను. అబద్దాలు చెప్పను
అయితే నువ్వు వ్రేలిముద్రవేసిన ఈ పంచాయితీ రిపోర్టు చదువు అంటూ జడ్జి తన గుమాస్తా ద్వారా ఆ కాగితాన్ని నాకందించాడు.
నేను నెమ్మదిగా అక్షరాలు కూడబలుక్కుంటూ ఆ రిపోర్టు మొదటి నుంచి చివరదాకా చదివాను. నిజానికి కానిస్టేబుల్ దస్తూరికన్న జడ్జి దస్తూరీ బావుంది. ఆ పంచాయీతీనామాలో కానిస్టేబుల్ ఏం రాశాడో నేను అప్పుడు చదవలేదు. ఇప్పుడు అందులోని అంశాల్ని గురించి ఏం ప్రశ్నలు వేస్తారో అని ఆ రిపోర్టు చదవాలనే ఉద్దేశ్యంతో అలాగ అన్నాను.
నేనా కాగితం చదవడం చూసి పోలీసులు, పదో క్లాసు టీచరు, జడ్జి, కోర్టులో అందరూ ఆశ్చర్యపోయారు.
నేనిచ్చిన సమాధానాల్లో నేను చూపెట్టిన నా తెలివికి నేను ఆశ్చర్యపోయాను.
ఇక బోనులోంచి దిగు అన్నాడు, ఏయస్.ఐ.
నేనుదిగి నా స్టేట్‌మెంటు మీద నిశానీ వేసి బైటకు వెళ్ళిపోయాను. నేరం చేసో, మోసం చేసో డబ్బు సంపాదించడానికి కావలసిన నేర్పూ, నేను పట్టుబడితే తప్పించుకోడానికి కావలసిన తెలివితేటలూ, నాక్కూడా ఉన్నాయనిపించింది. ఈ విషయాల్ని గురించి ఆలోచించుకుంటూ నడుస్తున్నాను, మా ఇంటివైపు.
త్రోవలో యెరకల ఈరిగాడు కనపడ్డాడు. నాకో ఆలోచన వచ్చింది. ఏరా ఈరిగా అని పలకరించాను.
ఏటి శాత్తుల్లు బాబూ ? అన్నాడు ఈరిగాడు.
నువ్వీ మధ్య అగుపడ్డం లేదేం ? అన్నాను.
మాపు యాడికి బోతావో యెందుకు బోతావో తవురలాంటి వోరు అడగనూ కూడదు, నాను చెప్పనూ కూడదు, అన్నాడు వాడు.
పోన్లే చెప్పొద్దుగాని, నాకో విషయం నీ దగ్గిర నుంచి తెలుసుకోవాలనుందిరా అన్నాను, చనువుగా లాలనగా. అలాగయితేనే గాని నాకు కావలసిన సమాచారం వాడివ్వడని అనుకున్నాను.
ఏ ఇసయం బాబదీ ?
నువ్వు మనూర్నించి పాతిక ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళో, ఎవరింట్లోనో దొంగతనం చేసి ఇట్టే తిరిగి వచ్చేస్తావు కదా. అక్కడ ఏ అర్ధరాత్రో దొంగతనం చేసి మళ్ళీ తెల్లారకముందే ఇక్కడికి ఎలా వస్తావురా ? అన్నాను కొంచెం మొహమాటంగా.
గొయ్యమ్మ వెంటబడ్డప్పుడు నేనంత కన్నా వేగంగానే పరిగెతానన్న సత్యం నాకొక్కడికే తెలుసు.
అయ్యబాబాయ్ ! ఇదేంటి శాత్తుల్లు బాబో ! నా తోటి పరాశికాలాడతన్నారేంటి ? అన్నాడు వాడు.
పరాశికం కాదురా ! తెలుసుకోవాలని.... అన్నాను కొంచెం సిగ్గుపడుతూ
తెలుసుకుంతారా బాబయ్యా ! తవురు కూడా కన్నమేద్దాదనుకుంతన్నారేటి ? అన్నాడు, వాడు, సూటిగా.
పోనీ అలాగే అనుకో ! అన్నాన్నేను నసుగుతూ.
పులంట, సెట్టెక్కడం పిల్లికాడ నేరసుకుందట. అలాగుంది మీ యవ్వారం.
పోనీ అలాగే అనుకో అన్నాన్నేను నసుగుతూనే.
ఈడకి రాములోరి గుడి ఎంత దూరముంతాది ? అన్నాడు, ఈరిగాడు.
కొంచెం హెచ్చు తగ్గుగా ఓ మైలుంటుంది అన్నాన్నేను.
ఈడ నుంచి ఆడకి లగెత్తుకెళ్ళి లగెత్తుకు రావాల. తవురు ఎంచేపట్లో సేయగలరు ? అని ప్రశ్నించాడు వాడు.
ఇరవై నిమిషాల్లో అన్నాన్నేను. మా గొయ్యమ్మ ధర్మమా అని నేను బాగా వేగంగా పరుగెత్తగలననుకున్నాను.
తవురి నెత్తిమీద కూతంత బరువైన పెట్టో మూటో వుంటే ? అన్నాడు వాడు.
ఓ అరగంటలో అన్నాన్నేను. నాకీ అనుభవం లేదు, మరి
శాత్తుల్లు బాబో ! ఇలాగయితే తవురు దొరికిపోతారు - ఇల్లుగలాడు పట్టుకుంటే మక్కెలిరగ తంతాడు. పోలీసోళ్ళట్టుకుంటే టేసన్‌లో యెట్టి కుళ్ళబొడిసేత్తారు. జైలికెలితే వోర్డర్లు సావగొడ్తారు. నెత్తిమీద ఏటీ నేకపోతే పదిమినిట్లలో పరుగెత్తాల. నెత్తిమీద సరుకుంటే పదేను మినిట్లు దాటకూడదు తవురికి అలవాటు నేదు ఎందుకొచ్చిన బాద. తవురికి పిక్కబలం నేదు బుర్ర శాత్తుల్లుగారో ! తవురికి బుర్ర ఉంది కాదా మరి. ఇంకేదయిన సులువు పని సూసుకోండి అంటూ చకచక వెళ్ళిపోయాడు ఎరుకల ఈరిగాడు.
నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈరిగాడు చెప్పింది సబబుగానే ఉంది. వాడికి పిక్కబలం ఉంది, నాకూ ఉంది. వాడికి బుర్ర బలం లేదు అని నేను అనుకుంటున్నాను, నాకు బుర్రబలం కూడా ఉందేమో చూసుకోవాలి. ఇంకా బాగా ఆలోచించాను. ఆలోచిస్తూ నడుస్తున్నాను.
నా పెళ్ళాం, గొయ్యమ్మ ఎంత పని చేసిందీ ! కాలుతున్న కొరకంచు నా మీదికి గిరవాటు పెట్టి నన్ను సజీవ దహనం ! అయ్యబాబాయ్ గారెల యావ నా చేత దొంగ నాటకం ఆడిస్తే మాత్రం గొయ్యమ్మ నన్ను కట్టెతో కాల్చి చంపెయ్యడమే ! నాకు మాత్రం ఈ గారెల యావ ఇంత ఎందుకుడాలీ ? అది తీర్చుకోడానికి నేనిన్ని విధాల అగచాట్లు ఎందుకు పడాలి ? ప్రతి వాడికీ ఏదో ఒక యావ ఉంటుంది. అది తీర్చుకోడానికి ప్రతివాడూ మంచి మార్గమో, తప్పుడు త్రోవో పడుతూంటాడు. లోకంలో బుర్ర శాస్త్రిని నేనొక్కణ్ణే కాదు, లక్షలూ కోట్లూ ఉన్నారు దారియేదైనా సరే డబ్బు సంపాదించాలన్నదే నా లక్ష్యం గారెలు చేసుకుతినాలన్నదే నా ధ్యేయం - ఎలా ? ఎలా ? ఇలాగ ఆలోచిస్తూ నడుస్తున్నాను.
ఏటనుకున్నారయ్యగోరో ! ఈ అప్పన్న బడ్డీకొట్లో, సింగిల్ ఆప్ సోడా డబల్ సోడా అంత గాటుగా ఉంటాది ! డబ్బులిప్పించండి అన్నాడు అప్పన్న.
నేను లేచి నిలబడ్డాను. అప్పన్న చేతిలో అయిదు పైసలు పెట్టాను.
అప్పన్నా, నువ్విచ్చిన సోడా గాస్ ఖరీదు ఇప్పుడిచ్చేశాను. ఇహను. మిగతా పావలా అంటావూ ? గుర్తుంచుకో, నాచేతికి రాగానే నీ చేతికిచ్చేస్తాను అంటూ నా దారిన నేను చక్కాబోయాను.
అప్పన్న ఏదో చెపుతున్నాడు. అతను మా ప్రక్కవీధివాడే. అతను చెపుతున్నదేమిటో తర్వాత ఎప్పుడైనా వినొచ్చు పైగా, అదేమిటో నాకు తెలియకపోలేదు. నాకే అన్నమాటేమిటి ? మీలో చాలా మందికీ తెలుసు.
గారెలు చేసుకోవాలి, డబ్బు కావాలి, ఎలా ? అని యోచిస్తూనే నడుస్తున్నాను. మెరుపులాంటి ఆలోచన మెరుపులా తట్టింది. నా ముఖం మెరుపులా అయింది.
*******
నీ కిద్దరు పెళ్ళాలు ! గళ్ళాపెట్టిలో డబ్బు సర్దుకుంటున్నవాడు, నా మాటలు విని, చివాలున తలెత్తాడు.
తమరికెలా తెలుసు ! అన్నాడు తెల్లబోతూ.
నో నొసటను రాసి ఉంది. చదివాను. అన్నాన్నేను, ధీమాగా.
మా ఊరికి ఆరుమైళ్ళ దూరంలో ఉంది అముదాలపురం. ఆ ఊళ్ళో ఆండాళ్ కేఫ్ ఉంది. ఈ హోటల్ యజమాని గళ్ళాపెట్టి వద్ద కూర్చుని ఉన్న సమయంలో ఉదయంపూట అక్కడికెళ్ళాను.
నేను తెల్లపంచ బిళ్ళ గోచీ పెట్టుకుని కట్టుకుని ఉన్నాను. తెల్లటి సగం చేతుల జుబ్బా తొడుక్కుని ఉన్నాను. నొసట స్పుటంగా వీభూతి పెట్టుకున్నాను. విభూతిమీద నొసటి మధ్య పెద్ద కుంకం బొట్టు పెట్టుకున్నాను. కుడి చెవిలో ఎర్రమందార పువ్వు తురుముకున్నాను. పైన మా నాన్నది పాత ఎర్రశాలువా కప్పుకున్నాను. ఎడంచేతికి నల్లటి కాన్వాసు సంచి తగిలించుకున్నాను. అందులో ఒక పాత సాముద్రిక పుస్తకం, ఒక కొత్త పంచాంగం పెట్టుకున్నాను. అద్దం కట్టిన మహాకాళి పటం పెట్టుకున్నాను. కుడి చేతిలో గొడుగు పట్టుకున్నాను.
తాను తలవంచుకుని ఉండగా నేను నొసటి వ్రాతను ఎలా చదవగలిగాను ? అనే సందేమం అయ్యరుకి రాలేదు. నా వేషమూ, గొంతూ అంత గంభీరంగా ఉన్నాయి. అయ్యరులేచి నిలబడ్డాడు. నాకు నమస్కరించాడు, రెండు చేతులూ జోడించి, ఇదివరకు నాకెవ్వడూ ఇలాగ నమస్కరించలేదు. ఈ నమస్కారం నా వేషానికి నేను చెప్పబోయే మాటలకుగాని నాకు కాదని నాకు బాగా తెలుసు.
గంభీరంగా తలాడించాను.
అయ్యరు నాకు మర్యాదచేశాడు. కొంచెం వారగా వున్న ఓ చిన్న టేబుల్ ముందున్న కుర్చీలో నన్ను కూర్చోబెట్టారు.
ఏం పుచ్చుకుంటారు ? అన్నాడు వినయంగా.
అయ్యరు ఆ వూరు పాల్ఘాట్ నుండి వచ్చి పదహారేళ్లవుతోంది. తెలుగువాడికంటె తెలుగు బాగా నేర్చుకున్నాడు. పధ్నాలుగేళ్ళ క్రితం ఓ పాల్ఘాట్ పిల్లని పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాడు. ఆవిడకి పిల్లలు కలుగలేదు. నాలుగేళ్ల క్రితం ఇంకో పాల్ఘట్ పిల్లని పెళ్లిచేసుకుని తెచ్చుకున్నాడు. ఆవిడకీ ఇంకా పిల్లలు కలుగలేదు. అయ్యరు మంచివాడు. దుర్గుణాలు లేవు. డాబా ఇల్లు ఆ ఊళ్లో ఒకటి, పాల్ఘట్ లో ఒకటి కట్టించాడు. అక్కడ ఇంకో ఇల్లు కొనే ఆలోచనలో వున్నాడు. అయ్యరుకి తల్లిదండ్రులు పోయారు. ఇద్దరు తమ్ముళ్లు ఒక అక్క ఉన్నారు. ఇలాగ వీలైనన్ని వివరాలు రెండ్రోజుల క్రితం రహస్యంగా సేకరించాను.
మహంకాళికి అయిదురూపాయలు నివేదన. నాకు ఆరు గారెలు నైవేద్యం అంటూ నిమిలిత నేత్రాలు అంటారే అలాగ పెట్టాను కళ్లు నా సంచీలోంచి మహంకాళి పటం తీసి బయట పెట్టాను.
అవతలివాడు వైష్ణవుడైనా, శైవుడైనా, మధ్యుడైనా ఆఖరికి ముస్లిం అయినా, మహంకాళిని చూసి జడుసుకుని దణ్ణం పెడతారు. అందుకే మహంకాళి పటం పట్టుకొచ్చాను. అయ్యరుమహంకాళికి దణ్ణం పెట్టాడు. ఒక అగరువత్తి పుల్ల తెచ్చి పటం ఫ్రేములో గుచ్చివెలిగించాడు. నాలుగు తమలపాకుల్లో రెండు వక్క పలుకులు, ఒక అయిదు రూపాయిల నోటు పటంముందుంచి మళ్లీ దణ్ణం పెట్టాడు. భక్తితో నా వైపు చూశాడు.
స్వామీ ! నైవేద్యానికి గారెలు లేవు అన్నాడు వినయంగా
మినప్పప్పు దినుసులేమున్నాయి ? అన్నాన్నేను.
ఏం లేవు ! స్వామీ ! అన్నాడు అతివినయంగా.
ఏ పప్పు దినుసులేమున్నాయి ? అన్నాన్నేను.
వడలున్నాయి, అన్నాడతడు.
సరే, ఇవి రెండో పక్షం ఎనిమిది వడలు నైవేద్యం అన్నాన్నేను. ఏదో విధంగా సరిపెట్టుకుంటానన్నట్టు.
చిత్తం అని నాల్గు ప్లేట్లు పడేయ్ ! అంటూ గట్టిగా బొబ్బిపెట్టి నా ప్రక్కన ఓ కూర్చి లాక్కుని కూర్చున్నాడు.
వడలొచ్చాయ్. నేనో ముక్క విరిచి నోట్లో వేసుకున్నాను. అయ్యరు నా ముందుకు తన కుడిచెయ్యి చాపి అరచెయ్యి తెరిచాడు.
నేను వడముక్క నవుల్తొ అయ్యరు అరచేతిలోని రేఖల్ని దీక్షగా చూస్తున్నాను. ఒకమాటు నొసలు చిట్లించాను. ఒకమాటు కళ్లు కప్పువైపుకి తిప్పాను. ఒక మాటు చిర్నవ్వు నవ్వాను. ఒక మాటు ఎడంచేతి చూపుడు వేలితో బల్లమీద చిన్నగా తాళం వేశాను.
నీ కిద్దరు పెళ్లాలు ! అన్నాను మళ్లీ.
నొసటి వ్రాత చేతిలోకూడా వుంటుందాండి ? అన్నాడు అయ్యరు.
ఆ బ్రహ్మ మొదట నొసటిమీద వ్రాస్తాడు. నొసటి వ్రాత అందరూ చదవలేరు. కొద్దిగా సులువుగా వుండాలని అరచేతిలో వ్రాస్తాడు. పైగా అరచేతిలో చాలా వ్రాయొచ్చు జాగా ఎక్కువ అన్నాను మూడోవడ తింటూ.
చిత్తం చెప్పండి అన్నాడు.
నీకు తల్లీ తండ్రీ లేరు. ఒకరి తరువాత ఒకరు పోయారు.
అవునండి. ముందు మా నాయన పోయాడు. నాలుగేళ్ల తర్వాత మా అమ్మ పోయింది.
నీకు ముగ్గరు తమ్ముళ్లు ఇద్దరు అక్క చెల్లెళ్లు ఉన్నారు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం అతనికి ఇద్దరు తమ్ముళ్లు ఒక అక్క మాత్రమే వున్నారు. అయినా పెద్ద చిక్కేమీ రాదనే ధీమాతో ఇలాగ చెప్పాను.
నిజమేనండి, ఒక తమ్ముడు పెన్నలో మునిగి చచ్చిపోయాడు. ఒక చెల్లెలు పొరుగింటి పిళ్లతో లేచిపోయింది. ఇప్పుడున్నది ఇద్దరు తమ్ముళ్లు ఒక అక్క అన్నాడు నెమ్మదిగా.
అప్పటికి అయిదోవడ అయిపోయింది.
ఆస్తులు బాగా సంపాదించావు. ఈ ఊళ్లోనూ, ఇక్కడికి చాలా దూరంలోనూ కూడా. ఇంకో ఆరేళ్లలో నీ ఆస్తి రెట్టింపవుతుంది అన్నాను. అయ్యరుకి ఆదాయం బావుంది. ఖర్చులేదు. ఆస్తి పెరగక మానదు. అందుకే అలాగ చెప్పాను. అప్పటికి ఏడో వడ తినేశాను.
నీకు మగపిల్లవాడు పుడతాడు. రెండేళ్లకి అన్నాను. అయ్యరుకు కావలసింది ఇదీ. ఎగిరి గంతేసినంత పనిచేశాడు. సంబరపడ్డాడు. ఏ పెళ్లానికి ? అతడు అడగలేదు. నేను చెప్పలేదు.
ఈలోగా రామేశ్వరం వెళ్లి సుబ్రహ్మణేశ్వరస్వామిని ప్రతిష్ఠించు. అప్పన్న కొండకెళ్లి సహస్ర నామార్చన చేయించు అన్నాను. ఎనిమిది వడలు అయిపోయాయి. ఇవన్నీ కూడా అరచేతిలో రాసి వుంటాయా ? అని అతను అడగలేదు.
స్వామీ కాఫీ పుచ్చుకుంటారా ? అని మాత్రం అడిగాడు.
పుచ్చుకోను అన్నాను ముక్తసరిగా.
పాలు పుచ్చుకుంటారా ?
పంచదార వేసిన గ్లాసుడు చిక్కటిపాలు తెప్పించు అన్నాను.
పాలు త్రాగేసి ఇంటి త్రోవ పట్టాను.
అయ్యరుకి తెలియనిది నేను ఏం జోస్యం చెప్పాను ? ఏమీ లేదు అయ్యరుకి తెలిసినవి నాకు తెలియనివి నేను అతనినొసలు అరచేయి చదివిచెప్పానని అతననుకున్నాడు. కనుక నన్ను దైవజ్ఞుడిగా గౌరవించి రూపాయలు వడలు ఇచ్చాడు.
నేను వెళ్లేసరికి మునసము ఇంటి అరుగుమీద చుట్ట కాల్చుకుంటున్నాడు. సరిగ్గ అయ్యరు దగ్గర ఏం చేశానో మునసబుగారి దగ్గరకూడా అలాగేచేశాను. మునసబును గురించి కూడా చాలావివరాలు రెండ్రోజుల క్రితం సేకరించాను.
నీ మూడో కూతురు వ్యవహారం నీవు కోరినట్లు అవుతుంది అన్నాను. మునసబు ముఖం చూస్తూనే.
మునసము కాలుస్తున్న చుట్ట రోడ్డుమీదకి గిరవాటు వేసి నన్ను ఆదరంగా తన ప్రక్కన అరుగుమీద కూర్చో పెట్టాడు.
తమరు ఏం పుచ్చుకుంటారు ? అన్నాడు.
మిట్టమధ్యాహ్నం వచ్చానుగదా మంచి నీళ్లా, మజ్జిగా అని అతని వుద్దేశ్యం.
మహంకాళికి అయిదు రూపాయలు నివేదన, నాకు అర్ధశేరుమినప్పప్పు నైవేద్యం అంటూ సంచీలోంచి మహంకాళి పటం బయట పెట్టాను.
మునసబు పటానికి దణ్ణంపెట్టి, తమలపాకుల్లో వక్కా అయిదు రూపాయల నోటు, అర్ధశేరు పట్టే గిన్నెనిండా మినప్పప్పు పట్టుకొచ్చాడు. నోటు జేబులోకి పప్పు సంచీలోకి వెళ్లిపోయాయి.
మునసబుకి తెలిసిన విషయాలే నేను కొత్తగా అతని అరచేతిని చూస్తూ చెప్పాను. అవును, నిజం అంటూ ఆశ్చర్యపోతూ వింటున్నాడు. అతనికి ప్రస్తుత ముఖ్యసమస్యను అతనికి మూడో కూతురి సంసార సమస్య. నా అల్లుడు నపుంసకుడు అందుకే నా కూతురు అత్తారింటికి వెళ్లదు అంటాడు మునసబు.
నీ కూతురు నీ పాలేరుని వుంచుకుంది. అందుకే అది ఇక్కడికి రాకూడదు అంటాడాయన అల్లుడు.
మునసబు కోర్కెప్రకారం నేను జోస్యం చెప్పడం నాకు శ్రేయస్కరం. అతని హస్తంలోని రేఖలు అతి దీక్షగా రెండునిమిషాలు చదివాను. ఇంక రెండేళ్లు మీ మూడో అమ్మాయి ఇప్పటి పెళ్లి చెడిపోయి, రెండో పెళ్లి చేసుకుంటుంది. మీరే స్వయంగా జరిపిస్తారు. అంటూ నా సంచీ నా గొడుగూ పుచ్చుకుని వడివడిగా వెళ్లిపోయాను.
కరణం ఇంటిదారి పట్టాను. హస్త సాముద్రికమూ, జోస్యమూ చెప్పించుకుని సంతోషంతో తృప్తిపడే అయ్యరూ, మునసబూ వంటివాళ్లున్నంతవరకూ బుర్రశాస్త్రులవంటి దైవజ్ఞులు బాగానే బ్రతుకుతారనుకున్నాను.
కరణం ఇల్లు రెండు వీధుల మొగలో వుంది. ఆయన ఇంటి అరుగుమీద ఏదో పుస్తకం చేతపట్టుకుని ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు కూర్చుని వున్నాడు. నన్ను చూసి గౌరవంగా నిలబడి నమస్కారం చేశాడు. రెండ్రోజుల క్రితం నేను ఆరా తీసిన గృహస్థుల్లో కరణం ఒకడు ! నేను ఆయన ముఖంలోకి తేరిపార చూశాను. నాలుగు క్షణాలు నా పెదవులు నాలో నేను ఏదో అనుకుంటున్నట్లు కదిలించాను.
మీ రెండో అమ్మాయి పెళ్లి మూడున్నర మాసాల్లో అవుతుంది అన్నాను. నా మాటకి తురుగులేదన్నట్లు.
దయచేయండి అంటూ నన్నాహ్వానించి అరుగుమీద కూర్చోపెట్టాడు. అప్పుడు సాయంకాలం మూడు గంటల సమయం. ఏం పుచ్చుకుంటారు ? అన్నాడు. పాలా, కొబ్బరినీళ్లా, పళ్ల రసమా, మజ్జిగ తేటా అనే అభిప్రాయంతో. కరణం మంచి సంపన్నుడు.
మహంకాళికి అయిదు రూపాయలు నివేదన, నాకు అర్థశేరు మినప్పప్పు నైవేద్యం అంటూ నా సంచీలోంచి మహంకాళి పటం తీసి బయటపెట్టాను. కరణం మహాభక్తితో మహంకాళికి దణ్ణం పెట్టుకున్నాడు. ఇప్పుడే వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్లాడు.
కరణం ఇల్లు రెండు వీధుల మొగలో వుందని చెప్పానుగా. ఒక వీధి వెంబడి అల్లంతదూరంలో ఒక మనిషి వస్తూండడం చూశాను. ఆ మనిషి ఒడ్డూ పొడుగూ నడకతీరూ అచ్చంగా మా ఊరి కరణంగారి పెద్దబ్బాయిలాగ వుంది. పెద్దబ్బాయిలాగా ఏమిటి, అతను పెద్దబ్బాయే ! నా గుండె గబగబ కొట్టుకుంది. తటాలున మహంకాళిని నా సంచీలో పెట్టుకుని, పెద్దపెద్ద అంగలు వేస్తూ వడిగా రెండో వీధిని నడిచాను.
మా ఊరి కరణంగారి పెద్దబ్బాయి నన్ను ఎరుగును. నన్ను గుర్తిస్తే ఇంవేముంది ? నేను తిన్న ఎనిమది వడలు కక్కించలేరుకాని, నేను దండుకున్న పది రూపాయలు, శేరు మినప్పప్పు కక్కిస్తారు. దేహశుద్ధి చేస్తారు. అందుకే మా వూరువైపుగా ముందు వేగంగా నడిచి తరువాత దౌడు తీశాను, మా గొయ్యమ్మ ధర్మమా అని నాకు దౌడు తీయడం బాగానే వచ్చునని మీకు తెలుసు.
హస్తపాముద్రికం, జ్యోతిష్యం చెప్పి డబ్బు సంపాదించడం చాలా ప్రయాసతోనూ ప్రమాదంతోనూ కూడుకున్న పని. ఇవి చెప్పుంచుకుని, నమ్మి, డబ్బిచ్చే వెర్రివాళ్లను ముందు ఎన్నుకోవాలి. వాళ్లను గురించిన సమాచారాలు రోజుల తరబడి కష్టపడి సేకరించాలి. ఎక్కడైనా కించిత్తు తప్పుగాని పొరబాటుగాని చేశానో ఒళ్లు హూనం అయిపోతుంది. ఇప్పుడు నా అదృష్టం బాగుండి గండం నిమిషంలో తప్పింది. డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు ఆలోచిస్తూ ఇంటికి నడిచాను.
నేను నడిచి వస్తున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ దారిలో జనం రద్దీ తక్కువగా వుంది. చీకటి పడుతున్నకొద్దీ మరీ నిర్మానుష్యంగా ఉన్నట్లుంది. ఎవడైనా దారిదోపిడి దొంగరోడ్డుకాసి, నన్ను అటకాయించి, నాలుగు తన్ని, నా పది రూపాయలు, శేరు మినప్పప్పు, నా సంచీ గొడుగూ, ఎర్ర పాత శాలువా పట్టుకుపోతే ? ఈ ఆలోచన నాకు ఎంతో భయాన్ని కలిగించింది.
కాని ఆలోచించిన కొద్దీ ఈ ఆలోచన నాకు భయంపోయి సంతోషాన్ని కలిగించింది. మూడు రోజులు కష్టపడితేగాని ముష్టి పది రూపాయలు, శేరు మినప్పప్పు సంపాదించలేకపోయాను. మూడో అయిదురూపాయల నోటు సంపాదించే సమయానికి ప్రమాదం ముంచుకొచ్చింది. నన్ను ఎవడైనా దారిదోపిడీ చేస్తే ముప్పై నిమిషాల్లో ఇవేగాక మిగతా వస్తువులుకూడా పోతాయి. ఎవరినైనా నేను దారిదోపిడి చేస్తే ? ఏమో ఎంత సంపాదించుకోగలనో ! అన్న ఆలోచన వచ్చింది.
మా ఇంట్లో మా తాతలనాడు ఒక పెద్ద కత్తిపీట ఉండేది. కాలక్రమాన కత్తీ, పీటా వేరైపోయాయి. పీట కర్రది కావడం మూలాన మా నాన్న కాలంలోనే జీర్ణించిపోయి పొయ్యిలోకి వెళ్లిపోయింది. కత్తి ఇనపది కావడాన కొంచెం తుప్పుపట్టి పాతసామానుల్లో పడి వుంది.
ఒకనాటి సాయంకాలం మా గొయ్యమ్మ పొరుగింటి వాళ్లతో వూసులాడుతున్న సమయంలో ఆ తుప్పుపట్టిన పాత ఇనుప కత్తిని పంచె కొంగున దాచుకుని ఇంట్లోంచి బయటపడి ఆముదాలపురంలో తోవ పట్టాను. అప్పటికి మసక చీకట్లు కమ్ముతున్నాయి.
దారిదోపిడీ చేయాలని అనుకున్నానుగాని, ఎలా చేయాలో నాకు తెలియదు. దారికాసి ఎవరైనా ఒంటరిగా నడిచివస్తున్నవాణ్ణి ఆపి నా కత్తితో బెదిరించి దోచాలి అని అనుకున్నాను. వంటరిగా వస్తున్న వాడికోసం దారిలో వేచివుండడంవల్ల ప్రమాదం అనిపించింది. అంతవరకు దారి వారన ఉన్న చెట్టెక్కి కొమ్మల్లో నక్కి కూర్చోవడం మంచిదని చెట్టెక్కి కూర్చున్నాను.
నేను ఇలాగ చెట్టెక్కి కూర్చున్నానో లేదో అలాగ ఎక్కడనుండి ఊడిపడ్డాడో ఒకడు, అటూ ఇటూ దిక్కులు పరీక్షగా చూస్తూ వస్తున్నాడు. నేను చెట్టుమీంచి నెమ్మదిగా దిగాలా దభీమని దూకాలా అని తబ్బిబ్బు పడుతున్న సమయంలో వాడు నేను కూర్చున్న చెట్టుక్రిందికు వచ్చేశాడు. చెట్టు పైకి చూశాడు.
ఎవరది ? దిగు అని నన్నుచూసి గద్దించాడు.
నేను హడలిపోయాను. గుండెలు ఒక చేత, కత్తి ఇంకోచేత పుచ్చుకుని దిగడానికి వీలుపడక కత్తినెమ్మదిగ ఆ చెట్టుమొదట్లోకి, దారి అవతలివైపున జారవిడిచాను. నేను చెట్టుదిగి, కత్తి చేతపుచ్చుకుని వాడిముందు నిలబడ్డాను. వాడు నన్నూ నా కత్తినీ చూసి భయపడతానుకున్నాను కాని భయపడలేదు. పైగా నన్ను ఎగాదిగా చూశాడు. ఎవర్నువ్వు ? అన్నాడు.
నేను ఎవరైతే ఏం ? ముందు నీ జేబులోది అక్కడపెట్టు అన్నాను కళ్లెర్రజేసి.
ఆ చీకట్లో నేను కళ్లు ఎర్ర చేశానో లేదో వాడికి కనిపించలేదు గావును.
దారిదోపిడి దొంగవా ? అన్నాడు తాపీగా
నేను దోపిడీ దొంగలాగా బింకంగా ఉండాలనే సంగతి మర్చిపోయాను.
ఆ చెట్టు మీదనేనున్నట్లు చీకట్లో ఎలాగ గుర్తించావూ ? అన్నాను.
నువ్వు తొడుక్కున్న చొక్కా నువ్వు కట్టుకున్న పంచా తెల్లగా వున్నాయి, కాబట్టి అన్నాడు వాడు నవ్వుతూ.
ఆహా ! తెల్లచొక్క, పంచా నన్ను పట్టిచ్చేశాయి. పొరబాటయింది అన్నాను.
నీకు డబ్బవసరం బాగా వుందేమిటి ? అన్నాడు వాడు.
నేను మినప్పప్పు కొనుక్కోవాలి, ఉప్పు కొనుక్కోవాలి. పప్పు నూనె కొనుక్కోవాలి అందుకు నాకు డబ్బు అవసరం చాలా వుంది. అన్నాన్నేను.
అందుకు దారి కొడదామనుకున్నావు అంతేనా ? ఎందుకు ఈ దినుసులన్నీ ?
గారెలు చేసుకోడానికా ! అంటూ మళ్లీ నవ్వాడు.
నాకు వళ్లు మండింది. ముందు నీ జేబులోది అక్కడపెట్టు అన్నాను కోపంగా.
అది సరే నేను చెప్పినట్లు విను. నీకు దార్లు కొట్టడం చేతకాదు. మీ ఊళ్లో లైబ్రరీలో వుంటుంది. పత్రిక అది చదువుతూండు. నీకు వీలైనదీ, లాభించేదీ ఓ మంచి నేరం ఎన్నుకో. అంతేగాని ఇలాంటి చేతగాని పనులు చెయ్యకు. అన్నట్లు నీకు చదవడం వచ్చా ? అన్నాడు వాడు.
వచ్చు అన్నాన్నేను. |