చిలికి చిలికి

ఉద్యోగాలు రాక‌ముందు నానా క‌ష్టాలూ ప‌డుతూ తిన‌డానికి తిండిలేక ఇంటాబ‌య‌టా కూడా హీనంగా చూడ‌బ‌డుతూ ప‌ర‌మ దీనావ‌స్థ‌లో ఉంటారు. తీరా ఉద్యోగం వ‌చ్చిందో కొమ్మెక్కి కూర్చుంటారు. త‌మ విధుల‌ను తాము స‌క్ర‌మంగా నెర‌వేర్చ‌రు అక్క‌డా ఇక్క‌డా కాల‌క్షేపం చేసి జీతం డ‌బ్బులు .జేబులో వేసుకుపోతారు. ఇలాంటి వాళ్ళ‌ని దార్లోకి తీసుకురావాలంటే ఉద్యోగాల్ని ఊడ‌పీకి పారెయ్యాలి. ఆ వేశంలో పిడికిళ్ళు బిగించాడు కోచ్క‌ర్‌.

అస‌లు సంగ‌తి చెప్ప‌కుండా ఉద్రేక‌ప‌డ‌తారేం డాక్ట‌ర్‌కోచ్క‌ర్ అదేనండి ఆ పోచయ్య‌నా ఆర్డ‌ర్స్‌ను స‌రిగా ఒబే చేయ‌డం లేదు. ఒక‌ప‌ని చెబితే ఒక ప‌ని చేస్తాడు. నేను ఎలుక‌కు ఇంజ‌క్ష‌న్ ఇమ్మంటే పిల్లికిస్తాడు. రియాక్ష‌న్స్ ఒక‌లా ఉంటే ఒక‌లా నోట్ చేస్తున్నాడు. ఈ సెక్ష‌న్‌కి హెడ్‌ని నేనా ?  అత‌నా ?  చెప్పండి అత‌నే అంటే పోచ‌య్య చెప్పిన‌ట్లు నేనేవింటాను. కోచ్క‌ర్ మాట‌ల‌కు కంపెనీ సెక్ర‌ట‌రీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ రాజు ఇరాక‌టంలో ప‌డ్డాడు. డాక్ట‌ర్ కోచ్క‌ర్ నుండి పోచ‌య్య మీద ఇలాంటి కంప్లెయింట్ రావ‌డం ఇది నాల్గ‌వ‌సారి.

ఇక పోచ‌య్య సంగ‌తి చూస్తే ఇలా... మేనేజ‌ర్ బాబూ మీరేచెప్పండి. కోచ్క‌ర్ తాత‌గారిదా ఈ ఫాక్ట‌రీ. పెద్ద మ‌హారాజు లాగా భారీగా ఆజ్ఞ‌లు జారీచేస్తూ ఉంటాడు. మేం మ‌నుషుల్లాగా ఆయ‌న‌కి క‌న‌ప‌డం. క‌నీసం పిల్లుల‌నూ కుందేళ్ళ‌నూ చూసిన‌ట్లుగా కూడా మ‌మ్మ‌ల్ని చూడ‌డు. నేనా సెక్ష‌న్‌లో ప‌న్చెయ్య‌లేను మ‌రో సెక్ష‌న్‌కి మార్పించండి అంటాడు. వీళ్ళిద్ద‌రికీ ఈ మ‌ధ్య ఎమ‌య్యిందో ? ఇదివ‌ర‌కు ఎంతో క‌లిసి క‌ట్టుగా ఉండేవారు. ఇద్ద‌రూ క‌ల్సిఫాక్ట‌రీకి ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు తేవ‌డ‌మేకాదు మాన‌వాళి కెంతో ఉప‌యోగ‌ప‌డే కొత్త కొత్త మందుల‌ను క‌నిపెట్టి దేశ‌సేవ చేశారు. అస‌లు కిటుకు ఎక్క‌డ వుందో క‌నిపెట్టి వీళ్ళత‌గాదాను మాన్పిస్తేగాని లాభంలేదు. వీళ్ళ‌త‌గాదాలో ప్రొడ‌క్ష‌న్ కుంటుప‌డుతోంది ఎంప్లాయిస్‌లో చీలిక‌కూడా వచ్చే ప్ర‌మాదం క‌న్పిస్తోంది.

ఇదిచాలా సున్నిత‌మైన స‌మ‌స్య మేనేజ‌ర్ రాజు సాయంత్రం వాళ్ళిద్ద‌ర్నీ త‌న‌రూమ్‌కి పిలిచిమాట్లాడాల‌ని నిర్ణ‌యించుకొని ఆనాటివ‌ర్క్ చూసుకోడంలో లీన‌మైపోయాడు.

మ‌ధ్యాహ్నం టీబ్రేక్ స‌మ‌యానికి డాక్ట‌ర్ కోచ్క‌ర్ ద‌గ్గ‌ర్నుంచి మేనేజ‌ర్ రాజుకి ఒక రిపోర్టు వ‌చ్చింది. అత‌ను ఏదైతే జ‌ర‌గ‌కుండా ఉండాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ్డాడో అది జ‌రిగేపోయింది. కోచ్క‌ర్‌, పోచ‌య్య ఇద్ద‌రిలో ఎవ్వ‌రూ త‌గ్గ‌టంలేదు. త్రాటిని బ‌లంగా లాగుతున్నారు. రిపోర్టును చ‌ద‌వ‌డంలో నిమ‌గ్నుడైనాడు రాజు.

రాజు టేబిల్ మీద ఉన్న ఎక్ట్సెన్ష‌న్ నంబ‌ర్ 2 ఇంట‌ర్ కామ్ బ‌జ్జ‌ర్ మ్రోగింది. య‌స్‌.రాజుహియ‌ర్‌. న‌మ‌స్తేసార్‌. నేను కోచ్క‌ర్‌ని మాట్లాడుతున్నాను. పోచ‌య్య‌ను డిస్మిస్ చేశారా స‌ర్. అత‌ని గొంతులో కోపం ఆత్రుత స్ప‌ష్టంగా తెలుస్తూ ఉన్నాయి.

ఇప్పుడే మీరిపోర్టు అందింది. ఇంకా చ‌ద‌వ‌డం పూర్తి కాలేదు. మేనేజ‌ర్ చాలా  సౌమ్యంగా నింపాదిగా అన్నాడు.

స‌రేస‌ర్‌. చ‌దివిన‌వెంట‌నే డిస్మిన్ చేసి పారెయ్యండి.రాజు ప‌క‌ప‌కా న‌వ్వాడు. ఇంట్లో అంట్లుతోమే ప‌నిమ‌నిషిని కూడా స‌డ‌న్‌గా మాన్పించ‌లేంగ‌దా డాక్ట‌ర్ ! పోచ‌య్య స్కిల్డ్ అసిస్టెంట్‌. అత‌ను ప‌ధ్నాలుగు సంవ‌త్స‌రాల‌నుంచి ఈ ఫాక్ట‌రీలో పనిచేస్తున్నాడు...రాజు చెప్పే మాట‌ల‌ను వినకుండా మ‌ధ్య‌లోనే అడ్డువ‌చ్చి నాకూ ప‌న్నెండేళ్ళ స‌ర్వీసు ఉందిక‌దా స‌ర్‌, నా కంప్లెయిట్ మీకు  అబ‌ద్ధంగా క‌న్పిస్తోందా లేక నా స‌ర్వీసెస్ కంటే పోచ‌య్య స‌ర్వీసెస్ ఎక్కువ ఫాక్ట‌రీకి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని మేనేజ్‌మెంట్ భావిస్తోందా తొంద‌ర తొంద‌ర‌గా మాట్లాడేశాడు. కోచ్క‌ర్‌.

కోచ్క‌ర్ మీరు ఆవేశంలో ఉన్నారు ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్ళు ఇక్క‌డ ఆర్డ‌ర్స్ పాస్ చెయ్య‌కూడ‌దు. రూల్సు రెగ్యులేష‌న్సూ ప్రొసీజ‌ర్సూ ఇవ‌న్నీ ఉంటాయి క‌దా ! గ‌వ‌ర్న‌మెంటు చేతా కోర్టుల చేతా ఇలా ఎందుకు చేశారు అనేమాట రాకుండా లా ప్ర‌కారం న‌డ‌వాల్సిన బాధ్య‌త మ‌న‌కు ఉంది క‌దా ! ఇంట‌ర్ కామ్‌డిస్క‌నెక్ట్స్ చేశాడు రాజు.

అది నియోమెడోలా లిమిటెడ్ కంపెనీ. జ‌ర్మ‌న్ కొలాబ‌రేష‌న్‌తో అక్క‌డ ఎన్నో విలువైన మందులు త‌యారవుతూ ఉంటాయి. ఇటీవ‌ల బ్ల‌డ్ కాన్స‌ర్‌ను అరిక‌ట్టే ఒక క్రొత్త మందును ఈ కంపెనీ వారు క‌నిపెట్టార‌ని అంద‌రూ చెప్ప‌కొంటున్నారు. ఈ వ్యాధిరాకుండా వాక్సిన్‌ని కూడా త‌యారు చేసేందుకు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. సంవ‌త్స‌రాంతంలో జ‌రిగే అంత‌ర్జాతీయ వైద్యుల మ‌హా స‌భ‌ల‌లో ఈ మందును గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా వెల్ల‌డిస్తారు. ఈ పరిశోధ‌న‌ల్లో డాక్ట‌ర్ కోచ్క‌ర్‌కూ పోచ‌య్య‌కూ ఎంతో ముఖ్య‌పాత్ర ఉంది. ఈ చివ‌రి ద‌శ‌లో వీరిద్ద‌రూ విడిపోతేచాలా క‌ష్టం. అందుకే స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించాల‌ని మేనేజ‌ర్ రాజు శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తున్నాడు.

అదీకాక ఏంటీటిట‌న‌స్ సీర‌మ్‌ను భారీ యెత్తుగా విదేశాల‌కు ఎగుమ‌తిచేస్తున్నారు. స్వదేశంలో ఉప‌యోగించే మందులో మూడవ‌వంతు ఇక్క‌డ‌నుంచే మార్కెట్లోకి ర‌వాణా అవుతుంది. గుఱ్ఱ‌పు వాతం అనే వ్యాధిని నయం చేయ‌డానికి ఈ మందును ఉప‌యోగిస్తారు. ఈ మందు మ‌స్క్యుల‌ర్ ఇంజ‌క్ష‌న్ గానే వాడాలి. కానీ నియోమెడోలా కాప్సూల్స్‌ను కూడా త‌యారు చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇంజ‌క్ష‌న్ ప్రాణాల‌ను ర‌క్షించ‌డ‌మేగాకుండా ఒక్కోప్పుడు ప్రాణాల‌ను తీసేంత‌గాకూడా రియాక్ష‌న్స్‌ని క‌ల్గిస్తుంది. లాబ్స్‌లో త‌యార‌యిన మందును  ముందుగా జంతువుల మీద ప్ర‌యోగించి ఎలాపనిచేస్తుందో క‌నిపెడ‌తారు. ప్ర‌మాద‌క‌ర‌మైన రియాక్ష‌న్స్ క‌లిగించి ఎ.టి.ఎస్‌.ను నిర‌పాయ‌క‌రంగా చేయ‌డానికి నియోమెడోలా క్వారిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఆహోరాత్రులూ శ్ర‌మిస్తూనే ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఎన‌లిట‌క‌ల్ సెక్ష‌న్‌లోని జంతువుల మీద అనేక ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. డాక్ట‌ర్ కోచ్క‌ర్ జంతు ప్ర‌యెగ‌శాల‌లో పోచ‌య్య‌కుడ్యూటీ వేశాడు. డ్యూటీస్లిప్ పుచ్చుకున్న వెంట‌నే పోచ‌య్య కోచ్క‌ర్ ద‌గ్గ‌ర‌కు సుడిగాలిలా వ‌చ్చిప‌డ్డాడు. ఈ డ్యూటీ ఇంకోరికీ వెయ్యండి అన్నాడు. ఎవ‌రికి డ్యూటీ వెయ్యాలో చెప్పాల్సిన వాడివినువ్వా కోపంగా అన్నాడు డాక్ట‌ర్ కోచ్క‌ర్‌. ఇద్ద‌రికి మాటామాటా పెరిగి పోయింది. పోచ‌య్య సెల‌వుపెడ‌తాన‌న్నాడు. కోచ్క‌ర్ సెల‌వుగ్రాంటు చెయ్య‌న‌న్నాడు.వెంట‌నే తెల్ల‌కాయితంమీద సెల‌వుకావాల‌ని రాసి ఇయ్య‌బోయాడు. కోచ్క‌ర్ తీస‌కునేందుకు నిరాక‌రించేస‌రికి పోచ‌య్య కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆ సెల‌వు చీటీని ఉండ‌లాచుట్టి కొచ్క‌ర్ మొఖానికేసి బలంగా కొట్టి చ‌ర‌చ‌రా న‌డిచిపోయాడు. ఈ విష‌యాల‌న్నీ విపులంగా వ్రాసి ఉన్న కోచ్క‌ర్ రిపోర్టును మ‌రోసారి చ‌దివాడు మేనేజ‌ర్ రాజు.

1-8-1984 టైమ్ 11-30. నా లేబోరీట‌రీ ఆఫీసులో ఛీప్ కెమిక‌ల్ ఎన‌లిస్ట్ రామానంద్‌తో ముఖ్య‌విష‌యాలు చ‌ర్చిస్తూ ఉన్నాను. స్టెనో టైపిస్ట్ ప్ర‌భాక‌ర్ మేము చెప్పిన విష‌యాలు నోట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంత‌లో లాబ్ అసిస్టెంట్  పోచ‌య్య వ‌చ్చినాతో అన‌వ‌స‌రంగా వాగ్వాదం పెట్టుకున్నాడు. నేను వేసిన డ్యూటీ చేయ‌డానికి నిరాక‌రించ‌డేమ‌గాక న‌న్ను మిక్క‌లి అవ‌మాన ప‌ర‌చేవిధంగా పేప‌ర్ బాల్‌ని నా మొఖాన విసిరికొట్టాడు. పోచ‌య్య నాకు చేసిన అవ‌మానానికి ప్ర‌త్య‌క్ష సాక్షులు మిస్ట‌ర్ రామానంద్ మిస్ట‌ర్ ప్ర‌భాక‌ర్‌లు ఈ పోచ‌య్య చ‌ర్య‌క్ష‌మించ‌రానిది క‌నుక‌వెంట‌నే అత‌డిని డిస్మిస్ చేయ‌వ‌లెన‌ని కోరుతున్నాను ఇదీ కోచ్క‌ర్ రిపోర్టు.

పోచ‌య్య వ‌చ్చి మేనేజ‌ర్‌తో మాట్లాడాడు. పోచ‌య్య‌కు రాజుప‌ట్ల  గౌర‌వాభిమానాలూ భ‌య‌భ‌క్తులూ ఉన్నాయి. ఒక‌సారి పోచయ్య ఉద్యోగం ఊడిపోవాల్సిందే. మేనేజ‌ర్ రాజు చాక‌చ‌క్యంతో పోచ‌య్య‌నుఆ ఉప‌ద్ర‌వం నుండి ర‌క్షించాడు. అప్పుడు పోచ‌య్య‌కు డ‌బ్బుచాల‌క ప‌క్క‌దారులు తొక్కేవాడు. రాజునోటీస్‌లోకి అవివ‌చ్చేస‌రికి ర‌జాఉ మంద‌లించి వ‌దిలేసాడు. అప్ప‌డు పోచ‌య్య ఇంకొక కొత్త‌ప్లాను వేసి డ‌బ్బుగ‌డించ‌డం మొద‌లు పెట్టాడు. కానీ ఇక్క‌డా దుర‌దృష్టం ఎదుర‌య్యింది పోచ‌య్య‌కి. ఈసారి పొర‌పాటు ఇ.ఎస్‌.ఐ కార్పొరేష‌న్ మేనేజ‌ర్‌ది. అత‌నొక‌నాడు మేనేజ‌ర్ రాజుకి ఫోన్‌చేసి మీ కంపెనీలో లాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఉన్న పోచయ్య‌కు ఇ.ఎస్‌.ఐ వారంరోజులు లీవ్‌గ్రాంట్ చేసింది. ఆ వారానికి మీరు ఇ.ఎస్‌.ఐ  బెనిఫిట్స్ ఇయ్య‌లేద‌ని మాకు కంప్లెయింట్ వ‌చ్చింది వెంట‌నే అత‌నికి రావ‌ల్సిన మ‌నీ ఇచ్చెయ్యండి. అన్నాడు మేనేజ‌ర్ రాజు వెంట‌నే ఎస్టాబ్లిష్ మెంట్ సెక్ష‌న్ హెడ్‌ని పిలిచి వివ‌రాలు తెల‌సుకున్నాడు. సారి ఆవారం పోచ‌య్య‌కు మెడిక‌ల్ బెనిఫిట్స్ రావు ఎందుచేత ఆ రోజుల్లోపోచ‌య్య కంపెనీకి వ‌చ్చాడు. డ్యూటీచేసిన‌ట్లు పంచ్ కార్డ్‌, అటెండెన్స్ రిజిష్ట‌రు పేమెంట్ రిజిష్ట‌రు అన్నీ నిరూపిస్తున్నాయి. అదే పీరీడ్‌లో మెడిక‌ల్ లీవు ఇచ్చిన‌ట్లు మీ స‌ర్టిఫికెట్లు చెబుతున్నాయి. అందుచేత‌, ఇ.ఎస్.ఐ బెనిఫ‌ట్స్ ఇవ్వ‌డానికి వీల్లేదు. మేం స‌ర్టిఫికెట్ ఇచ్చాక మీరు రెఫ్యూజ్ చెయ్య‌డానికి వీల్లేదు అన్నాడు ఇ.ఎస్‌.ఐ. మేనేజ‌రు, అత‌ను అంత‌టితో ఆగ‌క నియోమెడోలా మేనేజ‌ర్‌ని ప్రాసిక్యూట్ చేయిస్తాన‌ని బెదిరించాడు కూడా. మేనేజ‌ర్ రాజు నిదానంగా అన్నాడు. మీ స‌ర్టిఫికెట్ 14-8-72వ తేదీన ఇచ్చిన‌ట్లుగా ఉంది. కాని పోచయ్య‌ని మీరు ప‌రీక్షించిన తేది 28-8-72 అవిరికార్డులో ఉంది. అంటే ఏమిట‌న్న‌మాట‌. ఇంకా ప‌ధ్నాలుగు రోజుల‌కు పోచ‌య్యకు జ‌బ్బుచేస్తుంద‌ని క‌ల‌గ‌ని ముందే మెడిక‌ల్ లీవ్ గ్రాంటు చేశారా. ఇది దొంగ స‌ర్టిఫికెట్ అని మీరు వ్రాసిన తేదీల ప్ర‌కార‌మే నిరూపించ‌గ‌ల‌ను. ఈ మేట‌ర్ని డైర‌క్ష‌ర్ ఆఫ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్‌కి రిపోర్టు చేస్తాను. అని రాజు ఫోను పెట్టేశాడు. త‌రువాత ఇ.ఎస్‌.ఐ మ‌నేజ‌రు వ‌చ్చి త‌ప్ప‌యిపోయింద‌ని బ్ర‌తిమిలాడుకొన్నాడు. విష‌యాన్ని అంతటితో ఆపేయ‌మ‌ని వేడుకొన్నాడు. మేనేజ‌ర్ రాజు అంత‌టితో ఆపి వేశాడు. ఈ విష‌యం పై వారిదాకా వెడితే ఇ.ఎస్‌.ఐ మేనేజ‌ర్ ఉద్యోగ‌మే కాదు, పోచ‌య్య ఉద్యోగం కూడా ఊడిపోతుంది. పోచ‌య్య వ‌ర్క్ మీద మేనేజ్‌మెంట్‌కు ఎంతో కాన్ఫిడెన్స్ ఎంతో చిన్న కార్మికుడిగా కంపెనీలో చేరి స్వ‌యంశ‌క్తితో పైకి వ‌చ్చాడు. ప‌నిచెయ్య‌డంలో ఎంతో శ్ర‌ద్ధ‌. ఎంతో మెల‌కువ‌తో తెలివితో వ్య‌వ‌హ‌రిస్తాడు. శ‌రీర శ్ర‌మే కాకుండా బుద్ధిని ఉప‌యోగించి కంపెనీకెంతో లాభం వ‌చ్చేలా చేశాడు. సంసారం పెద్ద‌ద‌వ‌డం ఖ‌ర్చులు పెరిగి పోవ‌డంతో జీతం చాల‌క డ‌బ్బు క‌క్కుర్తితో చిన్న చిన్న పొర‌పాట్లు చేస్తూంటాడు.

 

చూసీ చూడ‌న‌ట్లు ఊరుకోవ‌డం క‌న్నా అత‌ని త‌ప్పులు తెలిసికొన్నామ‌న్న విష‌యం అత‌నికి తెలియ‌చేసి మంద‌లించి వ‌దిలెయ్యాల‌న్న మేనేజ‌ర్ రాజు అభిప్రాయంతో మేనేజింగ్ డైర‌క్ట‌ర్స్ ఏకీభ‌వించారు.

రాజు అత‌నికి లేబ‌ర్ క్వార్ట‌ర్స్ ఇప్పించి ప్ర‌మోష‌న్‌ను ఆప‌కుండా చూసి పోచ‌య్య‌కు ఎంతో మేలు చేశాడు. ఆర్ధికంగా అత‌ని ప‌రిస్థితి మెరుగుపడ్డాక పోచ‌య్య మ‌ళ్ళీ ఎటువంటి పొర‌పాటూ చెయ్య‌లేదు. మేనేజ‌ర్ అంటే అత‌నికి దేవుడే. అత‌డు ఏంచెయ్య‌మంటే అది చేస్తాడు.

కోచ్క‌ర్‌తో పోచ‌య్య‌కు త‌గాదా ఎందుకు వ‌చ్చిందో తెల్సుకుంటే చిక్కుముడి విడ‌తీయ‌చ్చు. కానీ ఎవ‌రూ తేల‌డంలేదు.

పోచ‌య్య ఏనిమ‌ల్ హౌస్‌లో డ్యూటీకి వ‌చ్చాడు. ఆరోజు మూడుర‌కాల మందుల‌కు ప్ర‌యోగాలు చెయ్యాలి. అందుకు పోచ‌య్య తెల్ల ఎలుక‌ల‌నీ కుందేళ్ళ‌నీ పిల్లుల‌నీ సిద్ధంచేశాడు. ఈ మూడు ర‌కాల వివ‌రాలు పోచ‌య్య‌చాలా స‌మ‌ర్ధ‌వంతంగా ఎన‌లైజ్ చేసి రిపోర్టు త‌యారు చేయ‌గ‌ల‌డు. ఇత‌ని క్రింద వ‌ర్క్ చేయ‌డానికి ముగ్గురు అసిస్టెంట్స్ కూడా హాజ‌రైనారు. మామూలుగా ఈ ప‌నే ఇంకొక‌రైతే ఒక్క‌రి సూప‌ర్‌విజ‌న్ క్రింద జ‌ర‌గ‌డానికి చీఫ్ వొప్పుకోడుకాని పోచయ్య‌కి ఎక్ట్ర్సా ఆర్డిన‌రీ ఎబిలిటీస్ ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.

పోచ‌య్య ముందు కుందేళ్ళ‌ను ప్రేమ‌గా అందుకున్నాడు. ఈ జంతువులంటే అత‌నికి వ‌ల్ల మాలిన ప్రేమ‌. వాటికేజెస్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు డెట్టాల్‌తో క‌డిగించి శుభ్రంగా వుండేలా చూస్తాడు. వాటికి నీళ్ళూ, ఆహార‌మూ వేళ కందేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. ఏ జంతువు ఎలా ప్ర‌వ‌ర్తిస్తోందో ఏది ఏ అనారోగ్యానికి లోనైందో దేని అవ‌స‌రం ఏమిటో వెంట‌నే గ్ర‌హించేస్తాడు. ఒక ర‌కంగా వాటి భాష అతడికి తెలుస‌న్నా అతిశ‌యోక్తి కాదు. డ్యూటీలో చేరాక ప‌ని పూర్త‌యితే గాని క‌ద‌ల‌డు ఎంత టైమైనాస‌రే. మందుల‌ను ఎక్జామిన్ చెయ్య‌డానికి ఇంజ‌క్ష‌న్స్  ఇచ్చిన జంతువుల‌ను ఎంతో జాగ్ర‌త్త‌గా వాచ్ చేస్తాడు.తానేస్వ‌యంగా ఇంజ‌క్ష‌న్ ఇచ్చి టెంప‌రేచ‌ర్ రికార్డుచేసి డ్ర‌గ్ రియాక్ష‌న్ నోట్ చేస్తాడు. వెంట‌నే దానికి ఆంటీడోస్‌గా మెడిసిన్ వాడి ఆ జంతువుకు వెంట‌నే బాధ నివార‌ణ అయ్యేలా చూస్తాడు. జంతువు రియాక్ష‌న్ వ‌ల‌న చ‌నిపోకుండా శాయ‌శ‌క్తులా పాటుప‌డ‌తాడు. నైట్‌డ్యూటీలో కూడా విశ్రాంతి తీసుకోకుండా గ‌డియారంలా ప‌నిచేస్తాడు. అబ్స‌ర్వేష‌న్ చార్టును అత‌ను త‌యారుచేస్తే ఇంక ఎవ‌రూ మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూసుకోనక్క‌ర‌లేదు. విష‌యంచాలా వివ‌రంగా దోష‌ర‌హితంగా స్ప‌ష్టంగా కంప్లీట్‌గా రాస్తాడు.

తాను మందును ఇంజ‌క్ట్ చేసిన తెల్ల ఎలుక క్ష‌ణాల్లో మ‌త్తుగాప‌డిపోయింది. ఒళ్ళువెడిక్కిపోయింది. శ్వాస‌చాలావేగంగా పీలుస్తోన్న‌ట్లుగా డొక్క‌లు ఎగిరెగిరి ప‌డుతున్నాయి. కుందేలు ప‌రిస్థితి కూడా ఆందోళ‌న క‌రంగా ఉంది. ఒకే మందు ఇచ్చినా ఆడ‌పిల్లి ఏక్టివ్‌గా వుంటే మ‌గ‌పిల్లి బాధ‌తోగిల‌గిల్లాడి పోతోంది. పోచ‌య్య చాలా ఆందోళ‌న ప‌డ్డాడు. ఏఏ ఇంజ‌క్ష‌న్స్ వేటికి చెయ్యాలో అసిస్టెంట్స్‌కి పుర‌మాయించాడు. కుందేలును ఒళ్ళోపెట్టుకొని ఐస్ క్లాత్‌తో ఒళ్లు తుడిచి సేవ‌చేశాడు. మూడు గంట‌ల‌క‌ల్లా అత‌ని డ్యూటీ టైమ్ పూర్తి అయిపోతుంది. త‌రువాత వ‌చ్చే వాడికి త‌న అబ్స‌ర్వేష‌న్స్ ఇచ్చి, చెప్పి వెళ్ళిపోవ‌చ్చు. కానీ పోచ‌య్య రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ ఆ జంతువుల‌న్నీ కొంత కోలుకుంటున్నాయ‌న్న న‌మ్మ‌కం వ‌చ్చే వ‌ర‌కూ వుండి డ్ర‌గ్‌రియాక్ష‌న్ ఎలావుందో కంప్లీట్‌గా నోట్ త‌యారు చేసి మ‌రీ ఇంటికి క‌దిలాడు. అతనికి త‌న స్వంత‌పిల్ల‌లు ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డినంత ఆనందంగా ఉంది. ప్రొద్దుటినించీ ఆహారం తిన‌క టీ నీళ్ళ‌మీదే కాల‌క్షేపం చేసి టిఫిన్ బాక్సులో ఉన్న చ‌పాతీల‌ని ఇంటి ముందు కునుకు తీస్తున్న కుక్క‌కు వేసాడు. ఇంటి ముందు లేబ‌ర్ లీడ‌ర్స్ రెడ్డి, న‌ర్సింహ పోచ‌య్య కోసం ఎద‌రుచూస్తూ కూర్చొని ఉన్నారు. ఉస్సురంటూ వాళ్ల ప‌క్క‌న కూర్చున్నాడు ఏం పోచయ్యా ఏదోగోడ‌వైందిట రెడ్టి మాట‌ల‌కు పోచ‌య్య స‌మాధానం చెప్ప‌లేదు. కోచ్క‌ర్ సాబ్ రిపోర్టు చేయ‌డం. మేనేజ‌ర్ సార్ నిన్ను క్ష‌మాప‌ణ చెప్పుకోమ‌న‌డం నిజ‌మేనా న‌ర్శింహ నిగ్గ‌దీశాడు. పోచ‌య్య త‌ల‌వంచుకొని నిజ‌మేన‌న్నాడు. అంతా నీ యిష్ట‌మేనా ?  యూనియ‌న్‌ని సంప్ర‌దించ‌వ‌ద్దా ఇద్ద‌రూ ఒక్క సారే అన్నారు.

 

ఇందులో యూనియ‌న్ సంబంధ‌మేం లేదు. నేను త‌ప్పుచేశాను కోచ్క‌ర్‌సాబ్‌ని కాగితం ఉండ‌చేసి మొహమ్మీద కొట్టిన మాట నిజం. అందుకే రాజుగారు చెప్పిన‌ట్లు క్ష‌మాప‌ణ‌కూడా చెప్పుకుంటాను పోచ‌య్య దృఢంగా అన్న మాట‌లు విని థూ అని ఉమ్మేసాడు రెడ్డి. ఇదినీ సొంత విష‌యంకాదు. నా సొంత‌మే. కోచ్క‌ర్‌కి నాకూ మ‌ధ్య‌నున్న‌ది కూడా వ్య‌క్తిగ‌త‌మైన త‌గాదాయే. పోచ‌య్యా నువ్వు ఒట్టి వెఱ్ఱివాడివి. వ్య‌క్తిగ‌త తగాదా అయితే మేనేజ్ మెంటు కెందుకు రిపోర్టు చేశాడు. ఈ బ్లాక్‌మార్క్ నువ్వు వ‌ప్పుకుంటే స‌ర్వీసులో ఉన్న‌న్నాళ్ళు ఉండిపోదూ న‌ర్శింహ న‌చ్చ‌చెప్పాడు. నువ్వు క్ష‌మాప‌ణ చెప్పుకొనే ప్ర‌శ్న‌లేదు. రెడ్డి ఖ‌చ్చితంగా ఆజ్ఞ‌జారీచేసేసి వెళ్ళిపోయాడు. పోచ‌య్య నీర‌సంగా మంచం మీద‌వాలి పోయాడు.

పొద్దున్న మేనేజ‌ర్ సాబ్ త‌న‌లోని త‌ప్పుల‌న్నీ ఎత్తి చూపాడు. సెల‌వుమంజూరు కాకుండా డ్యూటీని కాద‌ని వెళ్ళిపోవ‌డం. పై అధికారిని దూషించ‌డ‌మేకాకుండా  కొట్టి అవ‌మానించ‌డం నేరాల‌న్నాడు. వీటినుంచి తాను త‌ప్పించుకోలేడు. త‌ను చేసిన త‌ప్పుల‌న్నీటికీ యిజువులున్నాయి. సాక్ష్యాధారాలున్నాయి. ఉద్యోగం ఊడిపోతే ఇంత‌పెద్ద సంసారం ఏమైపోవాలి. త‌న పిల్ల‌లంద‌రూ ఆక‌లికి త‌ట్టుకోలేక బిచ్చ‌గాళ్ళుగా మారాల్సివ‌స్తుంది. మేనేజ‌ర్ సాబ్ చెబితే కోచ్క‌ర్ కూడా రిపోర్టు వెన‌క్కు తీసుకుంటాడు. క్ష‌మాప‌ణ ప‌త్రం రాత్రికి రాసి పొద్దున్న తీసికెళ్ళాల‌నుకొన్నాడు. ఇప్పుడీ యూనియ‌న్ గొడ‌వ‌వ‌చ్చిప‌డింది. వీళ్ళుసామాన్యులుకారు. వీళ్ళ‌ని కాద‌ని తానేం చెయ్య‌లేడు. పోచ‌య్య వేడిక‌న్నీళ్ళ‌తో దిండు ఆవిర్లు క‌క్కింది. భార్య ఎన్నిమాట్లు పిలిచినా భోజ‌నం చేయ‌క అలా ఉండిపోయాడు.

పోచయ్య వ్య‌వ‌హారం ఫ్యాక్ట‌రీలో పెద్ద క‌మీష‌న్‌ని లేవ‌దీసింది. ఫ్యాక్ట‌రీ లేబ‌ర్ యూనియ‌నూ రాజ‌కీయ లేబ‌ర్ పార్టీల నాయ‌కులూ జోక్యం క‌ల‌గ‌చేసుకొన్నారు. స‌మ‌స్య సులువుగా ప‌రిష్కార‌మై పోయే దాన్ని వీళ్ళు మ‌రింత కాంప్లికేట్ చేసేసి సూదిని తీసికెళ్ళి దూలానికి గుచ్చుతున్నారు.

 

పోచ‌య్య‌ను క్ష‌మాప‌ణ చెప్ప‌మ‌న‌డం కోచ్క‌ర్ కూడా న‌చ్చ‌లేదు. నాకు చేసిన అవ‌మానం, ఫ్యాక్ట‌రీకి మేనేజ్‌మెంట్‌కి చేసిన‌ట్లుకాదా ఇదిక్ష‌మాప‌ణ‌తో పోతుందా అని మేనేజింగ్ డైరెక్ట‌ర్స్‌ని రెచ్చ‌గొట్టాడు. వాళ్ళ‌కి యూనియ‌న్ వుంటే మ‌న‌కి ఉండ‌దా సార్ అంటూ అగ్నికి ఆజ్యం పోశాడు. పోచయ్య‌ని వెంట‌నే డిస్మిస్ చెయ్య‌మ‌ని మేనేజ‌ర్ రాజును ఒత్తిడి చేశాడు. డైర‌క్ట‌ర్స్ చేత‌కూడా చెప్పించాడు. డాక్ట‌ర్ కోచ్క‌ర్ మీ కంప్లెయింట్ మీద చ‌ర్య తీసికోవ‌ల్సిన డ్యూటీనాది. నా డ్యూటీ న‌న్ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ నీయండి అని రాజు సంభాష‌ణ‌ను పొడిగించ నీయ‌కుండా చేశాడు.

కోచ్క‌ర్ రిపోర్టు మీద డిపార్ట్‌మెంట‌ల్‌గా ఎంక్వ‌యిరీ చేయించ‌డం ఫ‌స్ట్‌స్టెప్ మేనేజ‌ర్ రాజు ఆదేచేశాడు. అక్కౌంట్స్ సెక్ష‌న్ సూప‌రింటెండెట్ కోట‌య్య‌ని ఇందుకు ఎవ్వ‌రికైనా అభ్యంత‌ర‌ముంటే మూడురోజుల‌లోగా తెలియ‌చేసుకోవాల‌నీ ఆ త‌రువాత పోచ‌య్య మీద వ‌చ్చిన రిపోర్టును విచార‌ణ‌చేసి మేనేజ‌రుకు కోట‌య్య యదార్ధ విష‌యాల‌ను తెలియ‌చేస్తాడు కాబ‌ట్టి కోట‌య్య‌కు స‌హ‌క‌రించ‌వ‌ల‌సిందిగా అభ్య‌ర్థిస్తూ మేనేజ‌ర్ ఒక నోటీసును జారీ చేశాడు.

నాయ‌కులంద‌రూ మేనేజ‌ర్ రూమ్‌లోకి వ‌చ్చారు. సార్ ఈ ఎంక్వ‌యిరీ మానెయ్యండి.

ఓ. య‌స్‌. త‌ప్ప‌కుండా మాన్పిస్తాను. మార్గం ఏమిటో చెప్తారా రాజువారి వంక న‌వ్వుతూ చూశాడు.

కంప్లెయింట్ డ్రాప్ చేసెయ్య‌డ‌మే మార్గం రెడ్డి తేల్చివేశాడు.

స‌రే కంప్లెయింట్ డ్రాప్ చేసేందుకు కూడా ఏదో ఓక మార్గం ఉండాలి క‌దా రాజు మాట‌ల‌కు అడ్డుత‌గులుతూ అన్నాడు న‌ర్శింహ‌.