దైవలీల

గోపీకృష్ణ‌

ఎమ్‌.కామ్ పూర్తి చేసుకుని అప్పుడే ఉద్యోగాల వేట‌లో అడుగు పెట్టాడు. అయినా అత‌నికి తెల్సు - ఉద్యోగాల‌నేవి రాసులుపోసి లేవ‌నీ, త‌న బోటి గాడికంత తేలిగ్గా రావ‌నీను త‌న బోటిగాడంటే -

ఏమిటో ?  అని కొంద‌రికి అనుమానం వ‌స్తుంది కానీ చాలా మందికి తెల్సు. పైన త‌న‌కెవ‌రూ గాడ్ ఫాద‌ర్ గానీ, పోనీ కొనుక్కుదామంటే త‌గినంత త‌డి గానీ లేవ‌నీ !

అత‌గాడికి ఉద్యోగం చేస్తేగానీ రోజులు వెళ్ళ‌వ‌నే భ‌యంలేదు. అంటే పెద్ద‌లు సంపాయించిన మ‌డులూ, మాన్యాలూ ఉన్నాయ‌ని అర్థంకాదు. రోగంతో ద‌గ్గుకుంటూ కుక్కిమంచం మీద ప‌డుకున్న త‌ల్లికానీ, వ‌య‌సు చేసే గార‌డికి లోబ‌డి అన్న‌య్యా నా పెళ్ళెప్పుడు చేస్తావ్ అని అడ‌క్కుండా చూపుల్తోనే చెప్ప‌గ‌లిగే చెల్లాయిగానీ, అల్ల‌రి చిల్ల‌రిగా తిరిగే త‌మ్ముడుగానీ లేరు. ఒంటికాయ సొంఠికొమ్ములాగా త‌నొక్క‌డ్నీ పోషించుకుందుకో నాల్గు ట్యూష‌న్లూ, త‌ల‌దాచుకొందుకో చిన్న గూడూ వున్నాయ్‌. అదీ థీమా ! ఉద్యోగం వ‌చ్చిన‌ప్పుడే వ‌స్తుంది లెమ్మ‌ని మ‌హాధీర‌త్వంతో వుంటాడు.

ఊరికే తోచ‌క పండులాంటి ఓ ఉద్యోగానికి గుడ్డివాడి చేతిలో రాయిలాగా ఓ అప్లికేష‌న్ని విసిరాడు. ఇంట‌ర్వ్యూ కూడా వ‌చ్చి చావ‌ద‌నుకుంటూ నిశ్చింత‌గా వున్నాడు.

అనుకోకుండా ఇంట‌ర్వ్యూ శుభ‌లేఖ‌రానే వ‌చ్చింది. ఏం ప్ర‌శ్న‌ల‌డుగుతారో ?  అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో ర‌ష్యా అమెరికాల్లో దేన్ది పై చెయ్యి ?  భుట్టోగార్కి క్ష‌మాభిక్ష పెడ‌తారా ?  మాజి (ఇరాన్‌) ప్ర‌ధాని భ‌క్తియార్ విదేశాలు పారిపోయాడా లేక వాళ్ళే చంపి అలా వుకారు పుట్టించారా ?  వియ‌త్నాం యుద్ధంలో భార‌త్ ఏ ప‌క్షం వ‌హిస్తే బాగుంటుంద‌ని నువ్వ‌నుకుంటున్నావ్ ?  వేదాలు ఏ సంవ‌త్స‌రంలో రాశారు ?  వ‌గైరా వ‌గైరా కొరుకుడు ప‌డ‌ని ప్ర‌శ్న‌లు వేస్తారేమోన‌ని భ‌యంతో గ‌జ‌గ‌జ లాడిపోలేదు.

ఇదే నా మొద‌టి ఇంట‌ర్వ్యూ జీవితంలో ఎప్పుడు గుర్తొచ్చినా స‌ర‌దాగా న‌వ్వుకునేలాగా వుండాలి. అస‌లీ ఇంట‌ర్వ్యూ చేసే ప‌ద్ధ‌తులేవీ బాగా లేవ‌నీ డైర‌క్ట‌ర్స్‌ని ముప్ప‌తిప్ప‌లు పెట్టిమూడు చెరువుల నీళ్ళు తాగించాల‌ను కున్నాడు.

పెద్ద ఆఫీస‌ర్‌లా ఎరువుతెచ్చుకున్న సూటూబూటూ వేసుకుని స్ట‌యిల్‌గా వెళ్ళాడు ఆల‌స్యంగా.

బంట్రోతు గోపీకృష్ణ‌గారెవ‌రండీ అని అప్పుడే అక్క‌డున్న వాళ్ళ న‌డుగుతున్నాడు. నేనేనోయ్ అంటూ నిర్ల‌క్ష్యంగా నిల‌బ‌డి సిగార్ ముట్టించాడు. ఇంట‌ర్వ్యూ చేసేగ‌ది వ‌ర‌కూ వ‌చ్చి ఒక్క పీల్పుపీల్చి వాళ్ళంద‌రూ చూస్తుండ‌గానే కాలికిందేసి న‌లిపి ఆర్పేసాడు. ఆ ఊపుతో లోప‌లికి వెళ్ళాడుగాని  సిగ‌రెట్స్ అల‌వాటు లేక‌పోవ‌డంతో గొంతు కొఱ‌పోయి - విప‌రీతంగా ద‌గ్గు వ‌చ్చింది. ద‌గ్గ‌లేక మాన‌లేక నానా అవ‌స్థా ప‌డుతూ క‌ళ్ళ‌లో తిరిగిన నీళ్ళు తుడుచుకుంటున్నాడు. ఛైర్మెన్ రంగ‌య్య‌గారికి జాలివేసి వెంక‌న్నా గ్లాసుతో మంచినీళ్ళివ్వ‌వోయ్ అన్నాడు.

అప్ప‌టికే అక్క‌డి మిగ‌తా ఇంట‌ర్వ్యూయ‌ర్స్‌కి ఒళ్ళు మండిపోతోంది. ఏమిటీ ఈత‌ని పొగ‌రుబోతు వైఖ‌రి ?  పెద్ద‌రాజు గారి బామ్మ‌ర్థిలా ఫోజూ వీడూను న‌మ‌స్కార‌మ‌న్నా పెట్ట‌కుండా కూర్చున్నాడ‌ని లోలోప‌ల కారాలూ మిరియాలూ స‌మ‌పాళంగా నూరి ముద్ద‌చేస్తున్నారు. స‌మ‌యం చూసి వెళ్ళ‌క‌క్కుదామ‌ని. ఛైర్మెన్‌గారె స్వ‌యంగా మంచినీళ్ళిప్పించి కుశ‌ల‌మ‌డుగుతుంటే వీడెదో ఘ‌ట్టి ఇన్‌ప్లుయెన్స్‌వున్న ఘ‌ట‌మేమోన‌ని వాళ్ళ‌కి అనుమానం వేసింది.

ద‌గ్గు కొంచెం త‌గ్గాక కాస్త స‌ద్దుకు కూచున్నాడు. కాల‌రెగ‌రేసి ఎవ‌రేమి అడుగుతారో అడ‌గండి అన్న‌ట్లు, వీడెవ‌రి తాలూకో ఏమ‌డిగితే ఏంతంటానో అనుకుంటూ మేనేజింగ్ డైరెక్ట‌రూ సెక్ర‌ట‌రీ ఒక‌రి ముఖాలు ఒక‌ళ్ళు చూసుకోడంతో ఛైర్మెన్‌గారే మొద‌లెట్టారు.

నీ పేరేమిటోయ్ ?

నాపేరండీ గోపీ కృష్ణండి మాతా....చెప్ప‌నా ?  అన్న‌ట్లు భావ యుక్తంగా చూసే స‌రికి -

మీ తాత పేరు అక్క‌ర్లేదులేవోయ్ అని హాస్యం చేశారు. స‌హ‌జంగా హాస్య ప్రియులైన ఛైర్మెన్ గారు.

మునీశ్వ‌రుల శాపంలాగా పెద్ద జోకు వృధాకారాదు. న‌వ్వురాక‌పోయినా బాగుండ‌దు. ఆయ‌న ఏమ‌నుకుంటాడో అనే మొహ‌మాటంతో మిగిలిన స‌భ్యులిద్ద‌రూ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు.

వారి దంత సౌభాగ్యానికి గోపీకృష్ణ‌కు న‌వ్వాగ‌లేదు. వాళ్ళ‌లో బంగారప్ప‌న్నాయ‌నికి హేమ‌దంత్ అనీ ఒక ప‌న్ను బ‌య‌టికి పొడుచు కొచ్చినాయ‌న‌కి ఏక‌దంత్ అని ముద్దుపేర్లు మ‌నుసులోనే పెట్టుకున్నాడు.

హేమ‌దంత్‌గార‌డిగారు, నీ వ‌య‌స్సెంత ? 22 సంవ‌త్స‌రాల 9 నెల్ల 8 రోజులు వృచ్ఛిక రాశి, కుంభ‌ల‌గ్నం. మీకెవ‌ర‌న్నా పెండ్లికాని క‌న్య‌లుంటే చూసుకోండి అనే స‌వాల్ లాగా ధీమాగా అన్నాడు.

ఈ స‌మాధానానికి ఛైర్మెన్ సంతత‌చిద్విలాసంతో ఉండే ముఖార‌విందం ముడుచుకుపోయింది. ఏమిటీ త‌ల‌తిక్క స‌మాధానాలు అనుకున్నాడు గాని పైకి తేల్లేదు వీడి ధైర్య‌మేమిటి ?  ఏమ‌న్నా రిక‌మెండేష‌న్ బాప‌తా అని సందిగ్ధంలో ప‌డి ఉండ‌గానే ఏక‌దంతుడుగారు. సారీ సెక్ర‌ట‌రీ గారు ఇంత‌కీ దిక్కులెన్నోయ్ అన్నారు. ఉత్త‌రం ఏమ‌న్నా వుందా ద‌క్షిణ తెచ్చావా అన్న ఉద్దేశంతో నాకైతే ఒక్క‌టే దిక్కుసార్ అన్నాడు గోపీకృష్ణ. ఈ ఉద్యోగం ఎలాగా రాదు ద‌ణ్ణంపెట్టుకోడానికి ఒక్క తూర్పే గ‌దా ఉన్న‌ద‌నే భావంతో ఈ గుంభ‌న భోళాశంక‌రుడైన ఛైర్మెన్ గారికి తెలీలేదు. నీకున్న దిక్కు పేరేమిటి ? అన్నారు.

నాకున్న‌ది మీ బాస్‌కి బాస్‌కి బాస‌యిన శ్రీ‌శ్రీ‌శ్రీ ప‌ర‌మే  --

ఛైర్మెన్‌గారు ఒక్క ఉదుటున కంగారుగా పైకి లేచి క‌ళ్ళ‌జోడు తుడుచుకుంటూ గాభ‌రాతో స‌రిస‌రి ప‌ర‌మేశ్వ‌ర‌న్‌గారి కేండిడేటువా ?  ఇంత‌సేపూ చెప్ప‌వేమిటోయ్ ? అన్నాడు. మ‌న హెడ్ ఆఫీస్ మేనేజ‌ర్ గారి అన్న కొడుకు ర‌హ‌స్యంగా ప్ర‌క్క వాళ్ళ చెవిలో అన్నారు.

నేనే ప‌ర‌మేశ్వ‌ర‌న్ కేండిడేట్ నూ కాదండీ !  నేన‌న్న‌ది - మ‌న ప‌ర‌మే...మ‌ధ్య‌లో ఆపేసి ఇక చాల్లేవోయ్ మీ అంకుల్ చెప్ప‌నే చెప్పాడు. మావాణ్ణి ఏం ప్ర‌శ్నలూ వెయ్య‌ద్దు. అన్నీ నెగిటివ్ ఆన్స‌ర్స్ ఇస్తాడు. వాడిచేత సాధ్య‌మైనంత త‌క్కువ మాట్లాడించండి ఆవ‌టా అని - నాకు ఏ అంకుల్సూ లేరండీ అని చెబుతున్నా విన‌కుండా స్టెనోని పిలిచి వెంట‌నే ఆర్డ‌ర్స్ టైప్ చేయించి ఇచ్చేశారు. వాళ్ళ‌ని చిత్తుచేద్దామ‌ని త‌నే చితైపోయిన గోపీకృష్ణ ఆర్డ‌ర్స్ పుచ్చుకుని నీళ్ళు కారిపోయాడు.

సార్ మీరు పొర‌బ‌డుతున్నారు సార్ నాకీ ఉద్యోగం వ‌ద్దు సార్ అని బ్ర‌తిమాలుకున్నాడు. ఆద్గ‌రీ ! మీ అంకుల్ స‌రిగ్గా ఇల్లాగే చెప్పారు. వాడు ఉద్యోగం వ‌ద్దూ అంటాడు. బ‌టాచోర‌ల్లే తిర‌గ‌డం అల‌వాటైపోయింది మా కృష్ణ‌న్‌ని ఇంట‌ర్వ్యూకి పంపిస్తాను మిగ‌తాది నువ్వు చూడు అన్నారు. ఆయ‌న మాట కాద‌నే ధైర్యం నాకులేదు. ఇక మీరు వెళ్ళ‌చ్చు. వెంక‌న్నా నెక్స్‌ట్ కేండిడేట్ రామ్మోహ‌న్‌ని పిలు అన‌డంతో కాళ్ళీడ్చుకుంటూ వ‌చ్చేశాడు గోపీకృష్ణ‌.

ట్యూష‌న్ పిల్ల‌లు ఇంట‌ర్వ్యూ గుంట‌పెట్టి గంట‌వాయించేసింది గాబోలు. అందుకే అంత నిరుత్సాహంగా వున్నా డ‌నుకున్నారు. మాష్టారూ ఈ బోడి ఉద్యోగం రాక‌పోతే అంత‌బాధ ప‌డ‌తా రెందుకు ?  ఇంకోటి వ‌స్తుందిలెండి అన్నారు. ఈ సారి కాక‌పోతే ఇంకోసారి జాబ్ వ‌స్తుందిలెండి. మీలాగా మాకు పాఠాల్చెప్పే మాష్టారుదొర‌క‌రు అని వూర‌డించ‌సాగారు. అది కాదు నాకు జాబ్ వ‌చ్చింది అన్నాడు నీర‌సంగా. పిల్ల‌లు గ‌ల‌భా చేస్తూ పార్టీ ఇవ్వాల్సొస్తుంద‌ని ఏడుపు మొహం పెడ్తేమేం ఊరుకోం అని అరిచారు.

గోపీకృష్ణ స‌హ‌జంగానే చాలా తెలివి గ‌ల‌వాడు. త‌ను ప‌ర‌మేశ‌న్ గారి అన్న కొడుకు కాద‌ని తెలిస్తే అప్పుడే ఉద్యోగంనుండి పీకేస్తార‌ని చాలా జాగ్ర‌త్త‌గా ఎఫిషియెంట్‌గా త‌న డ్యూటి చేస్తూ అంద‌రిమెప్పులూ పొందుతున్నాడు. ఛైర్మెన్ గారి పెంపుడు కొడుక‌న్నంత‌గా ఆయ‌న అభిమానాన్ని సంపాదించాడు. ఆఫీస‌ర‌యినా వ్యూన్స్‌కి కూడా ఎంతో మ‌ర్యాద యిచ్చి అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకోగ‌ల్గాడు. ప్ర‌మోష‌న్‌లిస్టులో త‌న పేరు కూడా వుంద‌ని తెలిసి కూడా సంతోషించ‌లేక పోయాడు. ఎప్పుడు వూడిపోయే వుద్యోగ‌మో అనుకుంటూ.

వ‌స్తుందేమో అనుకుంటున్న ప్ర‌ళ‌యం రానేవ‌చ్చింది. ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇన్‌స్పెక్ష‌న్ కి వ‌చ్చాడు. ఛైర్మెన్ రంగ‌య్య‌గారు గోపీకృష్ణ‌న్ గురించి ఎంతో మెచ్చికోలుగా చెప్పారు. మీ కృష్ణ‌న్ బాగా తెలివి గ‌ల‌వాడు సార్‌. త‌ల‌తిక్క వాడ‌ని మీరు చెప్పారుగాని చాలా నెమ్మ‌ద‌స్తుడు. వ‌ర్క్ విష‌యంలో చాలా సిన్సియ‌ర్‌. ఇలాంటివాళ్ళు నా స‌ర్వీస్‌లో ఇద్ద‌రేసార్ అన్నాడు.

ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి అత‌డేమి చెబ్తున్నాడో తెలియ‌లేదు. ఏమిటీ మా అన్న కొడుకే సిన్సియ‌ర్ వ‌ర్క‌రా ?  చాలా బాగుంది. వాడిప్పుడు ఏదో క్రిమిన‌ల్ కేసులో ఇరుక్కున్నాడు. కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. నా పేరు చెప్పుకుని ఎవ‌డో మిమ్మ‌ల్ని బాగా చీట్ చేశాడు. ఏం దాఖ‌లు చూసుకుని మా అన్న కొడుక‌ని న‌మ్మారు ?  ఇదేనా మీ తెలివి ?  ఎందుక‌య్యా చేస్తున్నారు ఉద్యోగాలు ?  ఇప్పుడు ఏం కార‌ణంచెప్పి ఉద్యోగంనించి తీసేస్తారు. ఎందుకొచ్చిన ఛైర్మెన్ వ‌య్యా అని త‌ట్టి ఎక్క‌డ లూప్‌హోల్ క‌న్పిస్తుందా అని గోపికృష్ణ సెక్ష‌నంతా బాగా త‌నిఖీ చేశాడు.

పైకి అన‌కపోయినా లోప‌ల అనుకున్నాడు. మెరిక‌లాంటి కుర్రాడు ఇలాంటి వాళ్ళు నిజంగా ఆఫీస్‌కే ఎస్సెట్ అని అత‌న్ని పిలిపించి, బెదిరించాల‌న‌కున్నాడు.

గోపీకృష్ణ లోప‌ల చిన్న‌గా వ‌ణుకుతున్నాడు. ఇదే ఫ‌స్ట్ ఇంట‌ర్వ్యూ లాగా భ‌య‌ప‌డిపోతున్నాడు. ప‌ర‌మేశ్వ‌ర‌న్ గొంతు స‌వ‌రించుకున్నాడు. ఏమ‌య్యా నువ్వు నా అన్న కొడుకువా ?  అబ్బెబ్బెఎంత మాత్రం కాదండి. నేను ఎంత‌మొత్తుకున్నా కాద‌న్నా విన‌కుండా ఉద్యోగం ఇచ్చారండి. నేన‌న్న‌ది ప‌ర‌మేశ్వ‌ర‌న్ అని కాదండి...రుడు అందామ‌నుకునేలోగానే ప‌ర‌మేశ్వ‌ర‌న్ అని అనుకున్నారండి - రుడు అని న‌న్న‌నీ లేదండి. త‌ర‌వాత నా మాటేమీ విన‌లేదండి అన్నాడు.

ఓహో రుడాల్ఫ్‌గారా ?  భ‌లే వారు ఛైర్మెన్‌గారూ. మ‌న సెంట్ర‌ల్ ఆఫీస్ హెడ్‌. రుడాల్ఫ్‌గారు అదే మ‌నం రుడు అంటాం అత‌ని తాలూకోయ్ నీకు కంగారెక్కువ !  సారీ మిష్ట‌ర్ కృష్ణా నిన్ను అవ‌మానం చేస్తే క్ష‌మించు అని మేరేమీ మాట్లాడ‌కుండా వెళ్ళిపోయారు. సార్ సార్ అని పిలుస్తున్నా వినిపించుకోకుండా.

గోపీకృష్ణ ఈ సారి బాధ‌ప‌డ‌లేదు పైగా సంతోషించాడు. ఇది ప‌ర‌మేశ్వ‌రుడి లీల‌. నేన‌న్న ఒక్క‌ప‌దం ప‌ర‌మేశ్వ‌రుడి రంగ‌య్య గార్కి ప‌ర‌మేశ్వ‌ర‌న్ అనీ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గార్కి రుడు రుడాల్స్ అని తోపింప‌జేసింది. దైవ‌లీల అంటే ఇదే ఇదే.