జయంతి ఇక ప్రయాణం అవుతోంది. జయతి ఇంకా కొన్నాళ్ళు ఉండమని బలవంతం చేస్తోంది. అమ్మమ్మా అప్పుడే వెళ్ళిపోతావా ? హంసి బెంగగా అంది. ఆమె పెద్ద కళ్ళలో గిఱ్ఱున నీళ్ళు తిరగడం అందరూ చూశారు. ఆనందరావుగారు మనవరాల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మీ అమ్మమ్మ ఇప్పుడే వెళ్ళదు లేమ్మా. నే చెప్తాగా, ఇంకా కొన్ని నెలలుండమని అన్నారు. కొన్ని నెలలా ? జయంతి ఆశ్చర్యంగా అడిగింది.
నెలలో, సంవత్సరాలో నాకు తెలియదు. చిన్నారి హంసికి నువ్వంటే ప్రాణం జయంతీ. తను వాళ్ళమ్మా నాన్నా దగ్గరికి వెళ్ళేదాకానో, పెళ్ళయి అత్తారింటికి వెళ్ళేదాకానో నువ్వు మాతో ఉండక తప్పదు. అమ్మయ్యా ! బావగారు ఇంతటితో నాకు అనుజ్ఞ ఇచ్చారు. ఇంకా హంసితో అత్తవారింటికి కూడా వెళ్ళమననందుకు కృతజ్ఞురాలిని అంది జయంతి. అందరూ ఆమె మాటలకు నవ్వారు.
వెళ్దువుగానిలే అమ్మా జయంతీ అని జయతి కూడా ప్రేమగా చూస్తూ చెల్లిలి చెయ్యి పట్టుకుంది. జయతీ మీరిక్కడ నాకు పట్టుదారాలతో వలలు అల్లుతున్నారు. అవింకా దట్టం కాకుండానే నేను విడిపించుకుని వెళ్ళాలి ! ఇన్నాళ్ళూ ఒక దేశం, ఒక ఊరు, ఒక భాష అనకుండా తిరుగుతున్న నన్ను ఒకేచోట కట్టివేసి గోసంరక్షణ చేస్తున్నారు. దీంతో నాధ్యేయమే తారుమారయిపోతోంది ! అమ్మమ్మా నీ ధ్యేయం ఏమిటో మాకు తెలుసు కదా ! నీ ధర్మప్రచారినికి ఇక్కడ కూడా అనేకమంది వస్తున్నారు. దూరదూరాలనుండీ వస్తున్నారు కూడా కదా ! అసలు ముఖ్యంగా ఈ మనుమరాలినైన నా అజ్ఞానాన్ని పారద్రోలడం నీ కనీస బాధ్యత కదా ! ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు గాని, నువ్వు రచ్చ గెలిచావు, ఇంట కూడా గెలువు హంసి మాటలకి జయంతి ముసిముసిగా చిరునవ్వు చిందించింది.
అవునుగాని జయంతీ వచ్చేవారం ఆషాడ పౌర్ణమి అంది జయతి. అవును గురుపూర్ణిమ అంది జయంతి. ఈ సారి జ్ఞానస్వరూపిణి అయిన మీ చెల్లాయి మన ఇంట్లో వున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురుపూజా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరిపిద్దాం. ఆనందరావుగారు ఉత్సాహంగా అన్నారు. హంసి చాలా ఆనందించింది.
అమ్మమ్మా ఇంతకీ నీ గురువెవరు ? రేపు వచ్చే గురుపూర్ణిమకు నీవు గురుపూజ చేస్తావా ? అంది ఉత్సాహంగా. జయంతీ ! ఇంతవరకు నాకా ఊహే తట్టలేదు సుమా ! నీ గురువెవరు ? ఎవరు ఉపదేశం చేశారు ? నీవు అనుష్ఠానం చేసే మంత్రం షోడశాక్షరా ? అష్టాక్షరా ? పంచాక్షరా ? జయతి ప్రశ్నకు జయంతి నవ్వి వూరుకుంది. చెప్పేదాకా హంసి వదల్లేదు. హంసీ ! చిట్టితల్లీ ! నాకు గురువంటూ ఎవ్వరో ఒకరు లేరు. మహాత్ములందరూ నాకు పూజనీయులే ! ఇక మంత్రమంటావా.....? జయంతి చెప్పడానికి సంశయించింది. చెప్పు అమ్మమ్మా...హంసి జయంతి భుజం పట్టుకుని ఊపింది. రెండే అక్షరాలురా తల్లీ !. ఆ ! తెలిసిపోయింది, రామ కదూ, నీ ఊహ సగం నిజం, చివరి అక్షరానికి ఒత్తుపెట్టి మొదటి అక్షరమైన ర బదులుగా అ పెట్టు. కొంచెం గొణుక్కుని అమ్మ అంది హంసి. జయతికి, ఆనందరావుగారికి కూడా అమ్మ అని తెలిసింది. అవునురా తల్లీ ! అదే నా మహామంత్రం. ఇందులో ఏమేమి బీజాక్షరాలు ఉన్నాయి ? ఏమేమి అర్థాలు ఉన్నాయి ? అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. పిపీలికాది బ్రహ్మపర్యంతం సర్వప్రాణికీ జనని అయిన ఆ జగజ్జననిని అమ్మా ! అమ్మా ! అనుకుంటూ తలుచుకుంటూ ఆమె కోసం ఏడ్చుకుంటూ క్షణాన్ని దొర్లించడమే నా అనుష్ఠానం ! ఇందుకోసం నాకు ఏ నియమాలు, దీక్షలూ లేవు. ఇందుకోసం నాకు ఏ పూజ సామాగ్రి కూడా అక్కరలేదు. మీ బోటివాళ్ళు పళ్ళూ, పూలు, అగరొత్తులూ, నైవేద్యాలూ అమరిస్తే సంతోషం. అమర్చకపోయినా సంతోషమే !
అమ్మమ్మా ! అచ్చులో మొదట అచ్చయిన అకారమే నీ మంత్రానికి మొదటి అక్షరం, అం అ కలిపితే అమ్మ అవుతుందని జిల్లెళ్ళ మూడి అమ్మగారు అన్నారుట కదా ! ఇవన్నీ నీకు ఎలా తెలసుకున్నావు అన్నట్లు జయతి హంసిని ఆశ్చర్యంగా చూసింది.
అది నిజమేగాని మహా మహా అని గబగబా అన్నా అమ్మే అవుతుంది చూడు. అమ్మ అంటే చాలా గొప్ప. ఎంతో ఉన్నతం, ఎంతో శక్తిమంతం, ఎంతో కరుణాపూరం అయిన మహా...అన్నిటికన్నా ప్రతిజీవికీ మహాప్రేమని పంచే మహా నే అమ్మ అయింది. ఇలా కబుర్లు చెప్పుకుంటుండగానే జయంతి ఒళ్ళో పడుకున్న హంసి నిద్రపోయిందని తెలుసుకుని మాట్లాడటం ఆపేసి సన్నగా జోలపాట పాడింది. జో కొడుతుండగా -
జయతి ప్రశ్నించడం మొదలు పెట్టింది. నువ్వు దేవీ భాగవతం చదివావా ? చండీ పారాయణ చేశావా ? ఖడ్గమాల అందరూ చదవ కూడదంటారే ? ఇందుకు చాలా నియమాలు పాటించాలి కదా !
జయతీ నేను ఇందాక చెప్పినట్లు శాస్త్రప్రకారం దీపధూపాలతో పూజను ఎప్పుడూ చేయను. చాలారోజులు నేను రైల్లోనో, కార్లోనో ప్రయాణిస్తూ ఉంటాను. పూజలు చేయడమంటే మనసులో ధ్యానించుకోవడం కూడా పూజే కదా ! గీతలో కూడా మానసికమేన జపం శ్రేష్ఠమేని ఉంది కదా ! ఆ రోజుకి అందరూ విశ్రమించారు. జయతి మానసిక పూజ ఎలా ? అని ఆలోచిస్తూ నిద్రకు దూరమయ్యింది.
గురుపూర్ణిమకు ఆహ్వానితులు చాలామందే వచ్చారు. డాబామీద షామియానా వేశారు. ఆహ్వానిస్తున్నపప్పుడే జయంతి అందరికీ చెప్పింది. మీ మీ గురువుల చిత్రపటాలు తెచ్చుకోండి అని ఓహ్ ! ఎంతమంది గురువులు వేంచేశారో ! దత్తాత్రేయుల వారు, సాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్ణి, స్వామి నారాయణ్, కుసుమ హరనాథ్ బాబా, మెహర్ బాబా, శబరిమాత, బుద్ధుడు, మహావీరుడు, పరమహంస యోగానంద, మహావతార్ బాబా, యుక్తేశ్వరగిరి, లాహరీ మహాశయ, మాస్టర్ సి.వి.వి. ఇలా ఎందరో మహానుభావులు, యోగులు, సిద్ధపురుషులు, కారణ జన్ములు.
యువకులు అందంగా ఆ చిత్రపటాన్ని అమర్చారు. అందరికన్న పైన మౌనస్వామివారు, జయతికి ఇష్టదైవాలైన రాజరాజేశ్వరీ అమ్మవారు, శివచిదానంద భారతీస్వామి వారి పటాలను ఉంచారు. ఈ అన్ని పటాలకన్న పైన అతి పెద్దదైన చిత్రపటాన్ని చూచి అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా ఆ పటం చిత్రంగా వుంది. ఆకాశంలాంటి లేత నీలిరంగు, పసుపు వర్ణంతో మధ్యగా సంస్కృత లిపిలో ఓం కారం. దాని చుట్టూ సప్తవర్ణాలతో కాంతులీనే కిరణాలు. ఈ చిత్రాన్ని జయంతి సూచనలతో హంసికి సోదరుని వరుస అయిన నీలమోహనుడు కంప్యూటర్ మీద ప్రింట్ తీశాడు.
అతని స్నేహితుడు ఆ ఓంకార నుండి వెన్నెల వెలుగుల్లా సన్నని కాంతులను విరజిమ్ముతున్నట్లు వెండి రంగు రేడియం పెయింట్ వేశాడు. ఆ వెలుగుల తోరణాలు మిగిలిన గురువుల పటాలపై ప్రసరిస్తున్నట్లు విద్యుల్లతలలాంటి తళుకులను అంటించాడు. ఒక్కొక్క గురువుని తలుచుకుని నమః అంటే అష్టోత్తర శతనామార్చన పూర్తి అవుతుంది. పూలమాలలు ధూపదీపాలు భజనలు హారతులు పూర్తి అయ్యాయి. ఆహుతుల మనస్సుల భక్తి పూరితాలై ఆనందంతో పొంగి పొర్లిపోయాయి !
జయంతి మధురస్వరంతో ప్రార్థన చేసింది.
శుక్లాం బ్రహ్మవిచార సార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం
వీణాపుస్తక ధారణీ మభయదాం జాడ్యాంధకారాపహాం
హస్తే స్పాటిక మాలికాం విదధతీం పద్మాసనే సుస్థితాం
వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్దిప్రదాం శారదాం
మనకు అది గురువు సరస్వతి ! జీవకోటిని సృష్టించిన బ్రహ్మ తత్త్వంలోని పరమార్థసారమే ఆ తల్లి ! పర పశ్యంతి మధ్యమ వైఖరీ రూపిణియైన ఆ వాగ్దేవి మనకు సద్బుద్ధిని ప్రసాదించుగాక అని ప్రార్థించుకుందాం. ఒక్క క్షణం కనులు మూసుకుంది జయంతి. అందరినీ కనులు మూపుకుని సరస్వతీదేవిని భక్తితో నమస్కరించుకోమంది. అందరూ భక్తిప్రపత్తులతో మౌనంగా ప్రార్థన చేసుకున్నారు.
ఈ రోజు గురుపూర్ణిమ ! సనాతన వైదిక ధర్మంలో మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన మన గురువులను పూజించుకోడానికీ, తలుచుకోడానికీ ఈ పూర్ణిమను మన పెద్దలు ఎన్నుకున్నారు. ఇవాళ ఇక్కడ యువకులు వచ్చి శ్రధ్ద భక్తులతో పాల్గొనడం చాలా ఆనందించ దగ్గ విషయం. ముసలితనం వచ్చాక ఆధ్యాత్మికం వైపు మళ్ళుదాంలే అని అనుకొనేవారు కూడా ఉంటారు.
మీలో ఎవరైనా ఏమైనా అడగాలి అని అనుకుంటే అడగండి అంది జయంతి. నీలమోహనుడికి ఒక అనుమానం వచ్చింది. మాకు స్కూల్లో చేరిన దగ్గర నుండి ప్రతి సంవత్సరం చాలామంది మాస్టర్లు మారుతూ ఉంటారు. మేము ఎవరిని గురువుగా భావించి పూజించుకోవాలి ? అని అడిగాడు. నీ ప్రశ్నకు సమాధానంగా వేదకాలానికి వెళ్ళిపోవాలయ్యా నీలమోహనా ! గురువు అంటే ఒక మార్గదర్శి ! విజ్ఞాన మార్గదర్శి ! ఒక అరణ్యం వుంది. దారి తెలియక కష్టాలు పడకుండా కృరమృగాలు బారిపడకుండా తాను ముందునడిచి మనని నడిపించే గురుతర బాధ్యతను వహించేవాడు గురువు. ఇక్కడ అరణ్యం అంటే ఆజ్ఞానం. ఎవరైతే పరమేశ్వరుణ్ణి కనుగొనే విద్య చెపుతారో వారినే గురువు అనాలి ! నీకు ఒక సంగతి తెలుసా ! ఒకటవ తరగతి నుండి చదువు ప్రారంభించి పది పన్నెండు పద్ధెనిమిది ఇలా పైపైకి వెళ్ళెవి ఈనాటి చదువులు. పూర్వంలో మన చదువు అత్యంత ఉన్నతమైన జ్ఞానాన్ని బోధించే వేద పరిచయంతో విద్యాభ్యాసం ప్రారంభం అయ్యేది. అంటే మనకు లభించిన మొదటి పాఠ్యపుస్తకాలు వేదాలు. ఆ తరువాత వేదాంతాలు ! బ్రహ్మము, ఆత్మ, జ్ఞానము, యోగము వీటితో మిళితమైనది మన విద్య. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఎవరికి ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఎవరు శిష్యులకు బోధిస్తారో వారే గురువులు. ఈ బ్రహ్మజ్ఞానము, ఆత్మ జ్ఞానము తెలుసుకొనేందుకు భక్తి జ్ఞాన కర్మయోగాలైన మార్గంలోనైనా నిష్ణాతుడై స్వయం జ్ఞాతయైనవాడే గురువు ! ఇప్పుడు నువ్వు చెప్పిన మీ మాస్టర్లని గురువులనవచ్చు. గౌరవించవచ్చు ! కాని మహాత్ములైన ఆ గురువులకు భౌతిక విద్యలను సరపే ఈ గురువులకు ఎంత వ్యత్యాసం ఉందో మీరే గ్రహించుకోండి ! పతంజలి మహర్షి స ఏవ గురుః అన్నాడు. అంటే ఆయన ఒక్కడే గురువు. ఆయన అంటే ఆ పరమేశ్వరుడే. నిత్యచేతనుడు. నిత్యజ్ఞాని నిత్యసాక్షి. నిత్యప్రకాశితుడు అయిన ఆ పరమేశ్వరుడే ఒక్కడే గురువు. ఆ పరమేశ్వరుని జాడ తెలుసుకున్న ఈ పరమయోగులు గురువులు. అంతే కాని చెవిలో మంత్రం ఊది తను, మన, ధనాల కోసం శిష్యులను పీడించేవారు గురువులు కారు, బరువులు. ఈనాడు మన పూజలందు కొన్న ఈ మహానుభావులందరు ఎంతెంత తపస్సు చేసి , ఎన్నెన్ని కష్టాలకోర్చి ఆ భగవంతుణ్ణి కనుగొన్నారో వారందరూ మనకు సదా ఆరాద్యులు. శిష్యునిచే సర్వవిద్యల సారమైన నిరుపాధిక బ్రహ్మ ప్రాప్తికై సాధన చేయించడమే గురువు యొక్క గురుతరమైన బాధ్యత. అందుచేతనే వారు గురుదేవులైనారు. కాలాతీతమౌతోందని జయంతి గ్రహించింది. ఆనందరావుగారికేదో అడగాలని వుంది. అమ్మా అన్నాడు. ఏమటి మీ అనుమానం అంది జయంతి. ఆధ్యాత్మిక గురువులు భౌతిక గురువులు అని వేరు వేరుగా ఉంటారా ? అన్నారు. ఆనందరావుగారు కూడా జయంతిని ప్రశ్నించడం చూసి జయంతి ఆశ్చర్యపోయింది. ఆమ్మో ! ఈయనకు కూడా అనుమానాలు వస్తున్నాయంటే దారిలో పడుతున్నారన్నమాటే ! అనుకుంది.
ఆధ్యాత్మికం ఆదిభౌతికం ఆదిదైవికం అనే మాటలను మనం తరుచువింటూ ఉంటాం. అంటే ఇది భౌతికానికి సంబంధించినదీ, దైవానికి సంబంధించినదీ, ఆత్మకు సంబంధించినదీ అన్నమాట ! ముందు దైవం అంటే ఏమిటో చూద్దాం. దైవం అంటే ప్రకాశమన్నమాట ! ఒక వెలుగు ఈ వెలుగు వల్ల ప్రయోజనం ఏమిటి ? ఈ జ్ఞా జ్ఞానం వల్ల ప్రయోజనమేమిటి ? ఈ వెలుగుతో ఈ జ్ఞానంతో దేనిని తెలుసుకుంటాం ? ఆత్మ యొక్క ఉనికిని కనుగొంటాం ఈ ఆత్మను కూడా మించినది ఆధి + ఆత్మ - అధ్యాత్మ ఏది ? అదే పరమాత్మ ! ఇప్పుడు అది దైవికాన్ని ఆధ్యాత్మికాన్ని గురించి కొంచెం చెపుకున్నాం. ఒక ఆదిభౌతికం - భౌతికం అంటే భూత సమ్మేళనం - పంచభూతాలు. మనిషి శరీరంలో ఐదు భూతాలు ఉన్నాయి. జయంతి భూతాలు లనే మాట నొక్కి చెప్పేసరికి అందరూ నవ్వారు. గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి. ఈ అయిదు పదార్థాలను ముద్దగా చేసి సృష్టించాఉ మనలని ఆ బ్రహ్మ. అన్ని పదార్థాల్లోకి పిండి వంటకి పిండి ఎంత ముఖ్యమో మనిషి వంటకి మట్టి అంత ముఖ్యం. కనక మన ఈ శరీర రక్షణకి కావల్సిన తిండి, బట్ట, ధనం శారీరక సుఖం వీటిని గురించి తెలియ చేసేది భౌతిక విద్య. ఈ విద్యను నేర్పే ఈనాటి మన మాస్టర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, భౌతిక విద్యను గరిపే గురువులు. గురువు చెప్పినట్లు తు.చ. పాటించలా అమ్మా ఒక యువకుడు ప్రశ్నించాడు. జయంతి నవ్వింది. మనిషఙ స్వభావం ఏమిటింటే ఎప్పుడూ తానే నేర్చుకున్న దానితో తృప్తిపడడు. దానినే ఆచరిస్తూ కూర్చోడు. గురువు నేర్పిన జ్ఞానం కేవలం చిన్న నిప్పురవ్వ. దానిని నిత్యం రాజేస్తూ రాజేస్తూ మహాజ్వాలనే శిష్యుడు సృష్టిస్తాడు. గురువులు చెప్పిందే విని కూర్చుంటే ఈనాడు మనకు జగద్గురవైన ఆదిశంకరాచార్యులవారు, వివేకానందులు మొదలైన మహామహులు ఉండరు. వారి సారస్వతమూ ఉండదు. పైన గురువుకు చెప్పిన అర్హతలన్నీ శిష్యులకీ ఉండాలి ! ఆ గుణాలకి తోడు గురువంటే భక్తిగౌరము ఉండి ఆయన చెప్పిన ధర్మాచరణ మాత్రం గీత దాటకుండా ఆచరించాలి. అప్పుడు ఆ గురువు సద్గురువు. ఈ శిష్యుడు సత్ శిష్యుడూ అవుతారు. ఇలాగే భౌతిక విజ్ఞాన శాస్త్రాల్లోను, సంగీత, సాహిత్య, శిల్పకళలల్లోనూ నిరంతరం విప్లవాత్మకమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితాలు లభిస్తూనే వున్నాయి. జ్ఞాన తృష్ణ అనేది తీరేది కాదు. నేర్చి నేర్చి కడకు ఎక్కడ వెడతాం ? ఒక్కోమారు పైపైకి వెళ్ళే బదులు గుండ్రంగా తిరుగుతాం. పాత క్రొత్త అవుతుంది. క్రొత్త పాత అవుతుంది. పాత కొత్తలను కలుపుకుంటూ చక్రభ్రమణంలో తిరుగుతూ తిరుగుతూ మళ్ళీ పైకి వళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం ! ఎన్ని జన్మలు ! ఎన్ని అనుభవాలు ! ఎన్ని విద్యలు ! అంతా ఆనందమయం ! జీవితంలోని ఆనందాన్ని మనకు అందించవలసింది గురువులే. సుఖమేదో దుఃఖమేదో ఆనందమేదో తెలుసుకోలేని మనకు ఇది ఇదీ అని చెప్పి జాగృతం చేయవల్సింది గురువే.
బాలానందముని నాకు ఉపదేశం చేశారమ్మా ఒక స్త్రీ అంది. న్యాయ భాషకు భాష్యం వ్రాసిన వాత్స్యాయనముని అంటారు - ఉపదేశం అనేది ఉపదేశించబడే వానికి ఆప్తమై ఉండాలి అని ! ఆప్తం అంటే హితవు ఇష్టం ప్రేమ. ఈ మూడు లేకపోతే ప్రయోజనం శూన్యం - ఇటు గురువుకీ అటు శిష్యుడికీ కూడ కంఠశోషే మిగులుతుంది. దీనివల్ల మనం అర్థం చేసుకోవలసిందేమిటంటే తనవద్దకు వచ్చిన శిశువు వంటి శిష్యుడికి కావల్సినదేమిటి ? అతని మనస్తత్వమేమిటి అతని పూర్వ సంస్కారమేమిటి ? తాను ఏమి చెపితే దానిని అందుకుని ముందుకు పోగలడు అనే విషయాలు కూలంకషంగా గురువు ముందు తాను నేర్చుకొని ఉండాలి ! ఈత నేర్పించేవానికి జలతరణ విద్యతెలిసే ఉండాలి గదా !
అయితే అమ్మా ! గురువు జ్ఞానో కాదో మనకెలా తెలుస్తుంది ! మనం ఆజ్ఞానంతోనే అక్కడకు వెడతాం కదా ఒక వృద్ధురాలి ప్రశ్నకు జయంతి ఇలా చెప్పింది ! నిజం తల్లీ ! గురువును పరీక్షించి అతడు సద్గురువో కాదో తెలుసుకునే తెలివితేటలు లేకనే చాలామంది అసలు గురువుల జోలికేపోరు. పూర్వకాలంలో అసత్యాలు వేషాలు మోసాలు చాలా తక్కువ అని పురాణకథలు మనకు తెలియచేస్తున్నాయి. సత్యం సత్యం సత్యం అని ఆనాడు ఉపనిషత్తులు వేయిగొంతుకలతో ఘెషించాయి. అంటే అప్పుడూ అసత్యవాదులు ఉండబట్టేకదా సత్యాన్ని గురించి అంత చెప్పాల్సి వచ్చింది. అప్పుడు అంటే వైదిక సంప్రదాయ పాలనలో సంస్కృతిలో జీవనం గడిపే ఆరోజుల్లో, బియ్యంలో అక్కడొకరాయి అక్కడొకరాయిలాగా సత్యదూరులుండేవారు. ఇప్పుడు రాళ్ళల్లో అక్కడొక బియ్యపుగింజ ఇక్కడొక బియ్యపుగింజలాగ సత్యవాక్య పరిపాలకులు ఉంటున్నారు. గురవులై భోదించే వారికి కూడ కొన్ని అర్హతలు శాసించబడే ఉన్నాయి. మొదటిది స్వాధ్యాయం - స్వ అధ్యాయం. తాను ఆధ్యయనం చేసి ఉండాలి ! నిత్యం అధ్యయనం చేస్తూవుండాలి ! అంతేగాని చిన్నప్పుడెప్పుడో చదివేశాను ఇక చదవాల్సింది లేదు అని అనుకుంటే శిష్యులే గురువులకు పాఠాలు చెప్తారు. స్వాధ్యాయం తరువాతదే ప్రవచనం. పఠించిన దాని నుండి మార్మిక పరమ సారాన్ని చిన్న చిన్న గుళికలుగా చేసి శిష్యుని బుద్ది చేత క్రమక్రమేణా మ్రింగిస్తూ ఉండాలి ! ఇక దమం - శమం ఈ రెండూ లేనివారు ఇతరత్రా ఏమి ఉన్నా గురువులే కారు. దమం అంటే బహిరింద్రియాల్ని తన అదుపులో చెప్పుచేతల్లో నిగ్రహించగలగడం. శమం అంటే అతంరింద్రియ నిగ్రహం. ధర్మాచరణం అంటే మీకు చెప్పక్కరలేదు. ఆదర్శనీయమైన ప్రవర్తన అన్నమాట. వీటన్నింటికీ మించింది మరొకటి ఉంది. గురువుతపోనిత్యుడై ఉండాలి ! అంటే నిత్యం పరమాత్మను గురించి ధ్యానిస్తూ తపించిపోవడం. అంతేగాని శిష్యులను మీరు పాఠాలు చదువుకోండి లేదా సహస్రనామ పూజ చేసుకోండి నేను ఇప్పుడే వస్తా అని లోపలున్న ఎ.సి. గదుల్లోకి వెళ్ళి ఎఱ్ఱ సినిమానో, నీలి సినిమానో చూస్తే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకరోజు ఎవరో ఒకరు పసిగట్టి గురువులకు బుద్ది చెప్పే క్షణం రావచ్చు. గురువులను ఆచార్యులు అని కూడా అంటారు. సదాచరణ చేసి శిష్యులకు ఆదర్శంగా ఉండేవారు అని భావము. అందుకే గురుత్వం చాలా కష్టతరమైన పని. ఎన్నో అర్హతలుండాలి. అర్హులైన గురువులు కొందరే ఉంటారు. వారిని ఎన్నుకోవడం కష్టమే ! సద్గురువును చూసించు తల్లీ ! అని అమ్మను మనసారా వేడుకోవాలి. ఏదోమొక్కుబడిగా కాదు. ఆర్తితో ప్రార్థించాలి ఇంకేమైనా ప్రశ్నలు, అనుమానలు ఉంటే మళ్ళీ కలుద్దాం. జయంతి లేచి మహాత్ముల చిత్రపటాలకు భక్తిగా నమస్కరించింది. అందరూ నమస్కరించారు. అందరి చేతా నీరాజనాలెత్తించి జయఘోష చేయించింది.
గురుమహరాజ్ గురు జయ జయ సాయినాధ సద్గురు
అని జయంతి పాడగా అందరూ ఆమెతో భక్తితో గొంతు కలిపారు.
గురుమహరాజ్ గురు జయ జయ వాసుదేవ సద్గురు జయ జయ
గురుమహరాజ్ గురు జయ జయ
దత్తదేవ సద్గురు జయ జయ
గురుమహరాజ్ గురు జయ శివ చిదానంద సద్గురు జయ జయ
గురుమహరాజ్ గురు జయ జయ మౌనస్వామి సద్గురు జయ జయ
జై శ్రీ యోగమూర్తులకూ జై ! జై శ్రీ సిద్దపురుషులకుఊ జై
జై శ్రీ మౌనానంద యతీంద్రులకూ జయ్ !
జై శ్రీ శివచిదానంద భారతులకూ జయ్ !
జై శ్రీ రాజరాజేశ్వరీ మాతకూ జయ్ !!
|