4
 

గురుపూర్ణిమ ఉత్స‌వాన్ని పెద్ద ఎత్తున చేయాల‌ని త‌ల‌పెట్టింది జ‌య‌తి. ఇంతలో ఉన్న‌ట్టుండి హంసీ వాళ్ళ అమ్మా, నాన్న‌, త‌మ్ముడు అమెరికా నుండి వ‌స్తున్న‌ట్లు ఫోన్ చేసారు. అమ్మా జ‌యంతి పిన్నిని చూసి ఎన్నో ఏళ్ళ‌య్యింది. పిన్ని ఒడిలో ఉయ్యాల లూగ‌డం, పిన్ని చెప్పే క‌థ‌లు విన‌డం ఇవ‌న్నీ నేను ఎన్న‌టికీ మ‌ర‌చిపోలేని మ‌ధుర‌క్ష‌ణాలు. అమ్మా నేను వ‌చ్చేదాకా పిన్నిని ఎక్క‌డికీ క‌ద‌ల‌నీకు. త్వ‌ర‌లో వ‌చ్చేస్తున్నా ! అంటూ వాసంతి జ‌యంతి వ‌చ్చినప్ప‌ట్నించీ ఫోన్లు చేస్తూనే వుంది. ఇప్ప‌టికి వీల‌యింద‌న్న మాట !

హంసికి అమ్మ‌తో, త‌మ్ముడితో ఎన్నో క‌బుర్లు, తండ్రితో గారాలు, అల‌క‌లు, ఇన్నింటితో తీరిక లేకుండా వున్నా ఎక్కువకాలం జ‌యంతితోనే గ‌డుపుతోంది. ఈ అపురూప‌మైన నిధి ఎప్పుడు త‌రలి పోతుందో అనే త‌హ‌త‌హ‌, ఎన్నో మంచి విష‌యాలు తెలుసుకోవాల‌నే త‌ప‌న ! వినేశాళ్ళుంటే చెప్పేవాళ్ళు చాలామందే వుంటారు. అయినా అమ్మ‌మ్మ మాదిరిగా చ‌ల్ల‌గా తియ్య‌గా హృద‌యానికి హ‌త్తుకునేలా చెప్పేవాళ్ళు అరుదు అనుకుంది హంసి.

వాసంతి పిన్నిని కౌగ‌లించుకు కూర్చుంది. పిన్నీ ఎన్నాళ్ళుయ్యింది నిన్ను చూసి అని దాదాపు వంద‌సార్లుపైనే అంది. జ‌యంతి వాసంతి త‌న ఆప్యాయంగా నిమిరింది. క్షేమ‌స‌మాచారాలు, అమెరికా సంగ‌తులు అన్నీ అడిగి తెలుసుకుంది. పిన్నీ నా రాక‌మూలంగా మీ గురుపూర్ణిమ పూజ ఆగిపోయింద‌ట‌గా ! సో సారీ పిన్నీ అంది వాసంతి. పిచ్చిపిల్లా పూజ ఎక్క‌డ ఆగింది. ఆగ‌లేదు. కాక‌పోతే ప‌దిమందీ రాలేదు, అంతే అంది జ‌యంతి. అయితే పూజ జ‌రిగిందా హంసి ఆశ్చ‌ర్యంగా అడిగింది. జ‌యంతి క‌నులు మూసుకుని చిన్న‌ప‌దం పాడింది.

ప్ర‌తి గురువారం గురుపున్న‌మి                 ప్రతి సాయంత్రం సాయి పున్న‌మి
ప్ర‌తి మ‌ధ్యాహ్నం మంగ‌ళ పున్న‌మి            ప్ర‌తి ఉద‌యం ఆహ్ల‌ద పున్న‌మి
అనుక్ష‌ణ‌మూ అనురాగ పున్న‌మి బ్ర‌తుకంతా....భ‌క్తి పున్న‌మి

అని పాడుతూ మైమ‌ర‌చి పోయింది. శ్రోతలంద‌రూ నిశ్శ‌బ్దాన్ని ఆశ్ర‌యించారు. కొంత‌సేపైనాక జ‌యంతి లేచి శ్రీ‌రామ‌కోటి వ్రాయడం మొద‌లు పెట్టింది. పిన్నీ అమెరికా నుండి ఇండియా వ‌చ్చిన వాళ్ళంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా తిరుప‌తి, షిర్డీ వెడ‌తారు. షిరిడీసాయి బాబా శివుడి అవ‌తార‌మా ? విష్ణుమూర్తి అవ‌తార‌మా ? అని అడిగింది వాసంతి. జ‌యంతి వ్రాయడం ఆపి వాసంతి వంక చూసింది. చూడు వ‌సూ ! శివుడూ, విష్ణువూ, ద‌త్తాత్రేయుడూ...ఇవ‌న్నీ పేర్లు మాత్ర‌మే వేరు. అస‌లు సిస‌లైన ప‌ర‌బ్ర‌హ్మ‌స్వ‌రూపం ఒక్క‌టే వుంది. ఎలాగంటావేమో, నిజానికి భూమి అంతా ఒక్క‌టే క‌దా ! వ్య‌వ‌హారం కోసం కొన్ని రాష్ట్రాలుగా విభ‌జించుకుని పేర్లు పెట్టుకున్నాం. ఆ రాష్ట్రాల‌న్నిటినీ జిల్లాలుగా, ప‌ట్ట‌ణాలుగా, ఆ ప‌ట్ట‌ణాల్లో పేట‌లుగా, వీధులుగా విభజించుకున్నాం. ఇన్ని పేర్లూ ఆ భూదేవివే క‌దా ! ఇవి మ‌నం పెట్టుకున్న‌వే క‌దా ! ఆమెకు ఈ పేర్ల‌తో ప‌ని ఏమిటి ? అలాగే సాయిబాబాకూడా ! ఆయ‌న‌కి పేర్ల‌తో ప‌నిలేదు. సాయిరామా అంటే ప‌లుకుతాడు. సాయీశ్వ‌రా అంటే ప‌లుకుతాడు. అభిషేకాలు చేస్తే చేయించుకుంటాడు. అర్చ‌న‌లు చేస్తే చేయించుకుంటాడు. కానీ ఏమి చేసినా, ఎలా ప‌లిచినా ఆయ‌న‌కు కావ‌ల్సిన‌వి రెండే రెండు. ఒక‌టి విశ్వాసంతో కూడిన ఓపిక‌, రెండు శ్ర‌ధ్ధ‌. దాస‌గుణ అనే భ‌క్తుడికి ప్ర‌యోగ వెళ్ళ‌న‌క్క‌ర లేకుండానే త‌న పాదాల చెంత గంగా య‌మున‌ల‌ను ద‌ర్శింప‌చేసిన స‌ర్వ‌దేవతా స్వ‌రూపుడు బాబా. దాస‌గుణు అంటాడు, తూధేనూ వత్స‌మీ తాన్హీ తూ ఇందు చంద్ర కాంతమీ స్వ‌ర్ న‌దీ రూప త్వ‌త్పాదా ఆద‌రేదా స‌హాన‌మీ నీ పాదాలే త్రివేణీ సంగ‌మ తీరాలు, నీవు గోవువి, నేను గోవ‌త్సాన్ని. నీవు చంద్రుడివైతే నేను చంద్ర‌కాంతిని అని. ఇంత‌క‌న్న సాయినాథు ఏమ‌ని వ‌ర్ణించ‌గ‌లం వాసంతీ. ద‌యాధ‌నుడైన సాయిని త‌ల‌చి ధ‌న్యులు కాని వారెవ‌రూ లేరు. స్మ‌ర‌ణ మాత్రం చేత‌నే సంతుష్టుడ‌య్యే ఆ ద‌త్తాత్రేయుని అవ‌తార‌మే సాయినాధుడ‌ని అనుభ‌వ‌జ్ఞులు నిర్ణియించారు. అలాగే అమ్మ‌వారికి కూడా నామ‌పారాయ‌ణ ప్రీత అనే బిరుదు ఉంది క‌దా ! అయితే బాబా బోద‌న‌లో గురువు యొక్క ప్రాముఖ్యం ఎక్కువ‌గా క‌న్పిస్తుంది.

సంసార‌మ‌నే మ‌హాన‌దిని దాటించి, ప‌ర‌మాత్మ అనే మ‌హానిధిని పొందింప‌చేసేవాడే గురువు. ఇది చాలా గురుత‌ర‌మైన బాధ్య‌త‌. అందుక‌నే ఆయ‌న‌ని గురువు అన్నారు. ఇంత బ‌రువైన బాధ్య‌త‌ను వ‌హిస్తున్న అదీ త‌న బాధ్య‌త‌నే అని తెలుసుకుని శిష్యుడు విచ‌క్ష‌ణ‌తో ప్ర‌వ‌ర్తించాలి. గురువుతో స‌హ‌క‌రించాలి ! స‌హ‌క‌రించ‌డం అంటే స‌మానంగా త‌న బాధ్య‌త‌ను తానుకూడా వ‌హించుకుంటూ గురుకార్యాన్ని సుల‌భ‌త‌రం చేయాలి. ఆయ‌న ఎలాచెపితే అలా చేయ‌డం ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. ఏమి చెప్తారో చెప్ప‌కుండానే గ్ర‌హించుకుని చేయ‌డం ఉత్త‌మ క‌ర్త‌వ్యం. చెప్పినా చేయ‌క‌పోవ‌డం అధ‌మ ల‌క్ష‌ణం.చెప్పిన‌దానికి వ్య‌తిరేకంగా చేయ‌డం అధ‌మాధ‌మ ల‌క్ష‌ణం.

చూడు వాసంతీ నీ పిల్ల‌లు ప‌సివారుగా ఉన్నప్పుడు వారి బాధ్య‌త నీవే తీసుకుని స‌ర్వోప‌చారాలు చేశావు. ఇప్పుడు నీ కొడుకు ఎనిమిదేళ్ళ‌వాడైనాడు. వాడి ప‌నుల‌ను కొన్నింటినే చేస్తావు. హంసికి ప‌ద్దెనిమిదేళ్ళు. ఆమెకు నీవు చేయాల్సిందే లేదు. ఇవి భౌతిక‌మైన ప‌నులు. అంత‌రికంగా గురువు కూడా త‌న శిష్యుని పెరుగుద‌ల‌ని బ‌ట్టి త‌న బాధ్య‌త‌ల‌ను కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వ‌చ్చి తుద‌కు త‌నంత‌వాడిగా అయిన త‌రువాత అత‌ణ్ణే గురువుని చేస్తాడు. అంతేగాని శిష్యుని ఎదుగుద‌ల‌కు మాత్స‌ర్యం పొందేవాడు స‌ద్గురువు ఎలా అవుతాడు ?

అమ్మమ్మా మొన్న ఒక సినిమా చూశాను. అందులో ఒక సంగీత గురువు త‌న శిష్యుడు చిన్న‌వాడైనా త‌న‌కు మించిన విద్వ‌త్తు ఉంద‌ని తెలుసుకుని ఎంతో మాత్స‌ర్య‌ప‌డ‌తాడ‌. హంసి మాట‌ల‌కు వాసంతి అడ్డు వ‌చ్చింది. అది సినిమారానాన్నా అయితే మరి ద్రోణాచార్యుడి సంగ‌తి ఏమిటి ? గురువే ఏక‌లవ్యుడి బొట‌న‌వేలునే కోరి అత‌డింక బాణ‌మే వేయ‌లేని స్థితికి తీసుకువ‌చ్చాడు క‌దా ! ఇది భార‌తంరా నాన్నా ! అంటావా అంది హంసి తీవ్రంగా.

బంగారూ ! ఇది భ‌గ‌వ‌తుండి బొమ్మ‌ల కొలువు. అన్ని బొమ్మ‌లూ ఒకేర‌కంగా ఉండ‌వు. మ‌న పురాణ గాధ‌ల్లో అంత‌రార్ధాలు వేరే ఉన్నా ఒక పాత్ర చేత ఇలాఉండాలి అని అన్పింప‌చేసి మ‌రొక పాత్ర ద్వారా ఇలా ఉండ‌కూడ‌దు అనే జ్ఞానాన్ని మ‌న‌కు ల‌భింప‌చేస్తారు ర‌చ‌యిత‌లు.ఏ పాత్ర యొక్క ల‌క్ష‌ణాలు మ‌న‌కు న‌చ్చ‌వో అలాగ మ‌నం ప్ర‌వ‌ర్తించ కూడ‌ద‌ని మ‌న‌ను మ‌న‌మే నియంత్రిచుకోవాలి ! జ‌యంతి స‌మాధానానికి హంసి ఆవేశం చ‌ల్ల‌బ‌డింది.

అయితే అమ్మ‌మ్మా నాకింకొక సందేహం ఏమిటంటే సాయిబాబా దాస‌గణుని నామ‌స‌ప్తాహం చేయ‌మంటాడు. దాస‌గణు స‌రే చేస్తాను కానీ నామస‌ప్తాహం పూర్తికాగానే విఠ‌లుడు ద‌ర్శ‌నమియ్యాలి ! అలాగ‌ని మీరు వాగ్దానం చెయ్యండి అంటాడు. కానీ దాస‌గ‌ణుకు విఠ‌లుడు ద‌ర్శ‌న‌మివ్వ‌లేదు. కాకాసాహెబ్ దీక్షిత్‌కి పారాయ‌ణ పూర్త‌యిన రోజున విఠ‌లుడు ధ్యాన‌గోచ‌రుడైనాడు క‌ద‌రా తల్లీ అంది జ‌యంతి. దాస‌గణు కోరితే దీక్షిత్‌కి ద‌ర్శ‌న‌మీయ‌డ‌మేమిటి ? హంసి వాద‌న‌కు తల్లి మురిసిపోతోంది. జ‌యంతి కూడా న‌వ్వింది. చూడ‌రా నాన్నా ! రామ‌దాసు ఎంత‌టి గొప్ప భ‌క్తుడు ? భ‌ద్రాచ‌లంపై రాముల వారికి గుడి క‌ట్టించాడు. ప‌చ్చ‌ల ప‌త‌కాలు, చింతాకుహారాలు మొద‌లైన న‌వ‌ర‌త్న ఖ‌చిత స‌ర్వాభ‌ర‌ణాలు చేయించాడు. ఆ చంద్ర‌తారార్క‌మూ నిలిచేలాంటి గొప్ప గొప్ప కీర్తన‌లు ర‌చించాడు. పన్నెండు సంవ‌త్స‌రాల‌పాటు ఆహోరాత్రాలూ న‌ను బ్రోవ‌మ‌ని చెప్ప‌వే సీత‌మ్మ తల్లీ అంటూ ఎవ‌రు చెప్తే వింటాడోన‌ని ఎంద‌రెంద‌రికో విన్న‌పాలు చేసుకుంటూ శ్రీ‌రామ‌చంద్రునికై ప‌రిత‌పించాడు. అయినా రాముడూ ల‌క్ష్మ‌ణుడూ వ‌చ్చి   ఎవ‌రికి ద‌ర్శ‌న‌మిచ్చారు ? రాముడంటే ఏమాత్రం భ‌క్తి భావ‌న‌లేని తానీషాకు. రామ‌దాసు సేవ‌కుల మంటూ వ‌చ్చి ద‌ర్శ‌న‌మిచ్చారు. మూసివున్న అన్ని ప్ర‌కారాలూ, ద‌ర్వాజాలూ దాటి అర్థ‌రాత్రి అంతఃపురంలోకి వ‌చ్చి రామాదాసు ఈయ‌వ‌ల‌సిన పైకం అంతా అణాపైస‌ల‌తో స‌హా చెల్లించిన వారెవ‌రై ఉంటారు ? అని యోచించాడు తానీషా. అర్థం వాళ్ళ పేర్ల‌లోనే ఉంది. రామోజీ ల‌క్ష్మీజీ అన్నారు. కాస్త ఉర్తూ ఛాయ‌లు గోచ‌రించేలాగ‌. అయితే ఈ దేవుళ్ళు ప్రార్థించిన వాళ్ళ‌కు ద‌ర్శ‌న‌మీయ‌క ఇంకొకరికి ద‌ర్శ‌న మీయ‌డ‌మేమిటి అమ్మ‌మ్మా !. అదికాదురా త‌ల్లీ, ఆ ప‌ర‌మాత్ముడు అడుగుపెట్ట‌డానికి త‌గిన‌ట్లుగా భ‌క్తుల హృద‌య‌మ‌నే రంగ‌స్థ‌లాలంక‌ర‌ణ ఎక్క‌డ పూర్తి అయితే అక్క‌డ వీరు ద‌ర్శ‌న‌మిస్తార‌న్న‌మాట‌. ఇటు దాస‌గ‌ణు గాని అటు రామ‌దాసు కాని ఇద్ద‌రూ హ‌రి నామ పారాయ‌ణ ప‌రాయ‌ణులే. కానీ వారిలో కించిత్తు గ‌ర్వం క‌న్పించ‌డం లేదూ ? నేను నీకింత చేసాను, న‌న్ను ర‌క్షించ‌డానికి రావా ? అని రామ‌దాసు హుంక‌రించ‌లేదూ ? అటు కాకాసాహెబ్ నిశ్చ‌ల చిత్తుడు. విఠ‌లుడే కాదు, మ‌హాదేవుడు కూడ లింగ‌రూపంలో ద‌ర్శ‌న‌మిచ్చాడు. తానీషాకు కూడా గ‌త‌జ‌న్మ జ‌న్మ‌ల ఉత్త‌మ సంస్కారం యొక్క ఫ‌లిత‌మే సోద‌ర‌స‌మేత శ్రీ‌రామ‌ద‌ర్శ‌నం. అది ఘోషా స్థ‌లం. కావున సీత‌మ్మ త‌ల్లి ప‌ర‌దామాటున దాగుండి ద‌ర్శ‌న‌మీయ‌లేదు. ఇదిరా త‌ల్లీ ! జీవుని సంస్కార ఫ‌లిత‌మే దేవుని ద‌ర్శ‌నం !

ఈ సంగ‌తి, అదే విఠ‌ల దర్శ‌నం దాస‌గ‌ణుకు కాక కాకాకు అయ్యింద‌ని సాయిబాబాకు తెలుసు. అందుక‌నే కాకా రాగానే బాబా అడుగుతాడు. విఠ‌ల‌పాటీలు వ‌చ్చాడా ? చూచావా ? ఆయ‌న మిక్కిలి పార‌బోతు. జాగ్ర‌త్త‌గా దృఢంగా ప‌ట్టుకోవాలి. ఏమాత్రం ఆజాగ్ర‌త్త‌గా ఉన్నా జారిపోతాడు అంటాడు. ఈ మాట‌లు ద‌స‌గ‌ణుని అడ‌గ‌డు బాబా. కాబ‌ట్టి విఠ‌లుడు క‌న్పిస్తాడు అని బాబా చెప్ప‌డం, విఠ‌లుడు కాకాకు క‌న్పించ‌డం, కాకానే బాబా విఠ‌లుడు క‌న్పించాడా అని అడ‌గ‌డం ఇదంతా చూస్తే విఠలుడికీ బాబాకీ ఉన్న సంబంధం ఏదో వ్య‌క్తావ్య‌క్తంగా గోచరించ‌క‌పోదు.

బాబానే విఠ‌లుడు, విఠలుడే బాబానా అమ్మ‌మ్మా అంది హంసి ఆసక్తిగా . అందుకు ఎలాంటి సందేహం అక్క‌ర‌లేదు. భక్త తుకారామ్ జీవిత చ‌రిత్ర‌ను మ‌హారాష్ట్ర బాష‌లో ర‌చించిన బాలారామ్ దురంధ‌ర్‌కు హార‌తి స‌మ‌యంలో సాయిబాబా పాండురంగ‌నిగా ద‌ర్శ‌న‌మిచ్చాడు క‌దా. జ‌య‌తి మాట‌లు వాసంతికి ఆశ్చ‌ర్యం క‌లిగించాయి. అమ్మా ! నువ్వుకూడా సాయిని పూజిస్తూ సాయి స‌చ్చ‌రిత్రను చదువుతున్నావా ? అంది. రెండు మూడుసార్లు చ‌దివాను. అయినా చాలా విష‌యాలు ఏవో మామూలు కాక‌మ్మ క‌థ‌ల‌ల్లే అన్పించాయి. ఇప్పుడు పిన్ని వ‌చ్చాక చాలామంది వ‌చ్చి బాబాను గురించి ఏవో ప్ర‌శ్న‌లు వెయ్య‌డం జ‌యంతి ఆ క‌థ‌ల్లోకి అంత‌రార్థాలు చెప్ప‌డంతో కృష్ణుడు లాగానే బాబా కూడా అంతార పురుషుడ‌ని అర్థం చేసుకున్నాను.

జ‌యంతి రోజూ సాయంత్రం భాగ‌వ‌తంలోని భ‌క్తుల చ‌రత్ర‌లు చెప్తుండ‌టంతో విన‌డానికి చాలామంది వ‌స్తున్నారు. ఆరోజు అప్ప‌టికే భ‌క్తులు జ‌యంతి కోసం ఎదురు చూస్తున్నారు. జ‌యంతి హాలులోకి వ‌చ్చి అంద‌ర్నీ చిరున‌వ్వుతో ప‌ల‌క‌రించింది. అంద‌రూ జ‌యంతికి దూరంనుంచే న‌మ‌స్క‌రించారు. జ‌యంతి పాద న‌మ‌స్కారాల నందుకోదు. తానూ వారిలో ఒక‌రినే నంటుంది. ప్ర‌త్యేక‌త చూపి త‌న‌ను దూరం చేయ‌వ‌ద్దంటుంది. జ‌యంతితోపాటు హంసి, వాసంతి, జ‌య‌తి కూడా వ‌చ్చారు. హంసి అమ్మమ్మ చెవిలో ఏదో గొణుగుతూనే వుంది. త‌ల్లీ నువ్వు చెప్పేదేదో అంద‌రికీ విన్పించేలాగా చెప్ప‌మ్మా అంది జ‌యంతి. నాకున్న బాధ ఒక్క‌టే అమ్మ‌మ్మా. సాయిబాబా భౌతికంగా ఉన్న‌న్నాళ్ళూ గురువు గురువు గురువు అంటూ అల‌స‌ట లేకుండా గురుగానం చేశాడు. ఇప్పుడు చాలామంది గురువుల‌మ‌ని న‌మ్మి అన్నిర‌కాలుగా మోస‌పోయామ‌ని చెప్తున్నారు క‌దా నీతో. మ‌రి ఇదేమిటి ? పురుషులందు పుణ్య‌పురుషులు వేర‌న్న‌ట్లుగా గురువుల్లో స‌ద్గురువులు ఎంతో త‌క్కువ మంది ఉంటారు. వారికై వెత‌కాలి. వారికోసం ప‌రిత‌పించాలి. అప్పుడే ఆ గురురూపంలో భ‌గ‌వంతుడు అనుగ్ర‌హిస్తాడు. బాబా గురువు అని పేరు పెట్టుకుని మోసం చేసేవారిని గురించి చెప్పింది. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. భ‌క్తులు జ్ఞానం సంపాదించాల‌ని వెళ్ళి ద్ర‌వ్యాన్ని, కాలాన్ని, శ్ర‌మ‌నీ కూడా న‌ష్ట‌పోయి చివ‌ర‌కు ప‌శ్చాత్తాప‌ప‌డతార‌ని బాబా విస్ప‌ష్టంగా చెప్పాడు. కొంద‌రు త‌న‌న‌ను గురించి తానే పొగుడుకుంటూ త‌న‌కు అంత‌శ‌క్తి ఉంది, ఇంత శ‌క్తి ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. హృద‌యం మృదువుగా ఉండ‌దు. అత‌నికే ఆత్మ‌సాక్షాత్కారం లేదు. ఇక శిష్యుల‌కేం చేయ‌గ‌ల‌డు ? వానివ‌ల్ల శిష్యుల‌కేమి లాభం క‌లుగుతుంది అని కూహ‌నా గురువుల‌ను గురించి బాబా చేసిన హెచ్చ‌రిక‌ను గ్ర‌హించి మ‌న స‌ద్గురువుల ద‌గ్గ‌ర‌కే చేరుకోవ‌లి ! అంది జ‌యంతి.

అమ్మా బాబా భ‌క్తులంద‌రిలో ఎవ‌రు ఉత్త‌ములు అని వ‌చ్చిన‌వారిలో ఒక వృద్ధుడు ప్ర‌శ్నించాడు. బాబ‌య్యగారు అస‌లు భ‌క్తుడ‌నే ప్ర‌తివాడూ ఉత్త‌ముడే క‌దా ! ఉత్త‌ముడుకాని వాడు భ‌క్తుడు కాలేడు. సాయీ స‌చ్చ‌రిత ప్ర‌కారం బాబా భ‌క్తులంద‌రూ ద్వాప‌ర‌యుగంలో కృష్ణుని సేవించిన భాగ‌వ‌తోత్త‌ములే న‌న్పిస్తుంది. దాదాపు అర‌వై సంవ‌త్స‌రాలు షిరిడీవాసుల‌తో ఎన్నో అను బంధాల‌ను బాబా ముడి వేసుకున్నాడు. హేమాడ్ పంతు ఆచంద్ర‌తారార్కం నిలిచేలాగ బాబా జీవిత చ‌రిత్ర‌ను  ర‌చించి ఎన‌లేని సేవ‌ను చేశాడు. బూటీ స‌మాధి మందిరాన్ని నిర్మించి కోట్లాది ప్ర‌జ‌లు బాబా స‌మాధి ద‌ర్శించుకునేలాగ చేశాడు. నానాసాహెబ్ త‌న ఉప‌న్యాసాల వ‌ల్ల దేశం న‌లుమూల‌ల్లో సాయిబాబాని గురించి వ్యాప్తి చేశాడు. దాస‌గ‌ణు హ‌రిక‌థ‌ల వ‌ల్ల ఎన్నో హృద‌యాలు బాబా వ‌శ‌మైనాయి. ఇక శ్యామా సంగ‌తి స‌రేస‌రి దాసాను దాసుడు. బాబ‌య్యగారూ ! వీరంద‌రూ చ‌దువు సంధ్య‌లు జ్ఞాన తెలివి ఉన్నావారు. బాలాజీ నెవాస్క‌ర్‌ను త‌లుచుకుంటే నా హృద‌యం ఆర్ధ్ర‌మౌతుంది. అత‌నొక శుద్ధ ప‌ల్లెటూరు రైతు, చ‌దువు సంధ్య‌లు లేనివాడు. రేప‌టికెలాగ అని భావించుకోకుండా పండిన పంట‌ని తెచ్చి బాబా పాదాల ముందు ఉంచి బాబా ఏమి ఇస్తే అది తీసుకుని సంసారాన్ని గడుపుకొనేవాడు. అతని విశ్వాసం, శ్ర‌ద్ధ‌, ఓపిక‌, సంస్కారం గ‌ణింప‌లేనంత గొప్ప‌వి. వాళ్ళు శిష్యులా అండి ? ఋషులు ! త‌పస్వులు. కార‌ణ‌జ‌న్ములు ! అందుకే మ‌నం పారాయ‌ణ చేసిన‌ప్పుడ‌ల్లా వారిని త‌ల్చుకుంటూ ప్ర‌భావితులం అవుతున్నాం. ఇక బాబా జంతువుల‌ను కూడా ఎంత ప్రేమించే వారో త‌ల్చుకుంటే మ‌నసు ఉప్పొంగిపోతుంది. పిపీలికాది బ్ర‌హ్మ‌ప‌ర్యంతం ఉన్న‌దొకే ప‌దార్థ‌మ‌ని బాబా నిరూపించాడు. కుక్క‌కి చ‌పాతీ పెడితే త‌న‌కు భుక్తాయాసం వ‌చ్చిందంటాడు. మేక‌ల‌కి శ‌న‌గ‌లు పెట్టి ఆనందిస్తాడు. పాముని క‌ప్ప‌ను తిన‌వ‌ద్ద‌ని శాశిస్తాడు. అంతేకాదు త‌న చెల్లిలి కోసం ఎదురు చూస్తోంద‌ని బ‌ల్లి కూత‌ల‌కి అర్థం చెప్తాడు. ఇదంతా త‌న‌కు సంబంధించిందే. కుక్క‌ల్లో, పిల్లుల్లో అంద‌రిలో ఉన్న‌ది తానే నంటాడు. ఈ సాయి స‌ర్వాంత‌ర్యామి. అంద‌రూ జ‌యంతి చెప్పిన సాయితత్త్వాన్ని మ‌న‌సుకు ప‌ట్టించుకుంటూ క‌నులు మూసుకున్నారు. ఈ రోజు భ‌గ‌వద్భ‌క్తుల‌ను గురించి కాకసాయి భ‌గ‌వానుణ్ణి గుఱించి చెప్పుకున్నాం. సాయి ప్ర‌భువుకు హార‌తి ఇచ్చి జ‌య‌వ్యాకం ప‌లుకుదాం.
మంగ‌ళం సాయినాథాయ‌.