జయంతి మంచంమీద పడుకుని వినాయకుడి ఫోటోవంక ఏకాగ్రతగా చూస్తోంది. గది బయటే జయతి తన స్నేహితులతో బిగ్గరగా మాట్లాడుతోంది. శ్రావణ శుక్రవారం పూజ ఇంత వైభవంగా జరుపుకున్నాం. అమ్మవారు మనింట్లో కూర్చున్నట్లే ఉంది అంది జయతి. నేను మద్రాసులో ఉండిపోవాల్సి వచ్చింది జయతీ. మీ యింట్లో పూజలు చూసే అదృష్టం నాకు లేదనుకున్నాను. మా కోడలు చెప్పింది. మీరు అమ్మవారిని ఎంతో చక్కగా తయారు చేశారట ! పట్టుచీరకట్టి వెలలేని ఆభరణాలుపెట్టి అమ్మవారిని అలంకరించారటగా. కామేశ్వరీ అమ్మవారిని జీవకళలతో ఉట్టిపడేలాగ జయంతే తయారు చేసింది. పసుపు గోధుమ పిండి కలిపి కొబ్బరికాయకు ముక్కు చెవులు పెట్టి కాటుకతో కనులు తీర్చిదిద్ది కుంకుమతో పెదవులను నవ్వే పాపలాగ క్షణాల్లో తయారు చేసిందనుకో జయతి కనులలో జయంతి అమర్చిన వరలక్ష్మీ అమ్మవారు తన ఇంట్లో కొలువైన తీరుకి ఆనందం తొణికిసలాడి పోయింది. అసలు భక్తే ప్రధానం అమ్మడూ ! అమ్మవారిని చేస్తున్నంతసేపూ మనందరిచేతా భజన చేయించింది కదా జయంతి. ఆ నామస్మరణమే అమ్మవారిగా రూపుదిద్దుకుందే పెద్ద ముత్తయిదువ తాయారమ్మగారు కూడా వరలక్ష్మీ అమ్మవారిని గుర్తుకు తెచ్చుకుంది.
చూడు చిత్రం, తొమ్మది రోజులు ఉంచాక పదోరోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పాక నేను వచ్చాను. ఒక్కరోజు ముందు వచ్చినా పూజల్లో నేనూ పాల్గొనేదాన్ని కదా కామేశ్వరి బాధగా అంది. ఇంతలో బయట ఏదో పెద్ద గోల. ఆనందరావుగారు ఎవరిమీదో అరుస్తున్నారు. పొండి, ఒక్కపైసా యివ్వను. గణేశ్ పూజ మీరే కాదు, మేమూ చేసుకుంటాము, మా పూజలు మాకు చాలు. చందాలట చందాలు ! మరీ పీక్కుతింటున్నారు అవతల వారి మాటలూ జయంతి చెవుల్లో పడ్డాయ్ ! ఏందయ్యో ముసలాయినా ! బతిమాలితే గొంతు చించుకుంటున్నావ్, జాగర్త. నువ్వు బయటికెళితే మా పందిరిమీదగానే వెళ్ళాలి ! మళ్ళీ తిరిగిరావు....జయంతి లేచి కూర్చుంది. జయతి లబోదిబోమంటూ వెళ్ళి ఆనందరావుగార్ని వెనక్కి లాగి....ఈ వంద రూపాయల్ని మా పేరు మీద రాసుకోండి బాబూ అంది. ఛెస్ ! వందరూపాయలా ! మేం ముష్టివాళ్ళమనుకున్నారా, బిచ్చమేస్తున్నారా ఆ నోటు తీసుకుని ఆమె మొహాన్ని కట్టినట్లు విసిరిపుచ్చుకుని తిరగ్గొట్టాడు. జయతి బిక్కచచ్చిపోయినట్లు తెల్లబోయింది. అయిదొందలకి తక్కువిస్తే తీస్కొనేది లేదు. మీరే తెచ్చియ్యండి అంటూ అందరూ వెళ్ళిపోయారు.
ఏమిటి ? చందాలకొచ్చి ఇంత పొగరుగా మాట్లాడతారా ? చందా అంటే మన ఇష్టం వచ్చినంత ఇయ్యాలి గాని ఇదేం కలికాలం కామేశ్వరి, తాయారమ్మగారు సణుక్కున్నారు. ఇంతలో జయతి అక్కడకు వచ్చి అంది, వీళ్ళు మన వీధి వాళ్ళు కాదు, పక్క వీధివాళ్ళు, మావారికేం తెలీదు, వీళ్ళతో వాదన పెట్టుకునే కన్నా వాళ్ళు అడిగిన అయిదొందలూ వాళ్ళకిచ్చేస్తే పోతుంది. క్రిందటేడు ఆ మూలమీద ఇంట్లోవున్నవాళ్ళు చందా ఇయ్యలేదుట, ఆయన ఆవైపు వెళ్తుండగా ఒకబ్బాయి స్కూటరు మీద వచ్చి ఇతన్ని ఢీ కొడితే ఆర్నెల్లు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అదీ కఱ్ఱకాలితో బయటపడ్డాడు.
హంసి జయంతి పక్కన కూర్చుంది. అమ్మమ్మా...దేవుళ్ళ పేరుతో ఈ చందాలేమిటి ? ఈ దందా లేమిటి ? డబ్బు లియ్యకపోతే కాళ్ళు విరకొట్టడాలేమిటి ? మొన్న గురువారం నాడు సాయిబాబా ఫోటోతో వచ్చే బళ్ళవాళ్ళు డబ్బులిచ్చాక పాతబట్టలు ఇయ్యమని వేధించారు. ఒకరొచ్చి దేవాలయం కడ్తున్నాం పదివేలకు తక్కువ రాయద్దు అంటారు. మరొకరు అన్నదానానికి బస్తా అన్నా బియ్యమియ్యమంటారు. ప్రతి సంవత్సరం ఆలయాల్లో వేంచేసిన విగ్రహమూర్తులకు కళ్యాణాలు, అభిషేకాలు, వెండిరధాలు, బంగారు ఉయ్యాలలు ! మామూలు ప్రజలు రెండుపూటలా అన్నాలు తినడానికే చాలీచాలని జీతాలతో అగచాట్లు పడుతుంటే ఈ చందాల గోలేమిటి ? అదీ మెడమీద కత్తిపెట్టి అడుగుతున్నారే - ఆ అన్నట్లు మరిచిపోయా ! ఇంకో రకం చందాలవారు కూడా వస్తున్నారు. వృద్ధాశ్రమాలు కడుతున్నాం, అనాధ బాలలకు ఆశ్రయం ఏర్పరుస్తాం, వికలాంగులకు ఆవాసం కల్పిస్తాం అంటూ మరికొందరు. హంసి ఆవేశాన్ని అర్థం చేసుకున్నట్లుగా జయంతి హంసి చేతిని ప్రేమగా నిమురుతూ అంది. చిట్టితల్లీ ఇదంతా జీవితమమ్మా ! రధం నడిచేది నేలమీదుగానే కదమ్మా, అలాంటప్పుడు రధం ఎన్నో ఛిద్రాలను దాటుకుంటూ వెళ్ళాలి ! ఒకచోట వృక్షాలు చక్కగా పూలను పరుస్తాయి. దారంతా పూలే ఉంటాయని నమ్మకం లేదు కదా ! మరొకచోట ముళ్ళు, గోతులు, గుట్టలు అశుద్దాలు ! అన్నిటినీ అధిగమించి గమ్యం చేరుకోవడమే రధచోదకుని లక్ష్యం ! నువ్వన్నట్లుగా మనం ఇచ్చే చందాలు కొన్ని దుర్వినియోగం అవుతూ వున్నాయి. అందర్నీ డబ్బులడిగి వీళ్ళు అశ్లీలమైన సినిమా పాటలు, సినిమా ప్రదర్శనలు చేస్తున్నారు. కాని కొంతవరకు అన్నదానాలో, ప్రసాదాలో, పులిహారలో బిచ్చగాళ్ళకు దక్కుతూనే వున్నాయి. ఇన్ని ఇళ్ళవాళ్ళకూ వినాయకుడి పూజల్తో తొమ్మది రోజులూ ఆనందం కలుగుతూనే వుంటుంది. ప్రతి వాళ్ళు వెడుతూ వస్తూ దణ్ణం పెట్టుకుంటూనే వుంటారు. తిలక్ మహాశయుడు ఆశించిన సామాజిక భక్తిచైతన్యం కలుగుతూనే ఉంది.
ప్రతి పనిలోనూ ఒక మంచితోపాటు కాస్త మనసుకు కష్టం కలిగించే లక్షణం కూడా వుంటుంది. ఈ కష్టాన్నీ సహించే ఓర్పును అలవరచుకుంటూ ఆనందాన్నే హృదయానికి అందించే ప్రయత్నం చేయాలిరా తల్లీ ... అంది. అమ్మమ్మ మాటలతో చందాలవారిమీద ఉన్న కోపం కొంత తగ్గింది హంసికి.
|