6
 

ఒక్క వినాయ‌క పూజే కాదు. ద‌స‌రాల్లో దేవీ న‌వ‌రాత్రులు, ఆషాడంలో బోనాలు. అస‌లొక ర‌కంగా చూస్తే ఇంచుమించు అన్ని మ‌తాచారాలూ క‌లుపుకుని సంవ‌త్స‌రం పొడుగునా పండ‌గ‌లే ! అమ్మ‌మ్మా ఎందుక‌ని మ‌న దేవుళ్ళ‌కి వింత ఆకారాలు. వినాయ‌కుడు చూడు ఏనుగు ముఖం, ఎల‌క వాహ‌నం ! నాగ‌య‌జ్ఞోప‌వీతం...హంసి వంక న‌వ్వుతూ చూసింది జ‌యంతి. త‌ల్లీ నీకిది అర్థంకాలేదంటే నేను న‌మ్మనురా...హంసి గారంగా అంది, చూడు అమ్మ‌మ్మా ! నాకు నువ్వు వ‌చ్చిన ద‌గ్గ‌ర్నుంచీ అనేక‌మైన గొప్ప గొప్ప విష‌యాలు చెప్తున్నావు. నేను అవే మాట‌లు మా ఫ్రెండ్సుకి చెప్తుంటే వీళ్ళు... ఇదిగో ఈ గ‌రిమ‌, పూజిత‌, స్వ‌ర్ణ వీళ్ళంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. పైగా వీళ్ళు వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ప్ర‌త్యేక వ్యాసాలు వ్రాస్తారుట‌. ఇక నీ మాట‌లు ముక్కున ప‌ట్టుకుని వ్యాసాల్లో వ‌దులుతార‌న్న‌మాట !

జ‌యంతి చెప్ప‌డానికి కూర్చుంది. అక్క‌డ‌క్క‌డ నిల‌బ‌డి క‌బుర్లు చెప్పుకుంటున్న వాళ్ళంద‌రూ గ‌బ‌గ‌బా వ‌చ్చి మౌనంగా కూర్చున్నారు. హాలు నిండిపోయింది. గ‌ణప‌తిది చిన్న‌పిల్ల‌వాడి మ‌న‌స్తత్వం. గ‌ణాధిప‌తి, గ‌ణాధ్య‌క్షుడు అని అంటూ వుంటాం. ప్ర‌మ‌ధ గ‌ణాధీశుడైనా అతి పెద్ద జంతువైన గ‌జ‌ముఖాన్ని ముఖంగా గ‌ల‌వాడైనా చిట్టి చిన్న‌బాల గ‌ణ‌ప‌తి అమాయ‌కంగా న‌వ్వుతున్న‌ట్లే వుంటుంది. ఇది కేవ‌లం నా భావ‌మే సుమండీ ! మీరు కూడా పరికించి చూడండి. త‌మ్ముడితో స‌మంగా ప్ర‌పంచ ప్ర‌దిక్ష‌ణ చెయ్య‌లేక గెలిచే విధానాన్ని అమ్మ‌నే అడిగి తెలుసుకున్న గ‌డుసు గ‌ణ‌ప‌తి మొహం పాలుగారే ప‌సి మోములాగానే ఉంటుంది. జ‌యంతి మాట‌ల‌కు చాలామంది నిజం నిజం గ‌ణ‌ప‌తి ముఖం చాలా అమాయ‌కంగా ప‌సిత‌నంతో ఓడుతున్న‌ట్లు వుంటుంది. అన్నారు. గ‌జాన‌నుడు అమ్మ‌వారి న‌లుగుపిండి నుండి రూపుదాల్చాడ‌ని క‌థ క‌దా. ఈ న‌లుగు పిండి అంటే ఏమిటంటే ? ఆకాశ తత్త్వం ప‌ర‌మేశ్వ‌రుడు. పృధ్వీ త‌త్త్వం అమ్మ‌. జ‌ల‌త‌త్త్వం గంగ‌మ్మ. పృధ్విని, జలాన్ని తేజ‌స్సుతో మిళాయించింది ప‌ర‌మేశ్వ‌రి. త‌న శ‌రీరం నుండి చంద‌న గంధ ప‌రిమ‌ళాల న‌లుగుతో స‌రిసాళ్ళుగా క‌లిపింది. ఇక్క‌డితో పృధివి, ఆకాశం, వాయువు, జ‌లం, అగ్ని ఈ అన్ని త‌త్త్వాల స‌మాహారంగా మూల‌ప‌దార్థం సిద్ధ‌మ‌య్యింది. సంక‌ల్ప‌మాత్రం చేత ప్రాణం త‌నంత‌ట తానే వ‌చ్చి పార్వ‌తీ పుత్రుణ్ణి ఆశ్ర‌యించుకు కూర్చుంది. అన్ని తత్త్వాలు స‌మ్మిళిత‌మైనా వినాయ‌కునిలో పృధ్వీత‌త్త్వం పాళ్ళు మ‌రీ ఎక్కువ‌. అందుకే భూమికి క‌లుగులు చేసే ఎలుక‌ను త‌న చెప్పుచేత‌ల్లో వుంచుకున్నాడు భూమి ప్రియుడు అంది జ‌యంతి.

గ‌జ‌ముఖం బుద్దికి ప్ర‌తీక క‌దా అమ్మ‌మ్మా ! అందుకేగ‌దా సిద్ధి బుద్ది ఇద్ద‌రు భార్యలున్నారంటారు. హంసీ నీకు ప్ర‌తీక అంటే ఏమిటో తెల‌సిందా ? ఓ ! ప్ర‌తీక అంటే రెప్లికా, అంటే ... అంటే...రెండిటికీ భేదం లేద‌న్న‌మాట ! అంతేక‌దా అమ్మ్మమ్మా ! హంసి చేయి ప‌ట్టుకుని న‌వ్వుతూ చెప్పింది జ‌యంతి.

మ‌న పూర్వీకులు మ‌న‌కు అన్నీ అర‌టిపండు వొలిచి చేతిలో పెట్టిన‌ట్లు చెప్ప‌లేదు. కొన్ని గుర్తులు, కొన్ని సూచ‌న‌లు, కొన్ని మార్గాలు మ‌న‌కు చూపించి అస‌లు విష‌యాన్ని ఎవ‌రి శ‌క్తిని బ‌ట్టివారు, ఎవ‌రి బుద్ధిని బ‌ట్టివారు నిర్ణ‌యించుకోమ‌ని వ‌న తెలివికే వ‌దిలేశారు. అందుచేత‌నే మ‌న‌కిన్ని శాస్త్రాలు, ఇన్ని భాష్యాలు, ఇన్ని వ్యాఖ్యానాలు, ఇన్ని సిద్ధాంతాలూనూ. ఇది ఇదీ అని మూడు ముక్క‌ల్లో ఉన్న‌దున్న‌న‌ట్లు చెప్పేస్తే మ‌నం స‌త్యం కొర‌కు ఇంత అన్వేష‌ణ చెయ్య‌ము. ఇంత ప‌రిశోధ‌న చెయ్య‌ము. ఇంత వివేచ‌నా చెయ్య‌ము !

ఇది మ‌న పెద్ద‌లు మ‌న‌కిచ్చిన వ‌రం ! జ‌యంతి మాట‌ల‌కు అడ్డం వ‌చ్చింది తాయార‌మ్మ‌. అమ్మా ఆ మ‌ధ్య‌న ఏవో దేవాల‌యం...పేరు స‌రిగా గుర్తులేదు. అక్క‌డ వినాయ‌కుడికి చీర క‌ట్టారు. అది వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం చెక్కిన శిల్పం ! జ‌యంతి అంది, అమ్మా గ‌ణ‌ప‌తి మంత్రాలు మీరు విన్నారో లేదో అమ్మ‌వారి షోడ‌శాక్ష‌రిని గ‌ణ‌ప‌తి బీజాక్ష‌రాల‌కు ల‌యించిన మంత్రాలు కూడా ఉన్నాయి. పార్వ‌తీదేవి పాపాయి ప్రాణం పోసుకోగానే ఆక‌సంలో స్త్రీ దేవ‌త‌ల క‌ల‌క‌లం హెచ్చు అయ్యందిట ! ఆ జగ‌న్మాత ఎంతో ఆనందిచింద‌ట‌. వీరంతా నా బిడ్డ‌కు ఏవేవో మంచి కానుక‌లే తెచ్చి ఉంటార‌ని ఆశ‌గా చూసేస‌రికి ఆ వ‌చ్చిన వాళ్ళ గొంతుక‌కు వెల‌క్కాయ అడ్డుప‌డిన‌ట్ల‌య్యింది. వాళ్ళు ఆత్రంగా ఉత్తి చేతుల‌తో ఉన్న‌వాళ్ళు ఉన్న‌ట్లుగా వ‌చ్చారు. అంద‌రిక‌న్న ముందు ల‌క్ష్మీదేవి తేరుకుంది. ఈశ్వరీ నీ బిడ్డ‌కు నా వైష్ణ‌వీ శ‌క్తిని ద‌త్తం చేస్తున్నాను అందిట‌. వెంట‌నే బ్ర‌హ్మ‌దేవుని స‌తి బ్రాహ్మీశ‌క్తిని కాన్క చేస్తున్నాను అన్న‌ది. ఇక ఎవ్వ‌రూ త‌డుముకోలేదు. వారాహి, మ‌హేంద్రి, చాముండి, కౌమారి మొద‌లైన స‌ప్త‌మాతృక‌లు స‌మ‌స్త దేవ‌త‌లు వారిలోని శ‌క్తుల‌ను కానుక చేసేస‌రికి గ‌ణ‌ప‌తి శ‌క్తి గ‌ణ‌ప‌తి, ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి అని అనేక రూపాల‌తో వారికి క‌నుపించాడు. అనేక మంది ఋషుల‌కు అనేక మంత్రాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఉదాహ‌ర‌ణ‌గా ఒక్క మంత్రం చెప్తాను వినండి. గ బీజాక్ష‌రం, బిందువు శక్తి. అంటే గం. గం క ఏ ఈ ల హ్రీం గం హ‌స‌క‌హ‌ల‌హ్రీం గం స‌క‌ల‌హ్రీం. ఇది అమ్మ‌వారి షోడ‌శితో గ‌ణ‌ప‌తి మంత్రాన్ని మేళ‌వించిన మంత్రం. గురుముఖ‌త ఉప‌దేశం పొందిన‌వాళ్ళే మంత్ర జ‌పం చెయ్యాలి. పుస్త‌కాల్లో చ‌దివి జ‌పం చేయ‌కూడ‌దు...అంది జ‌యంతి.

విఘ్నేశ్వ‌రి, వినాయ‌కి అని కూడా అంటారుగా అంది జ‌య‌తి. అమ్మా ! పంచాయ‌త‌నం అంటే ఏమిటి శంక‌రులు పంచాయ‌త‌నానికి చాలా ప్రాముఖ్యాన్ని ఇచ్చారంటారు ఎందుక‌ని ? కామేశ్ర్వ‌రి ప్ర‌శ్న‌కు జ‌య‌తి ఆశ్చ‌ర్య‌పోయింది. ఎప్పుడూ న‌గ‌ల మాట ఎలా తెలిసిందో అనుకుంది. జ‌యంతి అంద‌రివంకా చూసి ఇలా ప్రారంభించింది. ఇందాక చెప్పుకున్నాం, తేజ‌స్సు పృధ్వి జ‌ల‌ము క‌లిసి మ‌హాగ‌ణ‌ప‌తి అనుకున్నాం. దివ్యులు అంటే దేవ‌త‌లు లేదా దేవుళ్ళు వీరంద‌రూ పేర్లువేరైనా బ్ర‌హ్మ‌త‌త్త్వ‌మూ ప‌ర‌బ్ర‌హ్మ‌తత్త్వ‌మూ తెలుసుకుంటే ఉన్న‌ది ఒక్క‌టేన‌ని తెలుస్తుంది. అలా తెలుసుకోగ‌ల‌గాంల‌టే పూర్వ‌జ‌న్మ సుకృత‌మూ అనేక జ‌న్మ‌ల సాధ‌నా జ్ఞాన‌మూ దైవ‌కృప కావాలి ! ఇవి అంద‌రికీ ఉండ‌వు గ‌నుక అంద‌రికీ పనికి వ‌చ్చేలా మ‌న మూర్తి లేదా విగ్ర్ర‌హ పూజ‌ను పెద్ద‌లు మ‌న‌కు అందించారు. శివుడు గొప్పా ? విష్ణువు గొప్పా ? లేదా అమ్మవారిని పూజించాలా ? అన్న స‌మ‌స్య‌లు అంద‌రికీ క‌లుగుతూ వుంటాయి. ఇలాటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగా శివుడు, విష్ణువు, సూర్యుడు. గ‌ణ‌ప‌తి, అమ్మ‌వారు ఈ అయిదు స్వ‌రూపాల‌ను ఒక్క‌చోట పెట్టి ఒక్క‌లాగ ఆరాధించేప‌ద్ధతిని ఆదిశంక‌రులు మ‌న‌కు అనుగ్ర‌హించారు. ఆ రోజున గ‌ణ‌ఫ‌తి వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకోవాలంటే శ్రీ మ‌హాగ‌ణేశ త‌త్త్వాన్ని తెలియ‌చేసే గ‌ణ‌ప‌తి పురాణం, గ‌ణేశ పూర్వ‌తాపిన్యుప‌నిష‌త్తు, గ‌ణేశోత్త‌ర తాపిన్యుప‌నిషత్తు, గ‌ణేశ వైభ‌వాన్ని గురించి విస్తృతంగా వ‌ర్ణించాయి. గ‌ణానాంత్వాం గ‌ణ‌ప‌తిం అంటూ ఏ కార్యాన్నైనా నిర్దిఘ్నంగా ప‌రిపూర్ణం గావించుకొనేందుకు గ‌ణ‌ప‌తిని పూజిస్తాము. వ‌క్ర‌తుండ మ‌హాకాయుడైన ఈ గ‌ణ‌ప‌తి ప‌ర‌బ్ర‌హ్మ‌స్వ‌రూపుడు. ఋగ్వేదంలో బ్ర‌హ్మ‌ణ‌స్ప‌తి సూక్తం ఈ విష‌యాన్ని వివ‌రిస్తోంది. జ్యేష్ఠ‌రాజం బ్ర‌హ్మ‌ణ‌స్ప‌త ఆన‌శృణ్య (ఆన‌శ్శృణ్వ‌) తండ్రి ద‌గ్గ‌రున్న ఐశ్వ‌రాన్ని మ్రొక్కిన‌వారికి మిక్కుటంగా ప్ర‌సాదిస్తాడు. అత‌డూ తండ్రివ‌లెనే బోళాశంక‌రుడు. త‌ల్లివ‌లె అయిద‌వ‌త‌నాన్ని స‌ర‌స్వ‌తిని ల‌క్ష్మిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నందున విద్య‌ని ధ‌నాన్ని కొల్ల‌లుగా ద‌య‌చేస్తాడు. వినాయ‌క‌చ‌వితికి అంద‌రం భ‌క్తిగా పూజ‌లు చేసుకుందాం జ‌యంతి మాట‌ల‌కు అంద‌రూ మౌనంగా త‌ల‌లూపారు. అమ్మ‌మ్మా నాదొక అనుమానం హంసిని ఏమిట‌న్న‌ట్లు చూసింది జ‌యంతి. నువ్వు అన్నీ త్వ‌ర‌త్వ‌ర‌గా అనండి. మ‌రామ‌రా అనండి అంటావుగ‌దా ! నేను గంగ‌ణ‌తే న‌మః అని త్వ‌ర‌త్వ‌ర‌గా అంటే నాకొక భావం క‌ల్గింది. గంగ గంగ గంగ అని. అంటే గంగ‌గ‌ణ‌ప‌తే అన్పిస్తోంది. వరుణ అసి అనే న‌దులు అని కొంద‌రంటానుకో. ఇంకొక‌టేమిటంటే ఎప్పుడూ తండ్రి పిల్ల‌ల్ని నెత్తినెక్కించుకుంటాడు. పెళ్ళాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఈశ్వ‌రుడి నెత్తిన ఉన్న ఆ గంగ గ‌ణ‌నాధుని ప్ర‌తిరూప‌మేనేమో ! హంసి మాట‌ల‌కు జ‌యతి జ‌యంతితోపాటు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. త‌ల్లీ నువ్వు చెప్పిన మాట‌లు చాలా బాగున్నాయి. ఆలోచించ వ‌ల‌సిన‌వే కూడాను. అనాది నుండి గంగ‌ను ఈశ్వ‌రుడి భార్య‌గానే క‌వులు వ‌ర్ణించారు. గంగా గౌరీ సంవాదాలు చిత్రించారు. ఇవి క‌వి చ‌మ‌త్కారాలు. కాళిదాసు వాల్మీకి వశిష్ఠుడు గంగ‌ను ప్ర‌శంసిస్తూ గంగాష్ట‌కాలు ర‌చించారు. గ‌ణ‌ప‌తి జ్ఞాన‌ప‌తి, గంగ అంటే జ్ఞాన‌ప్ర‌వాహం. కిల్బిష‌హర ప్ర‌వాహం, మోక్ష ప్ర‌వాహం. ఈ గంగా ప్ర‌స‌క్తిని గురించి మ‌రొక‌సారి ముచ్చ‌టించుకుందాం - ఇవ్వాళ్టికి జ‌య‌ఘోష చేద్దాం.

జై విజ‌య గ‌ణేశ్ కీ జై జై విద్యా గ‌ణేశ్‌కీ జౌ
జై ల‌క్ష్మీ గ‌ణేశ్ కీ జై జై మౌనానంద య‌తీశ్వ‌రుల‌కీ జై
జై శివ చిదానంద భార‌తుల‌కీ జై జై రాజ‌రాజేశ్వ‌రీ అమ్మ‌వారికీ జై