భార‌త‌దేశానికి త‌ర‌గ‌ని సంప‌ద వేద‌వాజ్ఞ్మ‌యం. ఎంద‌రో మ‌హాత్ములైన మునులు ఋషులు అచంచ‌ల దీక్ష‌తో తీవ్ర‌మైన త‌ప‌స్సు చేయ‌గా వారి అంత‌రాంత‌రాళాల‌లో మార్ర్మోగిన దివ్య‌నాద‌మే వేద‌మంత్ర‌మ‌య్యింది. అన‌గా వేదాల‌ను ఎవ్వ‌రూ ర‌చించ‌లేదు అన్న మాటే. ఈ విశ్వ‌మంతా వ్యాపించిన మ‌హానాదం నుండి పుట్టిన మ‌హిమాన్విత‌మైన వేద‌మంత్రాల‌ను య‌ధాత‌ధంగా తాము సాధ‌న చేసి శిష్యుల‌చే సాధ‌న చేయించారు ఋషులు వేదాల‌లోని అక్ష‌రాలు, స్వ‌రాలు, దీర్ఘ‌హ్ర‌స్వ ప్లుతాలు అన్నీ ఆదిలోనే నిర్ణ‌యింప‌బ‌డ్డాయి. నిర్దుష్టంగా వేద‌గానం జ‌రిపితేనే స‌త్ఫ‌లాలు ప్రాప్తిస్తాయి. లేదంటే ఫ‌లం ప్ర‌తికూలంగా ఉండ‌వ‌చ్చు. ఉండ‌వ‌చ్చేమిటి ? ఉండి తీరుతుంది.

అందుకే వేద‌మంత్రం చిన్న మార్పు కూడా లేకుండా అనాది నుంచి ఒకే స్వ‌రంతో ఒకే ల‌య‌తో ఒకే ప్ర‌కారంగా ప‌ఠింప‌బ‌డుతోంది. ఇందుకు వేద‌పండితుల‌కు గురువుల‌కు దేశం యావ‌త్తూ స‌ర్వ‌దా ఋణ‌ప‌డి ఉంటుంది. ఉండాలి.

ఇంతేకాక భార‌తీయ నాగ‌రిక‌త అనే స్వ‌ర్ణ‌మ‌య సింహాస‌నానికి వివేచ‌న‌, ఆధ్యాత్మిక చింత‌న‌, తాత్త్విక స‌మాలోచ‌న‌, మ‌హాసార‌స్వ‌త సృష్టి, ఖ‌గోళాది స‌ర్వ‌వైజ్ఞానిక శాస్త్రసంప‌ద‌, త‌ర్క‌న్యాయ మీమాంసాది హేతుబ‌ద్ధ‌మైన నిరూప‌ణ‌, విజ్ఞానం, స‌నాత‌న‌ధ‌ర్మ ప‌రిపాల‌న మొద‌లైన సంద‌ల‌న్నీ వ‌జ్ర వైఢూర్యాది న‌వ‌ర‌త్నాలు, కోటి సూర్య‌ప్ర‌భ‌ల‌తో దివ్య‌కాంతుల‌ను స‌మ‌కూర్చాయి. ఇంత‌టి ప్ర‌తిభామ‌య‌మైన వార‌స‌త్వం మ‌న‌కంద‌డానికి ముఖ్య‌కార‌ణం సంస్కృత‌భాషే. అన్ని సార‌స్వత ప్ర‌క్రియ‌ల్లోనూ శాస్త్ర నిరూప‌ణ‌లోనూ సంస్కృత వాణి సౌంద‌ర్య‌వాహినియై ప‌ర‌వ‌ళ్ళు తొక్కింది. ఆ చ‌దువుత‌ల్లి భార‌తీదేవి క‌రుణాక‌టాక్ష వ‌ర్షం ఈ దేశంపై ఇంత‌గా కురిసినందువ‌ల్ల‌నేనేమో మ‌న‌దేశం భార‌త‌దేశం అయ్యింది.

తాత్త్విక చింత‌న వేద‌ప్ర‌తిపాదిత‌మైన ధార్మిక‌వార‌స‌త్వం త‌ర‌త‌రాలుగా అనుక్ర‌మిస్తూనే ఉంది. కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు క‌లిగినా మూల‌వ‌స్తువు మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. అనేక మ‌తాలు, అనేక ఆచారాలు, సంప్ర‌దాయాలు, అనేక మార్గాలు ఎన్ని వ‌చ్చినా అన్నిటికీ వేద‌మే మూలాధారం అన‌వ‌చ్చు. భార‌త‌దేశానికి ఆత్మ వేద‌మే ! వేద‌మే ప‌ర‌మాత్మ ! గ‌జిబిజిగా ఉన్న వేదాల న‌న్నిటినీ వేరువేరుగా విభ‌జించి నాల్గువేదాలుగా స్థిరం చేశాడు వేద‌వ్యాసుడు. వేద‌వ్యాసుడు సాక్షాత్తు నారాయ‌ణ స్వ‌రూపం అని అంటారు. బ్ర‌హ్మ‌సూత్రాలు అష్టాద‌శ పురాణాలు ర‌చించిన వేద‌వ్యాసుడు భార‌త‌భార‌తికి మొద‌టి ముద్దుబిడ్డ‌. వ్యాసుణ్ణి మ‌రిపించేలాగ అద్వైత మ‌హాసౌధాన్ని పున‌ర్నిర్మించిన శంక‌ర భ‌గ‌వ‌త్పాదులు మ‌రింత గారాల‌ప‌ట్టి.

య‌జ్ఞాలు హోమాలు, వేద‌విహిత‌మైన క‌ర్మ‌లు ఆచ‌రిస్తూ ప‌శుబ‌లుల నిచ్చే ఆచారం ఎక్కు అవ‌డంతో హింస‌మీద తిరుగుబాటుగా అహింసా వాద‌సూత్రాన్ని ఆధారంగా చేసుకొని బౌద్ధ‌మతం ఉద్భ‌వించి పెరిగి పెద్ద‌ద‌య్యింది. ఈ బౌద్ధంలో య‌జ్ఞ‌యాగాదులు లేవు. ఈశ్వ‌రుడు లేడు. స్వ‌ర్గ‌న‌ర‌కాదులూ లేవు. అంతా శూన్య‌వాదం. నిరీశ్వ‌ర‌వాదం.

వేద‌మ‌తానికి త‌ప్ప‌, వేద‌మ‌తం ఆధారంలేని ఏ మ‌తానికైనా ఈ దేశంలో సృష్టి స్థితుల‌తోపాటు ల‌యంకూడా త‌ప్ప‌దు. అందుకే బౌద్ధం భార‌తంనుంచి దూరంగా వెళ్ళ‌క త‌ప్ప‌లేదు.

వ్యాసుడంత‌టివాడు మ‌ళ్ళీ పుట్ట‌వ‌ల‌సిన అగ‌త్యం ఏర్ప‌డింది. ప్ర‌జ‌ల‌కు ఒక‌దారి చూపేవాడు కావాల్సిన త‌రుణం వ‌చ్చింది. ర‌క‌ర‌కాల సంప్ర‌దాయాల‌లో ఏదిమేలైన‌దో దిక్కుతోచ‌ని త‌రుణంలో మీ క‌ర్త‌వ్యం ఇదీ, మీ ల‌క్ష్యం ఇదీ అని మార్గ‌ద‌ర్శ‌నం చేసే ఒక మ‌హామ‌హితాత్ముని రాక‌కై భార‌త ప్ర‌జ ఎదురుచూస్తోంది.

బౌద్ధం క్షీణ‌ద‌శ‌కు చేరుకుంటూ ఉండ‌గా వైదిక వృక్షం పుష్పించ‌డానికి ఉద్యుక్త‌మ‌య్యింది. కుమారిల‌భ‌ట్టు అనే ఉద్దండుడు య‌జ్ఞ‌యాగాది క్ర‌తువుల‌ను వైభ‌వంగా చేయించ‌సాగాడు. పురాణాలు ప్రాముఖ్యంలోకి వ‌చ్చాయి. ఆరు ద‌ర్శ‌నాలూ వ్యాప్తికొచ్చాయి. దేనిక‌దే ఘ‌న‌మైన‌దిగా భావింప‌బ‌డ్డాయి. పూజా తంతులు ఎక్కువ‌నాయి.

ఇంత‌లో మ‌రొక అప‌శృతి ! ఎవ‌రు పూజ‌వారు చేసుకోక మా దేవుడు గొప్ప అంటే మాదేవుడు గొప్ప అనే అహంకారాలు, క‌క్ష‌లు, కార్ప‌ణ్యాలు, ఘ‌ర్ష‌ణ‌లు, క‌ల‌హాలు, హింస‌లు, ఈర్ష్య‌లు, మాత్స‌ర్యాలు మ‌నిషిలోని మ‌న‌స్సును పెడ‌దారి ప‌ట్టించ‌సాగాయి. ఏదో అసంతృప్తి ! అస‌మ‌నం. అర్థంలేని వాద‌న‌లు ఎటూ తేల్చుకోని సందిగ్ధ స్థితిలో అన‌వ‌స‌ర విష‌యాల‌కి ప్రాముఖ్యాన్ని ఈయ‌సాగారు. నిజంగా శివుడిని పూజించినా, విష్ణువుని పూజించినా, భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో అర్చ‌న చేస్తే ఏ త‌గ‌వూలేదు. భ‌క్తి మాట మ‌ర్చిపోయి పైపై క్రియ‌ల‌కి ప్రాముఖ్యాన్ని ఇచ్చి విభూతి రేఖ‌లు ఎలా ధ‌రించాలా ? సింధూరాన్ని ధ‌రించాలా అన్న చ‌ర్చ‌లు ఎక్కువైనాయి. కొంద‌రు ఏపూజ‌లూ చేయ‌క నాస్తిక‌వాదాన్ని ఆశ్ర‌యించ‌సాగారు.

ఇక శ‌క్తిని ఆరాధించే ప‌ద్ధ‌తిలో మ‌రెన్నో ర‌కాలు పుట్టుకొచ్చాయి. ఇందులో అతి హేయ‌మైన వామాచారం అనే దుష్ట ఆచారం బ‌య‌లుదేరింది. వామాచార విధానంలో అర్చ‌న‌లు చేసేవారు త‌న ప‌ద్ధ‌తి హేయ‌మైన‌ది అని అనుకోరు. వారికి ఈ విధానంలోనే మోక్ష‌ఫ‌లాలు ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటాయి. ఎవ‌రి పూజ‌లు ఎవ‌రి ప‌ద్ధ‌తులు వారు చూసుకోక ఇత‌రుల‌ను హేళ‌న‌చేయ‌డం, కించ‌ప‌ర‌చ‌డం, వైరాలు పెంచుకోవ‌డం, అన్ని మ‌తాల‌వారిలోనూ సామాన్య‌మైపోయింది. దీనితో ఎక్క‌డ చూసినా ద్వేషాలు కొట్లాట‌లు ఎక్కువైపోయాయి.

అస‌లు న‌న్నే మ‌రిచిపోయారే అని భ‌గ‌వంతుడు భావించాడు. ఇంత‌మందిని, ఇన్ని ఛాంద‌స భావాల‌ని, ఇంత అజ్ఞానాన్ని రూపుమాపాలంటే మ‌ళ్ళీ పుట్ట‌క త‌ప్పదు అనుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఆదిశంక‌రుడు ప్ర‌భ‌వించ‌డం జ‌రిగింది. సంభ‌వామి యుగేయుగే అన్న‌ట్లు ఆ కైలాస‌వాసుడే శంక‌రునిగా కేర‌ళ‌లో అవ‌త‌రించాడు. శుభం.


ప‌చ్చ‌ని పొలాల‌తో కొబ్బ‌రి, ప‌న‌స‌వంటి ఫ‌ల‌వృక్షాల‌తో పున్నాగ‌, మందార‌, పొగ‌డ‌, సంపంగి వంటి పుష్ప వ‌న‌వాటిక‌ల‌తో స‌ముద్ర సంగ‌మానికై ప‌రుగులు తీస్తున్న న‌దీ నాట్యాల‌తో ఆకాశం దిగివ‌చ్చి భూక‌న్య‌ను ఆలింగ‌నం చేసుకోనుత్స‌హిస్తోందా అన్న‌ట్లు ఉన్న ఎంతో అంద‌మైన సుంద‌ర‌నంద‌న వ‌నం ఆప్ర‌దేశం. పేరు కేర‌ళ‌. క‌ద‌ళీ వ‌న‌విర‌ళ !

ఆ ర‌మ‌ణీయ రాష్ట్రంలో పుర‌జ‌నుల పుణ్య‌మే ప్ర‌వ‌హిస్తోందా అన్న‌ట్లున్న పూర్ణాన‌ది. న‌దీతీరంలో పూచే పుష్ప సుగంధాల నందుకోగ‌లంత దూరంలో ఉన్న‌దొక అగ్ర‌హారం. పేరు కాల‌డి. కాల‌డిలో కాలాన్ని వెళ్ళ‌దీస్తున్న వ‌య‌స్సు ముదురుతున్న పుణ్య‌దంప‌తులు. ఆయ‌న శివ‌గురువు. ఆమె స‌తీదేవి. వీరిది సంపన్న కుటుంబం.

స‌తీదేవిని అంద‌రూ అమ్మ‌గారూ అని అర్ధం వ‌చ్చేలాగ ఆర్యాంబా అని పిలుస్తారు. ఆర్యాంబ అంటేనే అంద‌రికీ తెలుస్తుంది. స‌తీదేవి అంటే కొంద‌రికే తెలుస్తుంది. వీరికి పిల్ల‌లు క‌లుగ‌లేదు. ఎన్నో పూజ‌లు, వ్ర‌తాలు చేశారు. అయినా ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేదు.

చివ‌రిగా వారికి కొంత‌దూరంలో ఉన్న సుప్ర‌భ అనే ఆల‌యానికి వెళ్ళారు. ఆ ఆల‌యంలోని దైవం పేరు వృషాచ‌లేశ్వ‌రుడు. వారి అనంత వేద‌న‌ని ఆ ఈశ్వ‌రునికి విన్న‌వించుకుని ఆవేద‌నా భారంతో శోషించిపోయారు.

ఎంతో నియ‌మ‌నిష్ఠ‌ల‌తో చేసిన వీరి అర్చ‌న‌కు త‌పస్సుకు పార్వ‌తీ ప‌తికి ద‌య‌క‌ల్గింది. త‌క్కువ ఆయుష్షువుండి వివేకి, విజ్ఞాని, విద్యావంతుడు అయిన కుమారుడు కావాలా ? లేక పూర్ణాయుష్మంతులు, అజ్ఞానులు అయిన బ‌హు పుత్రులు కావాలా ? అని ప్ర‌శ్నించాడు ఈశ్వ‌రుడు. అది క‌లో, నిజ‌మో అని శివ‌గురువు కంగారుప‌డ్డాడు. క‌ల‌లోనైనా స‌రే విజ్ఞాన‌వంతుణ్ణే పుత్రునిగా కోరుకుంటాన‌నుకున్నాడు. అలాగే వ‌రం కోరుకున్నాడు. కాలుడు అనే శివుడు. కాల స్వ‌రూపుడు. కైలాసం వ‌ద‌లి ఈ కాల డి లో పెద్ద‌కాలం ఎలా ఉండ‌గ‌ల‌డు ? అందుక‌ని స్వ‌ల్పాయుష్షును వెంట‌పెట్టుకుని కాల‌డిలో కాలుపెట్టాల‌నుకున్నాడు.

ఆర్యాంబ గ‌ర్భం ఫ‌లించింది. వైశాఖ‌మాసం శుక్ల పంచ‌మి. గ్ర‌హాల‌న్నీ ఉచ్ఛ‌స్థితిలో ఉండ‌గా శివ‌ఫ‌లం, ఆమె ఒళ్ళోకి వ‌చ్చి చేరింది. శిశువు జ‌న్మించాడ‌న్న ఆనందంతో శివ‌గురువు గోదానాలూ భూదానాలు స్వ‌ర్ణ‌దానాలు చేశాడు. తెలిసిన వారినంద‌రినీ త‌న‌దానాల‌తో సంతృప్తిప‌ర‌చాడు. లేక‌పోతే వారి ఈర్ష్యా, అసూయా, దృష్టిదోషం త‌న పిల్ల‌వాడికి చుట్టుకుంటుందేమోన‌న్న భావం ఒక‌టి, అంద‌రూ సంతోషంగా ఉండాల‌నే భావం ఒక‌టి. ఏదైతేనేమి ఆ బాలుని జ‌న‌నానికి గ్రామం అంతా సంతోషించింది. నామ‌క‌ర‌ణం వైభ‌వంగా జరిగింది. శంక‌రుని ద‌య‌వ‌ల్ల పుట్టినందున శంక‌రుడ‌నే పేరు పెట్టుకున్నారు. ఆర్యాంబ శివ‌గురువుల సంతోషానికి అంతులేదు. పిల్ల‌వాణ్ణి చూసుకుంటూ వుంటే వారికి లోక‌మే తెలియ‌టంలేదు. శంక‌రుడే వారి లోక‌మైపోయాడు.

శంక‌రుడు మూడవ‌నెల‌లో ఉంగా ఉంగా అంటున్నా క‌ళ్ళు మాత్రం ఉత్ప‌త్తి స్థితి ల‌య‌ల‌ను గురించి ప‌రిశోధ‌న చేస్తున్న‌ట్లే ఉండేవి. ఆరోనెల‌లో నాలుక అకార త‌కారాల‌తోపాటు మ‌ధ్య ద‌కారాన్ని కూడా క‌లుపుతుంది. అద్‌త‌, అద్‌త, అదే అద్వైతంగా రూపాంత‌రం చెందింది. తండ్రి ద‌గ్గ‌ర ఓన‌మాల‌కు ముందే ఓంకారం చెయ్య‌డం నేర్చుకున్నాడు. ఓంకార తత్త్వాన్ని కూడా వంట‌ప‌ట్టించుకున్నాడు. ముందు ముందు యావ‌ద్భాత‌దేశాన్నీ త‌న గుప్పెట్లోకి తెచ్చుకోడానికి వీలుగా మాతృభాష అయిన మ‌ల‌యాళంతో పాటు అనేక భాష‌ల‌ను ఔపోస‌నం ప‌ట్టాడు. నేర్వ‌కుండానే వ‌శ‌మ‌య్యింది దేవ‌భాష అయిన సంస్కృత‌భాష‌. గీర్వాణి శంక‌ర జిహ్వాగ్ర వ‌ర్తిని అయ్యింది.

చుట్టుప‌క్క‌ల ఉన్న గురుకులాల‌న్నిటికీ గుజ‌గుజ నుడుచుకుంటూ ప‌రుగు లెత్తుకుంటూ వెళ్ళెవాడు. అంద‌రికీ ముద్దుకృష్ణుడే. ఒక చోట సామ‌వేద గానం. మ‌రోచోట యజుర్వేద మంత్ర‌ప‌ఠ‌నం ఒక‌చోట ఋగ్వేద సూత్రం అన్నీ ఏకాగ్ర‌త‌తో వినేవాడు. అన్నిటినీ త‌న‌కు తనే మ‌ళ్ళీ చెప్పుకొనేవాడు. అన్నీ శంక‌రునికి కంఠోపాఠాల‌య్యాయి. ఇంతాచేసి మూడుసంవ‌త్స‌రాలే ! ఇవ‌న్నీ చిల‌క‌ప‌లుకుల‌లాగ ప‌లికేవాడు కాదు. అర్థాల‌ను అర్థించి మ‌రీ తెలుసుకునేవాడు. ఊరంత‌టికీ ముద్దుబిడ్డ‌. ఎంత‌లేసి భావాలు వ‌స్తున్నాయి ఆ చిన్ని మెద‌డులోకి ? అని అమ్మా నాన్నా ఆశ్చ‌ర్య‌పోయేవారు. దిష్టి త‌గులుతుందేమోన‌ని గ‌జ‌గ‌జ‌లాడిపోయేవారు.

శివ‌గురువు సంధ్య‌వార్చుకుంటున్నా న‌దిలో నిల‌బ‌డి సూర్యునికి అర్ఘ్యాలు ఇస్తున్నా పెద్ద‌పెద్ద క‌ళ్ళ‌తో వింత‌గాచూస్తున్న శంక‌ర‌బాలుణ్ణి చూసి ఉప‌న‌య‌నం చేయాల‌ని నిశ్చ‌యించుకున్నారు. కాని ఇంత‌లో ఆ కుటుంబానికి పెద్ద ఆప‌ద సంభ‌వించింది. శివగురువు శివైక్యం చెందాడు. ఆర్యాంబ కొండంత దుంఖంలో కొట్టుకుపోతూ ఉంటే కుమారుడు కొంగుప్ట‌ట్టి ఆపిన‌ట్ల‌య్యింది. వంశోద్ధార‌కుడు శంక‌రుణ్ణి త‌ను లేక‌పోతే ఎవ‌రు చూస్తారు ? అని అనుకుంది. దుఃఖం నుండి మ‌న‌సును మ‌ళ్ళించుకుని బంధువుల‌చేత ఉప‌న‌యం చేయించింది.

ఆర్యాంబ‌కు స‌ర్వ‌స్వ‌ము శంక‌రుడే. మ‌ధ్య‌మ‌ధ్య శంక‌రుడిని చూసి భ‌ర్త ఎందుకో బాధ‌పేవాడు అని గుర్తువ‌చ్చి గుండె గుభేలుమ‌నేది. శంకరుడు ముద్దుముద్దుగా మ‌హావాక్యాల లాగ ఏదో చెప్పేవాడు ఆమె మన‌సు ఆనందంతో నిండిపోయేది. బాధ‌ను మ‌రిచిపోయేది.

ఒక‌రోజు బాల‌శంక‌రుడు త‌ల్లిని ప్ర‌శ్నించాడు. అమ్మా అమ్మా మృత్యుంజ‌యుడుంటే ఎవ‌రు ? అని ఆర్యాంబ‌కు ఎలా చెప్పాలో బోధ‌ప‌డ‌లేదు. నాల్గేళ్ళ‌పిల్ల‌వాడికి మృత్యువును గురించీ, మృత్యు జ‌యాన్ని గురించీ ఎలా చెప్తే అర్థం అవుతుంది ? అనుకుంటోంది.

అమ్మా ! పుట్టిన ప్ర‌తివాడు ఎక్క‌ణ్ణించి వ‌చ్చాడో అక్క‌డికి వెళ్ళాలిగ‌దా ? గాలి, నీరు, మ‌ట్టి, అగ్ని, ఆకాశం మొద‌లైన పంచ‌భూతాత్మ‌క‌మైన ఈ శ‌రీరం పంచ‌భూతాల్లో క‌ల‌వాల్సిందే క‌దా ? అలా కాక మ‌ర‌ణాన్ని జ‌యించిన శ‌రీరం ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ భూమిమీద నిల‌వ‌గ‌ల్గుతుంది ? అస‌లు మ‌ర‌ణ‌మేలేని వ‌స్తువు కూడా ఉండే ఉంటుంద క‌ద‌మ్మా.... అన్నాడు. ఆర్యాంబ కంగారుప‌డిపోయింది.

తండ్రీ...తండ్రీ... ఏమిటిరా ఆ పెద్ద‌మాట‌లు త‌ప్పురా క‌న్నా అని శంక‌రుని నోరు నొక్కేసి గుండెల‌కు హ‌త్తుకుంది ఆర్యాంబ‌. అమ్మ‌వొళ్ళోంచి ఇవ‌త‌ల‌కు వ‌చ్చి క‌ళ్ళల్లోకి చూస్తూ ఎంతో అమాయ‌కంగా అడిగాడు. అమ్మా భ‌గ‌వంతుడంటే ఎవ‌రు ? ఎలా ఉంటాడు ? భ‌క్తి గొప్ప‌దా ? జ్ఞానం గొప్ప‌దా ? క‌ర్మానుభ‌వం అంటే ఏమిటి ? అని అడిగాడు. ఇవేం ప్ర‌శ్న‌ల‌ని త‌ల్లి తెల్ల‌బోయి చూస్తూ ఉండానే త‌నే స‌మాధానాలు చెప్పేశాడు. ఇదేమిటి ? ఇన్నేసి విష‌యాలు వీడికెలా తెలుస్తున్నాయి పెద్ద‌పెద్ద పండితుల‌కే అర్థంకాని వేదాంత ర‌హ‌స్యాలు అర‌టిపండు వ‌లిచి చేతిలో పెట్టిన‌ట్లు అల‌వోక‌గా ఆడుతూ పాడుతూ చెప్పేస్తున్నాడు ? అనుకుంటూ ఆర్యాంబ‌కి కాలూ చెయ్యి ఆడేదికాదు. అంతే శంక‌రుని ప్ర‌శాంత‌మైన క‌న్నుల్లో న‌వ్వుల‌కాంతులు. ఆనందంతో మైమ‌ర‌చిపోయేది. ఆహా ఎంత అదృష్టం. సాక్షాత్తు ఆ వృషాచ‌లేశ్వ‌రుడే నాకడుపున పుట్టాడు అనుకుని తృప్తిప‌డేది. తండ్రి లేక‌పోయినా త‌ల్లినీ తండ్రినీ నేనే అయి పెంచుతాను అని ధైర్యం తెచ్చుకొనేది. నేను నా వ‌రాల‌మూట‌కోసం బ్ర‌తుకుతాను అని శంక‌రుని గుండెల‌కు గాఢంగా హ‌త్తుకొనేది.

శంక‌రుడికి అయిద‌వ ఏడురాగానే ఆర్యాంబ బంధువుల స‌హకారంతో ఉప‌న‌యం జ‌రిపించింది. మాతా! భిక్ష‌పెట్టు అని శంక‌రుడు తల్ల‌ని మొద‌టి భిక్ష కోరాడు. ఆక్ష‌ణంలోనే త‌న భావిజీవితాన్ని ఏప్ర‌కారంగా గ‌డ‌పాలో నిర్ణ‌యించుకున్నాడు. దేహీ అంటూనే దేహ‌భారాన్ని జయించ‌సాగాడు.

ఒక‌నాడు అమ్మా ! దైవ‌మ‌న్నా భ‌గ‌వంతుడ‌న్నా ఒక్క‌డేనా ? అని ఆర్యాంబ‌ను అడిగాడు శంక‌రుడు. అవునురా తండ్రీ అందామె. అయితే మ‌రి నాన్నగారు అస్త‌మానం ప‌ర‌మాత్మ‌....పర‌మాత్మ‌...అని అనేవారే ? ఆ ప‌ర‌మాత్మ ఎవ‌రు ? శంక‌రుని క‌ళ్ళల్లో అమాయ‌క‌త్వం. ఆర్యాంబ త‌న‌యుని చూస్తూ ప్ర‌శ్నే మ‌రిచి పోయింది. శంకరుని మేధ మ‌రొక‌చోటికి మళ్ళ‌గా మరొక ప్ర‌శ్న సంధించాడు.


శంక‌రుని మేధ‌స్సు ప‌రిపూర్ణ జ్ఞానంతో నిండిపోయింది. ఎంతో ఉన్న‌త భావాలు ప‌సిత‌నంలోనే మ‌న‌స్సులో ప‌ర‌వ‌ళ్ళు త్రొక్కేవి. ఎన్నో చిక్కు ప్ర‌శ్న‌ల‌కు ఆ చిన్ని బుఱ్ఱ‌లో స‌మాధానాలు తేచేవి. అస‌లు భ‌గ‌వంతుడెవ‌రు ? భ‌గ‌వంతుడికీ ప్రాణికీ ఉండే సంబంధ‌మేమిటి ? మ‌ధ్య మ‌ధ్య‌లో ఈ ఆత్మ ఏమిటి ? పాప‌పుణ్యాలు జీవుల‌మీద ఎలాంటి ప్ర‌భావం చూపుతాయి ? ఇవండీ ఆ నాలుగేళ్ళ న‌లుసుని న‌లిపేసిన ఆలోచ‌న‌లు.

చ‌క్క‌గా అమ్మ‌పెట్టే బువ్వ‌తిని గురువులు చెప్పే పాఠాల‌ను వ‌ల్లిస్తూ గోళీకాయ‌లో గుజ్జ‌న‌గుళ్ళో ఆడుకోవ‌ల‌సిన లేత‌వ‌య‌సులో ఒక‌నాడు అమ్మా నేను స‌న్యాసం పుచ్చుకుంటాన‌మ్మా అని గారాలు పోయాడు శంక‌రుడు. పండ‌గ‌కి పాయ‌సం కోరినంత అల‌వోక‌గా కోరిన ఆ కోరిక‌కి అమ్మ‌నెత్తిమీద పిడుగుప‌డింది. అప్ప‌టికేవో మాయ‌మాట‌లు చెప్పి మాట మార్చింది. నిజంగా కార‌ణ‌జ‌న్ముడు కాక‌పోతే. అంటే మ‌హ‌త్కార్యాన్ని సాధించ‌డానికి పుట్టిన‌వాడు కాక‌పోతే పాలుగారే ప‌సివ‌యస్సులోనే ఇలాంటి కోర్కె ఎందుకు క‌ల్గుతుంది.

అమ్మా ప‌ర‌మాత్మ అంటే ఎవ‌ర‌ని మొన్న అడిగాను క‌దా చెప్ప‌మ్మా ప‌ర‌మాత్మ అంటే ఎవ‌రు ? అంటూ మ‌జ్జిగ చిలుకుతూ ఉన్న ఆర్యాంబ వ‌ళ్ళో చోటుచేసుకుని కూర్చాన్నాడు.

ప‌ర‌మాత్మ అన్నా దేవుడే అని అంది. మ‌రి ఆయ‌న అస‌లు పేర‌మిటి ? ఎక్క‌డుంటాడు ? ఆర్యాంబ‌కి ఏమి చెప్పాలో తెలియ‌లేదు. నాన్నావెళ్ళి ఆడుకోపో అంది. నాకు చెప్పాల్సిందే ! చెప్ప‌క‌పోతే ఆడుకోను. అన్నంకూడా తిన‌ను అని పేచీ పెట్టాడు. ఈ జీవిని ఎంత ఇబ్బంది పెడ్తున్నావురా ? అందామె. వెంట‌నే అందుకున్నాడు జీవా ? జీవి ? జీవంటే ? అన్నాడు. ఆర్యాంబ మ‌రీ కంగారు ప‌డిపోయింది. శంక‌రుడికి త‌ల్లిని చూస్తే జాలివేసింది. స‌రేలే అమ్మా ! కుండలాల తాత‌గార్ని అడిగి రేపు చెప్పు అని స్నేహితుల‌తో ఆడుకోడానికి వెళ్ళిపోయాడు. జీవం దైవం అంతా బ్ర‌హ్మ‌మ‌యం అని పాడుకుంటూ. త‌ల్లి నోరుతెరిచి అలా చూస్తూ ఉండి పోయింది.

*******