ముందుగా ఒక‌మాట‌

శ్రీ‌మ‌న్మ‌హావిష్ణువు రాక్ష‌సుల్ని సంహ‌రించ‌డం కోసం ద‌శావ‌తారాలు ఎత్త‌వ‌ల‌సి వచ్చింది. రాక్ష‌స సంహారం జ‌రిగిపోయింది. కానీ రాక్ష‌స‌త్వం స‌మూలంగా న‌శించిపోలేదు. అజ్ఞాన‌రూపంలో అంద‌రినీ ఆవ‌రించుకొనే ఉంది. రాశీభూతంగా లేని ఈ అజ్ఞాన రాక్ష‌స‌త్వాన్ని రూపుమాప‌డానికి ఆ కైలాసేశ్వ‌రుడే దిగి వ‌చ్చాడు. ఇక్క‌డ ఆ త్రిశూలాధారి సంస్క‌రించ‌డానికేగాని సంహ‌రించ‌డానికి రాలేదు. అద్వైతమ‌నే మ‌హాస్త్రాన్ని ధ‌రించి అజ్ఞాన ధ్వంస‌మ‌నే మ‌హ‌త్కార్యాన్ని నిర్వ‌ర్తించేందుకు సాక్షాత్తు ప‌ర‌మేశ్వ‌రుడు ఈభ‌ర‌త‌భూమిపై శంక‌ర‌భ‌గ‌వ‌త్పాదుడై, శంక‌రాచార్యుడై అవ‌త రించాడు. వీరినే ఆదిశంక‌రుల‌ని ప్ర‌స్తుతిస్తున్నాము.

ఆర్యాంబ - శివ‌గురువుల‌కు కాల‌డిలో జ‌న్మించిన ఈ శంక‌రుడు భువిపై చ‌రించిన‌ది మూడుప‌దుల‌పైన సంవ‌త్స‌రాలే. అందులో ఎనిమిది సంవ‌త్స‌రాలు అమ్మ‌చాటుబిడ్డ‌. అప్పుడే అద్వైతంలో దిట్ట‌. మిగిలిన ఇర‌వైనాల్గు సంవ‌త్స‌రాలు భార‌త‌దేశాన్ని ఎన్నిసార్లు ప్ర‌ద‌క్షిణించారో ఎన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించారో ఎంద‌రు దేవ‌త‌ల‌ను కీర్తించారో ఎన్ని భాష్యాల‌ను ర‌చించారో విద్వాంసులను శాస్త్ర‌జ్జ్ఞుల‌ను మ‌త పెద్ద‌ల‌ను జ‌యించారో ...? ఇవ‌న్నీ మాన‌వ‌మాత్రుల‌కు సాధ్య‌ప‌డే విష‌యాలుకావు. అంతేకాదు శ్రీ శంక‌ర‌భ‌గ‌త్పాదులు ఈ మాన‌వాళికి చేసిన మ‌హోప‌కారాన్ని అర్థంచేసుకోవాల‌న్నా కూడా ఎన్నో జ‌న్మ‌లు ఎత్త‌వ‌ల‌సిందే.

శ్రీ‌శంక‌ర భ‌గ‌వ‌త్పాదులు ఏమి చెప్పారు ? ఏమిచేశారు ? అవ‌తార ప‌ర‌మార్థం ఏమిటి ? అన్న‌ది అందరికీ సుల‌భంగా అర్థం కావాల‌నే ప‌ర‌మార్థంతో శ‌తాబ్ధాల క్రితం ఉద‌యించిన ఆ ఆధ్యాత్మిక చైత‌న్య‌దీప్తి ఎంత నిత్య‌నూత‌నంగా శాశ్వ‌త కాంతుల‌ను ప్ర‌స‌రింప‌చేయ‌గ‌ల‌దో సామాన్యుల‌కు సైతం అనుభ‌వం కావాల‌నే సంక‌ల్పం గురుదేవుల క‌రుణ‌తో మొల‌కెత్తి ఆధ్యాత్మిక న‌వ‌ల‌గా రూపుదిద్దుకుంది. ఈ ఆద్యాత్మిక న‌వ‌ల కైలాసం నుండి కైలాసందాకా ... శంకరుని శిర‌స్సు నుండి ఉద్వేగంతో ఉరికి భువిపై ప్ర‌వ‌హించే విద‌ద్గంగ‌లాగ శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ మ‌హాస్వామివారి పాదాల చెంత‌కు చేర‌డానికి ఉవ్విళ్ళూరుతున్న‌ది. ఆ పాదాల చెంత‌క‌దా గంగ పుట్టుక‌. సాక్షాచ్ఛంక‌రులు ! నిత్య నారాయ‌ణ స్మ‌ర‌ణాంత‌రంగులు ! శ్రీ స్వామివారిని చేర‌డంక‌న్న మ‌హద్భాగ్యం ఈ న‌వ‌ల‌కు మ‌రింకేముంటుంది ?

శ్రీ ఆదిశంక‌ర భ‌గ‌వ‌త్పాదులు ప్ర‌తిష్టించిన చ‌తురామ్నాయ పీఠాల‌లో శృంగేరిలో విలసిల్లుతున్న ద‌క్షిణామ్నాయ శ్రీ శార‌దాపీఠం మ‌హోత్కృష్ట‌మైన‌ది.

ఆ న‌దీ న‌గ వ‌న మ‌ధ్య‌నున్న ఆ శృంగేరీ తీరంలో పుణ్య‌పురుషులు మ‌హాత్ములు ఎంద‌రో క‌ఠోర‌మైన త‌ప‌స్సులు చేసి ఆప‌విత్ర క్షేత్తాన్ని మ‌రింత ప‌విత్ర చేశారు.

ఒకనాటి ఏకాద‌శీ పుణ్య‌మూహుర్తంలో సాయం స‌మ‌యాన శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ మ‌హాస్వామివారిని ద‌ర్శించుకోవ‌డం జ‌రిగింది. ఆరాత్రి వారు శార‌దా చంద్ర మౌళీశ్వ‌రుల‌కు అభిషేకం చేస్తుంటే జ‌న్మ‌ధ‌న్య‌మైంద‌న్న తృప్తిక‌లిగింది. ఆ క్ష‌ణాన్ని భ‌ద్రంగా గుండెల్లో పొందుప‌చ‌రుకోడంతోపాటు మ‌హాత్ముల ఆవ‌శ్య‌క‌త ఏమిటో కూడా బోద‌ప‌రుచుకున్న‌ట్ల‌యింది. ఈదేశం కొర‌కు, ఈ జాతికొర‌కు, మావ‌న క‌ళ్యాణం కొర‌కు, సంప్ర‌దాయ ర‌క్ష‌ణ‌కొర‌కు, శాంతి స్థాప‌న కొర‌కు, ఆ శివాంశ‌లే మ‌ళ్ళీ మ‌ళ్ళీ మ‌నమ‌ధ్య‌కు వ‌చ్చి మ‌న‌కు మార్గ‌నిర్దేశం చేసేందుకు భ‌వ్యాకృతులు దాలుస్తూ ఉంటాయ‌నే స‌త్యం స్ఫురించింది. పూజ్య శ్రీ గురుదేవులు అంత శ్ర‌మిస్తుంటే మ‌న‌మేమి చేయ‌గ‌లం ? వంద‌నాలు అర్పించుకోగ‌ల్గ‌డం త‌ప్ప అనిన్నీ అన్పించింది. మ‌రింకొక్క అడుగుముందుకు వేసి శ్రీ శంక‌రుల జీవిత చరిత్ర‌ను ఆధ్యాత్మిక న‌వ‌ల‌గా మ‌ల‌చి ఆ మ‌హాస్వామి శ్రీ‌భార‌తీతీర్థ అనంత శ్రీ‌విభూషిత శ్రీ‌ప‌దముల చెంత ఉంచ‌గ‌ల్గుతున్నందుకు.....ధ‌న్యోస్మి ధ‌న్యోస్మి.

- శ్రీ‌మ‌తి డా|| దిట్ట‌క‌వి శ్యామ‌లాదేవి