కొస మెరుపు

బాప్‌రే గుర‌డొచ్చేస్తున్నాడురోయ్ కంగారుగా ర‌వి జ‌బ్బ గిల్ల‌డంతో చేత‌న్ చేతిలోంచి సిగ‌రేట్ కిందికి ప‌డిపోయింది. పొగ‌లు గ్ర‌క్కుతున్న దాని  గొంతును బూటుకాలుతో నులిమి వేశాడు.

కాలేజీ బెల్ అయినా ప‌ట్టించుకోకుండా అశోక వృక్షం క్రింద జేరిన ఆడ‌పిల్ల‌లు ఆ వారం స‌స్పెన్స్ ఎక్కువ‌గా ఉన్న సీరియ‌లేదో తేలిక కొట్టుకుంటున్నారు. వెంట‌నే ఆ వ‌చ్చే భారీకాయాన్ని చూసి గ‌ప్‌చుప్‌గా అయిపోయారు.

సాయంత్రం పార్క్‌కి వెళ్ళాలో సినిమాకి వెళ్ళాలో హోట‌ల్‌కి వెళ్ళాలో నిర్ణ‌యించుకోలేని మంజులా దిలీప్‌లు మాత్రం ప్రిన్సిప‌ల్ గ‌రునాధారావు రాకని త‌మ‌దాకా వ‌చ్చేదాకా చూసుకోలేదు స‌రిగ‌దా ఆయ‌న త‌మ‌ని సీరియ‌స్‌గా చూస్తూ వెళ్ళిన సంగ‌తి కూడా గ్ర‌హించుకోలేదు.

అర్జంట్ ప‌నిమీద గ‌బ‌గ‌బా న‌డుస్తూ త‌ను చూసిన దృశ్యం మ‌న‌సు కెక్కించుకునేస‌రికి గురునాధరావుగారి కాలు గేటు అవ‌త‌ల ఒక‌టీ ఇవ‌త‌ల ఒక‌టి ఆగిపోయి ముందుకు వెళ్ళ‌మ‌ని స‌మ్మె చేశాయి.

అప్పుడే అటుకేసి చూసిన మంజుల గుండెల్లో ప్రిన్సిపాల్ చూపు చాకులాదిగిన‌ట్లు బాధ‌తో విల‌విల లాడిపోయింది. గుండె కొట్టుకోవ‌డం ఆగిపోయింది. క‌న్నీళ్ళు ఉర‌క‌టానికి సిద్ధంగా ఉన్నాయి. దిలీప్ వెర్రిచూపులు చూస్తూండిపోయాడు. వెంట‌నే ప్రిన్సిప‌ల్ ఆఫీస్ రూమ్‌లోకీ చ‌ర‌చ‌రాన‌డ‌చి వెళ్ళిపోడం జ‌వాన్ మంజుల‌నీ దిలీప్‌ని అస్సెంబ్లీ హాల్లోకి తీసుకు వెళ్ళ‌డం చ‌క‌చ‌కా  జరిగిపోయాయి.

అయిపోయింది. ఇహ ఇవ్వాళ మంజు ప్రిస్తేజీ మీటింగ్ కి హాజ‌రుకాక త‌ప్ప‌దు అని మంజుల ఫ్రెండ్సుంద‌రూ త‌ల్ల‌డిల్లిపోయారు.

ఒక సంవ‌త్స‌రం క్రితం ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు ఇలా ప్రిన్సిపాల్‌ని చూసి య‌ములాడ్ని చూసిన‌ట్లు గ‌జ‌గ‌జ‌లాడి పోయేవారు కారు. అస‌లు ఏ లెక్చ‌ర‌ర్ అన్నా పోయేవారు కారు. అస‌లు ఏ లెక్చ‌ర‌ర్ అన్నా కూడా వారికి లెక్క లేదు. క్లాసులో అంత‌కంటే వుండేవారు కాదు. ఆడ‌, మ‌గ‌, మ‌గ‌, ఆడ ఆడ ఈ ప్ర‌కారంగా జ‌ట్లు జ‌ట్లుగా విడిపోయి నిర‌వ‌ధిక బాతాఖానీ కొడ్తూండేవారు.

గేటు బ‌య‌ట వుండ‌వ‌ల‌సిన మిర్చీవాలా, ప‌ల్లీ, బ‌ఠానీ జాయ‌కాయ‌ల‌మ్ముకొనే కుర్రాళ్ళు కోన్ ఐస్‌బ‌ళ్ళూ య‌ధేచ్చ‌గా లోప‌లికొచ్చేసి  స్టూడెంట్స్ కెవ‌రెవ‌రికి ఏమేమి ఇవ్వాలో ఇచ్చేసి చేత‌న‌యినంత సంఘ‌సేవ చేసేవారు.

ఇక ఆద్యాప‌కులో...గోళ్ళు గిల్లుకునీ గిల్లుకునీ గిల్లుకోడానికేం మిగ‌ల‌క‌పోతే చెవులు కొరుక్కునీ కొరుక్కునీ ఇక చేసేదేమీ లేక స్టూడెంట్స్‌తో పాటు పిక్చ‌ర్ల‌కి చెక్కేసేవాళ్ళు కొంద‌రూ ఇళ్ళ‌కు పోయే వాళ్ళు కొంద‌రూ...ఇంట్లో మాత్రం తోచిచావ‌ద్దూ అని అక్క‌డే ఏ కార్డ్సో, చెస్సో ప‌ర‌చేసి బెల్ అయ్యేదాకా బైఠాయించే వారు కొంద‌రూ.

ఇది కాలేజీనా లేక ఛాట్ ఖాండారా ?

అని కొంద‌రికి అనుమానం చాలా మ‌న‌స్ఫూర్తిగానే క‌లిగేది. అయినా మ‌న‌కెందుకొచ్చిన గోల ఏమైనా అంటే ఈ పిల్ల‌కాయ‌లు తాటాకులు క‌డ‌తారు. ఉత్తినే తాటాకులు క‌ట్టినా బాగుండిపోనుగానీ కాళ్ళ కింద బాంబులు కూడా పెట్టేస్తారు అనే సిన్సియ‌ర్ ఆలోచ‌న కూడా వ‌చ్చే స‌రికి మిన్న‌కుండి పొయ్యేవారు.

ఒక‌నాడు విద్యాశాఖా మంత్రిగారి కారు సరిగ్గా ఈ కాలేజీ ముందుకే వచ్చి చెడిపోయి కూర్చుంది. డ్రైవ‌రు బాగుచేస్తున్నాడు. కాలేజీలో చెట్ట కింద్ర నిల‌బ‌డదామ‌ని లోప‌లికి వ‌చ్చాడు.

ఇవాళ క్లాసులు లేవా ? అంద‌రూ బ‌య‌టే ఉన్న‌ట్లున్నారే...

ఛ అదేం మాటండీ మా అక్క‌య్య బ‌య‌టుంటుంది గాని మేం మ‌గ‌పిల్ల‌లం సార్ అని వంక‌ర్లు తిరిగి పోయాడొక‌డు. ఆ జోక‌కి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వారు. మంత్రిగారు ముఖం మాడ్చుకుని ఇంకో చెట్టుకింద ఇంకో గ్రూప్‌ని అదే ప్ర‌శ్న వేశాడు.

ఆయ్‌. అవునండి సెల‌వేనండి అని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా యాస‌తో జ‌వాబు చెప్పాడు యాద్గిరి.

ఏం ఎందుక‌ని మంత్రిగారికి అనుమానం వ‌చ్చేసింది ఏ ప్ర‌బుద్డుడ‌న్నా....

అబ్బే ఎవ‌రూ గ‌యాకొట్ట‌లేదండి. మా ప్రిన్సిపాలుడి కూతురుకి బుద్ధి తెలిసిందండి.

ఏం ! ఇవాళే బుద్ధి తెల్సిందా ? అంత‌కు ముందు బుద్ధిలేదా ?  మంత్రిగారు త‌ను కూడా జోకులు వెయ్య‌గ‌ల‌న‌ని తెల్సుకున్నారులావుంది.

ఓహో నువ్వేజిల్లా వోడివో షామీ. ఇది చిత్తూరు మాట‌లే. బుద్ధి తెలియ‌డమంటే పెద్ద‌ద‌యింద‌న్న మాట సామీ.

అప్ప‌టికే అక్కడ చాలామంది గుంపుగా చేరారు. అంద‌రూ ర‌క‌ర‌కాలుగా స‌కిలించి చ‌ప్ప‌ట్లు కొట్టారు.

అమ్మాయిలు కూడా తోసుకుంటూ వ‌చ్చారు. అయ్యో ఆ అమ్మాయి పెద్ద‌ద‌వ‌కుండా నీళ్ళోసుకుంది అంది ఒక‌మ్మాయి.

ఇదేం క‌త ?  పెద్ద‌ద‌వ‌కుండా నీళ్ళోసుకుంటారా ?

ఎందుకోసుకోరూ ఇలాంటి సీరియ‌ల్ చ‌ద‌వ‌లా ?

మంత్రిగారికి సాంతం మ‌తిపోయేలా వుంది. విద్యార్ధులు పాడైపోయారు. క్ర‌మ‌శిక్ష‌ణ లేకుండా పోయింది. ప్రిన్సిపాల్ ఏం చేస్తున్న‌ట్లు వెళ్ళి వార్నింగివ్వాల‌నుకున్నాడు.

ఆఫీస్ బ‌య‌టే ఫ్యూన్ ఆపేసాడు.

అయ్య‌గోరు చెప్పాడు కుంటాన్నారు. ఇప్పుడెవ్వ‌ర్నీ లోప‌లికి రానివ‌ద్ద‌న్నారు.

కారు బాగ‌యిపోయింది ర‌మ్మ‌ని పిలుస్తూ డ్రైవ‌ర్ వ‌చ్చేయ‌డంతో మంత్రిగారు వెళ్ళిపోయారు. పోతూపోతూ కాలేజీ పేరు నోట్ చేసికోడం చూసి వీడెవ‌డో పిచ్చోడ‌ల్లే ఉన్నాడ‌ని న‌వ్వుకుంది కుర్ర‌కారు. ఆయ‌న వెళ్ళిపోయాక ఒక‌టి బుర్ర‌లో ఏదో మెరుపులాంటి భావం మెరిసింది.

ఒరేయ్ ఇప్పుడెళ్ళింది మంత్రిగారు టోయ్ అని అర‌చాడు.

మంత్రిగారంటే మా సీకాకోళం బాస‌లో బార్బ‌రోయ్ మ‌రొక‌డు స‌కిలించాడు.

ఇంత జ‌రిగింద‌ని తెలుసుకున్నాడు.  ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ఊహించ‌లేక‌పోరు. ఆ ప్రిన్సిప‌ల్ స‌స్పెండ్ అయిపోయాడు. క్ర‌మ శిక్ష‌ణ‌కు మారు పేరైన గురునాధ‌రావుని ప్రిన్సిప‌ల్‌గా నియ‌మించారు. ఈ సారి ప్రిన్సిప‌ల్‌కి స్టూడెంట్స్ త‌ల్లితండ్రులు కూడా అండ దండ‌లుగా ఉండి కాలేజీనొక కొలిక్కి తీసుకోచ్చారు.

స్టూడెంట్స్ ఎవ‌ర‌యినా కాలేజీ ఆవ‌ర్స్‌లో ఆవ‌ర‌ణ‌లో క‌న్పిస్తే గురునాధ‌రావు న‌ర‌సింహావ‌తారం ఎత్తుతాడు. క్లాసులోనూ లైబ్ర‌రీలోనూ త‌ప్ప చెట్ట‌కిందా రోడ్ల‌మీదా క‌న్పించ‌కూడ‌దు. ఆయ‌న మంచి చిట్ల సాహితీవేత్త‌, ఒక్క పొల్లు మాట రాకుండా ప‌డ్డ‌వాడు. సిగ్గుతో ఉడుక్కుని చ‌చ్చిపోయేలా తియ్య‌గా మందలిస్తాడు. ఏ స్టూడెంట్ అయినా అల్ల‌రి చేస్తూ ప‌ట్టుబ‌డితే ఇక ఆ నాటితో వాడి ప‌రువు గోవిందా. ప్రిన్సిప‌ల్ గారు కొత్త ప‌ద్ద‌తి ప‌నిష్‌మెంట్ క‌నిపెట్టారు. ఎవ‌ర్ని ప‌నిష్ చెయ్యాల‌నుకుంటాడో ఆతన్ని అస్సెంబ్లీహాల్లో స్టేజీ మీద నిల‌బెట్టి ర‌క‌ర‌కాల వ్యంగ్య ప‌దాల‌తో స‌న్మానం చేస్తాడు. హాజ‌ర‌యిన మిగిలిన స్టూడెంట్స్ ఆ టైములో త‌మ ఇష్ట‌మైన కామెంట్స్ అత‌ని మీద చెయ్యొచ్చు. ఎంత అల్ల‌ర‌యినా చెయ్యొచ్చు. ఇలాంటి అనుభ‌వాన్ని త‌ట్టుకోలేక ఆడ‌పిల్ల‌లు అల్ల‌రి చెయ్య‌డం మానుకొన్నారు. సెన్సిటివ్‌గా ఉండే మొగ పిల్ల‌లూ, మానుకున్నారు. ఎటొచ్చీ మొండిగా ఉండే కొంద‌రి వ‌ల్ల ప్రిస్టేజ్ మీటింగ్స్ పెట్ట‌క‌త‌ప్ప‌టంలేదు.

ఈ రోజు ప్రిన్సిప‌ల్ గంట‌ముందే వ‌చ్చి కాలేజీ వెన‌క వైపు క‌ట్టే హాస్ట‌ల్ బిల్డింగ్స్‌ని ప‌ర్య‌వేక్షిస్తూండ‌టంతో స్టూడెంట్స్ ప్రిన్సిప‌ల్ రాలేద‌నుకుని స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుంటున్నారు.

పాపం మంజులే ? ఎలా ?  కాలేజీ నుండి డిబార్ చేసినా ఫ‌ర‌వాలేదు కానీ ప్రిస్టేజ్ మీటింగ్ మాత్రం పెట్ట‌కూడ‌దే... మంజుల ఫ్రెండ్సంద‌రికీ క‌ళ్ళల్లోకి నీళ్ళు వ‌చ్చేస్తున్నాయి.

అంద‌రం క‌ట్ట‌క‌ట్టుకుని వెళ్ళి మంజూ దిలీప్ పెళ్ళి చేసుకోబోతున్నార‌ని చెబ్దాం...అంది న‌ర్మ‌ద‌.

మ‌నంద‌ర్నీ కూడా అక్క‌డ నుంచోబెట్టి త‌లో గుప్పెడు అక్షింత‌లూ వేస్తాడు ఆ మ‌హానుభావుడు అంది శివాని.

మంజూ అస‌లు దిలీప్ పిలిచినా రానంది. నీ ఉడ్ బీ నా కోసం క‌ళ్ళుకాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నాడు. ఇవ్వాళ య‌ముడు రాలేదు వెళ్ళ‌వే అని మ‌న‌మే దాన్ని తోశాం. ఇప్పుడు దానికి జ‌ర‌గ‌బోయే అవ‌మానానికి బాధ్య‌త మ‌న‌దే ర‌జియా అంది.

అద‌స‌లే సెన్సిటివ్ క్రీచ‌ర్‌. డిసిప్లిన్ జపం చేసి ప్రిన్సిప‌ల్ మీటింగ్ పెట్ట‌కామాన‌డు, దీన్ని అవ‌మానంచేయ‌కామాన‌డు. ఇదే సూసైడో చుసుకోదుక‌దా.... నిజ‌మేనే...ఎలా....ఉన్నట్లుండి చైత‌న్య కంగారుగా బ‌య‌ట‌కు ప‌రుగెత్తాడు.

ఇంత‌లో ఎస్సెంబ్లీహాల్లో మీటింగ్ అంద‌రిని ర‌మ్మ‌ని నోటీస్ వ‌చ్చింది. అన్ని క్లాసులూ మూసేసారు. లైబ్ర‌రీ మూసేసారు. బ‌య‌టి గేటు కూడా మూసేసారు. ఎవ్వ‌రూ బ‌య‌టికి పోడానికిలేదు.

జ‌లియ‌న‌వాలాబాగ్ టైమ్‌లో మ‌నం ఎక్క‌డున్నామోగాని, మ‌న‌కు మ‌ళ్ళీ క‌ళ్ళ‌కు క‌ట్టిస్తున్నాడు....

అవునే....ఇలా మ‌నల్ని బ‌ల‌వంతంగా బంధించి మంజూ వాళ్ళ‌ని తిట్టే తూటాల వంటి మాట‌ల‌ను విన‌మ‌ని హింస‌పెడుతూంటే మ‌న‌లో ఒక్క‌రం కూడా ఎదురుతిర‌గ‌లేక పోతున్నాం.

న‌ర్మ‌దా మీరంద‌రూ ఒక్క విష‌యం మ‌ర‌చిపోతున్నారు. డిసిప్లినంటే డిసిప్లినే ఇలా మీటింగులు పెట్టి అవ‌మాన‌ప‌ర‌చేది స్టూడెంట్స్‌నికాదు. స్టూడెంట్స్‌లోని చెడ్డ‌త‌నాన్ని వేలెత్తి చూపిదాన్ని నిర్మూలించుకోవాల‌నే సూచ‌న‌నే మ‌న గురూగారు చేస్తున్నారు. ఇప్పుడు మంజూ మ‌న ఫ్రెండ‌వ‌టంతో మ‌నం బాధ‌ప‌డ్తున్నాం.

వేరేవాళ్ళ‌ని తిట్టేట‌ప్పుడు మ‌న‌కు చేత‌న‌యిన‌న్ని రాళ్ళ‌ని మ‌న‌మూ విసిరాంక‌దే అన్నది ర‌మ‌ణి.

ర‌మ‌ణీ ఈయ‌న ఎలాంటి ఈటెల లాంటి మాట‌ల‌ను అంటారో నీకు తెలిదే. తెలిస్తే అలా అన‌వు.

ఎందుకు తెలీదే ర‌జీ.  ఇదిగో చూడండి ఈ అమ్మాయికి పెళ్ళి తొంద‌ర ఎక్కువ‌యింది. మీలో ఎవ‌ర్నా కాస్త పుణ్యం క‌ట్టుకుని సంబంధం చూడండి అంటారు. సంబంధం వేరే చూడ్డం ఎందుకుసార్ నేను లేనా అని ప్రతి పొగ‌రుబోతూ బోర‌విరుచుకుని నించుంటారు...అంతేగా...

అంతేగా అంటున్నావుటే ర‌మ‌ణీ ఆడపిల్ల‌కి ఆ ఒక్క‌మాట చాల‌దా... నీదాకా వ‌స్తేగాని నీకు తెలీదు.

ఎందుకు తెలీదూ. చూస్తూ ఉండండి మీ కంటే నాకే ముందు తెలుసు. గేట్లు మూసెయ్య‌డంతో చైత‌న్య గోడ‌దూకి వ‌చ్చి ఒక క‌వ‌ర్ ని ర‌మ‌ణి చేతికిచ్చాడు. ర‌మ‌ణి వెంట‌నే ఆ క‌వ‌రుని త‌న బ్యాగ్‌లో పెట్టుకుంది.

ప్రిన్సిపాల్ ప్రిస్టేజ్ మీటింగ్ ప్రారంభం చేశాడు. ద‌గ్గ గొంతు స‌వ‌రించుకొన్నాడు. డియ‌ర్ స్టూడెంట్స్ ఈ అమ్మాయి....

సార్ మీరు పేరు చెప్ప‌న‌క్క‌ర్ల మంజుల‌. అంటే సౌంద‌ర్య‌వ‌తి. సార్ధ‌క నామ‌ధేయం. ఎత్తు అయిద‌డుగుల రెండంగుళాలు...అంటూ ఒక‌డు అరిచాడు.

ఈ అమ్మాయికి... ప్రిన్సిప‌ల్ ఒక్క క్ష‌ణం ఆగి మంజుల‌నూ స్టూడెంట్స్‌నీ ప‌ర‌కాయించి చూశాడు.

సార్ వ‌న్ మినిట్‌...ర‌మ‌ణి స్టేజి మీద‌కు వెళ్ళి ప్రిన్సిప‌ల్ తో ఏదో మాట్లాడి ఏదో చూపించింది. ఒక క‌వ‌రు చేతిలో పెట్టింది.

అంటే ప్రిన్సిప‌ల్ గురునాధ‌రావుగారు ఒక్క నిముషంలో మీటింగు చాలించేసి గేటు తెరిపంచేసి కార్టూన్ ఫిలిమ్స్‌లో ఏదో   జంతువు ప‌రిగెత్తిన‌ట్లే ప‌రిగెత్తిసి ఇంటికి చ‌క్కా పోయారు.

అంతే ఆనాటి నుంచి ప్రిస్టేజీ మీటింగ్స్ గాని డిసిప్లిన్ పేరుతో మ‌రే మీటింగ్సూగాని మ‌రి పెట్ట‌లేదు. ర‌మ‌ణి వేసిన మంత్ర మేమిటో వాళ్ళెవ్వ‌రికీ తెలీదు కానీ మీకు చెప్ప‌కుండా ఎల్లా ?

అంత‌కు నాల్రోజుల ముందే ఓ ఆదివారంనాడు ర‌మ‌ణీ ఆమె త‌మ్ముడు చైత‌న్య వ‌చ్చి కాలేజీ గార్డెన్‌లో ఉన్న ఒక మొక్క కోసం వచ్చారు. ఆ మొక్క వైద్యానికి ప‌నికివ‌చ్చేది. ఆ స‌మ‌యంలో కాకళీయంగా ర‌మ‌ణి భుజాన కెమేరా ఉండ‌టంతో నిండుగా పూలు పూసిన చెట్ల‌ని ఫోటో తీసింది.

ఆ సంద‌ర్భంలో హాస్ట‌లు క‌ట్టేచోటుకు కూడా వచ్చారు. ఆమె దృష్టిలో ఇంకో ర‌స‌వ‌త్త‌ర‌మైన దృశ్యం క‌ప‌బ‌డ‌టంతో దాన్ని కూడా ఆమె కెమెరాలో బంధించింది.

ఆ ఫోటోనే మీటింగ్‌లో ప్రిన్సిప‌ల్‌కి చూపింది. అందులో ప్రిన్సిప‌ల్‌గారు స్వీప‌ర్ సీత‌మ్మ‌తో స‌రాగాలాడుతున్నాడు.

ప్రిన్సిప‌ల్ గురునాధ‌రావు క్ర‌మ శిక్ష‌ణ పేరుతో స్టూడెంట్స్‌ని కొంత వ‌ర‌కు దారిలోకి తీసుకు వ‌చ్చాడు. కానీ గురునాధ‌రావుది మ‌రీ శాడిస్ట్  మెంటాలిటీ అని గ‌మ‌నించింది. డిసిప్లిన్ పేరుతో స్టూడెంట్స్‌ని హింసించ‌డం ఆమె స‌హించ‌లేక‌పోయింది. ఆయ‌న త‌ప్పు ఆయ‌న‌కే చూపిందిగాని ఆయ‌న్ని అల్ల‌రిచేసి మ‌ళ్ళీ కాలేజీని సంత‌లాగా చేసేందుకు కార‌కురాలుకాలేదు. ర‌మ‌ణి చూపిన మార్గంలో గుర‌నాధ‌రావు ముందుకు న‌డిచిపోతూ మంచి ప్రిన్సిప‌ల్ అనే పేరు తెచ్చుకోగ‌ల్గాడు.