మధురవాణి
మంజీరనిక్వాణం
శ్రీరామంభువనైక సుందర తనుంధారాధరం శ్యామలన
రాజీవాయత లోచనం రఘువరం రకేందు బింబాననమ్
కోదండాది నిజాయుధాశ్రిత భుజైర్భాంతం విదేహాత్మజా
ధిశం భక్తజనాను రంజకపదం శ్రీరామచంద్రం భజే !
నాట రాగములో ఆలపిస్తున్న రామకర్ణామృత శ్లోకము వినపడి ఆలయములోనికి వెళ్ళబోవుచున్న ఆ యువకుడు నాట్యమంటపము వైపునకు దృష్టి సారించాడు. ఆ రాగమంటే అతనికెంతో ప్రీతి.
అప్పుడే నాట్యారంభమైనట్లున్నది. అతనినెవ్వరూ గమనించుట లేదు. ఒక స్తంభము నానుకుని ఆసీనుడైనాడు. ఆ నర్తకి మోమును భక్తి చంద్రికలు తళతళ లాడుతుండగా శ్రీహరి పాదపద్మములకు పుష్పాంజలి సమర్పించినది. ఆ వెనుక గణాధిపతికిని, నటరాజస్వామికిని, శారదాదేవికిని, మన్నారు దేవునకును, చెంగమలవల్లికిని, దిక్పాలురకును, రంగాధిదేవికిని పూజ సలిపినది. అందెల బంగరు మువ్వలు ఘల్లుఘల్లు మన్నవి. రత్నకింకిణులు కరకంకణములు ఝుణం ఝుణం ఝుణ ఝుణత్కారములు చేసినవి. ప్రేక్షకుల హృదయమార్దంగికము
లోక్కమారుగా ఝల్లుమన్నవి.
బృహదీశ్వరాలయ నాట్యమంటపమున ఇంత శోభాయమానముగా జరుగుచున్న కళాసరస్వతీ పూజకు తానేల యాహ్వానింపబడలేదు ? ఆ యువకుని
హృదయము చిన్నబోయినది, క్షణమాత్రము మరల దృష్టి నాట్యమువైపునకు మళ్ళినది.
ఆమె వామపాదముచే వేధమును దక్షిణపాదముచే విక్షేపమును చేయుచు పరివర్తనము ప్రారంభించినది. జయదేవుని అష్టపది, దశావతారములనెంతో చాతుర్యముగా అభినయించుచున్నది. నాట్యశాస్త్రజ్ఞులకా నాట్యము భరతశాస్త్రపు పుటలు తెరిచినట్లుగా అనుభూతి కలిగినది. నాట్యశోభ అంతా అంగసౌష్ఠవము మీదనే ఆధారపడియున్నది. నాతి ఉచ్చములు నాతి కుబ్జములు కానట్టి అంగములు సౌందర్యకారములు. కటికర్ణములొకే రేఖలోను, మోచేతులు భుజములు ఒకే రేఖలోను ఉండగా ఉరముసమున్నతమై ఉంటే మహా సౌందర్యకారకమైన సౌష్టవం అని చెప్పవచ్చు. చాతురశ్ర్యము నందు వక్షము ఉన్నతముగా ఉండవలెనన్నది అభినవ గుప్తుల వారి నిర్దేశం, చాతురశ్ర్య మూలంనృత్తే, అంగస్య జీవితమ్ అన్నాడు గదా !
జయ జగదీశహరేచ, కృష్ణా ! జయజగదీశహరే ! నర్తకి మత్స్యమూర్తియై సోమకాసురుడు దొంగిలించి దాచిన వేదములను సముద్ధరించుకొని వచ్చి మత్స్యావతాన ప్రయోజనమును నిరూపించినది. బేడిసమీలను బెదరించు వాల్గన్నుల తళుకు బెళుకులను చూపి మీన భ్రాంతి కల్పించినది.
అమృతసాధరకై దేవాసురులు చేసిన క్షీర సాగర మధన వేళలో మంధరగిరిని వీపున మ్రోయుటకు శ్రీ హరి కూర్మావతారమెత్తినాడు.
ధరణి ధరణకిణ చక్రగరిష్ఠే కేశవాధృత కచ్ఛకపరూప
జయజగదీశహరే, కృష్ణా ! జయజగదీశహరే !
కూర్మహస్తమును పట్టినప్పుడు దక్షిణ వామహస్తములనర్ధ చంద్రాకృతిగ చేసి రెండు బొటనవ్రేళ్ళను పైకి క్రిందికి నల్లలాడించినపుడా కన్య కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితయోఐన లలితామహాదేవివలె భాసించినది. ఈమె సౌందర్యము చిత్త విభ్రమము పుట్టించక పూజ్యభావమంకురింపజేసి ప్రశాంత హృదయులచేయు లక్షణము కల్టియున్నదన్న భావమా యువకుని హృదిలో మెదలినది.
అవతారమునకొక రాగమును మార్చుచు గానము నాట్యమునకు సమానస్థాయిలో రసభావ పరిపూర్తిని కల్గించుచున్నది. పాతాళమునకు కూరుకొనిపోతూ ఉన్న ధారుణీమండలమును ఆదివరాహమూర్తియై తన దంష్ట్రాగ్రముతో నెత్తి రక్షించిన శ్రీ మహావిష్ణువు యొక్క హస్తకమలమున భాసించు శంఖమువలె ముక్తాహారశోభితమైన నామెకంఠమును చూచి యాతడబ్బురపడినాడు.
వసతి దశన శిఖరే ధరణీతవలగ్నా శశిన కళంకళేవ నిమగ్నా...
వరాహావతారము తరువాత నృసింహావతారమెత్తిన...కౌను ఉండీలేనట్లు మిధ్యవలేభాసించుచున్నది. |