మ‌స‌సులోమాట‌

మ‌ధుర‌వాణి ద్వితీయ ప్ర‌చుర‌ణ‌తో ముందుకువ‌చ్చి సంగీత సాహిత్య చారిత్ర‌క క‌ళాప్రాభవంతో ఆంధ్రుల హృద‌య రంగ‌స్థ‌లాన మ‌రోమారు న‌ర్తించ‌నుంది. ఇదెంతో ఆనంద‌దాయ‌కం శ్రీ అడివి బాపిరాజు గారి మిగిలిన చారిత్ర‌క న‌వ‌లల్లో మాదిరిగానే మ‌ధుర‌వాణిలో కూడా చ‌రిత్ర ఎన‌భై శాతం క‌ల్ప‌న‌, ఇర‌వై శాతం క‌ల‌నేసిన బంగ‌రు జ‌ల‌తారు ప‌ట్టుపుట‌లు !

బాపిరాజు గారి న‌వ‌ల‌ల్లో నాయికా నాయ‌కులు స‌ర్వ‌సాధార‌ణంగా క‌ళ‌ల్లో మునిగి తేలుతూ త‌ద్విజ్ఞానాన్ని ప‌ఠిత‌ల‌కూ సంత‌ర్ప‌ణ చేస్తారు. ఇంకొక సామాన్య విష‌య‌మేమిటంటే అటు తిప్పీ ఇటు తిప్పీ నాయికా నాయ‌కులు బావామ‌ర‌ద‌ళ్ళు అవుతుంటారు. మ‌ధుర‌వాణి లో ర‌ఘ‌నాథ నాయ‌కుడు మ‌ధుర‌వాణీ బావామ‌ర‌ద‌ళ్ళే. ఆమె అష్ట‌భాషా ప్ర‌వీణ‌, భాషాశాస్త్ర‌వేత్త్రి. సంగీత సాహిత్య నాట్య క‌ళాకౌముది. నాయకుడు వ్రాసిన ఆంధ్ర రామాయ‌ణాన్ని సంస్కృత రామాయ‌ణంగా మ‌ల‌చి రామాయ‌ణ‌సార తిల‌కం చేసింది. ఆమెకు మూడు పేర్లు చెంచుల‌క్ష్మి, శుక‌వాణి, మ‌ధుర‌వాణి, మూడూ సార్ధ‌క‌నామ‌ధేయాలే. వాక్ప‌టిమ‌, యుక్తి, చాతుర్యం, ప్ర‌తిభ‌ల‌తో ఔత్త‌రాహుడైన వాచ‌స్ప‌తి మిహిర‌కులుడ‌నే క‌విదిగ్గజాన్ని జ‌యించి అశేష విశేష గ్రంథాల‌తో శార‌దా పుస్త‌క భాండాగారాన్ని ఏర్ప‌రిచింది. ఈమె ర‌ఘునాథ‌నాయ‌కుని వ‌ల‌చి వ‌ల‌సించుకున్న ముగ్ధ మ‌నోహ‌రి !

ఇక నాయ‌కుడంటే ఇలాగే ఉండాల‌న్న‌ట్లు స‌ర్వ‌సుగుణాల‌గ‌ని ర‌ఘునాధ నాయ‌కుడు. నాయ‌క‌రాజుల‌లోనే కాక యావ‌దాంధ్ర చ‌రిత్ర‌లోనే నాయ‌క‌మ‌ణి వంటివాడు. చిఱు ప్రాయంనుండీ అత‌ని హృద‌యం అటు స‌మ‌ర‌క‌ళ‌ల‌కు, ఇటు సార‌స్వ‌త క‌ళ‌ల‌కు స‌మ‌స్పంద‌న‌త‌లో ఠ‌వ‌ణిల్లేది ! సంగీత సాహిత్య స‌మ‌రాంగ‌ణ సార్వ‌భౌముడైన కృష్ణ‌రాయ‌ల వారికి స‌రిజోడి. కాక‌పోతే మ‌రింకొన్ని తావుల అధికుడు కూడాను. రామావ‌తార కృష్ణావ‌తార స‌మీకృతాకృతి ర‌ఘునాథుడైతే మ‌ధుర‌వాణి జాన‌కీ రాధాదేవుల దివ్య సంగ‌మం. ఆంధ్రభోజుడుగా విఖ్యాతినందిన ర‌ఘునాథ నాయ‌కునికి, మ‌ధుర‌వాణిల‌కిద్ద‌రికీ గురువు గోవింద‌దీక్షిత మంత్రి.

ఈయ‌న తంజావూరి ప్ర‌భువులు మూడు త‌రాల వారికి మంత్రి, గురువు, దైవం. నాయ‌క‌రాజుల స‌ర్వ‌తోభిముఖాభివృద్ధికెంతో తోడ్ప‌డ్డారు. గోవింద దీక్షితుల ప్ర‌తిభ‌, పాండిత్యం రాజ‌కీయ చ‌తుర‌త జ్ఞాన వైదుష్యం రాజ్యంపై, రాజుల‌పై, ప్ర‌జ‌ల‌పై భార‌తీయ క‌ర్మ‌జ్ఞాన భ‌క్తివైరాగ్యాది యోగాల‌పై పొంగి పొర‌లే అత్యంత ప్రేమాభిమానాలు అనిత‌ర‌సాధ్యాలు.

శ్రీ పాద శ్రీ వ‌ల్ల‌భుల చ‌రితామృతం అనే ద‌త్తాత్రేయ చ‌రిత్ర‌లో గోవింద దీక్షితుల వారిని ద‌త్తాత్రేయ అవ‌తారంగా పేర్కొన‌బ‌డ‌డం జరిగింది. ఈ కార‌ణం చేత మ‌ధుర‌వాణి చారిత్ర‌క‌త్వంతో పాటు దివ్య‌త్వం కూడా సంత‌రించుకున్న‌ట్లాయెను. నాయికా నాయ‌కుల‌కు స‌మ‌ప్రాధాన్య‌మిచ్చి స్త్రీ పురుషులిద్ద‌రినీ స‌మానంగా హృద‌యాన‌కు హ‌త్తుకొన్నారు. మహిళ‌లంటే అత్యంత గౌర‌వాద‌ర‌ణ‌ల‌ను ప్ర‌తితావులోనూ ప్ర‌స్ఫుటీక‌రించారు. ముఖ్యంగా భోగినీస్త్రీలంటే ఆర్ద్ర‌త‌తో వారి గుండె ఆకాశ‌మంత ఉప్పొంగుతుంది. ఈ స్త్రీల క‌ళా కౌశ‌ల్యాన్ని వ‌ర్ణించ‌డంలో వారి క‌లం కావేరిలా ఉర‌వ‌డుల‌తో ప్ర‌వ‌హిస్తుంది. చేమ‌కూర వేంక‌ట క‌వి ఆత్మ‌న్యూన‌త‌భావాన్ని మ‌నో విశ్లేష‌ణాత్మ‌కంగా సహ‌జంగా చిత్రించారు.

బాపిరాజుగారు కూడా ఒక యోగియే. త‌న న‌వాహించిన బ‌హుముఖ క‌ళ‌లన్న‌టి ద్వారా ఒక మ‌హాప్ర‌ణ‌య‌యాగాన్నే నిర్వ‌ర్తించారు. ఆ విర‌హాగ్ని కీల‌ల‌లో ల‌లిత మ‌నోజ్ఞ సుంద‌ర సురుచిర ప‌రిమ‌ళ భావ‌నా స‌మిధ‌ల‌న్నింటినీ ఆహుతించారు. మ‌ధుర‌వాణి వారిని పూర్ణాహుతి ఘ‌ట్టానికి చేర్చింది ! ధ‌న్యోస్మి !

పున‌ర‌వ‌త‌ర‌ణ‌కు మ‌ధుర‌వాణిని ప్రోత్ప‌హించిన బుజ్జి డూండీ సాయిమిత్ర సంధ్య‌ల‌కు ఆశీస్సులు ! ఈ న‌వ‌ల నా కుటుంబాన్ని కూడా పునీతం చేయ‌గ‌ల‌ద‌ని భావిస్తున్నాను. ముఖ‌చిత్ర‌సంద‌రీక‌ర‌ణ‌కు తోడ్ప‌డిన మా మ‌న‌మ‌డు చి విశ్వ‌భాస్క‌ర్ సుస‌ర్ల‌కు దివ్యాశీస్సులు.

                                                                 
// ఓం త‌త్స‌త్‌ //

తేది 13 -9- 2013  
దిట్ట‌క‌వి శ్యామలాదేవి