మనవి
మధురవాణి నలవ సుమారు ముప్ఫైయేడేళ్ళ క్రితం ప్రారంభించబడి అసంపూర్తిగా ఆగిపోయింది. ఎందుకని ? బహుశ ఈ అవకాశం నాకు లభించాల్సి ఉన్నందుకేనేమో !
మంజీర నిక్వాణము అనే మొదటి ప్రకరణంలో రఘునాథ నాయకుడు ఇంకా యౌవరాజ్య పట్టాభిషిక్తుడు కాకముందే శత్రువులను జయించి గజారూఢుడై ఊరేగుతూ గురువైన గోవింద దీక్షితామాత్యుల వారి సౌధానికి వేంచేస్తూ ఉన్నాడు. ఇక్కడ అడివి బాపిరాజుగారు రాసిన .....వసించి అన్నపదం అసంపూర్తిగా ఉన్న తావు నుండి ఉన్న మధురవాణి నవల నాకు లభించింది. అంటే, నవల మొదలు లభించలేదు. అందుచేత, నవల మొదటి నుంచి మొదలు పెట్టి, ఈ .......వసించి అన్న పదానికి అధి అనే ఉపకరణాన్ని చేర్చి, అధివసించిగా వాక్యం కలిపి, మొదటి ప్రకరణంలో మొదటి భాగాన్ని పూరించాను. రెండవ ప్రకరణం భోజాన్వేషిలో చేమకూర వేంకటపతిరాజు అభినవ భోజుడైన రఘునాథనాయకుని సేవించుకునేందుకై ప్రయాణిస్తూ మార్గమధ్యాన దొంగబారినపడి నిశ్చేష్టుడై నిలచిపోయి ఉన్నంత వరకూ బాపిరాజుగారు వ్రాశారు. వీరి మరణంతో ఇక్కడితో ఈ రచన నిలచిపోయింది. ఇక్కడ, చేమకూర వేంకటపతి రాజు చేత ఓం ధ్యేయస్సదా, అన్న అదిత్యస్త్రోత్రంతో మొదలుపెట్టి, నవల కడవఱకూ నేను పూరించాను.
సాంఘిక నవల కంటే చారిత్రక నవల రాయడం కష్టం. చారిత్రకమైనా ఇంకొకరి, అందునా బాపిరాజుగారి వంటి వారి పంధాలో పయనించడం మరీ దుర్గమం. అయినా నన్ను చెయ్యి పట్టుకుని నడిపించింది నవలా సరస్వతే !
ఈ అపూర్వకార్యం సంపూర్తి గావించడానికి సహకారాన్ని అందించిన మా శ్రీవారు న్యాయమూర్తి శ్రీ దత్తాత్రేయులు గారికీ, బాపిరాజుగారి కూమర్తె శ్రీమతి తాడికొండ రాధా వసంతగారికీ, మేనల్లుడు బుద్ధవరపు కామరాజుగారికి ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ధారావాహికంగా ప్రచురించిన ఎడిటర్ శ్రీ కనకాంబర రాజుగారికి నా హృదధన్యవాదాలు.
|
|
ఇట్లు |
భాగ్యనగరం. |
|
బుధజన విధేయురాలు
|
2 -8 -1987 |
|
దిట్టకవి శ్యామలాదేవి
|
|