సంగమేశ్వరం
డా || దిట్టకవి శ్యామలాదేవి.
అధ్యాయి కథా, ఖండకథా హరికథా తథా
కథానికే మన్యంతే గద్యకావ్యంద పంచధా
గద్యకావ్యాలకు, లక్షణప్రాయాంగావున్న ఈ శ్లోకం అగ్ని పురాణం లోనిది. అగా పురాణకాలం నాటికే మనకు కథా ప్రక్రియ అయిదు భాగాలుగా విభజింపబడింది. ఎంతో విస్తృతంగా వచన సాహిత్య వృక్షం ఆనాటికే వ్రేళ్ళూని బలిష్టంగా ఉండే ఉంటుందని మనం ఊహించుకోవచ్చు.
కాని పెద్దలెందరో కొద్దివందల సంవత్సరాల పూర్వం వచ్చిన అంగ్లేయుల ప్రాభవంలో ఆంగ్లేయ సాహిత్య ప్రభావాన మన కథ. నవలా సాహిత్యాలు ఏర్పడినాయంటూ పేర్కొంటున్నారు. కాలానుగుణంగా రూపం మారవచ్చు పాఠకుల అభిరుచినిబట్టి సాహిత్య సృష్టి జరగవచ్చు. కానీ కేవలం ఆంగ్లేయుల నుండే మనకు కథారచన ప్రక్రియ దిగుమతి అయిందనడం అంత సబబుగా ఉందనిపించదు.
ఆదిభాష అమృతభాష, అమరుల భాషా అయిన సంస్కృత భాష సంస్కృత వాజ్ఞ్మయ వికాసమూ భారతీయ భాషలెన్నింటికో ఆదర్శప్రాయం. ఇతర భాషలలో ఏ సాహితీ ఉపనదులు ప్రవహించినప్పటికీ హిమలయోత్తుంగ శిఖరాన జనించిన జాహ్నివీమూర్తికివి పాయులుగాక తప్పవు.
వేదాలలో కథలున్నాయి, ఉపనిషత్తులలో కథలున్నాయి. భారత, రామాయణాది పురాణాలలో ఉపకథలెన్నో ఉన్నాయి. ఇక కథా సరిత్సాగరమూ పంచతంత్ర హితోపదేశాలు, బృహతక్కథ, కాశీమజిలీ కథలు మొదలైనవెన్నో దివ్య రత్నాలు మనకున్నాయి.
కథలు కాలక్షేపానికేగాక మంచి విషయాలు తెలుసుకోడానికి, మహావిషయాల నలివోకగా గ్రాహ్యం చేసికోడానికి ఏర్పడిన వాజ్ఞ్మయ ప్రక్రియ.
బాపిరాజుగారు వ్రాసిన కథలను విమర్శనాదృష్టితో పరిశీలించడానికి వీలుగా, మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. యోగసంబంధమైన కథలు లలితకళలకు సంబంధించిన కథలు, సామాజిక స్పృహగల కథలు.
యోగశాస్త్ర సంబంధమైన కథలలో హిమాలయరశ్మి, సోమసుత ప్రముఖమైనవి.
హిమాలయ రశ్మి అనే కథ బాపిరాజుగారి భావనా పరిధి ఎంత ఉన్నతంగా విస్తరించగలదో తెలియజెప్పగల గాథ. ఇందులో అనేక విషయాలను రచయిత పొందుపరచారు.
విశ్లేషణాత్మకమైన దృష్టితో పరిశీలించవలసిన విషయాలు :
(1) విగతభర్తృక అయిన స్త్రీ కి కేశఖండనం అవసరమా ?
(2) మహాసాధకుడు, తపస్వి, సంస్కారి అయినప్పటికిన్నీ, స్త్రీ వ్యామోహంనుంచి పురుషుడు తప్పించుకొనలేడా ?
(3) పాప పుణ్యభావన మానసికమా లేక చేసినపనిని బట్టి నిర్ణయించాలా ?
(4) ఆనందస్వామి యొక్క తపోసాధన.
వితంతువులకు కేశఖండన మనవసరమన్న విషయాన్ని రచయిత సున్నితంగా ఈ కథలో సూచింస్తారు. ఆ కాలానికి ఈ రకమైన భావాలు గొప్ప తిరుగుబాటు అనే చెప్పాలి. వైధవ్యం ప్రాప్తించిన స్త్రీ తల వెంట్రుకల నుండి, స్నానాంతరం ఎన్ని నీటిచుక్కలు రాల్తాయో అన్ని జన్మలు వైధవ్యం అనుభవించాలనేది ఆనాటి వారి మూఢనమ్మకం.
నిరుపమాదేవి షోడశకళలతో విరాజిల్లే బాల వలె బంగారు ఛాయతో మెరిసిపోయే కన్య. కానీ ఆమె విధివంచితురాలై పసియవసులోనే భర్తను కోల్పోతుంది. పదహారేళ్ళు వచ్చాక, హరిద్వారం తీసుకొని వచ్చి ఆమె కేశాలను గంగ కర్పించాలని అనుకుంటారామె తల్లిదండ్రులు. అన్ని సంవత్సరాలు ఎందుకాగవలసి వచ్చిందో ? ఆమె తండ్రికి ఆమెనలా విరూపిని చేయాలని అనిపించదు. నలుగురూ ఏమనుకుంటారో నన్న భయంతో ఆ దురాచారాన్ని సమర్థించబోతాడు. ఆ బాల ఆ సంఘటనను తలచుకొని, భయంతో వణికిపోతుంది. పులి ముందుకు పోయేలేడిలా, బలికాబోయే పశువులా, గిజగిజలాడిపోతుంది. ఆ సమయానికే అక్కడకి వచ్చిన ఆనందస్వామి అనే తపస్వి ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా నిరసిస్తాడు. మనసులో లేని వైరాగ్యం జట్టుతీయిస్తే వస్తుందా అని మందలిస్తాడు. అంతటితో ఆ ఘట్టం సమాప్తమౌతుంది. కానీ మాఎ కతడు ఆదిశంకరుడయ్యాడు.
ఆనందజీ అంతకుముందే నిరుపమాదేవి నదిలో స్నానం చేస్తుండగా చూసి చలిస్తాడు. ఆమె జీలం నదిలో పూసిన బంగారు కమలంలా ఉందనుకొని, తన భావానికి తాన భయపడతాడు. తన తపస్సు భగ్నమైంది. మళ్ళీ తానెన్ని జన్మలు వెనక్కిపోవాలో అనుకుంటాడు. సత్ పదార్థంతో ఏకమైన వాళ్ళు మళ్ళీ క్రిందికి రావడం ఉంటుందా అని విభ్రమం చెందుతాడు. మనసు చలించినందుకు తనను తాను దూషించుకుంటూ, ఆ హృదయ ప్రక్షాళనార్థమై తీర్థ యాత్రలు చేసుకొంటూ, కాశ్మీరులో ఒక ఇంటిముంగిట నిలచినాడు. ఆ ఇల్లు నిరుపమాదేవి తండ్రిది. అతడు స్వామికి సాష్టాంగపడి, సగౌరవంగా లోనికి తీసుకొని పోయినాడు. ఆ దివ్యమంగళ విగ్రహం నిస్సంగిని నిలువెల్లా వణికించిన ఆ సౌందర్యమూర్తి నిరపమాదేవి అతనికి శుశ్రూషలు చేయడానికి నియోగింపబడినది.
దేనికొరకు భయపడి దేశసంచారం చేశాడో, ఏ ఇంద్రియ నిగ్రహంకోరి దేహాన్ని తపస్సు అనే అగ్నిలో పుఠం పెట్టాడో అదంతా ఒక్క క్షణంలో వ్యర్థమైపోయింది. మేనకకు వశుడైన విశ్వామిత్రుడే అయాడు. కోరిక తీరగానే ఆనందజీ సిగ్గుతో, భయంతో, పశ్చాత్తాపాగ్నిలో శలభమైనాడు. ఈ క్షణం పవిత్రమైనదో, పాపభూయిష్టమైనదో అనే సంశయాన్ని రచయిత వెలిబుచ్చారు.
ఆనందజీ తాను సర్వనాశనమై పోయానని కుమిలిపోతే, నిరుపమ తాను ధన్యనైనానుకుంటుంది. తన జన్మ పవిత్రమైనదనుకొంటుంది. ఆమెలో కలిగిన సంపూర్ణ సంతృప్తివల్ల ఆమె తేజస్విని అయింది. కాంతిపుంజమైంది. దుర్నిదీక్ష్య అయింది. తమ కన్నబిడ్డలో వెలిగే కళాకాంతులను కళ్ళారా ఆనందంగా చూచుకొన్న కాశ్మీర దంపతులు తమ తల్లి పరమ పూజ్యురాలు అనుకొంటారు.
ఆనందజీ హిమాలయ పర్వత శిఖరం నుండి దూకి ఆత్మహత్య చేసుకోబోతాడు, కాని ఒక చెట్టు మధ్యనపడి ప్రాణావశిష్టుడై, తిరిగి తపస్సులో నిమగ్నుడైపోతాడు. నిరుపమాదేవి గర్భవతి, పూర్ణచంద్ర శోభతో వెలిగిపోతూంది. కుమారస్వామి సర్వవిశ్వానికి అర్పించబోతున్న దేవి, తధాగతుణ్ణి నెలలు నిండుగా గర్భమందు దాచుకొన్న మాయాదేవి ఆమె దేవకి కౌసల్య.
ఒక సాంప్రదాయ విరుద్ధమైన కార్యమాచరించి, గర్భాన్ని ధరించిన వితంతు స్త్రీ పట్ల, రచయిత కెంత కారుణ్యభావం ఉందో పవిత్రమైన జగన్మాతకునూ ఆమెకునూ సామ్యం చెప్పడంలో వెల్లడౌతుంది.
ఆనందస్వామి తాను ఘోరతపస్సు చేసిన తరువాత, తిరిగి కోరడానికి వస్తాడు. కాని నిరుపమ తండ్రి మాత్రం మహాకృద్ధుడై, అతనిని దండించబోగా, మనుమడు బుల్లిచేతులతో వెనుకకు లాగుతాడు. ఇదీ హిమాలయ రశ్మి ముఖ్యగాథ.
మానసిక శాస్త్ర పరిజ్ఞానంలో ఈ కథను విశ్లేషించాల్సి ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రతీకాత్మకంగా ఉండటం మరో విశేషం.
పాప, పుణ్య భావనలకు మనస్సే ప్రధానమని నిరుపమ పాత్ర నిరూపిస్తుంది. తాను మహత్కార్యం చేస్తున్నాననుకొంటుంది. ఆనందజీ పరమ శివమూర్తి లాగా ఆమెకు గోచరిస్తాడు. అతడేం చేయమంటే అది అక్షలారా ఆచరించేంతగా ఆమె అతనికి వశురాలవుతుంది. తన ఆలోచన తనకులేదు తన సుఖంసంతోషాలు తనకు లేవు. తన పాపపుణ్య చింతన కూడా తనకు లేదు. సర్వం ఆనందజీ ! అతనిని అంతగా అమాయకంగా ఆరాధిస్తూనే, తన అహం కు ఆమె నశింపచేసికోగల్గింది. అందుచేత, ఆమె సంకల్ప వికల్పరహితమైన మనస్సుతో చలించకుండా ఉండిపోయింది.
|