సాహితీ హిమాలయోత్తుంగ శృంగం
-డాక్టర్ దాశరథి, డి.లిట్.
హిమాచల శిఖరాలవలె, గంగా యమునా నదులవలె శాశ్వతత్వం పొందిన ఉత్తమ సాహిత్య స్రష్టల్లో కీ.శే. శ్రీ అడవి బాపిరాజు గారు ఆగ్ర శ్రేణిలోనివారు.
అట్టివారితో వివిధ సభలలో పాల్గొను భాగ్యం అస్మదాదులకు కొందరికి కలిగింది. అది మా అదృష్టం.
బాపిరాజుగారిది విశిష్టమైన వ్యక్తిత్వం. త్రివేణీ సంగమం వలె సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలు బాపిరాజులో కలగలిసిపోయాయి.
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు బాపిరాజుగారిని గురించి చెప్పిన పంక్తులు కొన్ని చదివతే చాలు బాపిరాజుగారు వ్యక్తిత్వం అర్థమవుతుంది.
అతడు గీసినగీత బొమ్మై
అతడు పలికిన పలుకు పాటై
అతని హృదయములోని మెత్తన అర్ఝథవత్కృతియై
అతడు చూపిన చూపు మెరుపై
అతడు తలచిన తలపు వెలుగై
అతని జీవికలోని తియ్యన అమృత రసధనియై
ఈ పంక్తులు బాపిరాజుగారి హృదయ స్వరూపాన్ని మన కన్నుల ముందు నిలబెడతాయి.
హృదయములోని మెత్తన
జీవికలోని తియ్యన - ఈ రెండు మహాగుణాలు బాపిరాజుగారిని మహా మానవునిగా తీర్చిదిద్దాయి.
ఆయన, ఎదుటివారిలోని మంచిని చూడడానికే ప్రయత్నించేవారు. ఆయన జీవితం కవితామయం. లౌక్యం తెలియని మనిషి ఆయన. రేపేమిటి అన్నది ఆయన ఆలోచించలేదు.
పుంఖానుపుంఖంగా రచనలు చేసేవారు. మీజాన్ పత్రికలో వారి హిమబిందు చదివాను.
వారు ప్రిన్సిపాల్‌గా వున్నప్పుడు బందరులోని నేషనల్ కాలేజీలో ప్రసంగించాను నేను చాలా అదృష్టవంతుణ్ణి. బాపిరాజుగారి ప్రేమాభిమానాలు చూరగొన్నాను.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఏ నవలైనా తీసుకుని చదివితే ఆయనకు ఎన్నెన్ని విషయాలు తెలుసో అర్థమవుతుంది. తలస్పర్శిగా తెలిసిన వ్యక్తి ఆయన.
దిగ్ధంతులవంటి మహారచయితలు ఆ రోజుల్లో ఉండేవారు. ఆరమరికలు లేకుండా మాట్లాడుకునేవారు.
స్పర్ధయావర్థతే విద్యా - అన్న సూక్తిలోని స్సర్ధయే తప్ప అన్యము లేదు.
కవిసమ్మేళనం జరిగితే బాపిరాజుగారు, విశ్వనాధవారు, నండూరి సుబ్బారావుగారు విధిగా ఉండవలసిందే. అరచేతుల్ని మూసేసే పొడుగైన ఖద్దరు జుబ్బా, కావి రంగు ధోవటి, మెరిసే కండువా, తుమ్మెద రెక్కల్లాంటి జుత్తు, పచ్చని బంగారు ఛాయ ముఖం, ఆజానుబాహువు బాపిరాజుగారు వేదికపై నిలుచుని -
హిమాలయోత్తుంగశృంగం
నీ బ్రతుకు
ఉమాపతి నాట్యరంగం
అని గాంధీజీని గురించి గానం చేస్తుంటే తన్మయమై వినేవాళ్ళం. శరత్ పూర్ణియా చంద్రికా ధవళమైన బాపిరాజుగారి హృదయం నభూతో నభవిష్య తి.
బాపిరాజుగారి రచనలు పునః పునర్ముద్రితులై ఇంటింటా వెలయవలెననీ, అందుకు ఒక చక్కని ప్రచరణసంస్థను స్థాపించవలెనని నా కోరిక.
అడవి బాపిరాజువంటి
ఆంధ్ర కవులుకావాలి
ఆంధ్రప్రదేశ్‌మునకు క్రొత్త
అందాలు రావాలి.
|