అనుభవాలు - జ్ఞాపకాలు
బుద్ధవరపు కామరాజు
తారీఖులు దస్తావేజులు. ఇవి కావోయ్ చరిత్రకర్థం, అన్నారు శ్రీశ్రీ దేశచరిత్రలు అనే గేయంలో. కాని, ఓ దేశచరిత్ర, ఓ మనిషి చరిత్ర అర్థం చేసుకోడానికి తారీఖులు, దస్తావేజులు ఆత్యవసరం. రామనవమి, కృష్ణాష్టమి వంటి తారీఖులు, రామాయణం, భారతం వంటి ద
స్తావేజులు మహనీయులు, మాననీయులూ అయినట్టి వారి చరిత్రకు సంబంధించినట్టివే. శ్రీ అడివి బాపిరాజు మహనీయుడూ, మాననీయుడూ మనిషిన్నీ.
8 అక్టోబరు 1895 న, పశ్చిమ గోదావరిజిల్లాలో భీమవరానికి అనతి దూరంలో, తన మాతామహుల స్వగ్రామానకి సమీపానగల సరిపల్లె అనే కుగ్రామంలో బాపిరాజు జన్మించారు.
22 సెప్టెంబరు 1952న, మద్రాసు రాయపేట, ఆస్పత్రిలో, ప్రోస్తేటెక్టమి అయాక, అంతా బాగయాక, ఆస్పత్రి నుండి విడుదలయాక, ఇంటికి వెళ్లే రోజున ఆస్పత్రి బెడ్‌మీదనే మరణించారు. ఆయన జీవించిన 57 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది సంక్షిప్తంగా చెప్పాలని నా అభిలాష.
ఇప్పటి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలలోని అధిక భూగాలన్నీ, కలిపి, బృహత్తరమైన రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ అని ఉండేది. ఆ మద్రాసు ప్రభుత్వంలో మా నాన్నగారు ఉన్నతోద్యోగి. ఆయనను అటు తూత్తుకుడి నుంచి, ఇటు కోరాపుట్ బరంపురం వరకు, ఎక్కడికైనా బదిలీచేయవచ్చు. అందుకని 1928 లో ధర్డ్ ఫారం నుంచి, 1932లో యస్.యస్.యల్.సి అయే వరకూ, బీమవరంలో మా మామయ్య ఇంట్లో ఉండి, యు.యల్.సి మిషన్ స్కూలులో చదువుకున్నాను. అప్పటికే బాపిరాజు గాంధీజీ అనుయాయులుగా, రచయితగా, చిత్రకారుడుగా పేరుపొందారు. ఫోటోతో పత్రికల కెక్కారు. శుద్ధ ఖద్దరు వస్త్రాలు ధరించేవారు రాట్నంమీద తాను సన్నని నూలు వడికేవారు. ఇంట్లో అందరిచేత వడికించే వారు. నేను సైతం రాట్నంమీద నూలుతీశాను. ఒక యేకుకి పదిప్నెండు బారల దారం వచ్చేది. అంచేత నూలు దుడ్డుగా ఉండేది. కట్టుకునే బట్టలకు పనికిరాలేదు. ఆనాటి రాట్నాలు. శిధిలావస్థలో మామయ్య స్వగృహంలోని ఆటకమీద ఇప్పటికీ కొన్ని ఉన్నాయి.
గాందీజీ ముఖ్య సూత్రాల్లో అంటరానితనం నిర్మూలన అనేది మిక్కిలి ముఖ్యమైనది. మా అమ్మమ్మకు పుట్టెడు ఆచారం. అంటరానివాళ్ళు స్కూల్లో మేము చదువుకుంటున్నాం కదా ! మేము అంటే నేనూ, మా తమ్ముడూన్నూ. కృష్ణారావుకూడా నాతోబాటు మామయ్య ఇంట్లో ఉండి అదే హైస్కూల్లో చదువుకుంటున్నాడు. మేము స్కూలు నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడూ, సాయంత్రం స్కూలు అయాక ఇంటికి వచ్చినప్పుడూ, కట్టుబట్టలు విప్పి, తడిగోచీ పెట్టుకొని ఆ బట్టలు గోడమూల కొట్టిన మేకుకు కట్టబెట్టాలి. మళ్ళీ స్కూలుకు వెళ్ళేటప్పుడు ఈ మైల బట్టలు కట్టుకోవాలి. మామయ్య ఈ అంటరాని తన రూలుని నిరకరించాడు. ఓ రోజు మరో మెట్టు పైకి వెళ్ళాడు. ఓ మాల పిల్లవాణ్ణి తమ పొలం పని చేసే పాలేరు కొడుకుని ఇంటికి తెచ్చి మండువాలో, అత్తయ్య చేత భోజనం పెట్టించాడు. అమ్మమ్మ బతిమాలినా, బామాలినా, దూషించినా వినలేదు. సరికదా అదేపని పదేపదే చేసేటప్పటికి, మాకు యెంతో ధైర్యం వచ్చేసింది. స్కూలు బట్టలతోనే ఇంట్లోనూ తిరిగి మైల మంట కలిపేశాం.
బాపిరాజు ఓ మాల పిల్లవాణ్ణి చేరదీసి, కొంచెం చదువు సంస్కారం నేర్పించారు. అతణ్ణి సేవాగ్రాంలో స్వయంగా చేర్పించారు. తరువాత అతడు పౌనార్‌లోని వినోబాభావే ఆశ్రమంలో చేరాడు. అతడు భూదానోద్యమ కార్యకర్తగా, వినోబాజీ అనుచరుడుగా పేరుపొందిన ప్రభాకరజీ, హరిజనులను సవర్ణులు ఎంతగా హింసించి బాధిస్తారో నరసన్న పాపాయి అనే ఆయన కథలో బాపిరాజు, కళ్లకు కట్టినట్లు చిత్రించారు. ఈ కథ చదువుతూంటే గుండె వ్రక్కలవుతుంది. మనసు ముక్కలవుతుంది.
1932లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు సాంఘిక నవలా రచనలో పోటీ పెట్టారు. ఇతివృత్తం యేమిటో ఎన్ని పేజీలు ఉండాలోచ ఏమేమి బహుమతులో, ఏ తేదీలోగా వారికి చేరాలో అన్ని నిబంధలను ప్రకటించారు. వ్యావహారిక భాషలో వ్రాయాలని స్పష్టంగానే చెప్పారు. ఈ పోటీ న్యాయ నిర్ణయ సంఘానికి జయపురం రాజావారు శ్రీ విక్రమదేవవర్మ అధ్యక్షులు ఆయన సంస్కృతంలో, తెలుగులో ఒరియాలో మంచి పండితుడు. అంతటి మద్రాసు ప్రెసిడెన్సీలోనూ రెండే యూనివర్సిటీలు పాతది మద్రాసు యూనివర్సిటీ కొత్తది ఆంధ్రా యూనివర్సిటీ.
ఆయన స్నేహితుడు, డాక్టర్ చెన్నా ప్రెగడ సుబ్బారావు, బాపిరాజును పోటీకి నవల వ్రాయమని పట్టుబట్టాడు. కాలంగడుస్తోంది. గడువు తేదీ పక్షం దినాల్లోకి వచ్చింది. డాక్టరు రోజూ రాత్రి తొమ్మిది గంటలకు గోల్డ్‌ప్లేక్ సిగరెట్ల టిన్నుతో మామయ్య ఇంట్లో పడక కుర్చీలో హాజరయ్యేవాడు. మామయ్య నారాయణరావు నవల డిక్టేట్ చేసేవాడు. మధ్య మధ్య ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, హాస్యాలాడుకుంటూ, సిగరెట్లు కాల్చుకుంటూ ఉండేవారు. ఇలాగ తాపీగా మామయ్య నవలను డిక్టేట్ చేశారు. నేను వ్రాశాను. నా దస్తూరీ బావుటుందని వాళ్ళిద్దరూ మెచ్చుకున్నారు. నవల పూర్తయింది. మా పెత్తల్లి కొడుకు క్రొవ్విడి కేశవరామయ్య చేత గడువు తేదీ ముందునాటికి వాల్తేరు ఆంధ్రా యూనివర్సిటీకి అందజేశారు.
బాపిరాజు నవల నారాయనరావు కు ప్రథమ బహుమతి ఇచ్చారు. విశ్వనాథ నవల వేయిపడగలు కు ప్రథమ బహుమతి ఇచ్చారు. ఇదెలా జరిగింది ! ప్రథమ బహుమతి రూ.750 లు అని ఆదిలో ప్రకటించారు. న్యాయ నిర్ణయ కమిటి అధ్యక్షులు శ్రీ రాజా విక్రమదేవవర్మ వినా మిగతా మెంబర్లందరూ వ్యావహారిక భాషలో వ్రాసిన నారాయణరావు కు ప్రథమ బహుమతిగా నిర్ణయించారు. అధ్యక్షులు గ్రాంధిక భాషలో వ్రాసిన వేయిపడగలు ప్రథమ బహుమతికి అర్హమని వాదించారు. చివరకు ఆయన తన సొమ్ము రూ.250లు యూనివర్సిటీ బహుమతి సొమ్ముతో కలిపి, రెండు ప్రథమ బహుమతులు, ఒక్కొక్కటి రూ.500 లుగా ప్రకటించారు.
నారాయణరావులో ముఖ్యపాత్రలు, ముఖ్య సంఘటనలు, పేర్లు మారినా వాస్తవమైనవి. ఎంత వాస్తవం అంటే విశాఖపట్టణం జిల్లాలోని ఓ జమిందారు బాపిరాజుకు పరువు నష్టం దావాకు లాయరు నోటీసు ఇప్పించారు. నారాయణరావు బాపిరాజే అని కొందరంటారు. కాని, ఇది నిజంకాదు. నారాయణరావు ముగ్గురు వ్యక్తుల కలయిక. నారాయణరావు నవలను తొలిసారిగా ఆంధ్ర దినపత్రికలో ధారావాహికంగా కాశీనాధుని నాగేశ్వరరావు ప్రచురించారు. పత్రికలో కాలమ్స్‌గా ప్రచురించిన నవలను అట్లే పుస్తక రూపంలో తెచ్చారు. ఈ ప్రతి ఒకటి మా మామయ్య తన దస్కత్‌తో, ప్రేమతో మా నాన్నగారికి బహుకరించాడు. ఈ అపురూప ప్రతి ఇప్పుడు నా వద్ద ఉంది.
ఆ ప్రాంతంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కవిత్రయంలో ప్రముఖుడు తిక్కన చిత్రానికి పోటీ, నూటపదార్లు బహుమతి ప్రకటించారు. మళ్ళీ ఆయన మిత్రులు డాక్టరు సుబ్బారావు బాపిరాజును చిత్రం వేయమని పోటీ చేయమని ఒత్తిడి చేశారు. గడువు తేదీ దగ్గరపడుతున్నది. మామయ్య వద్ద చిత్రానికి కావలసిన అనువైన కాగితం లేదు. నేను చదువుతున్న హైస్కూల్లో అంకాల వెంకట సుబ్బారావు డ్రాయింగు టీచరు ఇంటికిపోయి, మా మామయ్యకు కావలసిన కాగితం అప్పుగా ఇవ్వమని కోరాను. ఆయన అతి చిన్న కాగితం ఇచ్చారు. మామయ్య బెజవాడ వెళ్ళి కాగితాలు, రంగులు, కుంచెలు కావలసినన్ని కొని తెచ్చుకున్నాడు.
తిక్కన యజ్ఞం చేసిన సోమయాజి. మహా పండితుడు, మహాశూరుడు, మహామంత్రి. మహాభారతం తెనిగించిన ప్రతిభాశాలి. భారతాన్ని తానే స్వయంగా వ్రాసుకుంటాడుగాని ఏ కుమ్మరి గురవయ్యకో డిక్టేట్ చెయ్యడు. బాపిరాజు తిక్కన చిత్రం పూర్తిచేశారు. తిక్కన సోమయాజి వదనం తేజోవంతంగా ఉంది. శరీరం బలంగా పొడుగ్గా ఉంది. చెపులకు కుండలాలు, చేతుల్లో గంటం, తాటాకులు ఉన్నాయి. ముందు పీటమీద వ్రాసినవి వ్రాయవలసినవి తాటాకు కట్టలు. సింహాసనం లాంటి ఉన్నతాసనం మీద కూర్చుని, కృష్ణరాయబార ఘట్టం వ్రాస్తున్నాడు. ఇది ఆయన మనో నేత్రం ముందున్నట్లు, నేపధ్యంలో చిన్న సభాచిత్రం, ఆ సభలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, భీష్ముడు మున్నగువారు ఉచితాసనాలమీద ఆసీనులై ఉన్నారు. కృష్ణుడు నిలబడి రాయబారం వినిపిస్తున్నాడు.
ఈ చిత్రానికి షాపులో ఒక్కప్రక్క ప్రేముకట్టే యత్నాలు సాగుతుండగా, మామయ్య ఒక్కప్రక్క తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. మేము రంగులు కుంచెలు పట్టుకెళ్ళాము. నారాయణరావు నుమోసుకుపోయినట్లే, మళ్ళీ క్రొవ్విడి కేశవరామయ్య తిక్కనను మోసుకుపోయి వాల్తేరు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారికి గడువుతేదీ నాటికి ఒకరోజు ముందుగా భద్రంగా అందించాడు. భీమవరం నుంచి నిడదవోలు నుంచి వాల్థేరుకు బ్రాడ్‌గేజి రైలు ఉండేది. అందుచేత నిడదవోలు జంక్షనులో రైలు మారవలసి వచ్చేది. ప్రయాణం రోజు పైన పట్టేది. రైళ్ళలో ఫస్ట్, సెకెండ్, ఇంటర్, ధర్డ్‌క్లాసులు ఉండేవి. ధర్డ్‌క్లాసు బోగీలు క్రిక్కిరిసి ఉండేవి కొంతదూరం నిలబడి ప్రయాణం చేయవలసి వచ్చేది. కూర్చోడానికి, పడుకోడానికి బలప్రయోగం చేయవలసి వచ్చేది. కేశవరామయ్య పొడగరి కండలు తిరిగిన కాయ శరీరం గలవాడు. తిక్కన చిత్రానికి మోడల్. ధర్డ్‌క్లాసులో ప్రయాణించగల శూరుడు.
బాపిరాజు తిక్కన జలవర్ణ చిత్రానికి ప్రథమ బహుమతి ప్రకటిస్తూ, అందులో ఏవో కొన్ని చిన్న మార్పులు చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు సూచించారు. ఆ సూచనలు చిత్రకారుడికీ చిత్రకళకూ అవమానకరమని భావించి, బాపిరాజు అంగీకరించలేదు. సూచనలతోబాటు బహుమతి నిరాకరించారు. మామయ్య తిక్కన చిత్రం మామయ్య ఇంటనే ఉంది.
|