కళాసౌందర్య దార్శనికుడు
డా || ముదిగొండ శివప్రసాద్ ఎం.ఎ. పిహెచ్‌డి
ప్రతి రచయితకు తన రచనా వ్యాసంగం నిర్వహించటానికి స్ఫూర్తికావాలి. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసములతోపాటు స్ఫూర్తిని కూడా కావ్య హేతువులలో అలంకారికులు చేరిస్తే బాగుటుందని భావిస్తున్నాను. నేను చారిత్రక నవలలు వ్రాయటానికి ప్రథానంగా ముగ్గురు వ్యక్తులు స్ఫూర్తినిచ్చారు. వారు సర్వశ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు, ఆడివి బాపిరాజు గారు నోరి నరహింసశాస్త్రిగారు.
చిన్నప్పుడు హైస్కూలులో చదువుకొనే రోజుల్లో శ్రీ కె.ఎం. మున్షీ రచించిన జైసోమనాథ్ తెలుగు అనువాదం చదివాను. నాలో రసార్ధ్రపు స్పందనాలను బాగా మేల్కొల్పిన నవల అది, ఈ విషయం నేను అప్పుడు వరుసగా బాపిరాజు గారి నవలలు చదవటం మొదలు పెట్టాను. హిమబిందు, నారాయణరావు, తుఫాను కోనంగి అలా అంశుమతి, ఆడివి శాంతిశ్రీ కొంచెం ఆలస్యంగా చదివాను.
తెలుగులో చారిత్రక నవలలకు మూల స్తంభాలు అని చెప్పదగిన వారిలో విశ్వనాధ, నోరి, బాపిరాజు ముఖ్యులు. అయితే రచనావిషయకంగా ఈ ముగ్గురిలోను కొంచెం భేదముంది. ఉదాహరణకు విశ్వనాధవారి ఏకవీర తీసుకొందాము. ఇందటి వైగైనది, కుట్టాన సేతుపతి, అంబా సముద్రము, మద్మర రాజులు, ఇవన్నీ చారిత్రకపు వాసనను కల్గిస్తాయి. కానీ ఇది నూటికి నూరుపాళ్ళు కాల్పనకి కథ. ఇంగ్లీషు రొమాంటిక్ నవల, ఈ ధోరణి విశ్వనాధవారి చాలా చారిత్రక నవలల్లో కన్పిస్తుంది. కానీ బాపిరాజుగారి నవలలు అలాకాదు. ఆయన చారిత్రక నవలల్లో నూటికి ఎనభైపాళ్ళు చరిత్ర, ఇరవైపాళ్ళు కల్పన ఉంటుంది. అంతేకాదు బాపిరాజుగారి నవలల్లో చరిత్ర అంటే కేవలం రాజులు, రాజ్యాలు, పేర్లు, పట్టికలు మాత్రమే కాదు ఆనాటి వేష భాషలు, ఆచార వ్యవహారాలు, సాంఘిక రాజకీయ మత పరిస్థితులు ఎంతో సమగ్రంగ, సునిశితంగా చిత్రించబడి ఉంటాయి. బహుశా ఆయన చిత్రకారుడై ఉండటం కారణమేమో నవలలో ఒక పాత్రను చిత్రిస్తే కళ్ళ ఎదురుగా ఒక బొమ్మను గీచినట్లే ఉంటుంది. ముఖ్యంగా హిమబిందులో యుధ్ధ వ్యూహముల సందర్భంలో, పెళ్ళి వేడ్కల సందర్భాలలో ఆయన వాడిన పదజాలం బాపిరాజు గారి పరిశోధక మేధకు దర్పణం పట్టేదిగా ఉంది. నిజానికి బాపిరాజు గారు 1922 లో జైల్లో ఉన్నప్పుడు హిమబిందు నవలకు అంకురార్పణ చేసారు. ఆ తరువాత అంటే ఈ 65 సంవత్సరాలలోను శాతవాహనచరిత్రను గూర్చిన నూతన విశేషాలు ఎన్నో వెలుగులోనికి వచ్చాయి. అయినాసరే శాతవాహనులపై ఎవరు నవల వ్రాయాలన్నప్పటికి వారికి హిమబిందు రచనయే నేటికి ఒరవడిగా మిగిలిపోయింది. ఇది బాపిరాజుగారి అసామాన్యమైన శక్తికి, అనల్ప కల్పనా ప్రతిభకు ధ్వజస్తంభం వంటింది. ముఖ్యంగా బాపిరాజు గారి నవలల్లో ఉన్న లాలిత్యం మరెవ్వరి నవలలోను లేదు అంటే అది అతిశయోక్తి కానేరదు. ఆయన అణువణువునా నిండిన రసార్ధ్ర ప్రవృత్తి బొమ్మలలో రస రేఖలుగా నవలలో అక్షరాలుగా శాశ్వతత్వాన్ని సంతరించుకొన్నది.
అంశుమతి చిన్న నవల, కుబ్జ విష్ణువర్థనుడు అంశుమతిని వివాహంచేసుకోవటం ఇందలి ఇతివృత్తం విష్ణువర్ధనుడు బహుశా పొట్టివాడై ఉంటాడు. అందుకే అతనికి కుబ్జ విష్ణువర్థనుడు అనే పేరు వచ్చింది. అతన్ని అంశుమతి ప్రేమించింది. అంశుమతి తొలిసారి విష్ణువర్ధనుణ్ణి చూపినప్పుడు అతడు ప్రభువని ఆమెకు తెలియదు. తనతో సమానమైన వయస్సుగల ఒక క్షత్రియ బాలకుడని అనుకొన్నది. విష్ణువర్ధనుడు ఈ వామనత్వమునకీ పది సంవత్సరముల నుండి మనస్సు అప్పుడప్పుడు దుఃఖము నొందుచు తన్ను గుజ్జువానిగి నెంచిన వారినెల్లరను ద్వేషించుచు నానాటికి కర్కశత్వమును దాల్చినది . కానీ ఈ బాలిక పరమ సుందరి. దివ్యగాత్ర, తనపై అభిమానము చూపినది. ఆమె మాటలు కోకిల పులుగు కువకువలు వలె తేనియలు చెమరించినవి. చివరకు వీరిరువురికిని వివాహమవుతుంది. మొత్తం నవలలోని కథ ఈ సన్నివేశానికి ఉపబలంగా సాగేటట్లు రచయిత ప్రణాళికను సిద్ధం చేసుకొన్నారు. అదే ఇందులోని శిల్పం. బాపిరాజు గారి నవలలో మనం గమనించ వలసిన ముఖ్యమైన అంశం స్త్రీ పాత్రల చిత్రీకరణ, హిమబిందు, అమృతకన్య, శారద, అంశుమతి మొదలైన ప్రధాన పాత్రలన్నీ అపురూంగా తీర్చిదిద్దబడతాయి. ఆలాలిత్యము, మార్ధవము, లావణ్యము విశ్వరూపాన్నీ కింద ప్రక్కనున్న పురుష పాత్రలను కూడా ప్రభావితం చేస్తాయి. అటు సువర్ణ శ్రీ వద్దనుండి ఇటు కుబ్జ విష్ణువర్ధనుని వరకు, ఇటు నారాయణరావు నుండి ఇటు త్యాగతివరు అందరూ పరమ సుకుమారంగానే కనపడతారు. అందరూ దాదాపు ధీరలలితులవలెనే గోచరిస్తారు. ఇందుకు కారణం రచయితగా బాపిరాజు ధీరలలితుడు. నోరి, విశ్వనాథగారలు ధీరోదాత్త, ధీరోద్ధతులు. ఇదే మౌలికమైన భేదము.
బాపిరాజు ముందు, బాపిరాజు తరువాత ఎందరో చారిత్రక రచయితలు వచ్చారు చారిత్రక విషయాలు చాలా స్పష్టంగా పరిశోధనాత్మకంగా కూడా ఉదాహరించినావారు ఉన్నారు. కానీ సమగ్ర కళా సౌందర్య దర్శనం చేసి రస సిద్ధులుగా బాపిరాజుకు సాటి బాపిరాజుగారే. ఈ విషయంలో ఆయన అనన్వయాలంకారము.
ఈ రేయి వెన్నెలరేని యిక్కలో
కస్తూరి కామోద సుమములే విరిసె బో !
రిక్కగమి చెక్కిళ్ళ
నెక్కి నిలిచిన సిగ్గు
రంగు రంగుల మెరిసి
తొంగి చూచెను మురిసి
అరుణ కిరణములల్లి
తరుణ శశికళ కులికే
మధుర సోపాన తతి
మంటి మింటిక నమరె
వైశాఖ పూర్తిమ - రాచకొండ విశ్వనాధశాస్త్రి బాపిరాజుగారికి జరిగిన కనకాభిషేక మహోత్సవాన గానం చేసినది.
|