బహుముఖ ప్రతిభాశాలి బాపిరాజు
- డాక్టర్ సంజీవదేవ్
ప్రతిభ ఎక్కువ మందిలో ఏదో ఒక విషయంలో మాత్రమే ఉంటుంది. కొందరిలో అది రెండు విషయల్లో ఉంటుంది. చాలాఅరుదుగా అది చాలా తక్కువ మందిలో ఎన్నో విషయాల్లో ఉంటుంది.
ఇటువంటివారే బహుముఖ ప్రతిభాశాలులు.
కొన్ని దశాబ్దాల క్రిందట మరణించిన ఆడివి బాపిరాజుగారు బహుముఖ ప్రతిభాశాలి.
ఆయన కోర్టుకుపోని లాయరు, మనోవైజ్ఞానిక నవలాకారుడు, కధకుడు, కవి, పాటకుడు, పాత్రికేయుడు, అన్నిటికంటే మించిన భావుకుడు, ఆంతకంటే మించిన మానవుడు.
నాలుగు దశాబ్దాలకు పైసంగతి. విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో అప్పుడు ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. గొప్ప విద్వాంసుడైన డాక్టర్ పుట్టపర్తి శ్రీనివాసాచారి. నేను ఆయన విద్యార్థిని కాకపోయినా (అసలు నేను ఏ కాలేజీ విద్యార్ధినీ కాను ). మా ఇద్దరికీ ఒక విధమైన సాంస్కృతిక మైత్రి ఉండేది. చిన్నా పెద్దా తేడా ఆయనకుండేది కాదు. ఆయన్ను నేను పెద్దవాడుగా గౌరవించటాన్ని కూడ ఆయన సహించేవాడు కాదు.
ఒకనాడు విజయవాడ పోయినప్పుడు వారింట ఒక రాత్రిగడపటం జరిగింది. మా మాటల మధ్య అడవి బాపిరాజుగారు ఆయన బహుముఖ ప్రతిభా మొదలైన విషయాలు వచ్చినాయి.
డాక్టర్ శ్రీనివాసాచారిగారు అడిగారు నన్ను ఆడివి బాపిరాజుగారిని ఎపుడైనా చూడటం జరిగిందా అని. ఆయన్ను గురించి ఎంతగానో వినటం తప్ప చూడటం తలస్థించలేదని తెలిపారు.
నేను బాపిరాజుగారిని అంతవరకూ చూడనందుకు డాక్టర్ శ్రీనివాసాచారిగారు సంతోషించారు. కారణం రేపు బాపిరాజుగారు తమ ఇంటికి రాబోతున్నారు.
బాపిరాజుగారుని నేను మొదటిగా చూచే ఘనత తమ ఇంట జరగాలని శ్రీనివాసాచారిగారి వాంఛ.
అందుకు ఆయనా నేనూ ఉభయులం ఆనందించాం.
మరుసటి రోజు తమ ఇంటనే నన్నుండమని డా. ఆచారి దంపతులు కోరగా నేను బాపిరాజుగారి రాక నిరీక్షణలో మరుసటిరోజున వారింటనే ఉండిపోయాను.
అదివరకే బాపిరాజుగారి ప్రతిభా వైవిధ్యాన్ని గురించి విని ఉన్నాను. ఆయన ఒకటి రెండు రచనలు కూడ చదివి ఉన్నాను.
శ్రీనివాసాచారిగారు బాపిరాజుగారిని గురించి ఎన్నో నేనెరుగని విషయాలు చెప్పేరు.
దాంతో ఆయనరాకకై ఆతురత ఎక్కువ అయింది.
కొంతసేపటికి టక్ టక్ మంటూ ఒక జట్కాబండి వచ్చి వారింటి ముందు ఆగింది.
బాపిరాజుగారి ఫోటోను అనేకసార్లు పత్రికల్లో చూచిఉన్నందున జట్కా దిగిన మొగవ్యక్తి బాపిరాజుగారనీ, ఆడవ్యక్తి ఆయన సతీమణి అనీ, ఇంకో అమ్మాయి వారి కూతురనీ గ్రహించాను.
శ్రీనివాసాచారిగారు నన్ను ఆయనకు పరిచయం చేశారు. నన్ను గురించి ఉన్నవీ లేనివీ ఏమేమి చెపితే బాపిరాజుగారికి నా మీద ప్రీతి జనిస్తుందో శ్రీనివాసాచారిగారికి తెలుసు. అవన్నీ బాపిరాజుగారితో చెప్పేరు.
అందుకు బాపిరాజుగారు ఆనందించి నన్ను బుజ్జగించారు. ఏమి చదువుతున్నావయ్యా ? అని నన్ను ప్రశ్నించారు. అందుకు నాకే సమాధానమూ లభించలేదు.
నా పరిస్థితిని కనిపెట్టి శ్రీనివాసాచారిగారే సమాధానం జెప్పేరు. ఆయన ఎప్పుడూ ఏమీ చదువలేదు, ఇప్పుడూ ఏమీ చదవటంలేదు. అందుకే ఆయన మా కందరికీ ఎంతో ఇష్టుడు.
అప్పటికే నాకు కొంత బెంగాలీ సాహిత్యంలో పరిచయం ఉండేది.
బాపిరాజుగారికి బెంగాలీ సాహిత్యంమీద అభిమానం ఉండేది. కాని ఆయనకు బెంగాలీ భాఫ తెలియదు.
అందువల్ల అప్పటి బెంగాలీ, నవకవులను, యువకవులను గురించి, బెంగాలీ ఇతర సాహితీ విభాగాలను గురించీ నన్ను అడిగి తెలుసుకొన్నారు.
రవీంద్రుని రచనలు చాలాభాగం ఆయన ఇంగ్లీషు అనువాదాల్లో, శరత్ చంద్రుని రచనలు తెలుగు అనువాదాల్లో చదివి ఉన్నారుకాని మౌలిక బెంగాలీలో చదివి ఎరుగరు.
బెంగాలీలోని గ్రాంధిక శైలికీ, వ్యావహారిక శైలికీ ఉన్న ప్రధాన ప్రభేదాలను తెలుసుకోవాలనే ఆయన అభిలాషను తీర్చాను బెంగాలీనుండి కొన్ని ఉదాహరణ వాక్యనిర్మాణాలను చూపి.
అంతకు పూర్వం బాపిరాజుగారు బందరు జాతీయ కళాశాలలో విఖ్యాత బెంగాలీ చిత్రకారుడైన ప్రమోద కుమారచటర్జీ దగ్గర చిత్రవిద్య సభ్యసించి ఉన్నారు.
అందువల్ల ఆయనకు బెంగాలీ భాష తెలియకపోయినా బెంగాలీ సాహిత్యం మీద అభిమానం ఉండేది.
బాల్యంలోని నా పర్యాటక జీవితం మూలంగా బెంగాలీలో నాకు సంపర్కం ఏర్పడటం, బెంగాలీ భాషలో నాకు వ్రాయటం చదవటం వచ్చునని తెలుసుకొని బాపిరాజు గారు నన్నెంతో వాత్సల్యంతో బుజ్జగించారు.
అప్పటికి నేనింకా చిత్రకారుడుగా మారలేదు. అయినా, చిత్రకళ, శిల్పకళలను గురించి అరుదుగా రచించేవాడిని చిన్నచిన్న వ్యాసాలు, కాలేజీల సాంస్కృతికోత్సవాలలో కళలను గురించి చిన్న చిన్న ప్రసంగాలు చేసేవాడిని.
ఇందుకు డాక్టర్ శ్రీనివాసాచారిగారి ప్రోత్సాహం ప్రోద్బలం నాకెంతో లభించేది.
నేను అప్పటికి చిత్రకారుని కాకపోయినా చిత్రనిర్మాణానికి చెందిన మాధ్యమాలను గురించీ, రచనా విధానాలను గురించీ, వాటి చారిత్రక వివరాలను గురించీ అంతలోతుగా కాకపోయినా పైపైన అయిన తెలుసునాకు.
పెద్ద అసంతృప్తి ఏమంటే బాపిరాజుగారు తమ వెంట తమ చిత్రాలను పట్టుకరాలేదు. అందువల్ల ఆయన చిత్రాలను ఆయన సమక్షంలో చూసే అవకాశం అపుడు నాకు లభించలేదు.
శ్రీనివాసాచారిగారు మా ఇద్దరినీ సంభాషణలో దింపితాము శ్రోతపాత్ర నవలంబించి మౌనంగా వింటూ కూర్చున్నారు. మా మాటలు ఆయనకు కొత్తవిగా ఉన్నట్లు నటిస్తూ.
వాస్తవానికి మేము మాటాడుకొనేవన్నీ ఆయనకు తెలిసిన విషయాలే.
నీటిరంగుల్లో చిత్రిస్తే చిత్రంలోని ఫలితాలు ఏ విధంగా ఉండేవీ, తైలవర్ణాల్లో చిత్రిస్తే ఏవిధంగా ఉండేవీ టెంపరా విధానంలో చిత్రిస్తే పేస్టల్సుతో చిత్రిస్తే ఏ విధంగా ఉండేవీ మొదలైన సాంకేతిక విషయాలను ముచ్చటించుకొన్నాం.
నాకు ప్రకృతి దృశ్యచిత్రాలంటే ఎక్కువ ప్రీతి. బాపిరాజుగారు ఎక్కువగా దేవమూర్తులనూ మానవ మూర్తులనూ, ఇంకా ఇతర ఇతివృత్తంగల చిత్రాలనూ చిత్రించటంలో అభిరుచి కలిగి ఉండేవారు.
ప్రాచ్యవిధానంలోని రేఖా ప్రాధాన్య పద్ధతిలోను, పాశ్చాత్య విధానమైన మూడు ఆయతనాల వెలుగు నీడల పద్ధతిలోనుకూడ ఆయన సమానదక్షతతో చిత్రించేవారు.
ఇంతలో భోజనాలవేళ అయింది. మేమంతా బల్లల ముందుకాక భారతీయ పద్ధతిలో నేలబారు పీటలమీద కూర్చున్నాం.
బాపిరాజుగారు చిత్రకారుడు మాత్రమేకాదు. సాహిత్యకారుడు కూడ. నిజానికి ఆయన చేసిన చిత్రరచనలకంటే చేసిన సాహితీ రచనలే ఎక్కువ. ఆయునకు కీర్తి తెచ్చినవికూడ ఆయన చిత్రాలుకాదు, ఆయన నవలలే, ఆయన గేయాలే.
నేనెందుకు చిత్రరచన చేయను అని మీరు చిత్ర రచన ఎందుకు చేయరు అని వుంటే ఆయన నన్ను ప్రశ్నించారు. నేను ప్రయత్నిస్తే నా కేదీ అబ్బదు. దానంతటది రావాలి నాలోకి అన్నాను. అల్లాగా ? అని ఆయన పెద్దగా నవ్వారు.
బాపిరాజుగారి గురించి ఒక చమత్కారం చెప్పేవారు. సాహిత్యకారుల మధ్య తాను చిత్రకారుడననీ, చిత్రకారుల మధ్య తాను సాహిత్యకారుడననీ చెప్పేవారట !
ఏది ఏమైనా, ఆడివి బాపిరాజుగారు గొప్ప స్రష్ట. ఆయన సృజనశీలత అనేక రంగాల్లో అద్భుత స్రవంతి అయి ప్రవహించేది.
బాపిరాజుగారు అక్షర స్రష్ట, రేఖా స్రష్ట, వర్ణ స్రష్ట, నాద స్రష్ట, ఇంకా అనేకాల స్రష్ట.
జీవితంలో ఆయన బాధలను అనుభవించారు.
కొందరు మనీషులు తాము బాధలను తీసుకొని ఇతర్లకు ఆనందాన్ని అందిస్తారు.
ఆడివి బాపిరాజుగారు అటువంటి మనీషే !
1ఈ కుక్క నా స్నేహితుడు
నాతోటి అతిధి
మేమంతా గొప్ప గుట్టాలు
కాకులూ కుక్కలూ యానాదులూ
|
4. గవేషణ
నీల మహా గధీరపథసువినిశ్చలయామిని సర్వతారకా
గోళ మయూఖ కాంతి సీతకోమల కౌముది చంచలా ముఖా
లోల లలాటి కారుచుల లోహిత సుందర మూర్తి సాంధ్యలా
లాలలితాబ్జ లోచములన్ పరికించితి, యుష్మదర్థయై |
|
|
2 మా భాష
మా ఉరుముల భాష
మా అమృత ప్రవాహాల భాష
మా షడ్రుచుల భాష
మా మహా మధుర భాష
మా భాషే
మా ఆంధ్ర భాషే
మా తెలుగు భాషే
మా భాషే మా భాషే
|
5. యజ్ఞసేని
సురభి చందన తరుఖండ సుందరేధ
నములు మాత్పుర్వ వాసనాక్రమిత జీవి
తాశయమ్ముల నీ ప్రణయాగ్ని కీల
యజ్ఞదేక్షాసముండనై యాహతింతు
దేవి యెన్సీకేని తద్దివ్వధూమ
మానికోద్ధితమైన నీ మహితవర్ణ
రేఖికామూర్తి సాక్షాత్కారిప కున్నెదేవి ? |
|
|
3
ప్రతి కంటిలో ఒలుకు భాష్పములు
ఒక కంటిలోనైన
తుడిచేవేయాలని నేను ! |
6
నీ దైవం వేషాలు వేసినాడు.
నీ దైవం అబద్దాలు చెప్పడు.
నీకు ఆస్తి లేదు
ఆస్థులు ఉన్నాయి.
నువ్వు శివుని బిడ్డడివా పవిత్రమూర్తీ. |
|