హిమ‌బిందు న‌వ‌ల‌లో బాపిరాజు గారుచేసిన బౌద్ధ హిందూమ‌త విశ్లేష‌ణ‌

- తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌లింగేశ్వ‌రరావు

శ్రీ అడివి బాపిరాజు గారి జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌క‌టింప‌బ‌డ‌నున్న స్మారిక‌కు న‌న్నీ విష‌యం మీద వ్యాసం వ్రాయ‌మ‌న్నారు. నిర్వాహ‌కుల కోరిక‌ను మ‌న్నించి య‌థామ‌తి నేను వివ‌రించ‌డానికి పూనుకుంటున్నాను.

బాపిరాజు గారు శ‌శిక‌ళా ప్రియంభావుకుడు. ఆయ‌న పాల వెన్నెల‌లు తీవ‌ల‌ల్లుకొని క‌ట్టిన పందిరి లాగా కార్తికోత్ప‌న్న సుధాంశుధీధితులు ప‌న్నిన మ్రుగ్గులులాగా వ‌ర్ణ‌న‌లు చేసుకుంటూ పోతారు. చంద్రుడంటేనూ, వెన్నెల అంటేనూ ఆయ‌న‌కు మ‌హాప్రీతి. ఆ మాట‌లు వ‌స్తే చాలు ఆయ‌న ప‌ర‌వ‌శ‌మైపోతారు. ఆయ‌న ర‌చ‌న ప‌ర‌వ‌ళ్లు త్రొక్కుతుంది. ఆయ‌న ఏ క‌థ వ్రాసినా, క‌బుర్లు చెప్పినా ప్ర‌ణ‌య మాధుర్యం వెల్లువ‌లు వెల్లువ‌లుగా ప్ర‌వ‌హిస్తుంది. ప్ర‌తి ర‌చ‌న‌లోనూ యీ ప్ర‌ణ‌య మాధుర్యానికే ప్రాముఖ్యం. క‌థ‌లో మూడు నాలుగు జంట‌ల ప్ర‌ణ‌య వృత్తాంతాలు ఉంటాయి. ఈ హిమ‌బిందు సువ‌ర్ణ‌శీల ప్ర‌ణ‌య వృత్తాంతంతో పాటు స‌మ‌ద‌ర్శి నాగ‌బంధునిక ప్ర‌ణ‌య వృత్తాంతం ఇంకా చంద్ర‌బాలా శ్రీ‌కృష్ణ సాత‌వాహ‌నుల ప్ర‌ణ‌య వృత్తాంతం పెన‌వేసికొని ముప్పేట‌గా న‌డ‌వ‌డ‌మే కాదు ఉప క‌థ‌లుగా ముక్తావ‌ళీ దేవి కీర్తి గుప్తుల ప్ర‌ణ‌య‌గాధ‌, ఆంధ్ర చ‌క్ర‌వ‌ర్తి శ్రీ‌ముఖ సాత‌వాహ‌నుని గాథ మ‌ల్లెపందిరుల గుబాళీంపులు చేస్తాయి.

ఆయ‌న‌కున్న శ‌శిక‌ళా ప్రియంభావుక‌త వ‌ల‌న క‌థ‌లో ఒక పాత్ర‌కు శ‌శి సంబంధ‌మైన నామ‌క‌ర‌ణం చేస్తాడు. ఈ క‌థ‌లో చంద్ర‌బాల ఉన్న‌ది. బాపిరాజు గారు చిత్ర క‌ళాకారుల‌లో క‌వి. క‌వుల‌లో చిత్ర క‌ళాకారుడు, సంగీత ర‌సికుడు, నృత్య క‌ళాపిపాసి. శిల్ప‌క‌ళా మ‌ర్మ‌జ్ఞుడు శిల్ప క‌ళాభిమాని కావ‌డం వ‌ల‌న భార‌త దేశంలోనేకాదు యావ‌త్ర్ప‌పంచంలోనూ శిల్ప‌క‌ళా వికాసానికి ఆన‌ల్ప‌మైన సేవ‌చేసిన బౌద్ధ‌మ‌తమంటే ఆయ‌న‌కు స‌హ‌జంగానే అభిమానం. ప‌క్ష‌పాతంకూడా అని చెప్ప‌వ‌చ్చు. అందుచేత బౌద్ధ‌మతాన్ని గురించి చెప్పెట‌ప్పుడు, దాని విస్త‌ర‌ణ‌ను నిలువ‌రించ‌డానికి వైదిక మ‌తం వారు చేసిన ప‌నుల‌ను గురించి చెప్పేట‌ప్పుడూ కొంచెం బాపిరాజుగారి క‌లం బౌద్ధ‌మ‌తం వైపే మొగ్గుచూపింద‌నిపిస్తుంది. హిమ‌బిందు న‌వ‌ల‌లో బౌద్ధ‌మ‌తాన్ని బాపిరాజుగారు ఏ దోష‌మూలేని స‌ర్వ‌సంపూర్ణ ప‌రిశుద్ధ తాత్త్విక‌మ‌తంగా ప్ర‌ద‌ర్శించ‌డానికి ప్ర‌య‌త్నించారు. వైదిక ధ‌ర్మాన్ని గురించి కొంచెం న్యూన‌త‌గానే చెప్పుతున్నారేమో అనిపించేట‌ట్లు చెప్పి, మ‌ళ్ళీ రెండు మ‌తాలు చెప్పుతున్న‌దీ ఒక్క‌టేనంటూ ముక్తాయింపులు చేశారు.

కేవ‌లం తాత్త్విక దార్శ‌నిక దృష్టితో ప‌రిశీల‌న చేస్తే బాపిరాజుగారి భావాలెంత‌వ‌ర‌కు నిలుస్తాయి ? అది ప‌రిశీలిద్దాము.

ప్ర‌తిమ‌తానికీ - సిద్ధాంతము న‌మ్మ‌క‌ము ఉంటాయి. ఈ రెండూ కాక సిద్ధాంతంలో చెప్పిన‌దాన్ని అనుభ‌వంలోకి తెచ్చుకోవ‌డానికి చేయ‌వ‌ల‌సిన సాధ‌న క్ర‌మం ఉంటుంది. బౌద్ధ‌మ‌తానికి కూడా ఈ మూడు ఉన్నాయి. బౌద్ధ మ‌తాన్ని గురించి చెప్పేట‌ప్పుడు బాపిరాజు గారు దానికున్న మంచి న‌మ్మ‌కాలు కొన్నిటిని ఉటంకించారేగాని బౌద్ధ‌మ‌తంలో కూడా తంత్ర గ్రంథాలున్నాయ‌ని, ఏహ్య‌మైన క్రియాకాండ‌వున్న‌ద‌నీ బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం ఆయ‌న అనుయాయుల‌చేతుల్తో ఎన్నో అవ‌తారాలెత్తి చివ‌ర‌కు జుగుస్స క‌లిగించే స్థితికి దిగ‌జారటం వ‌ల‌న‌నే మాతృదేశంలో స్థానాన్ని పొగొట్టుకున్న‌ద‌నీ లోట్లు బౌద్ధానికి కూడా ఉన్నాయ‌నీ బాపిరాజు గారు గుర్తించ‌లేదు.

ఆయ‌న మ‌ధుర‌మైన ర‌చ‌నాఫ‌ణితిలో ప్ర‌ణ‌య మాధుర్య ర‌స ప్ర‌వాహం తేట‌లుదేరి త‌ట‌ద్వ‌య‌మ్మొర‌య వెల్లువ‌లుగా వ‌స్తోంటే మ‌తాన్ని గురించి స‌రిగ్గా చెప్పాడాలేదా ? అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌దు. అక్క‌ర్లేదు. మ‌నం కూడా మాధుర్య ర‌సానంద సాంద్ర ప్ర‌వాహంలో మునిగి తేల‌ట‌మే కావ‌ల‌సింది. అదే ప్ర‌యోజ‌న‌ము.

సంస్కృత కావ్యాల‌లో (ముద్రారాక్ష‌సం) పూర్వ చరిత్ర‌లో విష‌క‌న్య‌ల‌ను గురించి చ‌దువుకున్నాము. బాపిరాజుగారు, విష‌క‌న్యా ప్ర‌యోగాన్ని క‌థ‌లో మ‌లుపులు తిప్ప‌డానికి చ‌క్క‌గా ఉప‌యోగించుకున్నారు. ఇది ఔష‌దీ ప్ర‌యోగ‌మే కాని తాంత్రికం కాదు. వేదవేత్త‌, స‌ర్వ‌శాస్త్ర పారంగ‌తుడు క్షుద్ర ప్ర‌యోగాలు చేయ‌న‌క్క‌ర‌లేదు. కృత్య‌లున్న‌వి.

త‌ల‌కు దెబ్బ త‌గుల‌గా అమృత‌పాదులు లంబికా యోగంలో ప‌డిపోయినార‌ట‌. త‌ల‌కు దెబ్బ త‌గిలి స్మృతిపోయిన‌పుడు లంబికాయోగంలో ప‌డ‌టానికి వీలు లేదు. దానికి ఆస‌న‌శుద్ధి, మొద‌లైన నియ‌మాలున్నాయి. లంబికాయోగ‌మంటే తెలిసిన వ్రాత‌కాదు బాపిరాజు గారిది.

న‌వ‌ల‌లో చ‌తుర్థభాగ‌మున ప‌దియ‌వ ప్ర‌క‌ర‌ణ‌ము జ్ఞాన యుద్ధ‌ము. ఇది స్థౌల‌తిష్య అమృత‌పాదుల వివాద‌ము. ఈ వాదోప‌వాద‌ము చాలా తేలిక‌గానున్న‌ది. అమృత పాదుల‌చే బాపిరాజుగారొక ప్ర‌శ్న‌వేయించిరి. మాయాజాత మ‌గున‌ది ఆభాస‌, మాయాజాత‌మ‌గున‌ది అజ్ఞాన‌ము, మాయాజాతుడే జీవుడును. ఆ జీవుడును అజ్ఞాన‌మును ఒక‌టి అయిన‌ప్పుడు అజ్ఞానమేమిటి స్వామీ ? ఈ ప్ర‌శ్న బౌద్ధునిది దానికి స్థౌల‌తిష్యునిచేత బాపిరాజు గారు స‌మాధాన‌ము చెప్పించ‌లేదు. అందుచేత పాఠ‌కులు వైదిక‌మ‌త‌ము యుక్తి యుక్త‌ము కాద‌న్న భావ‌న క‌లిగించుకొన‌వ‌చ్చును. ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌ము చెప్పింప‌క‌పోవుట స‌మాధాన‌ము లేక కాదు. బాపిరాజుగారికి ఉప‌నిష‌ణ్మ‌త‌ములో దీనికున్న స‌మాధాన‌ముతో ప‌రిచ‌య‌ము లేక‌పోవుట వ‌ల‌న కావ‌చ్చును.

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మును చెప్పుట‌కు ముందు కొంత వివ‌ర‌ణ‌ము కావ‌ల‌సియున్న‌ది. వైదిక‌మ‌త‌మున‌కు స్థౌల‌తిష్యుని , బౌద్ధ మ‌త‌మున‌కు అమృత‌పాదుని, సంకేత‌ములుగా గ్ర‌హించుట యందొక చ‌మ‌త్కార‌మున్న‌ది. వారు తండ్రికొడుకులు. ఈ రెండు మ‌త‌ముల‌కు సంబంధ‌మ‌ట్టిదే. త‌న పూర్వ స్మృతి, సంస్కృతి నేప‌థ్య‌ము లేనివాడు అమృత‌పాదుడు. ఇదియు బౌద్ధ‌మ‌త విష‌య‌మున స‌మంజ‌స‌మే. ఈ రూప‌కాలంకార సాంకేతిక మింత‌వ‌ర‌కే.

బాపిరాజు గారు జ్ఞాన యుద్ధ‌మ ని పేరిడినారు. జ్ఞాన యుద్ధ‌మ‌న‌గానేమి ? త‌త్పురుష‌యా ? క‌ర్మ‌ధార‌య‌మా ? ద్విగువా ? బ‌హువ్రీహియా ? ద్వంద్వమా, అవ్య‌యీ భావ‌మా ? అలుక్స‌మాస‌మా ? వృత్త్య‌ర్థ‌మును తెలుపున‌ట్టి విగ్ర‌హా వాక్య‌మును గ్ర‌హించి, దానిని బ‌ట్టి స‌మాన‌మేదియో నిర్ణ‌యింప‌వ‌లెను.

విభ‌క్తి ప్ర‌త్య‌య‌ము లోపించ‌క స్పురింప‌వ‌ల‌సియున్న ఆలుక్స‌మాస‌ము కాజాల‌దు. అవ్య‌య‌ము మొద‌టి ప‌ద‌ముగా నుండ‌వ‌ల‌సిన అవ్య‌యీభావ స‌మాస‌ము కాదు. ద్విప‌ద‌, బ‌హుప‌ర‌ద‌, ద్విప‌ద‌, స‌మాహార బ‌హుప‌ద‌స‌మాహార భేద‌ముల‌తోనైనా ద్వంద్వ‌స‌మాస‌ము కూడ కాజాల‌దు.

సామాన్య‌, స‌మాహార‌, సంఖ్యోభ‌య‌, త‌ద్ధితార్థ భేద‌ముల‌తో నున్న ద్విగుస‌మాస‌ము కూడ కాజాల‌దు.

బ‌హువీహ్రిస‌మాస మ‌నుకొంద‌మా ? ద్వితీయాది స‌ప్త‌మీ విభ‌క్తి ప‌ర్యంత‌మైన ద్విప‌ద బ‌హువ్రీహికాదు. క్రియా విశేష బ‌హు వీహికాదు. బ‌హుప‌ద బ‌హువ్రీహిగాని, సంఖ్యోభ‌య‌ప‌ద బ‌హువ్రీహిగాని, సంఖ్యోత్త‌ర ప‌ద బ‌హువ్రీహిగాని, స‌హ‌పూర్వ‌ప‌ద బ‌హువ్రీహిగాని, వ్య‌తిహార‌ల‌క్ష‌ణ బ‌హువ్రీహిగాని, దిగంత‌రాళ ల‌క్ష‌ణ బ‌హువ్రీహిగాని, న‌జ్ఞ బ‌హువ్రీహిగాని, ఉప‌మాన పూర్వ‌ప‌ద బ‌హువ్రీహిగాని కాజాల‌దు.

త‌త్పురుష‌స‌మాన‌మ‌నుకొంద‌మా ? జ్ఞాన‌ము యుద్ధ‌మున‌కు అను విగ్ర‌హ‌ము కుదుర‌దు కావున ప్ర‌థ‌మా త‌త్పురుష‌ము కాదు. జ్ఞాన‌మును దాటిన యుద్ధ‌మ‌నుట‌కు వీలులేదు కాబ‌ట్టి ద్వితీయా త‌త్పురుష‌ము కాజాల‌దు.

దీనియందు విశేష‌ణ‌మే లేదు కాబ‌ట్టి, విశేష‌ణ పూర్వ‌ప‌ద‌, లేక విశేష‌ణోత్త‌ర‌ప‌ద‌, లేక విశేష‌ణోభ‌య‌ప‌ద‌, క‌ర్మ‌ధార‌య స‌మాస‌ము కాదు. ఉప‌మాన‌ము లేదు కాబ‌ట్టి ఉప‌మాన పూర్వ‌ప‌ద‌, లేక ఉప‌మానోత్త‌ర ప‌ద క‌ర్మ‌ధార‌య‌మునుకాదు. సంభావ‌నా పూర్వ‌ప‌ద‌ముగాని, అవ‌ధార‌ణా పూర్వ‌ప‌ద‌ము గాని క‌ర్మ‌ధార‌య భేద‌ములందు కాదు.

తృతీయా త‌త్పురుష‌ము చెప్పుకొందమ‌న్న‌చో జ్ఞాన‌ముచేత యుద్ధ‌మ‌న‌గానేమి ? జ్ఞాన‌ముచేత యుద్ధ‌ముండ‌దు. జ్ఞాన‌మ‌న‌గానేమియో తెలిసిన‌వార‌ట్ల‌న‌రాదు. మ‌త‌సంబంధ‌మైన వాద యుద్ధ‌మ‌ని బాపిరాజుగారి భావ‌ము అట్టివారిని వాగ్యుద్ధ‌మ‌నిగాని, వాద‌యుద్ధ‌మ‌ని గాని చెప్ప‌వ‌లెను.

మాయాజాత మ‌గున‌ది ఆఖాస మాయాజాత‌మ‌గున‌ది అజ్ఞాన‌ము, మాయాజాతుడే జీవుడు. ఆ జీవుడు న‌జ్ఞాన‌మొక‌టియైన‌ప్పుడు ఆజ్ఞాన‌మేమిటి ?

ఈ ప్ర‌శ్న కూడ స‌మీచీన‌ముకాదు. ఆ ధ్యాస అనుట‌కు బ‌దులు బాపిరాజుగారు ఆభాస అనిన‌ట్లున్న‌ది. జీవుడు మాయాజాతుడు కాదు.

మాయ‌కు ఆవ‌ర‌ణ విక్షేప‌శ‌క్తుల‌ని రెండు శ‌క్తులున్న‌వి. ఆవ‌ర‌ణ‌శ‌క్తి జీవున‌కు ఆత్మ‌జ్ఞాన‌ము లేకుండ చేయును. జీవుడ‌న‌గా అవిద్యావిచ్ఛిన్న చైత‌న్య‌ము. మాయ యొక్క విక్షేప‌శ‌క్తి భేద ప్ర‌పంచ బుద్ధి క‌లిగించును. జ్ఞాన‌ము ల‌భించిన‌పుడు ఆవ‌ర‌ణ‌శ‌క్తి న‌శించి ఆత్మ జ్ఞాన‌ము ప్ర‌కాశించును. అప్పుడు స‌చ్చిదానంద రూప‌మైన ఆత్మ యొక్క అనుభ‌వ‌మ‌గును. ఆత్మ జ్ఞాన‌ము చేత క‌ర్మ‌యందు సంకుచిత‌మైన న‌శించుట‌యు, ఆగామి క‌ర్మ సంభ‌వింప‌క‌పోవుట‌యు జ‌రుగును. ప్రార‌బ్థ‌క‌ర్మ భోక్త‌మై న‌శించువ‌ర‌కు విక్షేప‌శ‌క్తి యుండును.

మాయ‌య‌న‌గా లేనిది వ్య‌వ‌హార‌ము క‌ల్పించుట‌యు మాయ యొక్క కార్య‌ము, ఈ ప్ర‌శ్న‌లోని మాయా జాత‌మ‌గున‌ది ఆభాస స‌రికాదు. మాయాజాల‌త‌మ‌గున‌ది అజ్ఞాన‌ము మాయ‌యొక్క ఆవ‌ర‌ణ శ‌క్తివ‌ల‌న జీవుల‌కు ఆత్మ‌జ్ఞాన‌ములేకుండ‌పోవుట ఆజ్ఞాన‌ము. ప్ర‌శ్న‌లో మ‌రియొక భాగ‌ము మాయాజాతుడే జీవుడు ఇది స‌రికానేకాదు.

ఇట్లు వైదిక‌మ‌త అవ‌గాహ‌న స‌రిగాలేదు బాపిరాజు గారీ జ్ఞాన‌యుద్ధ‌మున బౌద్ధ ద‌ర్శ‌న‌మునుకొంత త‌డ‌వినారు ఆర్య‌స‌త్ర‌ముల‌ను నాలుగు స‌త్య‌ముల‌ను (గొప్ప స‌త్య‌ముల‌ని) విద్వాంసులచే గ్ర‌హ‌ణ‌యోగ‌లైన‌వి చెప్పినారు. అవి దుఃఖం దుఃఖ స‌ముద‌య‌, దుఃఖ‌నిరోధ‌, నిరోధ‌మార్గ‌ముల‌న్న‌వ‌నున‌వి. జ్ఞాన‌శీల‌ముల అంగ‌ముల‌యిదు, స‌మ్య‌క్ర‌ప్ప‌య‌త్న స్మృతి, స‌మాధులు (ఇవి మూడు ) క‌ల‌సి ఆర్య అష్టాంగిక మార్గ‌ము. అస‌లు క‌థాగ‌మ‌న‌మున‌కు బౌద్ధ‌మ‌త విశ్లేష‌ణ‌తోగాని, వైదిక మ‌త విశ్లేష‌ణ‌తోగాని పనిలేదు. ఈ మ‌త‌దార్శ‌నిక విష‌య‌ముల లోతుల‌కు పోయిన‌చో క‌థ కుంటుప‌డును. క‌థా శిల్ప‌ము దెబ్బ‌తినును. బాపిరాజుగారు క‌థాక‌థ‌న శిల్ప‌దృష్టితోనే ఆన‌వ‌ల‌యును యీ దార్శ‌నిక వివ‌ర‌ణ వివాద‌ముల‌జోలికి పోలేదు. అందుచేత న‌వ‌లా గ‌మ‌న పురోగ‌తికి అవ‌రోధ‌ము క‌లుగ‌లేదు. అయితే కొన్ని న‌మ్మ‌క‌ముల దృష్ట్యా ఆయ‌న వీటిపైచూపు చూచెన‌న‌వ‌చ్చు.

ఆంధ్ర న‌వ‌లా సాహిత్య‌మును శ‌శిక‌ళామ‌య‌ము చేసి జ్యోత్స్నా ర‌మ‌ణీయ‌ముగా తీర్చిదిద్దిన బాపిరాజు గారిని యీ 90 జ‌యంతినాడు స్మ‌రించి ఆయ‌న‌ల సాహిత్య స‌ర‌స్వ‌తికి అంజ‌లించుట సాహ‌త్య భావుకు క‌ర్త‌వ్య‌ము. ఈ క‌ర్త‌వ్య‌మున నిర్వ‌హించుచున్న వుక‌లోక‌మున‌కు అభినంద‌న‌లు.