మానవాతావాది - అడివి బాపిరాజు
- కల్లూరి కాశీవిశ్వేశ్వరశర్మ, ఎం.ఏ.
ఒక మహావ్యక్తి, కవి, చిత్రకారుడు, నవలాకారుడు, కధకుడు అన్నిటికన్నా మించి మానవతావాది అయిన అడివి బాపిరాజుగారు నిజంగా ఆంధ్రుల అదృష్టఫలమే అనిపిస్తుంది. ఈనాటి యువతరానికి అడివి బాపిరాజు గారి గురించి అంతగా తెలియకపోవచ్చు. కాని వారితో సన్నిహితంగా ఉండి వారి వాగమృతాన్ని సేవించిన, వారి స్నేహహస్తం తమ భుజం మీద పడగానే అవ్యక్తానుభూతి ననుభవించిన వారి మిత్రులు, ఆప్తులు అందరు వారి గురించి చెప్పినమాట ఒక్కటే వారు మధుర మూర్తులు, వారి ఆప్యాయత అనురాగాలు తమను వారికి దాసుణ్ణిచేసాయి అన్నవారే. గుండెల నిండిన దేశభక్తి భావలతోను వాత్సల్యపూర్ణ హృదయంతోను బాపిరాజుగారు పలికిన పలుకులు గుర్తుకు వస్తే నేటికీ మా హృదయాలు ఆర్ద్రమవుతాయి అన్నవారే అందరు. ఇలా తన ఉదాత్త వ్యక్తిత్వంతో, మధురవచో విన్యాసంతో అందర్ని ఆకర్షించిన అడవి బాపిరాజుగారి సంపూర్ణ స్వభావము వారి రచనల్లో, చిత్రాల్లో ప్రత్యణువును మనకు దర్శనమిస్తోంది. వారిలో సాన్నిహిత్యానికే కాదు, వారి రచనల్లో దర్శించగలము. ప్రతి అక్షరం బాపిరాజై మన కన్నుల ముందు సాక్షాత్కరిస్తుంది హిమశృంగ సన్నిభులైన విశ్వనాధ కవీంద్రులు అతడు గీసినగీత బొమ్మై అతడు పలికిన పలుకు పాటై, అతని హృదయంలోని మెత్తని అర్ధవతృతియైందని బాపిరాజు గారి గురించి చెపుతూ చెప్పిన ప్రతిమాట సత్యమే. జీవితం పట్ల బాపిరాజు గారి దృక్పథం గురించి చెపుతూ బుచ్చిబాబు రాజకీయాలు, సంసారం, ఉద్యోగం, పలుకుబడి, దైనందిన వ్యవహారిక విలువలు వీటి అన్నింటితో నిమిత్తం ఉండాలి. కాని వీటికి లొంగిపోకుండా, దూరంగా ఉండి మరో ప్రపంచాన్ని సృష్టించుకొని వ్యక్తిగతంగా పరిపూర్ణమై, తక్షణమైన ఆనందాన్ని అనుభవించడం.ఇదీ వీరి దృక్పధం అంటారు సున్నితమైన అనుభవం, సౌందర్యం, అన్వేషణలో ముడివడని స్వేచ్ఛ, స్వచ్ఛమైన ఆనందం. యివి వీరు కల్పించుకొనే మరోప్రపంచానికి పునాదులు. అలాగే వీరు ప్రచారంలోకి తెచ్చిన జీవిత దృక్పధంలో కళకోసం సౌకర్యాన్ని త్యాగం చేయాలి అనే సూత్రం ప్రధానమైందిగా భావించవచ్చు అంటారు బుచ్చిబాబు.
బాపిరాజుగారి మానవతావాదానికి అమ్ములు లేవు. ఎల్లలెరుగని విశ్వప్రేమైకమూర్తి బాపిరాజుగారు. ఎంత ఉదాత్త భావాలతో మహోన్నత చిత్రాలు, శబ్ద చిత్రాలు చిత్రించారో, అంతే సామాజిక స్పృహతో పరులను పల్లెత్తుమాట అనకుండా సమాజాన్ని సంస్కరించాలనే ప్రయత్నం వారి నిర్మాణాత్మక దృక్పధానికి, సర్వే పామ విరోధేన అన్న ఉదాత్తవాక్యానికి నిదర్శనం. ఈ సమాజంలో ఉన్న అస్పృశ్యతా భావానికి ఒక ప్రక్క దాన్ని సమూలంగా నిర్మూలించాలనే సంకల్ప బలంతో ఉపన్యాసాలు, వాదోపవాదాలు, చర్చలు లాంటివి ఏవిలేకుండా అతిసహజంగా ఈ సమస్యను పరిష్కరించిన పాత్రలను తమ రచనలలో మనముందుంచారు అడివి బాపిరాజుగారు నరసన్న పాపాయి అన్న కథలో.
రామేశ్వరం గుడియెదుట శివరాత్రి ఉత్సవం నాడు మాలవాడు గుడిలోకి రాబోతే మా అన్నయ్య అతణ్ణి చావగొట్టాడు అని ఒక చిన్నారి లేతహృదయం ఎంత పరితపించి పోయిందో చెప్పలేం. తననే కొట్టినంతగా ఆ బాల విలవిల్లాడిపోయింది. ఇద్దరికిఉన్న అనుబంధం ఒక్కటే అదే ఇద్దరు బాల్యావస్థలో ఉండటం. ఆ చిన్నారి హృదయంపై చెరగని ముద్రవేసిన ఆ సంఘటనను ఆమె అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మరచిపోలేదు గుడిలో అర్చకుని వేదమంత్రాలు ఆమె చెవికి నరసన్న ఏడుపులా ఉన్నాయి. ఆలయంలో మ్రోగుతున్న ఘంటానాదాలు వాడు వెక్కి వెక్కి రోదించినట్లే ఉన్నాయి. బాపిరాజుగారి ఎల్లలెరుగని మానవతావాదానికి, ఈ దేశ జనాభాలో ఒక వర్గం చేసిన దుర్మార్గానికి ఆ వర్గానికే చెందిన బాల తల్లడిల్లిపోయిందని చెప్పటంలో తానే ఆ బాలగా మనముందు పరితపించి పోతున్నాడా అనిపిస్తుంది. హరిజనోద్ధరణకై ఉద్యమించిన మహాత్మాగాంధీ, మాలపల్లెలో ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులుగార్లు చేసిన విశ్వ ప్రయత్నాలు ఈ అతి చిన్న కథలో బాపిరాజుగారు చేసారు. పాపం ఆ అమ్మాయి పెద్దయ్యాక భర్త కౌగిలిలో ఇమిడిపోతూ కూడా నరసన్నకి జరిగిన అన్యాయాన్నే స్మరిస్తూ కనీసం నరసన్న పాపాయేనా రుద్రేశ్వరం గుడిలోకి వెళ్తాడాండీ ? అని భర్తను అడుగుతుంది. రుద్రేశ్వరమేకాదు. కాశీవిశ్వేశ్వరమే అని భర్త చెప్పినమాట ఆమెకు ఎంతో ఊరట కల్గించింది. ఆమె ఆనందానికి హద్దులు లేవు ఒక్కక్షణం. అయినా స్త్రీ సహజమైన భయం పోలేదు. ఆ పాపాయిని మా అన్నయ్యలాంటి వాళ్ళెవరు కొట్టరు కదాండీ అని గుండె దడదడలాడి పోతుండగా అడుగుతుంది. కథ ఎంత చక్కగా, సహజంగా నడుస్తుందో బాపిరాజుగారి రచనా సామర్థ్యాన్ని, వర్ణనా నైపుణ్యాన్ని, కధా కధన కౌశలాన్ని మనం యిక్కడ దర్శించలేం. బాపిరాజుగారి అమృతహృదయాన్ని అత్యంత సున్నితమైన హృదయానురాగాన్ని మనం యిక్కడ దర్శించగలం. వజ్రాదపి కఠోరాణి మృదూనికుసుమాదపి. మహాత్మానాం చేతాం సి కో ను విజ్ఞాతు మభూతి అన్న భవవ్హాతి మాటలిక్కడ స్ఫురణకి వస్తాయి మనకు. సొంత అన్నగారు కోపంతో రావటం మానేస్తే నరసన్నే నాకు అన్న అన్నది. ఆ స్త్రీ మూర్తి అవును రవణా ! రుద్రేశం తల్లి కడుపున పుట్టిన అతడే నీకు అన్న అని భర్త చెప్పినపుడు అతని ముందు మన శిరస్సులు గౌరవభావంతో అవనతమవుతాయి. ఆదర్శ దాంపత్యానికి ఇంతకన్న గొప్ప ఉదాహరణ మరో కవియో, రచయితయో ఎవరివ్వగలరు ఒక్క బాపిరాజుగారు తప్పజ ఆ తల్లి ఒడిలో పడుకుని ఆ అమ్మ వాత్సల్యధారలతో పునీతంకాబడ్డ భరతం (నరసన్న కుమార్తె ) గంగాది పుణ్యనదీ ప్రవాహాలతో పునీతం కాబడిన భారతికి ప్రతిరూపమే. నరసన్న పాపాయి తనలో రేకెత్తించిన మాతృభావనానుభూతి శాశ్వతమైంది. ఆమె కడుపు పండింది. స్వరాజ్యలక్ష్మి ఉదయించింది.
అత్యంత జటిలమయిన హరిజన సమస్యను అతి సున్నితంగా పరిష్కరించిన బాపిరాజుగారి సున్నిత హృదయం ఈ కథలోని ప్రతి అక్షరంలోను మనకి గోచరమవుతుంది. బుచ్చిబాబుగారు బాపిరాజుగారి గురించి చెపుతూ ఆయన చిత్రాలు రచనలు వీటికంటే గొప్పవాడు బాపిరాజుగారు. వారు హృదయం గల మానవతావాది. జీవితం అనుక్షణం పొందే పరిణామాలను చూసి ముగ్ధుడై ఆశ్చర్యంతో వణికిపోయి, ఆప్యాయతతో ఎవరి భుజాన్నో తట్టడానికి తిరుగాడే యాత్రికుడాయన. ఎప్పుడూ ఆనందంతో వూహలో స్వేచ్ఛగా విహరించడం, ప్రయోజనంతో ప్రమేయం లేని సౌందర్యాన్ని అన్వేషించడం, అనుభవాన్ని పంచిపెట్టడం, కష్టసమయంలో ప్రేమతో భుజం చరచడం ఇదీ బాపిరాజుగారు జీవితంపట్ల అలవరచుకొన్న దృక్పధం అంటూ బుచ్చిబాబు ఈ దృక్పథం సమాజానికి అవసరం. దీన్ని వ్యక్తపరచి, ప్రచారం చేసిన బాపిరాజుగారి లాంటి వ్యక్తులకు మనం కృతజ్ఞులం. కాలవాహినిలో ఈ కృతజ్ఞత మరుగుపడవచ్చు. కానీ ఆయన వేసిన చల్లటి నీడ మాత్రం ఉండిపోతుంది అంటారు. నిజంగా బాపిరాజుగారు వర్షించిన ప్రేమామృత ధారలకు ఈ పుడమితల్ఇ పులకరించిపోయింది. మనకు అనురాగఫలాలను అందించింది.
|