మహా తపస్వి - మా నాన్న
- శ్రీమతి తాడికొండ రాధావసంత
ఏ పూర్వ పుణ్య పుంజమో
మా పాలి వరమయ్యె
సత్య దీక్షలో గడిపితి మెన్ని జన్మలు
ఈనాడు ఈ మహాభాగుని సుతులమై జన్మించితిమి !
నా గురువు, దైవం అయిన, శ్రీ కులపతి అడవి బాపిరాజు. ఏ మహత్తర భాగ్యమో, ఏనాటి తపసుకు ఫలమో ఈనాడు నాకు తండ్రిగా లభించాడు. బహుముఖ ప్రతిభాసంపన్నుడు. లలిత కళాచైతన్య మూర్తి, రసపిపాసి సౌందర్యాన్వేషి, జ్యోతిశ్శాస్త్ర వేత్త, గొప్పవక్త, మహారచయిత నీటన్నింటినీ మించి హిమాలయోత్తుగశృంగం వంటి వ్యక్తిత్వం కల మా నాన్న, వెన్నెల్లో వెల్లి విరిసిన విరజాజి పువ్వుల్లా చిరునవ్వులు చిందించగల పాపాయి లాంటి మంచి గంధపు పరీమళం లాంటి, వెన్నలాంటి మనస్సుగలవాడు. దయా స్నేహమూ సముపాళ్ళు కలిగిన మహా తపస్వి మా నాన్న. బాధనూ బరువునూ, సంతోషాన్నీ సుఖాన్నీ సమంగా స్వీకరించ గలిగే ఆత్మ సంయమనం కలిగిన నాన్న ఒక్కోసారి నాకు మహామేరువులా కనిపిస్తారు. మహా మానవుడనిపిస్తారు.
నేనలా ఊరికే అన్నానా ? ఎంత మాత్రమూ కాదు, జీవిత యాత్రలో విసిగి వేసారుతున్నా, బాధలు విరుచుకొని పడినా, భార్యా బిడ్డల గురించి బెంగ లెదురయినా, ఊహించిని ఆనందాలు తరలి వచ్చినా, అనుకోని అవకాశాలు అందుకో గలిగినా ఒక్కలాగే ఉన్నారు. అవన్నీ నాకు బాగా తెలుసు. చిన్ననాటి సంగతులు వీలున్నప్పుడల్లా అడిగి తెలుసుకునేదాన్ని. తాత్కాలికంగా విచారమో ఆనందమో కలిగినప్పుడు దగ్గర ఎవరు ఉంటే వారికి చెప్పుకునేవారు. ఆయన సన్నిహితులూ హితులూ ఆయనకు ప్రాణం పంచి యిచ్చేవారు. ధైర్యం చెప్పేవారు. ఎంతటి వ్యధ అయినా ఒక్క క్షణం మాత్రమే. తరువాత ఎప్పటి ఉత్సాహమే. మా అమ్మకు మా చిన్నప్పుడే నెర్వస్‌బ్రేక్ డౌన్ వల్ల కదలలేని స్థితి వచ్చింది. ప్రాణం పోతుందని భయం. నాన్న ఎప్పుడూ దగ్గర ఉండాలనేది. నాన్న స్నేహితులు డాక్టరు చెన్నాప్రగడ సుబ్బారావుగారి వైద్యం వల్ల ఇంచు మించు పూర్తి ఆరోగ్యం వచ్చింది. అయినా అడుగడుగునా, ప్రోత్సాహాన్నిస్తూ ధైర్యాన్నందిస్తూ, సలహాలు చెపుతూ ఉండగలిగే సహధర్మచారిణి కాలేకపోయింది. అందుకు ఆయన బాధపడలేదు. ఆమెను తక్కువగానూ చూడలేదు. తాను కృంగిపోనూలేదు. పెదవులపై చిరునవ్వు చెదర నివ్వలేదు. మా నాన్నకు నేనూ బాధకలిగించాను. అడుగులు వెయ్యడం నేర్చుకొంటున్నప్పుడే నడక ఆగిపోయింది. పోలియో వచ్చింది. కుప్పగా కూలిపోయారు. దుఃఖం కట్టలు తెంచుకుంది. ముగ్గురు మొగబిడ్డలు పుట్టిపోయిన వెనుక చాలా కాలానికి పుట్టిన నాకు నడక లేదంటే, రాదంటే భరించలేకపోయారు.
అలా తల్లడిల్లిన ఆయన మరుక్షణంలో ఎప్పటిశక్తితో లేచారు. ధైర్యం తెచ్చుకున్నారు. అంతేకాదు నాకు ఎదురయిన లోపాన్ని, అవధ్యతను వరంలా స్వీకరించకలిగే ఆత్మ శక్తిని ప్రసాదించారు. అందుకే నా జీవితం సంపూర్ణమై ఆనందంగా గడిచింది, గడుస్తోంది, గడుస్తుంది. ఆయన్ని మా చెల్లాయి చిరునవ్వులు సేదతీరుస్తూండేవి. ఇద్దరు బిడ్డలం, ఆయనకు తన కీర్తి ప్రతిష్టలకన్న,తన సర్వస్వం కన్నబిడ్డలంటే ప్రాణం. మాకు వాత్సల్యాన్ని పంచియిచ్చి అపురూపంగా పెంచుకొన్నారు. తన ఆస్తితోపాటు శశికళను కూడా పంచి యివ్వాలనుకున్నారు. అలాగని మాతోనూ ఇతరులతోనూ అనేవారు శశిని నీకూ, చెల్లాయికి కళనూ పంచియిస్తాను అన్నారు ఒకసారి. శశిఏమిటి ? కళ ఏమిటి ? అన్నాను. అమృంతాశుడూ, ఓషధీశుడూ అయిన చంద్రుడు కవిత్వానికి అధిపతి వెన్నెల కవిత్వానికి చిహ్నం. సూర్యుడు వర్ణపతి, చిత్రలేఖనానికి అధిపతి. సకల వర్ణ సమన్వితమైన సూర్యుని కాంతి చిత్రలేఖనానికి చిహ్నం. కాబట్టి ఓసి కన్నతల్లి ! నీకు కవిత్వాన్నీ, చెల్లాయికి చిత్రలేఖనాన్నీ యిస్తున్నానన్న మాట అన్నారు నాన్న, కవిత్వమూ, చిత్రలేఖనమూ ప్రధానంగా కలిగిన మా నాన్న లలితకళా తపస్సుకు శశికళాదేవి ఆలంబన.
ఆలౌకికమూ ఆపూర్వమూ పవిత్రమూ అయిన శశికళారాధనకు ఏవో అర్ధాలు వెతికారు కొందరు. శశికళను దివినుండిభువికి తీసుకొని రాలేదు. భువినుండి దివికి పంపారు. అన్నారు మరికొందరు. అది నిజం కాదు. అలాగని వారికి అత్యంత సన్నిహితులయిన ప్రియమిత్రులకు కూడా తెలుసు. శ్రీ విశ్వనాధ మామయ్యగారు, శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు మామయ్యగారు, శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు, శ్రీ కృష్ణశాస్త్రిబాబయ్యగారు, తల్లావర్ఘులు శివశంకరశాస్త్రి పెద్దనాన్నగారు, శ్రీ నండూరి సుబ్బారావుగారు, శ్రీ రాయప్రోలు సుబ్బారావు పెద్దనాన్నగారు, తోట పెద్ద నాన్నాగారు, శ్రీ ముష్టి లక్ష్మినారాయణగార, శ్రీ డాక్టరు చెన్నాప్రగడ సుబ్బారావుగారు, డాక్టరు అమంచెర్ల శేషాచలపతిరావు గారు, డాక్టరు గోవింద రాజుల సుబ్బారావుగారు, వీరంతా ఆయన కలల్లో భాగం పంచుకుని కలిసి మెలసి తిరిగిన ప్రాణ స్నేహితులు. శ్రీ విస్సా అప్పారావుగారూ శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావుగారూ నాన్న స్నేహితులే ! వీరందరికీ బాపిరాజు శశికళ తెలుసు.
శ్రీ నండూరి వారినీ శ్రీ విస్సా అప్పారావుగారినీ నేను చూడలేదు. మిగతా అందరూ నాకు బాగా తెలుసు. నాన్నను కోల్పోయినప్పుడు నాతోపాటు నాదుఃఖాన్ని (స్వయంగా వచ్చీ ఉత్తరాల ద్వారానూ) పంచుకున్నారు, బాపిరాజు లేనిదే ఎలా బ్రతకాలి అన్నారు. వాడిని విడిచి ఎలా బ్రతుకుతున్నానో ! అంటూ నన్ను కలుసుకున్నప్పుడల్లా కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు. కృష్ణశాస్త్రి బాబయ్యగారు, నాన్న పాటల పుస్తకంలో రాశారు.
అన్నా ! ఎట్టి రెక్కలు తొడిగికొన్నట్టి మాటయేని
కలయంచు లందుకోలేని లేదు.
ఏదో పాటయని పదమని వ్రాసిగీసి
ఎంత చల్లార్చుకొందు వోయి పిపాస
నాన్న భావావేశాన్ని గమనించి వివశుణ్ణయి రాశానని నాతో ఒకసారి అన్నారు. ఇంకా చాలా మంది నాన్న పాటల పుస్తకంలో రాశారు. శశికళా ప్రియంభావుకా అని పిలిచేవారు.
ఇలా ఎక్కడికో వెళ్ళిపోతున్నానేమిటి ! ప్రస్తుతం లోనికి వస్తారు. మా నాన్నగారి ఆత్మ పీఠస్థ ఆరాధ్య దేవి అయిన శశికళ వారి మహత్తర కృషి ఫలితమైన కవిత్వానికీ చిత్రలేఖనానికీ ప్రతీక. వారి లలితకళారాధనే శశికళాదేవి అవతరణ. వారి ఆత్మ శక్తి శశికళాదేవి. ఆయన తపస్సు, దీక్ష, అసిధారావ్రతం లాంటి జీవితం, అంతటినీ శశికళ అలముకొన్నది. అనన్య విన్యసిత రసస్వరూపిణి అయిన శశికళ బాపిరాజు బ్రతుకులో మహాశిల్పమై ప్రత్యక్షమయింది. ఆ రసావిష్కరణలో ఎంత మాత్రమూ నీలినీడలు లేవు. అతి పవిత్ర మహోజ్వలకాంతి ప్రసారితం మాత్రమే అవగతమౌతుంది.
ఇంతకీ కొద్దోగొప్పో కథలు, పాటలు వ్రాసినా చెల్లాయి కొన్ని బొమ్మలు వేసినా మేమిరువురమూ మా నాన్నగారి ఆశయం నెరవేరుస్తూ, శశికళా దేవి పూజా ప్రసూనాలం కాలేకపోయాము. మా వివాహాలు ఘనంగా చేశారు. ముఖ్యంగా నాకూ చెయ్యకలిగారు.
నెహ్రూ అభినందన గ్రంధ లో వ్యాసం రాసే అవకాశం నాన్నకే వచ్చింది. మదరాసు ప్రభుత్వం నాన్ననకు సిలోను వెళ్ళి సిగీరియా చిత్రాల ప్రతిరూపాలు తీసుకురమ్మని కోరింది. శ్రీ రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీ పిలకా నరహింసమూర్తి, శ్రీ యం. శ్రీనివాసులు నాన్నతో సిలోను వెళ్ళి వచ్చారు.
నాన్నకు తటస్థించిన ఆనాటి ఆవేదనలూ ఈనాటి అవకాశాలూ ఒక్కలాగే తీసుకున్నారు, అలాంటి నాన్నను మహాతపస్వి అనీ, మహా మానవుడ నీ అనకుండా ఎలా ఉండగలను ? ఎలా ఉంటాను ?
ఏమైనారు మా నాన్నగారు !
ఏమైపోయింది ఎక్కడుండిరి,
ఏమైనారు ? ఏమైనారు ?
నీలి ఆకాశాలు, గాలించి చూచాను
తేలివచ్చానన్ని, లోకాలలోనూ
ఏమైనారు ? ఏమైనారు ?
నీరాల లోతులో, పారాడి వచ్చాను
విరిచి వెన్నెలలన్ని, తరచి చూచాను
ఏమైనారు ? ఏమైనారు ?
కొండలే తిరిగాను, కోనలే గడిచాను
చిన్ని పులుగులు చూచి, కన్నీరు నింపాను
ఏమైనారు ? ఏమైనారు ?
పూవులే వెతికాను, తేనెలే వొంపాను
పూల బ్రతుకులలోనే, వాలి పోయాను
ఏమైనారు ? ఏమైనారు ?
కరమెత్తి పిలచాను, శిరమెత్తి చూచాను
పరమేశునే చేరి, నిలదీసి అడిగాను
ఏమైనారు ? ఏమైనారు ?
నాన్న కోసమే నేను, నా ప్రాణమే నాన్న
నా మనసులో నాన్న, నాన్న మనసే నేను
ఏమైనారు ? ఏమైనారు ?
చిరునవ్వుతూ నాన్న, చిన్ని పాపయ్యారు
కన్ను తెరిచేలోనె, కన్నుమూశారు
ఏమైనారు ? ఏమైనారు ?
కైలాస శిఖరాన, కనుపించి మా నాన్న
మృత్యుంజయుడ నేను, సత్యమే నన్నారు
ఏమైనారు ? ఏమైనారు ?
ఏమయ్యారు ఎక్కడికి వెళ్ళిపోయారు ? యీ బాధ ఎలా భరించాలి ? ఆయన కలలు కన్నారు. ఆ కలలు వివిధ రూపాలుగా మలిచారు. నేను కలలు కంటూ ఆ కలల్లో కూడా నాన్నని చూడలేక కన్నీళ్ళు కారుస్తూ పిచ్చిగా గడిపాను. బాధగా గడిపాను. ఏ రచనా వ్యాసంగమో ఉంటే కొంత ఊరడింపు ఉండేది. రాద్దామని కూర్చేంటే నాన్న చెప్పడం నేను రాయడం ( ఆయన రచనలే) గుర్తువచ్చి అసలు రాయలేక పోయేదాన్ని.
1895 అక్టోబరు 8న కాంతి శకలంలా భూమికి తరలివచ్చిన శ్రీ బాపిరాజు బ్రతుకు బాటలో మేటిగా ప్రయాణం చేస్తూ, భీమవరంలో నర్సాపురంలో, రాజమండ్రిలో విద్యాభ్యాసం కొనసాగించారు. చిన్నతనం హాయిగా గడిచింది. మా తాతయ్యగారు అడవి కృష్ణయ్యగారు మా బామ్మ సుబ్బమ్మగారు ఆయన్ని అతి వాత్సల్యంతో గారంగా పెంచారు. మా తాతయ్య గారు తాలూకా ఆఫీసుల ఉద్యోగం చేస్తూ, అనుబంధంగా వ్యవసాయం చేయించేవారు. చిన్న వ్యాపారం కూడా చేసేవారు. నాన్నగారు ఫోర్తుఫారం చదువుతూండగా చాలా జబ్బుచేసి నెమ్మదించి గండం గడిచింది. రాజమండ్రిలో బి.ఏ. చదువుతూండగా 7-8-1951 న వివాహం జరిగింది.
ఆర్ట్సు కాలేజీలో (రాజమండ్రి) చేరిన దగ్గర నుండి ప్రిన్సిపాల్ శ్రీ ఆస్వాల్డుకూల్డ్రే గారితో అత్యంత సన్నిహిత్యం ఏర్పడింది. శ్రీ కూల్డ్రేగారికి ప్రియతములయిన శిష్యులు ముగ్గురు. శ్రీ అడవి బాపిరాజు, శ్రీ దామెర్ల రామారావు, శ్రీ కవికొండల వెంకటరావు. వీరి ముగ్గురిలోనూ ఆయనకు బాపిరాజు బాగా దగ్గరగా వచ్చాడు. ఇండియన్ వెడ్డింగ్స్ అన్న పుస్తకం వ్రాసి ఈ ముగ్గురికీ అంకితం యిచ్చారు కూల్డ్రేగారు.
ఒకసారి పాపికొండలు చూడటానికి వెళ్ళినప్పుడు, ప్రకృతి అందానికి పరవసించి తిరగి తిరిగి అలసిసొలసి బాగా కిందికి వాలిఉన్న చెట్టుకొమ్మపై వారి నిదుర కొరిగిన బాపిరాజును చూశారు కూల్డ్రేగారు. ఆ కొమ్మ కింద నీరు ప్రవహిస్తూ దృశ్యం మనోహరంగా ఉంది. అంతే ! బాపిరాజు చిత్రం గీసి ఎండిమియాను అని పేరు పెట్టారు. యీ విషయం చెపితే స్నేహితులు నమ్మలేరు. తరువాత ఆ పెయింటింగ్ కూల్డ్రేగారు నాన్నకి పంపారు.
నాన్న బియ్యే చదువుతూండగానే ఆయన ఇంగ్లాండు వెళ్ళిపోయారు. శ్రీ కూల్డ్రే వెళ్లేముందు నాన్నగారికి డిగ్రీ రాగానే ఉద్యోగం వచ్చే ఏర్పాటుచేసి ఆ విషయం ఆయనకు చెప్పాను. నీ కోసం నువ్వు నడిచే దారిలో నా జీవితాన్ని పరుస్తాను. అంతేకాని నా దేశానికి యింత ద్రోహం చేసిన వారికి బానిసనై పడి ఉండలేను. నన్ను క్షమించు అని వినయంగా చెప్పారు నాన్న. ఆ వినయం మాటున పొంగులెత్తిన ఆవేశమూ ఆవేదనా గమనించారు కూల్డ్రేగారు. నాన్నని అర్థం చేసుకుని వెన్ను తట్టి మెచ్చుకుని ఆశీర్వదించారు. ఆయన ఈ దేశానికి దూరమైనా ఉత్తరాలు రాసుకొంటూ దగ్గరయినట్లే భావించి సంతృప్తిపడ్డారు నాన్నా, కూల్డ్రేగారున్నూ, నాన్నపోయాక కూడా నాకూ చెల్లాయికీ ఉత్తరాలు రాశారు కూల్డ్రేగారు. ఆయనకు భారతదేశమన్నా భారతీయులన్నా చాలా యిష్టం.
|