బాపిబావ పూలకుచ్చు దెబ్బ
- కోనంగి
చౌదురాణికి డాక్టరు రెడ్డికి పెళ్ళయ్యింది. వాళ్ళిద్దరిని వదలి తలుపులు వేసేసి యెక్కడి వారక్కడవెళ్ళిపోవాలి. కోనంగి అప్పటికే అక్కణ్నుంచి కదిలి గుమ్మం దగ్గరికి చేరాడు చౌదురాణి చెల్లెలు కమల నయన, రెడ్డి బావగారూ ! ఇదిగోనండి బావకు పన్నీరు ! అంటూ అతనిపై పన్నీరు వాన కురిపించింది. ఇంక తన్నేరు ఎవరు కమలా అని కోనంగి గుమ్మం దగ్గిర నుంచే కేకవేశాడు. ఎవరు ? మా అక్కే అంటూ అక్కణ్నుంచి తుర్రుమంది కమలనయన. ఆ యిద్దర్ని అక్కడ వదలి ఆ సన్నివేశం నుండి అందరూ నిష్క్రమించారు.
బావా బావా పన్నీరు బావను పట్టుక తన్నీరూ
వీధీ వీధీ తిప్పేరూ వీసెడు గంధం పూసేరూ
మూడూగుద్దులు గుద్దేరూ మూలకుమంచంవేసేరూ !
ఏనాడు తెలుగునాట మరదలీ పాట ప్రారంభించిందో ఆనాటినుండి బావా మరదళ్ళు హాస్యం బహిరంగమయ్యింది. అంతరంగంలోని చిలిపి హాస్యభావాలు బహిరంగంలోకి వచ్చి చక్కిలిగింతలు పెట్టే ఈ స్థితినాడున్నది. నేడున్నది. రేపుంటది. నవ్వు నాలుగందాల చేటు అనేది రామాయణంలోని ఓ సన్నివేశాన్ని పట్టుకొని పుట్టిందేగాని అది సర్వత్రా అన్వయించుకకునేది గాదు, అన్వయించుకోవాల్సిన అవసరమూ లేదు.
కోనంగి బాపిబావ :
తెలుగు సాహిత్య నవలాకాశంలో షోడశ కళాప్రపూర్ణ చంద్రుడు అడివి బాపిరాజు. కవిగా నవలా రచయితగా, రేడియో నాటికా రచయితగా, వ్యాసస్రష్టగా, సాహిత్యవేత్తగా, చలనచిత్ర కళా దర్శకుడుగా, అధ్యాపకుడుగా, ప్రిన్సిపాల్‌గా, దేశభక్తుడుగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా, వక్తగా, న్యాయవాదిగా, నాట్యా చార్యుడుగా, గాయకుడుగా, ఉత్తమ పత్రికా సంపాదకుడుగా, లబ్ధ ప్రతిప్ఠితుడైన కులపతి అడివి బాపిరాజు ఎంత హాస్యప్రియుడో ఆయన కోనంగి నవల పట్టిస్తుంది. సమస్యల అగ్ని గుండాల్లో చిక్కుకొని వేడెక్కిన ప్రతిమనిషి పన్నీటి జల్లులాంటి హాస్యాన్ని పైన కుమ్మరించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ నవల నొక్కిచెబుతుంది. సర్వజ్ఞాత్వాన్ని సంతరించుకొన్న కోనంగేశ్వర్రావు కొంటె కోనంగి తనమంతా బాపిబావదే. ఆ కోనంగిలో ఆయనే సాక్షాత్కారిస్తాడు. నవ్వుల పువ్వులు రవ్వుతాడు. నవ్వుతాడు. నవ్విస్తాడు. నవ్వుతూ నవ్విస్తూ పన్నీరు లాంటి మాటలతో తన్నిస్తాడు. తెలుగు నవలల్లో ఇంతగా పన్నీటితో తన్నిన పాత్ర నభూతోనభవిష్యతి.
ఇతివృత్తం :
బి.ఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన కోనంగి బందరు నుండి బయల్దేరి మద్రాసు వచ్చాడు. వరుడు కావాలి ప్రకటన చూసివచ్చాడు. లావుపాటి ఎత్తుపళ్ళు వధువు సీతాదేవికి ఈ కోనంగి నచ్చలేదు. ఉద్యోగం పురుష లక్షణం అనుకుంటూ కోనంగి ఓ సినిమా కంపెనీలో చేరాడు. ఆ ఉద్యోగం పోయాక మరోచోట అమ్మకం మనిషిగా చేరాడు. ఆనంత లక్ష్మికి రాత్రిళ్ళు తెలుగు ట్యూషన్ చెప్పడం మొదలెట్టాడు. సేల్సుగర్ల్ సారాను ఉంచుకున్న ప్రొప్రయిటర్ కోనంగిని అనుమానించి ఉద్యోగంలోంచి తీసేశాడు. గుజరాతీ హోటల్‌లో సర్వర్‌గా చేరాడు.అనంతలక్ష్మికి ట్యూషన్లు చెబుతూనే ఉన్నాడు. ఇద్దరు ప్రణయ లోకాల్లో విహరించడం మొదలెట్టారు. అనంతలక్ష్మి తల్లి జయలక్ష్మి తన కూతురును కోటీశ్వరుడైన చెట్టియార్‌కు ఇవ్వాలనుకుంది. చెట్టియార్ మాటి మాటికి ఆ యింటికి వస్తున్నాడు. అనంతలక్ష్మి అతని రాకను అసహ్యించుకుంటుంది. చెట్టియార్ కోనంగిని కొట్టిస్తాడు. అనంత కోనంగిని డా|| రెడ్డి ఆస్సత్రిలో చేరుస్తుంది. కోనంగికి డాక్టరుకు మంచి స్నేహమేర్పడుతుంది. కోనంగి సర్వర్ ఉద్యోగం పోతుంది. ఓ సినిమాలో కథానాయకునిగా నటిస్తాడు. మంచిపేరు వస్తుంది. ఓ నాటకంలో కూడా వేషమేస్తాడు. కోనంగి గుణాలకు జయలక్ష్మి సంతసిస్తుంది. అనంతలక్ష్మి అదృష్టంగా భావిస్తుంది. కోనంగి అనంతల పెళ్ళవుతుంది.
మొదటిరోజు గడిచింది. తెల్లవారింది. కోనంగిని పోలీసులు అరెస్టు చేశారు. డా|| రెడ్డి కూడా అరెస్ట య్యాడు. వీరి అరెస్టుకు కారకుడు చెట్టియార్. ఆ తర్వాత ఈ చెట్టియార్ అనంతలక్ష్మి మనసు విరచడానికి ప్రయత్నం చేస్తాడు. అటు కోనంగికి, ఇటు అనంత లక్ష్మికి ఉత్తరాలు రాయిస్తాడు. ఒకరిమీద ఒకరికి అసహ్యం పుట్టాలని వదుంతులు సృష్టిస్తాడు. చెట్టియార్ కుతంత్రం ఇరువురికీ అర్థమవుతుంది. కోనంగి అనంతల మధ్య అనురాగ పూర్వకమైన ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తాయి. ఆ విధంగా వాళ్ళిద్దరు మరీ సన్నిహితులవుతారు. కోనంగి జైలు నుండి విడుదలవుతాడు. అనంతతో కలిసి బందరు వెడతారు. అక్కడ బ్రహ్మ సమాజికుడైన మిత్రుడు మధుసూదనరావు అతని భార్య సరోజిని, చెల్లెండ్రు చౌదురాణి కమలనయన కోనంగితో పాటు మద్రాసు వస్తారు.
నవజ్యోతి పత్రిక స్థాపిస్తారు. కోనంగి సంపాదకుడు. అనంత, చౌదురాణి, సరోజిని, డా|| రెడ్డి, మధుసూదనరావు, రియాసత్ అలీ అందరూ పత్రికను తీర్చిదిద్దుతుంటారు. సెంటిమెంట్సు నమ్మని డా|| రెడ్డి బౌదురాణిని ప్రేమిస్తుంటాడు. ఈ విషయం కోనంగి చౌదురాణితో మాటాడారు. అనంత అనుమానించి భర్తపై నీలాపనిందలు వేస్తుంది. కోనంగి ఆ రోజే సత్యాగ్రహం చేసి జైలుకు వెడతాడు. ఎనిమిది నెలలు తర్వాత అతడు విడుదలవుతాడు. అతనికో కొడుకు. అనంత పశ్చాత్తాప పడుతుంది. రాజకీయంగా వైరుధ్యమున్నా మొహరున్నిసా రియాసత్ ఆలీల ప్రేమ ఫలిస్తుంది. పెళ్ళవుతుంది. రెడ్డి చౌదురాణిల వివాహ మవుతుంది. చెట్టియార్ చితికిపోయి పశ్చాత్తాప పడతాడు. నవజ్యోతి పత్రిక బ్రహ్మాండంగా నడుస్తుంది. కోనంగి సంసారంలో సరిగమలు మధురిమలు.
ఈ విధమైన కథా రంగస్థల నేపథ్యంలో భారత జాతీయోద్యమం, గాందీ గారి ప్రభావం, భారతీయ కమ్యూనిస్టుల ఆలోచనా ధోరణులు, సంగీతం, సాహిత్యం, కళలు, అభినయాలు, జతి, ధర్మం, మతం, సంస్కృతి, సామ్రాజ్యవాదం, రాజకీయాలు, సమాజ సేవ, సినిమాలు, నటీనటులు, నాటకాలు, పోషకాలు, వికృతాకారాలు, విభిన్న మనస్తత్వాలు, విద్యాలయాలు, అమ్మాయిలూ అబ్బాయిలు, అధికారాలూ ఆశ్రితజనులు, కోర్టులు దావాలు, అంగారం శృంగారం, పత్రికా రంగం, జైళ్ళు బ్రిటిషు ప్రభుత్వం, రెండు ప్రపంచ యుద్ధాలు, హిట్లరు, ముస్సోలిని, లెనిన్, స్టాలిన్, చర్చిల్, జర్మనీ, రష్యా, జపాను, ఇటలీ, బ్రిటను, అమెరికా, ముస్లింలీగు, కాంగ్రెసు, కమ్యూనిస్టులు, కాంగ్రెసులో సోషలిస్టులు, కవిత్వం, రాయప్రోలు, కృష్ణశాస్త్రి, విశ్వనాథ, బసవరాజు, గురజాడ, పురాణం, ప్రబంధం, నాయికా నాయకులు...అబ్బ ! ఎన్నని, అదొక విశ్వరూపం, ఒక విజ్ఞాన సర్వస్వం. శృంగారాన్నీ చమత్కారాన్నీ రంగరించి ఆంధ్ర నవలా పాఠకలోకానికి అందించిన అమృతం.
ఆ అమృతేతి వృత్తంలో శబ్దాన్ని, అర్థాన్ని, వాక్యాన్ని, సన్నివేశాన్ని, సంభాషణల్ని, ఆకార వికారాల్ని, వర్ణనల్ని, అలంకారాల్ని, అది యిది అనికాదు అన్నిటినీ ఆశ్రయించి జిడ్డులా పట్టుకొన్నది హాస్యం. అదే కొంటే కోనంగి తనం, అదే కోనంగి బాపిబావ పూలకుచ్చుదెబ్బ (పు.311), ఆ దెబ్బ తాకకుండా ఈ కథలో ఏ పాత్రా తప్పించుకోలేదు. పఠిత పరిస్థితి అంతే, కోనంగి బావ నవ్వించిన మనుష్యుడు ప్రపంచంలో లేడు. అంత గడుసరి ఇంకొకరు లేరు అన్న చౌదురాణి మాటలక్షర సత్యాలు. (పు. 380). ఆ అక్షర సత్యాల్నే అక్కడక్కడ పరిశీలిద్దాం. అన్నం అంతా పట్టి చూడాలా ఓ మెతుకుచాలు ! అదే పట్టి చూద్దాం.
క భాష - దా భాష :
తెనుగునాట చిన్నపిల్లలు తమాషాగా కభాష మాటాడుతుంటారు. రహస్య గోపనానికి కూడా వాళ్లీ భాష ఉపయోగిస్తుంటారు. ప్రతి అక్షరాని క ముందు చేర్చడమే క భాష. క అ కడి కవి కబా కపి కరా కజు కగొ కప్ప కక కవి - అడవి బాపిరాజు గొప్పకవి. కోనంగి దాభాష ఉపయోగించాడు.
సీతాదేవికి కోనంగి తగినవాడా కాడా అని పరీక్ష చేయడానికి గుమాస్తా వస్తాడు. అతడు తనకు వచ్చిన అరవ తెలుగులో నాను ఇక్కడి వాణ్ణిదా...అవునుదా అంటాడు. నేనుదా, అడిగేదిదా, మీరుదా, నన్నుదా, ఎట్లాదా, పరీక్షదా, చేస్తున్నారుదా, అదిదా అంటాడు కోనంగి, అన్నిటికీ దా ఉండదు సామి అంటాడు గుమస్తా.
మా దేశంలో చూస్తివా ! పిల్లకాయలు దా భాష మాట్లాడుదురు. నీదాకుదా, ఎదాన్నిదా, ఏందాడ్లుదా ? అంటే నీకు ఎన్ని ఏళ్ళు ? అన్నమాట తెలుసునా ? ఈ దెబ్బతో పరీక్షకు వచ్చిన గుమస్తా హడలి బేజారెత్తి వెళ్ళిపోతాడు.
కన్నాటుపురం :
అనంతలక్ష్మీ కోనంగుల ప్రథమ దర్శనంలో సంభాషణ తమాషాగా జరిగింది. అనంత ఇంటివైపు చూస్తూ గేటు దగ్గర నిలబడ్డ కోనంగి పైకి, లైటు ఫోకసుతో ఒక్కసారిగా వచ్చింది కారు. తబ్బిబ్బయ్యాడు కోనంగి.
ఎవరయ్యా ! దారికడ్డంలే. నాటుపురం మనిషిలా వుంటివే అన్నది అనంతలక్ష్మి.
నేను నాటుపురం వాణ్నే ! నాటు పురమే కాదు కన్నాటుపురం కూడా నాది అన్నాడు కోనంగి.
కన్నాటు అంటే ! అడిగింది అనంత.
కళ్ళు మూసుకు కలలు కంటున్న నాటుపురంవాణ్ని, అందుకని కన్నాటుపురం వాణ్ని అన్నాడు కోనంగి.
కిలకిలనవ్వింది అనంత, కలల మీద కన్నాడు కోనంగి.
పాలుపోకపాలు :
సారా పనిచేసే చేటనే కోనంగి అమ్మకం మనిషిగా కురిరాడు. ఇరువురికీ స్నేహం కుదిరింది. మొదటినుంచీ మీ వాళ్ళు మన జాతీయోద్యమాల్లో ఏమీ పాలు పుచ్చుకోవడం లేదే ! అడిగాడు కోనంగి మొదటి నుంచి ఏమీ పాలుపోక పాలుపుచ్చుకోలేదు అంది సారా.
ఆ తర్వాత కొంతసేపటికి తన యజయానిని గూర్చి చెబుతూ సారా ఇలా అంది - ఇద్దరం అతి భారమైన మాటలనుకున్నాం. కోనంగి వెంటనే అన్నాడు. ఆ భారం ఇంత పారేస్తే మా అవకాయన్నా పెట్టుకుందురు.
ఆకాశంలో చుక్కలెన్నున్నాయో, ఈ పుస్తకాలకాశంలో ఇఆంటి మాటలన్నున్నాయి.
ఒత్తుకుంది :
సినిమాతీయడానికి డైరక్టరు కోనంగిని కథా నాయకునిగా ఎన్నుకున్నాడు. కథానయిక కంచి ఇడ్లీపిల్ల అని ముఖం అచ్చం తిరగలి రాయిలా ఉందని, అ అమ్మాయి పనికిరాదని, ప్రాణనాథా అనమంటే వరాణనాథా అంటుందని, నాథా అనమంటే నాదా అంటుందని, థా ఒత్తుఅంటే న్హాదా వని నామీదే ఒత్తుతుంది బాబూ అంటాడు కోనంగి డాక్టర్ రెడ్డితో.
నీమీదే ఒత్తిందీ, అని రెడ్డి దీర్ఘం తీస్తాడు.
నన్ను ఒక్కణ్నే, అక్కడ ఉన్న వారందరినీని, రేపు ప్రేక్షకకులనందరినీ కూడా ఒత్తుకుంది అంటాడు కోనంగి.
పనికిరాని నాయికల్ని (నటనకు) ఎన్నిక చేసుకోవడంవల్ల ఎన్నెన్ని ప్రమాదాలో మర్మగర్భితంగా చెప్పబడిందిక్కడ.
ఓ తువాలా......నిన్నేనే !
సరోజిని, చౌదురాణి, డాక్టరూ, అనంత అలా కూర్చొని అలవోకగా భార్యాభర్తల సంబోధనకు సంబంధించిన సంభాషణల్ని చర్చించుకుంటారు. గారు, అండి, ఏమండి మొదలైన విషయాలపై మాటలయిపోయాక సరోజిని అంటుంది.
|