నాకు పరిచితుడైన బాపిరాజు
- ఆచార్య కె.గోపాలకృష్ణారావు
తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఇప్పటికి నలుబదేండ్లకంటే ముందునాటి మాట. నేను ఇంటర్మీడియట్ చదువుకొంటున్న రోజులు. ఆంధ్ర మహాభారత పాఠ్యభోదనం పూర్తిఅయిన తర్వాత ఆచార్య పల్లాదుర్గయ్యగారు సూచించారు. నిజాం కళాశాలలో అడివి బాపిరాజుగారి ఉపన్యాస కార్యక్రమము ఉందనీ, వెళ్ళిపాల్గొంటే మంచిదనీ, ఆచార్యులవారి సూచనను ఆదేశంగా భావిస్తూ సహధ్యాయులైన తెలుగు విద్యార్ధులతో నిజాం కాలేజీకి వెళ్లాలని నిశ్చియించుకొని బయలుదేరినాము. నారాయణరావుని చిత్రించిన బాపిరాజుగారిని చూడాలని తహ తహ లోలోన ఇనుమడించి ఉరకలు వేయించింది.
నిజాం కాలేజి తెలుగు శాఖకు వెళ్ళగానే ఆచార్య కురుగంటి సీతారామయ్యగారు చిరునవ్వుతో ఆహ్వానించి బాపిరాజుగారితో పరిచయం చేసినారు. ఆ కళామూర్తిని చూడగానే అవ్యక్తమైన ఆనందం కలిగింది. ముసిముసి నగవులతో పలుకరించినారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా ఎదలో భద్రంగా ఉన్నది. ఆయన నడకలో మాటలో పాటలో చూపు హస్తవిన్యాసం, ముఖ చాలనంలో ఊహకందని సౌకుమార్యం, లాలిత్యం భాసించింది. వ్యక్తావ్యక్తంగా స్పష్టాస్పష్టంగా పౌరుషేయమైన అందం, మార్దవంతోమేలమాడింది. వేదిక నలంకరించి సాహిత్యోపన్యాసం చేస్తూంటే అభినయపూర్వకంగా గేయగానం చేసినట్లనిపించింది. పరుషమైన వర్ణ విన్యాసం, శబ్దాడంబరం లేక మెత్తగా సంభాషణాత్మకంగా, గుండెతో గుండె మాట్లాడినట్లు లేతగా వెన్నెలవలె, మల్లెతీగవలె, ఉపన్యాసం అంతా ఆహ్లాదకరంగా సాగింది. బాపిరాజుగారిని చూడటం, వారి మాటలు వినడం అదే మొదటిసారి. మళ్ళీ ఇంకొక సందర్భంలో, మీజాన్ పత్రికా కార్యాలయంలో దర్శనమైంది అంతే. ఆ తర్వాత ఆయనను గేయాల్లో, నవలల్లో, పత్రికల్లో, చిత్రకళ్లలోనే దర్శించినాను.
అరవై వసంతాలుకూడ పూర్తిగా చూడని బాపిరాజు జీవితమంతా ఒక యజ్ఞంవలె సాగింది. కాలగమనంలో కష్టసుఖాలతో నిమిత్తం లేకుండా, లేనిదానికి తాపత్రయ పడకుండా, ఉన్నదానితో సంతృప్తి పొందినారు. జన్మాంతర సంస్కారదత్తమైన ప్రతిభ ఉరకలువేయటంతో అన్ని రంగాలలో స్వేచ్ఛావిహారం చేసినారు. ఒక విధమైన అష్టావధానం చేసినారు. కవి, కళోపాసకుడు, చిత్రకారుడు, కధానికా నవలా రచయిత వ్యాసకర్త, పత్రికా సంపాదుకుడు, ఆచార్యుడు, దర్శకుడు, స్వాతంత్య సమరయోధుడు, కులపతిగా జీవయాత్ర కొనసాగించినాడు. కళోపాసకుడు మహోన్నత శిఖరాల నలంకరించినాడు.
ఆధునిక యుగంలో కధానిక, నవల అనేరంగాలలో ఎందరో కృషిచేసినారు. వారిలో బాపిరాజుకు కూడ విశిష్టస్థానమున్నది. తెలుగు నవలలు తీర్చిదిద్దటంలో ఆయన పాత్ర గణనీయమైంది. బాపిరాజు నవలలు తెలుగువారి సాంస్కృతిక వ్యవస్థకు అద్దంపట్టే విశిష్ట రచనలు. అవి ప్రక్రియా శిల్పసంపన్నములు. పాత్రల మనస్తత్వాన్ని చిత్రించటంలో, వారిలో ఆత్మీయతా ధర్మాన్నీ సాక్షాత్కరింపచేయటంలో, కొన్ని ఆదర్శాలు, వాస్తవాలు, ధ్యేయాలు మొదలైన మూర్తీభవింప చేయుటంలో, బాపిరాజు లేఖిని సజీవంగా సాగింది. వీరి నవలలలో కూడ సాంఘిక, సాంస్కృతిక, కళాత్మక సంఘటనలు కోకొల్లలు.
విశ్వనాధ వారి వేయిపడగల తో వియ్యమాడిన నవల నారాయణరావు సాహిత్య కారులలో మహామహుల రచనలు కొన్ని శ్రీకృష్ణ జన్మస్థానంలో నాలుగు గోడలమధ్య అవతరించినా అవి విశ్వవ్యాప్తమైనవి. నారాయణరావు పుట్టుక .జైలుగదిలోనే. విశ్వనాధ ధర్మారావు బాపిరాజు నారాయణరావు తెలుగు నవలలో సాక్షాత్కరించిన విశిష్టపాత్రలు. విశ్లేషాత్మక తులనాత్మక అధ్యయనం చేస్తే పాత్రోన్మీలనలోని శిల్పం విభిన్న దృక్పధాలు విస్పష్టరేఖలలో ప్రత్యక్షమయ్యే అవకాశమున్నది.
తెలుగులో చారిత్రక నవలకు చక్కని పునాదులేర్పర్చినా, కళాత్మక సుందర సౌధ నిర్మాణంలో బాపిరాజు పాత్ర విలక్షణమైంది. వారి గుండె లోతులలో దోబూచులాడిన జాతీయ, రాష్ట్రీయ అభిమానం హిమబిందు, గోన గన్నారెడ్డి మొదలగు నవలల్లో గోదావరీ నది మాదిరిగా ఉప్పొంగి పోయింది. తెలుగుగడ్డ మీద గద్దెనిలిపిన శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, ఆంధ్రజాతీయ సంస్కృతికి వెన్నెల పందిళ్ళు వేసినారు. చారిత్రక నేపద్యానికి కల్పన కళాత్మక రూపాన్ని ప్రసాదించింది. కేవలం చారిత్రక వ్యక్తులను, రాజకీయ సంఘటనను చిత్రించనంతమాత్రాన అది చారిత్రక నవలకాదు. అది ఇటుక, సున్నం, రాళ్ళవంటి మూల పదార్ధం మాత్రమే. జాతీయ హృదయ చిత్రణం దానికి ఒక జీవాన్ని కలిగించే చైతన్య శక్తి. బాపిరాజు చారిత్రక నవలల్లో ఈ విలక్షణ ధర్మం పుష్కలంగా ఉన్నది. ప్రాచీన నాగరికతా సంస్కృతులు అన్ని దివ్యనదీ తీరాలలో విలసిల్లిన అంశం చారిత్రక సత్యం. తెలుగునేలను పునీతం చేసి, సస్యశ్యామలం చేసే నదులన్నీ, దివ్యత్వాన్ని తీర్చిదిద్దుకొన్నవే. ఆ నదీ తీరాలు మతానికి శిల్పాలకు సాంఘిక సంస్కృతులకు ప్రతిబింబాలుగా వున్న అంశాన్ని బాపిరాజుగారనేక సందర్భాల్లో రమ్యంగా ప్రబోధాత్మకంగా చిత్రించారు.
వర్తమానానికి చక్కని స్ఫూర్తినిచ్చి భవిష్యత్తుకు బంగారు బాటలువేసేదే భూతకాలం. అదే చరిత్ర. ఈ నగ్న సత్యాన్ని, ప్రభోదాన్ని బాపిరాజు కళాత్మకంగా అందించారు. కృష్ణాగోదావరీ తీరాలలో ప్రాచ్యకాలం నుండి నేటివరకు ఇటువంటి సంస్కృతి వెలిసింది. కృష్ణాతీరాన బౌద్ధము, బౌద్ధశిల్పము ఆంధ్ర సంస్కృతికి వన్నె చిన్నెలు తెచ్చింది. గోదావరీ తీరము కవిపండితులకు, విద్వాంసులకు విహారభూమైనది. తుఫాను నిజంగా బాపిరాజు ఎదలో లేచిన తుఫానే. జాజిమల్లె హృదయంలో విరిసిన సౌరభాన్ని వెదజల్లుతుంది.
ప్రాచ్యపురాణేతిహాస కావ్యప్రబంధాల్లో రచయితలలో, కవులు సందర్భాన్ని అనుసరించి తమకు గల లోకవిజ్ఞతను, వివిధ శాస్త్ర పారమ్యాన్ని ప్రదర్శించారు. ఈ దృష్టి ఆధునిక రచయితలలో, కవులలో విశేషంగా గోచిరస్తుంది. వాస్తవిక చిత్రణం, సామాజిక స్పృహ అను రీతిలో దీనిని విమర్శకులు వ్యవహరిస్తున్నారు. నవల లేదా కధానికయందు రచయితలకు ఈ విధమైన వ్యవస్థను చిత్రించడానికి విస్తృతమైన అవకాశం రచయితలు తమకు గల లోకజ్ఞతను, మత రాజకీయ సాంఘిక సాంస్కృతిక అంశములలోని విశేషాలను, వివిధ శాస్త్ర కళావైదుష్యాన్ని వ్యక్తీకరించినారు. రచనలలో వీనిని శిల్పదృష్టితో పలకరించటం కవి ప్రతిభపై, రచనాశిల్పంపై ఆధారపడి ఉన్నది విశ్వనాథ, బాపిరాజు ప్రభృతులలో ఈ విలక్షణ దృష్టి విశిష్టంగా గోచరిస్తున్నది. వారి బహుముఖ ప్రజ్ఞను చాటుచున్నది. బాపిరాజు నవలల్లో విశ్వరాజకీయాలు, ప్రాచీనాధునిక వైజ్ఞానిక విశేషాలు, వివిధ శాస్త్ర కళాత్మక విశేషాలు అనేక సందర్భాల్లో వ్యక్తమైనవి. వీనిలో బాపిరాజు వైదుష్యాన్ని స్పందిత కళాహృదయాన్ని దర్శింపవచ్చు. విశ్వనాధ వేయి పడగలు లోని పాత్రలలో ఆయనకు సన్నిహితులైన మిత్రులు ప్రత్యక్షమైనట్లే బాపిరాజు నవలల్లో విశ్వ రాజకీయాలు, ప్రాచీనాధునిక కళాత్మక విశేషాలు అనేక సందర్భాల్లో వ్యక్తమైనవి. వీనిలో బాపిరాజు వైదుష్యాన్ని స్పందిత కళాహృదయాన్ని దర్శింపవచ్చు. విశ్వనాథ వేయిపడగలు లోని పాత్రలలో ఆయనకు సన్నిహితులైన మిత్రులు ప్రత్యక్షమైనట్లే బాపిరాజు నవలల్లో సన్నిహితులు కవిరచయితలు మూర్తి వివిధ పాత్రలలో కనిపిస్తున్నది బాపిరాజు చిత్రకారుడైన కవి కనుక వీనిని చిత్రించటంలో ఆయన లేఖిని చిత్రకారుని కుంచెలోని మెలకువను, కవితాస్ఫూర్తిని, కళాకారుని కుంచెలోని మెలకువను, కవితా స్పూర్తిని, కళాచాతురుని, సంపూర్ణంగా అందజేసింది.
|