నాన్నగారి ప్రియమిత్రుడు
- డాక్టర్ నాయని కృష్ణకుమారి
నా బాల్యం చాలా వరకు గుంటూరు జిల్లాకు చెందిన నరసరావుపేటలో గడిచింది. అక్కడ మా నాన్న గార కీ||శే|| నాయని సుబ్బారావుగారు మునిసిపల్ ఉన్నత పాఠశాలలో తొలుత ఉపాధ్యాయులుగాను, ఆ మీదట ప్రధానోపాధ్యాయులుగాను పనిచేస్తుండేవారు.
భావ కవితా కాయమానాన్ని తాల్చిన నాలుగు స్తంభాలలో పటిష్ఠమైన స్తంభం మా నాన్నగారు. ఆయన సౌభద్రుని ప్రణయ యాత్రలోని వత్సల మా అమ్మ. ఆయన మాతృ గీతాలలోని ఉదయమ్మ తల్లి నా పుట్టుకకు మునుపే కన్ను మూసిన నే నెరుగని మా నాయనమ్మ. ఆయన విషాద మోహనంలోని మోహనుడు, నా తరువాత పుట్టిన నా తమ్ముడు. తన జీవితంలో సంఘటనల్నీ, వ్యక్తుల్నీ, తన కవిత్వధారలో అక్షరాలుగా మలచిన మా నాన్నగారి కవితా మార్గం అనుభవ కవితా మార్గం.
ఆయన కవిత్వమూ, వ్యక్తిత్వమూ, రెండు ఒక దాని కంటె మరొకటి నేనే మిన్న అని పోటీ పడడం ఆయన నెరిగిన వారందరికీ తెలిసిన విషయమే. భారతంలో ధర్మరాజుకు అజాత శత్రు బిరుదం ఉంది. ఆ బిరుదాన్నే మరోలా కూర్చి చెప్పాలంటే మా నాన్న గారిని జాత మిత్రుడు అని చెప్పవచ్చును.
సాహిత్యాకాశంలో ధ్రువతారలై వెలిగిన ఎందరో ప్రముఖులు మా నాన్న గారికి మంచి మిత్రులు. ఏ కళ అయినా మంచి కళాకారుల మధ్య స్పర్థలను పెంచడం సహజం. ఆ స్పర్థే విద్యార్థక విషయంగా మాత్రమే ఉండిపోక, అంతశ్శైత్యాలను పెంచేదిగా కూడా ఒక్కొక్కసారి మారి పోవడమూ సహజమే తెలుగు సాహిత్యాకాశంలో సూర్యులూ ఉండేవారు. చంద్రులూ ఉండేవారు.
సూర్య చంద్రులూ, తారకలూ అన్నీ నిలువగలిగిన విపులాకాశానికి తారతమ్య విచక్షణ ఉండదు. మా నాన్నగారు దిగంతాలకు పరచుకున్న వినీలాకాశంలా నాకు కనిపించేవారు.
ఆయనకు విశ్వనాథ అన్న, దేవులపల్లి సోదరుడు జాషువా మంచి మిత్రుడు. బాపిరాజు బావ.
చిత్రమేమిటంటే తెలుగు సాహిత్య ప్రపంచంలో 20వ శతాబ్దపు ప్రథమార్థంలో, సాహిత్యకులంతా, చాలావరకు ఒకరికొకరు అన్నదమ్ములు ఒక్క బాపిరాజుగారు మాత్రమే చాలా మందికి బావ వరుస. ఆయన్ని అందరూ బాపి బావ అని పిలుస్తూ సన్నని జలతారు పోగువంటి హాస్యాన్ని మెరిపించడం చాలా మందికి తెలుసు.
విశ్వనాథగారి వేయిపడగల్లో, బాపి బావ పేరు మార్చుకోకుండా అట్లాగే సాక్షాత్కిరిస్తారు. విశ్వనాథ తనకు స్నేహితుడూ, కూర్పుతమ్ముడూ అయిన మా నాన్నగారికి కిరీటి అని పేను పెట్టి వేయి పడగల్లో ఆయన ప్రణయకథకు శాశ్వతత్వం ఇచ్చారు. కిరీటి పెండ్లి వేడుకలు అందులో ముగ్థ మొహనంగా తీర్చి దిద్దబడ్డాయి. ఆ పెండ్లిలో కిరీటి కవి మిత్రులు చేసిన హంగామా ఇంతా అంతా కాదు బాపి బావ పెండ్లి పందిట నృత్యం చేయడమేగాక చందనంతో చేసిన రాధాకృష్ణుల బొమ్మని పెండ్లి పిల్లలకు కానుక ఇచ్చారు. అది యిప్పటికి మా యింట వారసత్వపు చిహ్నంగా ఉంది.
నరసరావుపేటలో మా నాన్నగారు హెడ్.మాస్టరుగా ఉన్నప్పుడు బాపిరాజు గారు వస్తూ ఉండేవారు. మా స్కూల్లో ఆయన ఉపన్యాసాలివ్వడం, నాకు బాగా గుర్తు. ఒకనాడు మా యింట్లో నన్ను ఎదుటనిలబెట్టికుని, ఉప్పొంగి పోయింది గోదావరీ, తాను తెప్పన్న ఎగసింది గోదావవీ అని తాను ఆడుతూ నా చేత చేతుల్ని కదిలిస్తూ చిరుగంతుల్ని వేయించడం నేను మరువ లేని దృశ్యం. పది, పదకొండేళ్ళ ప్రాయంలో ఉన్నా నాకు, ఈ పెద్దమనిషి గంతులు వేయమంటున్నాడు కదా అని వేయడమే తప్ప, నృత్యం మీద ఏ రకమైన మమకారమూ ఉండేది కాదు. మా నాన్నగారు, బాపిరాజు గారు, కలిసి బెజవాడ వెళ్ళి విశ్వనాధ వారింట పిచ్చాపాటి కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు.
1949 సెప్టెంబరులో విజయవాడలో ఒక కవితా మహోత్సవం జరిగింది. కీ||శే|| చెళ్ళ పిళ్ళ వెంకటశాస్త్రాగారు ఆస్తానకవి గౌరవాన్ని అందుకొన్న రోజది, ఆ రోజు సెప్టెంబరు 18వ తారీకనుకుంటాను - దేశం నలుమూలల నుండి కవులూ, పండితులూ, కళావేత్తలు, కృష్ణవేణి తీరాన సమావిష్టులై ఆ మహా మనిషిని గౌరవించి తమ్ము తాము గౌరవించుకొన్న శుభ దినమది. అప్పుడు చిరుత ప్రాయంలో ఉన్న నాకది నిజంగానే కనీ వినీ ఎరుగని పండగ. ఒక ఆటోగ్రాఫ్ పుస్తకం చేతపట్టుకొని అందరి సంతకాల సేకరణ ప్రారంభించాను.
నా పుస్తకంలో బాపిరాజుగారు ఒక బొమ్మగీచి తన కవితా ఖండికల్లోని ఒక ఖండికను ఉదాహరించి, సంతకం చేశారు. ఆ ఖండిక ఇది -
ఒఖ్ఖణే యిసుక ఒడ్డు
ఒఖణే నీరు దెసలు
ఒదిగి పోవు దూరాలూ
చెదరి పోవు పారాలు
తీరిక సమాయాల్లో ఆ సంతకాల పుస్తకం చూస్తుంటే ఎన్నెన్నో బాల్య స్మృతులు., ఆ స్మృతుల సరస్సులో రాజహంసలై తిరిగే మా నాన్నాగారికి మిత్రులు నాకు పితృతుల్యులు వాత్సల్యయుత మందగమనాలు.
టేప్ రికార్డర్లు లేని దౌర్భాగ్యుపు రోజులవి. మాటల్ని యంత్రబద్ధం చేసి దాచుకోవడం అందుబాటులో ఉండి ఉంటే 20వ శతాబ్దపు ప్రథమార్థపు కవిత్వ చరిత్ర, ఆ కవుల జీవన విధానంలో ఎంత రమ్యాకృతిని దాల్చి మనకు చిరస్థాయిగా నిలచి ఉండేదోకదా ! ఇంతకూ మనం దురదృష్టవంతులం.
చంద్ర బింబం లాంటి కాంతిపూరక సౌమ్యవదనం బాపిరాజు గారిది. అందుకే ఆయన మనస్సునుండి అక్షరరూపమైన శశికళ సాక్షాత్కారించి, తెలుగువారకి ఆందిన చందమామయై భాసించింది.
బాపిరాజు గారి 90వ వర్థంతి సందర్భంలో ఆయన మనసు మెచ్చిన మరో ఇద్దరు మిత్రుల్ని తలుచుకోవడం ఆనందప్రదం.
ఈ మిత్రత్రయం, తెలుగు కవితా సరస్వికి ముప్పేటగా పేనిన ఒక మంచి ముత్యాలహారం.
|