అడివోరి సిన్నోడు
- రాంభట్ల కృష్ణమూర్తి
అడివోరి సిన్నోడ అమృతాధారల వాడ
అభినందనములివే అందుకో చెలికాడ
నిజం ఆయన సిన్నోడు. పసివాళ్ళలో పసివాడు. బాలురలో బాలుడు. తరుణులలో తరుణుడు. ఎవరిలో ఉన్నా ఆయన అంతే. అంతకుమించిన ఆయన వయస్సు పెరగలేదు. జీవితాంతం త్రిదశత్వాన్ని అనుభవించిన అదృష్టశాలి. ఆయన శిల్పకారుడు, కవి కథానికా రచయిత, నవలాకారుడు, సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల మర్మమోరిగినవాడు. కనుక శాస్త్రాలలో పరిచయమున్న ఎవ్వరైనా సరే ఆయన తన వాడుగా గుర్తించ లేదు. కవులతన్ని చిత్రకారుడనే వారు. చిత్రకారులు కవి అనేవారు. కథాకారులు ఆయన మంచి నవలాకారుడనేవారు. నవలాకారులు అతడు చిన్న కథలు వ్రాయటంలో నేర్పరి అనేవారు. ఇలాగ ఆయన్ని అందరు వెలివేసారు. అయినా అందరి తలలో నాలుక. ఇదీ ఆయన ప్రత్యేకత.
ఆయన్ని ఎవరు ఎలా వర్ణించినా ఆయన తొలిప్రేమ మాత్రము చిత్రకళమీదరే అని నిస్సంశయముగా చెప్పవచ్చును. అవి జాతియోద్యమం రోజులు. ప్రతి విషయాన్ని జాతియోద్యమ దృష్టితో నాటి పండితులు చూసేవారు. బాపిరాజుగారు కూడా జాతీయ చిత్రకళ మీద ఎన్నో వ్యాసాలు వ్రాసారు. జాతీయ చిత్రకళ అంటే ఏమిటో తన బొమ్మల్లో నిరూపించారు. నాకు కూడా ఎంతో అంతో చిత్రకళ మీద ప్రథమ ప్రేమ ఉండేది. ఆయన వ్యాసాలు చదివి తరువాత పక్కా భారతీయ కళావాదినై పోయాను. ఆయన దగ్గర చిత్ర కళ్యాభ్యాసం చేద్దామనుకొన్నాను. నానా అవస్థలు పడి ఏవో ఏర్పాట్లు చేసుకొని 1933లో బందరు చేరుకొన్నాను. అప్పటికే ఆయన జాతీయ కళాశాలను విడిచి పెట్టారు. హతాశుడ నయ్యాను. ఎలాగూ వచ్చానూ కదా అని చెప్పి ఓ డ్రాయింగు మాష్టరు దగ్గర చేరాను. ఇప్పటి టైప్ పరీక్షలులాగే ఆ రోజుల్లో డ్రాయింగులో లోయర్, హయ్యర్ పరీక్షలుండేవి. ఆ పరీక్షలు పాసయిన వాడికి డ్రాయింగు మాష్టరు ఉద్యోగం దొరికేది. నేను చేరిన డ్రాయింగ్ మాష్టరు కూడా అలాంటి వాడే. ముందు లోయర్ పరీక్షకు కావలసిన సిలబస్ దృష్టిలో పెట్టుకొని నాకు నేర్పటం మొదలు పెట్టాడు. నాకు విసుగెత్తింది. అయినా చేయగల్గిందేమీలేదు. అప్పటికే అడవి బాపిరాజు గారి వ్యాసాలు చదివాను. పెర్సీ ? బ‌్రౌన్ భారత చిత్రకళ మీద వ్రాసిన పుస్తకం చదివాను. అంటే మూలం కాదు. దాన్ని మన తొలి కార్టూనిస్ట్ తలిసెట్టి రామారావు గారు తెలుగులో కనువదించారు. తెలుగులో వచ్చిన మేరకు ఆనంద కుమారస్వామి పుస్తకాల సారాన్ని కొంత గ్రహించాను. విన్సెంట్ స్మిత్, ఫెర్గూసన్ భారత చిత్రకళ వైలక్ష్యాన్ని వివరిస్తూ వ్రాసిన పుస్తకాలు చూసాను. వారిచ్చిన లక్షణాలు ఇంగ్లీషులో ఉన్నందువల్ల అర్థం చేసుకోలేక పోయాను. కాని లక్ష్యాలుగా యిచ్చిన బొమ్మలు చూసాను. అప్పటికి బాపిరాజుగారి వ్యాసాలు మరి కొంత అర్థమయ్యాయి. ఇంత చదివిన తరువాత బందరు వెళ్ళిన నాకు డ్రాయింగు మాష్టారు గారి ప్రథమ పాఠాలు ఏం రుచిస్తాయి ? అయినాఎలాగూ వచ్చాను కదా ! అని అవీ నేర్చుకొన్నాను. లోయర్ పరీక్షకు కట్టాను. హయ్యారు పరీక్ష కోసం మరుసటేడు రమ్మని ఆయన వత్తిడి తెచ్చారు. ఇది నా ప్రారబ్దం అనుకొంటూ వెళ్ళాను. కానీ ఆ సంవత్సరం ఏం నేర్చుకోలేదు. మకాం టీచర్స్ ట్రైనింగు కాలేజీలోఅక్కడి విద్యార్ధులతోను, అధ్యాపకులతోను గోష్టితో కాలం గడిపాను. రాత్రుళ్ళు అంత్యాక్షరీ ఆటలు ఆడుకునే వాళ్ళము. అప్పటికే ఆశు కవిత అనర్గళంగా వచ్చేది. ఎప్పుడూ గెలుపు నాదే. ఆ తర్వాత భారతీయ కళాకారుల ఔన్నత్యాన్ని గురించి, శిల్ప చిత్రకళా కౌశల్యాన్ని గురించి మూడవ జాము రాత్రి దాటే వరకు పరిశీలిస్తు ఉండేవాణ్ణి అంతే, హయ్యర్ పరీక్షకు కూర్చోలేదు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తరువాత లభ్యమైన చిత్రకళా గ్రంథాలు చదవటం మొదలు పెట్టాను. స్టెర్లా కేవారిష్, తిబెతీయ భాషలో వుండే ఉత్తమ నవతాళ గ్రంథ ఆంగ్లానువాదాన్ని కూడ బలుక్కొని చదివాను. భోజుని సమరాంగణ సూత్రధారలో ఉన్న చిత్రకళా కావ్యాన్ని కూడ బల్కుకొని చదివాను. అలాగే చాళుక్యరాజు భూలోక మల్లసోమేశ్వర దేవుని అభిలాషితార్థ చింతామణి తిరగేసాను. అప్పటికి కృష్ణదేవరాయ లైబ్రరీలో గబ్బిలంలా వ్రేలాడుతూండే వాణ్ణి. తర్వాత బేతనభట్ల విశ్వనాధం గారితో పాటు లైబ్రరీకి జాయంట్ సెక్రటరీ నయ్యాను. పుస్తకాలు చదవటం ఒక్కటే అక్కడ పని. (దాంతో నాలోకొద్ది సంస్కృతాంగ్ల భాషా పరిచయాలో కొద్ది వెలుగు పొడసూపింది) ఆ వెలుగులోనే వాత్సాయన కామ సూత్రాలు చదివాను. దానికి జయమంగళమనే వ్యాఖ్యానం వ్రాసిన యశోధరుడు చిత్రకళకు ఆరు అంగాలు వుంటాయిన ఒక శ్లోకం యిచ్చాడు.
రూప భేదాఃప్రమాణాని భావలావణ్యయోజనం
సాదృశ్యం వర్ణికాభంగమితి చితషడంగకమ్
అన్న శ్లోకాన్ని బట్టీ పట్టాను. ప్రతి చిత్రాన్ని ఆరు కోణాల నుండి చూడటం నేర్చుకొన్నాను.
అది 1943 గులాం మొహమద్ కలకత్తావాలా అనే బొంబాయి వర్తకుడు హైదరాబాద్ వచ్చి ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషలో మీజాన్ అనే ఒక దిన పత్రికను ప్రారంభించాడు. మీజాన్ అంటే త్రాగు అని అర్థము. అందులో తెలుగు పత్రికకు సంపాదకుడుగా బాపిరాజుగారు హైదరాబాదు వచ్చారు. నిజాం కళాశాల తెలుగు విద్యార్థుల వార్షికోత్సవం జరిగింది. తెలుగు విద్యార్థులందరు అనేక కారణాల వల్ల నాకు పరిచితులు. వారి సావనీర్‌కి అట్టమీద బొమ్మ కూడ వేసాను. అందుకోసం నాకూ బహుమతి వచ్చింది. దాన్ని బాపిరాజు గారి చేతులమీదుగా అందుకొన్నాను. అదే మా తొలి పరిచయము. అంతకు ముందు పండుగ చిత్రకళ అన్న పేరుతో ఒక బృహద్వ్యాసం వ్రాసాను. దాన్ని లైబ్రరిలో చదివి వినిపించాను. అప్పుడు మాడపాటి హైస్కూలులో చిత్రకళాధ్యాపకురాలుగా ఉన్న సంగం లక్ష్మీబాయి అధ్యక్షురాలు. నేను వక్తని. ఈ అనుభవం ఇద్దరికీ అదే మొదలు. ఇద్దరము కూడా టెంకాయ పిచ్చుకొండ, యామన్న గార్కి భసాపంకంభసాపంకం అనే స్థితిలో వున్నాము. నేను పుస్తకం మొఖానికి అడ్డు పెట్టుకొని వ్రాసిన వ్యాసం గభగభా చదివేసాను. ఆమె కూడా అదే పుస్తకాన్ని అడ్డు పెట్టుకొని చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పేసింది. మాకు భసాపంకం ఎంత ఉన్నప్పటికి ఈ వ్యాసం సంగతి బాపిరాజు గారి చెవి సోకింది. ఆయన నాకు కబురు పంపారు. వ్యాసం చదివారు. చాలా బాగుంది యంగ్ మాన్ అని వెన్ను తట్టారు. వ్యాసం తీసుకుని దాన్ని ధారావాహికంగా ప్రచురించారు. అప్పటి నుండి రాకపోకలు యెక్కువయ్యాయి. ఆయన దగ్గర భారతీయ చిత్రకళా రహస్యాలు తెలుసు కుందామనుకొన్నాను. కానీ ఏం లాభం. ఆయన నాకు జర్నలిజమ్ అంటించారు. మీజాన్‌లో సబ్ ఎడిటర్‌గా నియమించారు. నాకు ఇంగ్లీషు రాదు మొర్రో అన్నా వినలేదు. ఇన్ని విషయాలు తెలిసి వున్నవాడివి అది నీకు కష్టమా ? అని ప్రశ్న వేశారు. ఆయన అన్న మాటలు నిజమే. ఆయన అన్నట్లుగా చేరిన రెండో రోజునే జర్నలిస్టుగా తయారై పోయాను. అప్పుడు ప్రపేదిరే ప్రాక్తన జన్మవిద్యా అన్న శ్లోకం జ్ఞాపకం వచ్చింది. బాపిరాజుగారు నిఖార్సైన భారతీయ చిత్రకళా వాది. అందునా బారతీయులందరికి తెలుగు వాళ్ళే చిత్రకళ నేర్పారు అనేవారు. ఆ మాట నిజం - శాంతినికేతనంలో రవీంద్రుని భ్రాత ఆవనీంద్రనాథఠాగోర్ చిత్రకళాధ్యాపకుడు. ఆయన దగ్గర ముగ్గురు మూర్తిత్రయం లాంటి శిష్యులుండేవారు. ఒకరు నందలాల్‌బోస్.
. |