పాత్ర చిత్ర‌ణ

బాపిరాజుగారి పాత్ర చిత్ర‌ణా సామ‌ర్థ్యం వేనోళ్ళ పొగ‌డ‌ద‌గిన‌ది. ఈయ‌న స‌హ‌జంగా క‌వి, చిత్ర‌కారుడు మ‌న‌స్త‌త్వ‌వేత్త‌యును అయివున్న కార‌ణంచేత ఆయా పాత్ర‌ల‌ను బ‌హిరంత‌ర ప్ర‌వృత్తుల‌లో స‌ర్వాంగీణంగా చిత్రించ‌గ‌లిగారు. పాత్ర‌ల బాహ్య ప్ర‌వృత్తుల‌ను మ‌నోహ‌రంగా వ‌ర్ణించ‌డానికి ఆయ‌న క‌వితాశ‌క్తి, అంత‌ర ప్ర‌వృత్తుల‌ను విన్యాస‌గ‌మాలుగా చిత్రించ‌డానికి మాన‌సిక మార్మిక‌త‌ల‌ను తెలుసుకోగ‌ల ఆయ‌న చిత్ర ర‌చ‌నా ప్ర‌తిభ‌యు బాగా తోడ్ప‌డ్డాయి. ఆయ‌న మొక్క చిత్ర‌ణాత్మ‌క ప్ర‌తిభ‌నుబ‌ట్టి ఈ న‌వ‌ల‌లోని పాత్ర‌ల‌న్నీ నిత్య చైత‌న్య‌మూర్తులుగా మ‌న మ‌నఃఫ‌ల‌కాల‌పై తాండ‌విస్తుంటాయి. ఇంద‌లి స్త్రీమూర్తులు ఉద‌య‌వేళ న‌వ‌ల‌తో కాన‌లుసాచే లేదీవ‌ల‌వ‌లె కోమ‌ల సౌంద‌ర్య చైత‌న్య‌రాశులుగా, విద్యావివేక చూడామ‌ణులుగా ప్ర‌ణ‌య సంభ‌రిత‌ములుగానూ కాన‌వ‌స్తాయి. శృంగార సుంద‌ర మూర్తులుగా, కార్య‌దీక్షాద‌క్షులుగా, విద్యా వివేక సంప‌న్నులుగా, వాద ప్ర‌తివాద కుశ‌లురుగా, వివిధ క‌ళావేత్త‌లుగానూ ఇంద‌లి పురుష పాత్ర‌లు కాన‌వ‌స్తాయి. పాత్ర‌ల‌న్నియు వ్య‌క్తిత్వ విల‌సితాయి.

1. నారాయ‌ణ‌రావు :-

ఈ న‌వ‌ల‌లో నారాయ‌ణ‌రావుపాత్ర మిక్కిలి ప్ర‌ధానమ‌యిన‌ది. ఇందు ఆదినుండి అంత‌మువ‌ర‌కు సంస్కార పూరిత వీర‌విహారం ప్ర‌యోజ‌నాత్మ‌కంగా చేసిన ముఖ్య పాత్రిది. బాపిరాజుగారి ఆత్మీయ‌త‌యంత‌యు, ఈ స‌క‌ల క‌ళామ‌య పాత్ర‌లో ప్ర‌తిస్పందిస్తుంది. నారాయ‌ణ‌రావే తాను తానే నారాయ‌ణ‌రావు అన్న‌ట్లుగా ప్ర‌తిప‌త్తితో అభేద జాగ‌రూక‌త‌తో ఈ పాత్ర‌ను తీర్చిదిద్దారు. ఈ ర‌చ‌యిత యొక్క స‌క‌ల క‌ళాశ‌క్తుల స‌మాహార రూప‌మే ఈ పాత్ర త‌న భావాల‌ను, నైపుణ్యాన్ని, ఈ పాత్ర ద్వారా ప్ర‌ద‌ర్శించారు. త‌న సంగీత సాహిత్య చిత్ర‌క‌ళాప్ర‌తిభ‌ల‌కు ఈ చైత‌న్యాత్మ‌క పాత్ర‌నుర‌స‌వ‌త్ప్ర‌తీక‌గా చేసుకున్నారు. నువ్వు వీణ‌, నేను ఫిడేలు వాయించుకుంటూ కిన్నెర‌మిధునంలా ఉందా మ‌నుకున్నాను. ప్ర‌తి ప‌రీక్ష‌లో ప్ర‌ధ‌ముడుగ నెగ్గుచూ, అనేక శాస్త్రాల‌లో పాండిత్యం సంపాదించుకున్నందుకు అనురూప‌మైన విద్యావ‌తిని నాకు ల‌భించినావ‌ని మురిసిపోయాను. నాకు అల‌వ‌డిన క‌విత్వం, చిత్ర‌లేఖ‌నం, నీవ‌ల్ల చ‌రితార్థ మ‌వుతవ‌నుకున్నా ! అని (పుట‌. 215) నారాయ‌ణ‌రావు, శార‌ద వ‌ద్ద మాయామ‌ర్మాలు లేకుండా హృద‌య వేద‌న‌తో ప‌లికిన ప‌లుకుల‌లో అతని యొక్క బ‌హుశాస్త్ర పాండిత్యం క‌ళావైదుష్యం, విద్యాభిమానం సౌంద‌ర్యలాల‌స‌త్యం, మున్న‌గున‌వి వ్య‌క్తాల‌వుతున్నాయి, మీలో ఒక్క‌డూ ఇంకా ప‌రీక్ష‌యినా కూర్చోలేదు, అప్పుడే ఉద్యోగాలు ! (పుట‌. 9) అని త‌న మిత్రుల‌తో అన్న నారాయ‌ణ‌రావు మాట‌ల‌ద్వారా ప‌రీక్ష‌ల‌లో కృతార్థుల‌యితే త‌ప్ప ఉద్యోగాన్వేష‌ణ చేయ‌రాదు, చ‌దువు యొక్క ప‌ర‌మార్థం విజ్ఞానం అనే త‌న ఆశ‌యాల‌ను, ఆద‌ర్శాల‌ను వ్యంజింప‌చేశారు. మామ‌గారి ఎస్టేటులో మిమ్మ‌ల్నెవ‌ళ్ళ‌నీ అడుగు పెట్ట‌నివ్వ‌ను, ఒక ప‌ర‌మేశ్వ‌రుణ్ణి మ‌టుకు ఆస్థాన క‌విని చేస్తాను (పుట‌. 9) అన్న మాట‌ల‌లో యిత‌ని క‌వితా ప‌క్ష‌పాతం ప్ర‌తిధ్వ‌నిస్తూంది. మ‌ద్రాసులో న్యాయ‌శాస్త్రాధ్య‌యంన చేసి, ఉన్న‌త శ్రేణిలో కృతార్ధుడై లా డిగ్రీ చేప‌ట్టి, లాయ‌రుగా కొంత‌కాలం జీవిత యాత్ర సాగించినా ఆత్మ వికాసానికి లా ప‌ర‌మ శ‌త్రువ‌ని నేడు అది ధ‌ర్మ‌. స‌త్య‌దూర మ‌యిన‌ద‌ని అంటాడు నారాయ‌ణ‌రావు. అత‌డు సంభాష‌ణ ప్రియుడైన‌ను సుమిత‌భాషి స‌హ‌జ విన‌య సంప‌న్నుడు, స‌మ‌య‌ము వ‌చ్చిన‌పుడు విద్యా ప్రౌఢిమ‌తో, ఆవేశ‌ముతోను, యుక్తి యుక్తంగా గంభీరోప‌న్యాసం చేయ‌గ‌ల‌డు.

నారాయ‌ణుడు, అనుప‌దానికి జ్ఞాన‌మున‌కు మార్గ‌మైన‌వాడు. జ‌న స‌మూహానికి త్రోవ అయిన‌వాడు, అను వ్యుత్ప‌త్యార్థాలు ఉన్నాయి. ఉన్న‌త విద్యా ప‌రిజ్ఞానంచేత‌, లౌకికానుభవం చేత‌ను, బంధువుల‌కు, మిత్రుల‌కు, ప‌రిస‌ర జ‌న స‌మూహానికే ఉజ్జ్వ‌ల మార్గ‌ద‌ర్శ‌కుడ‌య్యాడు క‌నుక‌, ఇత‌ని నారాయ‌ణ నామం సార్థ‌క‌మైన‌దిన చెప్ప‌వ‌చ్చును. వీరేశ‌లింగంగారి, రాజ‌శేఖ‌రమునుకు, చిల‌క‌మ‌ర్తివారి రామ‌చంద్రున‌కు, బాపిరాజుగారి నారాయ‌ణ‌రావున‌కు, ఎంతో సామ్యం క‌నిపిస్తుంది. ఎన్ని స‌మ‌స్య లెదురైనా, ఎన్ని ప్ర‌లోభాల‌కు గురియైనా క‌డు నిగ్ర‌హ శ‌క్తితో స‌హ‌న స్వ‌భావంతో మ‌చ్చ‌లేకుండా త‌న జీవ‌యాత్ర‌ను సాగించిన ఆ క‌ళంక‌శీలి. ఆచంచ‌ల హృద‌యుడు, ధీర గంభీర‌మూర్తి నారాయ‌ణ‌రావు. సౌశీల్య ప‌తియైన శ్యామ‌సుంద‌రీదేవి, ఇత‌ని అంద‌చందాల‌కు, గుణ‌గ‌ణాల‌కు, శ‌క్తియుక్తుల‌కూ మురిసి, పార‌వ‌శ్యంతో ఇత‌నిని ఆలింగ‌నం చేసుకున్న‌ప్పుడు మొద‌ట కొంచ‌ము ప్ర‌ణ‌య భావ‌న‌లో చలించి, పుల‌కించి, ప‌ర‌వ‌శించిన త‌నువాత త‌న అర్థాంగి శార‌దా దేవి గుర్తుకువ‌చ్చి, జరిగిన దానికి ప‌శ్చాత్తాప‌డి, జారిన కాలును మెలుకువ‌తో కూడ దీసుకున్న అక‌లుష హృద‌యుడు, త‌ల్లిదండ్రుల‌పై, అత్త‌మామ‌ల‌పై కుటుంబ వృద్ధుల‌పై అపార‌భ‌క్తి విశ్వాస‌ములు గ‌ల‌వాడు యిత‌డు, పెద్ద‌ల‌క‌డ‌, గ‌రువుల వ‌ద్ద‌ను అణ‌కువ‌తో, క్ర‌మ‌శిక్ష‌ణ‌తోనూ మెల‌గి, అపార‌జ్ఞాన స‌ముపార్జ‌న‌చేసిన విన‌య‌శీలి. త‌న సోద‌రీమ‌ణుల‌న్న అనంత‌గౌర‌వము. చిన్నారి సోద‌రి సూరీడు అన్న యిత‌నికి ప్రాణ‌ము. త‌న ఆద‌రాభిమానాదిగుణాల చేత‌, మ‌మ‌త‌లు వెద‌జ‌ల్లిన స‌మ‌తా భావంచేత‌, వాజ్ఞ్మాధుర్య‌ము చేతనూ, ఆబాల‌గోపాలం యొక్క ప్ర‌శంస‌లు అందుకున్న ఆశాజీవి, ఆర్థ్ర‌హృద‌యుడు, ఈ నారాయ‌ణ‌రావు పాత్ర యొక్క వ్య‌క్తిత్వం చాలా వ‌ర‌కూ అప‌మార్గ‌మును అనుస‌రించిన త‌న యిల్లాలు శార‌దాదేవిని కేవ‌ల‌ము త‌న సౌజ‌న్య‌, సౌశీల్య సంప‌త్తి చేత స‌న్మార్గ‌మున‌కు మ‌ర‌లించి, త‌న‌కు అనుకూలవ‌తిని కావించు కొనుట‌లోనే కాన‌వ‌స్తుంది. మొత్త‌ము మీద ఈ న‌వ‌ల‌లోని ముఖ్య‌పాత్ర‌యైన నారాయ‌ణ‌రావు త‌లలో నాల్క‌వ‌లె పూస‌ల‌లో దార‌మువ‌లెను, స‌క‌ల కార్య నిర్వాకుడుగా కాన‌వ‌స్తాడు.