న్యాయం

నేర‌స్థుడికి శిక్ష ప‌డిందంటే సాక్ష్యం చెప్పిన‌వాడి ప్రాణం పోవ‌ల‌సిందేనా ?

స్పీడ్‌గా వెడుతున్న ప్లిమ‌త్‌ను స‌డ‌న్ బ్రేక్ వేసి ఆపింది మాధ‌వి. బాగా త‌ప్ప‌తాగిన మ‌త్తుతో నిద్ర‌పోతున్న రాజేష్ ముందుకు తూల‌డంతో నుదురు ముందు సీటుకి కొట్టుకొని బొప్పికట్టింది.

అబ్బా ఏమయింది మ‌ధూ క‌ళ్ళు తెర‌వాల‌ని ప్ర‌య‌త్నం చేసి కూడా తెర‌వ‌లేక నుదురు తడుముకోవాల‌ని త‌డుముకోలేక మ‌త్తుగా అన్నాడు రాజేష్‌.

మాధ‌వి వంద‌గ‌జాలు కారుని వెన‌క్కి న‌డిపింది స్లోగా. డోర్ తెరిచి ప‌ట్టుకుని దిగు అన్న‌య్యా నీకు మెళుకువ వ‌చ్చిందా !  అంది కంగారుగా.

అక్క‌డ రోడ్డు ప‌క్క‌గా ఓ ఆకారం ప‌డివుంది అది మాన‌వాకారం లాగానూ ద‌గ్గ‌రైన కొద్ది ఆడ‌దాని లాగానూ క‌న్పించింది మాధ‌వికి.
ఓ అన్నాయ్యా  - ఇంకా నిద్రేనా ! లే ?  గ‌ట్టిగా వీపుమీద త‌ట్టింది.

అబ్బా ఏమిటి చెల్లాయ్ పీస్‌ఫుల్‌గా నిద్ర‌పోనియ్  -  మ‌ళ్ళీ గుర్రు -  ఇదిగో నిన్నిక్క‌డే విడిచి పెట్టి నేను వెళ్ళిపోతున్నా, మ‌న కారుని చింత‌చెట్టు కింద పెట్టా -  ఆ చెట్టు మీద ద‌య్యం ఉందిట - అది కామినీ పిశాచంట లేచి కారు తాళాలు తీసుకొనే పోతున్నా అంది రాజేష్ ని బెదిరిస్తూ.

రాజేష్ ఒక్క ఉదుటున లేచాడు. అయ్య‌బాబోయ్ ద‌య్యాలే  - వెళ్ళ‌కు చెల్లాయ్  -


అమ్మ నీకు ఆంజ‌నేయ దండ‌కం నేర్పిందిగా చ‌దవ‌వూ ప్లీజ్  - క‌ళ్ళు తెరిచే ప్ర‌య‌త్నం చేసి చేసి స‌గం తెరిచాడు  -  శ్రీ  అంజ‌నేయం....ప్ర‌స‌న్నాంజ‌నేయం...అన్న‌య్యా నువ్వొక ప‌నిచేస్తే పూర్తిగా చదువుతా లేక‌పోతే లేదు అంది మాధ‌వి.

చెప్ప‌వే తల్లీ  -  పెంకిఘ‌ట‌మా నీ చెప్పులు మొయ్య‌నా !  నీ కాళ్ళ‌కు మొక్క‌నా విసుగ్గా అన్నాడు.

అదుగో ఆ డొంక ద‌గ్గ‌ర చూడు ఎవ‌రో ప‌డివున్న‌ట్టుగా వుంది - వాళ్ళెవ‌రో బ్ర‌తికున్న‌దో చ‌చ్చిపోయిన‌దో తెల్సుకొని వ‌ద్దాం నాకు సాయంరా ? అంది.

అమ్మో ?  అది దెయ్యం ప‌నేనే మ‌న‌ల్ని ఆక‌ర్షించ‌డానికి అక్క‌డ ప‌డుకుని ఉంటుంది. అన్నాడు రాజేష్‌.

అది నే తేల్చేస్తానుగా - ఆంజ‌నేయ ఆంజ‌నేయ అంటే ద‌య్య‌మైతే మాయ‌మైపోతుంది -  మ‌నిషైతే అక్క‌డే ఉంటుంది. చ‌ప్పున రా - ఇప్ప‌టికే నిన్ను మేల్కొల్ప‌టానికి అర‌గంట దాటిపోయింది అంది మాధ‌వి.

అబ్బా ఆ గోలంతా మ‌న‌కెందుకే - ఛ‌స్తే మ‌న‌మేం చేయ‌లేం - బ‌తికున్నా అంత‌క‌న్నా ఏం చేయ‌లేం - ఎందుకొచ్చిన గొడ‌వే చెల్లాయ్ అన్నాడు రాజేష్‌.

మాధ‌వి అన్న మాట‌లు విన‌కుండా డొంక దగ్గ‌ర‌కి వెళ్ళింది. అమ్మో ఒక్క‌డ్నే ఉన్నాను. కారు చింత‌చెట్టు కింద‌కూడా ఉంది రాజేష్ భ‌యంగా కారు దిగి చెట్టుమీదికి చూశాడు.

అప్పుడే ఓ గుడ్ల‌గూబ వికృతంగా కూసి రెప్ప‌లు ట‌ప‌ట‌పా కొట్టుకొని ఎగిరింది - దాంతోపాటు దాని కుటుంబ‌మూ బంధుమిత్రులు కూడా త‌మ‌కు చేత‌నైనంత‌గా వికృత రావాలు చేస్తూ ఎగిరాయి.

ఆ చ‌ప్పుడికి రాజేష్ బెద‌రిపోయిడు - దూరంగా మాధ‌వి ఒరిగి ప‌రీక్షిస్తూ ఉంది.

అన్న‌య్యా చ‌ప్పున రా ? ఆడ‌పిల్ల - అట్టే వ‌య‌స్సు కూడా ఉన్న‌ట్లు లేదు - ఇంకా ఊపిరుంది అని అరిచింది.

రాజేష్‌కి ఆ ప‌డివున్న పిల్ల‌ను చూస్తుంటే జాలి వేసింది. ఇద్ద‌రూ క‌లిసి ఆ అమ్మాయిని వెనుక‌సీటులో ప‌డుకోబెట్టి హాస్ప‌ట‌ల్‌కి తీసుకువెళ్లారు.
హాస్స‌టల్లో ఆ అమ్మాయిని జేర్చుకోవ‌డానికీ ఎంతో ఇబ్బంది పెట్టారు డాక్ట‌ర్‌. ఎన్నో ప్ర‌శ్న‌లు వేశాడు. అన్నిటికీ మాధ‌వి ఒక‌టే జ‌వాడు చెప్పింది.

మాకు వివ‌రాలు తెలియ‌వు - రోడ్ మీద కార్లో వెడుతూ కారు లైట్ల వెలుగులో చూసి హాస్ప‌ట‌ల్‌కి తీసుకువ‌చ్చాం అంది.

రాజేష్ ఆ అమ్మాయిని స్ట్రెచ‌ర్ మీద లోప‌లికి తీసుకువెళ్ళ‌గానే కార్లో ప‌డుకుని గుర్రు కొట్ట‌డం మొద‌లు పెట్టాడు. అక్క‌డ తిప్ప‌ల‌న్నీ మాధ‌వే ప‌డాల్సివ‌చ్చింది. అలా ఆ అమ్మాయిని అక్క‌డ వ‌దిలి వెళ్ళిపోవ‌డానికి ఆమె అంత‌రంగం వొప్పుకోలేదు. ఇదంతా చాలా గొడ‌వ‌వుతుందిట - పోలీసుల‌కి తెలియ‌జేస్తారుట - కోర్టులో సాక్ష్యం చెప్పాల‌ట చూసింది చెప్ప‌డానికేం బాధ అనుకుంది.

మొత్తానికి ఆ అమ్మాయికి ఫ‌స్ట్ ఎయిడ్ అన్నా చెయ్య‌కుండా ఓ అర‌గంట కాలాన్ని దొర్లించేశాడు డాక్ట‌ర్ బ్ర‌తుకుతుందా డాక్ట‌ర్ ! ఆత్రంగా అడిగింది మాధ‌వి.

ఫ్చ్ పెద‌వి విరిచాడు - మూతి వంక‌ర‌గా పెట్టాడు. ఏమో ఎవ‌డు చూడొచ్చాడు. బ‌తికితే బ‌త‌క‌నూవ‌చ్చు. చ‌స్తే చావ‌నూవ‌చ్చు - రాజ‌బాబు మార్క జోక్ వేశాన‌నుకుని ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాడు డాక్ట‌ర్‌.

మాధ‌వి పెద‌వి కొరుక్కుంటూ వుండిపోయింది - ర‌క్తం చాలా పోయింది - ఇంజ‌రీస్ చాలా వున్నాయి - అదృష్టం బాగుంటే బ్ర‌తుక్కూడ‌దు అన్నాడు డాక్ట‌ర్.

ఇవి డాక్ట‌ర్ మాట్లాడే మాట‌లేనా ! ఆశ్చ‌ర్యంగా చూస్తూండిపోయింది మాధ‌వి.

అవున‌మ్మా  ఈ అమ్మాయి బ‌తికిందే అనుకుందాం - నలుగురూ కాకుల్లా పొడిచి చంపుకు తింటారు. సంఘంలో మొహ‌మెత్తుకుని తిర‌గ‌నియ్య‌రు. మానం పోయాక ఆడ‌ది బ్ర‌తికేం చ‌చ్చేం అన్నాడు.

మాధ‌వికి ఆ అమ్మాయి అంటే మరింత జాలి పెరిగిపోయింది. ఆ అమ్మాయి బ్ర‌తికి తీరాలి. సంఘంలో ధైర్యంగా త‌లెత్తుకొని తిరిగేలా త‌ను అభ్యుద‌య మ‌హిళాసంఘంలో ఆమెకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళ‌ని న‌లుగుర్ని స‌రైన దారిలో పెట్ట‌గ‌లిగినా త‌న జ‌న్మ సార్థ‌క‌మైన‌ట్టే భావించుకుంటాను అనుకుంది మాధ‌వి.

ప‌ట్టుమ‌ని ప‌ద‌హారేళ్ళు లేవు - మొహంలో పసిఛాయ‌లు వ‌ద‌ల్లేదు. ఇంకా విడ‌ని మొగ్గ - విరిసీ విర‌య‌ని అర‌విందంలాగా వుంది - ఏ రాక్ష‌సుడీ కుసుమాన్ని కాల‌రాచాడో మాధ‌వి ఆవేశంతో వ‌ణికిపోయింది.

వ్య‌ధ‌గా నిట్టూర్చింది. ఎందుకో ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళ‌డానికి మ‌న‌సొప్ప‌లేదు.

తెల్ల‌వారు జామున ఆ అమ్మాయికి తెలివివ‌చ్చే సూచ‌న‌లు క‌న్పించాయి. మాధ‌వి న‌ర్సును లేపింది - న‌ర్సు విసుక్కుంటూ డాక్ట‌ర్ కోసం వెళ్ళింది. డాక్ట‌ర్ లోలోప‌లే తిట్టుకుంటూ వ‌చ్చి ఇంకో ఇంజ‌క్ష‌న్ చేశాడు. ఈ అమ్మాయి బ్ర‌త‌కాలి త‌ను ఆమెను ధైర్యంగా మ‌ళ్ళీ స‌మాజంలో తిరిగేలా చూడాలి అనుకుంది.

మెజిస్ట్రేట్ కి రిక్విజిష‌న్ పంపాడు. గొణుక్కుంటూ వ‌చ్చాడు మెజిస్ట్రేట్‌. ఏమిట‌య్యా డాక్ట‌రూ నీకు వేళాపాళా లేదూ రిక్విజిష‌న్ పంపండానికి ! చ‌నువుగా అన్నాడు.

ఇద్ద‌రూ చాలాసేపు కులాసా క‌బుర్లు చెప్పుకున్నారు. హాట్ హాట్ గా టీ తెప్పించుక‌తాగారు. మ‌సాలా ప‌కోడీల‌న్నా తెప్పించి ఉంచ‌లేదేమిట‌య్యా నిద్ర‌మ‌త్తు వ‌ద‌ల్టానికి అని మెజిస్ట్రేట్ గారు జోకేశారు.

ఇలాంటి క‌బుర్లు ఆడుకోడానికి వాళ్ళ‌కి ఎట్లా మ‌న‌సొప్పిందో అవ‌త‌ల ఒక ప్రాణి మ‌ర‌ణించ‌డానికి సిద్ధంగా వుంటే వీళ్ళ‌కి చీమ కుట్టిన‌ట్ల‌యినా లేదే ఛీ ఏం మనుషులు.

ఆ అమ్మాయి క‌ళ్ళు తెరిచింది దాహం దాహం అంటోంది. మాధ‌వి హార్లిక్స్ తెప్పించి ప‌ట్టించింది. మేజిస్ట్రేట్ మెల్ల‌గా ప్ర‌శ్న‌లు ప్రారంభించాడు.

ఏయ్ అమ్మాయ్ నీ పేరేమిటి ?

స‌మ్మ‌వ్వ అంది.

స‌మ్మ‌వా వాటే బ్యూటిఫుల్ నేమ్ - ఏమ‌య్యా డాక్ట‌రూ నీ మ‌న‌వ‌రాలికి ఈ పేరు పెట్టుకోరాదూ ఇద్ద‌రూ ఆ మాట‌ని బ్ర‌హ్మాండ‌మైన హాస్యంగా భావించి పొట్ట ప‌గిలేలా న‌వ్వుకున్నారు..

స‌మ్మ‌వ్వ బెదురుగా వాళ్ళ‌వంక చూస్తోంది. వీళ్ళ‌కి చ‌స్తున్న వాళ్ళ‌ని చూస్తోన్నా జోక్స్ వ‌స్తాయి కాబోలు.

మీదేవూరు ! నువ్విలా అవ‌డానికి కార‌కులెవ‌రు ! నువ్వెవ‌ర్న‌యినా గుర్తు ప‌ట్ట‌గ‌ల‌వా ! అని ప్ర‌శ్న‌లు వేసి ఆమె చెప్పే జ‌వాబుల్ని నోట్ చేసుకోసాగాడు మేజిస్ట్రేట్‌.

ఆమె పొడిపొడిగా చెప్పిన విష‌యాల‌న్నిటినీ గుదిగుచ్చ‌గా -

స‌మ్మ‌వ్వ‌ది వ‌రంగ‌ల్ ద‌గ్గ‌ర ఓ ప‌ల్లెటూరు. అయిదెక‌రాల పొలం ఒక ఎక‌రం మామిడ‌తోట‌. ఓ ఎడ్ల‌జ‌త‌, పాడి ఆవు, చ‌క్క‌ని ఇల్లు స‌మ్మ‌వ్వ తండ్రికి ఉండేవి. ఆ తండ్రి పేరు మొగిలి. మొగిలికి ఇంకొక‌ళ్ళ‌ని కూలికి పెట్టుకుని భ‌రాయించే స్తోమ‌త‌వుంది. ఉన్నంత‌లో ద‌ర్జాగానే బ్ర‌తికేవారు. స‌మ్మ‌వ్వ‌కి వెండి వ‌డ్డాణం కంటే కాసులు పేరూ చేయించాడు. కాళ్ళ‌కి క‌డియాలు పెట్టుకుని ఘ‌ల్‌ఘ‌ల్‌మ‌ని న‌డూస్తూంటే మ‌న్మ‌థుడు విల్లెక్కు పెట్టి గురిచూసి వ‌దిలిన పూబాణంలాగా వుండిది స‌మ్మ‌వ్వ‌.

కోడెకారు పిల్ల‌ల‌కి స‌మ్మ‌వ్వ‌ని చూస్తుంటే గుండెలు ఝ‌ల్లుఝ‌ల్లు మంటుండేవి.

స‌మ్మ‌వ్వ‌ని చూసి ఆ వూరి మోతుబ‌రి రైతు కొడుకు రాగ‌య్య పెళ్లి చేసుకుంటాన‌ని ప‌ట్టుబ‌ట్టాడు. ఇద్ద‌రి కులాలూ ఒక‌టే. కాక‌పోతే భూష‌య్య‌కి ఐదొంద‌లు ఎక‌రాలుంటే మొగిల‌య్య‌కి ఐదెక‌రాలున్నాయి. భూష‌య్య పెళ్లానికి వంద కాసుల బంగారం ఉంటే మొగిల‌య్య పెళ్ళానికి ప‌దితులాల వెండి వుంది.ఇంతే తేడా ?

రాగ‌య్య మొగిలికి క‌బురు పెట్టాడు. నీ కూతుర్ని నాకిచ్చి పెళ్ళి చేయ్ అని. మొగిలి ఎగిరి గంతేశాడు. నా స‌మ్మ‌వ్వ ఆ భ‌వంతుల్లోల‌చ్మీదేవిలాగా తిరుగుతుంది.  ఒళ్ళంతా బంగారం ధ‌గ‌ధ‌గ లాడిపోతుంది. నిజానికి దాని మ‌న‌సు బంగారం. అందుకే యిలాంటి అదృష్టం వెతుక్కుంటూ వ‌చ్చింది అనుకున్నాడు.

ఇస్త్రీ చేసిన కానిపంచె క‌ట్టుకున్నాడు. ఎర్రంచు కండువా త‌ల‌కి చుట్టుకున్నాడు. త‌మ్ముడ్నీ, బావ‌మ‌రిదినీ వెంట పెట్టుకొని పిల్ల‌నిస్తాన‌ని చెప్ప‌డానికి భూష‌య్య ఇంటికి వెళ్లాడు.

మాట విన‌గానే భూష‌య్య భ‌గ్గుమ‌న్నాడు. ఒక  కూలోడి కూతురు నా గ‌డ‌ప మెట్ట‌డ‌మా ! నాయింటికి అధికారిణిగా రావ‌డ‌మా అనుకున్నాడు. వీడికెంత ధైర్యం వీడిని నాశ‌నం చేసి తీర‌తాను అనుకున్నాడు.
నా మేన‌కోడ‌ల్ని త‌ప్ప నా కొడుక్కి ప‌రాయిదాన్ని తేను అని పైకి మ‌ర్యాద‌గా చెప్పాడు.

మ‌ర్నాటినుంచీ మొగిలినెట్టా దివాలా తీయించాలా అని ఆరాలు తీశాడు. స‌ర్కారు జిల్లాల‌నుంచి కొంద‌రు వ‌చ్చి పొలాల‌ని ఎక్కువ‌రేట్ల‌కి కొంటున్నారు. ఎందుకా అని ఆరా తీశాడు భూష‌య్య. అందులో మైకానో సున్న‌పురాయో ఉంటుంద‌ని కొంద‌రు కుర్ర శాస్త్ర‌జ్ఞులు వాళ్ళకి ర‌హ‌స్యంగా చెప్పారుట‌. అలా అయితే ఎక‌రం వెయ్యిపెట్టి కొన్నా ల‌క్ష‌పైనే లాభం వ‌స్తుందిట‌. మామూలుగా అయిఏ ఎక‌రం రెండొంద‌లికి ఇస్తాన‌ని బ‌తిమాలినా కొనేవాడుండ‌డు. త‌న‌కున్న ఐదొంద‌ల ఎక‌రాలు ఆ ద‌రిదాపుల్లో లేవు. అక్క‌డికి నాలుగు మైళ్ళ‌క‌వ‌త‌ల ఉన్నాయి.

మొగిల‌య్య పొలం కొంటాన‌ని క‌బురు పెట్టాడు. ఎక‌రం వెయ్యికాదు ప‌దివేలిచ్చినా అమ్మ‌న‌న్నాడు మొగిలి. దాంతో ఇద్ద‌రికీ మాటా మాటా పెరిగింది. మ‌ధ్య‌వ‌ర్తులు ఇద్ద‌రి మ‌ధ్యా తగాదాని మ‌రికాస్త ర‌గిల్చారు. కొంత‌మందిని డ‌బ్బిచ్చి త‌న‌వైపు కూడ‌గ‌ట్టుకున్నాడు. మున‌స‌బు క‌ర‌ణాల‌ను లోబ‌రుచుకున్నాడు. పొలం త‌న‌ద‌నీ పొలంలోకి వ‌స్తే వేళ్ళు విర‌గ్గొడ‌తాన‌నీ బెదిరించాడు.