మొగిలి త‌న వాళ్ళంద‌ర్నీ కూడ గ‌ట్టుకొని పొలంలోకి వెళ్ళాడు. ముందుగా అనుకున్న‌ట్లే రెండువైపులా వాళ్ళు క‌ర్ర‌ల‌తో బాదుకున్నారు. మొగిలికి బాగానే దెబ్బ‌లు త‌గిలాయి. బుర్ర ప‌గిలిపోయింది. భూష‌య్య పాలేరు ఎవ‌రు కొట్టిన దెబ్బో నెమ‌రుక‌ణ‌త‌ను త‌గ‌ల‌గా అక్క‌డి క‌క్క‌డే చ‌చ్చిపోయాడు.

మొగిలిని మూడ్నెల్లు ఆస్ప‌త్రిలో వుంచి గాయం మానాక జైల్లో పెట్టారు. భూష‌య్య పాలేరుని కొట్టింది మొగిలేన‌న్నారు - సాక్ష్యాలు ప‌లికారు - కేసులు న‌డుస్తున్నాయ్ - సివిల్ కేసులు - క్రిమిన‌ల్ కేసులు.

మొగిలికి నాలుగైదుసార్లు కోర్టుల‌కి వాయిదాల‌కి తిరిగేస‌రికి బెయిలుమీద విడుద‌ల‌య్యేందుకూ మ‌స్తుగా డ‌బ్బు వ‌దిలిపోయింది. మామిడితోట మాయ‌మై పోయింది. ఎడ్ల జ‌త ఎగిరిపోయింది. పాడావుని పాపాయ‌మ్మ‌కి అమ్మేశాడు. పెళ్ళాం జ‌బ్బుకి మందిప్పంచుకునే స్తోమ‌త లేక శ్మ‌శానానిక‌ప్ప‌గించేశాడు.

భూష‌య్య మొగిలి పొలంలో ప‌నులు ప్రారంభించి ధ‌నాన్ని పిండుకుంటున్నాడు. స‌మ్మ‌వ్వ కి పెళ్ళి చేయ‌లేక బాప‌న్లు తోముకోడానికి నాలుగిళ్లు సంపాయించాడు. అత‌ను మాత్రం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. నాల్గ‌యిదు ర‌కాల కేసులు న‌డుస్తున్నాయ్‌. రైల్వే స్టేష‌న్లోనో బ‌స్టాండ్‌లోనో ప్ర‌యాణీకుల సామాన్లు మొయ్య‌సాగాడు. త‌న‌కి వ‌చ్చిందాంట్లో స‌గం వాళ్ళ‌కిస్తాన‌న్నాడు మొగిలి. అటువంటి ప‌రిస్థితుల‌కు బానిసైపోయాడు.

అన్నం మానేసి నాటుసారా ప‌ట్టించ‌డం మొద‌లు పెట్టాడు. తప్ప‌తాగి ఏ అరుగుమీదో పడుండ‌డం రెండ్రోజులు పోయాక నాల్గు డబ్బులు సంపాదించి మ‌ళ్ళీ తాగ‌డం...అన్నంలేని ఆ పేగులు నాటు సారా ఘాటుకి మాడిమ‌సై పోతున్నాయి. ఎందుకూ ప‌నికిరాని ఆ ప్రాణాలు ఎప్పుడో గాలిలో క‌ల్సిపోతాయి.

మొగిలి కోర్టు కెళ్ళ‌డం మానేశాడు. ఆ అయిదెక‌రాలు త‌న‌కే నైవేద్యం పెట్టాల‌ని భూష‌య్య ప‌ట్టుబ‌ట్టాడు. కానీ మొద‌ట్లో మొగిలి మంచిత‌నాన్నీ సంప‌ద‌నీ ఎరిగిన అత‌ని ఆరోగ్య‌మూ, ఆస్తీ హార‌తి క‌ర్పూరంలా క‌రిగిపోవ‌డాన్ని చూస్తూ సాక్షీభూతుడ‌యిన ప్లీడ‌రు మ‌ధుసూధ‌నం మాత్రం బాధ‌ప‌డేవాడు. అందుక‌నే వాయిదా ఉన్న‌రోజున మొగిలి ఎక్క‌డున్నాడో అని రిక్షా వేసుకుని సందులు గొందులు తిరిగి ఏ చెట్టునీడ‌న ప‌డివున్నాడో క‌నిపెట్టి ప‌ట్టుకుని భోజ‌నం పెట్టించి కోర్టుకి తీసుకెళ్ళేవాడు.
అప్ప‌టికి ముగ్గురు న్యాయాధికారులు మారారు. ముగ్గురికీ భూష‌య్య మ‌స్తుగా ముట్ట‌చెప్పాడు.

కేసు భూషయ్య‌కి అనుకూలంగా చెప్ప‌కుండా ఓ సాక్ష్యాన్ని మ‌ధుసూధ‌నం ప‌ట్టుకొచ్చాడు. అది మొగిలి తండ్రి రాసిన విల్లు. మొగిలి పొలం అమ్మ‌డానికి వీలు లేకుండా అందులో రాశాడు. అది త‌న మ‌న‌వ‌డికి చెందాల‌ని మొగిలికి కొడుకు పుట్ట‌క‌పోతే స‌మ్మ‌వ్వ కొడుకికే ఆ పొలం చెందాల‌నీ రాశాడు.

భూష‌య్య స‌మ్మ‌వ్వ‌ని త‌న కొడుక్కి చేసుకుంటే ఆ పొలం త‌న‌కే వ‌స్తుంద‌నుకున్నాడు. ఇద‌వ‌ర‌క్క‌న్నా స‌మ్మ‌వ్వ ప‌రిస్థితి మ‌రీ హీనంగా వుంది. న‌లుగిరింట్లో బాస‌న్లుతోమి వాళ్ళు తిన‌గా మిగిలిన కూడు తింటోంది. అయినా డ‌బ్బు మ‌హాత్మ్యం. ఐదెక‌రాలూ, ఐదు ల‌క్ష‌లో ఇంకా అంత‌కు రెట్టింపో వ‌స్తాయి.

భూష‌య్య స‌మ్మ‌వ్వ‌కి క‌బురుపెట్టాడు. త‌న కొడుకుని చేసుకుంటే కేసు వ‌దిలేసుకుంటాన‌ని.

స‌మ్మ‌వ్వ పెద్ద మ‌నుషుల ముఖాన ఖాండ్రించి ఉమ్మేసింది - ఛీ ఎద‌వ‌ల్లారా నేను పాచికూడే తింటున్నాను. మీరు ఆశుద్ధం తింటున్నారు. ఈ భూష‌య్య మూలంగా మా అమ్మ చ‌నిపోయింది. నాన్నా ఇవ్వాలో రేపో చ‌స్తాడు. ఏ మురిగ్గుంట ప‌క్క‌నో స‌చ్చి ప‌డుంటాడు. ఆ స‌మ్మందం చేసుకునే కంటే ఇలా బ‌త‌క‌డం వెయ్యిరెట్లు న‌యం. ఈ అమ్మ‌లంద‌రూ న‌న్ను బిడ్డ‌లాగా చూసుకుంటున్నారు. నాకు పెట్ట‌కుండా వాళ్ళ పిల్ల‌ల‌కి కూడా పెట్టుకోరు. నాకు త‌గిన కూలోడ్ని నేను చేసుకుంటా.ఈ సారి ఇలాంటి మాట‌లు తెచ్చారంటే మీకాళ్ళిర‌గ్గొట్టి జైల్లో కూర్చుంటా నాకు జైలంటే భ‌యం లేదు అని చీపురుక‌ట్ట వాళ్ళ మొహాన్న దులిపింది. స‌మ్మ‌వ్వ అందుకు ప‌క‌ప‌కా న‌వ్వి ఈ సారొస్తే పేడ‌నీళ్ళు కొడ‌తానంది.

వాళ్ళు భూష‌య్య‌కి ఉన్న‌వీ లేనివీ క‌ల్పించి చెప్పారు. నాతో త‌గాదా పెట్టుకున్న దీని బాబు చచ్చేందుకు సిద్ధంగా వున్నాడు. స‌ర్వ‌నాశ‌నం అయ్యాడు. ఇప్పుడిది క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఇవ్వాళ రాత్ర‌యిపోయింది. రేపు రాత్రితో దీనికి మ‌రి తెల్లార‌కూడ‌దు. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు భూష‌య్య‌.

స‌మ్మ‌వ్వ ద‌గ్గ‌రికి బ‌స్తీ నుంచి మ‌నుషులొచ్చారు. ప్లీడ‌రుగారు ర‌మ్మ‌న్నారు. రేపు కేసు ఆఖ‌రిరోజు. స‌మ్మ‌వ్వ సాక్ష్యం చెప్పాలి. తీసుకురండి అని మమ్మ‌ల్ని పంపించారు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ప్లీడ‌రుగారు నేర్పుతారు. అందుకు ఈరోజే బ‌య‌ల్దేరి ర‌మ్మ‌న్నారు అన్నారు.

స‌మ్మ‌వ్వ త‌ను ప‌నిచేసే అంద‌రిళ్ళ‌కీ వెళ్ళింది. రేపు ప‌న్లోకిరాను. ఎల్లుండి పొద్దుటే వ‌స్తాను. రేపొక్క రోజుకీ ఎవ‌రిచేత‌నైనా తోమించుకోండి అంది. అంద‌రూ త‌లో రూపాయి ఇచ్చారు. ప‌ట్నంలో ఏదైనా ఖ‌ర్చు ఉంటుంది వ‌చ్చేపుడు ఏ గాజులైనా తెచ్చుకోమ‌ని.

బ‌స్టాండు అర‌మైలు పైనే వుంది. స‌మ్మ‌వ్వా బ‌స్తీ నుండి వ‌స్తున్న ఇద్ద‌రు మ‌నుషులూ మెల్ల‌గా న‌డుస్తున్నారు. పొద్దు కూకుతోంది. ఇంత‌లో న‌లుగురు వ‌చ్చి స‌మ్మ‌వ్వ నోరుమూసి డొంక‌ల్లోకి లాక్కుపోయారు. చ‌చ్చేదెలాగూ ఛ‌స్తుంది అనుభ‌వించి మ‌రీ చంపుదాం అనుకున్నారు. అందులో భూష‌య్య కూడా వున్నాడు. స‌మ్మ‌వ్వ గింజుకుంది కొరికింది రక్కింది. ప‌ద‌కొండ‌య్యే స‌రికి స‌మ్మ‌వ్వ ప్రాణం లేన‌ట్లుగా ప‌డిపోయింది. రోడ్డు ప‌క్క‌గా వున్న కాల‌వ‌లో పారేద్దామ‌నుకుని ఈడ్చుకొని వెళ్ళారు. ఇంత‌లో ఏదో లారీ అటు వ‌స్తున్న‌ట్లుగా లైట్లు ప‌డుతున్నాయ్ అప్పుడు స‌మ్మవ్వ‌ని అక్క‌డే పారేసి త‌లోవైపుకు పోయారు.


ఈ సంగ‌తులన్నీ అన్న‌య్య‌కి చెబుతూ వెక్కి వెక్కి ఏడ్చింది మాధ‌వి. అన్న‌య్యా ?  చూశావా మ‌గ‌వాళ్ళెంత రాక్ష‌సులో అంది.

రాజేష్‌కి బాగా కోపం వ‌చ్చింది. చూడు ఈ భూష‌య్య‌ని వెతికి ప‌ట్టించి శిక్ష వేయించేదాకా విస్కీ ముట్టుకోను. అమ్మ‌మీద ప్ర‌మాణం చేస్తున్నాను అన్నాడు.

పెద్ద పెద్ద పోలీస్ ఆఫీస‌ర్స్‌తో వాళ్ళ‌నాన్న‌కి ప‌రిచ‌యం వుంది. తండ్రి కూడా రాజేష్ ప్ర‌తిజ్ఞ విని సంతోషించాడు. నా బిడ్డ విస్కీ మానేయాలేగానీ వెధ‌వ భూష‌య్య‌లాంటి వారిలెంద‌ర్నైనా జైళ్ళలో తోయించ‌గ‌ల‌ను అని అనుకున్నాడు.

స‌మ్మ‌వ్వ పూర్తిగా కోలుకున్నాక త‌ను అభ్యుద‌య మండలికి తీసుకువెళ్ళింది మాధ‌వి. శీలం పోయాక బ్ర‌తికేం ప్ర‌యోజ‌నం అమ్మ‌గారు అని ఏడుస్తున్న స‌మ్మ‌వ్వ‌ని ఓదార్చింది. ధైర్యంగా పరిస్థితుల్నెలా ఎదుర్కోవాలో నేర్పింది. త‌ను బ్ర‌తుకుతూ ఇత‌రుల‌కి సాయం చెయ్య‌డ‌మెలాగో చెప్పింది.

స‌మ్మ‌వ్వకి త‌న మీద త‌న‌కి వుండే ఆస‌హ్యం పోయింది. ఆత్మ విశ్వాసం పెరిగింది. ఆ అభ్యుద‌య‌మండ‌లి దేవాల‌యం. మాధ‌వి దేవ‌త అనుకుంది.

భూష‌య్య కేసు తీర్పుకొస్తోంది. ఎలా మాఫీ చేయించుకోవాలో శ‌త‌విధాల పాటుపడుతున్నాడు. ఇప్పుడుండే జ‌డ్జీ లంచాలు పుచ్చుకోడ‌ట‌. అయినా త‌న పేరు పైకి రాకుండా అనేక ప్ర‌య‌త్నాలు చేశాడు. బెదిరించాడు. నీ పిల్లాడు జాగ్ర‌త్త‌. ఇవ్వాళ ఈ కేసు వాయిదా వెయ్య‌క‌పోయావో ఈ ప్ర‌పంచంలో నువ్వుండ‌వు. నీ పెళ్ళాం పిల్ల‌లు దిక్కులేని వాళ్ల‌వుతారు. నీముందు వాళ్ళ‌కంటే నీకు కొమ్ములున్నాయా ! వాళ్ళూ తెలివిగా త‌లో పాతిక‌వేలూ సంపాదించుకున్నారు. నీ నిజాయితీకి  మెచ్చాముగ‌న‌క నీకు మ‌రో పాతిక‌వేలు ఎక్కువిస్తాము. మొత్తం ఏభ‌యివేలు ఎక్కువిస్తాము. మొత్తం ఏభ‌యివేలు.

నీకెన్ని అప్పులున్నాయో నాకు తెలుసు. నీ నిజాయితీని నీ ఎదుట మోచ్చుకుంటూనే న‌లుగురూ నీ వెన‌కాల నిన్ను ప‌నికిరానివాడ‌నీ, చేత‌కాని వాజ‌మ్మ అని తిట్టుకుంటున్నారు. అప్పులు తీర్చుకో . ఇంకా ఇద్ద‌రు కూతుళ్ళ‌కి పెళ్ళి చేసుకోడానికి డ‌బ్బు మిగుల్తుంది.

ఇలాంటి ఉత్త‌రాల‌కీ ఫోల్ల‌కీ లెక్క‌లేదు. ఆయ‌న్ని వెంటాడి వెంటాడి లంచం పుచ్చుకోమ‌ని వేధించి వేధించి విసిగించారు. న్యాయ‌మూర్తిగారు అన్నిటికీ స‌మాధ‌నంగా ఒక చిరున‌వ్వు పారేసి ఊరుకున్నారు. ఆయ‌న ఏం చెయ్య‌బోయేది ఎక్క‌డికి వెళ్ళ‌బోయేది ఏ హోట‌ల్లో ఏ బంగ‌ళాలో దిగబొయ్యేది భూష‌య్య‌కి వార్త‌లందుతూనే వున్నాయి.

న్యాయ‌మూర్తి బెదిరింపుల‌కు బెద‌ర‌లేదు. అంతా దైవం మీద వేశారు. ఇన్నాళ్లు న్యాయ‌దేవ‌త‌కి సేవ చేశాను. ఒక త‌మ‌ల‌పాకు తొడిమ కూడా అన్యాయంగా పుచ్చుకోలేదు. న్యాయ‌మ‌ని న‌మ్మిన‌దానిని బ‌ట్టీ, సాక్ష్యా ధారాల‌ను బ‌ట్టీ తీర్పులు చెప్పాను. ఇప్పుడు దేశానికి నీ లాంటి వాళ్ళ అవ‌స‌రం త‌క్కువ‌.

లంచాలు తీసుకునే వాళ్ళే జ‌న‌ప్రియులు వాళ్ళంటేనే ప్ర‌జ‌ల‌కీ పై వాళ్ళ‌కీ కూడా అభిమానం. వాళ్లు పుచ్చుకోను గ‌ల‌రు. ఇంకొక‌రికి ఇయ్య‌నూగ‌ల‌రు. త‌మ‌వంటి వాడేమీ చెయ్య‌లేడు. క‌నీసం పెళ్ళాం కూడా మెచ్చుకోదు. ఆవిడ పుట్టింటివారు పెట్టిన బంగారం అమ్ముడైపోయింది. పిత్రార్జితం క‌ర్చ‌యి పోయింది అంటుంది. ఫ‌లాన ఆవిడ ర‌వ్వ‌ల దుద్దులు చేయించుకుంది. ఫ‌లానా ఆవిడ కూతురికి న‌వ‌ర‌త్నాల హారం చేయించింది. వాళ్ళ‌క్క‌డ స్థ‌లం కొన్నారు. ఇక్క‌డ కొబ్బ‌రితోట కొన్నారు. ఇళ్ళు కొన్నారు. అని లిస్టు చ‌దువుతుంది. త‌మ‌కేం లేవ‌ని బాధ ప‌డుతుంది. లంచం పుచ్చుకోమ‌న్నావుటే రామ‌రామ మ‌హాపాపం అంటుంది. అదొక పిచ్చిది అనుకుంటూ న్యాయంగా న్యాయ‌స‌మ్మ‌త‌మైన న్యాయాన్ని తీర్పుగా చెప్పారు న్యాయ‌మూర్తిగారు. భూష‌య్య తొమ్మిదేళ్ళు జైల్లో మ‌గ్గ‌వ‌ల‌సిందేన‌న్నారు.
భూష‌య్య త‌న కుడిభుజాన్ని ద‌గ్గ‌రికి పిలిచాడు. పోలీస్‌వాన్ ఎక్కుతూ, ఇద్ద‌రు ఒక‌రి వైపు ఒక‌రు కొరుక్కున్నారు. సంబ‌రంగా కావ‌లించుకుంటున్న స‌మ్మ‌వ్వ‌నీ. మాధ‌వీనీ చూశారు. స‌మ్మ‌వ్వ మాధ‌వి కాళ్ళ‌కి వంగి దండం పెడుతోంది. మాధ‌వి స‌మ్మ‌వ్వ‌ని పైకి లేపి చ‌నువుగా నెత్తిమీద మొట్టింది. ఇద్ద‌రూ న‌వ్వుకుంటూ చెట్టాప‌ట్టాలేసుకుని అభ్యుద‌య మ‌హిళా మండ‌లి అని రాసివున్న కారెక్కి వెళ్ళిపోయారు.

ఇంకా అవలేదా మీ సంభాష‌ణ కానిస్టేబుల్ భూష‌య్య‌ని లాఠీక‌ర్ర‌తో డొక్క‌లో పొడిచాడు. భూష‌య్య బాధ‌తో స‌గం అవ‌మానంతో స‌గం లుంగ‌లు చుట్టుకుపోయి, తెల్ల కాయితం మీద సంత‌కం పెట్టి కుడి భుజానికిచ్చాడు. నా ఆస్థిలో స‌గం నా కొడుక్కి, స‌గం నీకు నే చెప్పిన ప‌నిచేయ్ అని వానెక్కాడు.

తెల్లారింది. అభ్యుద‌య మ‌హిళామండ‌లి ముందు మాధ‌వి త‌న వొక‌వైపూ మొండెం ఒక‌వైపూ గుమ్మానిక‌టూ ఇటూ ప‌డివున్నాయ్‌.

స‌మ్మ‌వ్వ అప‌ర కాశికాదేవిలా వుంది. క‌ళ్ళ‌లోంచి నిప్పులు చెరుగుతున్నాయి. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మైన‌వాడ్ని స్వ‌యంగా తెగ‌న‌రుకతాన‌ని ప్ర‌తిజ్ఞ చేసింది. న్యాయ‌మూర్తి గారి స‌ర్వీసు ఆనాటితో ముగిసింది. మాధ‌వి హ‌త్య‌కు కార‌ణ‌మైన వాడిని న్యాయ‌స్థానం ఎలా శిక్షిస్తుందో  రాబోయే న్యాయ‌మూర్తి న్యాయం ఎలాచెబుతాడో.