ప‌రిధి

( జ‌న్మ‌దిన సంచిక పోటీలో బ‌హుమ‌తి కోసం ఎన్నిక‌యిన క‌థ )

అల‌వాటు ప్ర‌కారం ప్ర‌శాంతికి నాల్గింటికే మెల‌కువ వ‌చ్చేసింది.

కంగారుగా లేవ‌బోయి ఆ రోజు ఆదివార‌మ‌ని గుర్త‌కొచ్చి అమ్మయ్య ఇవ్వాళ కాస్త ఆల‌స్యంగా లేవ‌చ్చు. ఆఫీసులు లేవు క‌దా అనుకొని మళ్ళీ దుప్ప‌టి క‌ప్పుకుని పడుకుంది. ప‌డుకున్న‌ద‌న్న‌మాటేగాని నిద్ర‌ప‌ట్ట‌లేదు. ఉత‌కాల్సిన బ‌ట్ట‌లు, చెయ్యాల్సిన ప‌నులు, తోమ‌వ‌ల‌సిన గిన్నెలు క‌ళ్ళ‌ముందు గిర‌గిరా తిరుగుతున్నాయి. ఆదివారం క‌దా అంద‌రం క‌ల‌సి భోజ‌నం చెయ్య‌వ‌చ్చు. ఏమైనా స్పెష‌ల్ చెయ్యాలి. ఏం చేస్తే బాగుటుంది. బాబిగాడికి చాక్లెటు త‌ప్ప ఇంట్లో చేసిన‌వేవీ అక్క‌ర‌లేదు.

ఆయ‌న‌కు ఆవ‌డ‌లంటే ఇష్టం. అవి చేయ‌డానికెంత క‌ష్ట‌మో ! గ్రైండ‌ర్‌లో రుబ్బితో బాగోవు...ఇలా ఆలోచ‌న‌లు వంటింటి చుట్టూ కుటుంబం చుట్టూ తిరుగుతుంటే ఒక్క క్ష‌ణం ప్ర‌శాంతికి త‌న‌మీదే త‌న‌కు చిరాకు వేసింది. ఛీ ఎప్పుడూ ఇలాంటి ఆలోచ‌న‌లేనా... ఈ ఇంటి ప‌రిధి దాటి నా ఆలోచ‌న‌లు పోవా..
ఇంత‌లో కునుకు ప‌ట్టిన‌ట్లుంది.

తలుపు కొట్టిన శబ్దం. ఏదో క‌ల‌. అంద‌మైన క‌ల‌లాగే వుంది. మ‌ద్య‌లో చెదిరిపోయింది. మ‌ళ్ళీ శ‌బ్దం. టక్‌....ట‌క్‌...ట‌క్‌....ట‌క్‌...గ‌డియారం ఆరుగంట‌ల‌ని సూచిస్తోంది. పాల‌వాడు వ‌చ్చి వెళ్ళిపోయాడో ఏమో క‌ర్మ‌... బండ నిద్ర పోయాను.

త‌లుపు తీసిన ప్ర‌శాంతి ఆశ్చ‌ర్యంతో, ఆనందంతో మీరా అంది. రండి రండీ అంటూ ఎంతో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో లోనికి ఆహ్వానించింది. ఏదో అద్భుతంగా అన్పించింది. ఆ వ‌చ్చినామె మాట్లాడ లేదు. లోనికి రాలేదు. రండి అంది మ‌ళ్ళీ ప్రేమ‌గా. న‌న్ను మీరెరుగ‌రు. నేను మీ బంధువు ఎవ‌రిలాగా అయినా ఉన్నానేమో అందుకె తెలిసినట్లుగా పిలుస్తున్నారు అంది.
ప్ర‌శాంతి మొహంలో చిరున‌వ్వు తొల‌గ‌లేదు. నిజ‌మే.మీరు మా అమ్మ పోలిక‌లో ఉన్నారు. చూడ‌గానే ఎంతో ఆనందం వేసింది. త‌రువాత మీరెవ‌రో నాకు తెలీద‌ని తెలిసింది. అయినా ఫ‌ర‌వాలేదు. రండి కూర్చోండి. కాఫీ తాగినాక మీరు వ‌చ్చిన ప‌నేమిటో చెబుదురుగాని.

ఆమె లోనికి రావ‌డానికి ఇంకా సంశ‌యిస్తూనే వుంది.

బాబిగాడు లేచిన‌ట్లుంది మ‌మ్మీ...మ‌మ్మీ...అంటున్నాడు.

శాంతి ఎవ‌రితోనో పొద్దున్నే వాక‌ట్లో బాతాఖానీ మొద‌లు పెట్టావ్ ?  అంటూ ర‌మేష్ స‌తాయిస్తున్నాడు.


ప్ర‌శాంతి లోనికి వెళ్ళింది. ఎవ‌రోనండి. మ‌న తెలుగావిడే. ఎంత క‌ళ‌గా వుంద‌నుకున్నారు. ల‌క్ష్మీదేవి బీద వేషం వేసుకొచ్చిన‌ట్లు వుంది. ఎంత నిదాన‌మో, ఎంత మంచిత‌న‌మో...ర‌మేష్ న‌వ్వాడు. నీ మొహం, మోస‌గాళ్ళంతా అమాయ‌కంగానే క‌న్పిస్తారు.

మీకెప్పుడూ అనుమాన‌మే.  దేవుడొచ్చినా న‌మ్మ‌రు.

స‌రే ఇంత‌కూ ఎందుకొచ్చిన‌ట్లుట !

ఇంకా చెప్ప‌లేదు.

వెళ్ళు. క‌వాలంటే ప‌దో ఇర‌వ‌య్యో దానం చెయ్యి అంతేగాని లేనిపోని స‌మ‌స్య‌ల్ని నెత్తిన వేసుకోకు. చ‌ప్పున పంపించెయ్యి.

ప్ర‌శాంతి కాఫీ తీసుకువ‌చ్చి ఆమెకు ఇచ్చింది. తాగ‌మ‌ని రెండుసార్లు చెప్పినా ఆమె మొహ‌మాటంగా అలా కూర్చునే వుంది.

ర‌మేష్ చిర‌చిర‌లాడుతున్నాడు.

బలే బాగుంది. ఈవిడ వ‌ర‌స‌. ఎందుకొచ్చిందో చెప్ప‌దు. నోరు విప్ప‌దు. ఏదైనా పెద్ద ప్రోగ్రామే పెట్టుకొచ్చిందేమో. ఇంకొక‌రైతే ఎడాపెడా నాల్గు అనేవాడే. కానీ ప్ర‌శాంతి చెప్పిన‌ట్లు ఆవిడ మొహం చూస్తూంటే నోరు పెగ‌ల‌టంలేదు. ఏదో చెప్ప‌లేని క‌ళాకాంతీ ప్ర‌త్యేక‌తా ఆమెలో ఉన్నాయి. వెల వెలాగా వెలిసిన మాసిన‌ట్లు వున్నా ఆ వ‌స్త్ర‌ధార‌ణ వింత‌గా వుంది. వ‌చ్చాపోసి క‌ట్టుకుని పెద్ద ముత్త‌యిదులా వున్న ఆమెను ఆప్యాయంగా ప‌ల‌క‌రించాల‌నే అన్పిస్తోంది. ద‌గా, మోసం చేసే బాప‌తులాగా అన్పించ‌టం లేదు.

ప్ర‌శాంతి అడ‌గ్గా అడ‌గ్గా ఆమె నోరు విప్పింది. మాది విశాఖ జిల్లా. కొన్ని కార‌ణాంత‌రాల‌వ‌ల్ల ఇలా రావ‌ల్సి వ‌చ్చింది. ఈ బొంబాయి ప‌ట్ట‌ణంలో మా చెల్లెలు కొడుకున్నాడు. ఆ ఎడ్ర‌సు ప‌ట్టుకుని మూణ్ళాళ్ళుగా తిరిగి నానా అవ‌స్థ‌లూ ప‌డ్డాను. మీ ఇంటికి త‌గిలించివున్న పేరుచూసి ఆంధ్రావాళ్ళ‌ని తెలిసి తలుపుకొట్టాను. అంతేగాని మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌ను. ఇంత‌సేపు ఇలా కూర్చున్నానంటే మీరెంతో ఆత్మీయంగా ఆహ్వానించారు. త‌న  పేరు చెప్ప‌డానికి ఆమె ఇష్ట‌ప‌డ‌లేదు. అడ‌గ్గా అడ‌గ్గా సుంద‌రి అని చెప్పింది.

ప్ర‌శాంతి ఎడ్ర‌స్ కాగితం తీసుకుని ర‌మేష్‌కి చ్చింది. అయ్యో అన్నాడు ర‌మేష్‌. ఏమిట‌న్న‌ట్లు చూసింది. ఈయ‌న‌కి ట్రాన్స్‌ఫ‌ర్ అయింది. మొన్న‌నే ట్రివేండ్రం వెళ్ళిపోయారు.

ఆమె లేచి నుంచింది. వ‌స్తాన‌మ్మా...పిల్లాపాప‌ల‌తో చ‌ల్ల‌గా వుండండి. మెల్ల‌గా బ‌య‌ట‌కి న‌డిచింది.

ప్ర‌శాంతి ర‌మేష్ వంక చూసింది. ర‌మేష్ మౌనం వ‌హించాడు. ఇప్పుడెలా, ఆవిడ ఎక్క‌డ‌కి పోతుంది. చేతిలో సంచీలేదు. రెండో జ‌త బ‌ట్ట‌లుకూడా లేవు. భాష‌రాదు. యాచించ‌డం రాదు. ప్ర‌శాంతికి క‌డుపులో చెప్ప‌లేని బాధ‌. త‌న త‌ల్లే దిక్కులేకుండా వీధుల వెంట అతి ద‌య‌నీయంగా ఏకాకిలాగా సంచ‌రిస్తున్న‌ట్లు...ఏవేవో ఊహ‌లు. ఏ చెట్టు కిందో,  ఏ రోడ్డు మీదో ఆమె ఆక‌లి దాహానికీ త‌ట్టుకోలేక గిల‌గిల్లాడి మ‌ర‌ణిస్తున్న‌ట్లుగా గుండె నెవ‌రో త‌డిబ‌ట్ట‌ను పిండినట్లుగా మెలివేస్తున్న‌ట్లుగా వ‌ర్ణ‌నాతీత‌మైన వేద‌న‌...ప్ర‌శాంతి ఒక్క అంగ‌లో బ‌య‌టికి ఉరికి  పిన్నిగారూ రండి... ఇపుడెక్క‌డికి వెడ‌తారు. భోజ‌నం చేసి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్దురుగాని అంటూ చెయ్యి పుచ్చుకొని బ‌ల‌వంతంగా తీసుకువ‌చ్చింది.

సంబంధంలేని ఆత్మీయ‌త‌కు ఆమె విస్తుపోతూ చేసేదిలేక ఆ రోజుకు అక్క‌డ వుండిపోయింది. అర‌గంట‌లో బాబిగాడు అల‌వాటైపోయి ఆవిడ వొళ్ళో ఊయ‌ల‌లూగ‌టం మొద‌లు పెట్టాడు.

భార్య‌భ‌ర్త‌లేవో చిన్న‌చిన్న‌గా వాదించుకోవ‌డం చెవుల‌లో ప‌డుతూనే వుంది. ఆవ‌డ‌లు వండ‌టంలోను, అంటు గిన్నెలు తోమ‌డంలోను అన్ని ప‌నుల‌లోను ప్ర‌శాంతికి సాయం చేసింది.

ప్ర‌శాంతికి ఎంతో సుఖంగా అన్పించింది. ఇలాంటి అత్త‌గారుంటే ఎంత బాగుండేది అనుకుంది. భోజ‌నాల ద‌గ్గ‌ర అలాగే అంది. ర‌మేష్ న‌వ్వాడు. నీకు ఇలాంటి అత్త‌కాదు మా నీరు వాళ్ళ అత్త‌లాంటి అత్త ఉండాలి తిక్క కుదిర్చేది.

నాకేం తిక్క‌లేదు. క‌దండీ పిన్నిగారూ... ఆమె ఏ మాటా విన్న‌ట్లు వుండ‌దు. ఒక జ‌డ ప‌దార్ధ‌మా లేక ఆవిడ ఆలోచ‌న‌ల్లో ఆవిడ వుందా...

భార్య భ‌ర్త‌లిద్ద‌రూ క‌నుసైగ‌లు చేసుకున్నారు. ఆమెను మాట‌ల్లో దింపింది ప్ర‌శాంతి. నీర‌జ మా ఆడ‌ప‌డుచు. పాపం అత్త‌గారు క‌డుపు నిండా అన్నంకూడా పెట్ట‌దు. ప్ర‌తి ప‌నికీ వంక‌లు పెట్టి కాల్చుకు తింటుందిట‌. క‌ట్నం తేలేద‌ని స‌తాయిస్తుందిట‌. ర‌మేష్‌కి చెల్లెలి అత్త‌గారిమీద ఎంతో ఆగ్ర‌హం వచ్చింది.

ఆ ముస‌లిదాన్ని జ‌ట్టు ప‌ట్టుకుని బ‌య‌టికి ఈడ్చాలి అన్నాడు.

ఆమె మొహంలో ఏదో భావం క‌దిలింది.

 ఇది సృష్టి ర‌హ‌స్య‌మేమో. కొంద‌రు అత్త‌ల‌ను వేధిస్తుంటే కొంద‌రు కోడ‌ళ్ళ‌ను రాచి రంపాన పెడ‌తారు. ఆడ‌వాళ్ళ మూలంగానే ఇల్లు న‌ర‌క‌మైపోతుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఆ మ‌గ‌వాడు ఎంత న‌లిగిపోతాడో గ‌దా అంది.

అయితే పిన్నిగారు మీ స‌మ‌స్యేమిటో నేను చెప్ప‌నా ?  మీ కోడ‌లు గ‌య్యాళి గంప‌...మిమ్మ‌ల్ని ఇంటినుంచి...ఆపైన ఆమె విన‌ద‌ల‌చుకోన‌ట్లు లోప‌లికి వెళ్ళిపోయింది.

ర‌మేష్ క‌ల్పించుకున్నాడు. ఒక ప‌నిచేస్తే ?  మా నీరు అత్త‌గార్ని వీళ్ళ కోడ‌లి ఇంటికి పంపిద్దాం. ఈమెను నీరు ద‌గ్గ‌ర‌కి పంపిద్దాం సింపుల్ ఎక్చేంజ్‌.

అత్తా, కోడ‌లు, ఇల్లు, స్వార్థం...ఈ ప‌రిధినుంచి భ‌గ‌వంతుడెందుకో నన్ను త‌ప్పించాడు. ఇంకా ఏమైనా చెయ్యాలి. నా పరిధిని పెంచుకోవాలి అనే త‌ప‌న ఎప్ప‌టినుంచో వున్నా ఇప్పుడేదో కొత్త అవకాశం కోసం ఎదురుచూడాల‌నిపిస్తోంది అంది.

ర‌మేష్ అమ్మో మీ పిన్నిగారు అసాధ్యురాలే. త‌న‌కు క‌ట్టుగుడ్డ‌లేదు. నిలువ‌నీడ‌లేదు. ఆశ‌లు మాత్రం చాలా పెద్ద‌వే ఉన్నాయి.
ఇలాంటి ఆద‌ర్శ‌వాదులు మాట‌ల్లో స‌త్యం...నేతి బీర‌కాయ‌లో నెయ్యి ఉన్నంత వుంటుంది ప్ర‌శాంతి అత‌ని నోరు మూసింది.

మ‌ర్నాడు ఎనిమిదింటికే భోజ‌నాలు చేసి టిఫిన్లు తీసుకుని ఆఫీసుల‌కి బ‌య‌లుదేరారు. బాబిగాడిని పాల‌బిస్క‌ట్స్ మొద‌లైన స‌రంజామాని తీసుకుని అల‌వాటు ప్ర‌కారం తాళం తీసుకుని బ‌య‌లుదేరింది. ఆమె కూడా ఆ స‌మ‌యానికి బ‌య‌ట‌కొచ్చి నిల‌బ‌డింది. పిన్నిగారు మీరు ఇంట్లోనే వుంటారా అంది ప్ర‌శాంతి.

ఆమె త‌ల అడ్డంగా ఊపింది. బాబును ఎక్క‌డ దింపుతారు. అంది. ఈ ప్ర‌క్క వీధిలోనే క్రెష్ వుంది. అక్కడ చిన్న పిల్ల‌ల్ని బాగా చూస్తారు. ఈ వీధిలో ఉద్యోగాలు చేసేవాళ్ళంద‌రూ త‌మ ప‌సివాళ్ళ‌నక్క‌డే దింపుతారు. ప్ర‌శాంతితోపాటు ఆమెకూడా న‌డిచింది.

క్రెష్ న‌డిపే ఆవిడ మ‌రాఠీ మ‌హిళ‌. లావుగా పొడుగ్గా వుంది. మాట క‌రుగ్గా వుంది. అక్క‌డ అన్ని భాష‌ల పిల్ల‌లూ ఉన్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డం, రాజ‌స్థానీ, గుజ‌రాతీ వారంతా త‌మ పిల్ల‌ల్ని అక్క‌డే దింపుతారు. అంద‌రితో చ‌క్క‌గా న‌వ్వుతూ మాట్లాడుతోంది.

మా పిన్నిగారు సాయంత్రం వ‌ర‌కు ఇక్క‌డ వుంటారు. ఫ‌ర‌వాలేదు క‌దా అంది ప్ర‌శాంతి.

ఉర్దూ, తెలుగు, మ‌హారాష్ట్ర మూడు భాష‌లూ క‌లిపి ఉంటే నాకేం న‌ష్టం. ఉండ‌నీ అంది. ఆమె పేరు క‌రుణా ప‌టాలే. అందరూ ప‌టాలే ఆంటీ అంటారు.


ప‌టాలే ఆంటీ పిల్ల‌లంద‌ర్నీ పెద్ద హాల్లో వుంచి కొన్ని ఆట వ‌స్తువులు, బిస్క‌ట్లు ప‌డేసి లోప‌లికి వెళ్ళి శుభ్రంగా నేల‌మీద‌నే ఒక దుప్ప‌టి వేసుకుని ప‌డుకొని గుర్రపెట్టి నిద్ర‌పోతోంది.

ఇక పిల్ల‌లంద‌రూ గోల న‌వ్వులు, ఏడ్పులు, ఆట‌లు ఒక‌రు పుచ్చుకున్న బొమ్మ‌ను ఒక‌రు లాక్కోడం, ఒక‌రి చేతిలో బిస్క‌ట్ మ‌రొక‌రు కింద‌పార‌యేడం. ప‌డ‌టం. లేవ‌టం.నానా హంగామా చేస్తున్నారు.

ప‌నిపిల్ల దాని దారిన అది ఏదో న‌వ‌ల చ‌దువుకుంటోంది. డ్రాయ‌ర్లు త‌డిచిపోతున్నా, చీమిడితో ముక్కూ, నోరూ ఏకం అవుతున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోడ‌టంలేదు.