సామ్రాజ్ఞి రుద్ర‌మ‌

పాన‌గ‌ల్లు ఛాయా సోమేశ్వ‌రుల క‌ల్యాణ‌ము మ‌హా వైభ‌వ‌ముగా జ‌రుగుతున్న‌ది. స్వామి క‌ళ్యాణ‌ము జ‌గద్క‌ళ్యాణ కార‌క‌ము అని ప్ర‌గాఢ‌ముగా విశ్వ‌సించిన భ‌క్తులంద‌రి హృద‌యాల‌లోనూ ప‌ర‌మ‌శివుడు ఆనంద తాండ‌వం చేస్తున్నాడు. అంద‌రి దృక్కులూ మ‌న‌స్సులూ ఒకే తావున కేంద్రీక‌రింప‌బ‌డియున్న‌వి. కాలాముఖ‌, కాపాలిక‌, పాశుప‌తాది స‌మ‌స్త శైవ శాఖ‌ల‌వారంద‌రూ శాఖాభేద‌మెంచ‌క సోమేశ్వ‌రుని వివాహ‌మున‌త్యంత భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుతూ ఉండిరి. సోమేశ్వ‌రుని వీక్షించిన త‌రువాత వారి క‌న్నులు శ్రీ‌శ్రీ‌శ్రీ కాక‌తీయ సార్వ‌భౌములు గ‌ణ‌ప‌తి దేవ చ‌క్ర‌వ‌ర్తి పైన నిలుస్తున్న‌వి. చక్ర వ‌ర్తులు విభూతాలంకృత దేహులై చెంగావి ప‌ట్టుపంచ‌ను క‌ట్టి రాజ‌ఠీవిని వేలార్చేలాగున మ‌ణిమ‌యాది ర‌త్న భూష‌ణ‌ముల‌ను ధ‌రింప‌క పండిన మామిడిపండు వంటి ప‌సిమి దేహముతో ఆశేష జనావ‌ళిని క‌రుణ‌ర‌స‌ముట్టిప‌డేలాగున తిల‌కిస్తూ ఉండిరి. వారి చెంత‌నే రాజ‌గురువులు గోళ‌కీమ‌ఠ పాశుప‌త శైవాచార్యులు, వారి ప్ర‌క్క‌న గ‌ణ‌ప‌తిదేవ చ‌క్ర‌వ‌ర్తులు శివ‌దీక్షా గురువు విశ్వేశ్వ‌ర శంభువు, వారి వెనుక భ‌ట్టిప్రోలు, త్రిపురాంత‌క‌ము, పుష్ప‌గిరి, మ‌ల్కాపురి మొద‌ల‌యిన అనేక శైవ మ‌ఠాచార్యులు న్నూక‌ర‌ములు మోడ్చి శివ క‌ళ్యాణ‌మున‌కు పెళ్ళి పెద్ద‌లై నిల‌చియుండిరి. వంద‌లాది జంగ‌మ‌దేవ‌ర‌లు శంభో... అంటూ శంఖ‌ముల‌నూదుతూ ఆక‌సానికావ‌ల‌నున్న కైలాస‌మున‌కు త‌మ పిలుపు చేరాల‌నే ఆకాంక్ష‌తో, భ‌క్తి త‌మ‌కంతో ఊగిపోవుచున్నారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ గ‌ణ‌ప‌తి దేవ సార్వ‌భౌములు అమ్మ‌వారికి వ‌జ్ర‌పు కిరీట‌మును, ముత్తెపు ముంగెర‌, ర‌వ‌ల క‌డియ‌ములు, నెల‌వంక‌ల కెంబ‌ట్టు పుట్ట‌ముల‌ను, బంగ‌రు ప‌ళ్ళెరాన పెట్టి కాన్క‌జేసికొన్నారు. స్వామికి ర‌జిత చంద్ర‌వంక స్వ‌ర్ణ ఫ‌ణిభూష‌ణ‌ముల‌ను పాల‌వెన్నెల‌ల‌ను మించు బంగ‌రుపోగుల తెలివ‌లిపెమును బ‌హూక‌రించుకొన్నారు. చ‌క్ర‌వ‌ర్తుఛాయామ‌హాదేవి త‌న క‌న్న బిడ్డ‌వ‌లెనో త‌న‌ను క‌న్న‌త‌ల్లివ‌లెనో కానుపించి తెలియ‌ని భ‌క్తి భావ మ‌మ‌తాను బంధముల‌తో ఆక‌ర్షించుకొనిన‌ది.
రుద్ర‌దేవ‌తా మంత్ర‌ములు ఉచ్ఛైస్వ‌ర‌మున ఉచ్ఛ‌రింప‌బ‌డుతూ ఉన్న‌వి.
స‌ర్వో వై రుద్ర‌స్త‌స్మై రుద్రాయ న‌మో ఆస్తు
ప‌రుషోడై రుద్ర స్స‌న్మ‌హో న‌మో న‌మః
విశ్వం భూతం భువ‌నం చిత్రం బ‌హుధా
జాతం జాయ‌మానంచ‌య‌త్ !!
స‌ర్వోహ్యేష రుద్ర స్త‌స్మై రుద్రాయ‌
న‌మో ఆస్తు ! రుద్రాయ న‌మె అస్తు
స‌ద్యోఘృత‌ము మ‌ధుద‌ధి గౌక్షీరాది పంచామృత‌ముల‌తో సోమేశ్వ‌రుడు త‌ల‌మున్క‌లై పోతూ ఉండెను. అమ్మ‌వారు స‌హ‌స్ర క‌మ‌ల పుష్ప‌, స‌హస్ర కుంకుమాది అభిషేక‌ముల‌తో అర్చింప‌బడుతూ ఉన్నారు. దివ్య‌శంఖాలు పూరించి, వీణా వేణు మృదంగాది వాద్య‌ముల‌తో కైలాస ప‌ర్వ‌త‌మున‌చ‌టికి త‌ర‌లింప‌చేసికొన‌గ‌ల్గినారు.

ఆల‌య‌మింత ప‌ట్ట‌రాని ప‌ర‌మ సంతసాన తెలియాడుచుండ‌గా ఆ మహావైభ‌వమును తిల‌కించ‌క విష్ణ్వాల‌య ప్రాకార‌ములోప‌ల ఇరువురు వ్య‌క్తులు గ‌జ‌కేస‌రుల‌వ‌లె ఢీకొని తీక్ష్ణ దృక్కుల‌ను బ‌రుపుతూ ఒక‌రినొక‌రు జయింప‌వ‌లెన‌నే గాఢ‌కాంక్ష‌తో పోరుస‌ల్పుచున్నారు. క‌త్తులు క‌ల‌సిన‌దే కాన‌రావ‌డ‌ము లేదు వాని మెరుపులు త‌ప్ప‌. క‌ర‌వాల‌ముల నుండి త‌టిల్లు త‌టిల్లు మ‌ని విస్ఫులింగ‌ములు రాలుచున్న‌వి. ఖ‌ణిల్లు ఖ‌ణిల్లు మ‌న్న శ‌బ్ద‌ముల‌తో తాండ‌వ నృత్య సుంద‌రుడు ప‌ర‌మ శివ‌మూర్తి గ‌జ్జెల రుద్ర‌ల‌య‌లు నిన‌దిస్తూ ఉన్న‌వి.

ఇరువురుర్నూ స‌మ ఉజ్జీలే, గెలుపెవ‌రిదో నిర్ణ‌యించుకోలేని ధ్వ‌జ‌స్తంభారోహి గ‌రుడుడు తెల్ల‌బోయి చూస్తూ ఉన్నాడు. అలుపెరుగ‌ని మ‌హోత్సాహంతో త‌మంత వీరుల‌ను క‌నుగొన్న ఆనందాతిరేకాంతోవ‌ల‌యాలు తిరుగుతూ త‌మ‌దే పై చేయి కావాల‌ని మ‌హాప్ర‌య‌త్నం చేసేటంత‌లో ఇరువురి క‌త్తులూ ఒక్క‌మారే వ్ర‌య్య‌లైన‌వి. రెండ‌వ వీరుడు మ‌ల్ల‌యుద్ధ‌ము ప్రారంభింప‌బోయి తొడ‌లు చ‌ర‌చి హూంక‌రించి మొద‌టి వీరుని రెండుచేతులూ బంధించ‌బోయెను. వెంట‌నే ఆత‌డు వాని చేతుల నుండి మెత్త‌గా చ‌ల్ల‌గా స‌ర్ప‌ములా క్రిందికి జారి మెర‌పులా ఆ తావునుండి శ‌ర‌వేగాన త‌ప్పుకొనినాడు.

వ్ర‌య్య‌లైన క‌ర‌వాల‌ముల‌ను ప‌రికిస్తూ ఉన్న రెండ‌వ వీరునిలో ఇది అది అన‌రాని తీయ‌ని స్పంద‌న చెల‌రేగిన‌ది. ఏదియో తెలియ‌ని భావోద్వేగ‌ము. ఎద‌లో వింత స‌వ్వ‌డి ! ఇంత‌టి శౌర్య‌మును ప్ర‌ద‌ర్శించిన ఆ నూత‌నుడు ఇంత‌లో మాయ‌మైన‌దెందుకో ?
ఇంత‌కూ తాను గ‌ణ‌ప‌తిదేవ చ‌క్ర‌వ‌ర్తుల‌ను దూషించ‌లేదు. చ‌క్రవ‌ర్తులు వృద్ధాప్యం చేత స‌రిగా ప‌రిపాలింప‌లేక‌పోవుచున్నార‌ని నాడు అంటే. దానికే అత‌డు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించి మ‌ధ్య‌లోనే త‌ప్పు కొన్నాడు. ఎంతైనా గొప్ప స్వామిభ‌క్తుడు. ఆకృతి కూడ వింత‌గానే ఉన్న‌ది. కోపంతో క‌న్నులు ఎఱ్ఱ తామ‌ర పూరేకులై త‌ళుకుమ‌నుతున్న‌వి. పాల్గారు ప‌సిడి బుగ్గ‌ల‌ప‌సిమి మిస‌మిస‌ల ప‌రిమ‌ళాల గ‌మ‌గుమ‌లు సుగంధ ద్ర‌వ్యాల‌తో మైపూత పూసి కొన్నాడు కాబోలు. పురుషాకృతి, స్త్రీ చిత్త‌వృత్తి. కాదు కాదు ల‌లితాకృతి పౌరుష ప్ర‌వృత్తిన్నీ.

ఎది ఏమైనా అవ‌క్ర ప‌రాక్ర‌మెపేతుడైన నిర‌వ‌ద్య పురాధీశ్వ‌రుడైన చాళుక్య వీర‌భ‌ద్రుని అర‌ఘ‌డియ‌సేపు క‌త్తితో నిలువ‌రించ గ‌ల్గిన వీరుడీత‌డొక్క‌డే. పాల‌పిట్ట‌వంటి, లేడి కూన‌వంటి, బంతిపూవువంటి బాలుడు త‌న‌ను గెలిచే ప్ర‌య‌త్న‌ము చేయ‌డ‌మా ?  అని చింతిస్తూ దేవ‌ళంలోనికి అడుగిడినాడు. క‌ళ్యాణ ఛాయా సోమేశ్వ‌రుల‌కు క‌పురంపుటార‌తుల‌ద్ది గ‌ణ‌ప‌తిదేవ సార్వ‌బౌముల‌కు వేదాశీర్వ‌చ‌న‌ముల నొస‌గుచుండిరి. సార్వ‌భౌములు క‌నులు మూసుకొని శిర‌సావానిన‌వ‌ధ‌రిస్తూ ఉండిరి.

చ‌క్ర‌వ‌ర్తుల చెంత మ‌హాలావ‌ణ్య సేవ‌ధి స‌క‌ల సౌంద‌ర్య నిధి, సుధావారాసి, పారిజాత కుసుమంపురాసి పూచిన‌క‌దంబ వృక్ష‌మువ‌లె చిరున‌వ్వుల దివ్య‌తేజ‌స్సుల‌ను వేలార్చుతూ ఉన్న సుంద‌ర సుకుమార సుర‌చిర రూప‌లావ‌ణ్య‌మూర్తి, మ‌ద‌న విముక్త పుష్ప‌బాణ‌ముల‌వ‌లె కానుపించిన‌ది. చాళుక్య వీర‌భ‌ద్ర నృపాలు డామెపైనుండి క‌నులు మ‌ర‌ల్చుకొన‌లేక పోయినాడు. ఆమె యువ‌రాణి రుద్ర‌మ‌దేవి. చాళుక్య నృప‌తిపై ఆమె క‌నులొక్క క్ష‌ణ‌ము వ్రాలిన‌వి. అటు నుండి సోమేశ్వ‌రుని గాంచి సార్వ‌భౌముల ప‌ద‌ముల క‌డ నాగిపోయిన‌వి.

తూర్పు చాళుక్య‌ల రాజ్య ప్రాభ‌వ‌మంతరించి పోతూ ఉండ‌గా తొల‌కిర మెరుపువ‌లె ఆశాజ్యోతిగ ఒక్క వీర‌భ‌ద్ర‌దేవుడు ప్రాభ‌వంలోనికి వ‌స్తూ ఉన్నాడు. అత‌ని ప‌రాక్ర‌మం కాక‌తీయ సార్వ‌భౌముల‌ను కూడ ఆక‌ర్షించిన‌ది. ఛాయా సోమేశ్వ‌రుల క‌ళ్యాణ స‌మ‌యాన గ‌ణ‌ప‌తి సార్వ‌భౌములాత‌నిని పుత్ర‌వాత్స‌ల్యంతో ఆద‌రించినారు. ఇంత‌లో ద్వంద్వ యుద్ధ‌ము చేయ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. ఆ వీరుని స్వామి భ‌క్తిని మ‌రొక్క‌సారి చాళుక్య నృపాలుడు మ‌దిలో త‌లంచుకొని అత‌నికై న‌లుమూల‌లూ దృష్ట‌ని సారించినాడు.


ఆనాటి సాయంత్ర‌ము చాళుక్య ప్ర‌భువు నిర‌వ‌ద్య‌పురానికీ త‌ర‌లిపోవ‌ల‌సిన‌దే కాని ఉద‌య‌ము త‌న‌తో యుద్ధ‌ము చేసిన యువ‌కుని మ‌రొక్క‌సారి చూడ‌వ‌లెన‌నే కోరిక‌తో ఆగిపోయాడు. సేవ‌కుల‌చేత వెద‌కించినాడు తానున్నూ వెదికినాడు. ఇంత‌లో సార్వ‌భౌములు మోటుప‌ల్లి వీర‌భ‌ద్ర‌స్వామిని ద‌ర్శించుకొనేందుకు వెళ్తూ చాశుక్య‌వీర భ‌ద్రున‌కు కూడా ఆహ్వాన‌మంద‌జేసినారు.

మోటుప‌ల్లిలో స‌ముద్ర తీరాన విహ‌రిస్తూ ఉన్న వీర‌భ‌ద్ర నృప‌తి యోచ‌న‌ల‌కు రూప‌ము వ‌చ్చిన‌ట్లుగ ఎదుట ఆ వీర‌యువ‌కుడు వ‌చ్చి నిల‌చినాడు. ఆత‌నిని చూడ‌గానే వీర‌భ‌ద్రున‌కు ప‌ర‌మానంద‌మైన‌ది. ఓయీ యువ‌కుడా నీకొర‌కే చూస్తున్నాన‌య్యా నీకు క‌త్తి యుద్ధ‌మేగాని మ‌ల్ల‌యుద్ధ‌మురాదా అని ప్ర‌శ్నించినాడు. ఆ యువ‌కుడు రాద‌ని న‌ట్లుగ త‌ల ఊపెను.

ఏమీ నీకు మాట‌లు కూడ వ‌చ్చిన‌ట్లు లేవే మ‌ర‌ల ఆ యువ‌కుడు త‌ల‌న‌డ్డ‌ముగా ఊపినాడు.

చూడు క‌త్తి యుద్ధం, ఖ‌డ్గ యుద్ధం ఎత్తుకు పై ఎత్తులు ఇన్ని విద్య‌లు వ‌చ్చిన‌వి క‌దా ద్వంద్వ‌యుద్ధ‌ము చేయాలనంటే అన్ని విధాల‌యిన యుద్ధాలూ రావాలి క‌దా ! నీకు విద్య నేర్పిన గురువెవ్వ‌రోగాని ఇంత చిన్న విష‌యాన్ని విస్మ‌రించినాడే...నేను నీకు ఆ మ‌ల్ల‌యుద్ధాన్ని నేర్ప‌నా...! అని ప్ర‌శ్నిస్తూ చాళుక్య వీర‌భ‌ద్ర నృపాలుడా యువ‌కుని రెండుచేతులూ ప‌ట్టి ఎలా మొద‌లుప‌ట్టుప‌ట్టాల‌నో నేర్ప‌బోయినాడు. ఆయువ‌కుడు మ‌ర‌లా స‌ర్ప‌మ‌లాజారిపోబోయే స‌మ‌యాన వాని శిర‌స్త్రాణ‌ము ఊడి క్రింద ప‌డిన‌ది. దానిని స‌ముద్రుడు లోనికి లాగుకొని మ‌ర‌ల విస‌ర‌మోతున్నాడు. చాళుక్య వీరభ‌ద్రుడు నిశ్చేష్టులుడాయెను. ఆక‌సాన ఉద‌యించ వ‌ల‌సిన చంద్ర‌బింబ మీ యువ‌కుని మోమున ఉద‌యించిన‌ది స‌రే. చంద్ర‌ద‌ర్శ‌నాన్ని కోరి క‌లువ‌లీ క‌నుల‌నాసించిన‌వీ స‌రే, నిండు జాబిల్లిని మోయ‌లేని మేఘ‌మాలిక‌లిత‌ని వెన్నునంటిపెట్టుకొన్న‌వా ?  పురుషున‌కింత ఒంపైన కేశ‌భార‌మా...ఆ క‌నులు అలు భారాన ఒదిగిపోతూ ఉన్న‌వి. ఈ క‌నులు ?  ఈ కుర‌లు ?  ఈమె యువ‌రాణి రుద్ర‌దేవి క‌దూ తెల్ల‌బోయిన చాళుక్య నృప‌తి స‌ముద్రుడు విస‌రిన శిర‌స్త్రాణ‌మును చేత‌బ‌ట్టుకొని నిల‌చినాడు.

ఇంత‌లో ఇరువురు సైనికులు వ‌చ్చి ప్ర‌భూ రుద్ర‌దేవ ప్ర‌భూ మీరిక్క‌డ ఉన్నారా ?  చ‌క్ర‌వ‌ర్తులు త‌మ కొర‌కు వ్య‌ధ చెందుతున్నారు అని ఆత్ర‌ముగ చెప్పిరి. వీర‌భ‌ద్రుడు ఆశ్చ‌ర్య‌ము నుండి తేరుకొనినాడు. ఈమె రుద్ర‌మ‌దేవి. ఈమెనే సార్వ‌భౌములు రుద్ర‌దేవ ప్ర‌భువ‌ని పేరు పెట్టుకొని పురుషునివ‌లె పెంచుకొన్నారు. ఈ ప్ర‌భువు భావి కాక‌తీయ సామ్రాట్టు. కాదు కాదు సామ్రాజ్ఞి. ఇపుడు నా హృద‌య సామ్రాజ్య చ‌క్ర‌వ‌ర్తిని అయిన‌ది. ఈ నా ప్రేమ‌ను నాలోనే అణ‌చుకొంటాను. లేక‌పోతే రాజ్య‌కాంక్ష చేత నేనీ రుద్ర‌దేవిని వ‌రించాన‌ని లోకులు ఆభాండాలు వేయ‌గ‌ల‌రు. అని నిట్టూర్పుతో అచ‌టి నుండి నిర‌వ‌ద్య‌పురానికి బ‌య‌లుదేరినాడు.

గ‌ణ‌ప‌తిదేవ చ‌క్ర‌వ‌ర్తి కుమ‌ర్తె హృద‌య‌మును గ్ర‌హించి రుద్ర‌మ‌దేవి మ‌న‌స్సును కొల్ల‌గొన్న చాళుక్య వీర భ‌ద్రునికేయిచ్చి అతి వైభ‌వోపేత‌ముగా వారి క‌ళ్యాణ‌ము జ‌రిపించినారు. రుద్ర‌మ‌దేవి తూర్పుచాళుక్యుల కోడ‌ల‌యిన‌ది. ఆమె కొన్ని నాళ్ళు నిర‌వ‌ద్యపురాన మ‌హారాణి భోగ‌ముల‌నుభ‌విస్తూ వినోద‌ముల‌తో కాల‌ము గడుపుతున్న‌ది. మ‌ర‌ల కొన్ని నాళ్లు కాక‌తీయ సామ్రాజ్యాన్ని త‌న భుజ‌స్కందాల‌పై మోసే సామ్రాజ్ఞ‌ఙ అవుతుంది. ఈలాగున సంవ‌త్స‌రాలు జ‌రిగిపోతూ ఉండ‌గా ఆమెను విడ‌చి మ‌న‌లేని వీర‌భ‌ద్రుడు కూడ ఓరుగల్లు న‌గ‌రానికే వ‌చ్చి అచ‌టి నుండియే త‌న సామ్రాజ్య‌మును పాలించుకోంటూ ఉండెను. రుద్ర‌దేవ సార్వ‌భౌముల పాల‌నలో ప్ర‌జ‌లు సుఖ‌శాంతుల‌తో ప్ర‌శాంత‌ముగా నున్నారు. ఆమె తండ్రిగారి పాల‌న‌ను మ‌రపించి వారి పాల‌న‌లోనున్న దోష‌ముల‌కు సైత‌ము తొల‌గించ‌గ‌ల్గిన‌ది.

క్రోది సంవ‌త్స‌రాన గ‌ణ‌ప‌తిదేవ సార్వ‌భౌములు మోటుప‌ల్లి రేవుక‌డ వ్యాపార‌స్థుల నిమిత్త‌మై ధ‌ర్మ‌శాస‌నాన్ని ర‌చించినారేగాని దానిని అమ‌లుప‌రుచ‌లేక‌పోయిరి. అన్య ద్వీప‌ముల నుండి అమూల్య‌మైన అనేక వ‌స్తువుల‌ను గొనివ‌స్తూ, ఇట‌నుండి, ఇట స‌మృద్ధ‌గ‌నున్న శ్రీ‌గంధ‌ము, క‌ప్పుర‌ము, జ‌వ్వాది, ముత్య‌ములు, ప‌గ‌డ‌ములు రాగి, సీస‌ము, మిర‌య‌ములు మొద‌ల‌యిన‌వానిని సీమాంత‌ర‌ముల‌కు గొనిపోయే సాహ‌స‌వంతుల‌యిన వ‌ణిగ్వ‌రుల‌ను రేపు అధికారులు అనేక విధాల హింసిస్తూ ధ‌న‌మున‌కై వారిని పీడిస్తూ ఉన్న‌ది గ్ర‌హించి రుద్ర‌దేవ మ‌హారాణి స‌త్వ‌ర‌మైన మార్పుల‌ను చేసిన‌ది. అచ‌టి అధికారులంద‌రినీ తీసివేసిన‌ది. తండ్రిగారు నియ‌మించిన సిద్ధ‌య‌దేవ మ‌హారాజును తొల‌గిస్తూ నాన్న‌గారూ నేను మీ అధికారాన్ని కాద‌ని , అధికార ప‌రిధుల‌ను దాటుతూ ఉన్నానా ? అని వ‌గ‌చిన‌ది.

రుద్ర‌ప్ర‌భూ ! సిద్ధ‌య‌దేవుడు స్వామి భ‌క్తుడు, ధ‌ర్మ‌బ‌ద్ధుడు అయితేయేం ? అస‌మ‌ర్థుడు అని నీవు స్వ‌యంగా తెలుసుకొన్నావు క‌దా ! ప‌టిష్ఠ‌మైన పాల‌న‌లో ఆస‌మ‌ర్ధుల‌కు తావు ఈయ‌వ‌ద్ద‌మ్మా. ఈత‌డు మంచివాడ‌ని నీవు సంశ‌యించ‌కు, అవ‌స‌ర‌మైతే క‌ర‌కుగానే ఉండాత‌ల్లీ అని అనున‌యించినాడు. ఆనాటి నుండి రుద్ర‌దేవ ప్ర‌భువుల వారు చ‌క్క‌ని నిర్ధిష‌మైన ప్ర‌భుత‌తో ప్ర‌జ‌ల‌ను చల్ల‌గా కాపాడుతూ ఉండిరి.

రుద్ర‌మ‌దేవికి ప‌ట్టాభిషేక‌ము చేసిన‌నాటి నుంచి ఆమె సార్వ‌భౌమ‌జ్ఞ‌త్వ‌మున‌కు త‌లవంచ‌లేని సామంత‌రాజులు కొంద‌రు ఆమెను సింహాస‌న‌ము నుండి తొల‌టించ‌వ‌లెన‌ని కుట్ర‌లు ప‌న్నుతూ ఉండిరి. చారులు తెచ్చిన వార్త‌లు రుద్ర‌దేవ ప్ర‌భువు తండ్రిగారితోనూ, శివ‌దేవ‌యామాత్యుల‌తోనూ క‌లిసి చ‌ర్చిస్తూ ఉండిరి. రుద్ర‌మ‌దేవి పేరును రుద్ర‌దేవ ప్ర‌భువు అని మార్చినంత మాత్రాన స్త్రీ పురుషుడుగా మారునా అని విమ‌ర్శ‌లు రేగుతున్న‌వి. వీనిని మ‌న‌ము ముందే ఊహించాము కాదా అమాత్యా అని గ‌ణ‌ప‌తిదేవులు ప‌లికినాడు.

ఏ దేశ చ‌రిత్ర‌లోనూ ఈలాగున స్త్రీ ముర్గాభిష‌క్త‌యై కుటాని ధ‌రించి రాజ్య మేలిన నిద‌ర్శ‌నాలు వారికి అగుపించ‌టం లేద‌ట ప్ర‌భూ అని శివ‌దేవ‌యా మాత్యులు విన్న‌వించుగొనినారు.

నాన్న‌గారూ రాజ్య‌ము వీర‌భోజ్య‌మ‌ట ! ఏ వీరుడు ఈ రాజ్యాన్ని కైవ‌సం చేసుకొని వీర‌భోజ్యం చేసికొంటారో వానిని ముందుకు రానీయండి అని హేల‌న‌గా న‌వ్వి  ఈ రుద్రుడును అబ‌ల‌గా భావించ‌కండి. పౌరుష‌హీనులే ఇలా వ్య‌ర్థ డంబాలు ప‌లుకుతారు అన్న‌ది.

మహారాణి శ‌త్ర‌వుల బ‌లాన్ని త‌క్కువ‌గా గ‌ణించ‌వ‌ద్దు. ఈ సామంతుల‌ను మ‌న‌ము విడివిడిగ జయించ‌గ‌ల‌మేగాని అతా ఏక‌మైవ‌స్తే విజ‌యం క‌ష్ట‌సాధ్య‌మే. అని శివ‌దేవ‌య్య మంత్రి త‌న అభిప్రాయ‌మును వ్య‌క్త‌ప‌ర‌చినాడు. రుద్ర‌మ ఏక్ష‌ణాన ఎవ‌రు దండు వెడ‌లుతారో అని అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ది.

రాజ్య‌ము ప్ర‌శాంతముగ‌నున్న‌ది. ప్ర‌జ‌ల నృత్య‌గీతాది క‌ళ‌ల‌ను పోషించుకుంటూ ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన నిశ్చింత‌తో కాల‌ము గుడుపుతున్న త‌రుణంలో అపార‌సేన‌తో హ‌రిహ‌ర మురారి దేవులు అనుమ‌కొండ‌పై విరుచుకొని ప‌డినారు. కాకతీయ‌సేన యుద్ధ స‌న్న‌ద్ధంగానే ఉన్న‌ది. రుద్ర‌దేవ ప్ర‌భువు త‌మ‌కు నాయ‌కత్వం వ‌హిస్తార‌నే సంబ‌రంలో వీరులు ప‌ర‌మోత్సాహంగా ర‌ణ‌భూమికి త‌ర‌లిపో సంసిద్ధులైనారు. క‌వచాన్ని ధ‌రిస్తున్న గ‌ణ‌ప‌తిదేవ చ‌క్ర‌వ‌ర్తుల‌ను మ‌హా సామ్రాజ్ఞి రుద్ర‌మ వారించిన‌ది.

నాన్న‌గారూ ఈ ముదిమి వ‌య‌సులో మీ చేత క‌త్తిని ప‌ట్టిస్తాన‌నుకొన్నారా ? ల‌ఏక మీ కుమార్తె ప‌రాక్ర‌మాన్ని మీరే శంకిస్తున్నారా.

త‌ల్లీ నిన్ను పుత్రునిగానే పెంచాను క‌ద‌మ్మా. ఈ నా బిడ్డ ఏ వీరున‌కూ తీసి పోద‌ని నాకు తెలుసున‌మ్మా. కాని నాకూ యుద్ధంలో...నా కుమార్తె నాయ‌క‌త్వం క్రింద పాల్గొనాల‌నే కోరిక‌గా ఉంద‌మ్మా.

నాన్నాగారూ అమాత్యుల‌తో క‌ల‌సి మీరు కోట బురుజుల మీద నుండి యుధ్దాన్ని తిల‌కించే శ్ర‌మ మాత్రం ప‌డ‌క త‌ప్ప‌దు. ఒక్క రెండు ఘ‌డియ‌లు చాలునండి.