స‌త్య‌నిర్ణ‌యం

తాము స‌త్య‌వంతుల‌మ‌ని అమాయ‌కుల్ని న‌మ్మించి, త‌డిబ‌ట్ట‌తో గొంతులు కోసే వాళ్ళుంటారు. త‌స్మాత్ జాగ్ర‌త్త !

క్లాసంతా గ‌ల‌భాగా వుంది. మాష్టారింకా రాలేదేమిటి ?  పిల్ల‌ల ఆత్రం రారేమో ?  రాక‌పోతే హాయిగా ఇంటికి వెళ్ళిపోవ‌చ్చ‌నే ఉబ‌లాటంతో వున్నారు. కొంద‌రు బ‌య‌టికి వెళ్ళి చూడ్డం మొద‌లు పెట్టారు.

వెళ్ళిన వాళ్ళంతా గ‌బ‌గ‌బా క్లాసుకి తిరిగి వ‌స్తూండ‌డంచూసి కూర్చుని గోల‌చేస్తున్న వాళ్ళంతా మాష్టారు వ‌చ్చేస్తుండ‌చ్చు అనుకుని బుద్దిమంతుల్లాగా పుస్త‌కాల‌కేసి చూస్తూ చ‌దువుతున్న‌ట్లు న‌టిస్తున్నారు.

వ‌చ్చేశారు. వ‌చ్చేశారు. గుస‌గుస అంతా నిశ్శ‌బ్ధం. అటెండెన్స్ ప్లీజ్‌. నెక్ట్స్‌.

ఒరేయ్ ర‌మ‌ణా హోమ్‌వ‌ర్క్ బుక్ ప‌ట్రా. చేశావా ?  ర‌మ‌ణ వొణుక్కుంటూ నోట్సు తీసికెళ్ళాడు. ఇదినీ ద‌స్తూరీ కాదు. అవునా ?  ర‌మ‌ణ చెవుల్లో పిడుగులు పడ్డాయ్‌. అమాయ‌కంగా లేత త‌మ‌ల‌పాకులా వున్న ర‌మ‌ణ మొహం భ‌యంతో న‌ల్ల‌బ‌డిపోయింఇ. త‌ర్వాత మేఘాలుగ‌ర్జించాయో, మాష్టారు యేమ‌న్నా అంటున్నారో ర‌మ‌ణ‌కి తెలీలేదు. అస‌లు చెయ్య‌క‌పోయినా ప‌ర‌వాలేదుగానీ, ఎవ‌రి చేతో చేయించి నువ్వే చేసిన‌ట్లు తీసుకొస్తావురా, దొంగ‌వెధ‌వా. చూడు తాట వ‌లిచేస్తాను. స‌త్యం మాష్టారంటే, మజాకా అనుకున్నావేమో, నాదగ్గ‌ర అబద్దాలాడి ఏ వెధ‌వా త‌ప్పించుకోలేడు. వేలెడు లేవు. ఇప్ప‌ట్నించీ నీకు అబ‌ద్ధాలు, మోసాలూ ఊ చెయ్యిచాపు. ఒక‌టీ...మూడూ స్కేలు ప్ర‌సాదించిన దెబ్బ‌ల‌తో లేత గులాబీలా వున్న ర‌మ‌ణ అర‌చెయ్యి ఎఱ్ఱ‌గా ముద్ద‌మందారంలా మారింది.

గుడ్ల నీళ్ళుకుక్కుకుంటూ వ‌చ్చే ఎక్కిళ్ళ‌ను బ‌ల‌వంతాన ఆపుకుంటూ వెళ్ళి బెంచీమీద కూర్చున్నాడు. చొక్కాతో క‌ళ్ళు, ముక్కూ తుడుచుకుని, త‌నే రాసినా నిజం చెప్పి ఒప్పించ‌లేక శిక్ష అనుభ‌వించాడు ర‌మ‌ణ‌. స‌త్యం మాష్టారింకా ఆవేశంగానే వున్నారు. ఒరేయ్ అస‌లుమీకు ముందు నేర్ప‌వ‌ల‌సింది చ‌దువు కాదురా, మంచి న‌డ‌వ‌డి. జీవితంలో స‌త్యానికి ఎక్కువ ప్రాధాన్య‌త నివ్వాలి. స‌త్యం అంటే ఏమిటి ?  నిజం సార్‌. ఎన్నో గొంతుక‌లు. నిజం అంటే ?  అబ‌ద్ధంకాని దంతా నిజం కిందికే వ‌స్తుంది. అస‌లు అబ‌ద్ధ‌మంటే ?  అ బ‌ద్ధం క‌ట్టుబ‌డ‌నిది. దేని చేత ? నిజం చేత అంటే నిజం చేత క‌ట్టుబ‌డ‌నిది అంతా అబ‌ద్ధ‌మే. మ‌న పూర్వీకులు స‌త్యం శివం సుద‌రం అన్నారు. స‌త్యాన్ని ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపంగా చెప్పారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా స‌త్య‌వాక్య ప‌రిపాల‌న చేసిన హరిశ్చంద్రుణ్ణి మ‌నం ఆద‌ర్శంగా పెట్టుకోవాలి. అబ‌ద్ధం చెప్పాలంటే ప్రాణం పోతున్నంత బాధ క‌ల‌గాలి. ప్రాణం పోతున్నా స‌త్య‌మే చెప్పాలి. ఈనాటి నుంచీ మీరెవ్వ‌రూ అబ‌ద్ధం చెప్ప‌రాదు. చెప్పిన‌ట్లు తెలిసిందో నాలుక చీరేస్తా.

స‌త్యం మాష్టారి క్లాసుకొంచెం అటూ, ఇటూగా రోజూ ఇలాగే వుంటుంది. మూడొంతుల టైమ్ పిల్ల‌ల‌కి స‌త్య‌వాక్య ప‌రిపాల‌న గురించే బోధిస్తారు. అందుకే హెడ్‌మాష్టారి ద‌గ్గ‌ర్నించి ఊళ్ళో పెద్ద‌లంద‌రికీ ఆయ‌నంటే త‌గ‌ని గౌర‌వం. ఎవ‌రితో మాట్లాడినా, స‌త్యం. స‌త్యం అంటూ స‌త్యజ‌పం చేస్తూ ఉంటారు. అందుకే ఆయ‌న ఆస‌లు పేరు రామారావ‌యినా స‌త్యం మాష్టార‌నే వాడుక‌యిపోయింది. రామారావుగారంటే ఆయ‌న చుట్టుప‌క్క‌ల వాళ్ళ‌కూడా యెవ‌రో మాకు తెలీదంటారు. అంతలా ఆయ‌న‌కి ఖ్యాతి వ్యాపించిపోయింది. స‌త్యం మాష్టార‌ని పిలిపించుకోవ‌డం ఆయ‌న‌కెంతో యిష్టం కూడాను. జ‌న్మ ధ‌న్య‌మ‌యిన‌ట్లే భావిస్తారు.

ఏమేవ్ జాన‌కీ టిఫినేదైనా వుందా ?  లేదా ?

ఇంటికొస్తూనే ఏమిటా గావు కేక‌లు. ఇదేం స్కూలనుకున్నారా ఒక్క క‌సురుతో పులిలాంటి మాష్టార్ని పిల్లిలా మార్చేసిన ఘ‌న‌త ద‌క్కించుకుంది స‌త్యం మాష్టారి స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి జాన‌కి. దొడ్లో ఏదో యుద్ధం జ‌రుగుతున్న సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. కొంగు దోపుకుని  ర‌య్యిన వీర‌నారిలా వెళ్ళింది జాన‌కి. నీ అబ‌ద్ధాలు మండిపోనూ. తిని లేదంటావేమే. మొన్న మా సీత పుట్టిన రోజున స్టీలు గిన్నెతో సాయసం ఇవ్వ‌లేదుటే ?

నా నెర‌గ‌న‌మ్మ‌గారు మీ పాయసం తిన్న‌దాన్నైతే నా పాపం నేనే అనుబగిస్తాను.

నీ పాపంతో, పుణ్యంతో నాకు ప‌నిలేదు . నా స్టీలుగిన్నె తెస్తేనే ప‌నిలోకిరా. లేక‌పోతే లేదు.

రంగి ల‌బ్బున గోల‌ప‌ట్టింది. కానాడు పాయ‌సం కూడా యివ్వ‌లేదు. ఇంట్లోనే ఏమూలో వుంటుంది. స‌రిగా యెత‌కండి.

ఎంత వొళ్ళు పొగ‌రు గిన్నె తీస్కెళ్ళి లేదంటానికి ?  జాన‌కి విసురు.

ఇదిగో ఎవ‌మ్మో పొగ‌రు గిగ‌రు అన‌మాక నీ గిన్నె నాకాడ‌లేదు. ఇష్ట‌మైతే ప‌ని చేయించుకోగాని దొంగ‌త‌నం అంట‌క‌డితే ప‌డేదిలేదు. దోపిన‌కొంగు విసురుగా బ‌య‌టికి లాగి ఒక్క దులుపుదులిపి ప‌క్కింటి ప‌న్లోకి పోయిందిరంగి. ముందు వేపుకి జాన‌క‌మ్మ వెళ్ళి పిలిచింది  కామాక్షీ ! క‌మ‌లా ! అంటూ. చూశావా రంగిముండ పొగ‌రు.

మొద్దులాంటి స్టీలు గిన్నె తీసికెళ్ళి లేద‌ని ద‌బాయిస్తోంది.

అవును మేమూ విన్నాం మీ మాట‌లు కామాక్షి అంది.

ఇల్లంతా వెతికావా వ‌దినా క‌మ‌ల సంశ‌యంగా అంది.

భ‌లే దానివి నేనంత ఒళ్లూపై తెలీనిదాన్ని కాదు. క‌మ‌ల‌మీద విసురు విసిరింది. క‌మ‌ల ఆజాగ్ర‌త్త‌గా వుంటుంది. త‌న్నిప‌రోక్షంగా అంట‌మే అని క‌మ‌ల చిన్న‌బుచ్చుకుంది.

ఏమైనా దానిచేత ప‌ని చేయించుకుంటే వెయ్యిక‌ళ్ళ‌తో మీ సామాన్లు కాపాడుకోండి ఉచిత స‌ల‌హా పారేసి వెళ్ళి పోయింది జాన‌కి.

నిజ‌మేనంటావా కామాక్షీ  క‌మ‌ల అనుమానం వెలిబుచ్చింది.

ఎంత పిచ్చిదానివి క‌దూ ?  జాన‌క‌మ్మొదిన హాస్యానికి కూడా అబ‌ద్ధ‌మాడ‌దుట‌. ఎప్పుడైనా త‌మాషాకి చిన్న అస‌త్యం చెప్పినా వొళ్ళంతా మంట‌లెత్తుతుంద‌ట‌. మాష్టారు స‌రేస‌రి. స‌త్యానికి మారుపేరు. ఇదంతా వాళ్ళ ఇల‌వేలుపైన స‌త్య‌నారాయ‌ణుడి మ‌హ‌త్యం.

స‌రేలే. వాళ్ళ స‌త్యాల‌తో మ‌న‌కేం ప‌నిగాని రంగిని మానిపిస్తే అంత శుభ్రంగా చేసే మ‌నిషి మ‌ళ్ళీ కుదురుతుందా ?  నీకు ప‌ర‌వాలేదు. మీ పిల్ల‌లు సాయం చేస్తారు. నేను చిన్న పిల్ల‌ల‌తో చేసుకోలేను. క‌మ‌ల రంగిని మాన్పించ‌డం ఇష్టంలేన‌ట్లే మాట్లాడింది. అయినా స‌రే త‌ప్ప‌దు క‌మ‌లా. దొంగ దాన్ని ఇంట్లో వుంచుకుంటామా ?  వెన‌క‌టి కెవ‌డో దొంగ‌కి తాళాలిచ్చాట్ట‌.

మూడిళ్ళ‌ల్లో ప‌నీ వొక్క‌సారి పోగొట్టుకుని పొట్ట‌గ‌డిచే మార్గం క‌న‌ప‌డ‌క వుసూరుమంటూ శాప‌నార్థాలు పెడుతోంది రంగి. క‌మ‌ల‌కి రంగిని చూస్తే జాలేసింది. దాని క‌ళ్ళ‌లో అమాయ‌క‌త్వం, నిర్ధోషిత్వ‌మూ వున్నాయ‌నుకుంది.

గిన్నేకాజేస్తే ప‌న్లోంచి తీసేస్తార‌ని దానికి తెలీదా ?  తెలిసీ దానిపొట్ట అదే కొట్టుకుంటుందా ? త‌ను డ‌బ్బులు ఎక్క‌డ ప‌డితే అక్క‌డేపెట్టి మ‌ర్చిపోతూంటుంది. ఇల్లూడుస్తూంటే రోజూ దానికి ఎంతో కొంత డ‌బ్బు దొర‌కాల్సిందే. ఏంట‌మ్మగోరూ ల‌చ్మిని ల‌చ్యం లేకుండా ఏడ‌ప‌డితే ఆడ ప‌డేస్తారు అంటూ నవ్వుతూ తెచ్చిచ్చేది. ఏమైనా. ఏది నిజం ?  ఏది అబ‌ద్ధం ? అనేది తేల్చ‌డం చాలా క‌ష్టం. అందుకు సంబంధించిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కే స‌త్యం తెలుస్తుంది. అయినా ఎవ‌రి వాద‌న‌ను వాళ్ళు సాగిస్తారుగాని లొంగిపోరు. స‌త్య నిర్ణ‌యం భ‌గ‌వంతుడే చెయ్యాలి. రంగికి కొత్త ప‌ని దొర‌క‌టం క‌ష్టం. అందులో దొంగ అని ముద్ర‌ప‌డిందిక‌దా ! తాగుబోతు మొగుడితో ఆరుగురు పిల్ల‌ల్నెలా సాకుతుందో ! ఎవ‌రూ చూడ‌కుండా ప‌ది రూపాయ‌లు రంగి చేతిలో పెట్టింది క‌మ‌ల‌.


క‌మ‌లా స‌త్యం మాష్టారు మొన్న వంద రూపాయ‌లు తీసుకున్నార‌ని  చెప్పాక‌దూ ?  శేఖ‌ర్ ర‌హ‌స్యంగా అడిగాడు. అవునండీ చెప్పిన‌ట్లేవున్నారు. కాఫీ అందిస్తూ అంది. ఇవాళ ఫ‌స్టు గ‌దా . ఇదుగో శేఖ‌ర్ మొన్న నీ ద‌గ్గ‌ర తీసుకున్న ఏభై రూపాయ‌లూ  అంటూ ఏభై రూపాయ‌ల‌నోటు చేతులో పెట్టారు. అన్నాడు కాఫీ సిప్ చేస్తూ.

ఏవిటీ స‌త్యం మాష్టారే ? అస‌లే పెద్ద‌వైన క‌ళ్ళ‌ను ఆశ్చ‌ర్యంతో మ‌రింత పెద్ద‌వి చేస్తూ అంది క‌మ‌ల‌. ఊరుకో క‌మ‌లా మెవ‌రితోనూ అన‌కు. నాకు పూర్తిగా గుర్తులేదు. ఏభ‌య్యే ఇచ్చి వంద యిచ్చాన‌నుకున్నానేమో ?

స‌త్యం మేష్టారు అబ‌ద్ధం ఆడ‌తారా ఈ మ‌ధ్య మీకు మ‌తిమ‌రుపు ఎక్కువౌతోంది అంది క‌మ‌ల‌.

నిజం నిజం స‌త్యం మాష్టారినోట అస‌త్యం చెప్పిస్తే ప‌దివేలిస్తాన‌ని వెన‌క‌టికెవ‌రో పందెం కాసారుట అన్నాడు శేఖ‌ర్‌.
నేను మాత్రం కాదు బాబూ. క‌మ‌ల హాస్యంగా అన‌డంతో ముక్కుప‌ట్టి లాగాడు శేఖ‌ర్ నాకు బోల్డంత‌ప‌నుందిబాబూ. రంగి మానేసింది. అంట్లు కూడా తోముకోవాలి. మీతో భేటీ వేసుకునేందుకు నాకు తీరిక లేదు అంది.

అదేం రంగి ఎందుకు మానేసింది. ఎంతోమంచిది నిల‌క‌డ‌గాచేస్తుంది. అన్నావుగదా అన్నాడు శేఖ‌ర్‌. క‌థంతా చెప్పింది. ఎక్క‌డో ఏదో అర్థ‌మ‌య్యీ కాన‌ట్ల‌నిపించింది శేఖ‌ర్‌కి.

ఆ పెంకుటింట్లో మూడు కాపురాలు. స‌త్యం మాష్టారు జాన‌క‌మ్మ‌. అయిదుగురు సంతానం పెద్ద వాటాలో వుంటున్నారు. కామాక్షీ, విశ్వ‌నాధం వాళ్ళిద్ద‌రు పిల్ల‌లూ ఒక వాటాలో. క‌మ‌లా శేఖ‌ర్ వాళ్ళ ముగ్గురుపిల్ల‌లు చివ‌రి వాటాలో వుంటున్నారు. శేఖ‌ర్ కి బ్యాంకులో వుద్యోగం. ఆ మూడు వాటాల్లోకి ఆర్ధికంగా వున్న‌తంగా వున్నాడు. ఇదీ ఆ యింటి సంగ‌తి. మూడు వాటాల‌వాళ్ళూ స‌ఖ్యంగానే వుంటారు.

క‌మ‌లా, కామాక్షీ యించుమించు ఒకే వ‌య‌సు వాళ్ళ‌వ‌టంచేత మ‌రీ స్నేహంగా, ఆత్మీయంగా వుంటారు. ఇంక పిల్ల‌ల సంగ‌తి చెప్ప‌నే అక్క‌ర్లేదు. బ‌డికెళ్ళిన స‌మ‌యంలో త‌ప్ప మొత్తం ప‌దిమంది పిల్ల‌లూ ఏదో ఓక ఆటో, పాటో, క‌బుర్లో స‌ర‌దాగా వుంటారు.

కామాక్షి జాన‌క‌మ్మ వాటాలోకి వెళ్ళింది. ఇంత‌లోనే క‌మ‌లా వ‌చ్చింది. ఏం చేస్తున్నావు వ‌దినా ?  అంటూ. చూశావా కామాక్షీ రంగి అవ‌త‌ల వీధిలో  సుబ్బ‌మ్మ‌గారింట్లో ప‌నికి కుదిరిందిట‌. ఇందాక పిల్ల‌లు చెపితే వెళ్ళాను.

నీ చాద‌స్తంగాని ఎక్క‌డా ప‌నిలోకి కుద‌ర‌క ఛ‌స్తుందా అంది కామాక్షి.

ఎంత‌యినామ‌న వాళ్లు గ‌దా చూస్తూ చూస్తూ దొంగ దాన్నింట్లోకి పెట్టుకున్నారంటే చెప్ప‌ద్దూ మ‌న‌సు కొట్టుకుపోయింద‌నుకో. అదేం ఖ‌ర్మ‌మోగాని యెవ‌రికైనా అన్యాయం జ‌రిగితే పాడుమ‌న‌సు గిల‌గిల్లాడిపోతుంది. నాకెందుకులే అనుకోబుద్ధ‌వ‌దు. ఉన్న‌మాట చెప్పేశాను. మీ యిష్టం సుబ్బ‌మ్మ‌క్కా. దాన్ని ప‌ని మాన్పించ‌కండి దానినోటికాడ కూడు ప‌డ‌గొట్టిన పాపం నా కెందుకుగాని ఓ కంట క‌నిపెట్టండి అన్నాను. అయినా సుబ్బ‌మ్మ‌క్క విన్లేదు. వెంట‌నే రంగికి ఉద్వాస‌న చెప్పేసింది. ముసి ముసిగా న‌వ్వుతూ చెప్పింది జాన‌కి.

అయ్యో వ‌దినా, ఎంత ప‌నిచేశావు. ఆరుగురిపిల్ల‌ల పొట్ట‌నింప‌లేక‌నేక‌దా పాచిప‌నిచేస్తోంది. ఇలా అరి తెలిస్తే దానికి ప‌నెవ‌రిస్తారు ? క‌మ‌ల బాధ‌గా అంది. జాన‌క‌మ్మ కోపంతో బుస్సుమంది. అబ్బో ఎంత జాలిగుండె. అలాట‌ప్పుడు నువ్వూ ఎందుకు తీసేశావు. క‌మ‌ల తెల్ల‌మొహం వేసింది.

గిన్నె తీసికెళ్ళి లేద‌ని చెపుతోందే ఏ పాపాన పోతుందోగాని, నీలాంటి వాళ్ళ అలుసు చూసుకునే అలా చేస్తారు. క‌మ‌ల కేసి ఛీత్కారంగా చూస్తుండ‌గానే సీత గిన్నె చేత్తో ప‌ట్టుకుని వ‌చ్చింది.

అమ్మా ఈ గిన్నేనా రంగి ఎత్తుకుపోయింద‌న్నావు. కావిడిపెట్లో....మాట పూర్తికాకుండానే జ‌డ‌ప‌ట్టుకుని వంగ‌దీసి వీపు మీద ఒక్క గుద్దు ద‌బీమ‌ని వేసింది. వెధ‌వ‌కానా నీక‌న‌వ‌స‌ర‌మైన‌విలేవు అంటూ యెడా పెడా ఒక తిట్టూ ఒక కొట్టూగా బాత్తూవుంటే కామాక్షి  మెల్ల‌గా యెప్పుడు జారుకుందో. చిన్న‌పిల్ల చ‌చ్చిపోతుంది. నీ అఘాయిత్యంకూలా అంటూ క‌మ‌ల పిల్ల‌నివ‌ల‌త‌కి విడిపించుకు వ‌చ్చింది.