నీ కొలువులో చేరాలని వచ్చాను. ఆడపిల్లలకు నృత్యం నేర్పగలను. నా పేరు బృహన్నల. నేను పేడిని అన్నాడు.
దీర్ఘబాహువులు, వెడల్పైన, ఎత్తెన వక్షస్థలము, కలువల్లాటి కన్నులు, నవ్వు ముఖము, ఉదాత్తమైన వర్ఛస్సు, మన్మధుణ్ణిమించిన అందము, ఇంద్రుణ్ణి మించిన విభవము..ఆహాహా ! ఇన్ని మహోత్తమ లక్షణాలు కలుగచేసిన బ్రహ్మదేవుడు చివరకు నపుంసకుణ్ణిగా చేశాడే ! నా వద్ద గల విల్లులు అన్నిటిలో గొప్ప విల్లోకటి నీకిస్తాను. నీకు గొప్ప రథంకూడా ఇస్తాను. నువ్వు నా రాజ్య విభవానికి రక్షకుడుగా ఉండాలిని కోరిక అని విరాటుడు కోరాడు.
నిజానికి నాకు ఆడుతనంలేదు. పుంస్త్వంఒప్పుతప్పింది. శాపంవల్ల నపుంసక జన్మ సంప్రాప్తించింది. పూర్వం చేసుకొన్న కర్మఫలం అనుభవించకతప్పదు కదా ! అందుచేత పసితనాన్నుంచి కుండలాకార నృత్యము, అభినయ నృత్యము, భాండోపరినృత్యము అభ్యసించాను. వివిధాలైన నృత్యగానాదులలో ప్రావీణ్యం సంపాదించాను. ఎంత జడ స్వరూపాల్లాంటి అమ్మాయిలకైనా ఇన్ని విధాల నాట్యాలున్నూ నేర్పగలను. నీ అంతఃపురంలో నాట్యగురువుగా ఉంటాను అన్నాడు బృహన్నల.
విరాటరాజు కాదనలేకపోయినాడు. పైగా తన కుమార్తె ఉత్తరకు నృత్యం నేర్పించాలని ఆతనికి అభిలాష కలిగింది. తక్షణం ఆమెను రప్పించాడు. ఉత్తర అపురూప సుందరి. నవయౌవనవతి. ఆమెను బృహ్నన్నలకు చూపించాడు. ఆమె నాట్యం నేర్పుగా నేర్వగల చురుకుగలది అని బృహన్నలచేత అనిపించుకొని ఆహ్లాదపడ్డాడు. బృహన్నలకు కర్పూర తాంబూలం, చిత్ర చిత్రాలైన చీనాంబరాలు, మణిమయాలైన అభరణాలు ఇచ్చాడు.
నీ చాతుర్యం అపారం నీకు ప్రత్యేకించి మా అమ్మాయిని అప్పగింతపెట్టక్కర్లేదు. అయినా నా మమకారం వల్ల చెపుతున్నాననుకో ఏమీ అనుకోకు. ఇది నెచ్చెలుల తోటి కలిసి దాని ఇచ్చవచ్చినట్లు, విచ్చలవిడిగా ఆడుకోడం తప్ప ఇంతవరకు క్రమశిక్షణ అంటే ఏమిటో ఎరుగదు. ముక్కుపచ్చలారని పసిపిల్ల ఆటలమీద ధ్యాస ఎక్కువ. దానికి క్రమక్రమంగా కళలయందు ఇష్టం కలిగించి, నయాన నృత్యం నేర్పు. ఇంక ఇక్కణ్ణుంచి దాని బ్రతుకు భారంనీదే అని విరాటరాజు బృహన్నలతో చెప్పాడు. పిమ్మట ఉత్తర హస్తం పట్టుకొని, చిట్టితల్లీ ! వారు నీ గురువు భయభక్తులతో ఉండాలి నువ్వు. గురువు ఎలాగ చెబితే అలాగ నడుచుకోవాలి. నీ గురువుకు కావలసిన భోజనములు, వస్త్రములు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు అన్నీ నువ్వే సమకూర్చాలి. స్నేహితులు, చుట్టాలు, తల్లి తండ్రి, తోడు అన్నీ గురువే. అందుచేత నీకేమీ కొరవలేదన్నమాట. బుద్ధి గౌరవాలతో బ్రతుకమ్మా ! మనింట్లో ఇక్కడ అక్కడ అనే భేదం లేకుండా ఎక్కడబడితే అక్కడికి వెళ్లతగిన మనిషి బృహన్నల. తనకు ఇష్టం వచ్చినట్లుగా వర్తించవచ్చు అన్నాడామెతో. ఈ ప్రకారంగా వారిద్దరు ఒకరినొకరికి అప్పగించి అంతఃపురంలోకి పంపించాడు.
అనంతరం విరాటరాజు తన గుర్రాలను కొలువు ప్రాగణంలోనికి రప్పించాడు. వాటి బాగోగులు అరసి తెలుసుకొన్నాడు. పిదప మరల తన యధాస్థానంలో ఆశీనుడయిన సమయాన నకులుడా సభదరికి వచ్చి ఆ అశ్వాలను అతి పరీక్షగా చూడ ఆరంభించినాడు. విరాటుడు అతణ్ణి చూచాడు.
ఎవరా అబ్బాయి ! ఎంత అందంగా ఉన్నాడు ! అతని ఉదాత్త హృదయం అతని ముఖంలో ఎంత స్పష్టంగా కనిపిస్తోందో గమనించారా ? అతడు అశ్వాన్ని చూస్తున్న విధంలోనే అతడు అశ్వవిద్యానిపుణుడని తెల్లమవుతున్నది. మిక్కిలి పరాక్రమశాలిలా కూడా ఉన్నాడు ! అతని పేరేమిటో మీకెవరికన్నా తెలుసా ? లేకపోతే ఎవరన్నా ఒకరు వెళ్లి కనుక్కుని రండి అని విరాటుడు తన చేరువనున్న వారితో అంటూ ఉన్నసమయంలో నకులుడు విరాటరాజును సమీపించాడు.
స్వామీ ! నీ గుర్రాల సంరక్షకుడుగా పనిచేద్దామని వచ్చాను. నా పేరు దామగ్రంధి. నాక అశ్వవిచక్షణాజ్ఞానం బాగా ఉంది. అశ్వాల అవయవ లక్షణాలు, ఆయః ప్రమాణం ! వయస్సు ప్రసవ విషయములు, దేశ, కలాలకు ఉచితమైన ఆహార
ప్రయోగాలు, మర్మావయువ విషయాలు, జాతికి అనుగుణమైన శిక్షా క్రమము, వ్యాయామము, గుర్రాల విచార సంతోషాలు, పోషణ ప్రకారము, రోగాలకు చికిత్స ఆదిగా గల విషయాలన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు... అంటూండగా విరాటుడాతని మాటకు అడ్డు వచ్చాడు.
నువ్వు అశ్వశిక్షకుడుగా పనిచేస్తావనడం నీకూ నాకూ కూడా బాగాలేదు. నీకు తగిన పదవి ఇస్తాను. నా కోశాధికారిగా ఉండు అన్నాడు.
అయ్యా ! ఎవరి వృత్తివారు చేసుకొని జీవించాలిగాని, తనకు మించిన వృత్తిని చేపట్టవచ్చునా ? ధర్మరాజు నన్ను పెంచి పెద్దజేసి అశ్వశాస్త్రం చెప్పించారు. ఆయన అశ్వశాలను అధిపతిగా నియమించి నన్ను ప్రేమతో చూచాడు. ఇన్ని మాటలెందుకు ! నన్నుతన తమ్ముళ్ళలో ఒకణ్ణిగా చూచుకొన్నాడనుకోండి ! ఆ మహారాజు, పాపం రాజ్య సుఖాలంటే విముఖత్వంతో, బంధువుల్ని విడనాడి ఎక్కడకో వెళ్లిపోయాడు. అప్పటినుంచి నేను పొట్టచేత బట్టుకొని పొట్టకూటికి మార్గం ఏమిటా అని తిరిగి తిరిగి చిట్టచివరకు నీవు ధర్మరాజంత మంచివాడవని విని, నీ సేవ చేసుకొని బ్రతుకుదామని ఇలాగ వచ్చాను. నీ దర్శనం చేసుకొన్నాను. నాకు చేతనైనట్లు విన్నపం చేసుకొన్నాను. నాకు పని ఇప్పించు. అనుమానంగా ఉంటే పొమ్మను పోతాను అన్నాడు, దామగ్రంధి.
సరే ! అబ్బాయి ! గుర్రాలను చూస్తూ ఉంటానంటే నేనేం చేయను ? ఆ పనేచేయి. నీ ఇష్టం నిన్ను నా తురగశాలలన్నింటికీ సర్వాధికారిగా నియమించాను.
అది వరకు నా అశ్వపాలకులంతా నీ క్రింద పనిచేస్తారు, అని విరాటరాజు నకులుణ్ణి తన అశ్వశిక్షకుడుగా నియమించినాడు.
పిమ్మట కొంతసేపటికి సహదేవుడు విరాటుని సభ ప్రవేశించాడు. అతని ముఖంలో శాంతము, నిజాయితీ స్ఫుటంగా అగుపడుతున్నది. బ్రహ్మ మానవ వేషంలో వచ్చాడా, లేక అగ్ని శరీరం దాల్చాడా అన్నట్లుగా ఉన్నాడాతడు.
పశువులను కట్టే పలుపును ఒక భుజం మీద, పెక్కు ముడులుగల పొడవాటి త్రాడు ఒక భుజంమీద ఉన్నవి. పెద్ద త్రాటిని మొలకు అనేక చుట్లుగా చుట్టుకొన్నాడు. గొల్లవాడు పశువులను మేపెడు కోల చేతపుచ్చుకొన్నాడు. భయపడుతూ, సభాసదులను వెర్రి వానిలా చూస్తూ సహదేవుడు విరాటరాజు ఎదుట సవినయంగా నిలబడినాడు.
అయ్యా ! నీ పశువుల కాపరిగా ఉందామని వచ్చాను. నా సంరక్షణలో ఉండే ఆవులకు ఆకలి దప్పికలు, అనారోగ్యాలు ఉండవు ! నీ పశువులు తప్పిపోకుండా, మృగాలు, పురుగులు వాటి జోలికి పోకుండా కాపాడగలను. పాడి తరుగనీయను. నాతోటి గొల్లలూ, మీరూ మెచ్చుకోనేట్లాగ గోగణాల్ని సంరక్షిస్తాను. నాకా ఉద్యోగం ఇప్పించు అని సహదేవుడు ప్రాధేయపడ్డాడు.
ఎక్కడి మాటలివ్వి ? నున్నని నీ శరీరం దాని కాంతి చూస్తే కించిత్తు అయినా గొల్లతనం నీలో మృగ్యం. నువ్వు ఏ సూర్యవంశపు రాజు కొడుకువో, ఏ చంద్రవంశం రాజు కూమారుడవో అనిపిస్తున్నావు ! నా రాజ్యాన్నే నడపగల మనిషిలా ఉంటే, అల్పమైన బ్రతుకు తెరువు కోరుతున్నావేమిటి ? మంచి మంచి వాహనాలు, ఆయుధాలు ఇస్తాను. ఉండడానికి ఒక గొప్ప భవంతి ఇస్తాను. నాకు సైన్యాధికారిగా ఉండు అని విరాటుడనే సరికి సహదేవుడు నమస్కరించాడు.
|