బాబూ ! అల్ప కులస్థుణ్ణి. పైగా పసివాణ్ణి, అనాగరికుణ్ణి. నాగరకపు పనులు నాకేం తెలుస్తాయి. బాబు ! నీవు అలాగ శలవివ్వవద్దు. పశువులను కాచుకొనిగాని బ్రతకలేను. మునుపు కౌరవ రాజ్యంలో ధర్మరాజు పశువుల్ని నేనే కాచేవాడిని. ఆయన నన్నెంతో మెచ్చుకొనేవాడు. తంత్రీపాలుడు అంటారు నన్ను. నాచేతి మేత మేసిన దూడలు వర్థిల్లి చేయెత్తు గోవులవుతాయి. నేను ఎన్నుకొన్న ఆబోతు యొక్క పంచితమును వాసన చూసినా, పైగాలి సోకినా, గొడ్డుకుకూడా చూలు కలుగుతుంది. నాము, ఆముదపాకులను మేయడంవల్ల వచ్చే ఉంగిడి
అనే రోగము, అదురుతిక్క అనే వ్యాధి నా పేరు చెపుతేనె భయపడి పారిపోతాయి. పశువుపోకడలన్నీ తెలుసు. నీకు నావల్ల ఉపయోగం ఉన్నదంటావా, మరోమాట చెప్పక నన్ను పశువుల కాపరిగా నియమించు అన్నాడు తంత్రీపాలుడు.
విరాటరాజు కాదనలేక పోయాడు. నీకు గొప్ప గొప్ప పనులకన్న గోవుల్ని కాయడమే ఇష్టమైతే అలాగే అవశ్యం చేయవచ్చు. మా గోధనానికంతకూ నిన్ను రక్షకుడుగా నియమిస్తున్నాను. మునుపు ఉన్న గొల్ల వాళ్లందరిపూనా ఇక్కణ్ణుంచి నువ్వు అధికారివి. నీకీ పదవి ఇవ్వడం మాకు మేలే అని విరాటుడు సహదేవుణ్ణే తన ముఖ్య గోపాలకుడుగా నియమించాడు.
ఈ విధంగా పాండవులు అయిదుగురు విరాటరాజు కొలువులో ఉద్యోగాలు సంపాదించారు.
ద్రౌపది రాజమందిర బాటను ప్రవేశించినది. ఆమె తన దేశాచార ప్రకారం అల్లుకొన్న జడ విప్పి వేసినది. కుడి ప్రక్కకు కొప్పు పెట్టుకొన్నది. మాసిన కురవ చీర కట్టుకొన్నది. పసుపు కలిసిన తెల్లని వర్ణంగల వస్త్రంతో వక్షస్థలం కప్పుకొన్నది. ఈ ప్రకారంగా సైరంధ్రీ జాతివేషంలో వస్తూ ఉన్నది. ఆమె ఆకారంలో నడకలో దాసీవాళ్ల వలె ఉన్నది. మబ్బు కమ్మిన చంద్రకళలాగ, మంచుకప్పిన కలువలాగ, కొడిగట్టిన దీప కలికలాగ, ధూళి గప్పిన లతికలాగ, దాసీ వేషంలో ఉన్న ద్రౌపదిని, పురజనులు విస్తుపోతూ చూచారు. ఆమె మనుష్యజాతి మనిషి కాదు. రోహిణో, అరుంధతో అయి ఉంటుంది అంటూ గుజగుజలు పోయారు. కొందరు స్త్రీలు ఆమెను సమీపించారు.
నువ్వెవరు ? ఏ పనిమీద ఎక్కడి కెడుతున్నావు ? అని అడిగారు.
నేనా ? నేను దాసీదాన్ని. అంతఃపురాల్లో పనులు చేస్తూంటాను. నాకు కడుపు నిండా కూడు పెట్టి వంటినిండా కట్టుకోవడానికి బట్ట ఇస్తే చాలు. దాస్యం చేస్తాను అన్నది ద్రౌపది. ఆమె మాటలు విని ఆ స్త్రీలు అచ్చెరువు పడినారు. నమ్మలేకపోయారు. కడుపు కూటికోసం ఆమె దాస్యం చేయగలదా ? అని సందేహం వెలిబుచ్చుతూ తమలో తాము వితర్కించసాగారు.
తన పరిచారికలతో కలిసి రాజమందిర ప్రాసాదంలో విహరిస్తున్న విరాటరాజు పట్టమహిషి సుదేష్ణ, ద్రౌపదినీ, ఆమెను పల్కరిస్తున్న స్త్రీలను చూసినది. ద్రౌపదిని చూడగా చూడగా ఆమె కుతూహలం ఎక్కువైనది.
ఎవరా కాంత ? ఎక్కడనుండి ఎక్కడకి వెడుతున్నదో ? వాళ్లంతా ఆమెను చుట్టుముట్టి ఆశ్చర్యంగా అలాగ చూస్తున్నారేమిటి ? మీరిద్దరూ వెళ్లి ఆమెను ఇక్కడకు పిల్చుకురండి, అంటూ సుదేష్ణ ఇరువురు పరిచారికలను పంపింది.
నిన్ను పిల్చుకురమ్మని రాణీ శెలవైంది అన్నారు వారు ద్రౌపదితో. ద్రౌపది మొదట స్త్రీలకు సహజమైన బెట్టు చూపినది. పిదప వినయ విధేయతలతో ఆ పరిచారికల వెంబడి సుదేష్ణ ఉన్న కడకు వెళ్లినది. రా అమ్మా రా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించినదామె ద్రౌపదిని. ద్రౌపది తగుమాత్రం దూరంలో నిలబడ్డది. సుదేష్ణ ఆమెను ఆపాదమస్తకం అతి కుతూహలంతో చూసినది.
అమ్మాయి ! నీది ఏ కులం ? నే పేరేమిటి ? నీ భర్త ఎవరు ? తల్లిదండ్రులెవరు ? ఏ పనిమీద ఎక్కడికి వెడుతున్నావు. వివరాలన్నీ చెప్పు అని గుక్కతిప్పుకోకుండా అడిగినది.
అమ్మా ! నేను సైరంధ్రీ జాతిలో పుట్టాను. పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు ఉన్నారు. ఒకానొక కారణాన బలవద్విరోధులవల్ల నా భర్తల ఎట్ట ఎదుటనే జుట్టుపట్టుకొని ఈడ్చబడ్డాను. పిమ్మట ఒక విధమైన వ్రతం వల్ల భర్తలతో సహా అడవులపాలై కాయాకసరూ తింటూ కాలం గడిపి బ్రహ్మచర్య దీక్ష అవలంబించాను. ఆ వ్రతం పూర్తికావడానికి ఇంకా సంవత్సరం కొరత ఉంది. నువ్వు ధర్మ పరురాలవని విన్నాను. నాకు చేతనైననట్లుగా నీకు సేవలు చేస్తూ నీ వద్ద ఉండి కాలం గడుపుదామని ఇక్కడికీ వచ్చాను అన్నది ద్రౌపది.
సుర, గరుడ, ఖచర, విద్యాధర, కిన్నర, యక్ష, సిద్ద స్త్రీలలో నువ్వు ఎవరో ఒకత్తెవు అయి వుంటావు. యా ఊరు ఎందుకు వచ్చావో నిజం చెప్పు. అనవసరంగా అబద్ధాలాడకు అన్నది సుదేష్ణ సూటిగా.
ద్రౌపది చిరునవ్వునవ్వి,
అదివరకు కృష్ణుని భార్య సత్యభామకు పరిచర్యలు చేసేదాన్ని, తరువాత ద్రౌపదికి చేసాను. తల్లీ ! ఏం చెప్పను ? ఆ ద్రౌపదీ దేవి నన్ను త ప్రాణంలో ప్రాణంగా చూసుకొంది. ఆమెయే నేను, నేనే ఆమె ! అలాగ ఉండే వాళ్లం మేమిద్దరమూను !...సరే దానికేంగాని నీడపు పనులు తప్ప చెప్పిన పనల్లా చేస్తాను. సుగంధ ద్రవ్యాలు చేయగలను. వివిధాలైన తిలకాలు అద్దగలను. వింత వింతలైన పువ్వుల మాలలు కట్టి తలను అలంకించగలను. అనేక విధాలైన జుట్టు ముడులు నాకు వచ్చును. హారాలు గ్రుచ్చగలను అన్నది సైరంధ్రి.
ద్రౌపది మాటలు వని సుదేష్ణ వెలవెల బోయింది.
ఇకచాలుగాని వినమ్మాయి ! నీ సౌందర్యం చూస్తే మా రాజు నోరూరుతుంది. నిన్ను పని మనిషిగా నేను ఎలాగ పెట్టుకొంటాను ? మిగతా పనివాళ్లు కూడా నీ అందచందాల్ని విస్తుపోతూ చూస్తూ పనిపాటలు మానుకుని కూర్చుంటారు కూడాను. నువ్వు నాకు పని చెయ్యక్కర్లేదు, ఏమీ వద్దు. ఎండ్రకాయ గర్భంలాగ దుర్భరమైన నిన్ను ఇంట్లో పెట్టుకొని నా విధ్వంసాన్ని నేనే పుట్టించుకొనేటంత వెర్రిదాన్ని కాను నేను అన్నది నిష్కర్షగా సుదేష్ణ.
నువ్వు అనుకుంటున్నట్లేమీ కాదు. నా భర్తలు, గంధర్వులు, ఒక్క నిమిషం కూడా నన్ను ఏమరచి ఉండరు. వాళ్లు మహా బలశాలులు. ఎవడైనా నన్ను నీచపు ఉద్ధేశ్యంతో చూస్తే హరిహరాదులు అడ్డొచ్చినా సరే ఆ రాత్రికి రాత్రే వాణ్ణి చంపుతారు. ఏనుగులాటి వాడినైనా సంధులు సంధులు ఊడదీసి చంపేస్తారు. అందుచేత మగవాళ్లు నావేపు కన్నెత్తి చూడడానికి జంకుతారు. నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు వాళ్లకు తెలుస్తు ఉంటాయి. మా కులాచార మహిమ అలాటిది. అందుచేత నన్ను గురించిన నీచపు ఆలోచనలు కట్టిపెట్టు, అనుమానం పెట్టుకోకు. నన్ను నీ పరిచర్యలు చేయనియ్యి. ఉదాత్తమైన నాగరిక పద్దతుల్లో భయభక్తులతో నువ్వు మెచ్చుకోనేటంత బాగా పనులు చేస్తాను. సజ్జనులు, సాధుజనులు, పెద్దలు మెచ్చుకోనేటంత బాగా ఉంటుంది నా ప్రవర్తన, నాకు నీచపు పనులు చెప్పకుండా ఎంగిలి పెట్టకుండా నన్ను తగు మన్ననతో చూసే వారియందు నా భర్తలు ఎంతో ప్రీతి కలిగి అట్టివారికి ఉపకారం చేస్తారు అన్నది ద్రౌపది.
సుదేష్ణ సంతోషించింది. సైరంధ్రిని తన పరిచారికగా నియమించుకొన్నది. ఆ అంతఃపుర అలవాట్లకు నెమ్మది నెమ్మదిగా అలవాటుపతుడూ ఉన్నది ద్రౌపది.
ఈ ప్రకారంగా పాండవులు అయిదుగురున్నూ, ద్రౌపదినీ సర్వజనులకు అజ్ఞాతంగా విరాటరాజు పట్టణంలో నివసిస్తున్నారు.
ఆ తరువా ఏం జరిగింది ? ఆతృతతో ప్రశ్నించినాడు జనమేజయుడు. వైశంపాయనుడు చెప్పసాగాడు.
శ్రీ ఆంధ్రమహాభారతం విరాటపర్వం ఒకటవ ఆశ్వాసం.
ధర్మారాజు, విరాటరాజు సభలోని సభికులు, రాజు ఆనందించేటట్లు ప్రసంగాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. అప్పుడప్పుడు వినోదార్థం జూదాలాడి గెల్చిన ధనాల్ని తమ్ముళ్లకు ఇస్తూ వచ్చాడు. భీముడు, వండగా మిగిలిన మాంసం వృధా కాకుండా తన సహోదరులకు ఇస్తున్నాడు. అర్జునుడు తన సంగీత ప్రదర్శనవల్ల సంపాదించిన కనకాంబరాదులు సోదరులకు చేరవేస్తున్నాడు. నకులుడు తన ఆశ్వ విద్యవల్ల
సంపాదించు ధనం తోడబుట్టిన వాళ్లకు ఇస్తున్నాడు. సహదేవుడు, గోవులను చూసి రాజు సంతోషించి తనకిచ్చిన బహుమానాలన్నీ అన్నలకు ఇస్తున్నాడు. వారికి పాలు పెరుగులు కూడా పుష్కలంగా ఆందజేస్తున్నాడు. ద్రౌపది వీరందర్నీ కళ్లారా చూస్తూ తన పనులు నిర్వర్తించుకొంటూ కాలక్షేపం చేసుకొంటున్నది. ఈ విధంగా పాండవులు, ద్రౌపది తమ తమ సత్ర్పవర్తనవల్ల అణకువ, సౌహాద్రతవల్ల అందరి ఆదరణ పొందారు.
ఇట్లా ఉండగా ఒకనాడు విరాటరాజు సభ తీర్చియున్న వేళ అతని ఆస్థాన జెట్టీలు ఇష్టాగోష్టీ సలుపుతూన్న సమయాన ఒక మల్లవీరుడు ఎక్కడనుంచో వచ్చి ఆ రాజు ఎదుట నిలబడి జబ్బ చరిచాడు.
మహారాజా ! నేల నాలుగు చెరగుల గల రాజ్యాలన్నీ చూసివచ్చాను. నా ఎదుట నిలబడి జబ్బ చరవగల జెట్టి ఎక్కడా ఒక్కడూ కనబడలేదు అన్నాడు గర్వంగా. అతని మాటలు వినేసరికి విరాటరాజు సభలోగల మల్లులు భయంతో ముడుచుకు పోయారు, నోట మాటలేక పోయారు. కన్నెత్తి చూడలేకపోయారు. తలలు వంచుకున్నారు.
రాజు ముఖం చిన్నబోయింది. ధర్మరాజు ఇదంతా గమనించాడు.
|