ఇతణ్ణి ఎదర్కొనగల ఒక గట్టి జెట్టీని, అదివరకు ధర్మరాజు పట్టణంలో చూసాను. అతడిప్పుడు మన వంటశాలలో వంట చేస్తున్నాడు. వలలుడనే అతడు అనేకమంది మల్లులను ఓడించాడు. నాకు బాగా తెలుసు అని రాజుతో చెప్పాడు.
విరాటరాజు తక్షణం వలలుణ్ణి క్రొత్త మల్లునితో ద్వంద్వ యుద్ధం చేసి గెలవమని ఆదేశించాడు. వలలుడు కంకుడివైపు క్రీగంట చూపాడు. కంకుడు కనుసన్న చేసాడు.
అయ్యా ! ధర్మరాజు వద్దవున్న దినాల్లో మల్లయుద్ధాలు చేస్తూ ఆయనను సంతోషపెడుతూ ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా అలాగే మిమ్మల్ని సంతోష పెడతాను అంటూ మెత్తమెత్తగా ఒప్పుకొన్నాడు వలలుడు.
వలలుడు జబ్బచరచి రాజునకు నమస్కరించాడు. వలలుడు, కొత్త మల్లుడు ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయారు. ఒకరి ఎదుట ఒకరు నిలబడ్డారు. ఒకరినొకరు ఆపాదమస్తకం చూసుకొన్నారు. యుద్ధరంగం మన్న నొసట బొట్టులాగ దాచుకొన్నారు. కొంచెం శిరస్సులపై చల్లుకొన్నారు. రెండు చేతుల మునివేళ్లను కొంచెం కొంచెం పట్టుకొని ఒకరి నొకరు తమ తమ వైపులకు లాగుకొనేందుకు ప్రయత్నించారు. ఎడమ చేతిలో కుడి జబ్బల మీద చరచుకొంటున్నారు. ఆఖరికి కలియబడ్డారు. నేలమీద పడి ఒకరిపై ఒకరు పడుతూ లేస్తూ పెనగులాడు తున్నారు. ఒకరినొకరు పట్టుకోవడానికి అనేక పథకాలు వేస్తున్నారు. అంతకంతకు పోరు ఘోరమైంది. వలలుడు, తన ప్రత్యర్థి కచ్చను తన రెండు చేతులతో పట్టుకొని అతని కాళ్లు చేతులు వేలాడేటట్లుగా పైకి ఎత్తి నేలకు వేసి కొట్టాడు. కొత్త మల్లుడి నోటి వెంబడి ముక్కు వెంబడి నెత్తురు వదరలైనది. అలాగ నేలమీద బోర్లాప్డ ప్రత్యర్థి వీపు మీద కాలుతో నొక్కిపట్టాడు వలలుడు. తన కాళ్లు చేతులతో నేలను కాగలించుకొని కొత్త జెట్టి అలాగే ఉండిపోయాడు.
విరాటరాజు సభ యావత్తు ఆనంద పారవశ్యంతో భళీ భళీ అఇ పెద్ద పెట్టున అరిచినది. భీముడు కొత్త జెట్టిని వదిలిపెట్టాడు. విరాటరాజు వలలుణ్ణి మెచ్చుకొని అనేక బహుమానాలు ఇచ్చినాడు. అవన్నీ అక్కడ ఉన్న జనానికి పంచి పెట్టేసి వంటింటివైపుకు నడిచాడు వలలుడు.
ఈ ప్రకారంగా మల్లులతో పోట్లాడుతూ తగిన మల్లు దొరకనివాడు క్రూర మృగాలతో పోరుసల్పుతూ విరాటరాజునూ, అతని అంతఃపుర వాసులనూ భీముడు సంతోష పెడుతున్నాడు.
ఈ విధంగా పాండవులు, ద్రౌపది విరాటరాజు పట్టణంలో అజ్ఞాతంగా కొన్ని దినములు తక్కువగా ఒక సంవత్సరం గడిపారు. అప్పుడొక అపూర్వ సంఘటన జరిగినది.
కీచకులందరిలో పెద్దవాడున్నూ, విరాటరాజు భార్య సుదేష్ణకు తమ్ముడున్నూ అయిన సింహబలుడు అనేవాడు మృత్స్య రాజ్యానికి సేనాధిపతి తన అప్పను చూద్దామని ఒకనాడు సింహబలుడు అంతఃపురంలోకి వెళ్లేసరికి ఆమెకు అనతిదూరంలో ఉన్న ద్రౌపది అతని కంటబడింది. అతడామెను రెప్పవేయకుండా చూస్తూ మ్రాన్పడిపోయాడు. అతని హృదయమనే మృగం, ఆమె సౌందర్యమనే ఉరిలో తగులుకొని మన్మధుడనే వేటగాని చేతిలో పడింది. సింహబలుడు కామాగ్నిలో కాలుతున్నాడు. అతని తలపు లన్నీ ఆమెతో నిండిపోయాయి. మనుష్యులలో ఇట్టి సౌందర్యం అపూర్వం ! ఆమెను చూసి తానే అన్నమాటేమిటి, జయంతుడంతటి వాడు కూడా విస్తుపోడా ? ఇంతటి అపురూపమైన అందం ముల్లోకాల్లోనూ అగుపడదు ! తన పూర్వ పుణ్యానికి ఫలితం ఆ ఇంతి పొందుకదా ? ఆమె ప్రాపుకోసం మన్మథుడు కూడా మహేశ్వరుణ్ణి అయినా ధిక్కరించడా ? ఆమె రూపం చూస్తే దేవేంద్రుడికి కూడా కన్ను కుడుతుంది. ఆమెను మించిన అందగత్తె లేదని తాను బ్రహ్మతో అయినా సరే పందెం వేయగలడు ! ఆమె భర్త అదృష్టం ముందు విష్ణువు ఎంత ? మన్మథుడి బాణాలన్నీ కరిగించి దానితో అతి అందమైన స్త్రీ మూర్తిగా పోతపోసి ప్రాణ ప్రతిష్ట చేస్తే ఈమె ఉద్భవించి ఉంటుంది ! లేకపోతే ఇటువంటి స్త్రీలు నిజంగా ఉంటారా ఎక్కడైనా ! ఆమెను చూస్తే మన్మథుడైనా విరహ వేదనతో క్రుంగిపోడా ? ఆమె తల్లిదండ్రులు ,మగడు ఎవరో ? ఆమె పేరేమిటో ? నివాసం ఎక్కడో ? తాను ఆమెను పొందే మార్గం ఏది ? తనకు ఈ పనిలో ఎవరు తోడుపడతారు ? పరి పరి విధాలైన ఆలోచనతో సమస్యలతో సింహబలుడు కల్లోపడి పోయాడు. ధైర్యం సడలి తల్లడిల్లాడు. తీక్షణమైన కోర్కెలతో మ్రగ్గి దారీ తెన్నూ తోచక చింతించాడు. బుద్ధి మందగించగా అక్కడ ఉన్న వాళ్లవైపు పిచ్చి చూపులు చూసాడు. మొహంతో కళ్లు కప్పడిపోయిన సింహబలుడు ద్రౌపది వెల వెలబోయిన రూపాన్ని రోసిన హృదయాన్నీ చూడలేకపోయాడు.
అనిమేష దృక్కులతో తనను చూస్తున్న సింహబలుణ్ణి ద్రౌపది ద్వేషించింది. ఆమెకు ముచ్చెమటలు పోసాయి. అనుచిత కృత్యాలు ఆచరించే బ్రహ్మ బలిమికి నివ్వెరపోయింది. అక్కడ తనకెవరూ దిక్కులేరనే భయంతో గజగజలాడింది. ఏమి చేయడానికి ఉపాయం తోచక తెల్లబోయింది.
ఇట్టి పరిస్థితిలో ఉన్న ద్రౌపది అతనికి ఆనందం కలిగించింది. ఆమె దీనావస్థ అతనికి మదప వికారంగా కన్పించి అతణ్ణి ముగ్థుణ్ణి చేసింది ! ఆమె సౌందర్యామృతాన్ని ఆస్వాదిస్తూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. నయనం ప్రధానం అన్నట్లు అతిన నయనేంద్రియం, మిగిలిన ఇంద్రియ వర్గాన్ని ధిక్కరించి ప్రధాన పాత్ర ధరించింది. మెహాంధుడైన సింహబడుడికి సైరంధ్రి వినాసర్వం అంధకారమైనది. తన సోదరి పరిజనులు తన నూతన వికార చేష్టనూ చూస్తూన్నారనే తలంపు అతనికి లేకపోయింది.
సైరంధ్రి చరిత్ర తన అక్కవల్ల తెలుసుకోవచ్చుననే కుతూహలం ఎట్టకేలకు కలిగిందాతనికి. ఆమెపై నిల్చిన దృష్టి ఎలాగో మళ్లించుకొని సుదేష్ణ వద్దకు వెళ్లి నమస్కరించాడు. ఆమె అతణ్ణి కనకపీఠంపై కూర్చోమన్నది. అతడది వినిపించుకోలేదు.
ఆ సుందరి ఎవరు ? పేరేమిటి ? భర్తలు ఎవరు ? ఎప్పుడు ఎక్కడ ఉంటుంది ? ఇక్కడికి ఇప్పుడు ఏం పనిమీద వచ్చింది ? దయచేసి చెప్పు అంటూ ప్రశ్నించాడు సైరంధ్రిని చూపుతూ.
తన తమ్ముడు మెహాంధుడయాడని సుదేష్ణ గ్రహించినది. ఆందోళన పడింది. అతని దృష్టి మనస్సు మార్పుటకు అనువైన ఉపాయం ఆలోచించింది. ఆమెను గురించిన ప్రస్తావన తప్పిస్తూ వేరు విషయాలను మచ్చటించ ప్రయత్నించింది. కాని అప్పటికే సింహబలుడి మనసు వశం తప్పింది. సోదరి మాటలు వినిపించుకోకుండా తిరిగి ద్రౌపది ఉన్న కడకు వెళ్లి కొంచెం సేపు అటు ఇటు తచ్చాడాడు.
ఆహో ! నీ అంత అందంగలదాన్ని ఈ లోకంలో ఇదివరకెప్పుడూ చూడలేదు నేను. నువ్వెవరమ్మాయివి ? నీ భర్తలు ఎవరు ? నీ పేరేమిటి ? అని అడిగాడామెను.
ద్రౌపది వినీ విననట్లు ఊరుకున్నది. నిర్వికారంగా నిశ్చలంగా ఉన్నదామె.
కన్నెత్తి చూస్తే కళ్ల కాంతులు తగ్గుతాయా ? కాస్త చిరునవ్వు నవ్వితే ముఖం అందం మందగిస్తుందా ? మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోతాయా ? మనసులోని పరసత్వం బైటపెడితే ప్రమాదం ఏముంది ? అంటూ ఆమెపై తనకుగల అనురాగాన్ని వెళ్లబోస్తున్నాడు సింహబలుడు.
తన ధోరణి ఏదో తనదేగాని ఆమె ఇంగితం ఏమిటో గ్రహించదల్చలేదాతడు.
నీ చక్కదనం రెప్పవేయకుండా చూస్తే దృష్టి దోషం తగులుతుండదేమెనని నాకే భయం కలుగుతోంది. నిన్ను చూస్తూంటే వళ్లు పరవశమైపోయి మనసులోని మాట నోటమ్మట రావడంలేదు. నీ చెయ్యి పట్టుకుందామనుకునే సరికి నా చేతులు వణుకుతున్నాయి. నా మనస్సు మనస్సులో లేదు స్వాథీనం తప్పిపోయింది. ప్రియా ! నువ్విలాగ ఇంకకొంచెం అనాదరణచేశావంటే మన్మధుడు నన్ను హత్యచేస్తాడు. ఆ తరువాత నువ్వు దుఃఖించి ప్రయెజనం లేదు. ఏం చేసినా తిరిగి నన్ను బ్రతికించుకోలేవు కదా అని తన అభిలాష ఆమెకు తేటతెల్లంగా తెలియబర్చినాడు.
ద్రౌపది అతనిని అసహ్యించుకొంది. ఇంకనూ ద్వేషించింది. భరింపరాని అవమానాన్ని ఎలాగో భరించి ద్వేషాన్ని గుండెల్లో గస్తపర్చుకొన్నది. అతడు దురభిమాని అని గ్రహించింది. తనను తొందరపాటు ప్రయోజనకారి కాదు. నేర్పుతో తాను తప్పించుకోవాలి.
నా దురవస్థ చూడవేం అన్నయ్యా ? ఈ ఒళ్లు ఈ వీర, ఛీఛీ, రోత పుట్టిస్తున్నాయి. వీటిని చూచి మొహింపడం మహా అసహ్యం, ఏహ్యం కాగా సజ్జనులు ఇటువంటి మాటలు అనవచ్చా ? నీకు అప్పచెలెళ్లు లేరూ పైగా నేను నీచపుకులంలో పుట్టాను, వివాహితను కూడాను, నన్ను ఇలాగ అడగవచ్చా ? అన్నది ద్రౌపది.
అంతమాత్రానికి సింహబలుడు నిస్పృహపడలేదు. తనను తాను మరిచిపోవడమే గాక ఎదుటి వారిని కూడా మర్చిపోయాడు.
నెత్తమ్మి రేకుల్లోని మెత్తదనం తెచ్చి అచ్చుపోసినట్లున్న నీ అంగముల అందం, చక్రవాకాల చందం తెచ్చి కుప్పవేసినట్లున్న నీ కువముల ఒప్పు, లేతవెన్నెల కాంతి వడపోసి బాగుచేసినట్లున్న నీ ముఖ వర్ఛస్సు, తుమ్మెదలనలుపు అంతా తెచ్చినారుపోసినట్లున్న నీ శిరోజాల నవకం ఇవన్నీ ఆనందంతో అనుభవించడానికి కావా, ఎందుకు అనవసరంగా తిప్పలు పెడతావు. నీది నీచపు కులం కాదనడానికి నువ్వే సాక్షి. పరపతీ సంగమం వల్ల వచ్చే పాపాన్ని భరిస్తాను. కాని ప్రణయ తాపాన్ని భరింపలేను. ప్రేమ కలాపం వినిపించాడు కీచకుడు.
కీచకుడి మాటలకు ఆమె ఒళ్లు రవిలిపోయింది. మహాకోపావేశంలో జలదరించింది. ఆ నీచుణ్ణి భయపెట్టి బెదరగొట్టాలని నిశ్చయించుకున్నది.
|