ఓరి దుష్టుడా ! కావరంతో కళ్లు మూసుకుపోయి కారుకూతలు కూయకు ! గర్వాంధుల్ని చీల్చిచెండాడే శక్తి సామర్ధ్యాలు గలవారు నా భర్తలు అయిదుగురు గంధర్వులు ఉన్నారు. జాగ్రత్త ! నీ మానం, ప్రాణం కూడా పుచ్చుకొంటారు అని గర్జించింది సైరంధ్రి.
నా బాహు బలానికిమించిన వాళ్లు నీ మొగుళ్లే కాదు ముల్లోకల్లోనూ లేరు. నీకు తెలుసో తెలియదో మరి అన్నాడాతడు చిరునవ్వుతో. సైరంధ్రికి అతనిని ధిక్కరించే బలం వచ్చింది.
తగునో కాదో తెలుసుకోక అందని చెట్టు పళ్లు కోయతలచుట బుద్ధిహీనత. నీలాగ ప్రవర్తించిన రావణుడు మున్నగు వాళ్లంతా నశించారని ఎరగవా నువ్వు ? అని చరచర వెళ్లిపోయినది.
సింహబలుడు ఆమె మాటలు అర్థం చేసుకొనే స్థితిలో లేడు. అయినా ఆమె తిరస్కారం అతనిని వ్యధపెట్టినది. ముఖం చిన్నబోయింది. తిరిగి తన సోదరి కడకుపోయి వేడినిట్టూర్పులు విడిచాడు.
ఇందాక నీకు చూపించి ఊరూపేరూ అడిగానే ఆ సుందరి మీద నా మనస్సు లగ్నమైపోయింది. ఇప్పటి వరకు నీ చేరువులో ఇక్కడే ఉందిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది, అక్కయ్యా ? అని అడిగాడు ఆత్రంగా.
సుదేష్ణ శిరః వేసింది. అతని వేగిరపాటు గ్రహించినది. తన తమ్ముడు సైరంధ్రిని మోహించాడు. దానివల్ల అతనికి ఏమి అపాయం వచ్చిపడుతుందో ! వద్దు తగదు అని తాను వారిస్తే వాడు వినడు. మాయదేవుడా ! నేనేం చేయను ? అని చింతించింది. అయినా చేతనైనంతవరకు అతణ్ణి మందలించి చూడాలని నిశ్చయించుకొన్నది సుదేష్ణ.
తమ్ముడూ ! లేతనవ్వులు ఒలికిస్తూ పండువెన్నెలవంటి కాంతలు, రాయంచల్లాగ, నీవద్దకు నడిచివస్తుంటే నువ్వేమో ఆ సైరంధ్రిని అర్థిస్తున్నావేమిటి...అని ఆరంభించేసరికి సుదేష్ణ మాటకు సింహబలుడు అడ్డుతగిలి....
గండుమీనుల్లాంటి ఆ కన్నులు, లేత తీగల్లాంటి ఆ చేతులు, పద్మరేకుల్లాంటి ఆ పాదాలు, వీణావాదం లాంటి ఆ కంఠ స్వరం, ఆ రూపురేఖా విలాసాలు ! ఇవన్నీ ఆ సైరంధ్రికి తప్ప ఇంకెవరికి ఉన్నాయి. అక్కయ్యా తెలియక అలాగ అంటున్నావు. ఎందుకు వచ్చినమాటలుగాని కడపటి మాట చెపుతా విను. ఏ ఉపాయాన్నైనా సరే నన్నామెతో చేర్చకపోతే మదనాగ్ని జ్వాలల్లో నా హృదయం దహిస్తుంది. నేను చచ్చిపోతాను అన్నాడు సింహబలుడు.
పరపతితో వ్యభిచారంవల్ల ఆయువు, ఐశ్వర్యం, కీర్తినశిస్తాయి. ఇది దుర్వివేకం అని ధర్మపరులంతా విసర్జించడం మనం చూస్తున్నాం...? వింటున్నాం కామా ? కాగా వ్యభిచారం వల్ల ఏమి సుఖం ? మొగుడికి తెలిస్తే ప్రాణానికి ముప్పుఅనే భయంతో గుండెలు దడదడలాడుతూ ఉంటాయి. ఇరుగుపొరుగు వారు చూస్తే పరువు మర్యాదలు బుగ్గి అయిపోతాయనే భీతితో ముఖం ముడుచుకుపోతూ ఉంటుంది. భార్యకు తెలిస్తే ఛీఛీ అంటుందనే వెరగువల్ల కాళ్లు చేతులు పట్టుతప్పుతూంటాయి. బంధువులు గ్రహిస్తే కుటుంబ మర్యాద పోతుందనే కలతవల్ల ముచ్చెమటలు పోస్తుంటాయి. ఇటువంటి ఏహ్యపు పరిస్థితుల్లో జారపొందు హృదయానికి ఇంపుకాదనే కదా ఈ తుచ్ఛ సుఖాన్ని బుద్దిగల వాడెవడూ కోరడు...? అన్నిటికన్న ముఖ్య విషయం ఒకటి ఉన్నది. దానికి అయిదుగురు భర్తలున్నారట ! వాళ్లు మహాబలం గల గంధర్వులట ! వాళ్లను తల్చుకుంటే నా గుండెలు గతుక్కుమంటున్నాయి. ఆమె నీకెందుకు తమ్ముడూ . చెడుత్రోవను పోతే ఏమి ప్రయోజనం చెప్పు ? బ్రతుకులో ఎంత మాధుర్యం ఉన్నా అపసవ్య మార్గాన వెడితే విషపూరితం అవుతుంది. నా మాటవిను. సైరంధ్రిని మర్చిపో అని నయానా భయానా హెచ్చరించింది సుదేష్ణ.
నాకు బుద్ధులు బోధించే ప్రస్తావన అలాగ అట్టే పెట్టు. ఎలాగైనా నేను సుఖపడే ఉపాయం చూడు. లేకపోతే నా చావు తథ్యం. నా వృద్దికోరే దానివే అయితే నువ్వు అవివేకివి అంటూ నన్ను నిందించక ఆమెను తక్షణం పిలిపించు అంటూ ఆమె పాదాలకడ సాగిలపడ్డాడు.
విచారంతో ఆమె మోము విన్నవైంది. తన ప్రయత్నం నిష్పలం. తాను ఎన్ని విధాల చెప్పి చూచినా ఆ మూర్ఖుడు పట్టినపట్టు విడవడంలేదు. తానేం చేయగలదు ? ఆ తరువాత వచ్చే ఆపదలను వాడే అనుభవిస్తాడు. మన్మధ వికారంవల్లనో గంధర్వుల వల్లనో తన తమ్ముడు ఎలాగూ చావడం నిజం ! తాఉ తప్పించగలదా ! ఆమె కన్నులు అశ్రుపూరితాలు అయ్యాయి. అతనిని లేవనెత్తింది.
ఇంతమాత్రానికి ఇంత వ్యధ ఎందుకు ? ఆమెను ఒప్పించడం ఆసాధ్యం కాదులే. దుఃఖం తగ్గించుకొన నెమ్మదిగా వెళ్లు. నువ్వు ఇంక ఇక్కడ ఉండవద్దు. ఇంక కొంచెం సేపయాక కల్లు తీసుకురమ్మనమని చెప్పి నీ ఇంటికి ఆమెను పంపిస్తాను. అప్పుడు నువ్వు ఆమెను అనుభవించు అన్నది సుదేష్ణ.
బ్రహ్మానందపడుతూ కీచకుడు స్వగృహానికి వెళ్లాడు. మధురాలైన వివిధ రసాలు, భక్ష్యాలు సిద్ధపరచాడు. ఆ ప్రదేశం యావత్తు నిర్జనం చేసాడు. ఒకానొక రమణీయమైన స్థలాన కూర్చొని ద్రౌపదిని గురించి తలపోస్తూ ఆమె రాకను ఆతృతతో నిరీక్షిస్తున్నాడు.
అక్కడ సుదేష్ణ ద్రౌపదిని పిలిపించింది.
మాలినీ ! నోరు ఎండిపోతున్నది. నాలుక పిడచకడుతున్నది. అబ్బబ్బ ! అమిత దాహం ! కల్లు త్రాగాలి. కీచకుడి ఇంట్లో ఎల్లప్పుడూ వివిధాలైన పానీయాలు ఉంటాయి. త్వరగా వెళ్లి తీసుకురా. చూస్తాగా నీ గమనవేగం అంటూ తొందరపెట్టింది.
సైరంధ్రి హృదయం గతుక్కుమంది. గుండె గుభిల్లుమన్నది. వళ్ళంతా చెమటలు పోసాయి. ఆమె డిల్ల పడింది. తనకెంత కష్ట కాలం అసన్నమైంది. తాను వెళ్లననడానికా వీల్లేదు. వెళ్లడానికీ వీల్లేదు ! తాను తప్పించుకొనే మార్గం ఏమిటి ? ఆమె ఆందోళనపడింది.
అమ్మా ! కల్లు తెచ్చుందుకు వేరెవరినైనా పంపించు. నేవెళ్లలేను. ఏదో నీ దగ్గరి పడి ఉంటూ తగు పనులు చేస్తూ ఉండవచ్చు. కానీ నీచపు పనులు చేసే దాన్ని కాదు. మీ ఇంట్లో నా భర్తల వద్దను ఉన్నంత భద్రంగా నిర్మలంగా ఉంటుందని ఆశతో ఉంటే ఇలాగా అన్యాయం చేయడం న్యాయమా ? తమ వద్ద నివసించే వారిని తగురీతిగా రక్షించి కాపాడవలసిన పెద్దవారు అన్యధా చేస్తే వింద్యం కాదా ? ఏ పనిమీద బడితే, ఆ పనికి, ఎవరింటికి బడితే వారింటికి నన్ను పంపించవచ్చా? నీచపు పనులు చేయను అని ఆనాడే మీ పనిలో చేరినప్పుడే నేను చెప్పలేదా అన్నది సైరంధ్రి.
సుదేష్ణ తాను చేస్తున్నపని చాలా అనుచితమైనదే అని పూర్తిగా తెలుసుకొన్నది. కాని ఆమె తన తమ్ముని దుఃఖం పోగొట్టాలని వాంఛించింది.
బాగానే ఉంది. మర్యాద గొంతుకర్చుకుపోయి కల్లు త్రాగాలని నేను ఎంతో ఆసక్తిపడి ఒక నికృష్టదాసీని పంపించడానికి ఇష్టంలేక నిన్ను వెళ్లమంటే నిన్ను ఏదో నాచపు పనికి నియమించానంటూ నన్ను అలాగ తిరస్కరించి తూలనాడుతున్నావేమిటి ? ఇదే నా మంచీ, మర్యాదాను ? అదేమన్నా క్రొత్త ఇల్లా ? నిన్నెవ్వరూ ఎరగరా ? నువ్విక్కడికి వచ్చిన మొదలుకొని నీ సంగతి యావత్తూ యావన్మందికీ చెపుతూనే ఉన్నాను అన్నది సుదేష్ణ నిష్ఠూరంగా.
సుదేష్ణతో పెద్దకాలం వాదించి ఫలితం లేదని ద్రౌపది నిర్ణయించి సరే ! అలాగే ! వెళ్లి తెస్తాను. అన్నది కల్లు కొరకు బంగారు కూజా ఇచ్చింది సుదేష్ణ. ద్రౌపది దానిని చేతపుచ్చుకొని కీచకుడి ఇంటికి బయలుదేరింది. తనతో కీచకుడు ఆడిన కర్ణశూలాలవంటి మాటలు ఆమెను వేధిస్తున్నవి. పైగా సుదేష్ణ తనను అనుచితమైన పనికి నియోగించడం పిడుగుపడ్డ వాని నేత్తిన కొరవి పడ్డట్లుగా ఉన్నదామెకు. ఆమె హృదయ వేదన అపారమైంది. దిగులుపడింది. మాయదైవం అని దైవాన్ని నిందించింది. తనకు అక్కడ దిక్కెవ్వరులేరని దుఃఖించింది. అడుగు తడబడింది. తనకు అపకారం ఎవడు చేయగలడనే ధైర్యం తెచ్చుకొని గుండె దిటవు చేసుకొన్నది. మళ్లీ దైర్యంసళ్లి దైన్యం కలిగినప్పుడు ఆమె ముఖం తెల్లపడుతున్నది. భయంతో ఒడలు వణకుతున్నది. నడక తొట్రు పడుతున్నది. ఆపాదమస్తకం చెమటలు పోస్తున్నది. వెరంగుపడింది. ఈ విధంగా ద్రౌపది దురవస్థపడుతున్నది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనుకొని మహాపదలకు పరిహరణం హరిస్మరణం అనుకొని మనస్సులో కృష్ణుణ్ణి తల్చుకొని ప్రత్యక్షదైవం అయిన సూర్యభగవానుణ్ణి ప్రార్థించింది. నా మనస్సులో అయినా పాండవులయందు పాతివ్రత్యం తప్పని దాన్నే అయితే ఓ సూర్య భగవానుడా ! నాకు కీచకుడివల్ల కీడురాకుండా రక్షించు ప్రభూ అని కేలు మోడ్చింది. దుఃఖితురాలైన ఆమెను రక్షించేందుకు బలాడ్యుడైన ఒక రాక్షసుని సూర్యభగవానుడు పంపగా ఆ రాక్షసుడు అదృశ్య రూపాన ఆమె వెంటనున్నాడు.
బెబ్బిలి గృహ జొచ్చే లేడిలాగా ఎట్టకేలకు ద్రౌపతి కీచుకుడి ఇల్లు జొచ్చినది.
ద్రౌపదిని చూచేసరికి కీచకుడి గుండెలును మహోద్రేకంతో దడదడలాడాయి. దేహ తాపోపశమనార్థం కల్లు కడుపార త్రాగి ఒళ్లు ఎరుగని మైకంలో ఉన్నాడు. అతని భావాలు చంచలించాయి. చిడిముడిపడుతూ ఆమెకు ఎదురువెళ్ల ప్రయత్నించాడు. తూలుతూ ఆమె ఉన్న కడకు చేరాడు.
దేవికి దాహం పుట్టి కల్లుతెమ్మెంటే వచ్చాను. పోయించండి అన్నది ద్రౌపది కీచకుడామెను అతి తమకంతో చూచాడు.
దేవి దాహం తీరుస్తావు. మంచిదే నేను ఆమె సహోదరుణ్ణి. మరి నా దాహమో ? నీ సరససల్లాపాలతో తీర్చు. ఇదే న్యాయం. నా జన్మఫలం నీ పొందు. నన్ను బంటుగా ఏలుకో ఇంక నీ సిగ్గు తెరలు ఒత్తిగించు అన్నాడు కీచకుడు.
ఆమె అతని మాటలు వినిపంచుకోలేదు. ధైర్యం చిక్కబట్టింది.
కల్లుపోయించండి. దేవి ఎదురుచూస్తూంటుంది. ఆలస్యమైతే అలుగుతుంది. నే వెళ్లాలి అన్నది.
మదిరాన్ని మరొకరి చేత క్షణంలో పంపిస్తానామెకు ? నువ్వు హాయిగా ఇక్కడే పుచ్చుకో నన్ను నీ అందాన్ని కడుపునిండా త్రాగనియ్యి. నేను కామ బాధపడకుండా కాపాడు. నా ఏనుగులు, గుర్రాలు, రథాలు, సంపదలు అన్నీనీవే. నాకులకంతలంతా నీ దాసీలు నేను నీ కనుసన్నల్లో మెలగుతాను. ఏ పైవానా సరే నువ్వే చేయించు అంటూ అతడు కామావేశాన్ని తట్టుకోలేక ఆమెపై బడి పట్టుకున్నాడు.
|