కావున దుఃఖాంతము కాకూడదన్న నియమము నాటకములకేగాక కథలకు (నవలలకు) కూడా నన్వయింపవలసివచ్చుచున్నది. సంపూర్ణ పద్యమయ కథకు లీలావతి యును గద్యమయ కథకు కాదంబరి యును ఉదాహరణములు కాదంబరిలోని వస్తువు పైశాచీ భాషలోనున్న గుణాఢ్యుని బృహత్కథ నుండి స్వీకరింపబడినది. రుద్రటుని కథాలక్షణముల ప్రకారము సంస్కృత కాదంబరిలోని వస్తువు ఉత్పాద్యముకాదు. నాయకునిచేత చెప్పబడలేదు. అయినప్పటికి లేని మెరుగులు పెట్టబడి ఉత్పాద్యమను భ్రమ కల్గింపగల్గుచున్నది. నాయకునిచేత చెప్పబడకుండుటచేత ఆఖ్యాయిక కాకపోయినది.
కన్నడములో బసవేశ్వరునివంటి శైవమతానుయాయులు మత వ్యాప్తి కొరకై ప్రజలకు సులభముగ నర్ధమగునట్లుగ వచనములు వ్రాసిరి. క్రీ.శ.978లో కన్నడమున ప్రథమ వచన కావ్యము వెలసినది. భారతీయ సాహిత్య ప్రక్రియకు నవల నూత్నము కాదనుట కీవాదము చేయబడినది.
సాహిత్య ప్రయోజనము - నవల
సాహిత్యము ప్రజల యొక్క సంస్కారమునకు దోడ్పడుటకై జనించిన దనుటలో నెట్టి సంశయములేదు. ప్రజాజీవనమున మతమునకున్న ప్రాశస్త్యము మరియెక విషయమునకు లేనందున ప్రజల ఆచారవ్యవహారములకు, మతమునకు నవినాభావ సంబంధముండుటచేత సాహిత్యము మతవ్యాప్తికి ముఖ్య పరికరము కాగల్గినది. హిందూ మతమునకు వేదోపనిషత్తులును, క్రైస్తవులకు బైబిలును, ఇస్లామునకు ఖురానును పూజనీయములైన గ్రంథములు. ఇవి మౌలికములు మరియు బౌద్ధమత వ్యాప్తికై బౌద్ధులు పాళీప్రాకృత భాషలలో నసమానమైన సాహితీసృష్టి గావించియుండగా శైవులు ప్రజాభాషలో వచనలములను సులభ గ్రాహ్యములైన శతకములకు రచించియుండుట యెల్లరకును విదితమైన విషయమే. ఆయా మతములకు తగినట్టుగ వ్యాఖ్యానమును చేయుటలోకూడ సాహిత్యమును సుషోషితయొనర్చియున్నారు. మహాభాగవతమునకు ద్వైతపరముగ, నద్వైతపరముగ, విశిష్టాద్వైతపరముగ వ్యాఖ్యానములు వెలువడినవి. సాంఘిక రాజకీయాది సమస్యలుత్పన్నములైనపుడు కూడ సాహిత్య మాయుధముగ నుపయోగపడుట కద్దు.
సాహిత్య ప్రక్రియలలో నవలా ప్రక్రియ అనేక విధములైన ప్రజల భావప్రకటనమున కనుకూల వాతావరణము కల్గియుండుటచే నవలకు ప్రపంచ ఖ్యాతి కల్గినది. ఏ భాషలోనైనా నేడు నవలకే ప్రథమ తాంబూలమీయబడుచున్నది.
నవలలో ప్రతిబింబించుచునట్లుగ సమాజము మరియే ఇతర ప్రక్రియలోనను ప్రతిబింబింపబడలేదనుట సత్యము.ఇందులకు కారణము నవలలలో కానవచ్చు అనేకములైన మొదటిది క్లాసిజమ్, తరువాత రొమాంటిజమ్, నేచరలిజయ్, రియలిజయ్, సర్‌రియలిజయ్, ఎక్ట్సెన్షియలిజమ్, సించాలిజమ్, మార్క్సిజమ్ వంటి వాదములకు నెలవైనది.
ఇట్లు అనేక వాదములలో సాంఘికపరమైన మార్పులన్నిటిని సాహిత్యమున ముద్రలువేయుచు తనను తాను పెంపొందించుకొనుచు నవలా సాహిత్యము పెరిగిపోవుచున్నది. హేతువాదమునకు, ధర్మమునకు, మతమునకు, మనస్తత్త్వవిశ్లేషణకు, భక్తితత్త్వమునకు నవలలో స్థానమేర్పడినది. ఈనాడు నవల విరాట్స్వరూపములో మనముందు నిలచినది.
విశ్వసాహిత్యములో ప్రతిబింబించిన నవలా సిద్థాంతముల స్వరూపము తెలుగు నవలలోకూడ ప్రతిఫలించక మానలేదు. నవలలో ముఖ్యమైనది కథమాత్రమే కాదని విమర్శకులందరును అభిప్రాయపడియున్నారు. నవలాకారుడు వాచ్యముగ చెప్పిన విషయమునకన్న మరింత లోతుగ భావించుటకే నవల యవకాశమిచ్చునో దానిని ఉత్తమ నవలయన వచ్చును. ఆనందవర్ధనులు చెప్పిన కావ్యలక్షణమైన ధ్వనిని నవలకు కూడ నాపాదించవచ్చును.నవల కథారూపమున పాత్రలద్వారా వెల్లడియగు సామాజిక పరిస్థితియని ఇవాన్స్ పండితుని యభిప్రాయము.
నవలను రచయిత రెండు విధములుగ నడిపించును. ఒకటి కేవల లేఖన విధము. రెండవది సంభాషణ పూర్వక విధానము. ఈ రెండును పడుగుపేకలవలె యల్లుకొన్నప్పుడు నవల సమగ్రమగునుగాని యే ఒక్క లక్షణముతోనైన నవలకు సంపూర్ణత్వము సిధ్దింపదు. కథలు సంపూర్ణముగనున్నను శైలీవిధానములోనున్న లోపముచే నవలకొక విధమగు వెలితి యేర్పడుట కవకాశమున్నది. పూర్తిగ సంభాషణములేయైనచో నవల నాటకమునకు సమానమగును. నాటకకర్తకువలె సమయ పరిధిలేదు (నవలాకారునకు) నవలలోని పాత్రలు, సన్నివేశములు, కథ నిర్మించి చెప్పుటకు నవలా రచయిత ఎట్టి పరిధులు లేక స్వాతంత్ర్యమవలంబింప వచ్చును.
|