నవల కథ
కథలకు ఏదియేని ఒక సంఘటనము వహింపగల శక్తి మాత్రమే గలదు. కాని నవలలో ననేకములైన సంఘటనలుండవచ్చను. పాత్ర లెక్కువగ నుండవచ్చును. వర్ణనలకిచట తావున్నది. మనస్తత్త్వ విశ్లేషణ కిచట యంగీకారమున్నది. సూక్ష్మముగ నవల చిన్నదైనదో కథ, కథ పెద్దదైనచో నవల యనుట కలదు, కాని నవల ముఖ్య లక్షణము సమస్యా పరిష్కారము. సంఘర్షణ ప్రథానముగ నుండవలెను. పందొమ్మిదవ శతాబ్దమున నవల యే వస్తువుపడిన నా వస్తువు నిరికించుటకు వీలైన హోల్డాలువంటిదని వాల్టర్ ఎలెన్ పండితుడనెను.
ఇట్లు విచారణ చేయగా తేలినదేమియనగా, నవల సామాజిక ప్రయోజనము కొరకు ప్రజా బాహుళ్యుము యొక్క హితార్థియై సులభ భాషలో వెలసిన బంధరహితమైన ఛందోబాహిరమైన ఒకానొక విలక్షణమైన ప్రక్రియయనుట. నవలలో సామూహికముగ మిగిలిన కళలు కూడ ప్రయోగింపబడుటకు తగినంత విస్తృత భూమికయున్నది. వరనలు
చేసి ప్రబంధ లక్షణమును సంభాషణను పొడిగించి నాటకమును వస్తుసామ్యమున కథానికను స్ఫూర్తితో చిత్రకారుని తలపింపజేయుటయును నిచట రచయిత చేయగలడు. పఠితనను తన శక్తి సామర్థ్యములతో తాను సృష్టించు లోకములోనికి గొనిపోగలడు. ఇది కావ్యత్వ లక్షణమును తలపింపజేయ వచ్చును. మరియు ప్రత్యేకమైన విషయమేమనగా రచయితమొక్క స్వాత్మ నవలలో ప్రతిబింబించునట్లు మరియొక ప్రక్రియలో సాధ్యపడదు. నవలకూ చిన్నకథకూ పూర్వస్వరూపాలు ఇతిహాసము, ఉపాఖ్యానమును. వీటికి రెండు ఆశయాలుండేవి. చరిత్రను సజీవంగా ఉంచటం జీవితం గురించి ఆబ్‌జెక్టివ్‌గా రచించటం అని కొడవటిగంటి కుటుంబరావుగారు అభిప్రాయపడిరి. నవలాపఠనమునకు ఎక్కువ విద్యాభ్యాసమక్కరలేదు. భాషాజ్ఞాన ముండినచో చాలును. ప్రజలకు సన్నిహితమైన భాషలో ప్రజలను చైతన్యవంతులను చెయ్యలేని కథలు (నవలలు) రచించి ప్రయోజనమేమిటి అని కుంటుంబరావుగారు ప్రశ్నించుచున్నారు.
విశ్వనాధవారు తమ నవలలో ధర్మమును గురించి మతమును గురించ, మానవత్వమును గురించియు విస్తృతముగ ప్రవచించియున్నారు. తమ నవలలు చదివినవారికి విజ్ఞానము కలుగుట తథ్యమని నొక్కి చెప్పగల ఆత్మవిశ్వాసము వారకున్నది. సాహిత్యపఠన ప్రభావమువలన పఠిత హృదయమున మార్పు జనించినచో రచయిత సఫలీకృతుడైనట్లే.
పాత్ర చిత్రణము - విశ్వనాథ సృష్టి
నవలా లక్షణములలో ముఖ్యమైనది పాత్ర చిత్రణము. శిల్పము, వస్తువు శైలి మొదలైనవన్నియు నొకదానికొకటి ముడిపడి విడదీయరానంతగ బిగువుగనుండును. ఈ లక్షణములన్నియు నొకదానికొకటి పుషిని కలిగించుకొనుచు ఒకదానివలన నింకొకటి సౌందర్యము నాపాదించుకొనుచు సాగిపోవుచు ఏకైక ప్రవాహమై సంపూర్ణ చిత్రమును ప్రతిబింబించును.
నవలాకారుడు సృష్టించిన తన నవలలోని స్త్రీ పురుషులు జీవముగల వ్యక్తులవలెనుండిరా లేక చైతన్యరహితముగగాని యసహజముగగాని ప్రవర్తించిరా యన్న విషయమును శోధించినచో పాత్ర చిత్రణములోని బాగోగులను గ్రహించవచ్చును. ఒక పాత్ర సహజముగాననుండెనా లేదా యన్నచో నీ విషయమును నిర్ణయించుటకు ఆ పాత్ర యొక్క ప్రవర్తన భావములు, భాష పరిశీలింపవలయును. ఒక సంఘటనమున
కావ్యక్తి యెట్లు చలించెనన్నదానిపై నీ విషయ మాధారపడియుండును. జీవితములో సుఖము కలిగినపుడెటులున్నదో దుఃఖము సంప్రాప్తించినపుడెటులున్నదో నావిషయమే సహజత్వా సహజత్వా విషయ నిరూపణము చేయును. జీవితమంటే సుఖదుఃఖాలు. ఒక మనిషి జీవితంలో అవి ఎలా సంప్రాప్తిస్తున్నవి ? ఆయా సందర్భాల్లో ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు ? ఈ రెండు విషయాల్ని బట్టి మనిషి వ్యక్తి వైశిష్ట్యం గోచరమౌతుంది. జీవితాన్ని కథగా మలచే ప్రక్రియయైన నవలలో అలా నిరూపింపబడే వ్యక్తి వైశిష్టాన్నే పాత్రచిత్రణ అంటారు. ఈని సుదర్శనంగారు పాత్రలలో వ్యక్తమగు ఔచిత్యచర్చకొక పరిధిని కల్పించిరి.
కొడవటిగంటి కుటుంబరావుగారు పాత్రల మనస్తత్వము సహజముగా నుండవలెనన్నచో పాత్రలు వారి వారి వ్యవస్థల నంటిపెట్టుకొన్న స్వభావములనే వ్యక్తము చేయవలెనన్న యభిప్రాయమును వెలిబుచ్చిరి. ఒక్కొక్కప్పుడు పాత్రల స్వరూపానికీ స్వభావానికీ సంబంధం ఉండదు. కార్మికుడికి మధ్యతరగతివాడి మనస్తత్వమూ, మధ్యతరగతివాడికి జమిందారీ మనస్తత్వమూ అంటగట్టబడుతోంది వ్యవస్థకును వ్యక్తకిని సంబంధము లేని మనఃప్రకృతిని కొడవటిగంటివారు అసహజమైన పాత్ర సృష్టికి ఉదాహరణముగ నిల్చియున్నారు. నిజమునకు వ్యక్తిలో వ్యవస్థాతీతమైన యోగినియై పెద్ద పెద్దలకు గురవు కాగలిగినది. వేలూరి శివరామశాస్త్రి వంటి పండితులు పిచ్చమ్మను చూడటం శివలింగాన్ని చూడటం పిచ్చమ్మతో మాటాడటం ఆత్మతో మాట్లాడటం అని వ్రాసిరి. ఈమె భాష పామర హరిజనుల వ్యవహారిక భాషయే. భావముమాత్రము జగద్గురువులైన శంకరాచార్య ప్రణీతములైన మహాగ్రంథములలో నున్నట్లుగ నుండును. హరిజనులైనంత మాత్రమున వారు వ్యవస్థను దాటిపోరాదను నియమము లేకుండుట పిచ్చమ్మ నిరూపించుచున్నది. మరియు స్వర్గానికి నిచ్చెనలులోని శశి పాత్రకు పిచ్చమ్మను మాతృకగ స్వీకరింపవలసి యున్నది. శశి బ్రాహ్మణ కుటుంబమున పుట్టి సంస్కారవతియైన వసుంధరకు లభింపని యోగమును తాను వశము చేసికొన్నది. పంచమి పాత్ర కూడ నిట్టిదే. పాత్ర చిత్రణములో భావములతోబాటుగ భాషకూడ నౌచిత్యముతోడ ప్రయోగింపబడవలయును. రచయిత పరోక్షమున చెప్పునప్పుడీ యవసరముండదు.
|