76
 

వంక జాబిల్లి

ధూమ‌రేఖ న‌వ‌ల‌లోన వంక‌జాబిల్లి శిశునాగుని భార్య ఆంధ్ర రాజ‌కుమ‌ర్తె. జ‌గ‌న్మోహ‌నాకృతిగ‌ల సౌంద‌ర్య‌వ‌తి. స్వ‌తంత్ర ప్ర‌వృత్తి గ‌ల‌ది. వివేక‌వంతురాలు. రాజ్య‌ములేల గలుగుట‌యే కాక రాజ్య విస్త‌ర‌ణ‌మును గూడ చేయింప‌గ‌ల స‌మ‌ర్థురాలు.

వంక‌జాబిల్లి యొక‌నాడు ద్యాన‌వ‌న‌ములో నుండ‌గా జ‌య‌ద్ర‌ధుడీమెలో నాస్తిక ధూమ‌మున ప్ర‌వేశింప‌జేసెను. ఈమె ఈ స‌మ‌య‌మున నిదుర‌లో నున్న‌ది. అప్ప‌టి నుండి యామె మంద‌బుద్ధియైన‌ది. ఆమెలోనున్న చురుకుత‌న‌మంత‌యు పోయిన‌ది.

ఆంధ్ర‌రాజు కూడా జ‌య‌ద్ర‌ధుని మాట‌ల‌ను న‌మ్మి శిశునాగున‌కు త‌న కుమార్తె నిచ్చుట కంగీక‌రించెను.

మ‌గ‌థ‌రాజు కుమారుడైన శిశు నాగున‌కును అత‌నికి వ‌ర‌స‌కు అన్న‌యైన కాశీరాజు కుమార్తె వేద‌మ‌రీచికిని సంబంధ మేర్ప‌డిన‌ది. శిశునాగుడు నాస్తిక‌ధూమ‌మును పీల్చ‌గా నా ధూమ‌ము నుండి జ‌య‌ద్ర‌ధుడు శిశునాగుని తండ్రి నావేశించి య‌త‌నిని క‌ల‌ద‌కుండ మెద‌ల‌కుండా మాటాడ‌కుండ నిశ్శ‌క్తుని చేసెను. వంక జాబిల్లిని శిశునాగున కిచ్చుట కూడ జ‌య‌ద్ర‌ధుని ప‌న్నాగ‌మే. నాస్తిక ధూమ‌మంత‌య నొక‌ర‌క‌ము మొక్క‌లు పీల్చుకొని నేల క్రింద దుంప‌లుగ గ‌ట్టిన‌వి. మ‌గ‌ధ రాజ్య‌మున ప‌రాశ‌ర‌శాస్త్రి య‌ను మంత్ర‌వేత్త వివేక‌ముతో నా నాస్తిక ధూమ‌ము వ‌ల‌న నేర్ప‌డిన దుంప‌ల‌న‌న్నిటిని తెప్పించి ఒక రేచు కుక్క‌తో వాని పొగ‌ను పీల్పించెను. వంక‌జాబిల్లి శిశునాగుని పెండ్లి యాడిన త‌రువాత మాయోపాయ‌ముతో కాశీరాజు కుమార్తె వేద‌మ‌రీచిని, అల్లుడైన అజాత‌శ‌త్రుని చంపించి కాశీరాజ్య‌ము నాక్ర‌మించుకొనిన త‌రువాత జ‌య‌ద్ర‌ధునిచే రేచు కుక్క‌ను ఆ కుక్క‌చే జ‌య‌ద్ర‌ధుని నొక్క‌మారు చంపింప‌జేసిన‌ది. ఈ నాస్తిక‌ధూమ‌ము జ‌య‌ద్ర‌ధుడు త‌నంత తాను చితిపై బ‌డి మ‌ర‌ణించుట‌చే నాచితా భ‌స్మ‌ము నుండి జనించిన‌ది. జ‌య‌ద్ర‌ధుడు నాస్తిక శేఖ‌రుడైనందున వాని చితాధూమ‌ము నాస్తిక ధూమ‌మైన‌ది. ఆ ధూమ‌రేఖ‌ల ప్ర‌భావ‌మున గల్గిన చరిత్ర‌యే ధూమ‌రేఖ‌ల‌లోని ప్ర‌ధ‌మ‌గాథ‌.

కాశీ రాజ్య‌మున ప‌రాశ‌ర శాస్త్రియ‌ను మంత్ర‌శాస్త్ర‌వేత్త అష్ట‌క‌ష్ట‌ములు ప‌డి రాజ‌కుంటుంమును కాచుచుండెను.

ధూమ‌రూప‌మున శిశునాగుని వెంట‌వ‌చ్చిన జ‌య‌ద్ర‌ధుని యాట‌లు క‌ట్టించుట‌కు ప‌రాశ‌రశాస్త్రి య‌త్యంత శ్ర‌మ‌ప‌డుచుండెను. ఈయ‌న త‌న జ‌ప‌హోమ త‌త్ప‌ర‌త‌యంత‌ను రాజు క్షేమ‌మున‌కై ధార‌పోసిన‌ట్టి స్వార్థ‌ర‌హితుడు. ప‌రాశ‌ర‌శాస్త్రికి మంత్ర‌దేవ‌త య‌థార్థ‌మునంత‌యును కండ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిన‌ది. వంక‌జాబిల్లి యొక్క సుగుణ‌మ‌లును గ్ర‌హించి బ్ర‌హ్మ ఆమెవంటి యుత్త‌మురాలిని సృష్టించకుండ నుండ‌లేడ‌ని త‌ల‌పోసెను. ఆమె వెంట వ‌చ్చు జ‌య‌ద్ర‌ధుని రాజ్య‌ము పొలిమేర‌ల లోనికి ప్ర‌వేశించకుండ ప‌రాశ‌ర‌శాస్త్రి మంత్రిదిగ్భంధ‌న‌మును చేసెను.

వంక‌జాబిల్లి యోగ్యురాలు, ఉత్త‌మురాలు అని పొగ‌డిన విశేష‌గుణ‌ము ల‌న్నియు నీమె పీల్చిన నాస్తిక ధూమ‌మువ‌ల‌న వ్య‌ర్థ‌ములైన‌వి. వంక‌జాబ‌ల్లి యొక్క జీవుడు త‌త్కాష్ఠ‌గ‌త ధూమ‌పాన‌ముచే జ‌య‌ద్ర‌ధున‌కు వ‌శుడై త‌న‌కు స‌హ‌జ‌మ‌గు కార్య‌ములుగాక జ‌య‌ద్ర‌ధున‌కు ప్రియ‌ములైన కార్య‌ముల‌నే చేయుచుండెను.

శిశునాగుని పెండ్లియాడి వంకజాబిల్లి కాక‌వ‌ర్ణుడ‌న్న కూమారుని గ‌న్న‌ది. అప్ప‌టికామె త‌న‌లోనున్న భార‌మంత‌యు దిగిన‌ట్లుగ భావించిన‌ది. ఆమె బుద్ధిమాంద్య‌ము పోయి వివేక‌ము భాసింప‌సాగిన‌ది. ఇందువ‌ల‌న నాస్తిక‌ధూమ‌మామె గ‌ర్భ‌కోశ‌మున‌నే ప్ర‌వేశించి కుమార ప్ర‌స‌వ‌ము త‌రువాత నా కుమారుని తోడ క‌లిసి పోయిన‌ద‌న‌వ‌లెను. కాని వంక‌జాబ‌ల్లి వంటి సుకుమారియైన స్త్రీని రాజ్య‌విస్త‌ర‌ణ‌కాంక్ష ప‌ట్టి పీడించుట ధూమ‌ప్ర‌భావ‌ము చేత‌నా ?  లేక స్వ‌భావ‌జ‌నిత‌మా ?  యోచించ‌ప‌వ‌ల‌యును. ప‌ర‌శ‌ర‌శాస్త్రివంటి పండితుడీమెను ఉత్త‌మురాల‌ని పొగ‌డుట‌లో నీమెలోని లోభ‌ము ధూమ‌ప్ర‌భావ‌మేయ‌నుట క‌వ‌కాశ‌ము క‌లుగుచున్న‌ది. కాని ఈమెలో నున్న యుత్త‌ముడైన జీవుడు చేసిన యుత్త‌మ‌కార్య‌ము లేవియు లేకుండుట‌చే నీమెలో నిక్షిప్త‌మైన ధూమ‌రజ్జు సంతాన‌ము కాక‌వ‌ర్ణుని జ‌న‌నముతో నిర్గ‌మింప‌క ఆమె న‌ర‌న‌ర‌ముల వ్యాపించి రక్త‌మున న‌మ్మిశ్రిత‌మై యుండెన‌న‌వ‌లెను.

వంక‌జాబిల్లిని భ‌ర్త‌కు పుత్రునికి రాజ్య‌లాభ‌ము గ‌డించుట‌కై నాస్తిక‌శేఖ‌రుడైన జ‌య‌ద్ర‌ధునితోచేతుల‌ను క‌లిపి వానిని వేద‌మ‌రీచిపైకి ఉసిగొల్పిన‌ది. శిశునాగుడు వేద‌మ‌రీచి యొక్క శీల‌మును హ‌రింప‌గా న‌త‌ని భార్య యామెప్రాణ‌ముల‌ను రాజ్య‌మును హ‌రింప‌జేసిన‌ది. ఉత్త‌మురాలైన స్త్రీ యుట్లు చేయ‌దు, గ‌నుక నీమెను స్వార్థ‌ప‌రురానియు రాజ్య కాంక్షాప‌రురాల‌నియు చెప్ప‌వలెను.

వంక‌జాబిల్లి మామ‌గారి నావేశించిన జ‌య‌ద్ర‌ధుడు వ‌ద‌ల‌గ‌నే నారాజు చ‌నిపోవును. వంక‌జాబిల్లి జీవుడులేని మామ‌గారు శ‌రీరముతో నుండియేమి ?  ఉండ‌క‌యేమి య‌ని భావించి జ‌య‌ద్ర‌ధుని వెడ‌ల‌గొట్టించి రాజు మ‌ర‌ణ‌మున‌కు కార‌కురాలైన‌ది.

త‌న‌కు రాజ్య‌మున‌కు యెంత‌యో చేసిన ప‌రాశ‌ర‌శాస్త్రి బ్ర‌తికి యుండుట‌వ‌ల‌న కొన్ని యిక్క‌ట్లున్నందున‌, అత‌నిని స్వ‌చ్ఛంద‌ముగ మ‌ర‌ణింపుమ‌ని పోత్స‌హించిన‌ది. ప‌రాశ‌ర‌శాస్త్రి నాస్తిక‌ధూమ కాష్ఠ‌ముల‌ను తెప్పించి ధూమ‌ము నొక రేచుక్క‌తో పీల్పించెను. ఇట్లు చేయుట‌వ‌ల‌న ప్ర‌జ‌ల‌కాధూమ‌మును పీల్చి వ‌ల‌సిన ప్ర‌మాద‌ము త‌ప్పిన‌ది. ఆ కుక్క మ‌రియొక నాస్తిక ధూమ‌పాన‌ము చేసిన వానిని చూచిన యెడ‌ల వెంట‌నే వానిపై నురికి వాని ర‌క్త‌మంత‌యు పీల్చువ‌ర‌కు వానిని వ‌ద‌లి పెట్ట‌దు. శిశునాగుడును న‌త‌ని కుమారుడైన కాక‌వ‌ర్ణుడును నాధూమ‌పాన‌ము చేసిన‌వారు గ‌నుక ప‌రాశ‌ర‌శాస్త్రి కుక్క చూచు చుండ‌గా వారిచేత బెల్ల‌ము వండించి పెట్టి వార‌కి దానిని మ‌చ్చిక చేయించెను. త‌రువాత వంక‌జాబిల్లి యా కుక్క‌ను త‌న సేధ‌మున‌కు తీసికొనిపోయిన‌ది.

మ‌గ‌ధ‌రాజ్య‌ము ఆమె హ‌స్త‌గ‌త‌ము కాగానే జ‌య‌ద్ర‌ధుని కోట‌నుండి వెడ‌ల న‌డిపించిన‌ది. అత‌డు కొంచెము దూర‌ము వెళ్ళిన త‌రువాత రేచుకుక్క‌ను కూడా వ‌దిలిన‌ది జ‌య‌ద్ర‌ధుని కామె ఆ కుక్క‌ను చంపుమ‌ని ముందే హెచ్చ‌రించిన‌ది.

ఆ కుక్క జ‌య‌ద్రధుని ర‌క్త‌ము త్రావుట‌యు, జ‌య‌ద్ర‌ధుడా కుక్క‌ను ఖ‌డ్గ‌ముతో పొడుచుట‌యు నొకే స‌మ‌య‌మున జ‌రిగిన‌వి. ఆ రెండు జీవ‌ములొక్క‌సారి శ‌రీర‌ముల‌ను వీడిన‌వి.

వంక‌జాబిల్లి యుక్తులు ప‌న్నుట‌లోను, ఊహ‌లు చేయుట‌లోను జ‌య‌ద్ర‌ధుని ప‌రాశ‌ర‌శాస్త్రిని మించిన‌ది. మ‌హావీరుల‌కు సైత‌ము సాధ్య‌ప‌డ‌ని కార్య‌ములీమె బుద్ధి బ‌ల‌ముతో సాధించిన‌ది. ఈమెకు ద‌యాదాక్షిణ్య స‌హిత‌మైన సున్నిత హృద‌య‌ము లోపించిన‌ది. రాజ‌కీయ దురంధ‌రురాలు కుటిల నీతితో న‌గ్ర‌గ‌ణ్య, రాజ్య‌కాంక్ష బ‌ల‌సియున్న మాన‌వ మాత్రులే విధ‌ముగ సంచ‌రింతురోయ‌ట్లే వంక‌జాబిల్లి సంచ‌రించిన‌ది. ఈ న‌వ‌ల‌లో నీమె కిచ్చి నంత ప్రాముఖ్య‌ము మ‌రో పాత్ర కీయ‌లేదు.