బుర్ర శాస్త్రీయం

బుఱ్ఱ‌శాస్త్రి - క‌థా - క‌మామీషు

ఇంటిపేరు నిశానీవారు. శాస్త్రి అన‌గానే ఏదో పండితుడ‌నుకోనేరు. ముందుగా ఇత‌డు వేలిముద్రాంకితుడే. కాస్త బుఱ్ఱ త‌క్కువ వాడ‌వ‌డం చేత బుఱ్ఱ‌శాస్త్రి అని నామ‌క‌ర‌ణం చేశారు. మా మామ‌గారు కే.శే. శ్రీ దిట్ట‌క‌వి రామ‌కృష్ణ‌య్య‌గారు. రామ‌కృష్ణ‌య్య గారంటే భ‌గ‌వ‌ద్గీత‌, ఉప‌నిష‌త్తులు, వేద వేదాంతాల మీద గ‌ట్టిప‌ట్టు ఉన్న ఆధ్యాత్మిక‌వేత్త ! నిలువెల్లా అద్వైత‌మే కానీ వారి జిహ్వ‌గ్రాన హాస్య‌ర‌సం ఉప్ప‌తిల్ల‌కుండా ఉండ‌దు. అమాయ‌క‌త్వానికి ప్ర‌తీక‌గా ఒక బుఱ్ఱ‌శాస్త్రి నీ గ‌డుసుత‌నానికి మారుపేరుగా గొయ్య‌మ్మ‌నీ ఉద‌హ‌రిస్తూ ఉండేవారు. వృత్తిరీత్యా ప్లీడ‌ర్ అవ‌డంవ‌ల్ల మారు మూల ప‌ల్లెల నుండా న్యాయం కోసం అనేక‌మంది వ‌స్తూవుండేవారు. బుఱ్ఱ‌శాస్త్రి ని వారికి ర‌క‌ర‌కాలుగా ప‌రిచ‌యం చేసేవారు రామ‌కృష్ణ‌య్య‌గారు. బుఱ్ఱశాస్త్రి ఇలా అన్నాడు. ఆయ‌న త‌లుచుకుంటే ఎలాంటి కేసైనా ఇట్టాతేలిపోయేట్టు చేస్తాడు. ప్లీడ‌రీ చ‌ద‌వ‌క‌పోయినా మంచి స‌ల‌హాలిస్తాడు. మీ కేసు ఆయ‌న‌కి చెప్పి స‌ల‌హా అడుగుదాం అనేవారు. స‌ద‌రు బుఱ్ఱ‌శాస్రిగార్ని చూడాల‌ని వాళ్ళు ఆశ‌గా ఎదురు చూసేవారు. మ‌ర్నాడు బుఱ్ఱ‌శాస్త్రి ఈ స‌ల‌హా చెప్పాడ‌య్యా మీకేసుకు తిరుగులేదు అని వాళ్ళ‌కి ధైర్యం చెప్పేవారు. గొయ్య‌మ్మ పాపం బుఱ్ఱ‌శాస్త్రిని ఎక్క‌డికీ వెళ్ళ‌నీదు అనేవారు. దీంతో వాళ్ళ దృష్టిలో ప్లీడ‌రు కాని ప్లీడ‌రు బుఱ్ఱ‌శాస్త్రి ! గ‌డుసుపిండం గొయ్య‌మ్మ !

ఇక పిల్ల‌ల‌కి బుఱ్ఱ‌శాస్తినింకో విధంగా ప‌రిచ‌యం చేశారు. బుఱ్ఱ‌శాస్త్రికి గారెలు తినాలి అనే కోరిక హెచ్చు. కాని గొయ్య‌మ్మ చ‌చ్చినా బుఱ్ఱ‌శాస్త్రిని గారెలు తిన‌నీదు. అష్ట‌క‌ష్టాలుప‌డి గారె ముక్క‌నోట్లో పెట్టుకో బోయె స‌మ‌యంలో గొయ్య‌మ్మ ఆకాశం మీంచి ఊడిప‌డ్డ‌ట్టు రోక‌లిబండో, కొరకంచో ( కొర‌కంచంటే కొంత‌మందికి తెలిక పోవ‌చ్చు - పొయ్యితో మండుతూ ఉండే క‌ట్టెపుల్ల ) ప‌ట్టుకు వ‌చ్చి ధ‌బ్బుని గారెముక్క‌ని క్రింద‌ప‌డేసి కాలితోన‌లిపిపారేసేది. పాపం పిల్ల‌లు వాళ్ళ‌కి పెట్టిన గారెల్ని అమ్మ‌మ్మ‌కి తెలీకుండా దాచిపెట్టేవారు బుఱ్ఱ‌శాస్త్రి వ‌స్తే పెద‌డామ‌ని ! ఆ బుఱ్ఱ‌శాస్త్రి నిజంగా ఉంటేగా రావ‌డానికి ! ఎలావ‌స్తాడు ? ఎలా రాగ‌ల‌డు ?

ఆయ‌న స‌తీస‌మేతంగా శ్రీ దిట్ట‌క‌విరామ‌కృష్ణ‌య్య గారి ఊహాగ‌ర్భం నుండి పుట్గుకొచ్చిన పుత్ర‌ర‌త్న‌మాయె ! ఈ బుఱ్ఱ‌శాస్త్రి ఈ వంశంలో త‌ర‌త‌రాలుగా వ‌స్తున్నాడు. ముందు రామ‌కృష్ణ‌య్య‌గారే బుఱ్ఱ‌శాస్త్రి అని అమ్మ‌ల‌క్క‌లు చెవులు కొరుక్కునేవారు అమ్మ‌ల‌క్క‌ల‌కు సాయం కోడ‌లుకూఆడా చేరింది ! ఆయ‌న త‌రువాత ఆ హోదా వారి కుమారుడికి ద‌క్కింది. అన్న‌ట్లు చెప్ప‌డం మ‌రి చేపొయ్యా. బుఱ్ఱ‌శాస్త్రికి లిక్క‌న్న అనీ లిక్కావ‌ధానీ అనీ పేరుప‌డ్డ ఒక వంశోద్ధార‌కుడు కూడా ఉన్నాడు. ఇప్పుడా నిక్కావ‌ధాని పెద్ద‌వాడై పోగా బుల్లి లిక్కావ‌ధాని మ‌ళ్ళీ బుఱ్ఱ‌శాస్త్రిగా రూపాంతరం చెంది మ‌రో లిక్క‌న్న‌కి జ‌న్మ‌నిచ్చాడు.

ఇలా దిట్ట‌క‌వి వారికీ బుఱ్ఱ‌శాస్త్రిగారికీ అవినాభావ సంబంధం ఏర్ప‌డి పోయింది.

ఈ బుఱ్ఱ‌శాస్త్రీయాన్ని అక్ష‌ర బ‌ద్ధం చేసే స‌మ‌యానికి నిర‌క్ష‌రాస్యుడైన బుఱ్ఱ‌శాస్త్రి లౌకికుడై త‌న గారెల కోర్కె ఎలా తీర్చుకోవాలా అన్న ర‌క‌ర‌కాల యుక్లులు ప‌న్నుతూ మేధావిగా మారుతూ మ‌ళ్ళీ పాత రూపానికొస్తూ అస‌లిత‌డు అమాయ‌కుడా ? అతి తెలివి వాడా ? అన్న మీమాంస‌ను ప్ర‌జ‌ల‌కు క‌ల‌గ‌జేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా మా బుఱ్ఱ‌శాస్త్రి న‌లుగురికి సాయం చేస్తాడే గాని హాని చెయ్య‌డు న‌లుగుర్ని న‌వ్విస్తాడేగాని ఎవ్వ‌ర్నీ ఏడిపించ‌డు ఇదీ క‌థ‌.

ఈ ర‌చ‌న‌కు స‌హాయ స‌హకారాలు అందించిన మా బావ‌గారు శ్రీ బుద్ధ‌వ‌ర‌పు కామ‌రాజుగార్కి నా కృత‌జ్ఞ‌త‌లు ధ‌న్య‌వాదాలు !

బుఱ్ఱ‌శాస్త్రి సృష్టిక‌ర్త శ్రీ దిట్ట‌క‌వి రామ‌కృష్ణ‌య్య గారికే ఈ న‌వ‌ల స్వంతం.

డా. దిట్ట‌క‌వి శ్యామ‌లాదేవి

24 - 3- 2014