1
 

                                                                                     బుర్ర శాస్త్రీయం

బుర్ర శాస్త్రీయం అంటే నేను రాసిపారేసిన ఏదో శాస్త్రం అనుకోకండి ఇది నా క‌థ‌.శాస్త్ర‌గంథాలు రాసిపారేసేంత‌టి చ‌దువు చ‌దువుకోక‌పోయినా ఏదో నాకు తోచిన‌ట్టు నా క‌థ రాసి పారేసేంత‌టి చ‌దువు చ‌దువుకున్నాను.నేను చ‌దువుకోలేదు అని నువ్వే చెబుతున్నావు. నీకు సంధ్య‌న్నారాద‌ని నీ మొహ‌మే చెప్పుతోంది. చ‌దువూ సంధ్యా రాని నువ్వు నీ క‌థ రాసిపారేయ‌డానికి నువ్వేమైనా రాజ‌కీయ వీరుడివా ? సినిమా యాక్ట‌రువా ? పోనీ స్మ‌గ్ల‌ర్ వా ? లేక‌పోతే మాంచి క్రిమిన‌ల్‌వా ? ఎవ‌రు నువ్వు ? నీ ఆత్మ‌క‌థ మేమెందుకు చ‌ద‌వాలి ? అని ఎవ‌రికైనా సందేహం రావ‌చ్చు. ఈ సందేహం స‌బ‌బే. న్యాయ‌మే.ఎవ‌రో న‌లుగుర్ని వేలెత్తి చూపించి వీళ్ల‌లో నువ్వెవరు ? అని ప్ర‌శ్నించారే ఆ న‌లుగురిలో నేనెవ‌ర్నీకాను. ఆ మ‌హాభాగుల్లో నేనొక‌ణ్ణి అయితే నా క‌థ ఏ పండితుడో, ప‌త్రికా సంపాద‌కుడో వ్రాసి ఉండేవాడు. నేను కాదు కాబ‌ట్టే నా క‌థ నేనే వ్రాసుకోవ‌ల‌సి వ‌చ్చింది. నీ క‌థ మేమెందుకు చ‌ద‌వాలి ? అని బొత్తిగా, నిర్మొహ‌మాటంగా అడిగితే నేనేం చెప్పేది ? ఆ మ‌హానుభావుల క‌థ ఖుషీకోసం, థ్రిల్ కోసం చ‌దువుతారు. మ‌రి నా క‌థ‌, నాప‌ట్ల చిన్న సానుభూతితో చిరున‌వ్వు కోసం చ‌ద‌వ మంటున్నాను. అయినా, ఇంకా మొద‌లైనా పెట్ట‌కుండానే ఎందుకు చ‌ద‌వాలి ? అంటూ అడ్డు త‌గ‌ల‌డం, తిన‌కుండా రుచుల‌డ‌గ‌డం వంటిది వ్ర‌తం చేయ‌కుండా ఫ‌లితం ఆడ‌గ‌డం వంటిది. కేసు విచారంచ‌కుండా తీర్పు ఏమిటి అని కేసు విచారించ‌కుండా తీర్పు ఏమిటి అని అడ‌గ‌డం వంటిది.ఒక్క‌మాట గ‌ట్టిగా చెపుతున్నాను. నా క‌థ. ఆ మొద‌లు అః వ‌ర‌కూ పూరాగా రాసేసి మీ ముందుచా అని నా అభిమ‌తంకాదు. నా జీవితంలోని ఒక రుచిక‌ర‌మైన భాగం గారెల‌కు నోచుకోని జిహ్వ అనేటటువంటిది, మీ ముందుంచాల‌ని నా అభిమ‌తం. ఇందువ‌ల్ల నాకు సానుభూతి, మీకు స‌ర‌దా ల‌భిస్తాయ‌ని నా అభిప్రాయం.

నా పూర్తిపేరు నిశాని బుర్ర‌శాస్త్రి. నిశాని అన్న‌ది మా ఇంటిపేరు. నాకు సార్థ‌క‌నామం కూడా ఏ పాటి అక్ష‌ర‌జ్ఞానం రావాల‌న్నా బొట‌న‌వ్రేలు, చూపుడువ్రేలు, మ‌ధ్య‌వ్రేలు మూడు వ్రేళ్ల‌ను ఉప‌యోగించాలి. నిశాని వేయాలంటే ఒక బొట‌న‌వ్రేలు చాలు. చులాగ్గా హాయిగా వేసేయ‌చ్చు. ఏ నిశానీదారుకైనా అక్ష‌రాల ఉప‌యోగం రాక‌పోవ‌చ్చు గానీ ఎంతో అక్ష‌ర‌జ్ఞానం ఉన్న ఛాన్స్‌ల‌ర్‌కైనా స‌రే ఛీఫ్‌జ‌స్టిస్‌కైనా స‌రే నిశానీ వేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం రాక‌త‌ప్ప‌దు. అందుచేత‌నే నేను అక్ష‌రం వ్రాయడం కంటె నిశానీ వేయ‌డం బాగా నేర్చుకున్నాను. అందుకే నిశానీ అన్న‌ది నా సార్థ‌క నామ‌మ‌ని చెప్పాను. మా ఇంటిపేరు శాశ్వ‌తంగా నిల‌బెడుతున్నాను.ఎప్పుడు ఎక్క‌డ వేలుముద్ర వేద్దామా అని నాకు ఒక‌టే స‌ర‌దా. ఒక‌టే ఉబ‌లాటం. ఏ ప‌త్రంలో అయినా స‌రే, ఏ త‌గాదాలో అయినా, ఏ కొట్లాట‌లో అయినా స‌రే, సాక్షిగా వ్రేలుముద్ర ముచ్చ‌ట‌గా వేసేవాణ్ణి. ఆడ‌పా త‌డ‌పా ఇష్టం వ‌చ్చిన‌ట్లు సంగ‌తీ సంద‌ర్భం తెలుసుకోకుండా గ్రుడ్డి ఎద్దు చేల్లో ప‌డ్డ‌ట్టు, ఎడాపెడా విచ‌క్ష‌ణ లేకుండా వేలిముద్ర‌లు గ్రుద్దేసేయ‌డంవ‌ల్ల అప్పుడ‌ప్పుడు ఇబ్బందుల్లో ప‌డి, చావుత‌ప్పి క‌న్నులొట్ట‌పోయి, బ్ర‌తికి బ‌య‌ట‌ప‌డినంత ప‌న‌యినా, నేను క‌ష్ట‌పెట్టుకునే వాణ్ణి కాదు. ఆ శ్రీ‌రామ చంద్రుడంత‌టి వాడే క‌ష్టాలు ప‌డ్డాడు అని నాన్న చెప్పాడు గ‌దా ? ఇక నాబోటి గాడొక లెక్క అనుకున్నాను. అంతేగానీ ఆ శ్రీ‌రామ‌చంద్రుడు వేలిముద్ర‌లేసి క‌ష్టాల పాల‌న లేదు, బంగారం ముద్ర‌లున్న తేది చూసి క‌ష్టాల పాల‌య్యాడ‌నే తెలివి నాకు లేక‌పోయింది.మా ఇంటిపేరు (నిశాని) నిల‌బెట్ట‌డానికి నేను ఎన్నో నిశానీలు వేసి బాధ‌లు ప‌డ్డాను. క‌ష్టాలు అనుభ‌వించాను. కానీ నా సాటివాళ్లు ఎక్క‌డోగానీ వుండ‌రు. ఉదాహ‌ర‌ణ‌కి చూడండి. నా స్నేహితుడొకాయ‌న ఇంటి పేరు క‌ప్ప‌గంతుల అని ఉంది. ఆయ‌న ఇంటిపేరు నిల‌బెట్ట‌డానికి క‌ప్ప‌గంతుల మాట క‌ప్ప ఎరుగ‌నుగానీ ఆయ‌న మామూలు కుప్పిగంతులైనా వేయ‌లేద‌ని ఆయ‌నే అంగీక‌రించాడు. మ‌రి ఆయ‌న కంటే నేను గొప్ప‌వాణ్ణి కాదా ? నేను గ‌ర్వ‌ప‌డ‌వ‌ద్దా ? మీరే చెప్పండి ? !నిశానీ అంటే వేలిముద్ర క్రింద నా పేరు నిశానీ బుర్ర‌శాస్త్రి అని రాయాలి. ఈ పేరు ఉండ‌కూడ‌నంత పొడుగ్గానూ, ఉండ‌వ‌ల‌సినంత నాజూక్కాను లేనందువ‌ల్ల నాకు రావ‌ల‌సినంత పేరు ప్ర‌ఖ్యాతి రావ‌డంలేద‌ని భావించుకున్న వాడినై, వ‌ర్త‌మాన కాల ఫ్యాష‌నానుసారం ముచ్చ‌ట‌గా క్లుప్తీక‌రించి ఎన్‌.బి.శాస్త్రి అని వ్రాస్తున్నాను. కాబ‌ట్టి మీరు ఎక్క‌డైనా ఎన్‌.బి.శాస్త్రి అని వేలిముద్ర క్రింద క‌నిపిస్తే అది నేనే అన‌గా నిశానీ బుర్ర‌శాస్త్రి అని గ‌మ‌నించ వ‌ల‌సిన‌ద‌ని కోరుతున్నాను.

మా నాన్న పేరు భ‌ర‌త‌శాస్త్రి. నేను నా ఈ క‌థాభాగాన్ని మీకు వినిపించే నాటికి మా నాన్న‌గారు ప‌ర‌మ‌ప‌దించారు. మా అమ్మ‌గారు చిల‌క‌మ్మ‌. ఆమె కూడా స్వ‌ర్గ‌స్థురాలైంది. పోయిన వాళ్ల‌ను గురించిన చెడును గురించి త‌న‌పెట్ట‌రాద‌ని మా నాన్న‌గారు హిత‌వు చెప్పేవారు కాబ‌ట్టి మా త‌ల్లిదండ్రుల‌ను గురించిన సెబ్బ‌ర‌ను ప్ర‌స్తావించ‌ను. కానీ నా పుట్టుక‌ను గురించి బాల్యాన్ని గురించి చెప్ప‌వ‌లసిన‌వి, అల్ప‌విష‌యాలే అయినా నాలుగు మాట‌లు మ‌న‌వి చేస్తాను.మా ఆమ్మ‌కీ ఎన్నాళ్ల‌కీ సంతానం క‌ల‌గ‌లేద‌ట‌. ఆ రోజుల్లో సంతానం క‌ల‌గ‌ని దంప‌తులు ఆస్ప‌త్రుల చుట్టూ, డాక్ట‌ర్ల చుట్టూ తిరిగి సిగ్గూబిడియ‌మూ విడిచిపెట్టేసి, ప‌రీక్ష‌లు చేయించుకుని, సంతానం ఎందుకు క‌ల‌గ‌డంలేదో నిర్ధార‌ణ చేయించుకుని, మందులు సేవించో, ఆప‌రేష‌న్లు చేయించుకునో సంతానం క‌నేవారు కారుట‌. ఇప్ప‌టి వాళ్ల‌లాగ తెలివి మీరిపోలేదుట‌. మా అమ్మ వెయ్యి గుళ్లూ గోపురాల్లోనూ ఉన్న వెయ్యి దేవుళ్ల‌కు మొక్కుకుంది. వంద తీర్ధ‌యాత్ర‌లు చేసి పూజ‌లు, పున‌స్కారాలు, స‌మారాధ‌న‌లూ చేసింది. యాభై మంది సాధువుల్నీ, గురువుల్నీ సేవించి ఉప‌దేశాలు పొంది, నానా ఆగ‌చాట్లూ ప‌డి న‌న్ను క‌న్న‌ద‌ట‌.నేను ఎర్ర‌గా బుర్ర‌గా బొద్దుగా ముద్దుగా ఉన్నాను. ఆ శిశుద‌శ‌లోనే గానీ ఇప్పుడు లేదు లెండి. నేను అపు రూపంగా, అసాధార‌ణ ప‌రిస్థితుల్లో పుట్టాను క‌నుక మా నాన్న‌గారూ, అమ్మ‌గారూ న‌న్ను అల్లారుముద్దుగా పెంచారు.నాలాగా పుట్టిన వాళ్ల‌కి త‌ల్లిదండ్రులు అచ్చిరాద‌నో, దిష్టి కొడుతుంద‌నో భ‌య‌ప‌డి, స‌న్యాసి అనో పెంట‌య్య అనో పేరు పెడ్తే ప‌దికాలాల పాటు చ‌ల్ల‌గా బ్ర‌తుకి ఉంటాడ‌నే న‌మ్మిక క‌లిగి ఉంటారు. కానీ నాకు బొర్ర‌కంటే బుర్ర పెద్ద‌దిగా ఉన్న‌ద‌నే విశ్వాసంతో మా త‌ల్లిదండ్రులు బుర్ర‌శాస్త్రి అని పేరు పెట్టారు.నా చిన్న‌త‌నం నాకు బాగా జ్ఞాప‌కం ఉంది. నేనంటే మా నాన్న‌కి అమ్మ‌కి ఎంతో మ‌రిపెం, గారాబం. నేను ఆడింది ఆట‌. పాడింది పాట‌. నేను ప‌ల‌కా బ‌ల‌పం ప‌ట్టు కోవాలో, గోటీబిళ్లా, గోలీక్కాయా ప‌ట్టు కోవాలో అంతా నా ఇష్టం. ఫ‌లితం నాకు జులాయిగా తిర‌గ‌డం అబ్బినంత బాగా, చ‌దువు అబ్బ‌లేదు. పుస్త‌కానిక‌నీ, పెన్సిల్‌క‌నీ అమ్మ‌ద‌గ్గ‌ర అబ‌ద్ధాలు చెప్పి డ‌బ్బులు ప‌ట్టుకుపోయి పాకంప‌ట్టిన వేరు సెన‌గ‌లు, పంచ‌దార చిల‌క‌లు కొనుక్కొని తినేవాడ్ని. అంచేత నా పొట్ట‌కోస్తే ఇవే క‌నిపిస్తాయి గానీ అక్ష‌ర‌మ్ముక్క క‌న‌బ‌డేది కాదు. బ‌డి

ఎగ్గొట్టి అల్ల‌రి చిల్లరిగా తిరుగుతూ అంద‌రిచేతా చివాట్లూ తిట్లూ తింటూ బాల్యం దాటిపోయి యౌవ‌నుణ్ణ‌య్యాను. మా నాన్న‌గారు ఎంత‌మాత్రం పండితుడో నేను అంచ‌నా క‌ట్ట‌నుగానీ నేను మాత్రం పూర్తిగా పండిత‌పుత్రుణ్ణే.మ‌న దేశంలో మ‌గాడికి, చ‌దువున్నా లేక‌పోయినా, సంస్కార‌మున్నా లేక‌పోయినా ఆరోగ్య‌వంతుడైనా రోగిష్టి అయినా, గుణ‌మున్నా లేక‌పోయినా, తెలివి ఉన్నా మూర్ఖుడైనా, పెళ్లీడు ఉంటే చాలు పెళ్లాడు కూతుర్లున్న తల్లితండ్రులు ఆ మ‌గాడి చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ చేస్తోంటారు. ఒక్క చ‌దువు మాత్రం లేదుగానీ నాకు మిగ‌తా అన్ని మంచి ల‌క్ష‌ణాలు ఉన్నాయి క‌దా. అందుచేత నాకు ఎన్నో పెళ్లి సంబంధాలువ‌చ్చాయి.అయితే, పెళ్లాన్ని పోషించ‌గ‌ల స‌మ‌ర్థ‌త ఈ మొగాడికి ఉందా లేదా అని మాత్రం చాలామంది పెళ్లికూతుళ్ల త‌ల్లిదండ్రులు ఆలోచించ‌రు. ఆ పెళ్ల‌య్యాక పెళ్లాన్ని పోషించ‌క ఏం చేస్తాడు ? అని త‌మ‌ని తాము స‌మ‌ర్థించుకుని ఆ మొగాడికోసం ఎగ‌బ‌డ‌తారు. కానీ పెళ్ళాం మాట అటుంచి నన్ను నేను పోషించుకోలేని అస‌మ‌ర్థుడ్ని అని మా నాన్నకు బాగా తెలుసు. అందుకే త‌న‌నేకాక న‌న్ను కూడా పోషించ‌గ‌లిగే అమ్మాయి కోసం వెదికి, మా నాన్న గొయ్య‌మ్మ అనే క‌న్య‌ను తెలివైన‌దిగా ఎంచి, గొయ్య‌మ్మ‌లాంటి స‌మ‌ర్థురాలు నాకు త‌గిన పిల్ల అని నిర్ణ‌యించి న‌న్ను గొయ్య‌మ్మకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ త‌ర్వాతే మా అమ్మా, నాన్నా కాలం చేశారు.మా నాన్న న‌న్ను గొయ్య‌మ్మ‌కి ఇచ్చి పెళ్లి చేశార‌ని చెప్పానుక‌దా. అంచేత న‌న్ను పోషించే భారం గొయ్య‌మ్మ‌మీద ప‌డింది. నాది మొద‌టినుంచి బాగా తిన్న నోరుక‌దా, గొయ్య‌మ్మ మొట్ట‌మొద‌ట చేసిన అని ఏమిటంటే నా నోరు క‌ట్టేసింది. ఆమె చేసిన క‌ట్ట‌డికి త‌ట్టుకోలేక కొట్టుమిట్టాడి పోయాను. ఒడ్డున ప‌డ్డ చేప‌లా గిల‌గిల లాడిపోయాను.

ఏమ‌య్యా ! నువ్వు ఏ కూలోనాలో చేసైనా నాలుగు రాళ్లు తేవ‌చ్చు. ఏ దుకాణంలో అయినా ప‌ద్దులు రాసి నాలుగు రాళ్లు తేవ‌చ్చు. మీరు ఏమీ చ‌దువుకోలేదాయె. వేలితో ముద్ర‌లేసి ఒక‌టో అరో అప్పుడ‌ప్పుడు సంపాయించింది నీ చిరుతిండికే చాల‌దాయె. పైగా డబ్బు రాక‌పోయినా అన‌ర్థాలు వ‌స్తున్నాయాయె. నేను మాత్రం ఎక్క‌డ్నించి తేగ‌ల‌ను ! అప్ప‌డాలు ఒత్తి, ఒడియాలు పెట్టి అమ్మ‌ల‌క్క‌ల‌కి అమ్మి అంతంత మాత్రంగా సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. నేను ఏ తిప్ప‌లో ప‌డి క‌లోగంజో ప‌డేస్తుంటే తాగి కూర్చోక‌, గారెలు కావాలి గారెలు కావాలి అంటూ ఏమిటి నీ గునుపు ? అంటూ గొయ్య‌మ్మ న‌న్ను సాధించేది. ఎప్పుడైనా గారెల‌డిగానో ఇంతెత్తు లేచేది. మా గొయ్య‌మ్మ న‌న్ను ఒక‌ప్పుడు ఏమండీ అని ఒక‌ప్పుడు ఏమ‌య్యా అని అంటుంది.న‌న్ను ఈ గొయ్య‌మ్మ‌కిచ్చి మా నాన్న న‌న్ను గోతిలోకి తోసేశాడు. కాక‌పోతే ఏమిటిది ? తానేమో నాకు ముద్ద‌ప‌ప్పు, పేరినెయ్యి పెట్టి పెంచాడు. ఈ గొయ్య‌మ్మేమో కొరివికార‌మో, కొత్తిమీర కార‌మో నూరి నా గొంతులోకి తోస్తుంది శివుడు మింగిన గ‌ర‌ళం ముద్ద అంటే ఇదేనేమో అనిపిస్తుంది.నాకు చిన్న‌త‌నాన్నుండీ గారెలంటే ప‌ర‌మ‌ప్రీతి. నాకు గారెల‌మీద ప్రేమ‌ని మా నాన్నే క‌లిగించాడు. మా అమ్మ స‌రేస‌రి మా చిట్టినాయ‌నకి గారెలిష్టం అని నా పుట్టిన‌రోజున కూడా నాకు గారెలే వండిపెట్టేది. వింటే భార‌త‌మే వినాలి తింటే గారెలే తినాలి అని నేను ఏ పూర్వ‌జ‌న్మ‌లోనో చెప్పి ఉంటాన‌ని నా గ‌ట్టి న‌మ్మ‌కం. నాకు గారెల‌మీద ఉన్న ప్రేమాభిమానాలు, త‌న‌మీద‌గానీ అఖ‌రికి మా త‌ల్లిదండ్రుల మీద‌గానీ లేవ‌ని మా గొయ్య‌మ్మ‌కూ తెలుసు. ఓనాడు ఏమ‌యిందో చెప్పుతాను.

పోపుల డ‌బ్బాలో అర్థ‌రూపాయి దాచాను. తీశావా ? అన్న‌ది గొయ్య‌మ్మ‌.ఆ ! అన్నాను కొంచెం న‌సుగుతూ.ఏం చేశావూ ? అన్న‌దామె కోసంగా.ఏం చేస్తామా ? నువ్వెలాగూ కొంటావుగ‌దా అని నేనే చేగోడీలు కొనుక్కొని తిన్నాను. అన్నాను. అయినా అర్ధ‌రూపాయికి గారెలొస్తాయా ఛ‌స్తాయా అన్నాను. అంతే గొయ్య‌మ్మ‌కి వ‌ళ్లు మండి పోయింది. గ‌ట్టిగా గొంతెత్తి తిట్లు లంకించుకుంది.నీకు ఇష్టం క‌దా పోనీ గారెలు వండిపెడ‌దాము అనుకుని ఆ అర్ధ‌రూపాయి దాచాను. ఇలాగే పైసాపైసా కూడ‌బెట్టి నీ మొహాన్న పెడ్దామ‌నుకున్నాను. వెధ‌వ దొంగ బుద్ధులు నువ్వూను. ఇక చ‌చ్చినా గారెలు వండ‌నుగాక వండ‌ను ! అని శ‌ప‌థం చేసింది.చ‌చ్చినా గారెలు వండ‌ను అంటున్నావు. ఏమిటీ నీ ఉద్దేశం ? అంటే నా త‌ద్దినానికైనా స‌రేవండ‌ను అనేక‌దూ నువ్వంటున్న‌ది ? అని నేనూ ఆగ్ర‌హంతో ఎలుగెత్తి ఆరిచాను.అదుగో అంతే. ఆనాటినుంచి మా ఇద్ద‌రి మ‌ధ్యా యుద్ధం ఆరంభ‌మైంది. ఈ గొయ్య‌మ్మ గారెలు చేయ‌క‌పోతే దిగ‌డిందేమిటి ? అని నాలో ప‌ట్టుద‌ల గ‌ట్టిప‌డింది. ఏ విధంగా గారెలు తినాలా ? డ‌బ్బెలా సంపాదించాలా అనే తాపత్ర‌యం నాలో పెరిగిపోయింది. ఈ మార్గాన్వేష‌ణ‌లో నా దృష్టి కేంద్రీకృత‌మైంది. ఇంత‌లో ఏమ‌యిందంటే -
గొయ్య‌మ్మా ! ఇదుగో శేరు మిన‌ప‌ప్పు తెచ్చా. నానేసి రుబ్బి వ‌డియాలు పెట్టి పెడుదూ. నువ్వు పెడితే చ‌క్క‌గా గుల్ల‌గా వ‌స్తాయి. అంటూ ప‌క్కింటి సుబ్బాయ‌మ్మ‌గారు గొయ్య‌మ్మ చేతికి చేట అందివ్వ‌డం చూశా. మా గొయ్య‌మ్మ ఆ ప‌ప్పులోని రాయీర‌ప్పా ఏరి, చేట‌ని నుల‌క మంచం క్రిందికి తోసింది. ఆమెకు అనుమానంగా ఉండి చెంబు పుచ్చుకుని కాల‌వ గ‌ట్టు కెళ్ల‌డం చూశాను. ఆమె తిరిగి వ‌చ్చేస‌రికి ఓ అర‌గంటైనా ప‌డుతుంద‌ని అంచ‌నా వేశాను. ఈ లోగా నా గాఢ‌వాంఛ చిర‌కాల వాంఛ తీర్చుకోవాల‌ను కున్నాను.గబ‌గ‌బ చేట‌లో ఉన్న మిన‌ప్ప‌ప్పు ఓ దోశెడు తీసుకుని రోట్లోపోసి ఓ గుప్పెడు ఉప్పేసి ఇన్ని నీళ్లుపోసి ఎడాపెడా రుబ్బ‌సాగాను. ఉన్న బ‌లాన్నంత ఉప‌యోగించి రుబ్బినా పిండి కాక‌పోగా ప‌ప్పంతా రోటికి అంట‌లంట‌లుగా అతుక్కు పోయింది. విరిగిపోయిన గ‌రిట‌కాడ‌తో దాన్నంతా గోకీగోకీ మ‌ళ్లీ రోట్లోకి తోసీ రుబ్బాను. అలాగ అయిదారుసార్లు నానా అవ‌స్థాప‌డ్డాను. అఖ‌రికి ఏదో పిండిలాంటి ప‌దార్థం కొంత న‌ల్ల‌గా ఉన్నా త‌యార‌వుతోంది.నా దృష్టింతా వీధిగుమ్మం త‌డికెకేసే ఉంది. గొయ్యమ్మ ఎక్క‌డ వ‌చ్చేస్తూందో అని ఆదుర్దా. ఆ కంగారులో దృష్టి రోలుమీద లేక‌, నా వేలు కూడా రుబ్బేసుకుని కుయ్యో మొర్రో అంటూ అరిచి న‌లిగిన వేలును నా నోట్లో పెట్టుకున్నాను.మొత్తంమీద చితికిన చిటిక‌న‌వేలును లెక్క చేయ‌కుండా గారెలు చేసుకుని తింటున్నాను క‌దా అనే ఆనందంతో ఉషారుగా రుబ్బేసి, పొయ్యిలో ముళ్ల కంప‌లు పెట్టి మంట చేశాను. ముళ్ల కంప‌ల్ని ప‌ట్టు కోవ‌డం చేతగాక చేతుల్లో ముళ్లు దిగినాయి. అయినా నేను ఏమీ చేయ‌లేదు. అల‌వాటు లేక పొయ్యి స‌రిగా అంటుకోక పొగ‌క‌మ్మి, క‌ళ్లూముక్కూ ఏక‌మైపోయినా ఎలాగో మంట చేశాను. అప్పుడు గుర్తొచ్చింది. ఇంట్లో నూనె చుక్క‌లేద‌ని.బాబోయ్ ! గొయ్య‌మ్మ వ‌చ్చేసే వేళ‌వుతోంది. ఆమెను కొంచెం సేపు అక్క‌డే కాల్వ‌ద‌గ్గ‌ర ఆప‌డం ఎలాగా ? అని ఆలోచించాను. నేను మొద‌ట‌నే చెప్పాగా నా బుర్ర మంచిద‌ని. గ‌బ‌గ‌బ ఎదురింటి వెంకాయ‌మ్మ గారింటికి ప‌రుగెత్తాను.పిన్నీ ! అని గ‌ట్టిగా ప‌లిచాను.ఏం శాస్త్రీఇలా వ‌చ్చావూ ? అన్న‌ది వెంకాయ‌మ్మ‌.ఆ ఏం లేదుపిన్ని. నీ కోడ‌లు కాల్వ‌గ‌ట్టు కెడితేనూ నాకేం తోచ‌క అన్న‌య్య‌తో క‌బుర్లాడ‌దామ‌ని ఇలాగ వ‌చ్చా అన్నాన్నేను. ఆ స‌మ‌యంలో పిన్ని మొగుడు బాబాయేగానీ అన్న‌య్య కాద‌ని నాకు తోచి చ‌చ్చింది కాదు. అలాగా అంటూ రివ్వున కాల్వ‌గ‌ట్టు వైపుకు వెళ్లిపోయింది వెంకాయ‌మ్మ‌.ఏదో వంక‌తో మ‌ధ్యాహ్న‌పూట ఆడాళ్లంతా కాల్వ ద‌గ్గ‌ర ఉన్న తాటితోపులో చేరి ఓ గంటైనా పిచ్చా పాటీ క‌బుర్లు చెప్పుకుంటూ కాల‌క్షేపం చేస్తుంటార‌ని నాకు తెలుసు. చెప్పిన క‌బురు చెప్ప‌కుండా చెప్పి మ‌హారంజుగా వెంకాయ‌మ్మ కాల‌క్షేపం చేయ‌గ‌ల‌ద‌నిన్నీ నాకు తెలుసు.ఒక‌వేళ మా గొయ్య‌మ్మ వ‌చ్చేస్తూంటే వెంకాయ‌మ్మ ఆమెని ఆపి వెన‌క్కిలాగి ఒక అర‌గంటైనా ఆమె క‌బుర్లు వినిపించ‌కుండా వ‌ద‌ల‌ద‌నిన్నీ నాకు గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. నాకీ పాటి టైము చాల‌నుకున్నాను. వెంకాయ‌మ్మ‌న‌టు పంపించి ప‌క్కింటి సుబ్బాయ‌మ్మ గారింటికి ప‌రుగెత్తాను. ఆవిడ నాక‌న్నా చిన్న‌ది అయినాఅత్తా ! ఓ గ్లాసెడు నూనె అప్పిద్దూ ! అన్నాను తొంద‌ర తొంద‌ర‌గా.గొయ్య‌మ్మ ఇంట్లో లేదా ? అంటూనే బుల్లి గ్లాసుతో నూనె తెచ్చి ఇచ్చింది.సుబ్బాయ‌మ్మ మా గొయ్య‌మ్మ‌కి ఇవ్వ‌వ‌ల‌సిన శేరుమిన‌ప‌ప్పు వ‌డియాల కూలీలో నాకు అప్పుగా ఇచ్చిన గ్లాసు నూనె ఖ‌రీదు విర‌గ్గోసుకుంటుంది. అందుకే అంత త్వ‌ర‌గా నాకు నూనె ఇచ్చింది.మా ఇంట్లో పెద్ద బూర్లెమూకుడు ఉంది. కానీ దానికి స‌రిప‌డిన‌న్ని స‌రుకులు లేవు. అందుచేత పెద్ద గ‌రిట కాలేసి, అందులో స‌గం నూనెపోసి కాగ‌పెట్టి రుబ్బిన మిన‌ప్పిండిని అర‌చేతిలో బిళ్ల‌లాగ వ‌త్తి మ‌ధ్య‌లో చిల్లుచేసి ఆ కాగిన నూనెలో వేశాను. చుయ్ మ‌ని చ‌ప్పుడైంది. ఆ చ‌ప్పుడు నా చెవుల‌కు ఎంతో శ్రావ్యంగా ఉంది. సంతోషంతో గంతు లెయ్యాల‌నిపించింది. కానీ అల్లాగే కూర్చుండిపోయాను. గ‌రిట‌లో గారె ఉడుకుతోంది. నేను సంతోషంతో ప‌ర‌వ‌శించి పోతున్నాను. గుమ్మం త‌డికె ఎవ‌రైనా తోశారో లేదో తోసిన చ‌ప్పుడు నాకు వినిపించ‌లేదు.

గ‌రిట‌లో గారె ఉడికింది. దాన్ని తియ్య‌డానికి ఇంకో గ‌రిటె క‌న‌ప‌డ‌లేదు. నా తెలివిని ఉప‌యోగించి పొయ్యిలో పెట్టే ఎండుపుల్ల‌తో గారెని తెల్ల ప‌ళ్లెంలోకి తోశాను. చ‌ల్లారేదాకా ఉండే ఓపిక నా జిహ్వ‌కు లేక‌పోయింది. ఆవురావురు మంటూ నోట్లో కుక్కుకున్నాను. వీపు వెన‌కాల పే....ద్ద చ‌ప్పుడు.నీ ఆత్రం గూలా ! ఇదా నువ్వు చేస్తున్న వెధ‌వ‌ప‌ని. వంటింట్లోంచి నూనె పొగ రావ‌డం చుయ్ మ‌ని చ‌ప్పుడ‌వ‌డం అప్పుడే అనుకున్నాను అంటూ పెద్ద గొంతుక‌తో అరుస్తూ ఒక్క అంగ‌లో నా ముందుకు దూకింది గొయ్య‌మ్మ‌. ఏ ద‌య్య‌మో, భూత‌మో అని ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాను. గ‌జ‌గ‌జ లాడిపోయాను. భూతంక‌న్నా భ‌యంక‌రంగా క‌నిపించింది మా గొయ్య‌మ్మ‌.నాకు నోట‌మాట రాలేదు. నోట్లో నిప్పుముద్ద లాగా ఉప్ప‌గా వేడిగా మండిపోతున్న గారెను తుపుక్కున ఉమ్మేసి వ‌డుపు చూసుకుని వీధిలోకి ప‌రుగెత్తాను. పొయ్యిలో మండుతూ మండుతున్న కొర‌కంను పుల్ల‌ను చేత‌పుచ్చుకొని గొయ్య‌మ్మ నా వెంట‌బ‌డింది. న‌న్ను ప‌ట్టుకోలేక అలిసిపోయి మళ్ళీ కొంప‌కు వ‌స్తావు కాదా ? అప్పుడు చెప్పా నీ ప‌ని అని స‌వాశ్లు చేసి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది గొయ్య‌మ్మ‌.నేను కాలిన బొబ్బ‌ల‌కి నోటి త‌డి రాసుకుంటూ ముళ్లు తీసుకుంటూ ఆక‌లితో మాడుతూ ఆ రాత్రంతా మా ఊరికి చివ‌ర‌గా ఉన్న రామాల‌యంలో గ‌డిపాను. ఇవ్వాళ సంగ‌తి రేప‌టికి మ‌ర్చిపోతుందిలే అనుకున్నాను.మా నాన్న శ‌త‌విధాలా పోరినా నేను చ‌దువుకోనందుకు, అడ్డ‌గాడిద‌లా తిర‌గ‌డ‌మేగానీ అర‌గానీ సంపాదించ‌డం నేర్చుకోనందుకు ఆ రాత్రి మొద‌టిసారిగా ఏడ్చాను.*********

నేను నిద్ర లేచేస‌రికి తెల్ల‌గా తెల్లారి ఉంది. ఒళ్ళంతా పులిసి పోయిన‌ట్లుంది. ఇంటికి రా నీ ప‌ని చెప్పా అని మా గొయ్య‌మ్మ చేసిన స‌వాలు నా చెవుల్లో గింగురుమంది. సీతారామాంజ‌నేయుల వాళ్ల‌కి పాచిముఖంతోనే సాష్టాంగ ప‌డ్డాను. ఆ దేవుళ్లు క‌ష్ట‌సుఖాలు స్వ‌యంగా అనుభ‌వించి తెలుసుకున్న వాళ్లు. క‌ష్టాలు త‌ప్ప సుఖం ఎరుగ‌ని న‌న్ను క‌నిక‌రిస్తార‌ని ఆశ‌. నిన్న మ‌ధ్యాహ్నం ఏం తిన్నానో ఏంలేదో క‌డుపు న‌క‌న‌క లాడుతోంది. నాకిప్పుడున్న క‌ష్టం ఇది.ఓసి గొయ్య‌మ్మా ! ఇంటికొస్తే నా ప‌ని చెప్పావా ? ఉండు ఇంటికొచ్చి నీ ప‌నిప‌డ్తా అని గ‌ట్టిగా స‌వాలు చేశాను. లోప‌ల్లోప‌ల కానీ ఏం చెయ్యాలో తోచ‌లేదు. ప్ర‌క్క‌లాగా ప‌ర్చుకున్న తువ్వాలు తీసి దులుపుకుని భుజాన వేసుకుని కాళ్లీడ్చుకుంటూ రామాల‌యం నుండి కాల్వ‌గ‌ట్టుకు వెళ్లాను. ఓ వేప‌మండ విరిచి ప‌ళ్ళు తోముకున్నాను. గ‌ట్టుమీద ఓ చెట్టువార చొక్కా, పంచ విప్పి లుంగ‌గా చుట్టి, దానిపైన తువ్వాలు పెట్టి ఏట్లోకి దిగాను. నిన్న మ‌ధ్యాహ్నం గారెలు చేసేట‌ప్పుడు భుజం మీద వేసుకున్న తువ్వాలు రాత్రి ప‌డుకోడానికి ఇప్పుడు ఒళ్లు తుడుచుకోడానికి ఎంత‌గానో ఉప‌యోగిస్తోంది. క‌ట్టుబ‌ట్ట‌లు త‌డిపేస్తే అవి ఆరేవ‌ర‌కు చాలాసేపు దిగంబ‌రంగా కూర్చోవాలి. అంత‌కంటే దిగంబ‌రంగా గ‌బ‌గ‌బ స్నానం చేయ‌డం మేలు. కానీ అలాగ అందునా బ‌హిరంగంగా నేనెప్పుడూ జ్ఞానం తెలిశాక స్నానం చేయ‌లేదేమో ఎంతో సిగ్గుప‌డి పోయాను. పొడిబ‌ట్టలు క‌ట్టుకుని, త‌డి తువ్వాలు భుజాల‌మీద క‌ప్పుకుని, నీర‌సంగా ఉళ్లోకి బ‌య‌లుదేరాను. అష్ట‌క‌ష్టాలు అంటూంటారు అవేమిటో నాకు తెలియ‌దుగానీ కంటినిండా నిద్ర లేక‌పోవ‌డం, క‌డుపునిండా కూడు లేక‌పోవ‌డం చాలా పెద్ద క‌ష్టాల‌ని మాత్రం నా స్వానుభ‌వంవ‌ల్ల చెప్ప‌గ‌ల‌ను.మా ఊళ్ళో ఎర్రాచారి అని ఓ ఎర్ర‌టి వైష్ణ‌వుడున్నాడు. ఆ పేరు ఆయ‌న త‌ల్లిదండ్రులే పెట్టారో ప‌దిమందీ వాడే పేరో అస‌లు పేరేదో స‌రిగా తెలియ‌దుగానీ ఎర్రాచారి ఎర్ర‌గా వుంటాడు. విష్ణు పాదాలంత పెద్ద ప‌ట్టివ‌ర్థ‌నాలు నొస‌టినింటా ముద్ద‌గా దిద్దుతాడు. ఎర్రాచారి అయుర్వేద వైద్యుడు. ఆయ‌న వైద్యానికి కావ‌ల‌సిన మందుల‌న్నీ ఒక సంచీలో ఉంటాయి. ఆ సంచిలో ఆరు అర‌లున్నాయి. ఒక అర‌లో కుప్పెలు, ఒక అర‌లో సీసాల్లో భ‌స్మాలు, ఒక అర‌లో సీసాల్లో ద్ర‌వాలు, ఒక అర‌లో సీసాల్లో మాత్ర‌లు, ఒక అర‌లో మూలిక‌లు, ఒక అర‌లో ఆకులు ఉన్నాయి. ఆయా అర‌ల్లో ఆయా మందులు క‌ట్టిన కాగిత‌పు పొట్లాలున్నాయి. ఈ సంచీ మూతి పాత న‌వారుతో క‌ట్టి ఉంటుంది.ఎర్రాచారి హ‌స్త‌వాసి మంచిది. నోటివాసి ఇంకా మంచిది. ఈ రెంటివ‌ల్ల ఆయ‌న వ‌రుమానం బావుంది. ఎర్రాచారి వైద్యం కావ‌ల‌సిన వాళ్ల‌కి వైద్యం చేస్తాడు. స‌ల‌హా కావ‌ల‌సిన వాళ్ల‌కి స‌ల‌హా ఇస్తాడు. ఎల్ల‌వేళ‌లా ఎల్ల‌ర‌కీ ఉప‌కారి. ఆయ‌న హ‌స్త‌సాముద్రికాలు, జ్యోతిష్యాలు ఇటువంటి వాటి జోలికి పోడు. పైగా వీటిని వ్య‌తిరేకిస్తాడు. ఇటువంటివి వైద్య‌వృత్తి ధ‌ర్మానికి విరుద్ధం అంటాడాయ‌న‌.ఎర్రాచారి న‌శ్య‌ప్రియుడు. ఆయ‌న రొంటిని వెండిపొన్ను కాయ‌నిండా క‌మ్మ‌ని నేతితో త‌యారుచేసిన క‌మ్మ‌ని లంక పొగాకు న‌శ్యం ఉంటుంది.శాస్త్రీ కుల‌ధ‌ర్మాలు ఏం చెప్పాయో తెలుసా ! వైష్ణ‌వులు తంబాకు, శైవులుఉ న‌శ్యం సేవించాల‌ని. ఈ కుల‌ధ‌ర్మాలు ఎలా ఏర్పడ్డాయో చిత్రంగా ఉంది. నార‌దుడు భూలోకంలో తిరుగుతూ గుంటూరు పొగాకును మెచ్చుకుని ఒక మ‌ణుగు పొగాకు శివుడికి బంగీలుగా గ‌ట్టి పంపించాడ‌ట‌. విష్ణువుకి పంపించిన పొగాకు పాల స‌ముద్రంలో నాని ముద్ద‌గా అయి విష్ణువుకి చేరింద‌ట‌. ఇదేమిటా ? అని ఆశ్చ‌ర్య‌ప‌డి, గుమ్మున వ‌స్తున్న సువాస‌న‌కి ముగ్ధుడై ఆ పొగాకు ముద్ద‌లోంచి పెద్ద ఉసిరికాయంత ముద్ద తీసి నోట్లో వేసుకున్నాడ‌ట విష్ణ‌మూర్తి. అప్ప‌టినుంచి వైష్ణ‌వుల‌కు తంబాకు న‌మ‌ల‌డం విద్యుక్త‌ధ‌ర్మం ఆచారం అయింది. శివుడికి పంపించిన పొగాకు క‌ట్ట శివుడికి చేరింద‌ట‌. ఇదేమిటా ? అని ఆశ్చ‌ర్య‌ప‌డి చూడ్డానికి రెండు క‌ళ్లూ చాల‌క మూడోక‌న్ను కూడా తెరిచాడ‌ట‌. ఆ వేడికి పొగాకు పొడుం అయింద‌ట‌. పొగాకు పొండులోంచి వ‌స్తున్న సువాస‌న‌కి ముగ్ధుడై సంత‌సం ప‌ట్ట‌లేక‌, బొట‌న‌వ్రేలు, చూపుడువ్రేలు, మ‌ధ్య‌వ్రేలు ఈ మూడువ్రేళ్ల మ‌ద్య ప‌ట్టినంత పొడుం ద‌ట్టించుకుని త‌న ముక్కుపుటాల్లోకి ఎగ‌బీల్చి ఆనంద తాండ‌వం చేశాట్ట‌. అప్ప‌టినుండీ శైవుల‌కు పొగాకు పొడుం పీల్చ‌డం విద్యుక్త ధ‌ర్మం, ఆచారం అయింది. అన్నాడు ఎర్రాచారి.

ఆచారిగారూ మీరు న‌శ్యం పీలుస్తున్నారు. తంబాకు న‌వ‌ల‌డంలేదు. విద్యుక్త‌ధ‌ర్మాన్నీ, కులాచారాన్నీ పాటించ‌డంలేదు. పాపం కాదా ? అన్నాన్నేను.శాస్త్రీ నువ్వ‌న్న మాట నిజ‌మే. లేద‌న‌ను. తంబాకు న‌వ‌ల‌డం నా వృత్తి ధ‌ర్మానికి స‌రిప‌డ‌దు. తంబాకు న‌వుల్తూ రోగితో మాట్టాడుతున్నాన‌నుకో, అప్పుడు నా నోటి తుంప‌ర్ల ప‌సే గానీ వైద్యం ప‌స క‌న‌ప‌డ‌దు. నీ ధ‌ర్మం అంటే వృత్తిధ‌ర్మం నిర్వ‌ర్తించు అని విష్ణువే కృష్ణుడుగా చెప్పాడుక‌దా ! వృత్తి ధ‌ర్మానికీ, న‌శ్యానికీ వైరుధ్యం లేదు స‌రిగ‌దా రోగ నిదానానికి ముక్కు పొడుంప‌ట్టు ఎంతో తోడ్పడుతుంది. పైగా శివుడూ కేశ‌వుడూ ఒక్క‌డే అంచేత వైష్ణ‌వులు పొడుం పీల్చినా, శైవులు పొగాకు న‌మిలినా పాపం అంట‌దు అన్నాడు ఎర్రాచారి.అయితే ఆచారిగారూ ! చుట్ట‌మాటేమ‌టి ? పొగాకు చుట్ట కాల్చ‌డం ఎవ‌రి విద్యుక్త ధ‌ర్మం ? ఇది ఎవ‌రి ఆచారం ? అన్నాన్నేను.

నార‌దుడు బ్ర‌హ్మ‌కి కూడా ఓ మ‌ణుగు పొగాకు క‌ట్ట పంపించాడ‌ట‌.   ఆ పొగాకు క‌ట్ట‌లోనే, గుంటూరులోచుట్టించిన మూడు పొగాకు చుట్ట‌లు కూడా పెట్టి పంపాడుట‌. బ్ర‌హ్మ పొగాకు చూసి ఇదేమిటి ? ఈ ఆకు బంగారంలా మెరిసి పోతూంది. ఘుమ‌ఘుమ లాడిపోతోంది ! ఈ ఆకు నేను సృష్టించిన జ్ఞాప‌కం లేదే ! అని విస్తూపోతూ త‌న మూడు నోళ్ల‌లోనూ మూడు చుట్ట‌లు అంటించి పొగ గుప్పుగుప్పుమ‌ని నోట్లోకి పీలుస్తూ ముక్కులోంచి వ‌దుల్తూ ఆనందంతో క‌ళ్లు తేలేస్తూ సృష్టిమాట మ‌రిచిపోయి కూర్చున్నాడ‌ట‌. అప్ప‌టినుంచి బ్ర‌హ్మ సృష్టించిన మ‌నుష్యులంతా ఆడ‌, మ‌గ‌, పిల్ల‌, పెద్ద‌, పండిత పామ‌ర భేదాలు లేకుండా ఎవ‌రుబ‌డితే వారు పొగాకు చుట్ట‌లు కాలుస్తున్నారు. పైగా బ్ర‌హ్మ పొగ‌తాగ‌నివాడు దున్నపోతై పుట్టున్ అని శాసించాడ‌ల కూడా అన్నాడు ఎర్రాచారి.నాకు క‌డుపుబ్బ న‌వ్వొచ్చంది బావుందండీ పొగాకు పురాణం అన్నాన్నేను.శాస్త్రీ ఇందులో ఒక గొప్ప ధ‌ర్మ‌సూక్ష్మం ఇమిడి ఉండి. ఎవ‌రైనా స‌రే అన్నం లేద‌నొచ్చు. నీళ్లు లేవ‌నొచ్చు కానీ తంబాకూ, న‌శ్య‌మూ, పొగ‌చుట్టా ఇవి లేవు అని అన‌కూడ‌దు. ఇవి లేవంటే ఆ త్రిమూర్తుల‌కు అప‌చారం చేసిన‌ట్లే అన్నాడాయ‌న‌.