2
 

                                                                                          బుర్ర శాస్త్రీయం

ఎర్ర‌చారి ద‌గ్గ‌ర నాకు అల‌వాటు లేక‌పోయినా  అప్పడ‌ప్పుడు కొంచెం న‌శ్యం పుచ్చుకొనే వాడ్ని. ఇప్పుడు నాకు కావ‌ల‌సింది న‌శ్యం కాదు అన్నం పిడ‌చ‌. చెప్పానుగా ఎర్రాచారి నోటివాసి మంచిద‌ని. అంచేత‌న నేను ఎర్రాచారి ఇంటికి వెళ్లాను. ఆయ‌న ముందు వాకిట్లో కూర్చుఏంవోయ్ బుర్ర‌శాస్త్రి వ‌డిలిపోయిన తోట‌కూర‌కాడ‌లా అలా ఉన్నావేం? అన్నాడు న‌న్ను చూసీ చూడ‌గానే ఓ ప‌ట్టు ప‌డ్తావేంటి? అన్నాడు రొంటిన ఉన్న పొడుంకాయ తీసి ముక్కుపొడుం ఎడ‌మ అర‌చేతిలో వేసుకుంటూ.

నేను ఆయ‌న కూర్చునివున్న కుర్చీప్ర‌క్క‌నే నేల‌మీద చ‌తికిల బ‌డ్డాను.

నేనిలాగ ఉండడానికి కార‌ణం త‌ర్వాత చెపుతాగానీ ముందు నాకు ప‌ట్టెడు అన్నం కావాలి. ప‌ట్టెడు ముక్కుపొడుం కాదు. అన్నాను హీన‌స్వ‌రంతో

అయ్యో ! అలాగా ! ఉండు ! అంటూ ఆయ‌న లోప‌లికివెళ్లి రెండు నిమిషాల్లో ఒక పెద్ద కంచం నిండా త‌ర‌వాణీ అన్న‌మూ, ఒక అరిటాకు, కొంచెం గోంగూర ప‌చ్చ‌డి ప‌ట్టుకొచ్చాడు. ఆవురావురుమంటూ కంచం ఖాళీ చేశాను. అప్ప‌టికి నాకు కొంత స‌త్తువ‌, ఉత్సాహ‌మూ వ‌చ్చాయి.

తరవాణి అంటే ఏమిటో మీలో చాలామందికి తెలియ‌ద‌ను కుంటాను. అన్నం గంజి బాగా చ‌ల్లారాక ఒక కుండ‌లో పోస్తారు. అందులో అన్నం క‌రుళ్లు వేస్తారు. సువాస‌న‌కోసం గంజికుండ‌లో దబ్బాకులో, నిమ్మాకులో వేస్తారు. రుచికోసం కొంచెం ఉప్పు వేస్తారు. ఇలాగ రాత్రి చేస్తారు. మ‌ర్నాటి ప్రొద్దున్న‌కి గంజి కొంచెం పులిసి ఆకువాస‌న‌తో చాలా రుచిగా, బాగా ఉంటుంది. దీనిని త‌ర‌వాణి అంటారు. ఇది బ‌లాన్ని, ఆర్యోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో నానిన అన్నం గోంగూర ప‌చ్చ‌డితో తిని, త‌ర‌వాణి త్రాగాను.

నాకు పుష్టి వ‌చ్చింది. నిన్న మ‌ధ్యాహ్నం మొదలుకొని ఈ నిమిషం వ‌ర‌కు జరిగిన అన్ని విష‌యాలు పూస గుచ్చిన‌ట్లు ఎర్రాచారితో చెప్పాను. నేను ప‌డిన పాట్ల‌ను వింటూ ఆయ‌న ఒక‌సారి ఆశ్చ‌ర్య‌పోయారు. ఒక‌సారి ఆగ్ర‌హ‌ప‌డ్డాడు. ఒక‌సారి ఆవేశ‌ప‌డ్డాడు. ఒకసారి విచార‌ప‌డ్డాడు. నాకు సానుభూతి చూపించాడు. చేత‌నైనంత సాయం చేస్తాన‌న్నాడు.


కానీ శాస్త్రీ నీకు ఏదైనా గ‌డ్డురోగం వ‌స్తే నేనుమందో మాకో ఇచ్చి న‌యం చేయ‌గ‌ల‌ను. నీకు వ‌చ్చింది గారెల రోగ‌మాయె. దీనికి నేనేం వైద్యం చేయ‌గ‌ల‌ను ? నీ గారెల రోగం, కుద‌ర్చ‌వ‌ల‌సింది నీ పెళ్లాంగానీ నేను కాదు. అంటూ నీళ్లు న‌మిలాడు ఎర్రాచారి.

అయ్యా ! ఆచారీగారూ మందులు కావ‌ల‌సిన వాళ్ల‌కి మందులు, స‌ల‌హాలు కావ‌ల‌సిన వాళ్ల‌కు స‌ల‌హాలు ఇస్తుంటారు క‌దా మీరు ? నాకు మందొద్దు. స‌ల‌హా కావాలి. నేను గారెలు చేసుకుంటూంటే నా పెళ్లాం ఆ గొయ్య‌మ్మ న‌న్ను అవ‌మానించి త‌రిమేసింది. అంచేత నా పెళ్లాం చేత‌నే గారెలు వండించుకుని నేను తినాలి. ఇందుకు మీ స‌ల‌హా కావాలి ! అన్నాను నేను ధృఢంగా.

బాగుంద‌య్యా శాస్త్రీ చాలా బావుంది. మ‌నిద్ద‌రం మంచి మిత్రులం క‌నుక నీకు మందివ్వ‌గ‌ల‌ను, ముక్కుపొడుం ఇవ్వ‌గ‌ల‌ను కానీ ఇదేం స‌ల‌హా ! ఇది నా వ‌ల్ల‌కాదు అన్నాడు ఎర్రాచారి.

ఆచారిగారూ మీరు చెప్పెది మాత్రం బావుందా ? మ‌నం మంచి మిత్రులం అంటారుగానీ న‌న్నీ క‌ష్టంలోంచి బ‌య‌ట‌ప‌డేందుకు సాయం మాత్రం చేయ‌నంటారు. అన్నాన్నేను నిష్ఠూరంగా.

నేను సాయం చేయ‌ను అన‌లేదు. స‌ల‌హా చెప్ప‌డానికి నాకు ఏమీ త‌ట్ట‌డంలేదు. అంటున్నాను. పోనీ నీకు ఏదైనా ఉపాయం తోస్తే చెప్ప‌రాదూ సాయం చేస్తాను. అన్నాడు ఎర్రాచారి.

ఆ మాట వింటూనే గ‌జ‌గ‌జ వ‌ణుకుతూ విల‌విల త‌న్నుకుంటూ క్రింద ప‌డిపోయాడు. ఆచారి కంగారు ప‌డ్డాడు. క‌ష్టంమీద నా నాడి ప‌ట్టుకున్నాడు. క‌ళ్ల రెప్ప‌లు తెరిచి కంటిపాప‌లు ప‌రీక్షించాడు. నాలో రోగ ల‌క్ష‌ణాలు ఏమీ క‌న‌ప‌డ‌లేదు. మ‌రి ఇదేమిట‌బ్బా! అని తెల‌తెల‌బోతున్నాడు.

నేను ఎంత హ‌ఠాత్తుగా క్రింద ప‌డ్డానో అంత హ‌ఠాత్తుగా లేచి కూర్చున్నాను. వ‌ణ‌క‌డంలేదు. త‌న్నుకోడంలేదు. ఆచారి ఎంతో ఆశ్చ‌ర్య‌పోయాడు. నేను ప‌గ‌ల‌బ‌డి న‌వ్వాను.

ఎలా ఉంది మ‌న న‌టన ఆచారిగారూ ! ఆరితేరిన ఘ‌న‌వైద్యులు మిమ్మ‌ల్నే న‌మ్మించ‌గా లేంది నా పెళ్లాం ఆ గొయ్య‌మ్మ ఎంత ! అన్నాను గ‌ర్వంగా.

ఆరి బుర్ర‌శాస్త్రీ న‌ట‌నేనా ? ఆ ?

న‌ట‌నా ? ఎందుకూ ? అని నా ప్లానంతా ఎర్రాచారికి విడ‌మ‌రిచి చెప్పాను.

నా ప్లాను విని ఎర్రాచారి నిజంగానే ద‌డుచుకున్నాడు. మా గొయ్య‌మ్మంటే ఆయ‌న‌కీ భ‌య‌మే.

బాబాయ్ ! ఈ ప్లానొద్దు. ఈ ప్లాను చెడిపోతే నా ప్రాక్టీసు కూడా దెబ్బ తింటుంది. నీకు గారెలు ఎలా నూ రావు. ఇంకో ప్లాను చెప్పు. అన్నాడాచారి.

న‌న్ను ఉపాయం చెప్ప‌మ‌న్నారు. మీరు సాయం చేస్తాన‌న్నారు. తీరా స‌మ‌యానికి పిరికిప‌డి గారెలు రావు ప్రాక్టీసు పోతుంది. అంటూ వాపోతున్నారు. మాట నిల‌బెట్టుకోలేని వాళ్లు వాగ్దానాలెందుకండీ ! మీరు వైద్యులండీ రాజ‌కీయ నాయ‌కులు కారు. మాట నిల‌బెట్టుకోండి ! అన్నాన్నేను.

మీకు ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని లేక‌పోతే రాజ‌కీయాల్లో చేరండి ! అని అన్నాన్నేను.

స‌రేలే ! మాట ఇచ్చాగా. నిల‌బెట్టుకుంటా అని ఆయ‌న అంటూండ‌గానే ఆ వీధిన వ‌స్తున్న మున‌సబుగారి రెండెడ్ల‌బండి చూసి వ‌ణుకుతూ త‌న్నుకుంటూ ప‌డిపోయాను. ఎర్రాచారి కంగారుగా వీధిలోకి ప‌రుగెత్తి ఎడ్ల‌బండిని ఆపించి అందులో ఒత్తుగా ఎండుగ‌డ్డి ప‌రిపించి, న‌న్ను అందులో ప‌డుకోబెట్టించి త‌న మందుల సంచిక‌ట్టు త‌న సైకిలుకు త‌గిలించుకుని ఎడ్ల‌బండి వెన‌కాల న‌డిపించుకుంటూ మా ఇంటికి నెమ్మ‌దిగా చేర్చాడు.

నేను బండిలో వ‌ణుకుతూ మ‌ధ్య‌మ‌ధ్య త‌న్నుకుంటూ గింజుకుంటూ క‌ళ్లు మూసుకుని ప‌డి ఉన్నాను.

ఓరి నీ ద‌ర్జా త‌గ‌ల‌డా ! పెత్త‌నాల‌కి బండీ కూడానా ! అని కేక‌లు పెడ్తూ గొయ్య‌మ్మ నా బండి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. నేను వ‌ణ‌క‌డం, త‌న్నుకోవ‌డం, గింజుకోవ‌డం ఎక్కువైంది. క‌ళ్లు అర‌మూత‌లుగా తెరిచి చూశాను.

గొయ్య‌మ్మ మా ఇంటి అరుగులు అలుకుతోంది కాబోలు చేతినిండా పేడ ఉంది. మా గొయ్య‌మ్మ అవ‌తారం చూసి చేతిలో పేడ‌చూసి ఎర్రాచారి, బండీ వెన‌క్కి బాగా త‌గ్గాడు. గొయ్య‌మ్మ‌ను చూసి నేను మూల‌గ‌డం మొద‌లెట్టాను. నోట్లోంచి చొంగ కార్చ‌డం ప్రారంభించాను.

అప్పుడు న‌న్నూ, ఎర్రాచారినీ పార‌కించి చూసింది గొయ్య‌మ్మ‌. ఆమె కోపం చ‌ల్లారి పోయింది. దుఃఖం ముంచెత్తుకొచ్చింది.

ఓరి నాయ‌నోయ్ ! ఏమ‌యింది రోయ్ ! ఓరి దేవుడోయ్ ! ఏమ‌యిందిరోయ్ ! అంటూ రాగాలు తీస్తూ శోకాలు ఆరంభించింది గొయ్య‌మ్మ‌.

అప్ప‌టికి ఎర్రాచారికి ధైర్యం వ‌చ్చింది. నాకూ ధైర్యం వ‌చ్చింది. నేను వ‌ణుకుతో గింజుకోడం, మూల‌గ‌డం బాగా ఎక్కువ చేశాను. న‌లుగురు సాయంప‌ట్టి నన్ను ఇంట్లో నుల‌క‌మంచం మీద‌కి చేర్చారు.

గొయ్య‌మ్మ పేడ‌చేతులు క‌డుక్కుని వ‌చ్చింది. నాకు వ‌చ్చిన‌రోగం కంటే అక్క‌డ మూగిన ఇరుగు పొరుగూ వాళ్ల సానుభూతి నా పెళ్లానికి ఎక్కువ దుఃఖాన్ని క‌లిగించింది. ఇల్లెగిరి పోయేలా బావురుమ‌ని ఏడుస్తూంది.

ఎర్రాచారి చిరాకుప‌డ్డాడు.

ఏమిట‌మ్మా. ఎంత‌సేపూ నీ ఏడుపేనా ? అవ‌త‌ల నీ మొగుడికి ఏం రోగ‌మో, రోగికి ఏం కావాలో చూసేదేమ‌న్నా ఉందా ? అని విసుగుతో గ‌ద్దించాడు ఎర్రాచారి.

గొయ్య‌మ్మ క‌ళ్లూ ముక్కూ తుడుకుని నా కాళ్ల‌వైపున నేల‌మీద కూల‌బ‌డింది. ఆమె దుఃఖం ఆగ‌డంలేదు. తెర‌లు తెర‌లుగా పొంగుకు వ‌స్తూంది.

ఇదేం మాయ‌రోగ‌మో దేవుడోయ్‌! నా మొగుడికే రావాలా ? ఇన్నాళ్లూ సంపాద‌న లేక‌పోతే పీడాపోయె. విగ్ర‌హ‌మ‌న్నా ఉంద‌ని సంతోషిస్తున్నానురా దేవుడా ? ఇంకేం దారిరోయ్ నాయ‌నోయ్ ! నా ప‌సుపూ కుంకం చెరిపెయ్య‌కు దేవుడోయ్ ! నీకు గారెలొండి నైవేద్యం పెడ‌తానురా దేవుడోయ్‌! అంటూ క‌న‌ప‌డిన ఆ దేవుడికి ద‌ణ్ణాలు పెడుతూ ఏడుస్తూంది మా గొయ్య‌మ్మ‌.

నా పెళ్లాం ఏడుపు చూసి నాకు చాలా జాలేసింది. ఆమెకు నామీద ఉన్న ప్రేమ చూసి నాకు చాలా సంబ‌రం క‌లిగింది.

ఛీఛీ వెధ‌వ గారెల కోసం ఇంటి ఇల్లాల్ని ఇంత‌గా ఏడిపించ‌డ‌మా ! ఒసే గొయ్యా ఇదంతా న‌ట‌నే. నాకే రోగం లేదు. నేను చావ‌ను ఏడ‌వ‌కు ! నాకే రోగం లేదు. నేను చావ‌ను. ఏడ‌వ‌కు ! అని వెన్ను నిమిరి ఓదార్చాల‌నుకున్నాను.

అయ్య‌బాబోయ్ ఇంకేమైనా ఉందా ? ఎర్రాచారి వ‌ళ్లు వాచేట్లు చివాట్లు పెడ‌తాడు. గొయ్య‌మ్మ గ‌రిట కాలేసి న‌డ్డిమీద వాత‌లు పెడుతుంది. గారెలూ పోయి శ‌నీ ప‌ట్టిన‌ట్ట‌వుతుంది, అనుకుని వ‌ణ‌క‌డం, త‌న్నుకోడం, మూల‌గ‌డం మ‌రికొంచెం ఉధృతం చేశాను. ఎవ‌రో పెద్ద లోటాడు చిటికెడు పంచ‌దార క‌లిపిన ప‌ల్చ‌టి పాలు తెచ్చి మా గొయ్య‌మ్మ చేతికాచ్చారు. ఆవిడ ఆప్యాయంగా నాచేత తాగించింది. నేను వ‌ణుకుతూనే, మూల‌గ‌కుండా ఆ పాల‌న్నీ తాగి మ‌ళ్లీ మూల‌గ‌డం మొద‌లెట్టాను.

నా రోగం ముదిరి పోతోంద‌ని వైద్యం ఇంక ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని, ఎర్రాచారి నా చుట్టూ మూగిన జ‌నాన్ని బ‌య‌టికి పంపించివేశాడు. వాళ్లంతా గుమ్మం ముందు గుమిగూడి నాకేసి ఎర్రాచారికేసి రెప్ప‌వాల్చ‌కుండా చూస్తున్నారు.

ఎర్రాచారి న‌న్ను నోరు బాగా తెర‌వ‌మ‌ని నోట్లోకి తొంగి చూశాడు. కుక్క‌లాగా నా నాలిక జాపించి దీక్ష‌గా చూశాడు. నాడి ప‌ట్టుకున్నాడు. పొట్ట నొక్కాడు. మ‌ళ్లీ నాడి ప‌ట్టుకున్నాడు. మొహం చిట్లించి క‌ళ్లు మూసుకుని మ‌ళ్ళీ తెరిచాడు. నాడి వ‌దిలేసి ప్చ్ ప్చ్ అని చ‌ప్ప‌రించాడు. అరికాళ్లు త‌డిమి చూశాడు. మళ్ళీ నాడి ప‌ట్టుకుని పెద‌వి విరిచాడు. ఓ మూల‌గా ఉన్న ముక్కాలుపీట మంచం ప్ర‌క్క‌కి లాక్కుని ఉస్ అంటూ కూర్చున్నారు.

గ‌దిలోని గొయ్య‌మ్మ గ‌ది బ‌య‌ట జ‌నం అంతా ఎర్రాచారి చేస్తున్న ప‌నులు ఆయ‌న ముఖం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూన్నారు. నాకు ఏదో ప్ర‌మాద‌క‌ర‌మైన పెద్ద జ‌బ్బే వ‌చ్చింద‌ని అంద‌రూ నిర్ణ‌యానికొచ్చేశారు.

ఎర్రాచారి ఓ సారి జ‌నంకేసి, ఓ సారి గొయ్య‌మ్మ కేసి చూశాడు. అత‌ని నోటినుంచి మాట రావ‌డంలేదు. నాకు వ‌చ్చిన రోగం చాలా తీవ్ర‌మైంద‌ని, ఎర్రాచారి కంగారు ప‌డుతున్నాడ‌ని అంద‌రూ అనుకున్నారు.

ఎర్రాచారి త‌న‌కింక చెప్ప‌క త‌ప్ప‌ద‌న‌ట్లుగా ముఖం పెట్టాడు. చిన్న‌గా స‌కిలించాడు. ఇదీ...స‌న్నిపాత పైత్య‌వాత‌మ‌మ్మా. బాగా ప్ర‌కోపించి పోయింది! అన్నాడు. మ‌రోమారు పెద‌వి విరుస్తూ.

ఈ రోగం ఏమిటో ఎవ‌రికీ తెలియ‌క‌పోయినా, ఇదేదో మ‌హ‌మ్మారిలాటి మాయ‌దారి రోగం అనుకున్నారంతా. జ‌నం విచారం ప్ర‌క‌టించారు. గొయ్య‌మ్మ మ‌రో శోకం తీయ‌బోతే ఎర్రాచారి వారించాడు.

జ‌బ్బు ప్ర‌మాద‌మైన‌దే నా చేత‌నైన వైద్యం చేస్తాను. ఆ త‌రువాత నీ అదృష్ట‌మ‌మ్మా అన్నాడు.

ఆచారి మందుల సంచీ క‌ట్లూడ‌తీశాడు. దోసెడు పొట్లాలు నేల‌మీద పోశాడు. అందులోంచి నాలుగు పొట్లాలు ఎన్నుకున్నాడు. గొయ్య‌మ్మ చేతిలో ఉంచాడు. గొయ్య‌మ్మ మూడు పొట్లాలు కొంగున మూట క‌ట్టుకుని నాలుగో పొట్లం నాకు వేయ‌డానికి మంచినీళ్ల కోసం లోప‌లికి వెళ్ళ‌బోతూంది.

సంగ‌తి సాంతం తెలుసుకోకుండా ప‌రుగెత్తుతావేమ్మా అంటూ ఆమెను ఆపేశాడు ఎర్రాచారి.

ఏం చెయ్యాలో చెప్పండి బాబూ ! మీరెలాగ చెపుతే అలాగ చేస్తాను. ఎంత డ‌బ్బ‌యినా స‌రే ఖ‌ర్చుపెట్టి నా ప‌సుపూ కుంకుమా నిలుపుకుంటాను. అంది గొయ్య‌మ్మ ముక్కు చీదుతూ.

గొయ్య‌మ్మ చీమిడి తుంప‌ర్లు త‌న‌మీద ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు ఎర్రాచారి. ఈ మందులు చాలా ముఖ్యం. చాలా శ‌క్తిగ‌ల‌వి. ఈ మందుల కంటే రోగి చేయ‌వ‌ల‌సిన ప‌త్య‌మూ, అనుపాన‌మూ అతిముఖ్యం. స‌రైన అనుపానం లేక‌పోతే స‌రైన ప‌త్యం చేయ‌క‌పోతే మందు ప‌నిచేయ‌క పోవ‌డ‌మేకాదు. విషం అయి ప్ర్రాణాలు తీస్తుంది. ఈ మందును అనుపానంతో క‌నీసం ప‌దిహేను రోజులైనా పుచ్చుకోవాలి అన్నాడు ఎర్రాచారి.

ప‌త్యానిదేం ఉందిలే బాబూ ! ప‌త్యం ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఎంతోమంది బాలింత‌రాళ్ల‌కి నేను స్వ‌యంగా ప‌త్యం వండిపెట్టాను. ఏ బీర‌కాయో, పొట్లాకాయో కూరా, ధ‌నియాల కార‌ప్పొడీ, పాత చింత‌కాయ పచ్చ‌డీ, న‌ల్ల మిరియాల చారూ ఇవేగ‌దా ప‌త్యం అంటే ? అన్న‌ది గొయ్య‌మ్మ‌.

 నా తల్లే ! నా తల్లే ! ఇంకా న‌యం ముందుగానే అడిగావు. లేక‌పోతే కొంప మునిగిపోను. నువ్వు చెప్పిన ప‌త్యం ఏవో చిన్న తెగుళ్ళ‌కీ, బాలెంత‌రాళ్ల‌కీ ప‌నికొస్తుంది కానీ శాస్త్రి స‌న్నివాత పైత్య‌వాత‌పు రోగానికి ప‌నికిరాదు. ఇలాటి అప‌త్యం చేస్తే రోగం ముదిరి శైత్యంలోకి దిగి అగ్నిహోత్ర‌మై సంధిలో ప‌డేస్తుంది. ఆ త‌ర్వాత విచారించి లాభం ఉండ‌దు. అన్నాడు ఎర్రాచారి.

గొయ్య‌మ్మ భ‌య‌ప‌డింది ప‌త్యం చెప్పండి బాబూ ! అన్న‌ది.

ఈ రోగానికి బాగా మినుము త‌గ‌లాలమ్మా ! అన్నాడు ఎర్రాచారి. ఆమెకేసి బిక్కుబిక్కుమ‌ని చూస్తూ శ‌రీరంలో వాతాన్ని త‌గ్గించి చ‌ల‌వ క‌లిగించే గుణం మినుములో బాగాఉంది. మినుముల్ని రెండు గంట‌లు నాన‌బెడితే వాటిలోని క‌టుత్వంపోయి మృదుత్వం వ‌స్తుంది. త‌రువాత శుభ్రంగా రుబ్బేసి రెండు అల్లం ముక్క‌లూ, నాలుగు ప‌చ్చిమిర‌ప ముక్క‌లూ త‌గిలించాలి. ఇవి మినుములో ఉండే త‌ల‌తిరుగుడు క‌లిగించే దోషాన్ని హ‌రిస్తాయి. ఇలాగ త‌యారు చేసుకున్న పిండిని ఇంతింత బిళ్ల‌లుగా చేసి నువ్వు ప‌ప్పునూనెలో దోర‌గానే వేయించాలి. ఒక్కొక్క మందు పొట్లంతో నాలుగు బిళ్లలు అనుపానంగా సేవించాలి. రోజుకు రెండు పొట్లాలు ప‌డాలి. అన్నాడు ఎర్ర‌చారి తెలివిగా.

గారెలు అనే మాట రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడుగానీ గొయ్య‌మ్మ గ్ర‌హించేస్తుందేమో అని ఎర్రాచారికి బితుకుబితుకు మంటూనే ఉంది. తానాడిన నాట‌కం బ‌ట్ట‌బ‌య‌లు అయితే త‌న‌కు గొయ్య‌మ్మ దేహశుద్ధి చేస్తుంది. జ‌నంలో వైద్యుడుగా తాను తెచ్చుకున్న పేరు పోతుంది అని ఎర్రాచారి లోలోప‌ల దిగులు ప‌డుతున్నాడు.

మా గొయ్య‌మ్మ ఏమంటుందో అని నాకు చాలా అదుర్దాగా ఉంది. నాకు కావ‌ల‌సిన అనుపానం చేస్తానంటుందా చేయ‌నంటుందా అనే సందిగ్ధంలో నా గుండె అతివేగంగా కొట్టుకుంటోంది.

నాకు వ‌చ్చిన రోగం ఏమిటో తెలిసింది. క‌నుక నాకు మందు ఇచ్చిన వైనం, మందుకు అనుపాన వివ‌రం తెలిసింది. క‌నుక మా ఇంటిగుమ్మం ముందుమూగిన సానుభూతి ప‌రులు ఎవ‌రింటికి వారు వెళ్లిపోయారు.

ఏమిటో డొంక తిరుగుడుగా చెప్పాడీ ఎర్రాచారి అనుకుంది గొయ్య‌మ్మ‌

ఆచారిగారూ ఏం చేయాలండీ మిన‌ప‌ప్పు నాన‌బెట్టి రుబ్బి బిళ్ల‌లు చేసి పప్పునూనెలో వేయించాలి అంతేక‌దా ! అన్న‌ది.

ఓహో గారెలు చేసిన‌ట్లుగా లేదూ ! అనుకుంది మ‌న‌స్సులో గారెలు అనే ఊహ వ‌చ్చేట‌ప్ప‌టికీ గ‌తుక్క‌మంది ఆమె మ‌న‌స్సు. కానీ ఆమె బైట‌కు తేల‌లేదు.

మిన‌ప‌ప్పు బిళ్ల‌లు అనుపానం అలాగే వండుతానండి ఆచారిగారూ. మ‌నిషికంటే ఎక్కువా ? అంది గొయ్య‌మ్మ‌.

ఎర్రాచారికి ఉషారొచ్చింది సాధించాన‌ని గ‌ర్వ‌ప‌డ్డాడు.

అన్న‌ట్టు గారెలు తేనెలో బాగా ముంచి మ‌రీ పెట్టాల‌మ్మోయ్‌! అన్నాడు. గొయ్య‌మ్మ గుడ్లు తేలేసింది.

గారెలు మునిగి నానేటంత తేనె ఎక్క‌డ తేను ? అన్న‌ది అనుమానంగా.

నా గుండె గుభేలుమంది. మొద‌టికే మోసం వ‌స్తుందేమో అని భ‌య‌ప‌డ్డాను.

ఇదెక్క‌డి లేనిపోని పిత‌లాట‌కం పెట్టావ‌య్యా ఎర్రాచారీ! అని మ‌న‌సులోనే నెత్తీనోరు బాదుకున్నాను. నోటి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన గారె జారి ప‌డిపోతున్న‌ట్లు అనిపించింది. ఇక ఉండ‌బ‌ట్ట‌లేక పోయాను,

తేనె లేక‌పోయినా ఫ‌ర్వాలేదు క‌దండీ ఆచారిగారూ ! అన్నాను. నా కంఠ‌స్వ‌రం దృఢంగా ఉంది. మాట స్ప‌ష్టంగా ఉంది. ఎర్రాచారిని నిల‌దీసి ప్ర‌శ్నించిన‌ట్లుగా ఉంది.

నా మాట ప‌డిపోయిన‌ట్లుగా మూల‌గాల‌ని, నేను వ‌ణ‌కాల‌ని, త‌న్నుకోవాల‌ని, నాకేదో పెద్ద రోగం వ‌చ్చింద‌ని ఇవ‌న్నీ నేను మ‌రిచిపోయాను. ఆ క్ష‌ణం అలాంటిది ఆ ఆతృత అలాటిది.

ఎర్రాచారి తెలివిత‌క్కుక‌గా అన్న మాట‌కి, నేను ప‌ర‌మ మూర్ఘుడిలా బ‌య‌ట ప‌డిపోయాను. కాలుజారితే తీసుకోవ‌చ్చుకానీ మాట జారితే తీసుకోలేం మేమిద్ద‌ర‌మూ మాట జారాము.

అవున‌వును తేనె లేక‌పోయినా ఫ‌ర్వాలేదు. పంచ‌దార పాకంలోనో బెల్లం పాకంలోనో ముంచ‌వ‌చ్చు. అన్నాడు ఎర్రాచారి నంగిగా.

మా గొయ్య‌మ్మ ఎప్పుడు వంటింట్లోకి వెళ్లిందో నేనుగానీ, ఎర్రాచారిగానీ గ‌మ‌నించ‌లేదు. ఎర్రాచారి వంటింటి కేసి చూసి కంగారుగా సంచిక‌ట్టు చేత పుచ్చుకుని ఒక్క ఉదుటున వీధిలో ప‌డి త‌న సైకిలుమీద‌కి దూకి తారాజువ్వ‌లా వెళ్లిపోయాడు.

ఎర్రాచారి ఇలాగ పారిపోతున్నాడెందుకా ? అని ఆశ్చ‌ర్యంతో వంటింటివైపు త‌న తిప్పి చూశాను. గొయ్య‌మ్మ జుట్టు ముడి విడిపోయి త‌న వెంట్రుక‌లు చింద‌ర వంద‌ర‌గా ముందూ వెన‌కా ఎగురుతున్నాయి. చేతిలో కాలుతున్న కొర‌కంచు ఉంది. ఆమె వాల‌కం ఉగ్ర‌కాళిలాగ ఉంది.

వెధ‌వ గారెల కోసం మీ ఇద్ద‌రూ కుమ్మ‌క్క‌యి న‌న్నింత ఏడిపిస్తారా ? అంటూ చేతిలోని కొర‌కంచులాగ క‌ళ్ళెర్ర చేసి వ‌స్తోంది.

నేను క‌ప్పుకున్న దుప్ప‌టి తీసి అవ‌త‌ల పారేసి నుల‌క మంచంమీంచి క్రిందికి ఒక్క దూకు దూకి వీధిలోకి దౌడు తీశాను.

నేను ఎంత వేగంగా దౌడు తీశానో అంత వేగంతో గొయ్య‌మ్మ త‌న చేతిలోని కాలుతున్న కొర‌కంచుని గురిచూసి నా మీదికి విసిరింది. స‌రిగా నేను వీధిగుమ్మం దాటుతున్న‌ప్పుడు క‌ణ‌క‌ణ‌లాడుతున్న కొర‌కంచు నా కుడి ప‌క్క‌ను ముద్దు పెట్టుకుంది. నేను క‌ర్ర దెబ్బ తిన్న కుక్క‌లాగ కుయ్యో మొర్రో అంటూ పిక్క‌బ‌లం చూపించాను. నా కుడికాలిపిక్క కాలి బొబ్బ ఎక్కినా ఆ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో నన్ను బాగానే ఆదుకుంది.

                                                                                   *************

నేను నా క‌థ‌ను రాసేపాటి చ‌దువు చ‌దువుకున్నాన‌ని మొద‌ట‌నే చెప్పాను. మా గొయ్య‌మ్మ ఆశించిన‌ట్లు ఏదోదుకాణంలో ప‌ద్దులు రాసి నాలుగు రాపాష‌ణాలు సంపాదించ‌డానికి ఆపాటి చ‌దువు చాలు. దుకాణంలో ప‌ద్దులు రాయ‌డం అంటే జ‌మాఖ‌ర్చుల లెక్క‌ల పుస్త‌కాల్లో నాలుగు ప‌ద్దులు రాయ‌డం కాదు. దుకాణం య‌జ‌మాని ఇంటికి ప్రొద్దున్న ఎనిమిది గంట‌ల‌క‌ల్లా వెళ్ళాలి.

ఆయ‌న పెళ్ళాం పుర‌మాయించిన ప‌నుల‌న్నీ ప‌ది గంట‌ల దాకా చెయ్యాలి. త‌ర్వాత దుకాణానికి వెళ్ళి ప‌ద్దులు రాయ‌డ‌మే కాకుండా, దుకాణం య‌జ‌మాని చెప్పిన ప‌నుల‌న్నీ చెయ్యాలి. బాకీలు వ‌సూళ్ళు, దుకాణానికి వ‌చ్చిపోయేవాళ్ళ హోదాని బ‌ట్టి టీయో, కూల్ డ్రింకో పుర‌మాయింపులు, వాళ్ళ‌ని ఆహ్వానించేందుకు చేయ‌వ‌ల‌సిన స‌రియైన స‌కిలింపులు, ఇకిలింపులు ఇవ‌న్నీ జాగ్ర‌త్త‌గా చేస్తూ మ‌స‌లుకోవాలి.

ఈ మ‌ధ్య‌లో ఎప్పుడో అద‌ను చూసుకుని ఇంటికి ప‌రుగెత్తి, నాలుగు మెతుకులు ఆద‌రాబాద‌రా క‌తికి, మ‌ళ్ళీ అదే ప‌రుగుతో దుకాణానికి రావాలి. రాత్రి తొమ్మిది గంట‌ల‌కు దుకాణం మూసేదాకా ఇలాగ స‌త‌మ‌త‌మ‌వ్వాలి. య‌జ‌మాని వెనుక‌, ప‌ద్దు పుస్త‌కాలు పుచ్చుకుని, చాక‌లి వెనుక గుడ్డ‌ల మూట మోసుకుపోయే గాడిద‌లాగ ఆయ‌నింటికి వెళ్లాలి. మ‌ళ్ళీ య‌జ‌మాని పెళ్ళాం చెప్పిన ప‌నులు చెయ్యాలి. ఆయ‌న కూతురు చేత అఆలే దిద్దించాలి. ఆయ‌న కొడుకు తడుపుకున్న చెడ్డీ మార్చాలి.

అప్పుడు రాత్రి పదిన్న‌ర గంట‌ల‌కు ఇంటికి చేరాలి. ఇక ఆదివారాలైతే అంతా ఇంటిప‌నే. అదుపూ అజ‌మాయిషీ అంతా అమ్మ‌గారిదే. నెల‌కి నాలుగు రాపాషాణాలు సంపాదించ‌డం కోసం నెలంతా న‌లిగి పొట్ట‌యిపోవ‌డం నాకు ఇష్టంలేక‌పోయింది.

అందుకే ప‌ద్దులు రాసేపాటి చ‌దువు నాకు రాద‌ని మా గొయ్య‌మ్మ‌తో బొంకాను. వేలిముద్ర‌లు వేసి డ‌బ్బు సంపాదించ‌గ‌ల‌న‌న్నాను. ఈ డ‌బ్బు చాల‌దంది, మా గొయ్య‌మ్మ కూలి, నాలి చెయ్య‌మంది. నీళ్ళ కావిళ్ళు మోయ‌మంది, పెళ్ళి వంట‌ల‌కెళ్ళ‌మంది. గొయ్య‌మ్మ సొమ్మేం పోయింది, ఏదైనా చెయ్యమంటుంది. నా వ‌ళ్ళు మాత్రం వంగ‌నంది.

డ‌బ్బు సంపాదించ‌డానికి సులువైన మార్గం ఏమిటా అని ఆలోచించాను. నిశానీ వేసి డ‌బ్బు సంపాదించ‌డం, స‌రిపోవ‌డం మాట అటుంచి సులువేనా ? అని ప్ర‌శ్నించుకున్నాను. లేద‌నిపించింది. ఇందులో గొప్ప క‌ష్టాలున్నాయి.


ఓ నాడు తెల్ల‌వార‌గ‌ట్ల కాల‌వ‌గ‌ట్టు కెళ్ళి వ‌స్తున్నాను. త్రోవ‌లో హైస్కూలు ఆవ‌ర‌ణ‌లో చిన్న‌గుంపు, ఓ ఆర‌డ‌జ‌ను మంది మ‌గ‌పిల్ల‌లు ఉన్నారు. పోలీసు అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, కానిస్టేబుల్ కూడా ఉన్నారు. నా బొట‌న‌వేలుకి ఏమైనా ప‌ని త‌గుల్తుందేమో ఓ స‌గం రాపాషాణం దొరుకుతుందేమో అని ఆశ‌ప‌డి అక్క‌డికెళ్ళాను.

ఏటి శాత్తుల్లూ, శ‌వం ఓస‌న నీక‌ప్పుడే ఒచ్చీసి నాదేటి, పారొచ్చినావు అంటూ ప‌ల‌క‌రించాడు కానిస్టేబులు.

స‌మ‌యానికొచ్చావ‌య్యా, శాస్త్రీ, రా, రా,, అంటూ ఆహ్వానించాడు. ఏయ‌స్‌.ఐ నేనేదో ముఖ్య‌మైన వాణ్ణ‌నుకుని ప్ర‌క్క‌కు త‌ప్పుకున్నారు స్కూలు పిల్ల‌లు.

అక్క‌డ నేల‌మీద సుమారు పాతికేళ్ళు వ‌య‌స్సున్న యువ‌కుడు త‌న ఎడ‌మ‌చేతి మీద కొద్దిగా త‌ల ఆనించి, ప‌డి ఉన్నాడు. అత‌ను న‌ల్ల‌చార‌ల బుష్‌ష‌ర్ట్‌, సిమెంట్ రంగు ప్యాంటు తొడుగుకొని ఉన్నాడు. అత‌ని ష‌ర్ట్ జేబులో మ‌డ‌త‌పెట్టిన కాగితం, ఇంక్ పెన్ను ఉన్నాయి. ఎడంచేతికి రిస్ట్ వాచీ ఉంది. నోట్లోంచి నురుగుకారి, నేల‌లో ఇంకిపోయింది. అత‌ని జుట్టు చెదిరి ఉంది. అత‌ని ఆకుచెప్పులు కాళ్ళ ద‌గ్గిర ప‌డి ఉన్నాయి. అత‌నికి అర‌గ‌జంలో ఒక చిన్న రేకుడ‌బ్బా ఉంది. దాని లోప‌ల కొద్దిగా ద్ర‌వం ఉంది. దాని మూత ఊడిపోయి ఉంది. దానిపైన ఎండ్రిన్ అని ఇంగ్లీషులో వ్రాసి ఉంది, అత‌ని క‌ళ్ళు మూసుకుని ఉన్నాయి. ఈగ‌లు ముసురుతున్నాయి. అత‌ను చచ్చిపోయినాడు.

అత‌నెవ‌రో నాకు తెలియ‌దు.

స్కూలు హెడ్మాస్ట‌రు వ‌చ్చాడు. ప‌దో క్లాసు టీచ‌రు వ‌చ్చాడు. వీళ్లిద్ద‌రూ అక్క‌డ అది వ‌ర‌కే ఉన్న నలుగురు కుర్రాళ్ళూ అత‌ణ్ణి గుర్తించారు.

ఫోటోగ్రాఫ‌ర్ వ‌చ్చాడు. ఆరు కోణాల్లోంచి ఆరు ఫోటోలు శ‌వానికి తీశాడు.

ఏయ‌స్ఐ శ‌వం జేబులోంచి పెన్నూ, కాగిత‌మూ తీశాడు. కాగితం మ‌డ‌త‌లు విప్పాడు. శ‌వాన్ని గుర్తించిన‌వాళ్లు ఆ కాగితంలోని ద‌స్తూరీ ఆశ‌వానిదే అని గుర్తించారు. ఆ ద‌స్తూరీ ఇంక్ ఆ పెన్నుదే అనిన్నీ గుర్తించారు.

ఆ అబ్బాయి చ‌చ్చిపోక‌ముందు, త‌న పెన్నుతో త‌న ద‌స్తూరితో ఈ కాగితం వ్రాశాడు. అన్నాడు హెడ్మాస్ట‌రు.

నిజం, నిజం ! శ‌వం రాయ‌లేదు అన్నాడో కుర్రాడు న‌వ్వుతూ.

ప‌దో క్లాసు టీచ‌రు ప్ర‌క్క‌కు తిరిగి న‌వ్వాడు. ఏయ‌స్ఐ మూతికి ఫైలు అడ్డం పెట్టుకుని న‌వ్వాడు. కుర్రాళ్ళూ, కానిస్టేబులూ, నేనూ
బ‌హిరంగంగానే న‌వ్వాము. హెడ్మాస్ట‌రు న‌వ్వ‌లేదు. శవం న‌వ్వ‌దు.

ఏయ‌స్ఐ శ‌వం జేబులోని కాగితం చ‌దివాడు.

నేను చ‌చ్చిపోవాల‌నే చ‌చ్చిపోతున్నాను. నా చావుకు ఎవ‌రు బాధ్యులుకారు. నేను ఎందుకు చ‌చ్చిపోతున్నానో చెప్ప‌డం అన‌వ‌స‌రం. నా ప్యాంటు కుడిజేబులో నూరు రూపాయ‌లున్నాయి.

పెద్ద‌బ‌జారులోని బాలాజీ మిఠాయి కొట్టువాడికి మూన్నాళ్ళ క్రితం సాయంత్రం ముప్పె మూడు రూపాయ‌లు బాకీప‌డ్డాను అది తీర్చి మిగ‌తా డ‌బ్బుతో నా శ‌వాన్ని త‌గ‌లెయ్య‌వ‌లెను అని వ్రాసి ఉంది.

పోలీసులు, ఆ కాగితాన్నీ, పెన్నునీ, నూరు రూపాయ‌ల్నీ, చెప్పుల్నీ, ఎండ్రిన్ డ‌బ్బానీ, శ‌వం నోటి నుండి జారిన నురుగుతో త‌డిసిన మ‌ట్టినీ, శ‌వాన్నీ స్వాధీనం చేసుకున్నారు.

మిగ‌తా వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను పోలీసుస్టేష‌న్‌కి వెళ్ళాను. ఏయ‌స్ఐ నాకు రూపాయి ఇచ్చాడు. కానిస్టేబుల్ పావ‌లా ఇచ్చాడు. న‌న్ను స్టాక్ విట్‌నెస్ అంటారు. ఆ రోజున నా నిశానీ నాకు రూపాయి పావ‌లా సంపాదించి పెట్టింది. ప‌దోక్లాసు టీచ‌రు ఇంగ్లీషు సంత‌కం పైసా అయినా తేలేక‌పోయింది.

నేను అదే చెపుతుంటాను క‌లం కంటే వ్రేలు మేల‌ని. కాని మా గొయ్య‌మ్మ చెవిని పెట్ట‌దు. ఎప్పుడో ఒక‌ప్పుడు క‌ష్టాల్లో ప‌డ‌తావు అంటూంటుంది.

నిజంగా, అనుకోని విధంగా నాకు క‌ష్టం రానే వ‌చ్చింది.

ఫ‌లానా అబ్బాయి త‌నంత‌ట తాను చ‌చ్చిపోలేద‌నీ, ఫ‌లానా వాళ్ళు బ‌ల‌వంతంగా కాగితం వ్రాయించి, బ‌ల‌వంతంగా నోట్లో ఎండ్రిన్ పోసి, ఫ‌లానా కార‌ణాల‌వ‌ల్ల చంపేశార‌నీ, కావ‌లిస్తే ఈ నిజం బాలాజీ మిఠాయి కొట్టువాడిని అడిగి తెలుసుకోవ‌చ్చు అనీ, చంపేసిన వాళ్లూ పోలీసులూ, పంచాయ‌తీ రిపోర్టు వ్రాసిన వాళ్ళు కుమ్మ‌క్క‌య్యార‌నీ, పంచాయ‌తీదార్ల‌లో రిపోర్టులో ఏం ఉందో తెలియ‌ని నిశానీదారు ఉండ‌డ‌మే కుమ్మ‌క్క‌య్యార‌డాన్ని రుజువు ప‌రుస్తోంద‌నీ ఎవ‌రో గ‌వ‌ర్న‌మెంటుకి అర్జీ పంపించాడు. అసెంబ్లీలో ప్ర‌శ్నించారు, పత్రిక‌ల‌కి ఎక్కించారు.

నాలుగేళ్ళు క్రితం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసి, ఇంట్లో కూర్చుని ఈగ‌ల్ని తోలుకుంటూ, గోళ్ళు గిల్లుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఓ జ‌డ్డిని క‌మిష‌న్‌గా నియ‌మించి ఆర్జీలోని విష‌యాల్ని ఇంక్వైరీ చేసి నెల‌రోజుల్లో రిపోర్టు పంప‌మ‌ని గ‌వ‌ర్న‌మెంటు ఆదేశించింది.

నాకు నిద్ర‌ప‌ట్ట‌లేదు. ఆర్జీలో ఉద‌హ‌రించిన నిశానీ పంచాయ‌తీదారుని నేనే. పంచాయ‌తీ రిపోర్టులో ఏముందో నాకు తెలియ‌దు. గుడ్డిగా నిశానీ పెట్టాను.

అలాగ నేను చేయ‌డ‌మే నేను ఆ శ‌వం బ్ర‌తికి ఉండ‌గా చంపేసిన వాళ్ళ‌తో కుమ్మ‌క్కుయ్యాన‌న‌డానికి తార్కాణం అంటున్నారు, ఆర్జీదారులు. వాళ్ళు అంటున్న‌దే నిజ‌మైతే, ఇంకేముంది, నాకొంప మునిగిన‌ట్లే ! రూపాయి పావ‌లా తెచ్చిన నా వ్రేలిముద్ర నా ప్రాణం మీదికి తెచ్చింద‌న్న‌మాటే ! ఏది దారి అని ఆలోచించాను. నాకు నిద్ర‌ప‌ట్ట‌డందు. అన్నం స‌యించ‌డంలేదు. నిశానీ వ‌ల్ల క‌ష్టాలొచ్చేస్తున్నాయి.

ఇంక్వైయిరీ క‌మీష‌న్ నుంచి నాకు నోటీసు వ‌చ్చింది. నోటీసులో వ్రాసి ఉన్న రోజున వ్రాసి ఉన్న టైముకు క‌మిష‌న్ ముందు హాజ‌ర‌య్యాను.

న‌న్ను సాక్షి బోనులో నుంచోమ‌న్నారు. నా చేత ప్ర‌మాణం చేయించారు. ఏవేవో ప్ర‌శ్న‌ల‌డిగారు. ఏవేవో స‌మాధానాలు చెప్పాను.

కానిస్టేబుల్ శ‌వ పంచాయ‌తీ రిపోర్టు వ్రాశాడు.

ప‌దోక్లాసు టీచ‌రు సాక్షి సంత‌కం ఇంగ్లీషులో చేశాడు. గొప్ప అనుభూతితో.

నేను య‌న్‌.బి.శాస్త్రి అన్న అక్ష‌రాల‌పైన ఎడమ‌చేతి బొట‌న వ్రేలి ముద్ర వేశాను.

వీట‌న్నిటికీ ఏయ‌స్ఐ ప‌ర్య‌వేక్ష‌ణ చేశాడు. పోలీసులు శ‌వాన్ని పోస్టుమార్ట‌మ్ కోసం గ‌వ‌ర్న‌మెంటు ఆస్ప‌త్రికి పంపారు. మిగ‌తా సామాన్లు తీసుకుని పోలీసుస్టేష‌న్ కి వెళ్ళిపోయారు.

గుడ్డిగా నిశానీ పెట్టినందుకు ఎంత పుచ్చుకున్నావు ? అని ప్ర‌శ్న‌.

లేదు అని స‌మాధానం

ఏమిటి లేదు, గుడ్డిగా నిశానీ పెట్ట‌డ‌మా ? లంచం పుచ్చుకోవ‌డ‌మా

రెండూను

అబ‌ద్దం చెప్ప‌కు. హంత‌కుల ద‌గ్గ‌ర లంచం పుచ్చుకుని, హంత‌కుల నేరాన్ని క‌ప్పిపుచ్చ‌డానికే నీకు చ‌ద‌వ‌డం రాని రిపోర్టుని చ‌దివాననే స్టేట్‌మెంట్ క్రింద నువ్వు నిశానీ వేశావు. అవునా ?

నేను నిజం చెపుతున్నాను. న‌న్న‌డుగుతున్న ప్ర‌శ్న‌లే అబ‌ద్దం

ఏమిటీ ? నువ్వు హంత‌కుల ద‌గ్గ‌ర లంచం పుచ్చుకోలేదా ?

లేదు అన్నాను ధీమాగా, నాకు పోలీసులు ఇచ్చిన రూపాయి పావ‌లా నా ఫీజు.

నువ్వు పంచాయితీ నామాలో చ‌దివే నిశానీ వేశావా ?

ఆ ! అన్నాను ధీమాగా

ఏఎస్ ఐ కానిస్టేబుల్ ప‌దో క్లాసుటీచ‌రు అంద‌రూ విస్తుపోయారు.

నీవు చ‌ద‌వ‌గ‌లిగితే సంతకం పెట్ట‌క నిశాని ఎందుకు వేశావు ?

సంత‌కం చేసిన‌వాడు ఆ సంత‌కం నాది కాద‌న‌వ‌చ్చు. నిశానీ వేసిన‌వాడు వేలిముద్ర త‌న‌ది కాద‌ని అన‌లేడు.

ఏఎస్ ఐ, కానిస్టేబుల్‌, ప‌దో క్లాసుటీచ‌రు అంద‌రూ నోళ్లు వెళ్ల‌బెట్టారు.

నీకు చ‌ద‌వ‌డం వ‌చ్చంటున్నావుగా ఈ కాగితం చ‌దువు అన్నాడు జ‌డ్జి

చ‌ద‌వ‌లేను అన్నాను, విచారంగా

ఏం ?

ఈ ద‌స్తూరీ చ‌ద‌వ‌డానికి ప‌నికిరాదు. ఛండాలంగా ఉంది.