వాసంతి అత్తగారి ఊరిలో ఒక నెలరోజులు గడిపి శరన్నవరాత్రుల సమయానికి పుట్టింటికి వచ్చింది. త్రిశతిపారాయణలు సహస్రనామార్చనలు చండీ హోమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరిపిస్తోంది జయంతి. జయంతి హంసితో చెప్పింది. ఈ సారి ఈ అమ్మమ్మ ఫ్రెండ్స్‌తో పాటు పూజల్లో నీ ఫ్రెండ్స్‌ని కూడా ఆహ్వానించి పాల్గొనేలా చెయ్యి అన్నది. అమ్మమ్మ ఫ్రెండ్స్‌లా మా ఫ్రెండ్స్ కుదురుగా కూర్చుని పూజల్లో పాల్గొరు అమ్మమ్మా ! వాళ్ళుత్త మర్కట కన్యలు ! సందర్భం ఉన్నా లేకపోయినా కిచకిచలాడతారు అంది హంసి. ఫరవాలేదురా నాన్న, నువ్వు పిలు ! చిన్న పిల్లలు నవ్వినా అందంగానే ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. వారి నవ్వుల్లో పెద్దలు కూడా పాలుపంచుకుని వాళ్ళు కూడా చిన్న వాళ్ళయిపోతారు అంది వాసంతి. అమ్మా నువ్వే మనకుంటున్నావ్ ! మావాళ్ళ గురించి ? వాళ్ళని భరించడం మనతరం కాదు. వాళ్ళల్లో వేదవతి, గాయత్రి మాత్రమే బుద్దిమంతులు అంది హంసి. అలా అన్నదే కాని కాలేజీకి వెళ్ళాక అందరినీ రమ్మని ఆహ్వానించింది. మా అమ్మమ్మా పూజ చేస్తే దేవతలు దిగివచ్చి పూజలు అందుకుంటారనీ అందర్నీ జయంతి అమ్మమ్మ ఆహ్వానిస్తోందనీ చెప్పింది. తొమ్మిదిరోజుల్లో ఒక రోజు వాళ్ళు వచ్చారు ! జయంతి వారందరినీ పేరుపేరునా పలకరించి నవ్వుతూ వారు భుజాలను తట్టి వారి మనసులకు హత్తుకునేలా చిన్న ప్రసంగం చేసింది జయంతిని చూడగానే వాళ్ళంతా వినమ్రంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. ఆమెలో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని ఎవరికి వారే అనుకున్నారు. ఎవరికివారే తమతో ఆమె మరింత ఆత్మీయంగా ప్రవర్తించిందని అనుకున్నారు. ఆమె ఏం చెప్తే అది మనస్ఫూర్తిగా చెయ్యడానికి సిద్ధపడిపోయారు. జయంతి, అందరిచేత ధ్యానం చేయించింది. ఏకాగ్రతతో ధ్యానం చేస్తే కలిగే సత్ఫలితాలు వ్యక్తికే కాక సమాజానికి కూడా ఎలా ఉపయోగపడతాయో చెప్పింది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే రోజుకి ఇరవై నిముషాలు ధ్యానం చేస్తామని ఆ యువదళం జయంతికి మాట ఇచ్చింది. వాళ్ళు అమ్మవారి ముందు భక్తిగా వినయంగా కూర్చుని ఎంతో శ్రద్ధగా నామావళి ఉచ్ఛరించడం హంసికెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అయినదానికీ కానిదానికీ పగలబడి నవ్వి ప్రతి వాళ్ళనీ ఆట పట్టించే తన స్నేహ బృంద మేనా అది ? అమ్మమ్మా అందరికీ చెప్పింది భక్తి అనేది చిన్నతనం నుంచీ ఉండాలని. అందరూ బొమ్మల్లాగా తల ఊపారు. పూజాహారతి పూర్తి అయ్యాక కమ్మనినేతితో జీడిపప్పు, ఏలకులు, పచ్చకర్పూరం, కుంకుమపూవు సువాసనలతో ఘుమఘుమ లాడిపోయే చక్కెర పొంగలి ప్రసాదాన్ని బాదం ఆకులలో పెట్టించుకుని వరండాలో ఉన్న ఉయ్యాల బల్లమీద కూర్చుని టి.వి. చూడసాగారు.
ఏడుకొండలవాడు - మలయప్పస్వామి హారతులందుకొంటూ దర్శనమిచ్చాడు. ఓహ్ బ్రహ్మోత్సవం అందరూ ఆనందంగా అరచి ఏడుకొండలవాడా ! వెంకటరమణా ! గోవిందా ! గోవింద అంటూ నమస్కరించుకున్నారు. హంసి
హారతిని కళ్ళ కద్దుకుంది. మిత్రబృందం పగలబడి నవ్వింది. ఏయ్ మన సింహం టి.వి. హారతిని కూడా వదల్దే ! ఎంత పుణ్యం మూటకట్టుకొంటోందో ? అందుకేగా దానికంత గూనివస్తోంది. పుణ్యం బరువెక్కువైపోతోందే ! అందరూ నవ్వులు.
పండితులు ప్రత్యక్షప్రసారానికి చేసే వ్యాఖ్యానానికి ఆ స్నేహితుల నవ్వులకి అంతే లేదు. ఆహా ! విద్యుద్దీపాలు ఎంత కాంతితో వెలుగుతున్నాయో ఆహా ! ఆ స్వామి ఎంత చక్కగా అశ్వాన్ని అధిరోహించాడో...అంటూ వ్యాఖ్యాతలను అనుకరిస్తూ నవ్వలేక కడుపులు పట్టుకున్నారు. ఆహా ! ఏనుగులు ! స్వామివారి ముందునడుస్తున్నాయి. అవి ఏనాటివో ? వ్యాఖ్యాతలన అనుమానానికి ఈ యువగాలి నవ్వుల ఝంఝూంమారుతమే అయ్యింది. హంసి పగలబడి నవ్వుతూ అంది నాయనా ! నీకు అనుమానం అక్కరలేదు. ఆ ఏనుగు నిశ్చయంగా త్రేతాయుగం నాటిదే. జయంతి అక్కడికి వచ్చి కూర్చోడం ఎవ్వరూ గమనించనే లేదు. ఆమె కూడా వారితో నవ్వుతూ తుళ్ళుతూ వారిలాగే హాస్యమాడుతూ చిన్నపిల్లే అయ్యింది జయంతి. జయంతి ఈ రెండో రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అందరూ జయంతి చుట్టూ చేరారు. మొదట్లో చూపిన భయం గౌరవం ఏమయిపోయాయో విద్యార్ధినులు అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. టి.వి.లో బ్రహ్మోత్సవం ప్రత్యక్షప్రసారం అవుతూనే ఉంది. ఒక విద్యార్థిని అదిగదిగో త్రేతాయుగం నాటి గజం వస్తోంది అంది. అబ్బే, నీకు అనుకరించడం చేతకాలేదు. హంసి బాగా మిమిక్రీ చేస్తుంది. నీ వ్యాఖ్యానం పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుంది అంది మరొక కన్య.
జయంతి నవ్వింది. పులిని చూసి నక్కవాత పెట్టుకుందో లేదో గాని...ద్వాపరయుగంలో...జయంతి మాటలు పూర్తికాకుండానే అందరూ ఘెల్లున నవ్వారు. ఆంటీ, త్రేతాయుగంలోంచి ద్వాపయుగంలోకి వచ్చారు. హంసికి కోపం వచ్చింది. అమ్మమ్మని మాట్లాడ నియ్యండే...అని నువ్వు చెప్పు అమ్మమ్మ ద్వాపరయుగంలో ఎవరు ఎవరిని అనుకరించబోయారు ?
ద్వాపరయుగంలో వసుదేవసుతుడైన వంశీ మోహనుడు పెరిగి పెద్దవాడై రాసక్రీడల్లో గోపగీపీ జనాన్ని రంజింపచేస్తూ గోరక్షణగావిస్తూ ఉండేవాడు. అదే సమయంలో అదే బడ్డూ పొడుగూ ఇంచుమించు కృష్ణుడంత కాకపోయినా కాస్త సౌందర్యం, వర్చస్సూ ఉన్న పౌండ్రకుడనే యువకుడు ఉండేవాడు. ఇతని తండ్రి పేరు కూడా వసుదేవుడే. వారూ వీరూ అరే ! నువ్వూ కృష్ణుడికి మల్లేనే ఉన్నావే అంటూ ఆశ్చర్యపోవడం చూసి క్రమక్రమంగా గర్వం పెరిగి పోజొచ్చింది. అందరూ తనని వాసుదేవుడనే పిలవాలని కట్టడి చేశాడు. ఇక కొన్నాళ్టికి తనే వాసుదేవుడైన విష్ణుమూర్తిననే భావం బలీయం అవడంతో శంఖచక్రాలు కూడా ధరించడం మొదలు పెట్టాడు.
జయంతి చెప్పె కథను హంసి మిత్రబృందం అత్యంత ఆసక్తితో వింటున్నారు.
ఆంటీ ! ఇదే నిజంగా పులిని చూసి నక్కవాతపెట్టుకోవడమంటే అందొక అమ్మాయి. నువ్వూరుకోవే....ఆ తరువాత ఏమయ్యింది అని మరొక అమ్మాయి ఆసక్తి కనబరచింది.
ఏముందీ ! నందగోపుడైన కృష్ణమూర్తికి ఈ పౌండ్రకవాసుదేవుడు రాయబారం పంపించాడు. ఓ కృష్ణా ! నువ్వు మూర్ఖుడివై వాసుదేవుడనే నా పేరును ఉపయోగించుకుంటూ, నాలాగా ఉండాలనే క్షాంక్షతో నా చిహ్నాలన్నీ ధరిస్తున్నావు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని నా చిహ్నాలను నాకు పంపి శరణు వేడుకో. నిన్ను దయ తలచి వదిలేస్తాను అంటూ ఘాటైన సందేశం పంపించాడు.
మిత్ర బృందం పగలబడి నవ్వింది. పురాణకాలంలో కూడా ఇంత పిచ్చివాళ్ళుంటారా ? అన్నారు. జయంతి నవ్వింది. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల వాళ్ళుంటారమ్మా....అంది.
అమ్మమ్మ అప్పుడు గోపాకృష్ణుడేమైనా సమాధానం పంపించాడా అని అడిగింది హంసి. కొంతకాలం వేచి చూచాడు. పౌండ్రుకుని అతిశయమూ, ఆగడమూ ఎక్కువై పోయాయి. అవతారపురుషుడిననే మానసికవ్యాధి శ్రుతిమించి పోయింది. పెద్దలు తప్పు అని చెప్తే వినిపించుకోలేదు. తన మాట కాదన్న వారినల్లా కఠినంగా శిక్షించడం, వధించడం తన కర్తవ్యం అనుకున్నాడు. ధర్మరక్షణ చేస్తున్నాను అంటూ దేశంలో అరాచకం పెంచేశాడు. అతనికి వంతపాడుతూ కొందరు మరిన్ని ఘోరాలు చెయ్యసాగారు. అప్పుడు కృష్ణుడు వర్తమానం పంపాడు. వాసుదేవా ! నువ్వుకోరినట్లే చక్రాన్ని పంపిస్తున్నాను. అంటూ సుదర్శన చక్రాన్ని పంపాడు. ఆ చక్రాన్ని చూస్తూనే హాహాకారం చేస్తూ ప్రాణ భయంతో పరుగులెత్తాడు పౌండ్రుకుడు. తనపని తాను పూర్తిచేసుకుని మరలా కృష్ణమూర్తి సన్నిధికి చేరుకుంది సుదర్శనం !
జయంతి చెప్పడం ఆపగానే వారందరూ ఆ కథ ఎంతో నచ్చిందని చెప్పారు. కథలో ఎన్నో కోణాలు ఉన్నాయనీ, ఈనాఉ కూడా కొందరు తాము అవతార పురుషులమని చెప్పి మోసగించేవారున్నారనీ అన్నారు. జయంతికి నమస్కరించి అందరూ వెళ్ళి వస్తామని లేచారు. మేము మళ్ళీ రావచ్చునా అని సువర్చల హంసి నడిగింది. ఈ మాట జయంతికి వినిపించి అమ్మలూ ! మీరంతా తప్పకుండా రండి. కాస్తోకూస్తో తెలిసిన వారికి అంటే జ్ఞానులకు నేను ప్రత్యేకించి ఏమి చెప్పగలను ? నేను కూడా మీలాగ ఏమీ తెలియని దానినే. మీతోపాటు నేనూ కొన్ని పురాణగాథలను గుర్తు చేసుకుంటాను. తప్పకుండా రండి అంది.
ఆంటీ మీతో మాట్లడితే మకెంతో ప్రశాంతంగా ఉంది. మీరున్నన్నాళ్ళూ ప్రతి ఆదివారం తప్పకుండా వస్తాం. సరేనా ? అన్నారు. జయంతి వాళ్ళ వస్త్రధారణను పట్టి పట్టి చూస్తున్నట్లు తెలుసుకుని సిగ్గుపడ్డారా అమ్మాయిలు. ఒక్క విషయం తల్లులూ. మన సంప్రదాయం, సంస్కారం, అలవాట్లు, వేషభాషలూ వీటన్నింటి యొక్క ప్రయోజనం చివరకు ఆరోగ్యంగా పరిణమించడమే. ఉదాహరణగా వీటిన్నింటి యొక్క ప్రయోజనం చివరకు ఆరోగ్యంగా పరిణమించడమే. ఉదాహరణగా ఒంటినిండా బట్టవుంటే పొల్యూషన్ నుండి కాపాడబడతాము. సూర్యరశ్శి నుండి రక్షణ. గాలి నుండి రక్షణ కలుగుతుంది. ఇప్పుడు ఓజోన్ పొరనుండి వెలువడే కొన్ని కిరణాల వల్ల శరీరానికి కేన్సర్ కూడా వస్తోందట అన్నది. అందరూ మౌనంగా తలలు పంచుకున్నారు. ఇక నుంచి చక్కగా ఒంటినిండా బట్టలు వేసుకుంటాము అనుకున్నారు అందరు.
జయంతి జై బోలో శ్రీ రాజరాజేశ్వరీ మాతాజీకి అన్నది. అన్ని గొంతులూ జై అంటూ ప్రతినినాదాలు చేశాయి.
జై శ్రీ మౌనస్వామికీ జై ! జై శ్రీ శివచిదానంద భారతీస్వామికీ జై !!
|