జయంతి ఆధ్వర్యంలో లలితా త్రిపుర సుందరికి లక్ష కుంకుమార్చన జరుగుతోంది. రంగురంగుల జరీ పట్టుచీరలతో ధగధగలాడిపోయే బంగారు ఆభరణాలతో పెద్ద ముత్తైదువలూ, చిన్నముత్తైదువలూ ఎంతో భక్తి ప్రవత్తులతో అమ్మవారిని పూజించుకుంటున్నారు. బస్తాలతో గులాబీపూలు తీసుకువచ్చారు. బస్తా విప్పేదాకా గొంతును ఎవరో నులుముతున్నట్లు విలవిలలాడిపోయారు సున్నిత మనస్కులైన భక్తులు. అయ్యో ! పూలతల్లులూ మా భక్తివల్ల మీకెంత కష్టం కలుగుతోందీ...అనుకుంటూ దోసిటనిండా పూలను తీసుకుని గుండెలకు అద్దుకుని అమ్మవారి పాదలకు సమర్పించుకుంది జయంతి.
ఇల్లంతా వైకుంఠంలాగా కళకళలాడిపోతున్నా భక్తితతప్పరతతో ఓలలాడిపోతున్నా, జయతికి మాత్రం హృదయం అంతా శూన్యంగా అన్పిస్తోంది. మనస్ఫూర్తిగా పూజచేసుకోలేక పోతోంది. స్వామీ ! స్వామీ...! మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారా ! మీరే మా పెద్దదిక్కు అనుకున్నామే ! కష్టం వొచ్చినా సుఖం వచ్చినా మీకే విన్నమించుకుంటున్నామే ? ఇక మాకు దారేది స్వామి ! అని మధ్యమధ్యలో కళ్ళు తుడుచుకుంటోంది. కుర్తాళం రాజరాజేశ్వరీ భక్తురాలైన ఆమె, ఆ పీఠాధిపతులు 17-12-2002న బ్రహ్మైక్యం పొందిన దగ్గర నుంచి జయంతి బాధ వర్ణనాతీతంగా ఉంది. మధ్యమధ్యన అయ్యో అయ్యో అనుకుంటూ ఉంటుంది. జయతి బాధను చూసి జయంతి దగ్గరగా వెళ్ళికూర్చునికౌగలించుకున్నట్లుగా వెన్నురాచింది. జయతీ ! ఎందుకీ బాధ ! శివచిదానంద భారతీస్వామి వారు ఎక్కడికి వెళ్ళారు ? ఎక్కడికీ వెళ్ళలేదు. ఇదివరకు మనకు దూరంగా ఎక్కడో కుర్తాళంలో ఉండేవారు. ఆరడుగుల శరీరంలో నిలచిన ఆ దివ్యశక్తి ఇప్పుడు అనంతశక్తితో తాదాత్మ్యం చెందింది. ఇప్పుడాయన మనలోనే వున్నారు. నువ్వు పిలిస్తే పలుకుతారు. బాధపడకు అని ధైర్యం చెప్పింది. పూజ పూర్తయ్యింది. అందరూ అమ్మవారికి హారతులెత్తారు. జేగంటలు మ్రోగించారు. వాతావరణం ద్యివ్యభావ పరిపూరితమై పోయింది. అందరూ ధన్యోస్మి అనుకున్నారు. భోజనాలకు సిద్ధం అవుతండగా జయంతి ఉయ్యాల బల్లమీద కూర్చుంది.
గాయత్రి మెల్లగా లోపలికి వచ్చింది. అమ్మమ్మా మా తమ్ముడూ మా పక్కింటి అబ్బాయీ మీ ఆశీస్సుల కొసం వచ్చారు లోపలికి తీసుకురానా ? అంది జయంతితో. తప్పకుండా గాయత్రీ, తీసుకుఆ ముందుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు తెల్సుగదరా నాన్నా. గాయత్రి వెంట ఇద్దరు యువకులు వచ్చారు. వారిచేతిలో కొన్ని పేపర్లు ఉన్నాయి. అమ్మమ్మా ! వీడు నా తమ్ముడు విష్ణు, అతని రాజని మా పక్క ఇంట్లో వుంటారు. జయంతి వాళ్ళిద్దర్నీ దగ్గరగా కూర్చోపెట్టుకుంది. బంగారు తండ్రులు ! ఇంత వినయం అక్కర్లేదయ్యా, నేనే మీ అమ్మా అమ్మమ్మ వంటిదాన్నే అంది. అమ్మమ్మా వీళ్ళకి అమెరికాలో చదువుకొనేందుకు వీసా వచ్చింది. అంది గాయత్రి. జయంతి నవ్వింది. ఈ పాస్‌పోర్టులూ వీసాలు ఏమిటో తెలుసా ? పాస్‌పోర్టులేకుండా ఇంకో దేశానికి వెళ్ళే ప్రయత్నమే చెయ్యలేం ! వీసా లేకుండా ఆ దేశంలో అడుగైనా పెట్టలేం ! ఇదీ అమెరికాలాంటి విదేశాలకే ! ఇక అమర లోకానికి వెళ్ళాలంటే అక్కడికీ పాస్‌పోర్ట్ ఉండాలా ? అక్కర్లేదా ? ....జయంతి ప్రశ్నకు యువకులు కంగారుపడ్డారు. రాజుకి ఆ ప్రశ్న అర్థమే కాలేదు. జయంతి మొదలు పెట్టేలోపలే గాయత్రి చెప్పింది. తప్పకుండా ఉండాలమ్మమ్మా ! పై దేశానికీ పాస్‌పోర్ట్ అవసరమైతే పై లోకానికి ఇంకా పెద్ద పాస్‌పోర్టు కావాలి. జయంతి నవ్వింది. ఈ పాస్‌పోర్ట్ భగవంతుడి మీద ప్రేమ. భక్తి ఉందని తెలియచేసేదిగా ఉండాలిరా తల్లీ ! సాటి మానవులను గౌరవించడమే భగవంతుని గౌరవించడం, సాటిమనిషిని ప్రేమించడమే భగవంతుని ప్రేమించడం.
జాలి, దయ, ప్రేమ, పరోపకారం మొదలైన మంచి లక్షణాలు మనలో ఉంటే అక్కడ్నించి వీసా వస్తుంది. మీకు ఆహ్వానం పలుకుతూ ! నాయనలారా ఏ దేశం వెళ్ళినా మీ దేశం చిన్నబుచ్చుకొనేలా ప్రవర్తించకండి. ఫలానా దేశంవారు యోగ్యులు అని ఖ్యాతి పొందేలా ప్రవర్తించండి. ఇలా మీరు చేస్తే భగవంతుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. శుభం ! భోజనం చేసి మరీ వెళ్ళండి అంది ఆప్యాయంగా.
జై శ్రీ మద్రాజ రాజేశ్వరీ మాతకూ జై ! అంటూ లోలపనుండి అమ్మవారి జయజయధ్యానఘోష విన్పిస్తోంది. జయంతి అర్థనిమీలితనేత్ర అయ్యింది. ఆమె హృదయం ఎక్కడ సంచరిస్తోందో గాని కంఠం మాత్రం మృదుమధురంగా కర్ణపేయంగా శ్లోకాచ్చారణ గావించింది.
గౌరీం కాంచన పద్మినీ తట గృహం శ్రీ సుందరేశ ప్రియాం
నీ పారణ్య సువర్ణ కంచుక పరిక్రీడా విలోలాం ఉమాం
శ్రీమత్ పాండ్య కులాచలాగ్ర విలసత్ రత్న ప్రదీపాయితాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీ పాండ్యబాలాం భజే
అక్కడ మౌనసామ్రాజ్యం ఓలలాడింది.
|